ఆనందం నిండుగా… సంక్రాంతి పండు

వచ్చిందయా వచ్చింది – ఉల్లాసంగా సంక్రాంతి
తెచ్చిందయ్యా తెచ్చింది – తెలుగు వాకిట సుఖశాంతి
గణగణ గంటల నాదంతో – గలగల గజ్జెల రావంతో
కిలకిల కిలకిల నవ్వులతో – గరిసెలు నిండగా రాసులతో
డూడూ డూడూ వెంకన్నా – గంగిరెద్దుల బసవన్నా
తూతూ తూతూ పాటలతో – కిన్నెర సన్నాయి పాటలతో..
మన జీవితాల్లో ఆధునిక నాగరికత ప్రభావంతో అధునాతన జీవన విధానాలు చోటుచేసుకుంటున్నా.. ఈ కారణంగా మన తెలుగింటి సంప్రదాయాలు కొన్ని కనుమరుగైపోతున్నా.. సంక్రాంతి శోభ మాత్రం మన పట్టుగొమ్మలైన పల్లెలను ఇంకా అంటిపెట్టుకునే ఉంది.
మన జీవితాల్లో, ముఖ్యంగా మన తెలుగు వారి సంప్రదాయాల్లో సంక్రాంతిది విశిష్ట స్థానం.
సంక్రాంతి అంటే ప్రకృతితో మమేకమైన భారతీయ జీవితానికి ప్రతీక..
మట్టి మనుషుల (రైతుల) జీవితాల్లో ఉషస్సులు నింపే సంబరాలకు వేదిక..

బతుకుబాటలో మనతో కలిసి నడిచే మూగజీవులకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకునేందుకు ఇదో సందర్భోచితమైన వేడుక..
సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగు పల్లెల అందమే వేరుగా ఉంటుంది.
నేలంతా రంగవల్లుల, విరిజల్లుల హరివిల్లు పరుచుకుంటుంది.
మూడు రోజుల పండుగతో అందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నిండుతాయి. జీవన విధానాల్లో చోటుచేసుకున్న మార్పులతో నాటి ఉమ్మడి కుటుంబాలు వేరుపడ్డాయి.
బతుకుదెరువుకు తలోచోటుకు వెళ్లడం తప్పనిసరైంది.
ఉద్యోగాలు, చదువులు, ఇతరత్రా పనుల నిమిత్తం పల్లె జనం నగరాలకు, పట్టణాలకు మకాం మార్చింది.
అటువంటి కుటుంబాలన్నీ చలో పల్లె‘టూరు’కు క్యూ కట్టేది సంక్రాంతి సందర్భంగానే..
ఇలా చేరిన అందరితో సంక్రాంతికి పల్లెల్లో సందడి అంబరాన్ని తాకుతుంది. ఏ పండుగ పరమార్థమైనా.. మనిషికి సుఖసంతోషాలను చేకూర్చడమే అంతరార్థమై ఉంటుంది. అటువంటి ఆనందాలను, సంతోషాలను నిండుగా అందించే పండుగ సంక్రాంతి.
భోగి మంటల వెలుగులు, పెద్ద పండుగ దీవెనలు,
ముక్కనుమ సంబరాలు అందరి జీవితాల్లో
సంక్రాంతులు పూయించాలని కోరుకుంటూ.

Review ఆనందం నిండుగా… సంక్రాంతి పండు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top