అన్నం ఎలా తింటున్నారు?

‘పురస్తాద్విమలే పాత్రే సువిస్తీర్ణ మనోరమే’ అంటాడు ఆచార్య సుశ్రుతుడు. అంటే- భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు శుభ్రమైన, విశాలమైన, చూడముచ్చటైన పళ్లెం తెచ్చిపెడితే ఆహారం చక్కగా తినబుద్ధవుతుందట. మనం పళ్లెం తింటామా? పళ్లెంలో ఉన్న అన్నం తింటామా? అనే సందేహానికే తావులేదిక్కడ. పళ్లెం కూడా రమ్యంగా, ఆహ్లాదం కలిగించేలా ఉండాలన్నది ఈ సూత్రంలోని భావం.

  • అందమైన పళ్లెంలో ముందు పప్పు వడ్డించి, ఆ తరువాత ఒక్కొక్క ఆహార పదార్థాన్ని కొద్దికొద్దిగా వడ్డించాలి.
  • ఆహారంలో స్వీట్లు, పాయసాలు, వంటివి కుడివైపున వడ్డించాలి. చారు, సాంబారు, పులుసు, పలచగా ఉంటే ఇతర పదార్థాలను అవన్నీ పళ్లెంలో ఎడమ వైపున ఉంచాలి.
  • కూరలు, పప్పు, వడియాలు, అప్పడాల వంటివి ఎక్కువగా వడ్డించాలి.
  • ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి ఉద్రేకాలు, కోపతాపాలు లేకుండా ఆనందంగా, ఉల్లాసంగా ఉన్న మనసుతో తృప్తిగా భోజనం చేయాలి.
  • మరీ పొగలు కక్కుతూ కానీ, చప్పగా చల్లారిపోయి కాని ఉండే ఆహారం కాకుండా వేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
  • మామూలుగా ఏవిధమైన అనారోగ్యాలూ లేని వ్యక్తులు మొదట స్వీటుతో ప్రారంభించి ఆ తరువాత పులుపుగా, ఉప్పగా ఉండే వస్తువులు తిని, అప్పుడు మిగిలిన వాటిని తినాలి.
  • స్వీట్లుతో ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తే జీర్ణశక్తి తగినంత లేని వారికి వెంటనే కడుపు నిండిపోయి భోజనం సరిగా చేయలేరు. కాబట్టి ఇలాంటి వారు భోజనానికి ముందు దానిమ్మ గింజల్ని కానీ, టమోటా సూప్‍ కానీ తీసుకుని అప్పుడు అన్నం తినాలి.
  • ఉసిరికాయ తొక్కుడు (నల్లపచ్చడి) పచ్చడిని ఎప్పటికప్పుడు కొత్తిమీర వంటివి కలిపి తాజాగా తాలింపు వేసుకుని భోజనంలో మొదటి ముద్దగా తినడం మంచిది. ఇది తింటే ఆహారంలో ఉండే అన్ని దోషాలను హరిస్తుందని సుశ్రుతుడు చెప్పాడు.
  • అల్లం + సైంధవ లవణం.. ఈ రెండింటినీ కలిపి నూరి, అన్నంలో మొదటి ముద్దగా తింటే నాలుక మీద ఉన్న అరుచి జిగురు పోయి నోటికి రుచి తెలుస్తుంది. అన్న హితవు కలుగుతుంది. ఎలాంటి జబ్బులూ రానివ్వకుండా తీసుకున్న ఆహారం చక్కగా వంటబట్టేలా చేస్తుంది.
  • అల్లం, సైంధవ లవణం మిశ్రమంలో ఉసిరికాయ పచ్చడి కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. ఆరోగ్యం కూడా.

Review అన్నం ఎలా తింటున్నారు?.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top