ఉగాదికి స్వాగతం.. శ్రీరాముడికి జయం

తెలుగు వారి తొలి పండుగ ఉగాది.
తెలుగు వారి తొలి పూజ శ్రీరామ నవమికే..
ఈ రెండు పర్వాలు చైత్రంలో వస్తాయి.
శ్రీమన్నారాయణుని అవతారాల్లో మానవజాతికి అత్యంత హితమూ, ఆదర్శమూ అయినది శ్రీరామావతారం.
సీతారామలక్ష్మణులూ, భరత శత్రుఘ్నులూ తెలుగు వారికే కాక, విశ్వమానవ కుటుంబానికే నిరంతర స్మరణీయ మూర్తులు
శ్రీరాముని అరణ్యవాసం ఎక్కువ భాగం తెలుగునాటనే జరిగిందని అంటారు. రామావతార ప్రయోజనసిద్ధికి అవసరమైన బీజాలు ఇక్కడే మొలకెత్తాయి.
అందరి హృదయాల్లో ఆనందమూర్తియై రమించే వాడు రాముడు.
రామశబ్దం పరమాత్మ వాచకం కూడా.
మానవలోక కల్యాణం కోసం మాధవుడు మానవుడై అవతరించిన రోజే శ్రీరామనవమి.
శ్రీరాముడు నియతంగా పాలించిన ధర్మమూ, సత్యమూ మానవ జీవితానికి ఆదర్శగుణ సంపదలు. మనం ఆ మహా సంపదలకు వారసులం కావాలి. ఆ సంపదను ఆనందంగా అనుభవించాలి. తోటి వారికి పంచిపెట్టాలి.
శ్రీరాముని వంటి ఉత్తమ గుణ సంపన్నుడు మరొకడు లేడని వాల్మీకియే కాదు విశ్వమంతా ముక్తకంఠంతో కీర్తించి, ప్రశంసించింది. ఆ మహాగుణ సంపద దేశ కాలాలకు అతీతంగా సృష్టి ఉన్నంత కాలం స్థిరంగా ఉంటుంది.
సద్గుణ సంపదతో రమించే వాడూ, ప్రజలను సంతోషపెట్టేవాడూ కనుక ఆ మహాత్ముడికి రాముడనే పేరు సార్థకమైంది. ఈ రెండు శక్తులూ ఉన్న వారు రాముని వలే ఆదర్శవ్యక్తులూ, ఆరాధ్యమూర్తులూ అవుతారంటే అతిశయోక్తి లేదు.
రాముడు భారతీయులకే కాదు.. యావత్తు మానవజాతికే ఆదర్శమూర్తి.
శ్రీరామ నవమి ఏటా వచ్చేదే అయినా..ఈసారి మరో ప్రత్యేకత, విశిష్టత ఉంది. రాముడు తాను పుట్టిన చోట తప్ప విశ్వమంతా పూజలందుకున్నాడు. ఈసారికి ఆ లోటు తీరింది. అయోధ్యపురంలో తన జన్మభూమిలో ఈ ఏడాది జనవరిలో బాలరాముడిగా ప్రతిష్టితమయ్యాడు.
ఈ నేపథ్యంలో వస్తున్న ఈ శ్రీరామ నవమి విశేషాల గురించి తెలుసుకుందాం.

రా..మ’ అంటే కేవలం రెండు అక్షరాలు కాదు. అదో మహాశక్తి మంత్రం. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడిని కీర్తిస్తూ భక్తజనం పండుగ చేసుకుంటున్న శుభ తరుణమిది. 17.04.2024, చైత్ర
శుక్ల నవమి, బుధవారం- శ్రీరామ నవమి.
శ్రీ మహావిష్ణువు త్రేతా యుగంలో ధర్మస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన దినమే శుక్ల పక్ష నవమి.
ఈ రోజు ప్రధానంగా మూడు ఘట్టాలు నిర్వహిస్తారు.
అవి- శ్రీరామ జనన ఉత్సవం, సీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం.
మన సనాతన ధర్మం, పురాణాలు, జ్యోతిష శాస్త్రం ప్రకారం మహా విష్ణువు ప్రతి అవతారానికి ఒక్కో గ్రహం ప్రామాణికంగా ఉంటుంది.
నారసింహ అవతారం కుజ గ్రహాన్ని సూచిస్తుంది.
కృష్ణావతారం చంద్ర గ్రహాన్ని సూచిస్తుంది.
వామనావతారం గురు గ్రహాన్ని, శ్రీరామ అవతారం నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుడికి సూచిస్తుంది.
జ్యోతిష శాస్త్రం, రామాయణం ప్రకారం.. శ్రీరాముడు త్రేతాయుగంలోని గురువారం రోజున చైత్ర శుక్ల నవమి నాడు కర్కాటక లగ్నంలో జన్మించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి.
శ్రీరాముడు సూర్యవంశంలో జన్మించడం, ఆయన జాతకంలో సూర్యుడు మేషంలో ఉచ్ఛ క్షేత్రంలో ఉండటం..ఇవన్నీ ధర్మస్థాపన కోసం రామావతారం యొక్క ప్రాధాన్యతను తెలిపేవే.
మనిషి జీవితంలో ఎలా నడుచుకోవాలి? ఎలా ప్రవర్తించాలి? ఎలా ఉండాలనే అంశాలు రామాయణం ద్వారా తెలుసుకోవచ్చు.
శ్రీరాముడి పితృవాక్య పరిపాలన, ఉత్తమ రాజు లక్షణం, ఉత్తమ సోదరుడి కర్తవ్యం.. ఇలా అనేక విశేషాలను రామావతారం నుంచి నేర్చుకోవచ్చు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన శ్రీరాముడిని సనాతన ధర్మంలో పూజించడం వల్ల విజయాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

సకల గుణాభిరాముడు
ఒకరోజు నారద మహర్షి నారాయణ జపం చేసుకుంటూ వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడట. పరమానందం పొందిన వాల్మీకి భక్తిశ్రద్ధలతో నారదుడికి నమస్కరించి, ‘ఎంతోకాలంగా నా మనసులో ఓ సందేహం ఉంది. దాన్ని తమరే తీర్చాలి’ అని కోరాడట.
అదేమిటో అడగమన్నాడు నారదడు. ‘ఈ లోకంలో గుణవంతుడూ, పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు, తనకు సాయం చేసిన వారిని మరువని వాడు, సత్యాన్నే పలికే వాడు, దృఢచిత్తుడు, మంచి నడవడిక గలవాడు, సర్వప్రాణుల హితాన్ని కోరేవాడు, విద్వాంసుడు, సమర్థుడు, అందరికీ ప్రియం కలిగించేలా దర్శనం ఇచ్చేవాడు, ఆత్మజ్ఞాన సంపన్నుడు, క్రోధాన్ని జయించిన వాడు, కాంతిమంతుడు, అసూయ లేనివాడు, యుద్ధంలో ఆగ్రహిస్తే దేవతలను సైతం భయపడేట్టు చేయగలిగే వాడు.. ఈ పదహారు సద్గుణాలు ఉన్న వారెవరైనా ఉన్నారా? నేను తమరిని ఈ ప్రశ్న అడుగుతున్న ఈ సమయంలో ఆయన ఈ లోకంలోనే ఉండాలి. అలాంటి వాడు ఉన్నాడా? లేదా? అనేదే నా సందేహం. ఒకవేళ ఉంటే అతడెవరో తెలియచేయండి’ అని వాల్మీకి కోరాడు. అది విని నారదుడు, ‘నాయనా! నువ్వు అడిగిన లక్షణాల్లో ఒకటో రెండో ఉండటమే అసంభవం. కానీ, ప్రజల అదృష్టం కొద్దీ నువ్వు అడిగిన పదహారు సుగుణాలు కలిగిన మానవోత్తముడు ఉన్నాడు. అతడే శ్రీరామచంద్రుడు’ అన్నాడు.
ఆ వెంటనే శ్రీరాముడి చరితాన్ని వంద శ్లోకాల్లో సంగ్రహంగా వివరించి నారదుడు దేవలోకానికి వెళ్లిపోయాడు. అలా వాల్మీకి మహర్షికి నారదుడు రామతత్వాన్ని ఉపదేశించి, ఆయన ద్వారా లోకానికి శ్రీమద్రామాయణాన్ని అందచేసిన సదాచార్యుడు నారదుడు.

రమ్యమైనది రామ నామం
రాముడికి ఆ పేరును వశిష్ట మహర్షి పెట్టారు. రామాయణం ప్రకారం.. రామ రహస్యోపనిషత్తు ప్రకారం.. రామ అనే నామానికి అనేక రకాలైన అర్థాలు ఉన్నాయి. అందులో రమంతే యోగినో యత్ర రామ అని ఒక అర్థం. అనగా, యోగీశ్వరులు ఏ భగవంతుడి యందు ఆస్వాదన చెందుతారో అతనే రాముడు అని అర్థం.

రామ అనే పదానికి రాక్షస యేన మరణం యాంతి- రామ అంటే ఎవరిచే రాక్షసులు మరణించెదరో అతడే రాముడు అని అర్థం. శ్రీరామనవమి నాడు రామనామ స్మరణం చేయడం వల్ల అనేక రెట్ల పుణ్యం కలుగుతుంది. రామనామం తారక మంత్రమనీ, తారక మంత్రం అంటే తేలికగా భవసాగరాన్ని దాటించేదని అర్థం. ఏ మంత్రం చెప్పినా దాని ముందు ‘ఓం’ అని, తర్వాత ‘నమ:’ అనీ కచ్చితంగా వాడాలి. కానీ ‘రామ’ అనే మంత్రానికి ఇవేమీ వాడాల్సిన అవసరం లేదు. శ్రీరామ.. శ్రీరామ అనుకుంటూనే విష్ణులోక ప్రాప్తిని పొందవచ్చని పురాణ వాక్కు. పూర్వం శివుడు పార్వతీదేవికి శ్రీరామ నామ గొప్పదనాన్ని తెలియచేస్తూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే అనే శ్లోకాన్ని పార్వతీదేవికి ఉపదేశించాడట. విష్ణు సహస్ర నామ పారాయణాన్ని ఈ శ్లోకంతోనే ముగిస్తారు. ‘శ్రీరామ.. శ్రీరామ.. శ్రీరామ’ అని మూడుసార్లు అంటే ఇందులోనే వెయ్యి దైవిక నామాలున్నాయి, సకల దేవతలూ ఇందులోనే ఉన్నారని శివుడు పార్వతికి చెప్పినట్టు పురాణాల్లో ఉంది.

శ్రీరామ నవమి నాటి విధులేమిటి?
సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేయాలి. ఇంటిని తోరణాలతో అలంకరించాలి. కొత్త వస్త్రాలు ధరించాలి. ఇంట్లో, కుదరని పక్షంలో దేవాలయాల్లో శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, లక్ష్మణుడి విగ్రహాలను ప్రతిష్ఠించాలి. ధ్యాన, ఆవాహనాది షోడశోపచారాలతో శ్రీరామచంద్రుడిని పూజించాలి. శ్రీ సీతారాములను అష్టోత్తర శతనామావళితో అర్చించాలి. ఇలా పూజించి రామచంద్రమూర్తికి ఇష్టమైన వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా పెట్టి పూజ అనంతరం దాన్ని స్వీకరించాలి. ఈ రోజు ఉపవాసం లేదా జాగరణ చేయడం వల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని అంటారు. శ్రీరామనవమి రోజున రామనామ స్మరణ చేయడం, రామకోటి రాయడం వల్ల అత్యంత పుణ్యఫలం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరామ నవమి నాడు ఏ వ్రతం చేసినా ఫలించదనీ, కేవలం శ్రీరామ వ్రతం మాత్రమే ఫలితాలనిస్తుందని, ఈ వ్రతానికి మించినది లేదని పెద్దల మాట. ఈరోజు రామ నామ జపం వల్ల, పాపాలు తొలగి, జయాలు సిద్ధిస్తాయి.

ఈసారి ప్రత్యేక ఆకర్షణ.. బాలరాముడు
ఈసారి శ్రీరామ నవమి ఉత్సవాలు ఒక ప్రత్యేక వాతావరణంలో జరగనున్నాయి. రాముడు పుట్టిన అయోధ్య.. నిన్నా మొన్నటి వరకు ఆయన మందిరానికే నోచుకోలేదు. ఇప్పుడు ఆయన అక్కడ బాలరాముడుగా కొలువుదీరాడు. అయోధ్య అంటే ఇటీవల వరకు ఒక సాధారణ పట్టణం. ఇకపై దివ్య క్షేత్రరాజం. ఒకప్పుడు అయోధ్య అంటే ఏడు సప్త పురాల్లో ఒకటిగా పేరు. తాజాగా బాలరాముడి విగ్రహ ప్రతిష్టతో అయోధ్యకు మునుపటి వైభవం చేకూరింది. 2024, జనవరి 22న బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరగగానే దేశమంతటా సంబరాలు మిన్నంటాయి. నిజానికి రామజన్మభూమిలో బాలరాముడి విగ్రహం ఎప్పటి నుంచో ఉంది. దానికి నిత్యపూజలూ జరుగుతున్నాయి. అయితే రాముడి గుడి లేని దేశంలో ఆయన పుట్టిన ఊరిలో మాత్రం మందిరం కరువైంది. వివాదాస్పద స్థలం రామజన్మభూమి నిస్సందేహంగా రామ్‍లల్లా విరాజ్‍మాన్‍దేనని దేశ అత్యున్నత న్యాయస్థానం విస్పష్టమైన తీర్పునివ్వడంతో భవ్య మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. రాముడి గుడి నిర్మాణానికి దేశ ప్రజల నుంచి విరాళాలు సేకరించాలని ట్రస్టు నిర్ణయించగానే దేశ, విదేశాల నుంచి దాదాపు 5 వేల కోట్ల రూపాయలకుపైగా విరాళాలు పోటెత్తాయి.

రామమందిర ముఖద్వారం వద్ద ఏనుగు, సింహాలు, గరుడ పక్షి, హనుమంతుడి పెద్ద శిల్పాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వాస్తు, శిల్ప శాస్త్రాల నియమాలకు లోబడి సంప్రదాయ నాగర శైలిలో నిర్మించిన మందిరం కొంత వరకూ మధ్యప్రదేశ్‍లోని ఖుజరహో ఆలయాన్ని పోలి ఉంటుంది. భక్తులు 32 మెట్లు ఎక్కి గుడిలోపలికి ప్రవేశించాల్సి ఉంటుంది. భక్తులు తూర్పు ద్వారం నుంచి లోపలికి ప్రవేశించి దక్షిణ ద్వారం నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. ఆలయంలో వాడిన గ్రానైట్‍ రాళ్లను తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి సేకరించారు. ఆలయ ద్వారాలను హైదరాబాద్‍లోని అనురాధ టింబర్‍ డిపో తయారుచేసింది. ఆలయ కాంప్లెక్స్లో ఒకేసారి 70 వేల మంది ఉండవచ్చు. ‘వసుధైవ కుటుంబకమ్‍’ అని నమ్మే భారతీయ భావాన్ని ప్రతిబింబించేలా ఏడు ఖండాల్లోని నదులూ, సముద్రాల నుంచి నీటినీ, 2,587 ప్రాంతాల నుంచి మట్టినీ తీసుకువచ్చి మందిర నిర్మాణంలో వాడారు. బాలరాముడు కొలువైన గర్భగుడి గ్రౌండ్‍ఫ్లోర్‍లోనే ఉంటుంది. అయోధ్య బాలరాముడి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్‍కార్డు లేదా ఏదైనా ఇతర ధ్రువపత్రం తీసుకువెళ్లాల్సి ఉంటుంది. బాలరాముడికి రోజూ మూడు పూటలా హారతినిస్తారు. హారతి దర్శన టికెట్లను ఆన్‍లైన్‍లో బుక్‍ చేసుకోవాలి.

భవ్య రామ మందిరం.. దివ్యానుభవం
అయోధ్య రామ మందిరం ప్రపంచంలోనే మూడో అతి పెద్ద దేవాలయం. పునాది నుంచి ఆలయ శిఖరం వరకు ఎక్కడా ఇనుము, సిమెంట్‍ వాడలేదు. పూర్తిగా రాతితో నిర్మించిన అద్భుతమిది. మూడు దశాబ్దాలుగా దేశం నలుమూలల నుంచి సేకరించిన రెండు లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వినియోగించారు. వీటిని రామశిలల పేరుతో వ్యవహరించారు. ఈ సుందర దివ్య మందిరంలో 51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విల్లంబులు ధరించిన కౌసల్య తనయుడు జనవరి 22, 2024 నుంచి సుప్రభాత సేవలు అందుకుంటున్నాడు.
• 2024, జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12.29 గంటల 8 సెకండ్ల నుంచి 12.30 గంటల 32 సెకండ్ల వరకు (మొత్తం 84 సెకండ్లు) గల సుమూహర్తంలో బాలరాముడిని ప్రతిష్ఠించారు.
• రామమందిరం కాంప్లెక్స్ మొత్తం విస్తీర్ణం- 110 ఎకరాలు.
• ప్రధాన ఆలయ ప్రాంగణ విస్తీర్ణం- 2.77 ఎకరాలు.
• మందిర నిర్మాణానికి 2020 ఆగస్టు 5న శంకుస్థాపన జరిగింది.
• బాలరాముడి ఆలయ శిఖరం ఎత్తు- 161 అడుగులు. వెడల్పు- 235 అడుగులు.
• మందిర నిర్మాణ విస్తీర్ణం- 57,400 చదరపు అడుగులు.
• రామ మందిరం పొడవు- 360 అడుగులు.
• రామ మందిరానికి గల ప్రవేశ ద్వారాలు- 16.
• అహ్మదాబాద్‍కు చెందిన చంద్రకాంత్‍ సోమ్‍పూర ఆలయ నిర్మాణానికి ప్రధాన ఆర్కిటెక్ట్గా వ్యవహరించారు.
• బాలరాముడి విగ్రహానికి రూపునిచ్చినది కర్ణాటకకు చెందిన అరుణ్‍ యోగిరాజ్‍.
• రామ మందిరంలో 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉన్నాయి.
• మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో దీర్ఘచతురస్రాకారంలో ప్రహరీని నిర్మించారు. నాలుగు మూలల్లో శివుడు, దేవీ భగవతి, సూర్యుడు, వినాయకుడి మందిరాలను నిర్మించారు. ఉత్తరాన అన్నపూర్ణాదేవి, దక్షిణాన హనుమాన్‍ మందిరాలనూ నిర్మించారు.
• రెండు వేల సంవత్సరాలకు పైగా నిలిచి ఉండేలా ఈ కట్టడ నిర్మాణం జరిగింది. రిక్టర్‍స్కేలుపై 10 తీవ్రతతో భూకంపం వచ్చినా తట్టుకునే శక్తి ఈ ఆలయానికి ఉంది.
• రామ మందిరం సువిశాలమైన మూడు అంతస్తుల భవనం. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తున ఉంటుంది. కింది అంతస్తులో శ్రీరాముడి జననం, విద్యాభ్యాసం వంటివి తెలిపే ఫలకాలు, మొదటి అంతస్తులో రామదర్బార్‍ను తెలిపే ఫలకాలను పొందుపరిచారు.

Review ఉగాదికి స్వాగతం.. శ్రీరాముడికి జయం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top