
తండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్పించే కొడుకుల గురించి చదివి, విని ఉంటాం. కానీ, కొడుకునే తండ్రి వృద్ధాశ్రమంలో చేరిస్తే.. ?. అమితాబ్ బచ్చన్, రిషికపూర్ కలిసి నటించిన తాజా బాలీవుడ్ చిత్రం ‘102 నాటవుట్’లో ఇటువంటి సన్నివేశాలను చూడవచ్చు. ఇందులో అమితాబ్ నూట రెండు సంవత్సరాల వృద్ధునిగా నటిస్తుంటే, రిషికపూర్ ఆయన డెబ్బై ఐదేళ్ల వయసు కుమారుడిగా నటిస్తున్నారు. ఇంకో విశేషం ఏమిటంటే, వీరిద్దరు కలిసి దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల తరువాత నటిస్తున్న చిత్రమిది. ప్రసిద్ధ గుజరాతీ నాటకం ‘102 నాటవుట్’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘ఓ మై గాడ్’తో దర్శకునిగా మెప్పించిన ఉమేష్ శుక్లా ఈ చిత్రానికి దర్శకుడు. 75 ఏళ్లకే కొడుక్కి జీవితం అంటే మహా భారంగా అనిపిస్తుంది. తండ్రిని చూసినా, మరెవరిని చూసినా అతనికి పట్టరాని కోపం వచ్చేస్తుంటుంది. అతని మానసిక స్థితిని సరిదిద్దడానికి తండ్రి కొడుకును వృద్ధాశ్రమంలో చేర్పించాలని ఆలోచిస్తుంటాడు. అది ఎందుకు? కొడుక్కి తండ్రి చేసిన హితబోధ ఏమిటి? అనేది తెరపై చూడాల్సిందే. ఈ చిత్రంలో అమితాబ్‌కు రోజూ మేకప్ వేయడానికి రెండున్నర గంటలు, ఆ మేకప్‌ను తీయడానికి రెండున్నర గంటల సమయం పట్టిందట. ఈ చిత్రంలో అమితాబ్ నెరసిని పొడవాటి జుత్తు, గుబురు గడ్డం, ముడతలు పడిన చర్మంతో కనిపిస్తారు. ఏదేమైనా ఒకనాటి ఈ యాంగ్రీ యంగ్‌మాన్ ఈ వృద్ధుని పాత్రలో నటనను ఎలా పండించారో చూడాల్సిందే.
Review 102 నాటవుట్.