అచ్చ తెలుగు ముద్ర కూచిపూడి

అద్భుత ఆహార్యం, విశిష్ట వాచికాభినయం కూచిపూడి సొంతం. కృష్ణా తీరంలో ప్రభవించి, అచ్చ తెలుగు సంప్రదాయంలో వికసించి, ఖండఖండాంతరాల్లో జయకేతనం ఎగురవేసిన ఘనచరిత్ర కూచిపూడి నృత్యానిది. ఆనాటి సిద్ధేంద్రుడి నుంచి నిన్నటి వెంపటి చిన సత్యం వరకు ఎందరో మహానుభావుల కేళికా విన్యాసాలతో పరిపుష్టమై భారతీయ శాస్త్రీయ నృత్యాలకే తలమానికమై దేశవిదేశాల్లో అసంఖ్యాక అభిమానుల ఆదరణ అందుకుంటున్న అచ్చ తెలుగు కళా రూపమిది. తెలుగు.. కూచిపూడి.. ఈ రెండింటిదీ అవినాభావ సంబంధం. ఆరు వందల సంవత్సరాల క్రితం సిద్ధేంద్రుడు సృజించిన ‘భామాకలాపం’లో భాష, భావం జోడు గుర్రాలై కదం తొక్కుతాయి. ‘భామనే.. సత్యభామనే’ అంటూ తన గురించి చెప్పుకునే సిద్ధేంద్రుడి సత్యభామ.. ‘ఇంతినే చామంతినే మరుదంతినే విరిబంతినే’ అంటూ హ•యలుపోతుంది. పదహారు వేల మంది కోమలులందరిలోనూ తానే భామనని సగర్వంగా ప్రకటించుకుంటుంది. అభినయానికి, నర్తనానికి వందశాతం అవకాశం కల్పించే అక్షరాల సమ్మేళనం.. భామాకలాపం. ఇదొక్కటే కాదు, కూచిపూడి కళాకారులు అభినయించే నాట్యరూపాల్లో అత్యధికం అచ్చ తెలుగుకు పట్టం కట్టినవే. ఇక, ఈ కళ పూర్వాపరాల్లోకి వెళ్తే..
ఆనాడు శిస్తుల వసూలు పేరిట రాయలసీమలోని సిద్దవటం గ్రామంలో కరువు బారినపడిన కుటుంబాల్లోని స్త్రీలపై రాజ ప్రతినిధి సమ్మెట గురవరాజు క్రూరమైన అత్యాచారాలు చేసేవాడు. కేళిక రూపంలో శ్రీకృష్ణదేవరాయల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి, అకృత్యాలకు అడ్డుకట్ట వేయించారు నాటి కూచిపూడి భాగవతులు. ఆనాటి నుంచి నేటి వరకు ఎన్నో సామాజిక సమస్యలపై పదం కలుపుతూ కదం తొక్కుతూ కూచిపూడి పురోగమిస్తూనే ఉంది. విశ్వకవి రవీంద్రుని ‘చండాలిక’ను అభినయించి అంటరానితనంపై విల్లు ఎక్కుపెట్టింది. భ్రూణహత్యలపై ‘నాతిచర’, స్త్రీల సమస్యలకు అద్దం పట్టే ‘విజయోస్తుతే నారీ’, అన్నదాతల ఆక్రందనల నేపథ్యంలోని ‘రైతేరాజు’, జాతి సమగ్రతను చూపే ‘సమైక్యతా భారతి’, శాంతిని ఆకాంక్షించే ‘అహింసా పరమోధర్మ’, మహనీయుల జీవితాల్ని ప్రతిబింబించే ‘వివేకానంద’.. కూచిపూడి శైలికి నిలువెత్తు నిదర్శనాలు. చేతివేళ్ల కదలికలతో అద్భుత విన్యాసాలు..
కూచిపూడి కళాకారుల నయనాలు అభినయాన్ని పలికిస్తే, కరచరణాల విన్యాసాలు భావ ప్రకటనలను వ్యక్తం చేస్తాయి. సాధారణ భావాల నుంచి నెమలి నాట్యం, పూల మకరందాన్ని గ్రోలే భ్రమర విన్యాసం, కడలి కెరటాల పదనిసలు, మలయ మారుతం, మేఘాల షికారు, వానజోరు, పిడుగుల హ•రు, మగువ సౌందర్యం, సౌకుమార్యం వంటి అనేకానేక అపురూప దృశ్యాలను కేవలం చేతివేళ్లను కదిలిస్తూ, శిల్ప సదృశ్యమైన భంగిమలతో కళ్లకు కట్టడమే కూచిపూడి ప్రత్యేకత. కూచిపూడి హస్తముద్రలు అపూర్వం. ప్రకృతి నుంచి, సామాజిక నేపథ్యం నుంచి, నిత్య జీవితం నుంచి గ్రహించిన అనేక భావాలను అతి సుకుమారంగా వ్యక్తం చేస్తాయి. ఒక్క చేతితో అభినయించే 28 అసంయుక్త హస్తముద్రలు, రెండు చేతులతో చేసే 13 సంయుక్త హస్తముద్రలు కూచిపూడి సొంతం. నిజానికి భరతుడి నాట్యశాస్త్రంలోని 67 హస్తముద్రలనూ కూచిపూడి అభినయించగలదు. అలాగే చతుర్విధ పక్రియల్ని, రీతుల్ని పూర్తిగా అన్వయించుకున్న ఏకైక నృత్యమిది. కళకైనా, కళాకారులకైనా జనాధరణ ఆయువుపట్టు వంటిదైతే, ప్రభుత్వ చేయూత సంజీవనిలాంటిది. దేశాంతరాల్లో తెలుగువారి ఖ్యాతిని ఇనుమడింపజేస్తూ, అనితరసాధ్యమైన సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్న కూచిపూడికి ప్రభుత్వ ఆదరణ ఇంకా పెరగాలి. నాట్యాన్నే తపస్సుగా భావించి సాధన చేస్తూ, చేయిస్తూ భావితరాలకు దాన్ని దగ్గర చేస్తున్న కళాకారులకూ చేయూతనందించాలి.•
కూచిపూడి నేపథ్యమిది…
అంకురారోహణ: 600 ఏళ్ల క్రితం..
ఆవిర్భావం: కూచిపూడి, కృష్ణా జిల్లా
ఆద్యుడు: సిద్ధేంద్ర యోగి
ఆలంబన: భరతుని నాట్యశాస్త్రం
అంకాలు: వీధి నాటకాలు, యక్షగానాలు, కలాపాలు
ఆకర్షణ: ఆంగికం, ఆహార్యం, వాచికం, సాత్వికాల అభినయ విన్యాసం
అపూర్వం: మూడుసార్లు అంతర్జాతీయ సమ్మేళనాలను నిర్వహించుకోగలగడం
అజరామరాలు: హరిశ్చంద్ర, భక్తప్రహ్లాద, ఉషాపరిణయం, విప్రనారాయణ, శ్రీనివాస కల్యాణం, నర్తనశాల, చండాలిక తదితర నృత్య ప్రదర్శనలు
అగ్రగణ్యులు: వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, వెంపటి వెంకట నారాయణ, చింతా వెంకటరామయ్య, తాడేపల్లి పేరయ్య, మాధవయ్య హరి, వేదాంతం రాఘవయ్య, భాగవతుల రామలింగశాస్త్రి, వేదాంతం వేంకటాచలపతి శాస్త్రి, వెంపటి పెద సత్యం, పసుమర్తి కృష్ణమూర్తి, వెంపటి చినసత్యం, మహంకాళి సత్యనారాయణ శర్మ తదితరులు
కూచిపూడి సిగలో కలికితురాయి…
1502: కూచిపూడి భాగవతుల తొలి ప్రదర్శన
1678: కూచిపూడి బ్రాహ్మణులకు అగ్రహారాన్ని బహూకరించిన తానీషా
1952: వేదాంతం పార్వతీశం కృషితో సిద్ధేంద్ర కళాక్షేత్ర స్థాపన
1953: ‘క్షీరసాగర మథనం’ నృత్య నాటకం ద్వారా అంతర్జాతీయ ఖ్యాతి
1954: వేదాంతం పార్వతీశం కూచిపూడి పతాకావిష్కరణ
1960: కూచిపూడి సశాస్త్రీయ అని నిరూపణ
1986: కూచిపూడిపై డాక్టర్‍ చింతా రామనాథం మొదటి పరిశోధన
2002: కూచిపూడి నాటక వికాసంపై డాక్టర్‍ వేదాంతం రామలింగశాస్త్రి సమగ్ర పరిశోధ
చరిత్ర సృష్టించిన కూచిపూడి నృత్యం
తెలుగువారి న•త్యం, ప్రపంచ ప్రఖ్యాతగాంచిన నృత్యం కూచిపూడికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రతి తెలుగువాడు సగర్వంగా చెప్పుకునే కూచిపుడి నృత్యానికి గిన్నీస్‍ బుక్‍ రికార్డు దక్కింది.
ప్రపంచంలోని అన్ని కళలలో అగ్రగామిగా నిలిచిన కూచిపూడి నాట్య ప్రదర్శణ ఆంధప్రదేశ్‍లో అత్యంత వైభవంగా జరిగింది. లయబద్ధమైన సంగీతం మధ్య గురువులు, కళాకారులు కలిసి నిర్వహించిన న•త్య ప్రదర్శన అబ్బురపరిచింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‍ స్టేడియం మైదానంలో సిలికానాంధ్ర, భాషా సాంస్క•తిక శాఖ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం గిన్నీస్‍ బుక్‍ ఆఫ్‍ రికార్డు ఎక్కింది. కూచిపూడి నృత్యకళకు 6వేల 117 మంది న్యాట్యమణులు జీవం పోసి గిన్నీస్‍ రికార్డు సాధించారు. ఏకంగా వేల మంది ఒకే సారి కూచిపూడి న్యాట్యాన్ని ప్రదర్శించి గిన్నీస్‍ బుక్‍లో చోటు సంపాదించారు. వీరి
న•త్యాభినయం సందర్శకులను చూపుతిప్పుకోకుండా చేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‍ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం ముగింపు ఉత్సవాల్లో ఈ అరుదైన రికార్డు నమోదైంది.
6వేల 117 మంది కళాకారిణులు..
కూచిపూడి నృత్యంలో మన తెలుగు నాట్యకళాకారులు తమ ప్రతిభను చాటారు. విజయవాడలోని ఇందిరా ఇందిరాగాంధీ మున్సిపల్‍ స్టేడియం మైదానంలో సిలికానాంధ్ర, భాషా సాంస్క •తిక శాఖ సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం జరిగింది. మొత్తం 6వేల 117 మంది నృత్య కాళాకారిణుల మహా బృందం ఒకేసారి కూచిపూడి నాట్యం ప్రదర్శించి గిన్నీస్‍ రికార్డు సృష్టించింది. మైదానంలో కళాకారిణుల నృత్య ప్రదర్శన ఆధ్యంతం అందరినీ ఆకట్టుకుంది. మరోవైపు ఈ నాట్య సమ్మేళనానికి 18 దేశాలకు చెందిన కళాకారులు హాజరయ్యారు. ఈ మహాబృంద న•త్య రూపకం కళాప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనను తిలకించిన సందర్శకుల కరతాళ ధ్వనులతో స్టేడియం మారుమోగిపోయింది.

Review అచ్చ తెలుగు ముద్ర కూచిపూడి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top