హిట్ ప్లాఫ్‍తో నిమిత్తం లేకుండా కొన్నేళ్లుగా తెలుగు తెరపై తళుకులీనుతున్న తార కాజల్. అగ్ర నాయకులు, వర్ధమాన హీరోలు అందరి సరసన నటించిన ఈ భామ నెక్టస్ ఏం చేయ బోతోందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అందరి మాదిరిగానే తనలోనూ బలాలు, బలహీనతలు ఉన్నాయని, అయితే వయసుతో పాటే కలుగుతున్న అనుభవంతో బలహీనతలు, లోపాలను సునాయాసంగా నెగ్గుకొస్తున్నానని చెబుతోందీ అమ్మడు. ఇటీవల ఓ షూటింగ్ సెట్‍లో ‘తెలుగు పత్రిక’ సరదాగా పలకరించినపుడు తన మనసులోని మాటలు ఇలా చెప్పుకొచ్చింది..
ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు కదా! బోర్ కొట్టడం లేదా?
బోరా? నేను ఏదైనా పని చేపట్టానంటే పిచ్చిపట్టినట్టు అందులో లీనమైపోతా. నిజానికి ఆ పనికి అంత ప్రాధాన్యం ఇవ్వాలా? వద్దా? అనేది సెకండరీ. మొత్తానికి మనం ఏం పని చేస్తున్నామో అందులో వంద శాతం నిజాయితీగా లీనమైపోతే కలిగే కిక్కే వేరు. ఆ కిక్కే
ఇన్నేళ్లుగా నన్ను నడిపిస్తోంది.
మరి మీకంటూ సమయం మిగులుతుందా?
రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తుంటా. అయితే, నా కోసం నేను ఒకింత సమయం కేటాయించుకోలేనా? అనిపిస్తుంది. అది నా బలహీనతే. అయితేనేం.. పని చేయడంలో ఉన్న ఆనందం దాన్ని మరిపిస్తుంది.
ఇన్నేళ్లలో మీలో ఏమైనా లోపాలు గుర్తించారా?
మనలోని బలహీనతలను మనం గుర్తించగలగడం కూడా ఒక బలమే. అవును. నా లోపాలేమిటో నేను గుర్తించే విషయంలో ఎప్పుడూ ముందుంటా. వాటిని సరిదిద్దుకునే విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయను.
త్వరలో ఏ సినిమాలు చేయబోతున్నారు?
కొన్ని డిస్కషన్స్లో ఉన్నాయి. మరికొన్ని సెట్స్ ఎక్కడానికి రెడీ అవుతున్నాయి. వాటి నిర్మాతలు వాటి గురించి ప్రకటిస్తారు. ఆయా సినిమాల్లో నా పాత్రకు ఎంత వరకు న్యాయం చేయగలననే దానిపైనే నా దృష్టంతా.
అనుభవం నేర్పిన పాఠాలేమైనా ఉన్నాయా?
చాలా. ఇక్కడ ఎప్పటికప్పుడు పాఠాలు నేర్చుకుంటూనే ఉండాలి. అయితే, వాటి నుంచి ఎంతోకొంత నేర్చుకుంటా. ఈ ఇండస్ట్రీలో నాకున్న అనుభవం నేర్పిన పాఠాలతో నాకు ఎదురైన సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకెళ్తా.
Review పనిలోనే కిక్కు.