అందరూ బాగుండాలి యోగా వర్థిల్లాలి

శరీరాన్ని యోగా.. మనసును ధ్యానం నియంత్రించి జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయి. సాధారణ చికిత్సకూ లొంగని కొన్ని వ్యాధులు యోగాభ్యాసంతో నయమవుతున్నాయి. నేటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమతో పాటు ఒత్తిడినీ మోస్తున్నారు. ఈ యాంగ్జయిటీ కారణంగా శరీరంలో చోటుచేసుకునే మార్పులు.. మనపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగానే.. మనిషి, మనసు అదుపు తప్పుతున్నాయి. అసంతృప్తి, ఆందోళన, డిప్రెషన్‍.. ఇంకా మానసిక రుగ్మతలు మనసు అదుపు తప్పడం వల్లనే కలుగుతున్నాయి. వీటన్నిటికీ చక్కని, తేలికైన పరిష్కారం- యోగా మాత్రమేనని నేటి ఆధునిక పరిశోధనలు తెలియచెబుతున్నాయి. యోగా మనసులోని గజిబిజి ఆలోచనలను పారద్రోలి పంచేంద్రియాలకు సాంత్వన అందిస్తుంది. మెదడులో మెదిలే ఆలోచనల్ని నియంత్రించి ధ్యాసను ఏకాగ్రత వైపు మళ్లిస్తుంది. ఇది యోగాతోనే సాధ్యమవుతుంది. ఇవన్నీ సాధ్యం కావాలంటే వెంటనే చేయాల్సిన పని.. జీవనశైలిని మార్చుకోవడం. ప్రాచీన కాలం నాటి జీవన విధానాలు.. ఆశ్రమ వాతావరణం.. సంప్రదాయ ఆహార విహారాలు.. వీటి మధ్య గడుపుతూ, వీటిని స్వయంగా అనుభూతి చెందితే ఎంతటి మనిషైనా, ఎటువంటి మనసైనా దెబ్బకు ‘యోగా దారి’లో పడాల్సిందే. మరి అటువంటి అనుభూతిని ఆస్వాదించాలనుకుంటే.. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న ‘వివేకానంద యోగా అనుసంధాన సంస్థానం (ఎస్‍-వీవైఏఎస్‍ఏ)కు వెళ్లాల్సిందే. దేశంలోనే పప్రథమ యోగ విశ్వవిద్యాలయం (డీమ్డ్) ఇది. జూన్‍ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ విశ్వవిద్యాలయం.. ఇక్కడి వాతావరణం.. ఇక్కడ అందుబాటులో ఉన్న యోగవిద్య, ఇక్కడ దొరుకుతున్న శారీరక, మానసిక సాంత్వన గురించి తెలుసుకుందాం. జూన్‍ 21, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం..
పతంజలి మహర్షి ఈ ప్రపంచానికి అందించిన అమూల్యమైన కానుక ‘యోగా’. యోగాచార్యులు, యోగ పురుషుడు, యోగదాత అయిన ఆయన యోగ సూత్రాల రూపంలో మానవ లోకానికి అందించిన ఈ ‘యోగ నిధి’.. మానవజాతిలోని ఏ తరానికైనా తలమానికం అవుతుంది. తపోవనాల్లో, ఆశ్రమాల్లో ప్రాణం పోసుకున్న యోగ సూత్రాలకు శాస్త్ర ప్రతిపత్తిని కల్పించిన పతంజలి యోగ దాత కాక మరెవరు? భారతగడ్డపై పుట్టి విశ్వవ్యాప్తమైన యోగా.. ఒత్తిడితో కూడిన ఆధునిక జీవితాలకు, రోజురోజుకూ పుట్టుకొస్తున్న కొత్త జబ్బులను నయం చేయడానికి సరికొత్త రూపం సంతరించుకుంటోంది. అందుకు బెంగళూరులోని ఈ వినూత్న విశ్వవిద్యాలయం వేదికైంది.

రమేశ్‍లాంటి వారెందరో?!
రమేశ్‍కు ఉన్నట్టుండి చూపు మందగించింది. వయసు కూడా పెద్ద ఎక్కువేమీ కాదు. దీంతో కారణం ఏమిటో తెలియక ఆందోళనతో కంటివైద్యుడిని సంప్రదించి, కంటిఅద్దాలు పెట్టుకున్నాడు.
హమ్మయ్యా.. సమస్య తీరిందనుకునేలోగా, రమేశ్‍ ఒకరోజు మెట్లు దిగుతూ పడిపోవడంతో కాలు బెణికింది. నెలల తరబడి మంచంపై నుంచి లేవలేని పరిస్థితి.. ఎముకల డాక్టరు వద్దకు వెళ్లి ఎంతోకొంత వదిలించుకుంటే తప్ప మళ్లీ లేచి నిలబడలేదు.
చిరుద్యోగి అయిన రమేశ్‍ రోజుల వ్యవధిలో తనకెదురైన ఈ రెండు ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వైద్యం కోసం డాక్టర్ల చుట్టూ రోజుల తరబడి తిరిగాడు. అందుకోసం తన తాహతుకు మించి చాలా డబ్బు వెచ్చించాల్సి వచ్చింది. అంతకుమించి విలువైన సమయం వృథా అయింది.
ఎంతో చురుగ్గా ఉండే రమేశ్‍.. ఈ రెండు అనుభవాలతో ఎందుకో సైలెంట్‍ అయిపోయాడు. పిలిస్తే కానీ పలకడు. మనసంతా ఆందోళన.. పైకి ఇదీ అని చెప్పుకోలేని కారణంతో అసంతృప్తి.. మానసిక ఒత్తిడితో సతమతమవసాగాడు. ఎవరో సలహా ఇస్తే మానసిక వైద్యుడిని కలిశాడు. ఆ వైద్యుడు ఏవో మందులు రాశాడు. కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడు. కానీ సమస్య తీరలేదు.
ఉద్యోగ, సంసార బాధ్యతలు.. ఆరోగ్య సమస్యలు.. వాటిపి నయం చేసుకోవడానికి అవుతున్న ఖర్చు, అందుకోసం కరిగిపోతున్న సమయం.. ఇలా రమేశ్‍ జీవితం ఒడిదుడుకుల మధ్య సాగుతూనే ఉంది.
కాలినొప్పికి ఓ డాక్టరు.. గుండెనొప్పికి ఇంకో డాక్టరు.. కంటివైద్యానికి మరో డాక్టరు.. ఇలా శరీరంలోని ప్రతి అవయవానికి, వాటికి వచ్చే జబ్బులకు ఒక్కో ప్రత్యేక వైద్యుడు.. ఇంత ఆధునిక కాలంలోనూ మనిషికి ఒకేచోట.. పరిపూర్ణ ఆరోగ్యం లభించే చోటే లేదా?
ఈ రోజుల్లో ఒక వ్యాధి తగ్గించుకునే సరికి సైడ్‍ఎఫెక్ట్గా మరో జబ్బు పుట్టుకొస్తోంది. దాన్ని నయం చేసుకునే సరికి ఇంకో రుగ్మత పుడుతుంది.
మరి మనిషికి సంపూర్ణ ఆరోగ్యం ఎలా లభిస్తుంది? ఎక్కడ లభిస్తుంది.
.. ఇలా తన ఆలోచనలకు తనలోనే నవ్వుకున్నాడు రమేశ్‍. ఒక మనిషిలో కలిగే రుగ్మతలు, ఆరోగ్య సమస్యలకు ఒకేచోట వైద్యం లభించడం కానీ, ఒకేచోట సంపూర్ణ ఆరోగ్యం లభించడం కానీ అసంభవం అనుకున్నాడు.
అలా భావిస్తున్న సమయంలోనే అతడికి బెంగళూరులోని ‘వివేకానంద యోగ అనుసంధాన సంస్థానం’ గురించి తెలిసింది.
వెంటనే అక్కడికి బయల్దేరాడు. ఇప్పుడతను అక్కడే ఉన్నాడు. ఆ విశ్వవిద్యాలయం గురించి తెలుసుకోవడానికి మనమూ అక్కడికి వెళ్దాం పదండి..

పరిపూర్ణ ఆరోగ్యం ప్రశ్నార్థకం కాదు..
ఒక్కో అవయవానికి ఒక్కో వైద్యం.. పరిపూర్ణ ఆరోగ్యం ప్రశ్నార్థకం.. మనిషికి పరిపూర్ణ ఆరోగ్యం.. అంటే ఒకేచోట శరీరం, మనసు మొత్తాన్ని నయం చేయగల వైద్యమేదీ లేదా? దీనికి సమాధానమే- బెంగళూరు యోగ విశ్వవిద్యాలయం. ఇక్కడ సమీకృత యోగ చికిత్స లభిస్తుంది. యోగాసనాలు, ఆయుర్వేదం, ప్రకృతి చికిత్స, ఆక్యుపంచన్‍, ఫిజియోథెరపీ, సైకోథెరపీ, ఆక్యుప్రెషన్‍, పోషకాహారం.. ఈ ఎనిమిది అంశాల మేలు కలయిక ఈ యోగ విశ్వవిద్యాలయం. ఈ ఎనిమిదీ.. మనిషికి పరిపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తున్నాయి.
ఈ యోగ విశ్వవిద్యాలయంలోకి అడుగుపెట్టగానే.. ఎప్పుడో వేదకాలం నాటి వాతావరణంలోకి అడుగిడిన అనుభూతి కలుగుతుంది. వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చిన వారుంటారు.. కానీ ఎక్కడా మందుల వాసన.. ఆస్పత్రుల్లో కనిపించే మంచాలు.. రోగుల మూలుగులు.. ఇలాంటివేవీ కనిపించవు.
ఇక్కడ రోగుల ఆరోగ్యస్థితి, అవసరాన్ని నిపుణులు చికిత్సా విధానాన్ని నిర్ణయిస్తారు. వారం నుంచి నెలలో దాదాపు నయం చేస్తారు.
కానీ, ఇక్కడ అడుగుపెట్టే ముందు కచ్చితంగా.. అన్నీ నాకు తెలుసనే అహాన్ని విడిచిపెట్టాలి. మన హోదాలను తీసి అవతల పెట్టాలి. ఎవరైనా, ఎంతటివారైనా సరే.. ఒక విద్యార్థిలా మారిపోవాలి. ఏకాగ్రతతో ఉండాలి. మనసును అదుపులో పెట్టుకోవాలి. అప్పుడే ఇక్కడకు వచ్చిన మీరు సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వెళ్తారు. మన మునులూ, రుషులూ అనుభవపూర్వకంగా గ్రహించిన యోగ ఫలాలను ప్రపంచానికి అందించడం.. నిగూఢమైన అంశాలను పరిశోధనలతో వెలికితీయడం.. తేలికైన యోగ చికిత్స విధానాలను సమాజానికి మరింతగా చేరువ చేయడం.. ఈ యోగ విశ్వవిద్యాలయం

లక్ష్యాలు.
ఇక్కడ ఒక్కసారి అడుగుపెడితే మొత్తం జీవనశైలి మారిపోతుంది.. కాదు కాదు.. మార్చేస్తారు. ఇక్కడికి వచ్చే వారు కచ్చితంగా సమయపాలన పాటించేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇదీ టైమ్‍ టేబుల్‍..
ఉదయం 5.00: సరిగ్గా ఈ సమయానికి నిద్రలేవాలి.
5.30: ఈ సమయంలోగా (అరగంట) కాలకృత్యాలు తీర్చుకోవాలి.
5.30 – 6.00: ధ్యానం.
7.00: యోగాంశాలపై బోధన.. నిపుణుల సలహా సూచనలకు అనుగుణంగా, రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎవరికి అవసరమైన ఆసనాలు వారికి నేర్పిస్తారు.
8.00: ఫలహారం. ఆ తరువాత న్యూరాలజీ, అంకాలజీ, పల్మనాలజీ, కార్డియాలజీ, సైకియాట్రీ, రుమటాలజీ, మెటబాలిక్‍ డిజార్డర్స్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఎండోక్రినాలజీ వంటి వివిధ విభాగాల పర్యవేక్షణలో అవసరమైన వారికి రెండు గంటల పాటు వైద్యం, చికిత్స అందిస్తారు.
10.45: ప్రాణాయామ రహస్యాల బోధన.
మధ్యాహ్నం 1.00: భోజనం.
భోజనాలు పూర్తయ్యాక ఉపన్యాసాలు, భజనలు ఉంటాయి.
రాత్రి 9.00: కచ్చితంగా లైట్లు ఆర్పేసి నిద్రకు ఉపక్రమించాలి. నిమిషమైనా తప్పని సమయపాలన.. చక్కని క్రమశిక్షణ.. మానసిక స్వస్థతను కలిగించే ఉపశమన చర్యలు, యోగసనాలు.. ఆరోగ్యవంతమైన పోషకాహారం.. జ్ఞానం కలిగించే ఆధ్యాత్మిక ఉపన్యాసాలు.. భక్తియోగం కలిగించే భజనలు.. మనసుకు ఆహ్లాదం కలిగించే వాతావరణం.. అసలు ఈ దినచర్యే ఒక గొప్ప చికిత్స. ఈ సమయపాలన పాటిస్తే చాలు.. సగం రుగ్మతలు తగ్గిపోతాయి. ఈ ఆలోచన వెనుక ఆ నలుగురు..
అసలు జీవితం అంటే ఏమిటి?

జీవన పరమార్థం ఏమిటి?
ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది?..
ఇవీ ఆయన మదిలో ఎడతెరిపి లేని సంవాదాలు.. ఎగతెగని ఆలోచనలు.. అలా ఆ అన్వేషణలో వేదాంతం చక్కని చుక్కాని అయింది. ఎవరైనా తనను తాను తెలుసుకోవాలంటే, అందుకు ఆధ్యాత్మికతను మించిన మార్గం ఉందా?
ఈ స్పష్టత వచ్చాక ఆయన ఇక క్షణమైనా ఉపేక్షించలేదు. ‘నాసా’లో ఉద్యోగాన్ని వదిలేశారు.
ఇంతకీ ఆయన ఎవరు?
డాక్టర్‍ నాగేంద్ర.. ప్రస్తుత యోగా విశ్వవిద్యాలయం స్థాపనలో మూలస్తంభం లాంటి వ్యక్తి ఈయన. ఇండియన్‍ ఇన్‍స్టిట్యూట్‍ ఆఫ్‍ సైన్సెస్‍ నుంచి మెకానికల్‍ ఇంజనీరింగ్‍లో డాక్టరేట్‍ అందుకున్న ఘనత నాగేంద్రది. అనంతరం ఆయన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’లో పనిచేశారు.
తన ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుని, జీవితంపై ఒక స్పష్టత వచ్చాక డాక్టర్‍ నాగేంద్ర నేరుగా తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకుని, అక్కడ ఏక్‍నాథ్‍ రానాడే నిర్వహిస్తున్న వివేకానంద యోగా కేంద్రంలో చేరారు.
యోగాను ఓ సామాజిక అవసరంగా ఈ ప్రపంచానికి చాటిచెప్పాలనేది ఏక్‍నాథ్‍ ఆశయం. అందుకోసం పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటుచేసి దాని బాధ్యతలను ఈయనకే అప్పగించారు. కొంతకాలానికి ఆధ్యాత్మికపరురాలైన మేనత్త యోగసేవ నిమిత్తం నలభై ఎకరాలను డాక్టర్‍ నాగేంద్రకు అప్పగించారు. దీంతో బెంగళూరు శివార్లలోని ఆ స్థలంలో నాగేంద్ర.. వివేకానంద అనుసంధాన సమితిని ప్రారంభించారు. ఈ యోగ సమితి పాఠ్య ప్రణాళికను రూపొందించింది కూడా డాక్టర్‍ నాగేంద్రే. ప్రస్తుతం ఈయన ఈ విశ్వవిద్యాలయం కులపతి (చాన్స్లర్‍) హోదాలో ఉన్నారు. యోగా ద్వారా సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకు 2016లో పద్మశ్రీ పురస్కారాన్ని అందించి సత్కరించింది.
ఇంతకీ ఈ ప్రయత్నంలో, ఈ మజిలీలో ఆయనకు మరో ముగ్గురు తోడయ్యారు. యోగా వర్సిటీ వెనుక వీరిదీ కీలకపాత్ర.
అందులో ఒకరు డాక్టర్‍ నాగరత్న. ఈమె డాక్టర్‍ నాగేంద్రకు స్వయానా సోదరి. విశ్వవిద్యాలయ స్థాపనలో ఈమె కీలకపాత్ర పోషించారు. ఈమె విశ్వవిద్యాలయంలోని ‘యోగా అండ్‍ లైఫ్‍ సైన్సెస్‍ విభాగాధిపతిగా ఉన్నారు.
మూడో వ్యక్తి.. ప్రొఫెసర్‍ రఘురాం. ఈయనది తెలంగాణలోని ఖమ్మం జిల్లా. డాక్టర్‍ నాగేందర్‍కు స్వయానా బావమరిది. ఈయన భోపాల్‍లోని రీజనల్‍ ఇంజనీరింగ్‍ కాలేజీ నుంచి పట్టా పుచ్చుకున్నారు.
నాలుగో వ్యక్తి.. డాక్టర్‍ కె.సుబ్రహ్మణ్యం. ఈయనది ఆంధప్రదేశ్‍. వివేకానంద రచనలతో ప్రభావితులైన ఈయన యోగా విశ్వవిద్యాలయ అభివృద్ధికి సలహాదారు హోదాలో కొనసాగుతున్నారు. ఈయన పుణెలోని నేషనల్‍ డిఫెన్స్ అకాడమీ మాజీ ప్రిన్సిపాల్‍.
1972లో ప్రారంభం..
వివేకానంద యోగ అనుసంధాన సంస్థ (యోగా విశ్వవిద్యాలయం) 1972లో ప్రారంభమైంది.

యోగా పట్ల జనం ఆకర్షితులు కావడం, సాధకుల సంఖ్య పెరగడం, దాతలు ముందుకు రావడంతో సంస్థ ప్రాంగణం 40 ఎకరాల నుంచి నూటపది ఎకరాలకు పెరిగింది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం యోగా ప్రాధాన్యాన్ని గుర్తెరిగి మరింతగా ప్రోత్సహించడంతో ఈ విశ్వవిద్యాలయం మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. యోగా, జీవనశైలులపై లోతైన పరిశోధనలు చేయడానికి వీలుగా అవసరమైన నిధులు మంజూరు చేసింది. 2002 నాటికి ఈ సంస్థ డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యోగా గురించి ప్రచారం చేయడంలో విశ్వవిద్యాలయం తనవంతు కృషి చేస్తోంది. అమెరికా, చైనా, జపాన్‍తో పాటు పలు దేశాల్లో ఇరవై యోగా కేంద్రాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఇక, కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా యోగాను తప్పనిసరి పాఠ్యాంశంగా ప్రవేశపెట్టేందుకు, స్పోర్టస్ మెడిసిన్‍ అండ్‍ రిహాబిలిటేషన్‍ విభాగాన్ని ప్రారంభించేందుకు ఈ వర్సిటీ ప్రయత్నాలు చేస్తోంది. ఇక, వర్సిటీ తరపున ‘యోగసుధ’ అనే ఆంగ్ల మాస పత్రికను నడుపుతున్నారు. అలాగే, ‘ఐ జాయ్‍’ అనే ఆన్‍లైన్‍ యోగా జర్నల్‍నూ నిర్వహిస్తోంది. ఇక, దేశంలోని యోగా సంస్థలన్నింటినీ ఇండియన్‍ యోగా అసోసియేషన్‍ పేరుతో ఒకచోటికి చేర్చి ‘యోగవాణి’ అనే మాసపత్రికను కూడా ఈ సంస్థ నడుపుతోంది. యోగా వర్సిటీ ఆవరణలో సరస్వతీ గ్రంథాలయం ఉంది. ఇక్కడ ఎంతో యోగ విజ్ఞానం అందుబాటులో ఉంది.
బాధ, దు:ఖం ఒకటి కాదు..
ఇక్కడ చాలా సూక్ష్మమైన విషయాలను చాలా చక్కగా, అర్థమయ్యేలా బోధిస్తారు. చాలామంది బాధ, దు:ఖం ఒకటేనని అనుకుంటారు. కానీ, బాధ వేరు. దు:ఖం వేరు. బాధ శారీరకమైనదైతే, దు:ఖం మానసికమైనది. యోగా వర్సిటీలో అందరికీ నేర్పే తొలి పాఠం ఇదే. ఇలాంటివే రోజూ నేర్పుతుంటారు. అదో నిరంతర అభ్యాసం. ఈ అభ్యాసం ద్వారా లభించే అవగాహనతో ఎంతటి అనారోగ్యాన్ని అయినా తట్టుకోగలిగే శక్తి లభిస్తుంది. మరణమంటే భయం పోతుంది. అద్భుతమైన మనశ్శాంతి లభిస్తుంది. పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు ఎవరు, ఏవిధమైన ఆరోగ్య సమస్య ఎదుర్కొంటున్నా.. ఇక్కడకు వచ్చి పది పదిహేను రోజులుంటే చాలు జీవితాన్ని చూసే కోణమే మారిపోతుంది. నేడు జీవనశైలి వ్యాధులుగా పరిణమించిన ఒత్తిడి, మధుమేహం, ఊబకాయం, రక్తపోటు వంటి అనేకానేక సమస్యలకు ఇక్కడ యోగా ద్వారా పరిష్కారాన్ని చూపుతున్నారు. ఒత్తిడికి లోనయ్యే వారి కోసం సెల్ఫ్ మేనేజ్‍మెంట్‍ ఆఫ్‍ ఎక్సెసివ్‍ టెన్షన్‍ పేరుతో శిక్షణ శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఆరోగ్యధామానికి అనుబంధంగా ఆసుపత్రి ఉంది. క్యాన్సర్‍ బాధితుల కోసం ‘అమృతం’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని నిర్వహిస్తున్నారు. ‘సైన్స్ వితిన్‍ యోగా’ అనేది ఈ సంస్థ నినాదం. ఈ వర్సిటీకి అనుబంధంగా నడుపుతున్న 600 పడకల యోగా థెరపీ ఆసుపత్రిని కేంద్రం సెంటర్‍ ఆఫ్‍ అడ్వాన్స్ రిసెర్చ్ ఇన్‍ యోగా అండ్‍ న్యూరోఫిజియాలజీగా గుర్తించడం విశేషం.
పరిశోధనలు.. నిరంతరం..
ఆధునిక జీవితం మన ముందు వదులుతున్న సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. అటువంటి పరిస్థితుల్లో పుట్టుకొస్తున్న వ్యాధులకూ, ఆరోగ్య సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారాన్ని కనుగొనేందుకు ఈ సంస్థ నిరంతరం పరిశోధనలు సాగిస్తోంది. యోగా లోతుపాతుల్ని శోధించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యలకు, సవాళ్లకూ యోగాను ఒక పరిష్కార మార్గంగా ఎలా మలుచుకోవచ్చనేది శాస్త్రీయంగా నిరూపించే ప్రయత్నం ఇక్కడ జరుగుతోంది. ఇప్పటిదాకా ఈ సంస్థ ఏడు వందలకుపైగా పరిశోధనా పత్రాలను సమర్పించింది. 2013 నుంచి మూడేళ్ల క్రితం వరకు యోగాకు సంబంధించిన వివిధ అంశాలపై పన్నెండు పరిశోధనలను పూర్తిచేసింది. ప్రస్తుతం అంతే సంఖ్యలో మరికొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్‍ కాలిఫోర్నియాతో పాటు మరికొన్ని భారతీయ పరిశోధన, విద్యాసంస్థలు యోగా వర్సిటీతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
అంతా ఆశ్రమ పద్ధతిలోనే..
యోగా విశ్వవిద్యాలయం ప్రాచీన కాలం నాటి గురుకులాన్ని తలపిస్తుంది. గురువు ఒక ఉన్నత పీఠంపై కూర్చుంటారు. శిష్యులు పద్మాసీనులై శ్రద్ధగా పాఠాలు వింటారు. చెట్ల కిందే పాఠాలు.. అక్కడే పవర్‍ పాయింట్‍ ప్రజంటేషన్లు.. తాళపత్రాలు.. లాప్‍టాప్‍లు.. అంతా పాత-కొత్త మేలు కలయికగా అక్కడి వాతావరణం కనిపిస్తుంది. ఈ యోగా వర్సిటీ ఆధ్వర్యంలో యోగ ఉపాధ్యాయ శిక్షణ కోర్సు కూడా నిర్వహిస్తున్నారు. ఇది నెల రోజుల వ్యవధి కోర్సు. అలాగే, యోగాలో బ్యాచిలర్‍ డిగ్రీ, పీజీ డిప్లొమా, మాస్టర్స్ కోర్సులతో పాటు దూరవిద్య, ఆన్‍లైన్‍ కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. ఇందులో మాస్టర్స్ కోర్సుకు యూజీసీ అనుమతి కూడా ఉంది. వర్సిటీ ఆవరణలో యోగా, ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం, నర్సింగ్‍ కళాశాలలున్నాయి. రెండు వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థుల దినచర్య అయితే తెల్లవారుజామున నాలుగున్నర నుంచే మొదలవుతుంది.
ఇక్కడ నేర్పే పాఠాలు జీవితంలో క్రమశిక్షణగా మెలగడం, చక్కగా నెగ్గుకురావడం ఎలాగో నేర్పుతాయి.
ఎలా వెళ్లాలి? ఎలా చేరాలి?
ఈ యెగా విశ్వవిద్యాలయం బెంగళూరు నగరానికి 32 కి.మీ. దూరంలో ఉంది. అనారోగ్యంతో ఉన్న వారే కాదు.. ఆరోగ్యంగా ఉన్న వారూ ఇక్కడ చేరవచ్చు. యోగ చికిత్సకు మొదట పేరు నమోదు చేయించుకోవాలి. ప్రతి మంగళవారం కొత్త వారిని చేర్చుకుంటారు. ప్రతి సోమవారం డిశ్చార్జి చేస్తారు. అన్ని రోజుల్లోనూ సాధారణ సందర్శకులను అనుమతిస్తారు. ఇక, వసతి గురించి అసలు చింతే లేదు. ఇక్కడ డార్మెటరీ, సింగిల్‍, డబుల్‍ రూమ్స్, ఏసీ, కాటేజీ, సూట్‍ వంటి విభాగాలున్నాయి. మనం కోరుకునే సౌకర్యాన్ని బట్టి, అక్కడ ఉండే సమయాన్ని బట్టి ధరలు ఉంటాయి.
ఇక ఇక్కడ భోజనంగా శాకాహారాన్ని, సాత్వికాహారాన్ని మాత్రమే అందిస్తారు. నిర్ణీత సమయంలో మాత్రమే మొబైల్‍ ఫోన్లను అనుమతిస్తారు. సిగరెట్లు, మద్యం, మాంసాహారం వంటివి ఆవరణలో నిషిద్ధం.

Review అందరూ బాగుండాలి యోగా వర్థిల్లాలి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top