
ఒకోసారి పదేపదే మన కోరికలను గట్టిగా చెప్పుకుంటే కొన్నాళ్లకు అదే నిజమవుతుందేమో?!. చూడబోతే నాని విషయంలో అదే జరిగేట్టు ఉంది. నాని విభిన్న సినిమాలతో, విలక్షణ నటనతో తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. అతను ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా ‘మణిరత్నం సినిమాలో నటించాలనేది నా కల’ అని చెబుతుంటాడు. పైగా చిన్నప్పటి నుంచి మణిరత్నానికి నాని వీరాభిమాని. ఈ విష యాన్ని పలుమార్లు చెప్పడంతో పాటు ఆయన దర్శకత్వంలో నటించాలనేది తన డ్రీమ్ అని పలు సందర్భాల్లో చెప్పాడు. ఇప్పుడు నిజం గానే అది నిజమయ్యేలా ఉంది. మణిరత్నం ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో ముగ్గురు కథానాయకులు, ముగ్గురు కథానాయికలు నటిస్తారని సమాచారం. ఓ కథానాయకుడిగా తెలుగు నుంచి నానిని ఎంపిక చేసుకునే విషయాన్ని మణిరత్నం సీరియస్గా పరిశీలిస్తున్నట్టు తమిళ సినీ వర్గాల టాక్. ఇంకా తమిళం, మలయాళం బాషల నుంచి జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, అరవింద్ స్వామి నటిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఎంసీఏ’లో నటిస్తున్న నాని, అనంతరం ‘కృష్ణార్జున యుద్ధం’లో నటించనున్నాడు. చూడాలి మరి.. అతని కల నెరవేరుతుందో లేదో?!.
Review కలయా? నిజమా?.