అమ్మ బాషాకు వందనం

అ- అమ్మ, ఆ- ఆవు అని చదవడమే చిన్నతనమని భావించే రోజులొచ్చేశాయి. ‘మాతృభాష సరిగ్గా నేర్వని వారికి ఇతర భాషలు లొంగవు’ అని జార్జి బెర్నార్డ్ షా చద్దన్నంలాంటి మాట చెప్పాడు. కానీ, మన తరమంతా పరభాషా ఫాస్ట్ఫుడ్‍కు అలవాటు పడిపోతోంది. తెలుగు మాట్లాడటమే నామోషీ.. ఆంగ్లం ఫస్ట్ లాంగ్వేజ్‍ అని చెప్పుకోవడానికి గర్వకారణం.. అనే భావన పెరిగి పెద్దదవుతోంది. ‘అమ్మ భాష మకరందం’ అంటారే కానీ, జుర్రుకునే వారే కరువైపోతున్నారు. ఈ ఏడాది పదవ తరగతి పరీక్ష ఫలితాలను పరిశీలిస్తే సగానికి సగం మంది తెలుగులోనే తప్పారనేది ఓ తాజా అధ్యయనం సారాంశం. తెలుగు గడ్డపై పుట్టి, ఈ నేలపై పెరిగి, ఇంటా బయటా తెలుగు మాట్లాడుతూ.. తెలుగు పరీక్షలోనే తప్పడం అంటే.. మాతృభాష పునాదులు బీటలు వారుతున్నాయని అర్థం. వారసత్వ సంపదైన భాషను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. కానీ, ప్రభుత్వాలు ఆ బాధ్యత నుంచి తప్పుకుంటున్నాయి. ప్రాథమిక స్థాయి నుంచి అన్ని పాఠశాలల్లో తెలుగు మాధ్యమంలోనే బోధన సాగేలా చేయడం కూడా మనకు చేతకాకపోతోంది. పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక మాతృభాషకు పట్టం కడుతోంటే మనం మాత్రం మనకు మన భాషకు మధ్య అడ్డుగోడ కట్టుకుంటున్నాం. వాడుక తెలుగు భాషకు గొడుగు వంటి వారు గిడుగు రామ్మూర్తి పంతులు. ఆయన వ్యవహారిక భాషా ఉద్యమకర్త. ఆయనకు గుర్తుగానే ప్రతి ఏటా ఆగస్టు 29, తెలుగు భాష దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. అయితే, అవిభాజ్య ఆంధప్రదేశ్‍ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటి నుంచి ఆగస్టు 29ని ఆంధప్రదేశ్‍లో గిడుగు రామ్మూర్తి స్మారకంగా నిర్వహించుకుంటుంటే, తెలంగాణలో ఇదే రోజును ప్రజాకవి కాళోజీ నారాయణరావును స్మరించుకుంటూ తెలుగుతల్లికి మల్లెపూదండ వేస్తున్నారు. తెలుగు భాష దినోత్సవ వేళ మన తెలుగు తీరుతెన్నులెలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దామా.

పరభాషను గౌరవించు..
కానీ, నువ్వేమిటో ప్రపంచానికి మాతృభాషలో చాటిచెప్పు..
ఇది నినాదంగానే మిగిలింది. పైగా దీనిని వ్యతిరేక దిశలో అందరూ అనుసరిస్తున్నారు. అంటే, మన తెలుగు వారు నేడు ‘మాతృభాషను శుభ్రంగా పుస్తకాల్లో దాచేస్తున్నారు. పరభాషలో తామేమిటో ప్రపంచానికి నిరూపించుకుంటు న్నారు.
ఓ సినీ కవి కలం నుంచి జాలువారినట్టు.. ‘తెలుగు భాష తీయదనం, తెలుగు భాష గొప్పతనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక తీయదనం..’
ఒక్కో పలుకులో ఎంత మాధుర్యం..
‘అమ్మా..’ అనే పలుకులో ఎంత ప్రేమ దాగుంది?
కానీ, ‘మమ్మీ’ మాటున మన తేనెలొలుకు తెలుగు కొవ్వొత్తిలా కరిగిపోతోంది.
తెలుగు భాష గొప్పదనం ఈనాటిది కాదు. ప్రపంచ దేశాలలో మన తెలుగు గొప్పదనాన్ని ఎందరెందరో ఎన్నో విధాలుగా చాటారు. అయితే ఇంతటి ఘనకీర్తి కలిగిన తెలుగు వేగంగా అంత రించిపోతున్న భాషల జాబితాలో ఉండటానికి మన స్వయంకృతాపరాధమే కారణం.
కేంద్ర ప్రభుత్వం సంగతెలా ఉన్నా మన రెండు తెలుగు రాష్ట్రాలు వెంటనే మేల్కోకుంటే మాత్రం తెలుగు భాష ముప్పులో పడినట్టే.
తెలుగుకు ఎందుకింత దుస్థితి, దుర్గతి?
కారణాలు విశ్లేషించుకుంటే చాలా ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో, మాధ్యమంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. అయితే, వాడుకలోకి అవన్నీ రావడం లేదు. దీంతో మాటల పొందిక కరువైపోతోంది. తెలుగు పాటల అల్లిక మరుగై పోతోంది. తెలుగు మాట్లాడే వారు అంతకంతకూ నల్లపూసలైపోతున్నారు. ఆధునిక జీవనశైలి పేరుతో, పోటీతత్వాన్ని ఎదుర్కొనే పేరుతో పరభాష వ్యామోహంలో పడి తెలుగు భాష స్వరూప స్వభావాలను, రూపురేఖలను మార్చేస్తు న్నారు. నేడు జనం మాట్లాడే మాతృభాషలో వర్ణ, పద, వాక్య స్థాయిలలో పరభాషా పదాలే తిష్ట వేసుకుని కూర్చున్నాయి. కేవలం వ్యాకరణం మాత్రమే తెలుగులో ఉంది. అది తప్ప మిగతా దంతా పరభాషలోనే కొనసాగుతోంది.
కారణాలు సవాలక్ష..
తమిళనాడు, కర్ణాటక వాసుల మాదిరిగా తెలుగు వారికి మాతృభాషాభిమానం తక్కువ. ఇద్దరు తెలుగు వారు కలిసినా ఆంగ్లంలోనే మాట్లాడుకోవడాన్ని నాగరికతగా భావిస్తున్నారు. అలాగే, పాఠ్యాంశాలలో తెలుగు ఔన్నత్యాన్ని చాటే స్థాయిలో తెలుగు లేదు. లేక దాని స్థాయిని దిగ జార్చి ఉంచడం వల్ల దానిపై విద్యార్థులకు ఆసక్తి కలగడం లేదు. ముఖ్యంగా ప్రాథమిక విద్య స్థాయిలో భాషోపాధ్యాయులు తగినంత మంది లేరు. దీంతో పిల్లలు ప్రాథమిక దశలోనే మాతృ భాషకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. తెలుగు పదాలు అనేకం ఉన్నా.. పరభాషా పదా లను విచ్చలవిడిగా వాడే సంస్క•తి పెరుగుతోంది. నేడు తెలుగు పత్రికలుగా చెప్పుకుంటున్న చాలా దినపత్రికలు పరభాషా పదాలకు ప్రత్యామ్నాయ తెలుగు పదాలను సృష్టించడం మాని యథేచ్ఛగా ఇతర భాష పదాలను వాడేస్తున్నాయి. దీంతో అవే అలవోకగా వాడుకలోకి వచ్చేస్తున్నాయి. కొత్త పద నిర్మాణం ఎప్పటికప్పుడు జరుగుతుంటే కనుక తెలుగు పటిష్టమయ్యేది. కానీ, అటువంటి ప్రయత్నాలేవీ జరగక మొత్తానికి మనుగడే ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ స్థాయిలో అమలు చేస్తున్న పథకాల పేర్లు, జీఓలు అన్నీ ఆంగ్లంలోనే కొనసాగుతున్నాయి. న్యాయస్థానాల్లో తీర్పులూ ఆంగ్లంలోనే వెలువడుతున్నాయి. ప్రభుత్వ జీఓలు నేరుగా ప్రజలతో సంబంధం కలవి. అవి మాతృభాషలో ఉంటే మరింతగా ప్రజలు వాటితో మమేకం అవుతారు. ఇక, దేవాలయాల్లోనూ తెలుగుకు కనీస మర్యాద దక్కడం లేదు. ‘వీఐపీ దర్శనం’, ‘విజిటింగ్‍ అవర్స్’ అంటూ ఊదరగొడుతున్నారు. దేవుని సన్నిధిలోనే మన మాతృభాషకు తగిన గౌరవం దక్కడం లేదు.. ఇక జన సామాన్యం ఏం పట్టించుకుంటారు?
పట్టించుకునే వారేరి?
నందమూరి తారక రామారావు (ఆంధప్రదేశ్‍ మాజీ ముఖ్యమంత్రి), పాములపర్తి వెంకట నరసింహారావు (దేశ మాజీ ప్రధాని) వంటి వారు తప్ప తెలుగు భాషను ప్రోత్సహించడానికి మరే నాయకుడూ ఆ స్థాయిలో కృషి చేసిన దాఖలాలు లేవనే చెప్పాలి. ఆంధప్రదేశ్‍ రెండుగా విడిపోయే నాటికే తెలుగు నాట తెలుగు భాష ప్రాభవం కొడిగట్టడం మొదలైంది. విభజనానంతరం కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాతృభాష పరిరక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదనేది నిర్విదాంశం. తెలుగు భాష దినోత్సవాల సందర్భంగా ఇస్తున్న, ఇచ్చిన హామీలన్నీ నీటి మీద రాతలే అయ్యాయి, అవుతున్నాయి.
రెండు వేల ఏళ్ల చరిత్ర..
తెలుగు భాషకు రెండు వేల సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. క్రీస్తుకు పూర్వమే తెలుగు ప్రజల వ్యవహార భాషగా ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు శకం ఐదవ శతాబ్దంలోని గద్య శాసనాలు, క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దం నుంచి కనిపిస్తున్న పద్య శాసనాలు తెలుగు భాష క్రమ పరిణామాన్ని చాటుతున్నాయి. దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రాచీనాంధ్ర కవులు (శ్రీనాథుడు, శ్రీకృష్ణ దేవరాయలు) సగర్వంగా ప్రకటించారు.
ఆంధ్రత్వం ఆంధ్రభాషాచనాల్పస్య తపసః ఫలమ్‍ అని నానుడి. ఈ కోవలో ఆంధ్రుడిగా పుట్టడమే అదృష్టంగా భావించారు లాక్షణికుడైన అప్పయ దీక్షితులు. ఈస్టిండియా కంపెనీ యుగంలో మన దేశానికి వచ్చిన ఆంగ్లేయులు సైతం అనంతమైన మన భాషా మాధుర్యానికి ముగ్ధులై ఇటాలియన్‍ ఆఫ్‍ ది ఈస్ట్గా అభి వర్ణించారు. సీసీ బ్రౌన్‍ అయితే ఏకంగా తెలుగు వాడేనన్నంతగా మన మాతృభాషతో మమేకం అయిపోయాడు. తెలుగు భాషపై అమితమైన అభిమానంతో బ్రౌన్‍ ముత్యాల కోవ వంటి తెలుగు అక్షరాల ముద్రణకు శ్రీకారం చుట్టారు. 19వ శతాబ్దంలో ప్రారంభమైన ఆధునిక వాజ్మయం వివిధ పక్రియ రూపాలలో సుసంపన్నమై విల సిల్లుతూ ప్రపంచ భాషా సాహిత్యాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. జనాభా దృష్ట్యా మన దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య మిగతా భాషల వారి కన్నా ఎక్కువ. అంతేకాదు, ఇతర రాష్ట్రాలలోని అల్ప సంఖ్యాక వర్గాల జనసంఖ్యలో కూడా తెలుగు భాషీయులదే పైచేయి. కానీ విషాదం ఏమిటంటే- ఈనాడు అత్యధిక తెలుగు వారు.. అత్యల్పంగా తెలుగు మాత్రమే మాట్లాడే వారుగా నిలుస్తుండటం. అయితే, గత చరిత్రను తవ్వుకుని సంఖ్యా ఆధిక్యాన్ని చాటుకుంటూ కాలం వెళ్లదీస్తున్నామే తప్ప నేటి సమాజంలో తెలుగు భాష స్థితిగతులను పట్టించుకునే ఓపిక, తీరిక ఎవరికీ లేకుండాపోతున్నాయి. ఫలితంగా నేటి సమాజంలో మన తెలుగు భాష ఉనికిని తలుచుకుని కుమిలిపోతూ తలలు దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
1956 నుంచి కొన‘సా..గు’తున్న ప్రయత్నాలు..
భాషా రాష్ట్ర ప్రాతిపదికపై 1956 నవం బరులో సువిశాలమైన ఆంధప్రదేశ్‍ అవతరించిన నాటి నుంచి తెలుగును అధికార భాషగా రూపొందించే ప్రయత్నాలు కొనసాగినా.. అవి నేటి వరకు సాఫల్యం కాలేదు. 1955లో అయ్యదేవర కాళేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ ఈ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. పది సంవ త్సరాల తరువాత 1966 మే 14వ తేదీన తెలు గును అధికార భాషగా పరిగణిస్తూ ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసింది. దీనిని అమలు చేయడానికి తెలుగులో శాస్త్ర గ్రంథాలు, పారిభాషిక పదజాలం అవసరం అయ్యాయి. వీటిని రూపొందించడానికి 1968లో తెలుగు అకాడమీని ప్రత్యేకంగా నెల కొల్పారు. శాస్త్ర గ్రంథాల అనువాదాలు మొదలైన కార్యక్రమాలు జోరుగా ప్రారంభమయ్యాయి. మరోవైపు ఆంధప్రదేశ్‍ సాహిత్య అకాడమీ ఆధ్వ ర్యంలో మాండలిక వృత్తిపద కోశాలు రూపొం దాయి.
అధికార భాషా సంఘం ఏర్పాటు
అధికార భాషను పటిష్టంగా అమలు చేయ డానికి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం 1971లో అధికార భాషా సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. తెలు గును అధికార భాషగా చేయడంలో సాధించిన ప్రగతిని సమీక్షించడం, ప్రభుత్వానికి భాష స్థితిగతులపై నివేదికలు సమర్పించడం, అధికార భాష స్థాయిని కలిగించడానికి అనువైన పరిభాష రూపకల్పనకు కృషి చేయడం భాష సంఘం పరిధిలోని కార్యక్రమాలు. ఈ సంఘం కృషి ఫలితంగా 1971 తరువాత జిల్లా స్థాయిలోనూ పరిపాలనా వ్యవహారాలు తెలుగులోనే కొన సాగాలన్న ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ, ఎన్ని సంఘాలు ఏర్పడినా, కమిటీలు ఎన్ని నివే దికలు ఇచ్చినా తెలుగు పరిపాలన భాషగా ఎదగ లేదు. దానికి కారణం ప్రభుత్వాలకు చిత్తశుద్ధి కొరవడటమే. పట్టుదల, చిత్తశుద్ధి లోపించిన నాడు ఎన్ని శాసనాలు చేసినా నిష్ప్రయోజనమే అతాయి. శాస్త్ర గ్రంథ నిర్మాణానికి కావలసిన పారిభాష పదజాలం ఏర్పడలేదని, ప్రామాణిక భాష రూపకల్పన జరగలేదని మీనమేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే సంవత్సరాలు గడిచినా ఉన్న చోటే ఉండిపోతాం తప్ప అడుగైనా ముందుకు వేయలేం అనడానికి మన తెలుగు కోసం మనం చేస్తున్న మన ఉదాసీన ప్రయత్నాలే నిదర్శనం.
ఎంత చేసినా.. అంతే!
ప్రజల వ్యవహారమే ఏ భాషకైనా ప్రమాణం. పరిపాలన యంత్రాంగం నిర్వహించే అన్ని వ్యవ హారాల్లోనూ తెలుగు వాడుకను నిర్బంధంగా అమలు చేసిన నాడు ప్రామాణిక భాషగా తనంతట తానే మన తెలుగు రూపుదిద్దు కుంటుంది. సాంకేతిక పదాలను తెలుగులోకి అనువదించేటప్పుడు సమస్యలు ఉత్పన్నమైతే పర భాషా పదాలను స్వీకరించడానికి సంకోచించ కూడదు. తెలుగు భాషలో అన్య దేశాల చేరిక ప్రాచీన కాలం నుంచి వస్తూనే ఉంది.
ఇక, నాటి సమైక్య ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం తెలుగు ఉద్ధరణకు ఎంత చేసినా.. పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. 1969 నుంచి ఇంటర్మీడియట్‍ స్థాయి లోనూ, 1971 నుంచి డిగ్రీ స్థాయిలోనూ, 1985 నుంచి పీజీ స్థాయిలోనూ తెలుగు మీడియంలో విద్యా బోధనకు నాటి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పబ్లిక్‍ సర్వీస్‍ కమిషన్‍ పరీక్షల్లో కూడా తెలుగులో సమాధానాలు రాయడానికి 1970లో సౌకర్యం ఏర్పడింది. తెలుగు మీడియం ద్వారా డిగ్రీలు పొందిన వారికి ఉద్యోగార్హత కల్పిస్తూ నాటి ప్రభుత్వం జీఓలు జారీ చేసింది. ఇన్ని చేసినా నాటి పరిపాలకులు మాతృభాష అయిన తెలుగును నిర్బంధ పఠనీయ భాషగా మాత్రం అమలు చేయలేకపోయారు. అసలు లోపమంతా అక్కడే ఉంది. విద్యాసంస్థల్లో మరీ ముఖ్యంగా జూనియర్‍, డిగ్రీ కళాశాలల్లో తెలుగుకు రాష్ట్ర భాషగా గుర్తింపు లేకపోవడం పెద్ద పొరపాటు. ఇవాళ అన్ని స్థాయిల విద్యార్థులు తప్పించుకోవడానికి వీలు లేకుండా నిర్బంధంగా చదువుకుంటున్న భాష ఇంగ్లిషే కానీ మన మాతృభాష కాదు. పాఠశాల, కళాశాలల విద్యార్థులు తెలుగును నిర్బంధంగా చదవాలన్న నియమం ఈనాటి వరకూ గట్టిగా అమలైన దా•లా లేదు. మాతృభాషా పఠనం ఐచ్ఛికంగా మాత్రమే కొనసాగుతోంది. హైస్కూలు వరకు ప్రథమ భాషగా తెలుగును చదివిన విద్యార్థులు సైతం కాలేజీ స్థాయిలో మార్కుల వలలో పడి ఇతర భాషల వెంట పరుగెత్తుతూ మాతృభాష అయిన తెలుగును పూర్తిగా విస్మరిస్తున్నారు. రాష్ట్రంలో ఎనభై శాతం ప్రజలు మాట్లాడే భాషను ఇతర మైనారిటీ భాషలతో సమానంగా పరిగ ణిస్తూ అధిక సంఖ్యాకుల భాషకు గల ప్రత్యేక స్థానాన్ని గుర్తించలేని దయలేని పరిస్థితి బహుశా మన తెలుగు రాష్ట్రాలలోనే నెలకొన్ని ఉండటం దురదృష్టకరం.
ప్రభుత్వాలు పూనుకుంటేనే..
మన తెలుగు రాష్ట్రాల వారు పిల్లల నుంచి పెద్దల వరకు మాతృభాషకూ ఇతర భాషలకూ ఉన్న వ్యత్సాసాన్ని స్పష్టంగా గుర్తించకపోవడం వల్ల తెలుగు భాష స్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. వినిమయంలో తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలు మూడూ సమానమై ఏ భాషకూ ఎలాంటి పరిధులూ, పరిమితులూ ఉండటం లేదు. దీనివల్ల పరభాషల వినియోగం విస్త•తమై తెలుగు భాష వాడు•• కుంచించుకు పోతోంది. నిరక్షరాస్యులైన, ఇతర భాషలలో ప్రావీణ్యం లేని అత్యధిక శాతం తెలుగు ప్రజలు సమాజాభివృద్ధిలో భాగస్వాములు కాలేక ఎంతో వెనుకబడిపోతున్నారు. ఫలితంగా తెలుగు భాష, సంస్క•తుల వికాసం మందగిస్తోంది. సాంఘికాభి వృద్ధికి విద్యారంగం పునాటి వంటిది. ఆ రంగంలో మాతృభాషకు సముచితమైన స్థానం లభించినపుడే సమాజ అభివృద్ధి ప్రజాస్వామ్యబద్ధంగానూ, శక్తి వంతంగానూ కొనసాగుతుంది. కాబట్టి ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య స్థాయి వరకు తెలుగు చదవకుండా, విద్యాభ్యాసం కొనసాగించే దారుణమైన ప్రస్తుత విద్యా విధానానికి స్వస్తి చెప్పాలి. ఇకనైనా మన రెండు తెలుగు ప్రభు త్వాలూ, ప్రజలూ చిత్తశుద్ధితో ఈ దిశగా నిర్మా ణాత్మకమైన కృషి జరపాల్సిన అవసరం ఉంది.
విశ్వభాషలందు తెలుగు లెస్స..
‘తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా.. అంటూ మాతృ భాషాభివృద్ధికి మనమంతా కంకణం కట్టుకుని ముందుకు సాగాల్సిన తరుణమిదే.
వాడుక భాష ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి. గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ఆయన ప్రజల వాడుక భాషలోకి తీసుకుని వచ్చి తెలుగు వారి తలలో నాలుక అయ్యారు. ఆగస్టు 29 ఆయన జయంతి. వాడుక తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగానే ఆయన జయంతి దినాన్ని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకొంటున్నాం. పొరుగున ఉన్న తెలంగాణలో కాళోజీ నారాయణరావు జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకొంటున్నారు.
గిడుగు రామమూర్తి పంతులు గారి వల్లే శిష్టజన వ్యవహారిక భాషగా తెలుగు అవతరించింది. నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ అందరికీ తెలియ చెప్పిన మహనీయుడు ఆయన. వ్యవహారిక భాషోద్యమానికి గిడుగు రామ్మూర్తి పంతులు మూల పురుషుడు. ఆయన గొప్ప చరిత్రకారుడు. సంఘ సంస్కర్త. హేతువాది. ఆయన నాడు చేసిన ఉద్యమ ఫలితంగానే ఏ కొద్దిమందికో పరిమిత మైన తెలుగు అందరికీ అందుబాటులోకి వచ్చి అందరి నోట మాట అయ్యింది.
ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేటలో 1863 ఆగస్టు 29న వీర్రాజు, వెంకమ్మ దంపతులకు గిడుగు రామ్మూర్తి జన్మించారు. 1875లో తండ్రి మరణించే వరకు పర్వతాలపేటలోనే చదువుకున్న ఆయన అనంతరం విశాఖపట్నంలోని తన మేనమామ ఇంటికి చేరుకున్నారు. ఉన్నత పాఠశాల విద్య అభ్యసిస్తున్న రోజుల్లోనే ఆయన ముఖలింగ దేవాలయం శాసనాలను సొంతగా చదివి అర్థం చేసుకున్నారు. 1879లో మెట్రిక్యులేషన్‍ ఉత్తీర్ణులైన తరువాత ఉపాధ్యాయునిగా పనిచేస్తూ చదువు కొనసాగించారు. 1886లో ఎఫ్‍ఏను, 1896లో బీఏను డిస్టింక్షన్‍లో పూర్తి చేశారు. అనంతరం తెలుగు భాష బోధన చేస్తూ గజపతి మహరాజు స్కూలు, కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశారు. తెలుగును వ్యవహారిక భాషగా చేయాలనే ఆయన ఆశయానికి నిజానికి ఆలంబనగా నిలిచింది జెయేట్స్ అనే ఆంగ్లేయుడు. ఆయన స్కూళ్ల తనిఖీ అధికారిగా ఉన్న 1907 సమయంలో ఈ ప్రయత్నం శ్రీకారం చుట్టుకుంది. అప్పటి ఏవీఎన్‍ కాలేజీ ప్రధాన అధ్యాపకుడు శ్రీనివాస అయ్యంగార్‍, గురజాడ అప్పారావు, యేట్స్తో కలిసి రామ్మూర్తి పంతులు వ్యవహారిక భాషలో బోధనోద్యమానికి అంకురార్పణ చేశారు. వీరి కృషి కారణంగా 1912-13లో తెలుగు వ్యాస పరీక్షను గద్యంలో లేదా వ్యవహారిక భాషలో రాయవచ్చనే ఆదేశాలు జారీ అయ్యాయి. అప్పటి పాఠశాలలు, కళాశాలల్లో వ్యవహారిక భాషగా తెలుగు వెలుగొందింది. వాడుక తెలుగుకు ఎనలేని సేవ చేసిన గిడుగు వారు 1940, జనవరి 22న మరణించారు.

తెలుగు మెరుగుకు కొన్ని ప్రయత్నాలు.
ఆంధప్రదేశ్‍లోని విశాఖపట్నం జిల్లాలో ఇప్పటికీ డ్రెడ్జర్‍ను ‘తవ్వోడ’ అనీ, సబ్‍ మెరైన్‍ను ‘దొంగోడ’ అని అంటారు. అంటే ఆంగ్ల పదాలకు వారు సమానార్థకమైన సొంత పదాలను సృష్టించుకున్నారు. ఇటువంటి ప్రయత్నాలే అన్నిచోట్లా అందరూ చేస్తే తెలుగు మనుగడ పది కాలాల పాటు మన్నుతుంది.
దాదాపు కొన్నేళ్లుగా తెలుగులో కొత్త పదాల సృష్టి ఆగిపోయింది. ఏదో సినిమాలో అన్నట్టు ‘ఎవరూ సృష్టించకుండా మాటలెలా పుడతాయి’. ఉదాహరణకు కాశీనాథుని నాగేశ్వరరావు గారు నాడు సృష్టించిన పదాలు నేటికీ ప్రత్యామ్నాయమై నిలుస్తున్నాయి. నైట్రోజన్‍- నత్రజని, నికెల్‍- నిఖిలము, ఆక్సిజన్‍- ప్రాణవాయువు, ఫొటోసింథసిస్‍- కిరణజన్య సంయోగక్రియ. ఇవి ఎంతో ప్రాచుర్యం పొందిన తెలుగు పదాలు. ఇటువంటివే మరిన్ని పదాల సృష్టి జరగాలి.
నాటికలు, ప్రహసనాలు, చతుర సంభాషణలు, జనపదాలు, పల్లె గీతాలు, చిందు గీతాలు తదితర వాటిల్లోని తెలుగు పదాలను ఒడిసి పట్టుకుని నిత్య వ్యవహారికంలోకి తెచ్చే ప్రయత్నం చేయాలి.
పత్రికలు తెలుగు పదాలనే వాడాలనే నియమం పెట్టుకోవాలి. ఉదాహరణకు- వాటర్‍ షెడ్స్- వాలుగట్లు, చెక్‍డ్యాం- వరదగట్టు, ఆర్గానిక్‍ ఫార్మింగ్‍- సేంద్రియ వ్యవసాయం, సెల్‍ఫోన్‍- చరవాణి, అసెంబ్లీ- శాసనసభ, కోర్టు- న్యాయస్థానం.. ఇవన్నీ ఆంగ్ల పదాలకు సమానార్థకాలు. కానీ, నిత్య వ్యవహారికంలో అసెంబ్లీ, కోర్టు, ఆర్గానిక్‍ ఫార్మింగ్‍ వంటి పరభాష పదాలనే మనం విచ్చలవిడిగా వాడేస్తున్నాం.
ప్రతిసారీ సమానార్థకమైన, ప్రత్యామ్నాయమైన పదాలను సృష్టించలేకపోవచ్చు. కానీ, అర్థబోధక శక్తి ఉన్న రూపాలను వ్యాకరణ విరుద్ధాలైనా సరే వాడటమే మంచిది. ఉదా హరణకు ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, గ్లోబలీకరణ వంటి పదాలు.
మన పొరుగున ఉన్న కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలలో ఇటువంటి ప్రయత్నాలు నిరంతరం జరుగుతున్నాయి.
ఫలితంగానే అక్కడ అమ్మభాషకు పట్టం లభిస్తోంది. ఇక్కడ మాత్రం అదేమీ లేనందున మాతృభాష మనుగడే కష్టంగా మారింది.
నినాదాలతో కాదు.. చిత్తశుద్ధితో కూడిన ఆచరణతో మాత్రమే తెలుగు భాష బతికి ‘మాట్లా’డగలుగుతుంది.

వేద, పురాణ, ఇతిహాసాలలో ఆంధ్ర, అందక శబ్దాలు జాతి వాచకపరంగా తిలింగ శబ్దం దేశ వాచకపరంగా ప్రస్తావితమయ్యాయి. కాగా, ఆంధ్రం, తెలుగు సమానార్థకంగా ప్రాచీక కాలం నుంచీ వ్యవహారంలో ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగు భాష, తెలుగు జాతి ప్రాచీనతను నిరూపించడానికి శాసనాలు బలమైన ప్రమాణాలుగా ఉన్నాయి. క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం నుంచి లభ్యమవుతున్నా శాసనాల్లో ఆంధ్ర దేశంలోని గ్రామ నామాలు, వ్యక్తుల పేర్లు గోచరిస్తాయి. మౌర్య అశోకుని కాలం ప్రాకృత శాసనాలు, బౌద్ధ స్తూపాలు మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో లభించాయి. అశోకుని 13వ ధర్మలిపి శిలా శాసనంలో (క్రీస్తు పూర్వం 256 – 254) ఆంధ్ర, పుళింద జాతుల ప్రస్తావన ఉంది. మూడవ శతాబ్దం నాటి అమరావతి స్తూప శిథిలాలలోని రాతి పలకల మీద కనిపించిన ‘నాగబు’ అనే పదం తెలుగు లిపిలో లభ్యమవుతున్న తొలి పదంగా భాషా వాజ్మయ పరిశోధకులు వేటూరి ప్రభాకరశాస్త్రి గుర్తించారు. ఇందులోని ‘బు’ తెలుగు ప్రథమావిభక్తి ‘ము’కు ప్రాచీన రూపం. ఇది ఆ కాలపు శాసనాల్లో ప్రయుక్తమైన నాగబుధనికా పదంలోని భాగమై ఉంటుందని, కానీ అనంతర శాసనాల్లోని వక్రబు పట్టణబు పదాల ఆధారంగా అది నాగము అనే పద రూపమై ఉంటుందని భావించవచ్చు. శిల్పంలోని బొమ్మ కింద దాని పేరును చెప్పడం మౌర్యుల కాలం నాటి సంప్రదాయంగా ఉండటం కూడా ఈ అభిప్రాయాన్ని బలపరుస్తోంది. అశోకుని పద్నాలగవ శిలా శాసనంలో ఏనుగు బొమ్మ కింద గజతము (ఉత్తమ గజము) అన్న మాట కనిపిస్తుంది. శాతవాహనుల తరువాత వారైన విష్ణుకుండిన రాజులకు చెందిన కీసరగుట్ట శాసనంలో గల ‘వాన్డు’ (వాండ్రు వారు) పదం కూడా తెలుగు భాష ప్రాచీనతను సూచిస్తుంది.
మన తేనెలొలుకు మధుర పలుకుల తెలుగుకు ఎంతో ప్రాచీనత ఉంది. కానీ, దానిని నాలుగు కాలాల పాటు కాపాడుకోవాలనే ఆధునిక స్ప•హే నేటి తరంలో లేకపోవడం విషాదం.

Review అమ్మ బాషాకు వందనం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top