ఆరోగ్యభాగ్యం ‘వేగం’.. ఆపితే రోగమే!

ఆరోగ్యభాగ్యం
‘వేగం’.. ఆపితే రోగమే!

ఆయుర్వేదం మనకు ప్రకృతి నుంచి లభించే ఔషధాల గురించే కాదు.. అంతకంటే ముఖ్యమైన జీవన విధానం గురించి ఎక్కువ చెప్పింది. ఏ రోగానికైనా మందులు మాత్రమే పరిష్కారం కాదు. కాబట్టి అసలు రోగాలే రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేదే మన ప్రాచీన ఆయుర్వేదం చెప్పింది. రోగం రాకుండా ఉండాలంటే నివారణ మార్గం ఏమిటో సూచించింది. ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలో మందులూ మాకులూ కంటే 69 శాతం జీవన విధానం ఎలా ఉండాలనేదే వివరించింది. మంచి జీవన విధానానికి ఉండాల్సిన నియమాలేమిటో తెలిపింది. ఆయుర్వేదం సూచించిన అనేకానేక నివారణ మార్గాల్లో ‘వేగం’ అనేది ఒకటి. ఇది అనేక రోగాలను రాకుండా చేసే మేలిమి మార్గం. అసలు ఈ ‘వేగం’ అంటే ఏమిటి? దీని విషయంలో మన జీవన విధానం ఎలా ఉండాలో ఆయుర్వేదం ఏం చెప్పిందో చదివేయండి..
వేగం’ అంటే అయుర్వేద పరిభాషలో ‘శరీరం నుంచి సహజ ప్రక్రియ ద్వారా వాటికవే బయటకు వెళ్లిపోయేవి’ అని అర్థం. స్థూలంగా చెప్పాలంటే శరీరం నుంచి బయటకు వెళ్లే వాటిని ‘వేగం’ అంటారు. శరీరం నుంచి ఇలా బయటకు వెళ్లే ‘వేగం’ పదమూడు రకాలు. వాటన్నిటినీ ఒక శ్లోకంలో ఇమిడ్చి చెప్పింది ఆయుర్వేద శాస్త్రం.
వేగాన్నధారయేత్‌వాత విణ్మూత్ర క్షవత్రట్‌ క్షుధాం
విద్రాకాసశ్రమ శ్వాస జృంభ అశృచర్థి రేతసాం
1. ఆపానవాయువు, 2. విరేచనము, 3. మూత్రము, 4. తుమ్ము, 5. దాహం, 6. ఆకలి, 7. నిద్ర, 8. దగ్గు, 9. ఆయాసం, 10. ఆవలింత, 11. కన్నీరు, 12. వాంతి, 13. శుక్రము.
ఇప్పుడు ఈ పదమూడు రకాల ‘వేగా’లను ఆపడం వల్ల కలిగే నష్టాలేమిటో తెలుసుకుందాం.
ఆపానవాయువు:
ప్రతి ఒక్కరి పొట్టలో ఆపానవాయువు తయారవుతుంది. దీనినే గ్యాస్‌ ప్రాబ్లమ్‌ అంటారు. కొన్ని రకాల పదార్థాలు, ముఖ్యంగా శనగపిండి, పిండివంటలు, చిరుతిళ్లు తిన్నప్పుడు, కందిపప్పు వంటల్లో ఎక్కువగా ఉపయోగించినా ఆపానవాయువు ఎక్కువగా తయారవుతుంది. అది ఎప్పటికప్పుడు పురీషనాళం ద్వారా బయటకు వచ్చేస్తుంది. మరీ శబ్దం చేస్తూ ఇది బయటకు రావడం సహజం. అయితే, దీనిని చాలామంది ఆపుకుంటారు. జనం మధ్యలో ఉన్నపుడు, ఇతర సమయాల్లో ఎవరైనా వింటే బాగుండదనే భయంతో చాలామంది దీనిని బలవంతంగా ఆపుతారు. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపానవాయువును ఆపకూడదు. దానివల్ల వచ్చే సమస్యలు తీవ్రమైనపుడు పెద్దసమస్యలను తెచ్చిపెడుతుంది. ఆపానవాయువును బలవంతంగా ఆపే వారిని ఆయుర్వేదంలో నిత్యరోగులుగా పేర్కొన్నారు.
ఆపానవాయువును ఆపడం వల్ల తరువాత కాలంలో కడుపునొప్పి, ఆకలి తగ్గిపోవడం,, మొలలు, పొట్టలో కణితులు పెరగడం, ఛాతీ పట్టేయడం, ఛాతీ నొప్పి, గుండెజబ్బులు, జీర్ణ సమస్యలు, భంగంధరములు వంటి సమస్యలు ఏర్పడతాయి.
విరేచనం:
విరేచనం గురించి ఆయుర్వేదం చెప్పిన విషయాలు చెప్పాలంటే ఒక పుస్తకం సరిపోదు. పట్టణ, నగర ప్రాంతాల్లో ఉండే వారిలో 80 శాతం మందికి విరేచనం సక్రమంగా ఉండదు. విరేచనం అనేది మనం బలవంతంగా వెళ్లేలా ఉండకూడదు. అదే మనల్ని బలవంతంగా లెట్రిన్‌కు పంపే విధంగా ఉండాలి. అలా వెళ్లగలిగే సమయంలో వెళ్లకుండా ఉంటే తరువాత కాలంలో వచ్చే సమస్యలు పరిష్కరించలేని విధంగా ఉంటాయి. రోజూ సమయానికి విరేచనం అవుతుందా? లేదా? అనేది తప్పకుండా పరిశీలించుకోవాలి. విరేచనం వచ్చినపుడు ఆపితే తలనొప్పి, కడుపుబ్బరం, ఆకలి తగ్గడం,సమయానుకూలంగా నిద్ర పట్టకపోవడం, ప్రేగులు సాగిపోవడం, మలం వాసన పట్టడం, గుండెజబ్బులు, కంటి సమస్యలు వస్తాయి.
మూత్రం:
మూత్రాన్ని ఆపుకోవడం కూడా చాలామంది చేసే పని. మూత్రం వస్తున్నా తరువాత వెళ్దామనే భావనతో నిర్లక్ష్యం చేస్తుంటారు. మరీ అర్జంట్‌ అయినపుడు పోద్దాంలే అనేదే ఎక్కువ మంది ఈ విషయంలో అనుసరించే విధానం. మూత్రం కొంత మాత్రమే తయారైనట్టు అనిపించడం, ఇంకొంచెం ఎక్కువయ్యాక పొద్దాం అనిపించడం పనిలో ఉన్నపుడు సహజంగానే అనిపిస్తుంటుంది. అయితే మూత్రం సమయానుకూలంగా బయటకు వెళ్లకపోతే చాలా ఆరోగ్య సమస్యలు కలుగుతాయి.
ముఖ్యంగా యూరినరీ బ్లాడర్‌లో నొప్పి, మూత్రంలో రాళ్లు ఏర్పడటం, మూత్రంలో మంట, ఒళ్లంతా నొప్పి, మూత్రం చిక్కబడి మూత్రపిండాలకు శ్రమ కలిగి సమస్యలు తలెత్తడం, జననావయవాల్లో నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.
తుమ్ము:
తుమ్మును ఆపడం చాలా పెద్ద తప్పుగా ఆయుర్వేదం చెబుతోంది. కొందరికి డస్ట్‌ అలర్జీ ఉంటుంది. దుమ్ము, ధూళి పడక అదేపనిగా తుమ్ములు వస్తుంటాయి. అదేపనిగా తుమ్మితే ఇతరులు ఏమనుకుంటారోననే భావనతో వీటిని ఆపుకోవడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. కొందరికి ఏదౌనా వాసన తగిలినా కూడా తుమ్ములు వస్తుంటాయి. తుమ్మును ఆపితే కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా కలిగే ప్రమాదం ఉంది. ఆపితే ఏమీ కాదనే భావన వద్దు.
తుమ్ములు ఆపుకోవడం వల్ల ఛాతీ బిగపట్టి గుండెపోటు, నొప్పి వంటి సమస్యలు ఏర్పడవచ్చు. మెడనొప్పి, ఛాతీ బిగపట్టడం, గుండెపోటు సమస్యలు రావచ్చు. తుమ్ము వచ్చినపుడు వెంటనే ఆ పని చేయటమే ఉత్తమం.
దాహం:
దాహం వేయడం సహజం. అయితే, వెంటనే మనం దాహం తీర్చుకునే ప్రయత్నం చేయం. శరీరానికి నీరు అవసరమైనపుడు దాహం రూపంలో స్పందిస్తుంది. వెంటనే దానిని తీర్చడం ముఖ్యం. అది కూడా అవసరమైనంత మేరకే తీర్చాలి. దాహంగా ఉన్నపుడు గటగటా లీటర్లకు లీటర్లు నీళ్లు తాగేయడం చేయకూడదు. ఎండాకాలంలో బయటి నుంచి రాగానే దాహానికి ఎక్కువ నీటిని తీసుకుంటుంటారు. బయటి నుంచి రాగానే వెంటనే నీళ్లు తాగడం తప్పు. కొంతసేపు వేచి ఉన్న తరువాత నెమ్మదిగా తాగాలి. లేకపోతే గొంతులో పట్టేసి ప్రాణాపాయం కలగవచ్చు.
దాహాన్ని ఆపుకుంటే నోరు తడి ఆరిపోయి మాటకు స్పందించదు. కళ్లు తిరగడం, చెవులు జరిగా వినిపించకపోవడం, శరీరంలో నీటి శాతం తగ్గి అవయవాలు చురుకుదనాన్ని కోల్పోవడం, చర్మ సమస్యలు, గుండె సమస్యలు ఏర్పడతాయి.

ఆకలి:
ఆకలి గురించి చెప్పాల్సిన పనిలేదు. కొంతమంది ఆకలి లేకున్నా తింటారు. ఇంకొందరు ఆకలి వేసినా తినడానికి ఏమీ లేని దుస్ధితిలో ఉంటారు. ఆకలి అనేది రోజూ సమయానుకూలంగా అవుతుంటుంది. అలా ఆకలి వేసినపుడే మాత్రమే తినాలి. ఆకలైనపుడు నీళ్లు తాగడం, దాహమైనపుడు ఆహారం తీసుకోవడం వంటివి కూడదు. మనం తీసుకునే ఆహారం పూర్తిగా జీర్ణమై పెద్దపేగులలోకి వెళ్లిన తరువాతనే ఆకలి ప్రారంభమవుతుంది. ఆ సమయంలో మాత్రమే శరీరానికి ఆహారాన్ని అందించాలి. ఆహారం కూడా అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. అతిగా తింటే మళ్లీ వేయాల్సిన సమయానికి ఆకలి వేయదు. దానివల్ల సమయపాలన లేక ఆకలి మందగించే పరిస్థితి ఏర్పడుతుంది.
ఆకలి వేసినపుడు తినకుండా ఉండటం వల్ల నోటికి రుచి తెలియకుండా పోవడం, తల తిరగడం, శరీరం అలసటకు గురికావడం, నీరసం, అవయవాలు చురుకుదనాన్ని కోల్పోవడం, అవయవాల నొప్పులు, శరీరం చిక్కిపోవడం, స్పర్శ జ్ఞానం తగ్గడం వంటి సమస్యలు కలుగుతాయి.
నిద్ర:
తల వాల్చగానే నిద్రలోకి జారిపోవడం కొందరి అదృష్టం, ఎంత తన్నులాడినా కంటి మీద కునుకు రాకపోవడం మరికొందరి దురదృష్టం. మానసిక సమస్యలు ఎక్కువగా ఉన్న వారికి సరిగా నిద్ర పట్టదు. క్రమశిక్షణ లేని జీవితం గడిపే వారికి కూడా నిద్ర ఒక సమస్యగా మారుతుంది. ఎవరైనా సరే.. రోజుకు కనీసం ఆరు గంటలైనా నిద్రపోవాలి. అలా జరగకపోతే వారి ఆయుష్షులో ఆరు గంటలు తగ్గిపోతాయి. నిద్రలో కూడా చాలా రకాలు ఉన్నాయి. కొంత సమయమైనా గాఢనిద్రను పొందితే వారి ఆరోగ్యానికి ఢోకా ఉండదు. నిద్ర సరిగా లేకుంటే` చురుకుదనం కోల్పోతారు. ఏకాగ్రత కుదరదు. ముఖం పీక్కుపోయినట్టవుతుంది. బీపీ, కొలెస్టరాల్‌ పెరుగుతాయి. శరీరం కాంతి కోల్పోతుంది. అజీర్ణం, గ్యాస్‌ ప్రాబ్లం, మలబద్ధకం, మెదడు కణాలు దెబ్బతినడం, జుట్టు రాలడం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.
దగ్గు:
దగ్గు రావడానికి చాలా కారణాలుంటాయి. వాతావరణం, ఆహారం, కాలుష్యం వంటివి ప్రధాన కారణాలు. దగ్గును ఆపితే సమస్య మరింత పెరుగుతుంది. గొంతులో ఏమైనా ఇన్‌ఫెక్షన్లు వంటివి ఉంటే దగ్గు సమస్యగా మారుతుంది. ముఖ్యంగా ఆయాసం ఉన్నవారికి, పొగతాగడం, మత్తు పానీయాలు తీసుకోవడం వంటివి దగ్గును కలిగిస్తాయి. దగ్గు నిరంతరంగా వస్తూ ఉంటే కనుక తప్పనిసరిగా వైద్య సేవలు పొందాలి.
దగ్గును ఆపుకోవడం వల్ల నాలుక రుచిని కోల్పోవడం, ఎక్కిళ్లు, ఆయాసం, ఛాతీనొప్పి, గొంతు బిగపట్టడం, చికాకు వంటి సమస్యలు వస్తాయి.
ఆయాసం:
ఏదైనా శ్రమతో కూడిన పనులు చేయడం వల్ల, పరుగెత్తినపుడు ఆయాసం రావడం సహజం. అంటే అటువంటి సమయాల్లో శరీరానికి ఆక్సిజన్‌ సరిపోవడం లేదన్న మాట. బరువైన పనులు చేసేటపుడు శరీరం ఎక్కువ ఆక్సిజన్‌ తీసుకుంటుంది. అది సరిపోనపుడే ఆయాసం వస్తుంది. అటువంటపుడు కొంత విశ్రాంతి తీసుకోవాలి.
ఆయాసం కలిగినపుడు వెంటనే విశ్రాంతి లేదా సేద తీరకుంటే కళ్లు తిరగడం, పొట్టలో గుల్మము అనే రోగం రావడం, గుండెపోటు వంటి సమస్యలు వస్తాయి.
ఆవులింత:
నిద్ర వచ్చే ముందు వచ్చేవే ఆవులింతలు. నిద్ర రాకుండా ఉండేందుకు చాలామంది ఆవులింతలను ఆపకుంటారు. ఆవులింతలు ఆపితే నిద్ర సరిగా రాదు. అంటే నిద్ర ముంచుకు వచ్చే సమయం వాయిదా పడుతుంటుంది.
ఆవులింతలను ఆపితే` ఒంటినొప్పులు, తలనొప్పి, చికాకు వంటివి కలుగుతాయి.
కన్నీరు:
బాగా ఏడ్చేవాళ్లకు గుండె సమస్యలు, గుండెపోటు వచ్చే శాతం తక్కువని శాస్త్రీయంగా కూడా నిర్ధారణైంది. కాబట్టి ఏడుపు వస్తే ఆపుకోకూడదు. ఏడుపు రూపంలో కన్నీరు బయటకు ఉబికివస్తుంది. దీంతో మనసులోని వేదనంతా తీసివేసినట్టవుతుంది. గుండె బరువు తగ్గినట్టనిపిస్తుంది. కన్నీరు బాగా వచ్చే వారికి ఛాతీ సంబంధ సమస్యలు రావు. కన్నీరు వచ్చినా రాకుండా కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. ఇది సరికాదు.
కన్నీళ్లను ఆపుకుంటే` అది జలుబుగా మారుతుంది. చివరకు ఎంతకూ తగ్గనిదిగా మారుతుంది. కళ్లనొప్పులు వస్తాయి. మెడనొప్పి, తలతిరగడం వంటి సమస్యలు వస్తాయి. కన్నీళ్లు కార్చడం వల్ల కళ్లు శుభ్రపడతాయి. కంటిలోని మలినాలు నీటిలో కలిసి బయటకు వెళ్లిపోతాయి.
వాంతులు:
వాంటిని ఆపడం చాలా ప్రమాదం. వాంతి చేసుకుంటే ఎన్ని సమస్యలు తగ్గుతాయో.. వాటిని ఆపుకుంటే అంతకంటే ఎక్కువ సమస్యలు కలుగుతాయి.
శరీరంలో కలిగే చాలా వ్యాధులకు ప్రధాన కారణం` వాంతిని ఆపుకోవడమే. శరీరమంతా నల్లమచ్చలు, దద్దుర్లు, కళ్లవ్యాధులు, శరీరంపై పొక్కులు వంటి సమస్యలు వాంతిని ఆపితే వస్తాయి. ఇంకా ఛాతీలో మంట, కళ్లమంటలు, ఆన్నవాహికలో, గొంతులో మంట వంటివి కలుగుతాయి. కొన్ని రోగాలకు ఇవే తరువాత కాలంలో కారణమవుతుంటాయి.
శుక్రం:
శుక్రం అంటే వీర్యం. పలు కారణాల వల్ల నేడు చాలామంది శీఘ్రస్కలనం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి వీర్యాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలా చేయడం తప్పు. దీనివల్ల ప్రధానంగా నపుంసకత్వం అనే సమస్య వచ్చే ప్రమాదం ఉంది. వీర్యాన్ని ఆపడం వల్ల శుక్రాశ్మరి (మూత్రంలో రాళ్లు ఏర్పడం) అనే సమస్య వస్తుంది. అలాగే ప్రొస్టేట్‌ గ్లాండ్‌లో వాపు, టెస్టికిల్స్‌లో నొప్పి, తరువాత కాలంలో ఆపినా ఆగకుండా వీర్యం బయటకు వెళ్లిపోవడం, జననావయవాల నొప్పి, జ్వరం వంటి సమస్యలు ఏర్పడతాయి.
శరీర ధర్మాన్ని అనుసరించి బయటకు వెళ్లేవి వెళ్లిపోతుంటాయి. వాటిని మన నియంత్రణలో ఉంచాలనుకోవడం సరికాదు. లేదంటే అవి అనారోగ్య సమస్యలకు దారితీసి శరీరాన్ని లొంగదీసుకుంటాయి. సహజంగా బయటకు వెళ్లిపోవాల్సిన వాటిని కనుక బలవంతంగా ఆపితే దీర్ఘకాలంలో మెదడు నుంచి పాదం వరకు పలు రకాల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

Review ఆరోగ్యభాగ్యం ‘వేగం’.. ఆపితే రోగమే!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top