నవంబరు 14, బాలల దినోత్సవం సందర్భంగా ఈ మాసపు ప్రత్యేక కథనమిది..
ఏ పిల్లాడూ బడికెళ్లనని మారాం చేయడు.. నడుం వంగిపోయే బరువుతో బ్యాగులు మోస్తూ ఏ విద్యార్థీ కనిపించడు. యూనిఫాం, హోంవర్కులూ, వార్షిక పరీక్షలూ మార్కులూ, ర్యాంకుల పోటీ, రోజంతా సాగే స్కూలు.. స్టడీ అవర్లూ, ట్యూషన్లూ.. ఇవేవీ అక్కడ కనిపించవు. ఒక్కమాటలో చెప్పాలంటే విద్యార్థులను కష్టపెట్టే ఏ చిన్న విధానమూ అక్కడ అమలు చేయరు. అయితేనేం.. ప్రపంచంలోని అత్యుత్తమమైన, అత్యద్భుతమైన విద్యావ్యవస్థ అక్కడుంది. ఈ విషయంలో ప్రపంచంలోనే తొలి స్థానం సంపాదించింది. బాగా చదివే విద్యార్థీ.. మాదిరిగా చదివే విద్యార్థీ.. అంటూ అక్కడ తారతమ్యాలేవీ లేవు. అక్కడ ప్రతి విద్యార్థీ టాపరే. ఇదంతా ఎక్కడంటే ఫిన్లాండ్‍లో. పిల్లల్ని స్కూలుకు పంపే తల్లిదండ్రులూ.. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులూ.. ఫిన్లాండ్ దేశ విద్యా విధానం గురించి, అక్కడ అనుసరిస్తున్న పద్ధతుల గురించి తెలుసుకోవడం తప్పనిసరి.
ఒకటీ.. ఒకటీ.. ఒకటీ..
రెండు.. మూడు.. మూడు..
నాలుగు..
పదిలోపు వంద ర్యాంకులు..
వెయ్యిలోపు పదివేల ర్యాంకులు..
పరీక్ష ఏదైనా.. పోటీ ఏదైనా.. ఫలితం మా విద్యాసంస్థదే..
మన తెలుగు రాష్ట్రాల్లో వార్షిక, పోటీ పరీక్షలు ఫలితాలు వెలువడినప్పుడల్లా టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిపోయే ఆయా విద్యాసంస్థల ప్రకటనలివి.. ఏ దినప•త్రికలు తిరగేసినా కనిపించే అడ్వర్టైజ్‍మెంట్లు ఇవి..
ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో.. మంచి ర్యాంకులు వచ్చిన పిల్లలే పోటీ ప్రపంచంలో మనుషుల్లా కనిపిస్తున్నారు. టాప్ ర్యాంకు వచ్చిన వాళ్లనే సమాజం నెత్తిన పెట్టుకుంటోంది. క్రికెట్‍లో కోహ్లీలా బ్యాట్ ఝుళిపించే సత్తా ఉన్నా.. నటనలో వర్ధమాన హీరోలను తలదన్నే టాలెంట్ ఉన్నా.. చదువుల్లో మాత్రం మంచి మార్కులు, మంచి ర్యాంకు రాకపోతే మన సమాజం దృష్టిలో ఆ పిల్లాడు మొద్దావతారమే. అందుకే మన దేశంలో చాలామంది చిన్నారులు అంకెల వేటలో పడి
అందమైన బాల్యాన్ని కోల్పోతున్నారు. పరీక్షలో అనుకున్న మార్కుల కంటే పది మార్కులు తగ్గితే మహా పాపం చేసినట్టుగా ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆశలు, ఆరాటాలు, విద్యాసంస్థల ఒత్తిడీ కలిసి మన విద్యార్థుల పరిస్థితిని దయనీయంగా మార్చేస్తున్నాయి.
బుల్లి దేశం.. ప్రపంచానికే పెద్ద పాఠం!
ర్యాంకుల కోసం విద్యార్థులపై మన దేశ విద్యా వ్యవస్థలో ప్రయోగించే సామ దాన భేద దండోపాయాలెన్నో! అయినా మనం సాధించలేకపోతున్న ఉత్తమ ఫలితాలను ప్రపంచంలో అత్యుత్తమ విద్యావ్యవస్థ కలిగిన దేశంగా పేరున్న ఫిన్లాండ్ ఆడుతూపాడుతూ సాధించేస్తోంది. ఐరోపాలోని ఓ చిన్న దేశమైన ఫిన్లాండ్ విద్యార్థులపై ఏమాత్రం ఒత్తిడి పెట్టకుండానే వాళ్లను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దవచ్చని నిరూపిస్తోంది. పరీక్షలు, ర్యాంకుల ప్రస్తావన లేకుండానే వాళ్లను ఇంజినీర్లూ, డాక్టర్లూ ఇతర వృత్తి నిపుణులుగా తయారుచేస్తోంది. అన్ని విషయాల్లో అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లండ్‍లాంటి దేశాలకు కూడా పిల్లల్ని చదివించే విషయంలో ఫిన్లాండ్ కొత్త పాఠాలు నేర్పిస్తోంది. ఏటా తన బోధనా పద్ధతులను మార్చుకుంటూ, కొత్త ప్రమాణాలను అందుకుంటూ గత 45 ఏళ్లలో అక్కడి విద్యావ్యవస్థ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. మూడేళ్లకోసారి విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించే ‘పోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎసెస్‍మెంట్’ (పిసా) లెక్కల్లో అమెరికా, జపాన్, చైనాలాంటి దిగ్గజ దేశాలను దాటి చిట్టి దేశమైన ఫిన్లాండ్‍కు చెందిన పిల్లలు వరుసగా తొలి స్థానాన్ని సాధిస్తున్నారు. ప్రతి విద్యార్థీ కలలుగనే తరగతి గదులూ, ప్రతి పాఠశాలా అనుసరించాల్సిన విధానాలూ, అందరు తల్లిదండ్రులూ పాటించాల్సిన నియమాలూ ఫిన్లాండ్ సొంతం..
చదవడానికెందుకు తొందర.. ముందు ‘ఎదగాలి’!
మన దేశంలో తల్లిదండ్రులు పిల్లలకు రెండేళ్లు దాటగానే రెక్కపట్టుకుని స్కూళ్లో పడేస్తారు. ఏడాది దాటగానే మొదట స్కూళ్ల వేట మొదలుపెడతారు. స్కూలుకు పంపడానికి ముందే అ..ఆలు, ఏబీసీడీలు ఇంట్లోనే బట్టీ పట్టిస్తారు. కానీ ఫిన్లాండ్‍లో పిల్లలు స్కూల్లో అడుగుపెట్టాలంటే కనీసం ఏడేళ్లు నిండాల్సిందే.. అప్పటి వరకూ వాళ్లు పలకా బలపం, పుస్తకాలూ, పెన్సిళ్లూ పట్టుకోరు. అలాగని నేర్చుకునే వయసునీ వృథా చేసుకోరు. డే కేర్ సెంటర్లలో ఉంటూ తమ మెదడుకు పదును పెట్టుకునే పనిలో పడతారు. సాధారణంగా తొలి ఆరేళ్లలోనే పిల్లల మెదడు కణాలు 90 శాతం విచ్చుకుంటాయి. దేన్నయినా త్వరగా గ్రహించే శక్తి పెరుగుతూ వస్తుంది. అన్ని దేశాల్లో ఆరేళ్లలోపు వయసులోనే పిల్లలకు లెక్కలు, సైన్స్లాంటి అంశాలకు సంబంధించిన ప్రాథమిక విషయాలు బోధిస్తారు. ఫిన్లాండ్‍లో మాత్రం తొలి ఆరేళ్లలో పాఠాలకు బదులుగా పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తారు. అందరితో కలిసి ఆడుకోవడం, పద్ధతిగా తినడం, నిద్రపోవడం, ఒకరికొకరు సహాయపడటం, శుభ్రత పాటించడం, భావవ్యక్తీకరణ నైపుణ్యం, జాలీ, దయా, సామాజిక స్ప•హ.. ఇలాంటి అన్ని జీవన నైపుణ్యాలను అలవరచుకునేలా ప్రోత్సహిస్తారు. బడికి ఎప్పుడైనా వెళ్లొచ్చు. కానీ, మంచి పౌరుడిగా ఎదగడానికి పునాది మాత్రం పసి వయసులోనే పడాలనేది ఫిన్లాండ్‍వాసుల నమ్మకం. అందుకే తొలి ఆరేళ్లను దాని కోసమే కేటాయిస్తారు. ‘నేర్చుకోవాల్సిన వయసు వచ్చినపుడు పిల్లలు అన్నీ నేర్చుకుంటారు. తొందరపెట్టి వాళ్లలో ఒత్తిడి పెంచాల్సిన పని లేదు’ అంటారు అక్కడి ఉపాధ్యాయులు.
చదువు ఉచితం.. నైపుణ్యాలు సొంతం
ఉన్నత విద్యావంతులే మంచి పౌరులుగా మారతారు. అలాంటి ప్రజలున్న దేశమే ఉన్నతంగా ఎదుగుతుందనేది ఫిన్లాండ్ నమ్మిన సిద్ధాంతం. అందుకే ఆ దేశంలో పుట్టిన ప్రతి చిన్నారి చదువు బాధ్యతనూ ప్రభుత్వమే మోస్తుంది. ఎనిమిది నెలల వయసులో డే కేర్ సెంటర్‍లో కాలు పెట్టినప్పటి నుంచి పాతికేళ్ల తరువాత యూనివర్సిటీ నుంచి పీహెచ్‍డీ పట్టా అందుకునేంత వరకూ రూపాయి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరికీ ఆ దేశం ఉచిత విద్యనందిస్తోంది. ప్రైవేటు యూనివర్సిటీలు, ప్రైవేటు పాఠశాలల ఊసే అక్కడ వినిపించదు. చిన్న కార్మికుడి నుంచి దేశాధినేత వరకూ అందరూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుని బయటకు రావాల్సిందే. పుట్టుకతో ఎంత సంపన్నులైనా చదువు విషయంలో మాత్రం అక్కడి పిల్లలంతా సమానమే. చిన్న పల్లెటూరు నుంచి దేశ రాజధాని వరకూ అన్ని స్కూళ్లలో ఒకే తరహా శిక్షణ, బోధన పిల్లలకు అందుతుంది. పిల్లలంతా సమాన నైపుణ్యాలతో ఎదుగుతారు.
పల్లె నుంచి పట్నం దాకా ఒకేటే విధానం.. ఒకే పాఠం
మనకు తెలిసిన వారికెవరికైనా పిల్లలు పుట్టారంటే జాన్సన్ బేబీపౌడర్ సెట్టూ, స్వెట్టర్లూ, ఉగ్గు గిన్నె, ఉయ్యాల, శిశువుకు సరిపడా దుస్తులు.. ఇలాంటివే మనం కానుకలుగా ఇస్తాం. ఫిన్లాండ్‍లో మాత్రం బిడ్డ పుట్టాక ఆస్పత్రి నుంచి వెళ్లేటపుడు వైద్యులు మూడు పుస్తకాలను తల్లిదండ్రుల చేతిలో పెడతారు. పిల్లల్ని బాగా చదివిస్తూనే తల్లిదండ్రులూ పుస్తకాల్ని చదివే అలవాటు కొనసాగించాలని సూచిస్తూ ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే తొలి రోజుల్లో తల్లి సంరక్షణ చాలా కీలకం. అందుకే అన్ని సంస్థలూ తప్పనిసరిగా ఎనిమిది నెలల ప్రసూతి సెలవుల్ని
మహిళలకు అందిస్తాయి. ఆ తరువాత కూడా ఉద్యోగానికి వెళ్లని తల్లులు ఆదాయం గురించి బెంగపడకుండా మూడేళ్ల పాటు ‘డే కేర్ అలవెన్స్’ పేరుతో ప్రభుత్వం కొంత డబ్బుని చెల్లిస్తుంది. కానీ, ఆ అవకాశాన్ని ఉపయోగించుకునే తల్లుల సంఖ్య అక్కడ ఐదు శాతంలోపే. దానికి కారణం ప్రభుత్వ పరిధిలో ఉచితంగా పనిచేసే ‘డే కేర్’ కేంద్రాలే. ఎనిమిది నెలల వయసు నుంచి ఆరేళ్లు వచ్చే వరకూ పిల్లలంతా ఆ ప్రభుత్వ సంరక్షణ కేంద్రాల్లో హాయిగా పెరగొచ్చు. అక్కడ ప్రతి పన్నెండు మంది పిల్లలకూ ఓ టీచర్, ఇద్దరు నర్సుల చొప్పున అందుబాటులో ఉంటారు. చిన్నారుల ఆలనాపాలనతో పాటు వాళ్లలో జీవన నైపుణ్యాలు పెంచే బాధ్యతనూ వాళ్లే తీసుకుంటారు. దాదాపు ఐదేళ్ల పాటు ఒకే ఉపాధ్యాయుడి దగ్గర పన్నెండు మంది పిల్లలు పెరుగుతారు. తల్లిదండ్రుల తరువాత పిల్లలకు అంతటి అనుబంధం టీచర్లతోనే అల్లుకుంటుంది. దాంతో వాళ్ల స్వభావాన్నీ, సామర్థ్యాన్నీ అర్థం చేసుకుని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకు దొరుకుతుంది. ఆ ఐదేళ్లూ తరగతి గది పాఠాలు పిల్లల దగ్గరికి రావు. పక్షలూ, జంతువులూ, చెట్లూ, మనుషులూ, ఆహారం.. ఇలా చుట్టూ కనిపించే అంశాల గురించే పిల్లలకు నేర్పిస్తారు. సంరక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తయ్యాక కూడా ఏ స్కూల్లో చేర్పించాలా అని తల్లిదండ్రులు తలలు పట్టుకోవాల్సిన పనిలేదు. పల్లె నుంచి పట్నం దాకా ప్రతి స్కూలుకీ ప్రభుత్వం నుంచి ఒకే స్థాయిలో నిధులు అందుతాయి. ఒకే తరహా విద్యార్హతలూ, సామర్థ్యమున్న ఉపాధ్యాయులు ఉంటారు. అన్ని పాఠశాలల్లో ఒకేలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి అక్కడన్నీ మంచి స్కూళ్లే!.
నిర్బంధమే కానీ.. స్వర్గధామమే!
ఏడేళ్ల వయసు నుంచి పదహారేళ్ల వరకూ అంటే ఒకటి నుంచి తొమ్మిదో గ్రేడ్ దాకా ప్రతి ఒక్కరూ కచ్చితంగా చదువుకుని తీరాలన్నది ఫిన్లాండ్‍లో తూచా తప్పకుండా అమలయ్యే నిబంధన. అందుకే ప్రస్తుత తరంలో అక్కడ నిరక్షరాస్యులు ఒక్కరంటే ఒక్కరు కూడా అక్కడ కనిపించరు. పేరుకే అది నిర్బంధ విద్య. ఆచరణలో మాత్రం అక్కడి తరగతి గదులు పిల్లల పాలిట స్వర్గధామాలే. ఒంటి మీద రంగురంగుల దుస్తులుంటేనే పిల్లలకు ఉత్సాహం. అందుకే అక్కడ స్కూళ్లలో ఏకరూప దుస్తుల (యూనిఫాం) విధానాన్ని పక్కన పెట్టేశారు. చదువూ, పుస్తకాలూ పిల్లలకెప్పుడూ భారం కాకూడదని ‘హోం వర్క్’ పద్ధతినీ తీసేశారు. ఆరో తరగతి దాకా పిల్లలు ఇంటి దగ్గర పుస్తకం తెరవాల్సిన పనిలేదు. ఆపై తరగతుల వాళ్లకు ఇచ్చే హోంవర్క్ను పూర్తి చేయడానికి అరగంటకు మించి సమయం పట్టకూడదనేది మరో ప్రధాన నియమం. పిల్లల నిద్రకు ఫిన్లాండ్ చాలా ప్రాధాన్యమిస్తుంది. అందుకే పాఠశాలల గేట్లు తొమ్మిది తరువాతే తెరుచుకుని మధ్యాహ్నం రెండున్నరకల్లా మూతబడతాయి. అంటే హైస్కూల్ పూర్తయ్యే దాకా అక్కడి పిల్లలకు నిత్యం ఒంటిపూట బడులే. రోజుకి ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగు పీరియడ్లకు మించి జరగవు. ప్రతి పీరియడ్ మధ్యలో కనీసం పదిహేను నిమిషాల విరామం ఉంటుంది. ఆ సమయంలో ఠంచనుగా పిల్లలకు చిరుతిళ్లు అందుతాయి. రోజుకో గంట ఆటల విరామమూ తప్పనిసరి. పిల్లల భోజనం గురించి తల్లిదండ్రులు బెంగపెట్టుకోనక్కర్లేదు. చదువు పూర్తయ్యే దాకా చక్కని పోషకాహారాన్ని పిల్లలకు ఇష్టమైన రుచుల్లో ప్రతిరోజూ ప్రభుత్వమే పూర్తి ఉచితంగా అందిస్తుంది.
తేడాల్లేవ్.. అందరూ ఒకటే..
‘అందరూ సమానంగా చదవాలి. అందరూ టాపర్లు కావాలి’ అనేది ఫిన్లాండ్ విద్యాశాఖ లక్ష్యం. అందుకే విద్యార్థుల మధ్య హెచ్చుతగ్గులను ఎత్తిచూపే పరీక్షలూ, మార్కుల విధానానికి ఆ దేశం పూర్తిగా దూరం. అన్ని దేశాల్లో మాదిరిగా త్రైమాసిక, వార్షిక పరీక్షలంటూ పిల్లలకు పితలాటకాలుండవు. ఒక్కో తరగతిలో 15 – 20కి మించి విద్యార్థులు ఉండటానికి వీల్లేదు. కనీసం నాలుగు తరగతుల వరకూ ఒకే ఉపాధ్యాయుల బృందం పిల్లలకు పాఠాలు చెబుతుంది. అంటే వరుసగా నాలుగేళ్ల పాటు పిల్లల సామర్థ్యం, తెలివితేటలు, సబ్జెక్టులపై పట్టులాంటి అంశాల గురించి టీచర్లకు అవగాహన కలుగుతుంది. దాంతో పిల్లల్లోని లోపాలను సరిచేస్తూ ఏటికేడు వాళ్లని మెరుగుపరచడానికి కావాల్సినంత సమయమూ టీచర్లకు దొరుకుతుంది. ఒకట్రెండు పరీక్షలతో కాకుండా ఎప్పటికప్పుడు రకరకాల అంశాల్లో విద్యార్థులు చూపే ప్రతిభ ఆధారంగా వాళ్ల సామర్థ్యాన్ని టీచర్లు అంచనా వేస్తారు. ఏడాది చివరిలో గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో పరీక్షలు పెట్టినా, వాటిలో మార్కుల్ని మాత్రం బయటపెట్టరు. అంటే పరీక్షలు రాసేది విద్యార్థులైనా వాటి ద్వారా తామెంత బాగా చెబుతున్నదీ, తాము చెబుతున్న విషయాలను పిల్లలు ఏ మేరకు అర్థం చేసుకుంటున్నారన్నదీ టీచర్లు అంచనా వేసుకుంటారు. ఆ జవాబు పత్రాల ఆధారంగా మరుసటి ఏడాది తమ శిక్షణ తీరులో మార్పులు చేసుకుంటారు. మొత్తంగా ఒక్కో తరగతి మారే కొద్దీ విద్యార్థుల విజ్ఞానంతో పాటు వ్యక్తిత్వాన్నీ పెంపొందించడమే లక్ష్యంగా ఫిన్లాండ్ విద్యా విధానం సాగుతుంది.
‘పెద్ద పరీక్ష ఒక్కటే..
పదహారేళ్లు వచ్చే వరకూ పరీక్షలే తెలియకుండా పెరిగిన విద్యార్థులు, తొమ్మిదో గ్రేడ్ చివరిలో తమ జీవితంలో ‘పెద్ద పరీక్ష’ రాస్తారు. పై చదువులకు వెళ్లాలంటే అది పాసై తీరాల్సిందే. అపరిమితమైన పాఠాలూ, పిల్లలకు భవిష్యత్తులో ఏమాత్రం ఉపయోగపడని అంశాలూ ఫిన్లాండ్ విద్యా వ్యవస్థలో కనిపించవు. రోజువారీ వృత్తుల్లో ఉపయోగపడే లెక్కలూ, సైన్స్కి సంబంధించిన అంశాలను పరిమితంగానే వారికి నేర్పిస్తారు. పరీక్షలు కూడా విద్యార్థులు బుర్రలు బద్దలుకొట్టుకునేంత కఠినంగా కాకుండా, ఆయా అంశాల్లో వారి ప్రాథమిక జ్ఞానాన్ని పరీక్షించేవిగానే ఉంటాయి. అందుకే పరీక్షల్లో తప్పే విద్యార్థులు దాదాపుగా ఉండరు. తొమ్మిదో గ్రేడ్ తరువాత చదువు కొనసాగించాలా వద్దా అన్నది పిల్లల ఇష్టం. ఉన్నత డిగ్రీలు చదవాలనుకునే వాళ్లు ‘అప్పర్ సెకండరీ ఎడ్యుకేషన్’ కాలేజీల బాట పడతారు. చదువుపై ఆసక్తి లేని వాళ్లు వొకేషనల్ కోర్సుల్లో శిక్షణ తీసుకుని జీవితాల్లో స్థిరపడతారు. రెండిట్లో ఏ దారి ఎంచుకున్నా, ఆ ఫీజుల భారమంతా ప్రభుత్వానిదే. మొత్తంగా చదువు పూర్తయ్యే వరకూ పిల్లల ఖర్చులూ, పాఠశాలలో విద్యా ప్రమాణాల గురించి ఆలోచించాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉండదు. పోటీ, ఒత్తిడిలో పడిపోయి బాల్యాన్ని కోల్పోవాల్సిన ఆగత్యం పిల్లలకూ ఉండదు.
మన దగ్గర బతకలేక బడిపంతులు.. అక్కడ సూపర్‍స్టార్
మన దేశంలో ‘బతకలేక బడిపంతులు’ అనేది నానుడి. ఫిన్లాండ్‍లో మాత్రం ‘బతకాలంటే బడిపంతులే’ అనేది ఒరవడి. ఆ దేశంలో అత్యంత గౌరవప్రదమైన వృత్తుల్లో వైద్యుల తరువాత స్థానం ఉపాధ్యాయులదే. జీతాల విషయంలోనూ అదే వరస. టాలెంట్ ఉన్న టీచర్లను ఆ దేశం నెత్తిన పెట్టుకుంటుంది. తమ ఎదుగుదలకు ముఖ్య కారణం మంచి ఉపాధ్యాయులే అని ఆ దేశం బల్లగుద్ది మరీ చెబుతుంది. అందుకే ఫిన్లాండ్‍లో బోధన ఓ ‘స్టార్ ఉద్యోగం’. కుర్రాళ్లంతా టీచర్లుగా మారడానికి ఉవ్విళ్లూరతారు. యూనివర్సిటీలో చదువుకునే రోజుల నుంచే దాని కోసం కసరత్తు ప్రారంభిస్తారు. కానీ, ఆ ఉద్యోగం పొందడం అంత సులభం కాదు. ఓ ఆరు నెలలు పుస్తకాలు తిరగేసి, పరీక్ష రాసి టీచర్ అయిపోదామంటే అక్కడ కుదరదు. ఎలిమెంటరీ స్కూల్ టీచర్‍గా చేరాలంటే కనీసం మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సెకండరీ స్కూల్ టీచర్లకైతే పీహెచ్‍డీ తప్పనిసరి. ఏటా టీచర్ పోస్టులకు వచ్చే దరఖాస్తుల్లో కేవలం పది శాతమే తుది పరిశీలనకు ఎంపికవుతాయి. వాటిని జల్లెడ పడితే ఎక్కువ శాతం మంది వివిధ యూనివర్సిటీల టాపర్లే కనిపిస్తారు. ఉద్యోగ ప్రవేశ పరీక్ష ద్వారా వాళ్లలోంచి ఇంకొందరిని ఎంపిక చేస్తారు. ఆ తరువాత దశ ఇంటర్వ్యూలో అభ్యర్థుల వ్యక్తిత్వం, విజ్ఞానం, భావవ్యక్తీకరణ నైపుణ్యాలను అంచనా వేస్తారు. కేవలం జీతం కోసం కాకుండా బోధనపైన మక్కువతో ఆ వృత్తిలో అడుగుపెట్టే వారినే చివరికి ఎంపిక చేస్తారు. రెండు మూడు నెలల పాటు సాగే ఈ పక్రియ మన సివిల్ సర్వీసు అభ్యర్థుల ఎంపిక విధానానికి ఏమాత్రం తీసిపోదు. ఎంపికైన టీచర్లకు ఏడాది పాటు పిల్లలకు బోధించే విధానాలపైన శిక్షణ ఉంటుంది. అన్ని కఠినమైన దశలను దాటి వస్తారు కాబట్టే టీచర్లంటే అక్కడి వాళ్లకి అంత గౌరవం. పిల్లకు శిక్షణ ఇవ్వడం తప్ప శిక్షించే సంస్క•తి అక్కడి స్కూళ్లలో కనిపించదు. ఆ గురువులపైన అంత నమ్మకం ఉండబట్టే అక్కడ ‘పేరెంట్-టీచర్ సమావేశాలూ’ ఉండవు.
ఎంత తక్కువో అంత ఎక్కువ..
‘లెస్ ఈజ్ మోర్’ అనేది ఫిన్లాండ్ ప్రజల జీవన సూత్రం. అందుకే పసి మెదళ్లపైన గుదిబండలా మారే మార్కులూ, ర్యాంకులూ, గ్రేడ్ విధానాలూ, టాపర్లూ, మొద్దులూ అనే తారతమ్యాలూ, పేదాగొప్పా తేడాలూ, మంచి స్కూళ్లూ- చెడ్డ స్కూళ్లూ అన్న భేదాలూ, పల్లెలు – పట్టణాలూ అనే వ్యత్యాసాలూ అక్కడి వ్యవస్థలో లేవు. పిల్లలంతా ఒక్కటే. వాళ్లకు అందాల్సిన విద్యా ఒక్కటే అనే సిద్ధాంతాన్ని మనసావాచాకర్మణా ఆ దేశం అనుసరిస్తోంది. పాఠ్య పుస్తకాన్ని పిల్లల చేతిలో పెట్టడానికి ముందే వారి వ్యక్తిత్వాన్ని నిర్మించే పాఠాలకు అక్కడ పునాది పడుతోంది. మంచి విద్యార్థులనూ, మంచి పౌరులనూ దేశానికి అందించడానికి పిల్లల దృష్టిలో చెడ్డ తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా మిగలాల్సిన అవసరం లేదని ఫిన్లాండ్ నిరూపిస్తోంది.
అన్నింటా ఫైన్.. ఫిన్లాండ్!
ఆ మధ్య కనెక్టికట్ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక అక్షరాస్యత కలిగిన దేశాల్లో తొలి స్థానం ఫిన్లాండ్‍ది. చదువుతో పాటు చదువుకున్న వాళ్ల వ్యవహారశైలినీ పరిగణనలోకి తీసుకుని నిర్వహించిన నాగరిక దేశాల సర్వేలోనూ ఈ దేశానికే తొలి స్థానం దక్కింది.
• తరగతిలోని విద్యార్థుల మధ్య ప్రతిభ విషయంలో అతి తక్కువ వ్యత్యాసం ఉన్న దేశం ఫిన్లాండే. తెలివైన విద్యార్థుల కంటే, త్వరగా పాఠాలను అర్థం చేసుకోలేని పిల్లల దగ్గరే టీచర్లు ఎక్కువ సమయం గడపడం, సగటున పదిహేను మంది పిల్లలకు ఒకే టీచర్ ఉండటం దానికి కారణం. ప్రతిభ ఆధారంగా పిల్లల్ని వేర్వేరు సెక్షన్లలో కూర్చోబెట్టే పద్ధతి ఆ దేశంలోని విద్యావిధానంలో లేదు.
• ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ బోధనా గంటలు, స్కూళ్లకు ఎక్కువ సెలవులు ఉన్న దేశం కూడా ఫిన్లాండే. అక్కడ స్కూళ్లు గరిష్టంగా 180 రోజులు మాత్రమే పనిచేస్తాయి. భారత్‍లో దాదాపు 240 రోజుల పాటు స్కూళ్లు తెరిచి ఉంటాయి. అక్కడ సగటున ఒక ఉపాధ్యాయుడు ఏడాదికి 600 గంటల పాటు పాఠాలు చెబుతాడు. అదే మన దేశంలో ఆ సంఖ్య దాదాపు 1,700 గంటలు.
• భవిష్యత్తులో విద్యార్థుల వృత్తిగత జీవితంలో పెద్దగా ఉపయోగపడని జాగ్రఫీ, హిస్టరీలాంటి కొన్ని సబ్జెక్టులను సిలబస్ నుంచి తప్పించాలని ఇటీవల నిర్ణయించారు. వాటి స్థానంలో ప్రస్తుతం ట్రెండింగ్‍లో ఉన్న సాంకేతికత, సమకాలీన అంశాల గురించి బోధిస్తారు.
• ఫిన్లాండ్‍లో స్కూల్ సిలబస్‍ను తయారు చేసే బాధ్యత పూర్తిగా టీచర్లదే. వివిధ ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త పాఠ్యాంశాలను చేరుస్తూ, పాత వాటిని తొలగిస్తూ ఉంటాయి.
• ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో పిల్లల పుస్తకాలను ప్రచురించే దేశం ఫిన్లాండ్‍దే. ప్రతి సిటీ బస్సులో, రైల్లో ఓ పుస్తకాల స్టాండ్ కనిపిస్తుంది. విదేశీ కార్యక్రమాలను అనువదించకుండానే అక్కడి టీవీల్లో ప్రసారం చేస్తూ వాటి కింద సబ్‍టైటిళ్లు వేస్తారు. టీవీ చూస్తూనే పిల్లలు స్థానిక భాషను చదవడం నేర్చుకునేందుకే ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు.
• పదకొండేళ్లు వచ్చాకే ఫిన్లాండ్ పిల్లలకు ఇంగ్లిష్ పాఠాలు మొదలవుతాయి. అప్పటి దాకా బోధనంతా ఫిన్నిష్, స్వీడిష్ భాషల్లో సాగుతుంది. అక్కడ ఒక్కో విద్యార్థి సగటున నాలుగు భాషలు మాట్లాడగలడు.
• పోటీ పరీక్షలూ, కాలేజీలకు ప్రవేశ పరీక్షలూ, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లూ లేని దేశం ఫిన్లాండ్. హైస్కూల్ దశలోనే విద్యార్థులు తమ భవిష్యత్తును నిర్ణయించుకుని దానికి తగ్గ కోర్సులే చేస్తారు. ఆ విద్యార్థుల సంఖ్యకు సరిపడా వృత్తి విద్యా సీట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుంది.























































































Review ఆడుతూపాడుతూ.. చదవాలి..గెలవాలి!.