నిగ్రహంతోనే అనుగ్రహం

మనిషికి మనో నిగ్రహం అవసరం. దాన్ని పొందాలంటే ప్రతి రోజూ క్రమం తప్పకుండా ధ్యానం చేయడం అవసరం. కళ్లు, చెవులు, ముక్కు, నోరు జ్ఞానేంద్రియాలు. మానవునికి ప్రపంచం ఏమిటో తెలుసుకోవడానికి ఉప యోగపడే సాధనాలు ఇవి. అలాగే కాళ్లు, చేతులు కర్మేంద్రియాలు. ఇవి మనం కోరుకున్న వాటిని పొందడానికి పని చేసే పరికరాలు. ప్రకృతిలో అందమైన దృశ్యాలను చూడటానికి కళ్లు ఆరాట పడతాయి. శుభవార్తలను, మంచి మాటలను వివడానికి చెవులు ఇష్టపడతాయి. అలాగే, సువాసనలను, స్వచ్ఛమైన గాలిని పీల్చడానికి ముక్కు ఉపయోగపడుతుంది. నాలుకకు రుచులు అంటే అత్యంత ప్రీతి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మనకు ఎల్లప్పుడూ లోబడి ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇంద్రియ నిగ్రహంతోనే ఇవి అదుపులో
ఉంటాయి. అందుకే మనిషికి ఇంద్రియ నిగ్రహం అవసరం. మనం ఇంద్రియాలకు లోబడి ఉండకూడదు. ఇంద్రియాలే మన ఆధీనంలో ఉండాలి. అలా ఉండాలంటే, మన సును ముందుగా మన అదుపులో ఉంచు కోవాలి. మనసును నిలకడగా ఉంచడం అంత సులువు కాదు. అది చూసిన ప్రతి దానినీ పొందాలని తాపత్రయపడుతుంది. ఇంద్రియాల మీద నిరంతరం అది ఒత్తిడి తెస్తుంటుంది. దాంతో అనేక రకాల ఇబ్బందులు తలెత్తు తుంటాయి. ఈ సంఘర్షణే మానసిక అశాంతికి దారితీస్తుంది.

మనో నిగ్రహం పొందాలంటే..
మనో నిగ్రహం పొందాలంటే మనసును దైవ ధ్యానం మీద లగ్నం చేయాలి. అర్థం లేని ఆలో చనలు మనసును చుట్టుముడితే ఇష్టదైవ నామాన్ని జపించాలి. అస్టమాను గుడికి వెళ్లడానికి కుదరకపోయినా బాధపడాల్సిన పనిలేదు. మనసు భగవంతుడి మీద నిమగ్నం చేయగలిగితే చాలు. మనసు నిర్మలంగా ఉంటే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వల్ల మనో నిగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా బాహ్య ప్రపంచంలో తిరగడం వల్ల, మంచి పుస్తకాలు చదవడం వల్ల, మంచి మాటలను వినడం వల్ల, మంచి వ్యక్తులతో, సత్సంగాలు చేయడం వల్ల మనకు తెలియని అనేక విషయాలు తెలిసి వస్తాయి. తెలియని కొత్త కొత్త మంచి విష యాలను తెలుసుకోవడమే జ్ఞానం. తెలివైన
వాళ్లు దేనికీ భయపడరు. ఎలాంటి పనైనా సరే దిగ్విజయంగా చేయగలుగుతారు. అంతేకాక ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించగలుగుతారు. నోరు మంచిదైతే ఊరు మంచిదనే సామెత కూడా ఉండనే ఉంది కదా!. దీనిని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంటికి వచ్చిన అతిథులను, స్నేహితులను ఆదరించి వారితో ఏ విధమైన పరుష వాక్యాలు పలకకుండా మంచిగా మాట్లాడాలి. అంతేగాని చీటికీమాటికీ అబద్ధాలు, లేనిపోని గొప్పలు మాట్లాడకూడదు. మనం ఆత్మీయంగా మాట్లాడితే అందరూ మనం అంటే ఇష్టపడతారు. గౌరవిస్తారు. మన మాటకు విలువ ఇస్తారు. కోరికలకు పగ్గాలు వేయాలి..
అలాగే, కోరికలు అనంతాలు. ప్రతి ఒక్కరికీ కోరికలు ఉంటాయి. కొన్ని కోర్కెలు తీర్చు కోవచ్చు. మరికొన్ని తీర్చుకోవడానికి వీలు కాదు. ఆ కోర్కెలు ఎలా తీర్చుకోవాలా అని ఆలోచిస్తూ కూర్చుంటే పరిష్కారం లభించకపోగా, కుటుంబంలో, మనసులో లేనిపోని అలజడులు కలుగుతాయి. మనసులో అలజడి రేగితే భార్యాభర్తలు, పిల్లలతో ఆనందాన్ని పంచుకోలేం. వారితో సంతోషంగా ఉండలేం. స్నేహితులతో సరిగా ఉండలేం. ఏ పనీ మనసు పెట్టి చేయలేం. దేనిపైనా శ్రద్ధ చూపలేం. నిద్రపట్టదు. మనసు గతి తప్పుతుంది. ఇన్ని బాధలు పడుతూ కోర్కెలు పెంచుకోవడం అనేది అవివేకం. అధికమైన, తీరని కోర్కెలు కలగకుండా మనసుసు అదుపులో ఉంచుకోవాలి. అందుకు దైవ ధ్యానమే సరైన మార్గం. జపం ఎంత ఎక్కువగా చేస్తే మనసులోని కోర్కెలు అంత త్వరగా తొలగిపోతాయి. మనసు ప్రశాంతంగా, బుద్ధి నిలకడగా ఉంటుంది. రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులు, తలనొప్పులు మొదలైన రోగాలు కూడా దరిచేరవు.

ఉదయాన్నే లేస్తే ఎన్నెన్నో మార్పులు..
నేటి యాంత్రిక జీవితాలలో రాత్రి చాలా పొద్దుపోయే వరకు మెలకువగా ఉండటం, తెల్లవారాక ఎంత ఆలస్యంగా నిద్రలేస్తే అంత శ్రమపడ్డాం, అంత గొప్పవారం అనుకునే వారు చాలామంది ఉన్నారు. ఆలస్యంగా నిద్రలేస్తే ఎంత నష్టమో గమనించాలి. పిల్లలైనా, పెద్దవారైనా ఎవరైనా సరే తెల్లవారుజామునే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. అది ఆరోగ్యదాయకమైన లక్షణం. తెల్లవారుజామునే నిద్రలేచి బయట తిరుగుతూ పనులు చేసుకోవడం వల్ల నక్షత్రాల కాంతి శరీరానికి మెరుపును ఇస్తుంది. వీచే చల్లని గాలి శ్వాసకోశాలను శుభ్రపరచడమే కాక రోజంతా ఆహ్లాదాన్ని ఇచ్చే మానసిక ఆనందాన్ని కలుగుచేస్తుంది. ఉదయించే సూర్యకిరణాలు శరీరంపై పడటంతో ఎటువంటి చర్మవ్యాధులు దరిచేరవు. చాలామంది తెల్లవారుజామునే లేవలేం, పని చేయలేం అంటారు. కానీ, మనిషికి సాధ్యం కానిది ఏదీ లేదు కదా! మనసు ఉంటే మార్గం ప్రతీ దానికీ ఉంటుంది. వారం రోజులు క్రమం తప్పకుండా తెల్లవారుజామునే నిద్రలేస్తే అదే అలవాటు అవుతుంది. చీకటితోనే లేస్తే దైవ ధ్యానం చేసుకోవచ్చు. పనులు చేసుకుని, పిల్లలను చదివించవచ్చు. హడావుడి లేకుండా స్కూళ్లకు పంపించి ఆరామముగా ఆఫీసులకు వెళ్లవచ్చు. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయాల్సి రావడం వల్ల పడే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
ప్రస్తుతం పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ ధ్యానం (మెడిటేషన్‍) నేర్పడానికి అనేక కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. ఇంట్లో దైవ ధ్యానం చేయడానికి కుదరని వారు రోజూ ఏదో సమయంలో ఈ కేంద్రాలకు కానీ, గుడికి కానీ, ఖాళీ ప్రదేశాలకు కానీ వెళ్లి ధ్యానం చేయవచ్చు. లేదా ప్రశాంతంగా గడపవచ్చు. తద్వారా ఆరోగ్యానికి, మనసుకు స్వాంతన చేకూరుతుంది. వ్యాపకం లేకుండా ఎప్పుడూ ఇంట్లోనే ఏదో ఒక పనితో సతమతం అయ్యే వారు ఈ పేరుతోనైనా బయటకు వస్తే బాహ్య ప్రపంచం గురించి తెలుస్తుంది. నలుగురితో పరిచయాలు పెరిగి అందరితోనూ ధైర్యంగా మాట్లాడగలుగుతారు. యువతరానికి కూడా ధ్యానం అనేది తప్పనిసరి. అందులో నేటి తరం వారికి అన్ని రంగాల్లోనూ పోటీ విసరీతంగా పెరిగి వారి మనసుపై ఒత్తిడి అధికమవుతోంది. కొందరు బలహీనులైన వారు ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణాలు కూడా తీసుకుంటున్న ఉదంతాలను మనం చూస్తున్నాం. అటువంటి సున్నిత మనస్కులు మానసిక ఆందోళన చెందకుండా నిదానంగా ఆలోచించి పోటీని తట్టుకుని, సరైన మార్గంలో పయనించాలంటే వారికి మనో నిగ్రహం చాలా అవసరం. ధ్యానం ద్వారా మాత్రమే దానిని పొందగలం. ధ్యానాన్ని ఒక సాధనగా చేసుకోగలిగితే కనుక మనం జీవితంలో చాలా సాధించగలం. .

హృదయంతో జీవించాలి..
ధ్యానం, ప్రశాంతత.. ఇవన్నీ సాధించడానికి ముందు మనం అసలు ‘హృదయం’తో బతకాలి. మనం జీవించడానికి ఉండాల్సిన అతి ముఖ్యమైన సాధనం హృదయం. కానీ, దురదృష్టవశాత్తూ మనం హృదయం లేకుండానే బతికేస్తున్నాం. జీవులన్నిటిలో మనిషే ఉత్తముడు. అతనికి హృదయమే ప్రాణం. అక్కడే ఆలోచనలు.. అవి మంచివైనా, చెడ్డవైనా ప్రాణం పోసుకుంటాయి. మనలో ఏ లక్షణాలు ఎక్కువగా ఉంటే మనం ఆ రకంగా రూపుదిద్దుకుంటాం. అటువంటి పవిత్ర హృదయ స్థానంలో భగవంతుడిని ప్రతిష్ఠించుకుంటే మనం సాక్షాత్తూ భగవంతుడిలా మారిపోగలం. హృదయంలో దైవాన్ని ప్రతిష్ఠించుకుంటే, మనకు జీవితంలో ఏ లోటుపాట్లూ రావు. ఒడిదుడుకులు ఉండవు. కాబట్టి మొదట హృదయంతో జీవించడం అలవాటు చేసుకోవాలి. అది మనలోనే ఉంది. దానిని గుర్తించి, దానిని దారిలో పెట్టుకోగలిగితే చాలు ఇక మన పయనమంతా పూలబాటే.

Review నిగ్రహంతోనే అనుగ్రహం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top