
భారతీయ సంప్రదాయంలో సామూహికంగా నిర్వహించుకునే పండుగలు, పర్వాలు ఎన్ని ఉన్నా సంక్రాంతి సంబరాలకు మాత్రం మరేదీ సాటి రాదు.
‘జనమంతా మనవాళ్లే.. ఊరంతా మన ఇల్లే’ అన్నట్టుగా సంక్రాంతి వేడుకలను నిర్వహించుకుంటారు.
ఎన్ని పనులున్నా ఎలాగైనా తీరిక చేసుకుని ఊరికి వెళ్లడం.. మూడు రోజుల పాటు బంధుమిత్రులతో సరదాగా గడపడం.. ఈ సందర్భంగా మమతానుబంధాలను పెంపొందించుకోవడం అనేది ఒక్క సంక్రాంతితోనే సాధ్యం. భోగిమంటలు, అందమైన ముగ్గులు, పిండివంటలు.. గంగిరెద్దుల ఆటలు.. హరిదాసు కీర్తనలు.. పగటి వేషగాళ్ల కోలాహలం.. ప్రభల తీర్థాలు.. ఇదే కదా సంక్రాంతి అంటే.. అంటారా?! అయితే, ఇదే కాదు.. ఇంతకుమించి కూడా అంటున్నాయి మన తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని పల్లెలు. అసలు సంక్రాంతి అంటేనే పల్లె పండుగ. ఆ పల్లెలు ఈ పండుగ స్వరూపాన్ని, పరమార్థాన్ని మార్చేసి ఆదర్శ ‘క్రాంతులు’ నింపుతున్నాయి.
నిజానికి ఇప్పుడు పండగంటే అర్థం మారిపోయింది. సంక్రాంతి వచ్చిందంటే కోడిపందేలు, నంబర్ల ఆట, జూదం తప్ప మరేమీ కాదనేంతగా ఒక దురభిప్రాయం వేళ్లూనుకుపోయింది.
ఇలాంటి దురభిప్రాయాలను పటాపంచలు చేస్తూ ‘పండగంటే కొత్తబట్టలు వేసుకుని, పిండివంటలు తిని.. కోడిపందేలు చూడ్డం కాదు.. పండగంటే నిన్నూ నన్నూ ఒక్కటి చేసే సందర్భం.. పండగంటే కొత్తకాంతులు నింపడం.. పండగంటే ఆదర్శంగా నిలపడం.. నిలవడం..’ అని నిరూపిస్తున్నాయి మన పల్లెలు. అందుకే సంక్రాంతి తీరు మార్చుకుంటోంది. పేరుకు తగ్గట్టే కొత్త కాంతులు, క్రాంతులు తెస్తోంది.
సంక్రాంతి అంటే పండగ సంబరం.. సందడి. అంతేనా?
ఆ పండగకి, ఆ సంబరానికి, ఆ సందడికి మించి ఇంకా చాలా ఉందంటోంది నేటి తరం.
సొంతూరికి వెళ్లే తప్పనిసరి సందర్భం- సంక్రాంతి.
సంవత్సరానికి ఒకసారైనా అయిన వాళ్లను, మిత్రులను, ఊరి వాళ్లను చూడాలి.. వాళ్లతో మాటలు కలపాలి. పండగ సందడిని, ఆనందాన్ని పంచుకోవాలి. మనం పుట్టి పెరిగిన పల్లెలోని మట్టివాసనను ఆస్వాదించాలి. కొత్త పరిచయాలు పెంచుకోవాలి. బంధుత్వాలను పటిష్టం చేసుకోవాలి. పల్లె భాషలో నోరారా అందరినీ పలకరించాలి. అలాంటి ఊరితో బంధాన్ని పెనవేసుకోవడానికి సంక్రాంతిని మించిన పెద్ద పండుగ మరేముంది?
అందుకే రైల్లో టికెట్ కన్ఫామ్ కాకపోయినా, బస్సులో సీటు దొరక్కున్నా.. సంక్రాంతికి అందరూ పడుతూ లేస్తూ అయినా సరే ఎలాగోలా సొంతూరికి వెళ్లిపోతారు.
కేవలం ఈ ఆనందం కోసమేనా? అంటే కాదని చాలా ఊళ్లు అంటున్నాయి. ఎందుకంటే, సంక్రాంతి సందర్భంగా తమకంటూ కొన్ని సంప్రదాయాలను ఏర్పర్చుకున్నాయి తెలుగునాట కొన్ని పల్లెలు. అందుకే పండక్కి మించిన ఆ ఆనందాన్ని ఆస్వాదించేందుకు, ఆ సంప్రదాయాలను నిలుపుకునేందుకు ఎక్కకున్నా సరే.. సొంతూరికి వెళ్లడం తప్పనిసరి. మరి, అలాంటి ఊళ్లేం ఉన్నాయి? ఆ ఊళ్లలో సంక్రాంతి సమయంలో ఆచరించే సంప్రదాయాలేమింటే..?!
పాచలవలస.. సరికొత్త ‘రంగస్థలం’
ఆంధప్రదేశ్‍లోని విజయనగరం జిల్లా పాచలవలస మొత్తం రైల్వే ఉద్యోగులే. విజయవాడ నుంచి ఒడిశాలోని టిట్లాగడ్, భువనేశ్వర్ రైల్వేస్టేషన్ల వరకు ఈ ఊరికి చెందిన వారు వివిధ విభాగాల్లో పని చేస్తున్నారు. పాచలవలస వర్షాధార ప్రాంతం. కాబట్టి సొంతూరులో పని లేని వారంతా ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిపోతారు. వీరంతా సంక్రాంతికి కచ్చితంగా సొంతూరు వస్తారు. ఏదో మూడు రోజులు అందరూ కలుసుకోవడం.. కబుర్లు కలబోసుకోవడం.. మళ్లీ ఎవరి దారి వారు చూసుకోవడం.. ఇదేం నచ్చలేదు ఆ ఊరిలోని యువతరానికి. సంక్రాంతి సంబరానికి మించిన ఆనందాన్ని మరేదైనా సృష్టించాలనుకున్నారు. అంతే.. ఆరేళ్ల క్రితం మొదలైన ఆ కొత్త సంప్రదాయం ప్రతి ఏటా సంక్రాంతికి కొత్త క్రాంతులు, కాంతులు వెదజల్లుతూనే ఉంది.
ఇంతకీ, ఈ ఊళ్లో ఏం చేస్తారంటే.. సంక్రాంతి నాడు సాయంత్రం సాంస్క•తిక కార్యక్రమాలకు రంగం సిద్ధం చేస్తారు. పిల్లాజెల్లా, పెద్దలు అంతా ఈ వేదిక వద్దకు చేరుకుంటారు. గ్రామ పెద్దలు తమ ఊరి చరిత్రను, ఆనాటి పరిస్థితులనూ, అనుభవాలనూ, నాటి జీవన విధానాలనూ కథలు చెబుతుంటే.. యువత చెవులప్పగించి ఆసక్తిగా ఆలకిస్తుంది. చదువులోనూ, ఉద్యోగంలోనూ ప్రతిభ చాటిన వారిని ఇదే వేదికపై సత్కరిస్తారు.
ఇది పిల్లలకూ, పెద్దలకూ ప్రేరణగా నిలుస్తోంది. అలాగే వివిధ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందచేస్తారు.
పాచలవలస కళాకారుల ఊరు కూడా. తమలోని కళాభిరుచిని చాటడానికి ఊళ్లోని కళాకారులంతా ఈ వేదికను ఉపయోగించుకుంటారు. శ్రీరామాంజనేయ యుద్ధం, సత్యహరిశ్చంద్ర నాటకాల్లోని పద్యాలు పాడుతుంటే ఊరి జనమంతా చప్పట్లతో ప్రోత్సహిస్తారు.
ఈ ఊరికి చెందిన యువకులే తలా కొంత వేసుకుని సంక్రాంతి సందర్భంగా ఈ సంప్రదాయాన్ని ఏటా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.
ఊరి దీపం.. కొవ్వలి
సాధారణంగ సంక్రాంతి అనగానే ఎక్కడెక్కడ ఉన్న వారో సొంతూరికి వస్తారు కదా! కానీ, అక్కడ జరిగే వేడుకను చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో కూడా వస్తుంటారు. ఇంతకీ ఆ ఊరి విశేషం ఏమిటంటారా?!
సంక్రాంతి అంటే ఒకప్పుడు భోగిమంటలు, ముగ్గులు, పిండివంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలూ.. ఇలా ఎటుచూసినా సందడే. కానీ, రాన్రాను సంక్రాంతి పండగంటే అర్థం మారిపోయింది. కోడిపందేలు, పేకాట, గుండాటలు ఆడుతూ ఎంజాయ్ చేయడం పరిపాటయింది. అయితే పండగంటే ఇది కాదని చెప్పే యత్నంలో సఫలీకృతమైది ‘గ్రామదీప్’ స్వచ్ఛంద సంస్థ. ఆంధప్రదేశ్‍లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలంలోని కొవ్వలి గ్రామ కథ ఇది.
ఈ ఊళ్లోని వారు ఉపాధి, ఉద్యోగాల పేరుతో తరలిపోయారు. ఊళ్లోని ఇళ్లన్నీ ఖాళీ అయిపోయాయి. వలస వెళ్లిన వారు పండక్కి వచ్చినా.. ఫోన్లు, స్నేహితులతో షికార్లు వంటి వాటితో గడిపేవారు. ఈ పరిస్థితిని సమూలంగా మార్చివేసింది ఈ స్వచ్ఛంద సంస్థ. ఇప్పుడక్కడ పండుగంటే ఊరందరిదీ. గ్రామానికి చెందిన ప్రతి ఒక్కరూ పండుగ సంబరాల్లో పాల్గొనాల్సిందే.
గ్రామానికి చెందిన వైద్యురాలు గ్రామాభివృద్ధికి తలా ఒక చేయీ వేయాల్సిన అవసరాన్ని గుర్తించి ఆహ్వానపత్రికలు ప్రచురించి అందరికీ పంచుతారు. ఫేస్‍బుక్, వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులందరినీ ఏకతాటిపైకి తెచ్చారు. సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపేవారు. దీంతో తక్కువ సమయంలో గ్రామదీప్ సంస్థకు మంచి పేరు వచ్చింది. ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా కనెక్ట్ అయ్యారు. సంస్థ కార్యకలాపాల్లో తామూ భాగస్వాములు కావడం ప్రారంభించారు. సంక్రాంతి మూడు రోజులూ ఊళ్లోని ఉన్నత పాఠశాలను వేదికగా చసుకుని కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. భోగిమంటలతో మొదలుపెట్టి చిన్నారులకు భోగిపండ్లు వేయడం, ముగ్గుల పోటీలూ, గాలిపటాలూ, పిండివంటలూ, భోజనాల వరకూ అన్నీ సామూహికంగా చేయాల్సిందే.
తెల్లవారుజామున మొదలుపెడితే రాత్రి వరకూ ఒకదాని తరువాత ఒకటి ఉత్సాహంగా చేస్తూనే ఉంటారు. ఇక్కడ జరిగే సంక్రాంతి వేడుకలు చూసేందుకు వేర్వేరు ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారంటే సంబరాలు ఎంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతాయో అర్థం చేసుకోవచ్చు.
ఇక, ఈ సంస్థ గ్రామాభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తోంది. ఖాళీ ప్రదేశాల్లో సంస్థ సభ్యులు మొక్కలు నాటతారు. ఇలా నాటగా పెరిగిన చెట్లతో కొవ్వలి ఐక్యతా వనాన్ని తీర్చిదిద్దుకున్నారు. రహదారులను బాగు చేసుకున్నారు. గోడలను అందమైన చిత్రాలతో అలంకరించారు. నలుగురు కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి వీలుగా వీధుల్లో అక్కడక్కడా సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు. నేచర్ వాక్ పేరుతో మహిళలు, పిల్లలూ నడిచేందుకు వీలుగా బాట వేశారు. నిస్సహాయ, ఒంటరి మహిళలను దత్తత తీసుకుని వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అండగా నిలుస్తున్నారు.
పండగంటే మనమొక్కరమే సంబరాలు చేసుకోవడం, ఆనందం పంచుకోవడం కాదు.. అందరితో కలిసి ఆనందాన్ని పంచుకోవడం, ఊరికి వెలుగులు పంచడం అనే భావనతో ఈ గ్రామదీప్ సంస్థ ఊరికి వెలుగులనిస్తోంది.
కోరికలు తీరితే యాచన..
మన కోరికలు నెరవేరాలని దేవుడికి మొక్కుకోవడం సహజం. ఆ కోరికలు తీరితే.. ఇష్టదైవానికి ముడుపులూ, కానులకూ, నైవేద్యాలు సమర్పించడం కూడా సహజం. కానీ, ఆంధప్రదేశ్‍లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కొప్పవరంలో జరిగే సత్తెమ్మతల్లి ఆలయంలో మాత్రం విచిత్రమైన వేషాల్లో బిచ్చమెత్తి మొక్కు తీర్చాలి ఉంటుంది. వినడానికి ఇది విడ్డూరంగా ఉన్నా నిజం. ఈ ఊళ్లో రెండు సంవత్సరాలకు ఒకసారి సంక్రాంతి తరువాత సత్తెమ్మతల్లి జాతర జరుగుతుంది. జాతర సందర్భంగా విచిత్ర వేషాల్లో పుట్ట దగ్గరికి వెళ్లి పూజలు చేస్తారు. అనంతరం పూజారితో బెత్తం దెబ్బలు తింటే పాపాలు పోతాయనేది వీరి నమ్మకం. దాంతోపాటు కోరిన కో•ర్కెలు తీరిన భక్తులంతా ఏదో ఒక వేషం ధరించి భిక్షాటన చేసి.. యాచించిన వాటిని అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీ. భక్తులను ఇలా రకరకాల వేషధారణల్లో అలంకరించడానికి ఎందరో మేకప్ ఆర్టిస్టులు, కాస్ట్యూమ్ డిజైనర్లు ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతర భక్తులకు ఆధ్యాత్మికతను పంచుతుండగా, మరికొందరికి ఉపాధిని కల్పిస్తోంది.
గోడెక్కిన ముగ్గు
ధనుర్మాసం ప్రారంభంతోనే ముంగిళ్లకు పండుగ కళ వచ్చేస్తుంది. నెల రోజుల ముందు నుంచే గుమ్మాలను పెద్ద పెద్ద ముగ్గులతో అలంకరించి సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించడం మన ఆనవాయితీ. త్రిపుర రాజధాని అగర్తలకు సమీపంలో ఉన్న లంకముర గ్రామంలోనూ సంక్రాంతిని పురస్కరించుకుని రంగురంగుల రంగవల్లులు కనువిందు చేస్తుంటాయి. అయితే, అక్కడ మనలా గుమ్మాల ముందు ముగ్గులు వేయరు. ఇంటి గోడలనే అందమైన రంగవల్లులతో తీర్చిదిద్దడం లంకముర వాసుల ప్రత్యేకత. నిజానికి గోడలపై రకరకాల బొమ్మలు వేసి అలంకరించుకోవడం పశ్చిమబెంగాలీయుల సంప్రదాయం. అందుకే బెంగాలీలు అధికంగా ఉండే లంకముర గ్రామంలోనూ అదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అయితే గోడలపై శాశ్వతంగా ఉండిపోయే రంగులతో కాకుండా ముగ్గు చాక్‍పీస్‍లతో రంగవల్లులను
తీర్చిదిద్దు తుంటారు.
మనం ధనుర్మాసంగా పిలుచుకునే నెలని అక్కడ పోస్ పర్చన్ అంటారు. డిసెంబర్‍లో మొదలుపెట్టి సంక్రాంతి రోజు వరకూ గోడలపై ముగ్గులు వేస్తూ ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకుంటారు.
ముస్లింలకీ సంక్రాంతి..
సాధారణంగా సంక్రాంతి పండుగను హిందువులే చేసుకుంటారు కదా! కానీ ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో ఉన్న ఖాంటపాడా, బారునసింగ, బెగునియా, శ్రీజంగ్, ససంగ్, తుండ్ర గ్రామాల్లోని ముస్లింలు కూడా సంక్రాంతి సందర్భంగా తమ ఇంటి గుమ్మాలను రంగురంగుల రంగవల్లులతో తీర్చిదిద్దుకుంటారు. అంతేకాదు, సంక్రాంతి రోజు ఉదయాన్నే అందరూ కలసి ఆలయాల్లో పూజలు నిర్వహిస్తారు. దర్గాలో చాదర్‍ను సమర్పిస్తారు. ఖాంట్రాడాలోని గ్రామస్తులంతా ఒక్కచోట చేరి వంటలు చేసుకుని ఒకే కుంటుంబంలా కలసిమెలసి భోజనాలు చేస్తుంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆర్థిక సమస్యల్లో ఉన్న వారికి తలో చేయి వేసి సాయం అందిస్తుంటారు. దాదాపు నూట యాభై సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో సంక్రాంతి వేళ ఈ మత సామరస్యం వెల్లివిరుస్తోంది.
ఈ సంబరాలు వైవిధ్యం.. విభిన్నం
ఊరంతా కలిసి సంబరాలు చేసుకోవడం, ఊరి బాగు కోసం పండుగ పూట కంకణం కట్టుకోవడం ఇది ఒకపక్క కొత్త ధోరణిగా వేళ్లూనుకుంటుంటే.. మరోపక్క కుటుంబ అనుబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు ఒకే ఇంటిపేరు గలవారు ఏకమవుతున్నారు. అలాంటి కొన్ని కుటుంబాల వివరాలివి..
– ఒక ఇంట్లో పుట్టి మరో ఇంట్లో మెట్టినపుడు రెండు ఇంటి పేర్లుతోనూ అనుబంధం ఏర్పడుతుంది. ఒక్కో తరం పెరుగుతున్న కొద్దీ ఆ అనుబంధాలు మరింత విస్తరిస్తాయి. తుమ్మల వారి విషయంలో జరిగిందీ అదే. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పులిమేరులో ఉన్న తుమ్మల కుటుంబం ఎందరినో కలుపుకుని ఇంతింతై అన్నట్టుగా వ్యాపించింది. అందుకే ఇప్పుడా కుటుంబంలో సంక్రాంతి వచ్చిందంటే పూటకు రెండు వేల విస్తళ్లు లేవాల్సిందే. నా వారు అనుకునే వారు ఇంతమంది ఒకచోట చేరినపుడు ఉండే ఆనందానికి సాటి రాగలది ఇంకేముంటుంది? అందుకే దూరాభారాలనుకోకుండా ఎక్కడున్నా పండక్కి పులిమేరు వచ్చేస్తాం అని చెబుతారు వీరంతా.
– కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలోని రాజుపాలెం అనే ఒక గ్రామం ఉంది. ఈ ఊరికి వెళ్తే క్షత్రియ కుటుంబాలకు చెందిన నాలుగైదు తరాల వారిని ఒకేచోట చూడవచ్చు. విదేశాల్లో ఉన్న వారు కూడా పండుగ కోసం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేస్తారు. దాదాపు 500 మంది ఒకేచోట వంటలు చేసుకుని ఒకే పంక్తిలో భోజనాలు చేస్తారు. పెద్దలను సత్కరిస్తారు. పిల్లలకు తమ వారసత్వాన్నీ, బంధువులనీ పరిచయం చేస్తారు.
– కోనసీమ జిల్లా సంక్రాంతి సంబరాలకు పెట్టింది పేరు. పండగ నాడు ఈ జిల్లా వ్యాప్తంగా జరిగే ప్రభల తీర్థాలు మొత్తం సంక్రాంతి పండుగకే హైలైట్. అయితే ఈ జిల్లాలో పండుగ జరుపుకునే తీరులో ఇంకా ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి. ఇదీ అలాంటిదే.
కోనసీమ జిల్లాలోని పుల్లేటికుర్రు అనే గ్రామం ‘వక్కలంక’ అనే ఇంటిపేరు ఉన్న వారికి ప్రసిద్ధి. ఈ ఇంటిపేరుతో ఉన్న కుటుంబాలన్నీ దేశంలో ఎక్కడెక్కడ ఉన్నా సంక్రాంతి నాటికి ఇక్కడికి వచ్చేయాల్సిందే. ఇలా ఈ ఇంటిపేరున్న వారంతా కలుసుకోవడం కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది. సంక్రాంతి పండుగ మూడు రోజులూ వేడుకల్లో పాల్గొని చివరి రోజున తమ ఆధ్వర్యంలోనే స్థానికంగ ఉన్న అభినవ శ్రీ వ్యాఘ్రేశ్వరస్వామి వారి ప్రభల వేడుకలను ఘనంగా జరిపిస్తారు.
– ఆడపడుచులు పుట్టింటికి రావడం సహజమే కదా! కానీ తొమ్మిది మంది తోబుట్టువులు తలా ఒకసారి వచ్చి వెళ్లేకంటే అందరూ ఒక్కసారే వస్తే.. వారందరి పిల్లలూ, మనవలూ ఇలా అంతా ఒక్కచోట చేరితే ఎలా ఉంటుంది? ఈ ప్రయత్నమే చేయాలని అనిపించింది బత్తుల వారి కుటుంబానికి. ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ఈ ఆలోచనను బత్తుల సోదరులు క్రమం తప్పకుండా ఆచరణలో పెడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన బత్తుల సోదరుల ఇంట సంక్రాంతి వేళ జరిగే సందడి అంతా ఇంతా కాదు. గ్రామంలో వీరి కుటుంబం ఒక్కటే కానీ, మొత్తం 90 మంది ఉన్నారు. అందరూ కలిసి ఉండటానికి ఒక కల్యాణమంటపాన్ని అద్దెకు తీసుకుంటారు. పనులతో సతమతం అవ్వకుండా అందరూ పండుగ సంబరాన్ని ఆస్వాదించేందుకు వీలుగా పనివాళ్లతో ఏర్పాట్లన్నీ చేయిస్తారు. అలాగని తమ సంతోషానికే పరిమితం కారు. ఊరి కోసం ఏటా ఏదో ఒక మంచి పని చేయిస్తాయి. ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం, పేదలకు దుస్తులు పంచడం వంటి సేవా కార్యక్రమాలు చేపడతారు.
సంక్రాంతికీ ఓ కథ ఉంది!
పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవై వేల మంది కొడుకులు. వీరంతా ఒకసారి కపిల ముని ఆశ్రమంలోకి ప్రవేశించి ఆయన తపస్సుకి భంగం కలిగిస్తారు. దీంతో కోపించిన కపిల ముని వారందరినీ తన కంటి చూపు నుంచి వెలువడిన క్రోధాగ్ని జ్వాలలతో భస్మం చేశాడు. దాంతో వారికి మోక్షం లభించక అథోలోకంలో పడి ఉన్నారని, వారికి సద్గతులు కలగాలంటే వారి భస్మరాశుల మీద నుంచి గంగ ప్రవహించాలని తెలుసుకున్న సగర వంశీకులు చాలామంది భువికి గంగను రప్పించాలని పరిపరి విధాలా ప్రయత్నించి విఫలమయ్యారు. ఎట్టకేలకు ఈ వంశానికి చెందిన భగీరథుడు తన కఠోర తపస్సు, ఎడతెగని ప్రయత్నాలతో ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకు మెచ్చి సంక్రాంతి రోజునే గంగ నేల మీద అవతరించిందట. అందుకే సంక్రాంతి నాడు చేసే స్నానం గంగాజలంలో మునక వేసినంత ఫలాన్ని ఇస్తుందని పెద్దలు చెబుతారు.
కనుమనాడు కాకైనా కదలదు..
మనుషులు పొలిమేర దాటొద్దు
సంక్రాంతి అయినా, మరే పండుగయినా.. సంప్రదాయాల కలబోత. పండుగ పరమార్థం.. మనిషి మంచి కోరడం. నలుగురికీ ఆనందాన్ని పంచడం.. మరి సంక్రాంతి సందర్భంగా ఏర్పడిన సంప్రదాయాలేమిటో తెలుసుకోండి..
• సంక్రాంతిలో తొలి రోజైన భోగిని కీడు పండుగగానూ, రెండో రోజైన సంక్రాంతిని పెద్దల పండుగగానూ, మూడో రోజైన కనుమను పశువుల పండుగగానూ చేసుకునే ప్రజలు.. నాలుగో రోజున గ్రామ దేవతలను తల్చుకుంటూ మాంసాహారాన్ని వండుకునే సంప్రదాయం కూడా ఉంది. అందుకనే ముక్కనుమను ముక్కల పండుగగానూ పిలుస్తారు.
• కనుమ నాడు పొలిమేర దాటకూడదని నియమం.
• కనుమ మర్నాడు వచ్చే ముక్కనుమ రోజున కొత్త వధువులు ‘సావిత్రీ గౌరీ వ్రతం’ అనే వ్రతాన్ని ఆచరిస్తారు. ఇది బొమ్మలతో చేసే వ్రతం కాబట్టి దీనికి బొమ్మల నోము అనే పేరూ ఉంది.
• సూర్యుడు దక్షిణాయణంలో ఉండే చివరి రోజు భోగి. ఈ రోజు చలి తారస్థాయిలో ఉంటుంది. కాబట్టి భోగి మంటలు వేస్తారు. సూర్యుడు ఉత్తరాయణం (సంక్రాంతి)లోకి మళ్లింది మొదలు వాతావరణంలో వేడి పెరుగుతుంది. ఈ వేడిని, వాతావరణ మార్పును తట్టుకునేందుకే భోగి మంటలతో రాబోయే ఈ మార్పునకు శరీరాన్ని సన్నద్ధం చేసినట్టవుతుంది.
• పెద్ద పండుగ (సంక్రాంతి)తో పాటు కనుమ నాడు కూడా పితృదేవతలకు తర్పణాలు విడిచే ఆచారం కొందరిలో ఉంది. పెద్దల పేరుతో ఈ రోజుల్లో ఆరుబయట అన్నం ముద్దలుగా చేసి ఉంచుతారు. పితృదేవతల ప్రీత్యర్యం వారికి ఇష్టమైనవి కూడా వండి బయట ఉంచి కాకులను ఆహ్వానిస్తారు. అవి వచ్చి తింటే పితృదేవతలు తిన్నట్టే భావిస్తారు. సంక్రాంతి మూడు రోజులు ఊళ్లో ఎటు చూసినా తనకు సమృద్ధిగా ఆహారం లభిస్తోంది కాబట్టి, కాకి ఎటూ కదలాల్సిన అవసరం ఉండదు. ఈ కారణంగానే కాబోలు.. ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అనే సామెత ఏర్పడింది.
సంక్రాంతికి గాలిపటాలను ఎగరేయడం సంప్రదాయం. అప్పుడప్పుడే వేడెక్కే ఎండల్లో గాలిపటాలను ఎగరేయడం ద్వారా సూర్యరశ్మి శరీరానికి తగినంత సోకి డి-వి•మిన్ లభిస్తుంది. దీనివల్ల చర్మవ్యాధులు దరిచేరవు.
•సంక్రాంతికి నువ్వుల వాడకం పెంచాలని అంటారు. ఈ పండుగ రోజులు చలికాలం. ఈ కాలంలో నువ్వులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అందుకే నువ్వులతో చేసిన లడ్డూలను తప్పక తినాలని అంటారు.
సంక్రాంతి సందర్భం..
పుట్టింట సంబురం
తెలంగాణలో సంక్రాంతి సందడి వేరే. ఈ పండుగ సందర్భంలో చేతివృత్తుల వారికి చేతినిండా పనే. పిల్లా పీచు మొదలుకుని పండుటాకుల వరకూ అంతా పుట్టింటి బాటపడతారు. ఏడాదిలో బంధువులందరినీ పలకరించడానికి సంక్రాంతిని ఒక సందర్భంగా భావిస్తారు. అలాగే, పుట్టింటికి వచ్చే పడుచులు పలు నోములు నోచుకుంటారు. బంధువులనూ, ఇరుగుపొరుగునూ అందరినీ ఈ నోముల్లో భాగం చేస్తారు. ఈ సందర్భంగా పూజల కన్నా సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు.
రకరకాల చెట్లనూ, నీటి వనరులనూ గౌరవిస్తూ ఆచరించే ఈ నోములు పర్యావర్ణ స్ప•హకు అద్దం పడతాయి.
గురుగులు, కుందెలు, గొల్లనోము, కుమ్మరివాము వంటి నోముల్లో మట్టికుండలూ, వెదురుబుట్టలూ వంటివి ఉపయోగిస్తారు. తద్వారా వీటిని తయారు చేసే చేతివృత్తుల వారికి రెండు చేతులా పని దొరుకుతుంది.
సంక్రాంతి సందర్భంగా కొత్తగా పెళ్లయిన వారు నోచుకునే ‘పెళ్లి నోము’ను చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ నోము సందర్భంలో నవదంపతుల ఇరువైపుల బంధువులూ ఒక్కచోట కలుస్తారు. దీంతో అనుబంధాలు మరింతగా పెరుగుతాయి. నోము తరువాత ఊరందరికీ భోజనాలు పెడతారు. అందరినీ అందరూ బంధుత్వాల వరుసలు కలుపుకుని నోరారా పలకరించుకుంటారు.
‘సందె దీపాల నోము’ది మరో విశేషం. ఈ నోము నోచే మహిళలు సంధ్యవేళ ఊళ్లోని 75 ఇళ్లకు వెళ్లి తమ చేతులతో దీపాలు పెడతారు. తమ ఇంట్లో దీపం పెట్టిన ఆడపిల్లపై ఆ ఇంటి వారికి బాధ్యతతో కూడిన బంధం ఏర్పడుతుంది. ఏ నోము నోచుకున్నా ఇంటింటికీ వెళ్లి నోచుకున్న వస్తువులను పంచడం మరో చక్కని సంప్రదాయం. దీనివల్ల చుట్టుపక్కల వారందరితోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇక, సంక్రాంతి సమయంలో ఆడపిల్లల చేత నోములన్నీ చేయించే బాధ్యతను పుట్టింటి వారే తీసుకుంటారు. పెళ్లి చేసి పంపించడంతోనే బాధ్యత తీరిపోలేదని, తల్లిదండ్రులతో పాటు ఆమె నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్య, మేనమామలూ ఎప్పుడూ అండగా నిలవాలనేది ఈ నోముల పరమార్థం.
ఇలా తెలంగాణలో సంక్రాంతి సమయంలో ఆచరించే ఈ నోములు పండగకు అదనపు శోభనూ, సందడినీ తెస్తాయి. ఊరంతటినీ ఒక్కచోటకు చేరుస్తారు.
పెద్దలకు తర్పణాలు విడవడం, వారి కోసం పూజలు చేయడం కూడా తెలంగాణలో సంక్రాంతి సంప్రదాయమే.
కన్నడలో ‘ఎల్లు బిరోదు’..
గుజరాత్‍లో ‘ఉత్తరాయణ్’..
తమిళనాట ‘కరినాళ్’..
తెలుగు రాష్ట్రాల్లోని గోదావరీ తీర ప్రాంతాల్లో కనుమ నాడు ప్రభల తీర్థం నిర్వహిస్తారు. వీటిని వీరభద్రుడికి ప్రతీకగా భావిస్తారు.
• మహారాష్ట్రలో సంక్రాంతిని మూడు రోజుల పాటు జరుపుకుంటారు. బంధుమిత్రులకు నువ్వుల లడ్డూలు పంచుతారు.
• తమిళనాడులో ఇది నాలుగు రోజుల పర్వం. అక్కడ సంక్రాంతిని పొంగల్ అని పిలుస్తారు. నాలుగో రోజున ఘనంగా పండుగ జరుపుకుంటారు. ఈ నాలుగో రోజును కరినాళ్ అంటారు. ఈ రోజు చుట్టాలను కలుసుకోవడం తప్పనిసరి. కుటుంబ సమేతంగా వన భోజనాలకు వెళ్లే సంప్రదాయం కూడా తమిళనాట ఉంది.
• కర్ణాటకలో పిల్లలంతా కొత్త బట్టలు ధరిస్తారు. బాలికలు ఇతర కుటుంబసభ్యుల బాలికల ఇళ్లకు వెళ్లి ప్లేట్లు మార్పిడి చేసుకోవడం ఇక్కడి సంక్రాంతి ఆనవాయితీ. ఈ సంప్రదాయానికి ‘ఎల్లు బిరోదు’ అని పేరు. ఎల్లు అంటే నువ్వులు. పళ్లెంలో నువ్వులు, బెల్లం, వేరుశెనగలు, ఎండుకొబ్బరి పెట్టి ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ మిశ్రమాన్నే ఎల్లు బెల్లం అంటారు.
• అసోంలో సంక్రాంతిని భొగాలి బిహు పేరుతో నిర్వహించుకుంటారు.
• గుజరాత్‍లో ఉత్తరాయణ్ పేరుతో పండుగ జరుపుకుంటారు. గాలిపటాలు ఎగురవేసే పోటీలు ఇక్కడ బాగా జరుగుతాయి.
• ఉత్తరప్రదేశ్‍లో ‘కిచెరి’ పేరుతో నిర్వహించుకునే పండుగ ఆకట్టుకుంటుంది. ఉదయాన్నే తల స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి నువ్వుల లడ్డూలు తింటారు.
సంక్రాంతి సంప్రదాయాలు
– రేగుపండ్లకు సంస్క•తంలో బదరీ ఫలమని పేరు. సూర్యుడి కాంతిని తనలో నిలుపుకునే శక్తి రేగుపండుకు ఉంది. ఈ పండ్లను పిల్లలపై పోయడం వల్ల సూర్యుడి శక్తి వారికి చేరుతుందనే ఉద్దేశంతోనే రేగుపండ్లు, చెరుకుముక్కలు, చిల్లర, నవధాన్యాలు, పాలకాయలు, పూతరేకులు తదితరాలను కలిపి భోగిపండ్లను పోస్తారు.
– ఒకప్పుడు నరనారాయణులు బదరీవనంలో భోగినాడే తపస్సు ప్రారంభించారట. దానికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాలను ఇవ్వడంతో దేవతలంతా వారి తలలపై బదరీ ఫలాలను కురిపించారట. అందుకే పిల్లల్ని నరనారాయణులుగా భావించి వారిపై భోగిపండ్లను వేస్తారని అంటారు. పిల్లలపై దసరా పండుగ సమయంలోనూ భోగిపండ్లు పోసి దిష్టితీసే ఆచారం ఉంది.
– తెలంగాణలో భోగిపండుగ నాడు భోగినోము అనే వ్రతాన్ని ఆచరిస్తారు. ఈనాడు మట్టికుండల్లో నువ్వుల ఉండలు, చెరుకుముక్కలు, జీడిపండ్లు, చిల్లర డబ్బులు వేసి వాటిని వాయనాలుగా ఇచ్చిపుచ్చుకుంటారు.
– భోగిపండుగ నాడు భోగిమంటలు వేసే సంప్రదాయం ఎలా ఏర్పడిందంటే.. సంక్రాంతి పండుగ భోగితోనే ప్రారంభమవుతుంది. ఉత్తరాయణ కాలం మొదలయ్యే ముందురోజు విపరీతంగా ఉండే చలిని తట్టుకునేందుకే తెల్లవారుజామున భోగిమంటలు వేస్తారు.
– అలాగే, గోదాదేవి ధనుర్మాసం మొదటి రోజు నుంచీ తిరుప్పావై పాశురాలతో రంగనాథుడిని ఆరాధించి భోగినాడే స్వామిని వివాహం చేసుకుని ఆయనలో లీనమైందట. ఆ కారణంగానే భోగి పండుగ ఏర్పడిందనే కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. అందుకే ధనుర్మాస వ్రతం భోగి పండుగతో ముగుస్తుంది.
– సంక్రాంతి పండులో మూడో రోజైన కనుమ నాడు ప్రభల తీర్థం నిర్వహించడం ఆనవాయితీ. ఇది కోనసీమ జిల్లాలోని పల్లెల్లో ప్రత్యేకం. ప్రభలను వీరభద్రుడికి సంకేతంగా భావిస్తారు. వీటిని అందంగా అలంకరించే విషయంలో ఆయా గ్రామాల్లో పోటీ పడతారు. పండుగకు దాదాపు పది రోజుల ముందు నుంచే ప్రభల అలంకరణ మొదలవుతుంది. పుల్లేటికుర్రు, నాగుల్లంక, పెదపట్నం, జగ్గన్నపేట, జగ్గయ్యతోట తదితర గ్రామాల్లో జరిగే ప్రభల తీర్థాలు ప్రసిద్ధి. వీటిని మొదట ఊరంతా తిప్పి.. ఒకచోట చేరుస్తారు. అక్కడ తీర్థం జరుగుతుంది. తిరిగి సాయంత్రం మళ్లీ ఊరంతా ఇంటింటికీ తిప్పి తీర్థాన్ని ముగిస్తారు. ఇక, పెదపట్నం తదితర గ్రామాల్లో అయితే ప్రభలను పంట కాలువలు దాటించడం కనులపండువగా సాగుతుంది.
పతంగుల పండుగ
సంక్రాంతి అంటే పిల్లలకు, యువతకు పతంగుల పండగే. రకరకాల గాలిపటాలను పోటీపడి ఎగురవేస్తారు. మరి, ఈ పతంగుల సంబరం వెనుక కూడా కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని మన సంక్రాంతి నేపథ్యం గల సంప్రదాయాలైతే.. మరికొన్ని దేశవిదేశాల్లోని సంప్రదాయాలు. అవేమిటంటే..
– గాలిపటం ఎగరేయడం ఒక సరదానే కానీ, జపనీయులకు మాత్రం బిడ్డల ఆరోగ్యం కోసం ప్రార్థించే ఒక క్రతువు. గాలిపటం ఎంత పైకి ఎగిరితే బిడ్డ ఆరోగ్యం అంత చల్లగా ఉంటుందనే నమ్మకం వారిది. గాలిపటాల సంబరాన్ని ఆ దేశంలో ‘హిమమాత్సు’గా పిలుస్తారు. ఏటా మే 3 నుంచి 5వ తేదీ వరకు ఈ ఉత్సవాలను జరుపుకుంటారు. దీనినే గోల్డెన్ వీక్‍గా కూడా పిలుస్తారు. క్రీస్తుశకం 1558లో హిమమత్సు రాజుకు కొడుకు పుట్టిన సందర్భంగా గాలిపటం మీద కొడుకు పేరు రాసి గాల్లో ఎగరేశాడట ఆ రాజు. ఆ సంబరం క్రమంగా రాజ్యమంతటా పాకింది. నేటికీ కొనసాగుతోంది. చంటిపిల్లలున్న ఇళ్లలో ఈ వేడుక తారస్థాయిలో జరుగుతుంది. హిమమాత్సులోని నకతైమా ఇసుక తిన్నెలు ఇందుకు వేదికవుతాయి. మే 3న ఉదయం 11 గంటలకు గంట కొట్టగానే ఒకేసారి ఆకాశంలోకి వంద పతంగులను ఎగురవేసి వేడుకలకు శ్రీకారం చుడతారు.
అక్కడ జాతీయ సెలవు దినం..
సంక్రాంతి పండగలో భాగంగా గాలిపటాలను ఎగరవేయడం మన దగ్గర సంప్రదాయం. గుజరాత్, తెలంగాణ, రాజస్తాన్, కర్ణాటకలోని అనేక నగరాలు ఈ వేడుకకు సిద్ధం అవుతాయి. అయితే, అహ్మదాబాద్ అయితే కైట్ క్యాపిటల్‍గా పేరు తెచ్చుకుంది. ఇక్కడ పతంగుల పండుల జనవరి 13న మొదలై మూడు రోజుల పాటు జరుగుతుంది. ఈ సమయంలో పిల్లల ప్రధాన కాలక్షేపం గాలిపటాలే. జనవరి 13న అక్కడ జాతీయ సెలవు దినం కూడా. 2012లో అత్యధికంగా నలభై రెండు దేశాల నుంచి వచ్చిన సందర్శకులు పతంగుల పండుగలో పాల్గొన్ని రికార్డు నెలకొల్పారు. సబర్మతీ తీరంలో ఎన్నో వేల గాలిపటాలను గాలిలో ఎగురుతుండగా చూడటం ఒక అందమైన అనుభవం. ఎంత లేదన్నా ఐదు లక్షల మంది ప్రేక్షకులు ఈ పతంగుల పండుగను వీక్షించడానికి ఇక్కడకు వస్తుంటారు.
Review ఊరికో క్రాంతి.. సంబరాల సంక్రాంతి.