దైవ కార్యాలకు పునాదులు ఎలా పడతాయో, అసలు దైవికమైన ఆలోచనలు ఎలా కలుగుతాయో ఎవరూ చెప్పలేరు. అది ఆ భగవంతునికే ఎరుక. దేవుడే తన కార్యాలను కొందరు భక్తులను సాధనగా చేసుకుని వాటిని నిర్వర్తింప చేసుకుంటాడు. అటువంటిదే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అట్లాంటాలో గల హిందూ టెంపుల్ నేపథ్యం. ‘హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా’గా విశ్వ ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ ఎలా జరిగింది? ఆ దైవిక ఆలోచన కొందరు పుణ్య భక్తులకు ఎలా కలిగింది?.. ఈ విశేషాలన్నీ ఆసక్తి కలిగించేవే. ‘హిందూ టెంపుల్ అట్లాంటా’ ఆలోచన
1970లలో నాటి మాట.. డాక్టర్ వానపల్లి ఎం.రాజు సన్నిహిత మిత్రులు మోహన్, ఉపాధ్యాయ, సుబ్రహ్మణ్యంరెడ్డి, శైలేంద్ర పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఉండగా హఠాత్తుగా వాళ్ల సంభాషణ అట్లాంటాలో ఏదైనా బృహత్తర ప్రాజెక్టు చేపట్టాలనే విషయంపైకి మళ్లింది. కానీ, ఆ చర్చ అక్కడితో ఆగిపోయింది. ఆ తరువాత దాదాపు పన్నెండు సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత 1982లో డాక్టర్ రాజు ఎం. వానపల్లి నివాసంలో మిత్రులందరూ కలిశారు. ఎవరి అభిప్రాయాన్ని వారు వెలి బుచ్చారు. సర్వేశ్వర్ నాయుడు, ఐజే రెడ్డి, సుబ్రహ్మణ్యం నాయుడు, డాక్టర్ వానపల్లి చేపట్టబోయే బృహత్తర కార్యం ఎలా ఉండాలో విపులంగా చర్చించాలని నిర్ణ యించారు. ఆ తరువాత వారమే ఆ గొప్ప ప్రాజెక్టు ఎలా ఉండాలో మిత్రులందరూ ఒక ఆలోచనకు వచ్చారు.
ఆ బృహత్తర ప్రాజెక్టు ఏమై ఉండాలి? ఎలా ఉండాలి? ఏదైతే బాగుంటుంది?.. దీనిపై ఎడతెగని చర్చ జరిగింది. ఎవరి ఆలోచన లకూ అంతూదరీ లేదు. ఎవరి ఆలోచనలకు వారు రూపమిచ్చే ప్రయత్నం చేశారు నాటి చర్చలో. అంతలో కొందరు మిత్రులు ‘దేవాలయం అయితే ఎలా ఉంటుంది?’ అన్నారు. ‘ఎందుకు కాకూడదు?’ అనేది మిగతా అందరి ప్రశ్న అయ్యింది. అలా దేవాలయానికి హృదయం లోనే బీజం పడింది. వెంటనే అట్లాంటాలో గొప్ప ఆలయ ఆలోచనను మిగతా వారితో పంచుకున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని భారతీయ మిత్రులంతా ఇందుకు సానుకూలంగా స్పందించారు. ఇలా అన్ని వైపుల నుంచి దేవాలయ నిర్మాణానికి అను కూలంగా స్పందన వెల్లువెత్తడంతో ఆదిలో ఈ ఆలోచన చేసిన డాక్టర్ వానపల్లి తదితరులు ఆశ్చర్యానందాలకు గురయ్యారు. వెంటనే అరుణ ప్రసాద్, రాఘవరెడ్డి, ద్రోణవల్లి, మణి, కులకర్ణి, పాల్ఘాట్ మోహన్, కుప్పస్వామి తదితరులతో బోర్డు ఒకటి ఏర్పాటైంది.
ప్రస్తుతం దేవాలయం ఉన్న ప్రాంతం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని బోర్డు సభ్యులు నిర్ణయించారు. ప్రధాన రహదారికి సమీపంలో ఉండటం, అక్కడకు మిగతా అన్ని ప్రాంతాల నుంచి సులభమైన రవాణా సౌలభ్యం ఉండటంతో అదే దేవాలయ నిర్మాణానికి సరైన ప్రదేశమని నిర్ధారించారు. అలాగే, హిందు వుల కోసం చుట్టుపక్కల ఎక్కడా సరైన ఆలయం లేకపోవడంతో ఇక ఆలయం నిర్మాణానికి బీజం పడింది. ఇండియన్ కమ్యూనిటీకి ఒక దేవాలయం ఉండాలనే ఆవశ్యకతను గుర్తించిన, ఆధ్యాత్మిక భావాలు కలిగిన క్లేటన్ కౌంటీ కమిషన్ హానరబుల్ చార్లెస్ గ్రిస్‍వెల్, అతని బృందంలోని కౌంటీ కమిషనర్లుకు డాక్టర్ వానపల్లి బృందం కృతజ్ఞతలు తెలిపింది. దేవాలయ నిర్మాణానికి ప్రోత్సాహాన్ని అందించింది.
దేవాలయం నిర్మాణానికి ఉద్దేశించిన స్థలం అన్నీ ఆలయ నిర్మాణకర్తల చేతిలోకి వచ్చిన అనంతరం సుబ్రహ్మణ్యరెడ్డి మద్రాసు (నేటి చెన్నై)కు చెందిన స్తపతి ముత్తయ్యను సంప్రదించారు. ఆలయ నిర్మాణం ఎలా ఉండాలో ముత్తయ్య ఒక అంచనాకు వచ్చారు. డాక్టర్ వానపల్లి మిత్రబృందానికి చిరకాల మిత్రుడైన డాక్టర్ నార్మన్ అలెన్.. ఆలయ నిర్మాణానికి అవసరమైన ఆర్కిటెక్ట్ సేవలు అందించేందుకు, అందుకు సాధారణ ఫీజును మాత్రమే వసూలు చేసేందుకు అంగీకరించారు. కొన్ని గంటల వ్యవధిలోని నిర్మాణ శైలికి ఆయన అంచనా రూపమిచ్చారు.
ఆలయ నిర్మాణానికి అందరూ నడుం బిగించగానే.. ఈ విషయం తెలిసిన ఎందరో, భావసారూప్యం కలిగిన మిత్రులు ఆర్థికంగా అండదండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి ఏర్పాటైన బృందంలో సభ్యుల సంఖ్య లెక్కలేనంతగా పెరిగిపోయింది. అందరూ ఎవరికి వారే తమ వంతు సాయం చేయడంతో పాటు ఆలయ నిర్మాణంలో ఉత్సాహంగా పాలుపంచు కున్నారు. మరెందరో కల సాకారం కావడానికి మార్గదర్శనం చేశారు. చివరి వరకు అందరూ ఏకత్రాటిపై నిలిచేందుకు, కలిసికట్టుగా ముందుకు సాగేందుకు ఎస్‍పీ రెడ్డి తదితరులు ఎందరో చేసిన కృషి ఎనలేనిది.
నాడు ఆలయ నిర్మాణానికి తలచిన వారితో పాటు తరువాత కాలంలో ఆలయ నిర్మాణంలో అందరూ పాలుపంచుకుని తలో ఇటుక వేశారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన నీటిని పొరుగున ఉండే జాన్ ముండే అందించడం మరిచిపోలేని విషయం.
సముద్రాలు ఎన్నో ప్రాంతాలను కలుపు తాయి. జీవితం ఎప్పుడూ కొత్త కొత్త విషయాలను ఆలోచిస్తూనే ఉంటుంది. కొత్త దారుల కోసం అన్వేషిస్తూనే ఉంటుంది. అదీ దేశం కాని దేశం వచ్చిన వారు ఏదో మిస్ అయిన భావనతో గడుపుతారు. అటువంటి లోటు తీర్చేందుకేనేమో బృహత్ కార్యాలను తలపెట్టే యోచనను అందిస్తాడు భగవంతుడు. అలా రూపుదిద్దుకున్నదే ‘హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా’. ఇది కేవలం నిత్య పూజాధికాలు నిర్వహించే దైవిక స్థలం మాత్రమే కాదు. ఇది అమెరికాలో స్థిరపడాలని వచ్చే ప్రతి భావి భారత పౌరునికి దక్కిన అపురూప ఆధ్యాత్మిక కానుక.
హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా వ్యవస్థాపక బోర్డు సభ్యుడైన బీకే మోహన్, డాక్టర్ వానపల్లి తదితరులు ఒకసారి నాష్‍విల్లేలోని సత్యనారాయణ స్వామి వ్రత పూజకు హాజరయ్యారు. సింగిల్ బెడ్‍రూం అపార్ట్మెంటులో వారు ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆ చిన్న ప్రదేశంలోని ఆలయాన్ని చూసి వచ్చిన తరువాత బీకే మోహన్, డాక్టర్ వానపల్లితో పాటు తోటి మిత్రులైన ఎస్‍పీ రెడ్డి, ఐజే రెడ్డి, ఎస్‍కే నాయుడు, హరి ఉపాధ్యాయ, ఎస్‍ఐ నాయుడు, శైలేంద్ర తదితరులంతా తమ భవిష్యత్తు తరాల కోసం ఒక ఆలయాన్ని నిర్మించాలనే ఆలోచనకు వచ్చారు. మిత్ర బృందంలోని ఒక్కొక్కరు కనీసం పది వేల రూపాయల చొప్పున వెచ్చిస్తే (మొత్తం పదిహేను మంది) ఆలయం రూపుదిద్దు కుంటుందనే అంచనాకు వచ్చారు. ఆలయ నిర్మాణంపై చర్చించారు. అనేక సమావేశాలు, చర్చల అనంతరం డాక్టర్ వానపల్లి గృహంలో ప్రధాన సమావేశాన్ని నిర్వహించారు. ఆలయ నిర్మాణ ప్రసక్తి రాగానే మోహన్, హరి ఉపాధ్యాయ సౌత్‍లేక్ సమీపంలో గల రెండు ఎకరాల స్థలాన్ని దానంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే ఇంకో ఐదారు ప్రదేశాలను కూడా ఆలయ నిర్మాణం నిమిత్తం పరిశీలించారు. ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశాన్ని పదిహేను మంది ట్రస్టీ సభ్యులు జెవెల్ పి.క్విన్ అనే మహిళ నుంచి కొనుగోలు చేశారు. అక్టోబరు 1986లో ఈ స్థలం దేవాలయానికి దానం చేశారు. దీనికి అనేక పన్ను మినహాయింపులు లభించాయి.
పదిహేను మంది ట్రస్టీలు పలుమార్లు క్లేటన్ కౌంటీ జోన్‍కు వెళ్లి, అక్కడి స్థానికులతో సమావేశమయ్యారు. అక్కడి స్థానిక ప్రజలకు హిందూ దేవాలయ నిర్మాణ ఆవశ్యతను వివరించారు. ఈ విషయంలో శైలేంద్ర చేసిన కృషి ఎనలేనిది. ఆయనకు స్థానికులతో ఉన్న సత్సంబంధాలు ఇందుకు ఉపకరించాయి. ఆలయ నిర్మాణానికి అన్నీ సమకూరాయి.. ఒక్క డబ్బు తప్ప. దీనిని ఎలా సమకూర్చు కోవాలనే ఆలోచన నేపథ్యంలో ఎస్‍పీ రెడ్డి, డాక్టర్ వానపల్లి అమెరికాలోని అనేక ప్రాంతాల్లో పర్యటించారు. దేవాలయ నిర్మాణం గురించి తెలిపి నిధులు సమీకరించారు. ట్రస్టీల గ్యారంటీతో బ్యాంకు నుంచి కొంత రుణం తీసుకున్నారు. చివరకు 1986, జూన్ 22న హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటాకు స్వామి జ్మోతిర్మర్మయానంద జీ, జానకిరామ శాస్త్రిల మార్గదర్శకత్వంలో భూమిపూజ జరిగింది. 1989, మార్చిలో హాలెస్టిన్ కన్‍స్ట్రక్షన్ కంపెనీ, చావోట్ కన్‍స్ట్రక్షన్ కంపెనీల ఆధ్వర్యంలో దేవాలయ నిర్మాణం పూర్తయ్యింది. చికాగోకు చెందిన ఆర్కిటెక్ట్ సుభాష్ నాదకర్ణి, అట్లాంటాకు చెందిన ఇంజనీరింగ్ కన్సల్టెంట్, ఎస్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్, సెసిల్ చాన్, స్ట్రక్చరల్ ఇంజనీర్ తది తరుల సహాయంతో ఆలయ నిర్మాణ ప్రణాళిక రూపుదిద్దుకుంది. ఎస్‍పీ రెడ్డి గణేష్ విగ్రహాన్ని చెన్నై నుంచి తీసుకు వచ్చారు. డిసెంబరు 1, 1990.. హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా దేవాలయ నిర్మాణ చరిత్రలో మరుపురాని రోజు. ఆ రోజే గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం దేవా లయం నాటి నుంచి ఆధ్యాత్మికానందాన్ని ఎంద రికో పంచుతోంది. మద్రాసుకు చెందిన స్తపతి ముత్తయ్య సహకారంలో బాలాజీ, మహా లక్ష్మి, భూదేవి విగ్రహాలు ప్రతిష్ఠితమయ్యాయి. దుర్గాదేవి మార్బుల్ విగ్రహం జైపూర్ నుంచి తెప్పిం చారు. 1991, దసరా నాడు దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1992 మే నెల నుంచి దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలను నియమంగా సమర్పించేలా, ఇతర పూజాధి కాలకు నిర్ణయం జరిగింది. రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామచంద్రన్, డైరెక్టర్ ఆఫ్ హిందూ టెంపుల్ సొసైటీ ఆప్ నార్త్ అమెరికా ఆనందమోహన్ దేవాలయ ప్రతిష్ఠ మహోత్స వాలకు సహకరించారు. అలాగే, న్యూయార్క్ గణేశ్ టెంపుల్‍కు చెందిన డాక్టర్ ఉమా మైసోరేకర్, నాష్‍విల్లే టెంపుల్‍కు చెందిన డాక్టర్ సోమయాజి, డాక్టర్ హిరణ్యగౌడ కూడా తమవంతు సహాయ సహకారాలను అందించారు. అలాగే, ఆలయం ప్రారంభమైన నలభై రోజులకు చినజీయర్ స్వామి చేతుల మీదుగా పవిత్రీకరణ యంత్రాలను ప్రతి ష్ఠించడం జరిగింది. 1992, మే 19 నుంచి 25 వరకు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆగమ నియమాల ప్రకారం విగ్రహాల ప్రతిష్ఠ కనులపండువగా జరిగింది. విశ్వ నియంత్రణ శక్తిని ప్రసాదించే, శాస్త్రాలు నిర్దేశించిన అధివాసాస్ (జలాధి వాసం, ధాన్యాధివాసం, రత్నాధివాసం, సయ్యాధి వాసం, పుష్పాదివాసం, ఛాయాధి వాసం) ప్రతిష్ఠలు దిగ్విజయంగా నిర్వ హించారు.
1993, మేలో హనుమాన్, నవగ్రహ, ఇతర ఉత్సవ విగ్రహాలను హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటాలో ప్రతిష్ఠించారు. ఇందుకోసం ఆలయ శిల్పులను అట్లాంటాకు రప్పించే విషయంలో డైరెక్టర్ ఆఫ్ ఇమిగ్రేషన్ టామ్ ఫిశ్చర్ ఎంతగానో సహకరించారు. ఆలయ స్తపతి, శిల్పకళామణి, శిల్పరత్నాకర, పద్మశ్రీ ముత్తయ్య గారి రూపకల్పనలో అప్పటికి ఆలయం ఒక రూపుదాల్చింది. ఆయన రూపొందించిన ఆలయ బృహత్ ప్రణాళిక ఈ దేవాలయాన్ని అమెరికాలోనే సాటి లేని మేటిగా నిలబెట్టింది. ఈ ఆలయం పూర్తిగా వేల ఏళ్ల క్రితం నాటి పల్లవ, చోళ రాజుల కాలం నాటి శిల్పకళను పోలి ఉంటుంది.
మరీచ సంహిత, వైఖాశన ఆగమ నియ మాల ప్రకారం, నిబంధనలను అనుసరించి హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా నిర్మాణానికి రూపకల్పన చేసినట్టు స్తపతి ముత్తయ్య చెబుతారు. ఈ ఆలయ నిర్మాణ శైలి ఆంధప్రదేశ్‍లోని తిరుమల తిరుపతి దేవస్థానం శైలిని పోలి ఉంటుంది. ఇందుకోసం పదకొండు మంది శిల్పులు రెండున్నర సంవత్సరాల పాటు అహరహం శ్రమించారు. విజయ్‍కుమార్ ఆధ్వర్యంలో ఎందరో వలంటీర్లు ఈ ఆలయ నిర్మాణంలో తమ వంతు రాళ్లెత్తారు. ఎందరెందరి సంకల్పంతోనో చివరకు 1996 నాటికి ఈ ఆలయం భారత జాతీయతను సంతరించుకుంది.
ఆలయ ప్రాంగణాలు దక్షిణ భారతదేశం లోని పలు ఆలయాల నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. చినజీయర్ స్వామి పర్యవేక్షణలో మే, 1996లో కుంభాభిషేకం, మహా కుంభాభి షేకం వైభవోపేతంగా నిర్వహించారు. మొత్తం ఆలయ చరిత్రలోనే ఇది అత్యంత నేత్రపర్వమైన వేడుక. కుంభాభిషేకం నిర్వహించే రాత్రికి ముందు ఉరుములు.. మహా కుంభాభిషేకం నిర్వహణ సమయంలో దట్టంగా అలముకున్న మేఘాలు.. నాటి ఆధ్యాత్మిక ఘట్టానికి సాక్ష్యా లుగా చెరిగిపోకుండా నిలిచాయి. అభిషేకానికి వరుణదేవుడు హాజరయ్యా డని చాటేందుకు ఈ నిదర్శనాలే సాక్ష్యాలని స్వామీజీ నుడివారు. నాగప్రతిష్ఠి కూడా ఇదే సమయంలో నిర్విఘ్నంగా సాగింది.
మహా కుంభాభిషేకం అనంతరం ఆలయ ప్రాంగణంలో పూజారులు, ఇతర సిబ్బంది కోసం క్వార్టర్స్ నిర్మాణాన్ని చేపట్టారు. ఇది మైక్ డేవిస్ ఆధ్వర్యంలో జరిగింది. 2000 సంవత్సరం జనవరిలో శిల్పి కృష్ణమూర్తి నేతృత్వంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన జరిగింది. ధ్వజ స్తంభానికి అవసరమైన మేటైన వృక్షం కోసం •స్ట్రీల బృందం ఎన్నో సామిల్లులు, అడవులలో అన్వేషించింది. శిల్పి కృష్ణమూర్తి ధ్వజస్తంభానికి ఒక రూపాన్ని ఇవ్వగా, మార్చి 12, 2000 సంవత్సరంలో ప్రతిష్ఠించారు. ధ్వజారోహణ, నిత్య ప్రాకార ఉత్సవం, రథోత్సవం వంటి ఉత్సవాలను ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఆలయానికి వచ్చే భక్తుల కోరిక మేరకు 2001లో శివాలయాన్ని సైతం అట్లాంటా హిందూ టెంపుల్ ఆవరణలో నిర్మించారు. ఇందులో మహా రుద్రం, సంకల్పం వంటివి నిర్వహించారు.
2001లో ఆరు ఎకరాల స్థలాన్ని డాక్టర్ కష్లాన్ నుంచి కొనుగోలు చేయగా, శివా లయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం 2003, మే నెలలో నిర్వ హించారు.
అలాగే, 2003 అక్టోబరులో ఎడ్యుకేషన్ బిల్డింగ్, బాంకెట్ హాలును నిర్మించారు.
గీతా రఘు, డాక్టర్ రఘు, సుందరేశన్, శ్రీమతి అను నాథన్ ఆధ్వర్యంలో ‘బాలవిహార్’ రూపుదిద్దుకుంది. ఇందులో ఔత్సాహిక చిన్నారుల చిన్మయ కర్రికులమ్ పాఠ్యాంశాలను బోధిస్తారు.
ఎడ్యుకేషన్ బిల్డింగ్, బాంకెట్ హాలు పద్దెనిమిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యాయి. దీనిని హానరబుల్ క్రాండ్లే బ్రే అక్టోబరు 2003లో ప్రారంభించారు.
హవాయికి చెందిన సద్గురు బోధినాథ వేలన్‍స్వామి చేతుల మీదుగా 2004లో శ్రీరామలింగేశ్వర ప్రతిష్ఠాపన జరిగింది.
2005లో కనులపండువగా లక్ష లింగార్చన నిర్వహించారు.
2005లో హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటాకు ఉత్తర ద్వారాన్ని ప్రారం భించారు.
అమ్మ కరుణామయి చేతుల మీదుగా 2008లో శివాలయంలో కుంభాభిషేకం నిర్వహించారు.
చినజీయర్ స్వామి పవిత్ర హస్తాలతో ఆగస్టు 2010లో మహాలక్ష్మి కోటి కుంకుమార్చన నిర్వహించారు.
2011లో శ్రీ లలిత కోటి నామ పారాయణ నిర్వహించారు.
2011లో యోగశాల ఏర్పాటైంది.
నవంబరు 2011లో శివాలయంలో ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన వైభవంగా జరిగింది.
2013లో మొదటి శివ బ్రహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వ హించారు.
2014లో ఉదయాష్టమాన సేవ ప్రారంభించారు.
2014లో నంది మరియు బాలాజీ నూతన ధ్వజ ప్రతిష్ఠాపన నిర్వహించారు. ఆరున్నర టన్నుల గ్రానైట్‍తో నంది విగ్రహానికి కళ్లు చెదిరేలా స్తపతి రూపుదిద్దారు.
2015 సంవత్సరంలో అతిరుద్రం నిర్వహించారు.
నరేందర్‍రెడ్డి ఆలయ ప్రెసిడెంట్‍గా ఉన్న సమయంలో, మరియు పీబీ రావు ప్రెసిడెన్సీలో అతి రుద్రాన్ని స్వామి ఆధ్యాత్మానంద పర్యవేక్షణలో నిర్వ హించారు. ఇది ఆలయ వేడుకల్లోనే విశిష్టమైనది. ఇది విజయవంత మయ్యేందుకు ఆలయ కమిటీ విశేష కృషి చేసింది. ఇది పదకొండు రోజుల వైదిక కార్యక్రమం. స్వామీ ఆధ్యాత్మానంద, వేద బ్రహ్మర్షి నరేంద్ర కప్రేజీ, ఇతర వేద పండితుల సహకారంతో ఈ వైదిక కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.
2017, మే నెలలో అట్లాంటా హిందూ టెంపుల్ రజతోత్సవం నిర్వహించారు.
2018లో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. 2018 అక్టోబర్ 18న శత చండీయాగం పూర్తవుతుంది. 2018 నవంబర్ మొదటివారంలో శివాలయ బ్రహ్మోత్స వాలు జరగనున్నాయి. 2018 నవంబర్, డిసెంబర్‍లలో పతిత్రోత్సవాలు జరగ నున్నాయి. ఇంకా అనేక కార్యక్రమాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి.
నందిమండపం; 108 నటరాజమూర్తుల ప్రతిష్ఠ, శ్రీరామ స్థూపం, యోగ బిల్డింగ్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగు తున్నాయి.
హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా ఆలయ నిర్మాణం నుంచి నేటివరకు సాగినదంతా ఒక గొప్ప ఆధ్యాత్మిక యాత్ర. ఆలయం నిర్మించాలనే ఒక ఆలోచన బీజం వేసుకున్నది మొదలు నేడు సాకారమైన వాస్తవం వరకు అంతా ఏదో అద్భుత శక్తి ఆకర్షించి పని చేయించినట్టుగా ఉందని ఆలయ ట్రస్టీలు అంటారు. ఎంతోమంది ట్రస్టీలు, వలంటీర్లు, భక్తుల నిరంతర కృషితో అద్భుతమైన ఆలయం రూపుదిద్దుకుంది. అలాగే, ఆలయ అభివృద్ధి వెనుక ఎందరెందరిదో సహకారం ఉంది. ప్రత్యేకించి వలంటీర్లు ఆలయ నిర్మాణ, నిర్వహణ కమిటీలకు ప్రతి సందర్భంలోనూ వెన్నుదన్నుగా నిలిచారు. అశోక్‍కుమార్, అభిరావ.
Review ఆలయ శిఖరం.