
రుతువుల్లో మొదటిది- వసంతం.
మాసాల్లో మొదటిది- చైత్రం.
పక్షాల్లో మొదటిది- శుక్ల పక్షం.
తిథుల్లో మొదటిది- పాడ్యమి.
మొదలు అంటే ఆది.
ఇన్ని ఆదులు కలిసే రోజు ఉగాది.
కాలగతిలో కొన్ని ఆలోచనలు ఆగిపోతాయి..
కొన్ని నడకలు అలసిపోతాయి..
కొన్ని ప్రయత్నాలు మధ్యలోనే విరమించుకుంటాయి..
ఇవన్నీ అందరి జీవితంలో ఉండేవే..
అలాంటి వాటన్నింటినీ మళ్లీ కదిలించాలి.
ఆగిపోయిన ఆలోచనలు, తీరని కలలు, నెరవేరని సంకల్పాలను మళ్లీ అరంభించడానికి అసలు సిసలు తరుణమిదే.
కలల బూజును దులిపేయాలి.
బద్ధకాన్ని గోడుకున్న కొక్కేనికి తగిలించాలి.
నిర్లక్ష్యాన్ని వీడాలి.
గమ్యం చేరని లక్ష్యాలపై మళ్లీ గురిపెట్టాలి.
నీరసపడిపోయిన నిర్ణయాలకు కొత్త ఉత్సాహాన్నివ్వాలి.
కలంలో కాలాన్ని నింపి పాత తీర్మానాలను తిరగరాయాలి.
ఒట్టి చేతులనే గట్టి ఆయుధాలుగా మలుచుకోవాలి.
మన లక్ష్యం మంచిదైనపుడు.. మన సంకల్పం గట్టిదైనపుడు కాలం ఓ చేయి వేసి సాయం చేయడానికి సదా సిద్ధంగానే
ఉంటుంది.
‘రాగల కాలం మేలు.. గతించిన కాలం కంటే’ అనే భావనతో ముందడుగు వేయాలి.
మనం సాధించబోయే విజయాలకు ఈ ఉగాది ఒక వేదిక కావాలి.
మరిచిపోలేని వేడుక కావాలి. అందుకు ఈ ఉగాదే నాంది పలకాలి.
మధురమైన కోయిల పాట.. లేతచిగుళ్లు.. రంగుల పూలు.. ఇవన్నీ కలిస్తే వసంతరాగం.
ప్రకృతిని శోభాయమానం చేసే వసంతం.. ఒక శుభ సందర్భం.
ఒక శుభ కామన.
అటువంటి వసంతం ప్రారంభమయ్యేది చైత్ర
శుద్ధ పాడ్యమి నాటి నుంచే.
అటువంటి వసంతానికి ప్రారంభ దినం కాబట్టే ఈ తొలి రోజు ఉగాది అయ్యింది.
కొత్త జీవితానికి, కొత్త ఆశలకు, కొత్త ఆలోచనలకు, కొత్త శుభ సంకల్పాలకు ఉగాది ఒక శుభ సూచిక.
మంచి ప్రారంభ వేదిక.
కాలగతిలో కొత్త విషయాలపై మోజు పెరుగుతుంది.
పాత వాటితో అనుబంధం పూర్తిగా తెగిపోదు.
ఈ పాత – కొత్తల కలయికే జీవితం.
అలాంటి పాత-కొత్త ఆశలకు ఉగాది కావాలి పునాది.
బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినదీ..
ప్రజానురకంజకంగా పాలించిన శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగినదీ..
వెయ్యేళ్ల పాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినదీ..
శకకారుడైన శాలివాహనుడు కిరీటధారణ చేసినదీ..
కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తిన పీఠాన్ని అధిరోహించినదీ..
ఇవన్నీ ఉగాది నాడే జరిగాయని చారిత్రక, పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి.
కొత్త కార్యాలను ప్రారంభించడానికి ఉగాదిని మించిన శుభ తరుణం లేదు.
ఉగాది అంటే నక్షత్రపు నడక అనే అర్థం కూడా ఉంది.
ఇది పూర్తిగా ప్రకృతి పండుగ.
నేలంతా పులకరించి, కొత్త చిగుళ్లు, పూలతో కళకళలాడే పండుగ.
భవిష్యత్తుపై ఆశలు పెంచి, కొత్త జీవితానికి ఊపిరిలూదే పండుగ.
ఈ పండుగను ‘సంవత్సరేష్ఠి’ అని కూడా అంటారు.
ఇష్ఠి అంటే క్రతువు అని అర్థం.
అన్ని లోకాలూ సుఖశాంతులతో ఉండాలనే శుభ సంకల్పంతో విశ్వవ్యాప్తమైన శుభకామన కలిగి ఉండటమే మన భారతీయ పర్వాల్లోని అంతరార్థం.
అదే ఉగాది ఈ లోకానికి ఇచ్చే సందేశం.
పండుగల ఆవిర్భావానికి ప్రధాన కారణం.. మనిషి సంఘజీవి కావడమే.
ఆ సంఘం సంతోషంగా ఉండాలనీ, ఆ సంతోషాలలో తానూ భాగస్వామి కావాలని కోరుకోవడం మనిషి నైజం కావాలి.
అలా సహృదయ భావంతో జరుపుకునే ఒక్కో పండుగకూ ఒక్కో ఆచారం ఉంటుంది.
వాటి వెనుక దైవారాధనతో పాటు అంతర్లీనంగా ఆరోగ్య సంరక్షణ కూడా ఉంటుంది.
అలాంటి పండుగల్లో మనకు అత్యంత ముఖ్యమైనది ఉగాది.
ఉగాది సంపూర్ణ వికాసానికి గుర్తు.
భూమిపై వసంతం వికసించిన తొలిరోజు ఉగాది.
వసంత మాసంలో ప్రకృతి అంతా కొత్త సంకేతాలను ఇస్తుంది.
మనిషి ఆశలు కూడా చిగురుల వంటివి.
అవి ఫలించాలి.. ఫలితాలనివ్వాలి.
అదే ఉగాది పర్వం చాటే శుభకామన.
మిగిలిన పండుగల కన్నా ఉగాది ఎంతో ప్రత్యేకమైనది.
సాధారణంగా పర్వదినాలన్నీ ఏదో ఒక దేవత లేదా దేవుడికి సంబంధించి ఉంటాయి.
ఉగాది ఇందుకు పూర్తి భిన్నం.
ఏ దేవుడి పేరూ ఈ పండుగ నాడు ప్రత్యేకంగా వినిపించదు.
ఎవరి ఇష్టదైవాన్ని వారు పూజించుకోవడమే.
ఉగాది కాలానికి సంకేతం.
మానవ జీవనానికి, కాలానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకునే ఆనంద వేళ ఉగాది.
కాలాన్ని గుణిస్తూ, మార్పులకు అనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలనే సందేశాన్ని ఉగాది పండుగ అందిస్తుంది.
సహనానికి, వ్యక్తిత్వ వికాసానికి, మనో వికాసానికి, ఆత్మవిశ్వాసానికి ఇది ఆలవాలంగా నిలుస్తుంది.
ఎల్లప్పుడూ మంగళ ధ్వనులు వినాలనే తపనకు ప్రతిరూపమే కోకిల కూత.
ఈ విధంగా ఉగాది మనిషి జీవనంలో కీలకంగా, మూలకంగా ఆవిర్భవించింది.
ఉగాది పర్వదినం పునరుజ్జీవనానికి సంకేతం.
అప్పటి వరకు మోడుబారిన చెట్లు, తీగెలు ఉగాది రాకతో మళ్లీ చిగురించి పూలు, కాయలతో కళకళలాడినట్టు కష్టనష్టాలతో కుంగిపోతున్న మనిషి జీవితం ధైర్యంతో, ఆశతో ముందుకు సాగాలనే సందేశాన్ని అందిస్తుంది.
కాలం, విష్ణువు.. ఈ రెండూ వ్యాపించే గుణం గలవే.
సర్వం కాలాధీనమే.
ఆ కాలం విష్ణువు ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తుంది.
కనుక సంవత్సరాది నాడు విష్ణువును కాలస్వరూపుడిగా భావించి పూజించాలి.
మనం ఉగాది నాడు పఠించే పంచాంగానికి అధిష్ఠాన దేవత శ్రీమన్నారాయణుడేనని అంటారు.
ఉగాది యుగయుగాలుగా వస్తున్న యుగాల వేడుక.
తరతరాలుగా వస్తున్న తరాల పండుగ.
సృష్టి ఆదిలోనే ఆరంభమైంది.
త్రేతాయుగ వాసులూ, ద్వాపర పౌరులూ ఈ ఉగాదిని ఘనంగా జరుపుకున్నారు.
ఇక, మన ప్రస్తుత కలియుగం విషయానికి వస్తే.. స్వార్థం ఆకలిగొన్న పులిలా గాండ్రిస్తోంది.
క్రోధం, విరోధం జనుల నరనరానా పేరుకుపోయాయి.
ఈ కలి ప్రభావాన్ని తట్టుకుని నిలిచేందుకు అవసరమైన మనోబలాన్ని అందించి.. విశ్వావసు నామ సంవత్సరంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుని మనల్ని మనం యోధులుగా తీర్చిదిద్దుకోవడానికి ఒక గొప్ప అవకాశం- ఈ విశ్వావసు నామ సంవత్సరాది.
ఆణిమాది సిద్ధులు సాధించిన మహా మేధావి ఉదంకుడు. ఒకసారి సందర్భవశాత్తూ ఉదంకుడు వ్యాస భగవాడుని ఆదేశం మేరకు ఒక ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఇద్దరు వ్యక్తులు నలుపు – తెలుపు దారాలను వడుకుతూ కనిపిస్తారు. వారిని దాటి కొంచెం ముందకు వెళ్లగా.. ఆరో ఆరుగురు వ్యక్తులు పన్నెండు ఆకులు గల చక్రాన్ని తిప్పుతుంటారు. వారంతా ఎవరు? ఏం చేస్తున్నారనేది ఉదంకుడు గ్రహించలేకపోతాడు. అంతలోనే ఆయనకు ఒక వేదమంత్రం గుర్తుకువస్తుంది. విరాట్ పురుషుని కాల వర్ణన మదిలో మెదులుతుంది. దానికి బట్టి తాను చూసిన ఆ వ్యక్తులు, వారు చేస్తున్న పనిని గురించి ఇలా గ్రహిస్తాడు. అదెలాగంటే..
మొదటి ఇద్దరూ విధి, విధాత.
వారు వడుకుతున్న నలుపు – తెలుపు దారాలు చీకటి వెలుగులకు ప్రతీకలు.
అలాగే, మరో ఆరుగురు వ్యక్తులు ఆరు రుతువులను ఉదంకుడు గ్రహిస్తాడు.
వారు తిప్పుతున్న ద్వాదశ పత్రాల చక్రమే పన్నెండు మాసాల కాలం.
ఇది మహాభారతంలోని ఒక కథ.
మార్పు కాల స్వభావం. ఆ మార్పును కాల పురుషుడి తీర్పుగా జనంలోకి తీసుకుని వెళ్లడమే యుగధర్మం.
త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం వరకైనా.. ద్వాపర నుంచి కలియుగం వరకైనా.. యుగానికి ఒకసారి పెనుమార్పు వస్తుంది.
ప్రభవ నుంచి అరవై సంవత్సరాల కాలచక్రం తిరిగి మళ్లీ ప్రభవ వరకు వచ్చే వరకు అరవై సంవత్సరాల కాలం.
ఈ అరవై ఏళ్లలోనూ వ్యవస్థలోనూ, వ్యక్తుల జీవితాల్లోనూ ఎన్నో పరిణామాలు, మరెన్నో మార్పులు సంభవిస్తాయి.
అందులో కొన్ని మార్పులు, కొన్ని పరిణామాలు సకారాత్మకమూ, కొన్ని నకారాత్మకమూ.
ఆ మంచిచెడులను ఆకళింపు చేసుకుని అడుగు ముందుకు వేయాల్సిన సమయంలో హెచ్చరికతో కూడిన శుభకామనలు అందిస్తుంది ఉగాది.
కృతయుగంలో ఉగాది..
ఒకసారి విధాత యోగనిద్రలో ఉన్నపుడు సోమకుడనే రాక్షసుడు నాలుగు వేదాలనూ దొంగిలించుకునిపోయాడట. వేదం అంటేనే జ్ఞానకాంతి. అటువంటి అమూల్య సంపద పడకూడని వాడి చేతిలో పడింది. ఇంకేముంది? జ్ఞానకాంతి లోపించడంతో లోకమంతటా అసురసంధ్య (చీకట్లు) వ్యాపించింది. దైవీశక్తులు తేజస్సును కోల్పోయాయి. మహర్షుల యజ్ఞయాగాదులకు విఘాతం ఏర్పడింది. అంతా కలసి విష్ణుమూర్తిని శరణువేడారు. సోమకుడి మత్సరం అణచేందుకు స్వామి మత్స్యావతారం ధరించాడు. రాక్షస సంహారం జరిగిపోయింది. నాలుగు కట్టల (వేదాలు నాలుగు: రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం)నూ బ్రహ్మదేవుడికి భద్రంగా అప్పగించాడు వేదనారాయణుడు. ఇక లోకానికి సంభవించిన విఘ్నాలన్నీ తొలగిపోయాయి. కార్తిక శుద్ధ నవమి నాడు చతుర్ముఖుడు ప్రళయానంతర సృష్టిని ఆరంభించాడు. అలా సత్యయుగానికి శ్రీకారం చుట్టాడు. చివరి వరకూ కార్తిక శుద్ధ నవమి తిథి రోజునే ఉగాదిని జరుపుకున్నారు కృతయుగ వాసులు.
త్రేతాయుగంలో రెండు ఉగాదులు..?
రామాయణ కాలం నాటికే ఉత్తరాయణం ఉత్తమ ఫలితాలను మోసుకుని వస్తుందనే నమ్మకం ప్రజలలో ఉండేది. కాబట్టే సూర్యుడు మకరరాశాలో ప్రవేశించే శుభ సమయాన్నే ఆ కాలంలో ఉగాదిగా నిర్ణయించారనే ఒక వాదన ఉంది. అంటే రామాయణ కాలంలో సంక్రాంతి సమయంలో ఉగాది వచ్చేదన్న మాట. అలాగే, మనం ప్రస్తుతం అక్షయ తృతీయగా చెప్పుకుంటున్న వైశాఖ శుద్ధ తదియ నాడు కూడా రామాయణ కాలంలో ఉగాది వేడుకలు జరిగేవనే అభిప్రాయమూ ఉంది. సందర్భం ఏదైనా పండుగ మాత్రం ఘనంగా చేసుకునే వారు త్రేతాయుగ కాలంలో.
ద్వాపరయుగంలో ఇలా..
ద్వాపర యుగ ప్రజలు మాఘ కృష్ణ అమావాస్య తిథిని యుగాదిగా భావించే వారని పండితులు అంటారు. సాక్షాత్తూ దేవదేవుడే ద్వారకాధీశుడై పాలన సాగించిన సమయం అది. మహాభారత యుద్ధం పూర్తయిన వెంటనే కలి ప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. కానీ, కృష్ణ భగవానుడు ఉన్నంత కాలం భూమీ మీద కాలు మోపే ధైర్యం చేయలేదు కల్కి.
ప్రస్తుత కలియుగంలో..
కృష్ణావతారం పరిసమాప్తి కావడంతో ద్వారక నగరం సముద్రంలో కలిసిపోయింది. దాంతో ద్వాపరయుగం ముగిసింది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు కలియుగం ప్రారంభమైంది. ఒక వంతు ధర్మం, మూడొంతుల అధర్మం.. కలియుగ నియమం. భౌతిక కాలుష్యాన్ని మించిన భావ కాలుష్యం రాజ్యమేలుతున్న సమయమిది. అహం నెత్తికెక్కుతోంది. ఇహం పట్ల వ్యామోహం మితిమీరుతోంది. ఇది పతనానికి ఆది. అంతానికి ఆరంభం. ఈ ఉత్పాతం నుంచి రక్షించగలిగేది ఉగాదే.
పంచాంగమే ప్రమాణంగా కలిని గెలిచే, ఘోరకలిని తట్టుకుని నిలిచే మార్గాన్ని ప్రబోధించే మార్గదర్శి- ఉగాది. ఇది దానధర్మాలను, ధార్మిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంది. అంతరంగ శుద్ధికి జపతపాలను సూచిస్తుంది. ఉగాది రోజున పాటించాల్సిన మూడు ముఖ్య నియమాల ఉద్దేశం కూడా అదే. అవేమిటంటే..
అభ్యంగన స్నానం: ఒంటికి పట్టిన మురికితో పాటు మనోకల్మషాన్నీ వదిలించుకోవడం.
నింబకుసుమ భక్షణం: వేప పువ్వులో కించిత్ చేదు ఉంటుంది. జీవితంలో తారసపడే అవరోధాలకు ఇది సూచన.
పంచాంగ శ్రవణం: పంచాంగం మనల్ని వేలు పట్టుకుని నడిపించే దైనందిని. ఏడాది కాలానికి దిక్సూచి. మరో ఉగాది వరకూ మనిషిని నిటారుగా నిలబెట్టే పునాది. ఆ మనోబలమే.. కలిపురుషుడి పరుషత్వాన్ని నిలువరించే ధైర్యం ఇస్తుంది. మనం మనలా బతికేందుకు భరోసా అందిస్తుంది.
ఒక్కో ఉగాదికి ఒక్కో స్వభావం
కలియుగం ఆరంభం నాటికి మనిషి ఆయుర్ధాయం నిండుగా నూట ఇరవై (120) సంవత్సరాలు. అంటే ప్రభవ నామ సంవత్సరంలో పుట్టిన వ్యక్తి మరో ప్రభవ నాటికి షష్టిపూర్తి చేసుకుంటాడు. అప్పటికే అన్ని బాధ్యతలూ తీరిపోయి ఉంటాయి. మిగిలిన అరవై సంవత్సరాలూ ఆధ్యాత్మిక చింతనలో గడపాలి. ఇది నియమం. మన సంవత్సరాల పేర్లు సైతం కాల స్వభావాన్ని తెలిపేవే.
ప్రభవ అంటే పుట్టుక. ఆరంభం.
విభవ అంటే వైభవం.
శుక్ల అంటే నిర్మలం.
ప్రమోదూత అంటే ఆనందానికి ప్రతీక.
అంగీరస అంటే వివిధ శరీర భాగాల్లోని ప్రాణశక్తి.
ఇలా ఒక్కో సంవత్సరం ఒక్కో స్వభావాన్ని తెలియచెబుతుంది.
ఇప్పుడు మనం క్రోధి నామ సంవత్సరం నుంచి విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం.
గడిచిన సంవత్సరంలో క్రోధాన్ని జయించామో లేదో కానీ.. అందరికీ ప్రయోజనం కలిగించే, అందరికీ శుభాలు కలగాలని ఆశీర్వదించే ‘విశ్వావసు’ నామ సంవత్సరంలోకి అడుగిడుతున్నాం.
క్రోధాన్ని గెలిస్తేనే శాంతి.
శాంతి కలిగి ఉంటేనే ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటాం.
అలాంటి ఆత్మవిశ్వాసాన్ని అందించేది- ఈ విశ్వావసు నామ సంవత్సరం.
ఉగాది నాడు ఎవరిని
పూజించాలి?
సంవత్సరాది నాడు ఉమామహేశ్వర గౌరీ వ్రతం ఆచరించాలనే సంప్రదాయం ఉంది.
మూడు కాలాలూ లోకాలనేలే మహేశ్వరుడికి త్రినేత్రాలు.
శివుడి ఇల్లాలు గౌరీదేవి సౌభాగ్య ప్రదాత.
ఉగాది వేళ ఆ ఆది దంపతులను పూజిస్తే దోషరాశి తొలగిపోతుందని విశ్వాసం. ఉమా మహేశ్వరులకు ఉగాది పచ్చడితో పాటు పంచభక్ష్య పరమాన్నాలనూ నైవేద్యంగా సమర్పిస్తారు. షోడశోపచారాలు చేస్తారు. ఆ తరువాత పంచాంగ శ్రవణం చేయాలి.
అన్ని వ్రతాల మాదిరిగానే ఈ ఉమా మహేశ్వర వ్రతం కూడా గణపతి పూజతో ప్రారంభమై, ఉద్వాసనతో పరిసమాప్తి అవుతుంది.
ఉమా మహేశ్వర పూజ సకల శుభ కారకమని పండితులు చెబుతారు.
ఎవరీ విశ్వావసు?
తెలుగు సంవత్సరాల వరుసలో 39వది విశ్వావసు (విశ్వవసు) నామ సంవత్సరం. 1905, 1965 తరువాత మళ్లీ అరవై ఏళ్లకు వచ్చిన సంవత్సరమిది. ‘విశ్వావసు’ నామ సంవత్సరంలో ధనం సమృద్ధిగా ఉంటుందని పంచాంగకర్తలు చెబుతున్నారు. ఇంతకీ ఈ సంవత్సరానికి ఈ పేరెలా వచ్చింది? ఈ విశ్వావసుడెవరు? తెలుసుకుందాం.
వేదాలు, పురాణాల్లో దాదాపు 23 చోట్ల విశ్వావసుడనే పేరు, ఆ పేరు గల వ్యక్తి ప్రస్తావనలు ఉన్నాయి.
• పురాణాల ప్రకారం విశ్వావసుడు ఒక గంధర్వరాజు. స్వర్గలోక గాయకుడు. ఇంద్రుడి రాజభవనంలో ఉంటూ.. ఆయనను గురించి కీర్తిస్తూ ఉంటాడు.
• మహా భారతంలోని ఆదిపర్వంలో విశ్వావసుడి ప్రస్తావన పలుమార్లు ఉంది. దాని ప్రకారం.. ఈయన తండ్రి కశ్యపుడు. తల్లి ప్రభ. స్వర్గలోక కన్య, అప్సరస అయిన మేనకతో సన్నిహితంగా ఉండేవాడు. ఫలితంగా వీరికో కుమారుడు (ప్రమద్వరుడు) కలిగాడు.
• ద్రౌపది స్వయంవరం, అర్జునుడి జన్మదిన సందర్భాల్లో కూడా విశ్వావసు పేరు వినిపిస్తుంది.
• ఈయన సోముడు (చంద్రుడు) నుంచి చాక్షుపివిద్య (అన్నింటినీ చూసే కళ) నేర్చుకున్నాడు. అదే విద్యను గంధర్వుడైన చిత్రరథుడికి నేర్పించాడని మహాభారతం ఆదిపర్వంలో ఉంది.
• ఇక, రామాయణంలోనూ విశ్వావసు అనే పాత్ర ఉంది. రామలక్ష్మణులను కబంధుడనే అసురుడు రామలక్ష్మణులను అడ్డగిస్తాడు. ఈ సందర్భంలో రాముడి ద్వారా శాపవిమోచనమై కబంధుడే విశ్వావసుగా రూపాంతరం చెందాడని అంటారు.
• ఇక, దిలీపు చక్రవర్తి ఒకసారి యాగం తలపెడితే ఆ సందర్భంగా విశ్వావసు అనే పాత్రధారి వీణ వాయించినట్టు చెబుతారు.
• యాజ్ఞవల్క్యుడిని విశ్వావసు ఓ సందర్భంగా ఇరవై నాలుగు ప్రశ్నలు అడిగినట్టు, వాటికి సంతృప్తికరమైన సమాధానాలు లభించిన మీదట తిరిగి స్వర్గానికి తిరిగి వెళ్లినట్టు మహాభారతం శాంతిపర్వంలో ఉంది.
• స్వర్గంలో ఉండే గంధర్వులకు ఈ విశ్వావసు అధిపతి అని శివపురాణం చెబుతోంది.
బృహత్‍సంహిత ప్రకారం విశ్వదేవుడికి పవిత్రమైన యుగం (ఐదు సంవత్సరాలు ఈయన యుగకాలంగా చెప్పబడింది)లో వచ్చే మొదటి సంవత్సరం- శోభకృత్. దీని తరువాత సంవత్సరం- శుభకృత్. మూడవది- క్రోధి. మిగిలిన రెండు సంవత్సరాలు- విశ్వావసు, పరాభవ. శోభకృత్, శుభకృత్ నామ సంవత్సరాల్లో మానవాళి సంతోషంగా ఉంటుంది. క్రోధి నామ సంవత్సరం (2024)లో ప్రజలు కోపిష్టులై, దు:ఖితులై ఉంటారు. విశ్వావసు నామ సంవత్సరం (ప్రస్తుత సంవత్సరం 2025)లో ప్రజలు సంతోషంగా కానీ, దు:ఖితులై కానీ ఉండరు. కానీ పరాభవ సంవత్సరం (వచ్చే ఏడాది, 2026)లో అగ్ని భయం, ఆయుధాలు, వ్యాధుల బాధ ఉంటుంది.
• వేద జ్యోతిష శాస్త్రంల విశ్వావసు ముప్పై తొమ్మిదవ సంవత్సరానికి అధిపతి. మన తెలుగు పంచాంగాల ప్రకారం కూడా తెలుగు నామ సంవత్సరాల్లో 39 సంవత్సరం విశ్వావసు పేరు మీదనే ఉంది.
• విశ్వావసు నామ సంవత్సరంలో పుట్టే పిల్లలు సద్గుణవంతుడవుతాడని, వీరికి మంచి భార్య, సంతానం కలుగుతారని వేద జ్యోతిషంలో ఉంది. ఉదారంగా ఉంటారనీ, అద్భుతమైన ప్రవర్తన కలిగి ఉంటారనీ, సహనం, ఓర్పు తదితర సుగుణాలతో ఉంటారనీ ఉంది.
• జాతక పారిజాతం అనే గ్రంథంలో పేర్కొన్న ప్రకారం విశ్వావసు నామ సంవత్సరంలో పుట్టిన వ్యక్తికి గౌరవం ఎక్కువగా లభిస్తుంది. హాస్యాన్ని ఇష్టపడతారు. నైతిక విలువలు కలిగి ఉంటారు.
అందరి ప్రయోజనాన్ని కోరేవాడు
అందరినీ ఆశీర్వదించే వాడు..
గుణాఢ్యుడి కథా సరిత్సాగరం 90వ అధ్యాయంలోని వేతాళ పాంచవింశతిలోని పదహారవ కథ ప్రకారం.. మలయ పర్వతం (మలయాద్రి) వద్ద నివసించే సిద్ధుల రాజు పేరు విశ్వావసుగా చెప్పబడింది. గంధపు చెట్లతో కూడిన ఒక లోయలో ఆశ్రయం ఏర్పాటు చేసుకున్న ఈయన అక్కడే తన తల్లిదండ్రుల కోసం వేచి ఉంటూ సమయాన్నంతా గడిపాడని రాశారు.
• హిందూ సంప్రదాయంలో విశ్వావసు గంధర్వుల రాజు. మేనక ద్వారా బిడ్డను కన్నాడు. అయితే వీరు ఆ శిశువును పెంచకుండా వదిలేశారు. స్థూల కేశ అనే రుషి ఆ శిశువును చేరదీసి, తన సొంత కుమార్తెగా పెంచి, చ్యవన మహర్షి మనవడు రురుకు ఇచ్చి వివాహం చేశాడని హిందూ పురాణాల ప్రకారం తెలుస్తోంది.
• జైన సంప్రదాయంలో కూడా విశ్వావసు పేరు వినిపిస్తుంది. జైనుల్లో శ్వేతాంబర, దిగంబర సంప్రదాయాలు ఉన్నాయి. శ్వేతాంబర సంప్రదాయవాదులు విశ్వావసు అనే పేరును విశ్వానికి ప్రతీకగా భావిస్తారు.
• జైన రామాయణం ప్రకారం వసువు యొక్క పది మంది కుమారులలో విశ్వావసు ఒకడు.
• బృహస్పతి 60 సంవత్సరాల చక్రంలో కూడా 39వ సంవత్సరంగా విశ్వావసును పేర్కొన్నారు.
• రుగ్వేదం, అధర్వణ వేదం, జ్యోతిషం తదితర భారతీయ ప్రాచీన సాహిత్యంలో విశ్వావసు అనే పాత్రధారి ప్రస్తావన చాలాచోట్ల వస్తుంది.
• మహాభారతం భీష్మపర్వంలో భగవానుడు భీష్ముడికి విష్ణు సహస్ర నామ శ్లోకాలను, ఆ శ్లోకంలోని పదాలకు అర్థాలను వివరించే సందర్భం ఉంటుంది. అలాంటి పదాల్లో ‘విశ్వావసు’ అనే పదం కూడా వస్తుంది. ఇక్కడ ఈ పదానికి అందరికీ ప్రయోజనం కలిగించేదనే అర్థమిచ్చారు. అలాగే, అందరినీ ఆశీర్వదించే వాడనే అర్థం కూడా ఉంది.
• రుగ్వేదంలోని ఒక శ్లోకాన్ని విశ్వావసు అనే ఆయన రచించినట్టు చెబుతారు.
• మోనియర్-విలియమ్స్ సంస్క•త – ఆంగ్ల నిఘంటువులో విశ్వావసు అనే పదానికి ‘అందరి సంపద’ అనే అర్థాన్ని చూపారు.
• అమరసింహ, హలాయుధ, హేమచంద్ర తదితర గ్రంథాలలో ‘విశ్వావసు’ అనే పదాన్ని ‘రాత్రి’కి సంకేతంగా వాడారని తెలుస్తోంది.
కాల పట్టిక
సంవత్సరం:
పన్నెండు నెలల కాలాన్ని సంవత్సరం అంటారు. మనకు మొత్తం అరవై సంవత్సరాలు. మొదటిది ప్రభవ. చివరిది అక్షయ నామ సంవత్సరం. ఈ వరుసలో ప్రస్తుతం సంవత్సరవం విశ్వావసు నామసంవత్సరం. ఇది తెలుగు సంవత్సరాల కాలచక్రంలో ముప్పై తొమ్మిదవ సంవత్సరం.
ఆయనం:
ఆరు నెలల కాలాన్ని ఆయనం అంటారు. మనకు సంవత్సరంలో మొత్తం రెండు ఆయనాలు వస్తాయి. ఉత్తరాయణం, దక్షిణాయనం. జనవరి నుంచి జూన్ వరకు ఉత్తరాయణ కాలం. దేవతలకు ఇష్టమైన కాలంగా చెప్పే ఈ ఆయనాన్ని పుణ్యకాలంగా పరిగణిస్తారు. జూలై నుంచి డిసెంబర్ వరకు దక్షిణాయనం. దీనినే ఖగోళ శాస్త్రం ప్రకారం- ప్రతి సంవత్సరం జనవరి 15 నుంచి జూలై 15 వరకు ఉత్తరాయణంగానూ, జూలై 16 నుంచి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని దక్షిణాయనం అనీ లెక్కగడతారు.
మాసం (నెల):
ముప్పై రోజుల కాలాన్ని నెల (మాసం) అంటారు. మనకు సంవత్సరంలో మొత్తం పన్నెండు (12) నెలలు. అవి- చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం.
రుతువు:
ప్రతి రెండు నెలల కాలానికి ‘రుతువు’ అని పేరు. మనకు సంవత్సరంలో మొత్తం ఆరు రుతువులు వస్తాయి. అవి- వసంతం (చైత్రం, వైశాఖం. ఈ కాలంలో చెట్లు చిగురించి పూలు పూస్తాయి), గ్రీష్మం (జ్యేష్ఠం, ఆషాఢ మాసాలు కలిపి గ్రీష్మ రుతువు. ఎండలు మెండుగా ఉంటాయి), వర్ష రుతువు (శ్రావణం, భాద్రపదం: వర్షాలు పుష్కలంగా కురుస్తాయి), శరదృతువు (ఆశ్వయుజం, కార్తీకం: వెన్నెల పిండారబోసినట్టు కాంతివంతంగా ఉంటుంది) , హేమంతం (మార్గశిర, పుష్య మాసాలు: మంచు బాగా కురుస్తుంది. చలిగా ఉంటుంది), శిశిరం (మాఘ, ఫాల్గుణ మాసాలు: చెట్లు ఆకులు రాలుస్తాయి).
పక్షం:
ప్రతి పదిహేను రోజుల కాలాన్ని పక్షం అంటారు. నెలకు రెండు పక్షాలు. అవి- శుక్ల (శుద్ధ) పక్షం, కృష్ణ (బహుళ) పక్షం.
తిథి:
ఇరవై నాలుగు గంటల సమయాన్ని తిథి అంటారు. పక్షానికి పదిహేను తిథులు. పాడ్యమి నుంచి పౌర్ణమి లేదా అమావాస్య వరకు..
ఆరు రుచులూ..
ఆరు అనుభవాలూ..
షడ్రుచుల సమాహారంగా ఉగాది నాడు తయారు చేసే నైవేద్యపు వంటకాన్నే ఉగాది పచ్చడి అనీ అంటారు. దీనికి ఆరంటే ఆరే దినుసులు వాడాలి. రుచి కోసమో, అలంకరణ కోసమో అదనపు పదార్థాలు జోడించడం సరికాదు. అదీ, పరమాత్మకు నివేదించిన తరువాతే స్వీకరించాలి. పచ్చడిలోని ప్రతి దినుసులో ఆరోగ్య ఫలమూ, వికాస సూత్రమూ ఇమిడి ఉన్నాయి.
తీపి:
తీపి ఆనందానికి ప్రతీక. ఆశావాదానికి సంకేతం. ఆయుర్వేదం ప్రకారం.. వాత, పిత్త, కఫం అనే త్రిదోషాలను సవరించే శక్తి బెల్లానికి ఉంది.
పులుపు:
చిత పులుసులోని పులుపు రాబోయే అవరోధాలకు ప్రతీక. వాటిని లౌక్యంతో ఎదుర్కోవాలనే ధైర్యాన్ని ఇస్తుంది. ఆరోగ్య శాస్త్రం ప్రకారం పులుపు జీర్ణశక్తిని పెంచుతుంది. ఆ మోతాదు పెరిగితే వికటిస్తుంది కూడా.
ఉప్పు-కారం:
మనలోని అతర్లీన శక్తిని గుర్తు చేసే రెండు రుచులివి. ఉపూ• కారం తగ్గితే వంటలో రుచి పోతుంది. పొరపాటున పెరిగితే నాలుక మండుతుంది. మధ్యస్థమైన ఆహారాన్నే మన పొట్ట హరాయించుకోగలదు. జీవితంలోనూ ఇలాంటి సమతౌల్యం అవసరం.
చేదు:
భోజనంలో అయినా, జీవితంలో అయినా అనివార్యమైనది- చేదు. అయిష్టంగానైనా దీనిని ఆమోదించాల్సిందే. గుండెదిటవు చేసుకుని స్వీకరించాల్సిందే. చేదు అనుభవంలో ఓ పాఠం ఉంటుంది. వేప పూవులోని చేదులో అపారమైన ఔషధ గుణం ఉంది.
వగరు:
వసంతం అందించే పసందైన పంట- మామిడి. వగరు ఆశ్చర్యానికి బండగుర్తు. జీవితం నిబిడాశ్చర్యాల సమాహారమని గుర్తు చేస్తుందీ రుచి. వగరు ఎంతో కొంత ఆరోగ్యకరం కూడా. దీనికి గాయాలను మాన్పే గుణం ఉందని కూడా అంటారు.
Review ఆత్మ‘విశ్వా(వ)స’ నామ సంవత్సరం.