సూర్య నమస్కార ప్రియ

లోక దైవమైన సూర్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది మాఘ మాసం. వేదాలకు మూలమైన ఈ దైవం ఆరోగ్య ప్రదాత.
లోక రక్షకుడైన ఈయన నమస్కార ప్రియుడు. శరీరంలోని నీరసాన్ని, నిస్తత్తువను పోగొట్టే విశిష్ట జగజ్యోతి అయిన సూర్యుడు మానవుల్లోని తేజోవంతమైన జీవ చైతన్యమై వెలుగొందుతున్నాడు. ఉషః కాలంలో తనకు నమస్కారాలు చేసే వారికి సూర్యుడు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడని ప్రతీతి. అవే కాల క్రమంలో సూర్య నమస్కారాలుగా ప్రసిద్ధి పొందాయి.
సూర్య నమస్కారాలు ఇతర యోగాభ్యసనాల కంటే అతి సులువైనవి. సరళమైనవి. పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. మృదువైన కదలికలతో పన్నెండు భంగిమలు ఆచరించగలిగితే చాలు.. జీవితం మహాద్భాగ్యమవుతుంది. ద్వాదశ (12) సంఖ్యాత్మకమైన సూర్య నమస్కారాలను మనకు వారసత్వంగా వేదాలు అందించాయి. కాబట్టి ఇవి దేవాత్మకమైనవి. వీటిని సక్రమంగా ఆచరిస్తే, ఈ ఆసనాల ద్వారా జరిగే కదలికల ద్వారా శరీరంలోని ఏడు ప్రధాన చక్రాలు చైతన్యవంతమవుతాయి.
వీటిని ఎవరికి వారు సాధన చేయవచ్చు. కాకపోతే, తొలిలో ఎవరైనా శిక్షకులు ఉంటే ఆసన పక్రియ మరింత సరళతరం అవుతుంది.
పన్నెండు ఆసనాలు ఎలా వేయాలి? ఆయా ఆసనాలు వేసే సమయంలో పఠించాల్సిన మంత్రాలు ఏమిటి? ఆయా ఆసనాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటనే విషయాలు వివరంగా తెలుసుకుందాం.
1.

ప్రణామాసనం

మంత్రం: ఓం మిత్రాయ నమః
ప్రార్థన భంగిమలో నిటారుగా నిల్చోవాలి. రెండు పాదాలు ఒకదానికొకటి తాకుతుండాలి. చేతులు నమస్కార ముద్రను చూపాలి. కొద్ది నిమిషాలు ఉచ్ఛ్వాస విశ్వాసాలను చేయాలి. ఆ ఆసనం ఆచరణ వల్ల మనసు నిశ్చలమవుతుంది. మనసును హృదయంపై కేంద్రీకరించి ఉంచడం వల్ల మనసు సూర్యాభివందనం చేయడానికి అనువుగా మారుతుంది. ‘అందరికీ మిత్రుడవైన నీకు అంజలి ఘటిస్తున్నాము’ అనే అర్థం వచ్చేలా పై మంత్రాన్ని పఠించాలి.
2.

హస్త ఉత్థానాసనం

మంత్రం: ఓం రవయే నమః
శ్వాస లోనికి పీలుస్తూ రెండు చేతులనూ పైకెత్తి వీపు వైపునకు వెనుకకు వంచాలి. ప్రారంభ దశలో ఉన్న సాధకులైతే కొద్దిగానూ, చాలా కాలంగా అభ్యసిస్తున్న వారైతే గాఢంగానూ ఊపిరి పీల్చుకోవాలి. ఈ ఆసనం వల్ల వెన్నెముక శక్తిమంతమవుతుంది. వెన్నెముకలోని నరాలను ప్రభావితం చేసే ఆలోచనల వల్ల మనసును ఆహ్లాదంగా ఉంచుతుంది. ఈ ఆసనం సమయంలో ఛాతిని తెరచి ఉంచుకోవాలి. దీనివల్ల శ్వాసక్రియ మెరుగుపడి ఊపిరితిత్తుల శక్తి మెరుగుపడుతుంది. ‘ప్రకాశమవంతుడవైన, ప్రకాశదాతవైన నీకివే నా వందనాలు దేవా!’ అనే అర్థాన్నిచ్చే పై మంత్రాన్ని పఠించాలి.
3.

పాద హస్తాసనం

మంత్రం: ఓం సూర్యాయ నమః
ఈ ఆసనంలో శ్వాసను వదులుతూ రెండు చేతులను నేలపై ఆన్చాలి. రెండు చేతులను నేలపై ఆన్చలేని వారు మోకాళ్లను వంచి చేతులను పాదాలకు ఇరు పక్కలా ఉంచాలి. తల తొడలను చూస్తున్నట్టుండాలి. ఈ ఆసన సమయంలో పైకి చూసే అలవాటు మానాలి. మెడ కింద వైపు వేలాడేలాగా ఉంచాలి. ఈ ఆసనం ఫలితంగా శరీరం నాజూకుగా మారుతుంది. మలబద్ధకం తొలగిపోతుంది. చర్మం బిగువుగా మారి యవ్వన కాంతితో ప్రకాశిస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. తొడల వెనుక భాగానికి బలాన్నిస్తుంది.
‘పుట్టుకకు కారణమైన పరమాత్మా.. నీకు వందనం’ అనే అర్థాన్నిచ్చే మంత్రాన్ని ఈ ఆసన సమయంలో ధ్యానించాలి.
4.

అశ్వ సంచలనాసనం

మంత్రం: ఓం భానవే నమః
లోనికి శ్వాసిస్తూ కుడిపాదం వెనుక వైపునకు కదిలించాలి. అదే సమయంలో శరీరాన్ని కిందకు దించుతూ మోకాళ్లను వంచాలి. కుడి మోకాలుని కూడా అదే సమయంలో వంచాలి. ఇంటి కప్పుల పైకి చూడాలి. నేలపై రెండు చేతులను ఉంచాలి. ఈ భంగిమలో శరీరం అర్థచంద్రాకృతిని కలిగి ఉంటుంది. థైరాయిడ్‍ గ్రంధి చర్యను క్రమబద్ధం చేసేందుకు ఈ భంగిమ కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ ఆసనం వల్ల శరీరానికి మంచి ఆకృతి లభిస్తుంది. థైరాయిడ్‍, టైమర్‍ ఎడ్రినల్‍, యూరోజెనిటల్‍ గ్రంథులు ఉత్తేజితమవుతాయి. శ్వాస సంబంధమైన సైనస్‍ సమస్యను, సంతాన సాఫల్యాన్ని, శ్వాసక్రియను మెరుగుపరచడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. ‘అజ్ఞానాన్ని తొలగించే గురువుకు వందనం’ అనే అర్థాన్నిచ్చే పై మంత్రాన్ని ఆ ఆసనం వేస్తూ జపించాలి.
5.

సంతులనాసనం

మంత్రం: ఓం ఖగయే నమః
నాల్గవ స్థితి నుంచి గాలి నెమ్మదిగా వదులుతూ కాలి వేళ్లు నేలను తాకుతూ ఎడమ కాలిని వెనుకకు కదిలించాలి. ఇప్పుడు మోకాళ్లు రెండూ నేలకు దూరంగా ఉంచాలి. శరీరం మధ్య భాగాన్ని పైకి ఎత్తినట్టు
ఉంచాలి. శరీరం మొత్తం కాలి వేళ్ల పైన అరచేతులపైన ఆధారపడి నిలపాలి. దృష్టిని ఎదురుగా ఉన్న ఏదైనా వస్తువుపై నిలిపి
ఉంచాలి. ఈ ఆసనం వల్ల మణికట్టుకు బలం వస్తుంది. మానసిక, శారీరక పుష్టి కలుగుతాయి. నడుముకు పటుత్వం వస్తుంది. ఈ ఆసనం వేస్తూ ‘అనాయాసంగా సాగిపోయే దైవానికి వందనాలు’ అనే అర్థం వచ్చే పై మంత్రాన్ని పఠించాలి.
6.

అష్టాంగ నమస్కారం

మంత్రం: ఓం పూష్ణే నమః
అరచేతులను కాలివేళ్లను కదలించకుండా నేలపై ఆనించాలి. మొండాన్ని నేలపైకి నెమ్మదిగా వంచాలి. మొదటిగా మోకాళ్లను నేలకు ఆనించాలి. తరువాత ఛాతీని, గడ్డాన్ని నేలకు తాకించాలి. ఈ భంగిమలో శరీరం అల ఆకారంలో కనిపిస్తుంది. కడుపులోని కండరాలు వేలాడకుండా ఈ భంగిమ నిరోధిస్తుంది. మధుమేహం, మలబద్ధకం, జీర్ణ సమస్యల పరిష్కారంలో ఇది అద్భుతంగా పని చేస్తుంది. ఎడ్రినల్‍ గ్రంథులకు విశ్రాంతినిస్తుంది. ‘సర్వులకు పోషకుడవైన నీకు వందనం’ అనే అర్థాన్నిచ్చే పై శ్లోకంతో ఈ ఆసనం వేస్తూ సూర్యుడిని ప్రార్థించాలి.
7.

భుజంగాసనం

మంత్రం: ఓం హిరణ్యగర్భాయ నమః
అష్టాంగ నమస్కార ఆసనం మాదిరే ఇందులోనూ ఉదరం నేలకు తాకేలా ఉంచాలి. శ్వాసలోనికి పీలుస్తూ నేలపై నుంచి గడ్డాన్ని, తలను పైకెత్తి చూస్తూ ఉండాలి. నడుము వెనుక ఒంపు వచ్చేలా మెడను పైకెత్తి చూస్తూ ఉండాలి. మోచేతులను శరీరానికి దగ్గరగా ఉంచాలి. ఒత్తిడి, స్థూలకాయం, వెన్నెముక సమస్యలు, థైరాయిడ్‍ సమతుల్యం, రుతు సంబంధ సమస్యలకు పరిష్కారంగా ఈ ఆసనం అమోఘంగా పనిచేస్తుంది. ఈ ఆసనం వేస్తూ ‘విశ్వప్రతినిధివైన నీకు నమస్కారం’ అనే అర్థం వచ్చే పై మంత్రాన్ని పఠించాలి.
8.

పర్వతాసనం

మంత్రం: ఓం మరీచయే నమః
భుజంగాసనం భంగిమ నుంచి చేతులను, పాదాలను కదల్చకుండా శ్వాసను విడుస్తూ కటి భాగాన్ని మెల్లగా పైకి లేపాలి. మడమలను నొక్కి ఉంచాలి. ఈ భంగిమ ‘వి’ అనే ఆంగ్ల అక్షరాన్ని తిరగేసినట్టుగా ఉంటుంది. లో, హై బీపీలకు ఇది దివ్యౌషధి. శరీరం మొత్తాన్ని చక్కబరుస్తుంది. మానసిక, భౌతిక శక్తులను వృద్ధిపరుస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఆసన సమయంలో ‘మాయలను, భ్రమలను తొలగించే దైవమా’ అనే అర్థాన్నిచ్చే పై మంత్రాన్ని జపించాలి.
9.

అశ్వ సంచలనాసనం

మంత్రం: ఓం ఆదిత్యాయ నమః
పై ఆసనాల నుంచి నెమ్మదిగా కటి ద్వయాన్ని కిందకు దించి కుడి కాలిని కొంచెం ముందుకు తెచ్చి రెండు చేతులను నేలకు అదిమి ఉంచాలి. ఎడమ మోకాలును నెమ్మదిగా వెనక్కి చాచాలి. నెమ్మదిగా లోనికి శ్వాసిస్తూ పైకి చూస్తుంటే అర్థ చంద్రాకారం కలిగి గుర్రం ఆకారం వలే ఉంటుంది. ఇది కూడా లో, హై బీపీలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ ఆసన సమయంలో ‘విశ్వసుతుడవైన నీకు ప్రణామం’ అనే అర్థాన్నిచ్చే పై మంత్రాన్ని చదవాలి.
10.

పాదహస్తాసనం

మంత్రం: ఓం పవిత్రే నమః
అశ్వ భంగిమ నుంచి శ్వాసను విడుస్తూ ఎడమ పాదాన్ని ముందుకు చాచాలి. అప్పుడు రెండు పాదాలు ఒకే భంగిమలో ఉంటాయి. అదే సమయంలో శరీర భాగాన్ని పైకెత్తి ముందుకు నిల్చునే విధంగా వంగాలి. ‘చైతన్యం కలిగించే వానికి ప్రణామం’ అనే భావాన్నిచ్చే పై అర్థాన్ని జపించాలి.
11.

హస్త ఉత్థానాసనం

మంత్రం: ఓం అర్కాయ నమః
పై భంగిమ నుంచి రెండు చేతులను తలపైకి ఎత్తి ఉంచాలి. అలా చేసేటప్పుడు గాఢంగా గాలిని పీల్చాలి. నడుం వెనుక భాగం వద్ద కొద్దిగా వంగాలి. ‘శక్తి ప్రదాతకు నమస్సులు’ అనే అర్థాన్నిచ్చే పై మంత్రాన్ని చదవాలి.
12.

ప్రణామాసనం

మంత్రం: ఓం భాస్కరాయ నమః
శ్వాసను వదులుతూ రెండు అరచేతులను నమస్కార భంగిమలో ఉండేలా దగ్గరకు చేర్చి ఛాతీ వద్ద ఉంచాలి. సూర్య నమస్కారాల్లో ఇదే చివరిది. దీంతో సూర్య నమస్కారాలు పూర్తయినట్టే. ‘గురువుకు అభివాదం’ అనే అర్థంలో పై మంత్రాన్ని ఈ ఆసనం వేసే సమయంలో పఠించాలి.

Review సూర్య నమస్కార ప్రియ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top