ఆడండి .. పాడండి…. మీదే ఈ లోకం

ఎత్తుకోండి.. హత్తుకుపోతారు.. మాట్లాడండి.. మురిసిపోతారు. కథలు చెప్పండి.. కేరింతలు కొడతారు. ఆటలాడించండి..అల్లుకుపోతారు.
ఇలా పిల్లల కోసం మనం ఒక్కరోజు చేయగలిగితే చాలు ప్రతి రోజూ అటువంటి రోజు కోసం ఎదురు చూస్తారు పిల్లలు. వారి సంతోషం కంటే విలువైనది కాదు మన సమయం.అమ్మ ఒడి.. నాన్న ఛాతి.. మావయ్య భుజం.. తాతయ్య వీపు.. అన్నీ వారి ఆటస్థలాలే. అంతెందుకు ఈదేశపు భవిష్యత్తే వారు. ఈ దేశమంతా వారిదే. మురిపాల ముచ్చట్లకు, బుడిబుడి చేష్టలకు బాలల దినోత్సవం ఏటా ఒక్కసారే ఎందుకు? పై విధంగా చేయగలిగితే, పై విధంగా పిల్లలతో ఉండగలిగితే ప్రతి రోజూ బాలల దినోత్సవమే. పిల్లలంటే- బుజ్జాయిలు.. గడుగ్గాయిలు.. చిచ్చరపిడుగులు.. చిన్నారి దేవుళ్లు.. మన అందమైన ఆశలకు ప్రతిరూపాలు వారే. అందుకే వారిని రోజూ ఆడుకోనిద్దాం..పాడుకోనిద్దాం.. ఈ లోకమే వారిది.
నేటి బాలలే రేపటి పౌరులు. ఒక దేశపు భవిష్యత్తు, సంపద.. ఆ దేశంలో గల పిల్లలే. అందుకే వారి లక్ష్యాన్ని గుర్తు చేసేందుకు, వారిని దేశ నిర్మాణం దిశగా ప్రోత్సహించేందుకు ఏటా నవంబరు 14న బాలల దినోత్సవాన్ని నిర్వహించే సంప్రదాయం ఏర్పడింది. అన్నట్టు నవంబరు 14 బారతదేశ తొలి ప్రధాని పండిట్‍ జవహర్‍లాల్‍ నెహ్రూ జన్మదినం కూడా. ఆయనకు పిల్లలంటే మహా ఇష్టం. అందుకే ఆయనను పిల్లలు ‘చాచా’గా పిలుస్తారు. బాలలపై ఆయనకు గల ప్రేమకు గుర్తుగా ఏటా ఆయన జన్మదినోత్సవాన్ని బాలల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు పిల్లల ఆనందోత్సాహాలకు అవధులు ఉండవు. సహజంగానే ఆనం దానికి, సంతోషానికి ప్రతిరూపమైన చిన్నారులు నవంబరు 14న మరింత ఆనందోత్సాహాలతో గడుపుతారు. ఈ రోజున పాఠశాలలు, కళాశాలల్లో పండిట్‍ నెహ్రూ జయంతి వేడుకలతో పాటు బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. చిన్నారులు తమలో దాగి ఉన్న ప్రతిభను ఈ రోజు యథాశక్తి ప్రదర్శించడానికి నవంబరు 14 ఒక వేదికగా నిలుస్తుంది. ఈనాడు పాఠశాలల్లో పిల్లలు పూర్తిగా ఆటపాటల్లోనే నిమగ్నమవుతారు. జాతీయ నాయకుల వేషధారణలు, తాము రాసిన కథలు, కవితలు, ఇంకా తమకు అభినివేశం ఉన్న అంశాలలో ప్రతిభను చాటి తగిన బహుమతులు పొందుతారు.
దేశానికైనా, తల్లిదండ్రులకైనా వెలకట్టలేని అమూల్యమైన ఆస్తి పిల్లలే. వారితోనే భవిష్యత్తు ముడిపడి ఉంటుంది. ఒక తరం నుంచి మరో తరానికి వారధిగా నిలిచేది పిల్లలే. అందుకే పిల్లల్ని తల్లిదండ్రులు కళ్లలో పెట్టుకుని చూసుకుంటారు. వాళ్ల భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉండాలనే భావనతోనే, ఈ విషయాన్ని అందరూ గుర్తించాలనే లక్ష్యంతోనే బాలల దినోత్సవాన్ని పిల్లలకు ఇష్టుడైన నెహ్రూ జన్మదినోత్సవం రోజున జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
ఇక, ఈనాటి బాలల స్థితిగతులు ఎలా ఉన్నాయంటే.. పక్షులు గూళ్ల నుంచి బయటకు వచ్చినపుడు కిలకిలరావాలతో ఆనందిస్తాయి. గూళ్లలోకి వెళ్లేటప్పుడూ కిలకిలల సరిగమ రాగాలనే ఆలపిస్తాయి. పిల్లల విషయం లోనూ ఇదే వర్తిస్తుంది. నిజానికి బాల్యంలో పిల్లలు పాఠశాలకు వెళ్లేటప్పుడు మారాం చేస్తారు. వచ్చేటప్పుడు మాత్రం విజయోత్సాహంతో ఇంటికి బయల్దేరతారు. వయసు ప్రభావం, తల్లిదండ్రులను వదిలి ఉండలేని మనస్తత్వం వంటి కారణాల వల్ల ఇలా జరుగుతుంది. పిల్లల సామా జిక జీవనానికి తొలి అడుగు పడేది పాఠశాలతోనే. అటువంటి పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లల్ని తల్లిదండ్రుల్లా చూసుకోవాలి. వాళ్ల ఆశల్ని గుర్తించాలి. ఆకాంక్షలు నెరవేరడానికి సహక రించాలి. ఇంట్లో ఉండటాన్ని పిల్లలు ఎంత ఎంజాయ్‍ చేస్తారో బడిలో ఉండటాన్నీ అంతగా ఆనందించేలా తరగతి గదిని ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలి. పిల్లల భవిష్యత్తు రూపుదిద్దుకునేది తరగతి గదిలోనే. కాబట్టి బందిఖానా మాదిరి
ఉండకూడదు. చిన్నారుల ముఖాల్లోని వేదనను, బాధను గుర్తించే, గమనించే ఓర్పు- నేర్పు ఉపాధ్యాయులకు ఉండాలి. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రుల వద్ద ఒక విధంగా ఉంటారు.
ఉపాధ్యాయుల వద్ద మరో విధంగా ఉంటారు. అలా ‘మరో విధంగా’ ఉండటాన్ని గుర్తించగలిగిన ఉపాధ్యాయులే దానిని సరిదిద్ది దేశానికి పిల్లలకి మంచి భవిష్యత్తును అందించగలుగుతారు.
పిల్లలను చీకట్లో ఉంచి, వారి ముఖాల్లో ఆనందం చూడాలనుకోవడం భ్రమ మాత్రమే. చదువుల పేరుతో ఒత్తిడి పెంచి, చిన్న వయసు లోనే వారికి భారమైన లక్ష్యాలు విధించి వాటిని సాధించాలని టార్గెట్లు పెట్టడం వల్ల చేతులారా భవిష్యత్తును చిదిమేసిన వాళ్లమవుతాం.బాలల మనోభావం జాతికి జయ జయారావంవారి దరహాసం సరస్వతీసముల్లాసం ఆ ఊహలే విశ్వకల్యాణానికి పందిళ్లు అవుతాయి జాతీయ వికాసానికి పూల దోసిళ్లు పడతాయి.
కాబట్టి పిల్లలే కదా అని తక్కువ చేయవద్దు. చిన్నచూపు చూడొద్దు. పిల్లలే దేశ భవిష్యత్తు కాదు.. దేశ హృదయం అని కూడా చాటారు ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. అందుకే ఆయన పిల్లల గురించి తన రచనల్లో ఒకచోట-
‘బాల బాలికలం పసివాడని పూల మాలికలం
ప్రగతి పథంలో పురోగమించే భారత భూమికి ఏలికలం’ అంటూ పసి మనసుల్ని అత్యద్భుతంగా వర్ణించారు. అంతేకాదు, తెలుగు బాలలకు ఆయన తాతయ్యలా సుద్దులు కూడా నేర్పారు. అందుకో మచ్చుతునక ఇదీ-
‘కష్టబెట్టబోకు కన్నతల్లి మనసు
నష్టపెట్ట బోకు నాన్న పనులు
తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా’ అంటూ బుద్ధులు నేర్పారు. ‘నీతి లేని చదువు జీతాల చేటం’టూనే, మంకుబుద్ధి, విసుగు.. సహజ గుణములివ్వి చవట విద్యార్థికి’ అంటూ కొన్నిచోట్ల చురుక్కు మనిపించారు కూడా.
‘అయ్యవారన్న మాట వెయ్యారు వరాల మూట
ఆచార్యుల సన్నిధి విద్యార్థుల కందరకు పెన్నిధి’ అంటూ హితవు కూడా చెప్పారు.
బాల్యమంటేనే ఎన్నెన్నో ఊహలు, ఎన్నో కోరికలు, ఎన్నో ఆలోచనలు.. మరెన్నో సందే హాలు. ఇవి నిత్యం చిన్నారి బుర్రల్ని తొలిచేస్తుం టాయి. వాటిని పంచుకోవడానికి తరచుగా ఒక వేదికంటూ ఉండాలి. లేత గులాబీ మొక్కల్లాంటి పిల్లలకు స్వేచ్ఛనిస్తే వారి మెదడు వికసిస్తుంది. సృజన మొగ్గలు తొడిగి అందమైన పూలు పూస్తుంది. అటువంటి అవకాశం కల్పించడానికి ఏర్పాటు చేసిన వేదికే- బాలల దినోత్సవం. ఈ రోజున పిల్లలు కాసేపు చదువులను పక్కన పెడతారు. తమలోని ఊహలకు, సృజనకు ప్రాణం పోసి రెక్కలు తొడుగుతారు. ఆటలొచ్చిన వారు ఆడతారు. పాటలొచ్చిన వారు పాడతారు. కొందరు వేషం కడతారు. ఇంకొందరు బొమ్మలు వేస్తారు. ఇలా తమలోని అభినివేశాన్ని అంతా ప్రదర్శిస్తారు. అందుకే ఏడాదికి ఒక బాలల దినోత్సవం కాదు.. ప్రతి రోజూ పిల్లలకు ‘బాలల దినోత్సవం’లా ఉండేటటువంటి వాతావరణాన్ని కల్పించే బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పైనే ఉంది.
పిల్లల ఫ్రెండ్‍ నెహ్రూ
పండిట్‍ జవహర్‍లాల్‍ నెహ్రూ.. భారతదేశపు తొలి ప్రధాని. అన్నింటికీ మించి పిల్లలకు అత్యంత ఇష్టుడు. ఆయన పిల్లల్లోనే దేశ భవిష్యత్తును దర్శించారు. అందుకే పిల్లల్ని దేశ నిర్మాణంలో పునాదులుగా అభివర్ణించారు. మనకున్న గొప్ప ఆస్తి మన పిల్లలే అని, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్ది ఈ దేశానికి గొప్ప భవిష్యత్తును ఇవ్వగలిగేది వారి తల్లిదండ్రులేనని ఎలుగెత్తి చాటిన నెహ్రూకు నివాళిగానే ఆయన జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకునే ఆనవాయితీ ఏర్పడింది. నవ భారత నిర్మాణం కోసం పదిహేడు సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా ప్రణాళికాబద్ధమైన కృషి చేశారు నెహ్రూ. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాద ఆర్థిక విధానం, అలీన ఉద్యమ సిద్ధాంతాలతో దేశానికి ఒక కాంతిమంతమైన స్థిర స్వరూపాన్ని అందించారాయన. సంపన్న కాశ్మీరీ పండిట్‍ల కుటుంబంలో జన్మించిన నెహ్రూ ఇంగ్లండ్‍లో విద్యాభ్యాసం పూర్తయ్యాక ఇండియాకు తిరిగి వచ్చారు. జాతీయోద్యమానికి ప్రభావితులై ‘భారత జాతీయ కాంగ్రెస్‍’లో చేరారు. శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని పలుమార్లు జైలుకు వెళ్లారు. రెండో ప్రపంచ యుద్ధం పూర్తయ్యే నాటికి గాంధీజీ తరువాత దేశానికి మరో శక్తివంతమైన నేతగా అవతరించారు. ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా ఫలాలు ఆయన పెంచి పోషించిన ప్రజాస్వామ్య వృక్షానివే.
జన్మతేదీ: 14 నవంబరు, 1889
జన్మ స్థలం: అలహాబాద్‍, ఉత్తరప్రదేశ్‍
తల్లిదండ్రులు: మోతీలాల్‍ నెహ్రూ, స్వరూప్‍రాణి
భార్య పేరు: కమలా నెహ్రూ
సంతానం: ఇందిరాగాంధీ
మరణం: 27 మే, 1964
నెహ్రూ సమాధి పేరు: శాంతివన్‍
ప్రధాని పదవీ కాలం: 15 ఆగస్టు 1947 – 27 మే, 1964
భారతరత్న: 1955

Review ఆడండి .. పాడండి…. మీదే ఈ లోకం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top