గురువే దైవమైనది

గురువు అంటే ఎవరు? గురువు అవసరం ఏమిటి? ఈ ప్రశ్నలు సహజంగా తలెత్తేవే. నిజానికి భారతదేశమే ఒక జగద్గురువు. అపారమైన గురు పరంపరకు నిలయమైన ఈ పుణ్యగడ్డ ప్రపంచానికే గురువు వంటిది. ఇక్కడ పుట్టిన వేదం కూడా జగద్గురువే. ఇక్కడే ఆవిర్భవించిన యోగా నేడు అంతర్జాతీయ గురువు కూడా!. ఇక గురువు అంటే ఎవరనే విషయానికి వద్దాం. అసలు మనం పలికే మంత్రాలు, మాటలు పుట్టినవే గురువు ముఖతా. మంత్రాలకు మూలం పప్రథమ గురు సార్వభౌములు. మోక్షానికి మూలం జ్ఞానం. జ్ఞానానికి మూలం మహేశ్వరుడు. ఆ మహేశ్వరుడికి మూలం పంచాక్షరీ మంత్రం. ఆ మంత్రానికి మూలం గురువచనం. ఇక్కడ గురువు అంటే వేదం లేక వేద శాస్త్రాధ్యయనం చేసిన గురువు. అటువంటి గురువునే వెతికి పట్టుకోవాలి. అటువంటి గురువు దర్శనం, ఆయనకు చేసే పాదాభివందనం సర్వ పాప నాశనం. అజ్ఞాన నివారకం. జ్ఞానప్రదం. జూలై 27వ తేదీ, ఆషాఢ శుద్ధ పూర్ణిమ, శుక్రవారం నాడు గురుపూర్ణిమ సందర్భంగా ప్రత్యేక కథనం ‘తెలుగు పత్రిక’ పాఠకుల కోసం ప్రత్యేకం.\

ఆషాఢ శుద్ధ పూర్ణిమనే ‘గురు పౌర్ణమి’ లేదా ‘వ్యాస పూర్ణిమ’ అని అంటారు. ఈ తిథి వ్యాస మహర్షి జన్మతిథి అని ప్రతీతి. మన భారతదేశ గురు పరంపర అతి ప్రాచినమైనది. భార తీయ గురు పరంపరలో ప్రథమ గురువర్యుడు- శ్రీకృష్ణ పరమాత్మ. ఈయన రణరంగ క్షేత్రాన అద్భుత మైన భగవద్గీత అనే గొప్ప బహుమతిని లోకానికి అందించిన విశిష్ట యోగీశ్వరుడీయన. ఈయన తరువాత భారతాన్ని గ్రంథస్థం చేసి వ్యాసుడు గురు సంప్రదాయంలో ప్రథమ స్థానంలో నిలుస్తారు. అలాగే, మరో గురు సంపన్నులు దక్షిణామూర్తి. ఈయన జ్ఞాన సంపన్నుడు. ఈయన తరువాత అంతటి వారు ఆదిశంకరాచార్యులు. ఈయనే జగద్గురువుగా వాసికెక్కారు. ఈయన కూడా గోవింద భగవత్పాదుల వద్ద శాస్త్రాభ్యాసం చేసి అనతి కాలంలోనే గురువులకే గురువై జగద్గురువుగా అవతరించారు. జగత్తును దర్శించిన దార్శికుడాయన. అందుకే ఆయన ఈ జగత్తు (విశ్వం) మిథ్య అని, బ్రహ్మ సత్యమని లోకానికి చాటారు. ఇతిహాస సంపదను వ్యాసుడితో పాటు మనకు కానుకగా అందించిన వాల్మీకి కూడా గురుతుల్యులే. ఇంకా సూతుడు, శుకుడు, నారదుడు, సనత్కుమారుడు వంటి పురాణ పురుషులు కుడా మనకు గురు సమానులే. ఇక, మానవ జీవితంలోని మహిత సత్యాలను తాను నడయాడిన కాలంలో లోకానికి చాటిన షిర్డీ సాయినాథుడు సద్గురువుగా నిలుస్తారు. ప్రస్తుత కాలంలో గురుపూర్ణిమ అంటే షిర్డీ సాయినాథుడి ఆరాధనే జరిపేంతగా ఈ తిథి స్థిరపడింది.
గురుపూర్ణిమ పూర్వాపరాలివీ..
ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు అష్టాదశ పురాణ నిర్మాత, మహా భారతం తదితర సంహితా గ్రంథాలకు రచయిత అయిన వ్యాస మహర్షిని యథాశక్తి పూజిస్తారు. వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో జగద్గురువైన శంకరాచార్యుల వారు ఏర్పాటు చేశారని చెబుతారు. ఈనాడు చేసే పూజ విశేషమైనది. ఇది యతులకు ప్రశస్తమైన దినం.
వ్యాస పూర్ణిమనే గురుపూజా దినంగా కూడా వ్యవహరిస్తారు. ‘వ్యాస పూర్ణిమ’లోని ‘వ్యాస’ అనే పదానికి శంకరాచార్యులే పర్యాయపదమని కూడా అంటారు. శంకరాచార్యులు వ్యాస భగవానుని అపర అవతారమని కూడా వ్యాప్తిలో ఉంది. ఏదేమైనా ఈ లోకానికి వెలుగులు పంచిన వీరిద్దరూ గురోత్తములు. గురుపూర్ణిమ నాడు చేసే వ్యాసపూజ లోకంలోని సకల గురువులకు చేసే పూజగా భాసిల్లుతుంది.
గురువు లక్షణాలు ఇవీ..శాంత స్వభావం గలవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, సత్కులజుడు, వినమ్రుడు, పవిత్ర వేషం కలవాడు, సదాచార సంపన్నుడు, పేరు ప్రఖ్యాతలపై విమోహం కలవాడు, శుచిగా ఉంటూ నిత్యం శౌచం పాటించే వాడు, సమర్థుడు, బుద్ధిమంతుడు, శిష్యుని కోసం శ్రమించే వాడు, బ్రహ్మచర్య, గృహస్థాశ్రమాలను పాటించేవాడు, నిరంతర ధ్యాన పరాయణుడు, మంత్రతంత్రాలను ఎరిగిన వాడు, సరైన వేళలో సరైన వారిపై ఆగ్రహానుగ్రహములను ప్రదర్శించే వాడు.. ఈ లక్షణాలన్నీ మూర్తీభవించిన వాడే గురువు.
కబీర్‍దాస్‍ చెప్పిన గురు నిర్వచనం..
‘‘గురు గోబింద్‍ దోవు ఖడే కాకే లాగూ పాయ్‍
బలిహారీ గురూ ఆప్‍ నే గోబింద్‍ దియో బతాయ్‍’’
ఇదీ గురువుకు కబీర్‍దాస్‍ ఇచ్చిన నిర్వచనం. దీని తాత్పర్యం విశ్లేషిస్తే- ‘గురువు భగవంతుడు ఒకేసారి ముందుకు వస్తే ముందు ఎవరికి నమస్కరించాలి? భగవంతుడిని చూపిన వాడు గురువు. అందుకని గురువు కాళ్లకే నమస్క రించాలి’.
ఈ ఒక్క నిర్వచనం చాలు.. గురు ప్రాముఖ్య తను గుర్తెరగడానికి. గురువు గొప్పదనాన్ని గుర్తించడానికి ఇంతకు మించిన నిర్వచనం, ఉపమానం ఈ ప్రపంచంలో లేనేలేవు. భారతీయ సంప్రదాయంలో గురువుకు చాలా సమున్నత స్థానం ఉంది. భారతీయులు కేవలం గురువునే కాక, గురు పరంపరను అంటే తన గురువును (స్వ గురువు), గురువు గారి గురువు (పరమ గురువు)ను, వారి గురువు (పరమేష్టి గురువు)ను కూడా ఆరాధిస్తారు. సాధారణంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించే వారిని గురువు అంటారు. ఆ
జ్ఞానాన్ని ఆకాంక్షించే వారు తమ గురువులతో జీవితాంతం అనుబంధం కొనసాగిస్తారు. కొన్నిచోట్ల ఈ బంధం తరతరాల వరకు కూడా కొనసాగవచ్చు. ఇందుకు చక్కని నిదర్శనం- షిర్డీ సాయినాథుడు. ఆయన షిర్డీ అనే కుగ్రామంలో ఆవాసం ఏర్పర్చుకుని జనులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచారు. తేలికైన బోధనలు, సరళమైన పలుకులతో వెలకట్టలేని జ్ఞానాన్ని పంచిన జ్ఞాన గురుమూర్తి ఆయన. అందుకే ఈ గురు పౌర్ణమి నాడు సాయినాథుడిని యథాశక్తి కొలవాలి. గురు పరంపరలో చాలా మంది శిష్యులు, వారసులుగా తమకు తాముగా ప్రకటించుకోవచ్చు గాక!. కానీ భారతీయ గురు పరంపరలో చిట్ట చివరి సమర్థ సద్గురువు మాత్రం షిర్డీ సాయినాథుడే.

గురుపూర్ణిమ ఎలా వచ్చింది?
మనకు ఆషాఢ మాసం నుంచి వర్ష రుతువు ప్రారంభమవుతుంది. సన్యాసాశ్రమం స్వీకరించిన వారు ఆశ్రమ ధర్మంగా ఎక్కడా ఒకచోట ఎక్కువ కాలం గడపరు. కానీ, వర్షాకాలంలో వానల వల్ల ఇబ్బంది కలగడమే కాక, వ్యాధులు సోకడానికి అవకాశం ఎక్కువ. అందుకే సాధారణంగా వీరు ఆషాఢ పౌర్ణమి నుంచి నాలుగు నెలల చాతు ర్మాస్యం పాటిస్తారు. అంటే, తాత్కాలికంగా ఎక్కడో ఒకచోటే ఉంటారు. ఆ సమయంలో శిష్యులు వీరి దగ్గర జ్ఞాన సముపార్జన చేయడానికి వస్తారు. ఆ సందర్భంగా మొదటి రోజైన ఆషాఢ పౌర్ణమి నాడు గురుపూజ చేసేవారు. ఆ ఆచారం ప్రకారం ఈ పౌర్ణమి గురుపౌర్ణమి అయ్యిందని అంటారు.
తస్మై శ్రీ గురువే నమః
హలం పట్టుకున్నా.. కలం పట్టుకున్నా నేర్పేవాడు ఉన్నప్పుడే అందులో మెలకువలు తెలిసి వస్తాయి. ఆ నేర్పించే వాడే గురువు. లౌకిక, అలౌకిక, ఆధ్యాత్మిక.. ఇలా ఏ రంగంలో అయినా మనలను నడిపించడానికి గురువు కావాల్సిందే.
గుకారశ్చాంధకారస్తు రుకార్తన్నిరోధకత్‍
‘గు’ అంటే చీకటి. ‘రు’ అంటే దానిని హరించే వాడు. అంటే అజ్ఞానమనే అంధకారాన్ని హరించే వాడే గురువు.
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః
‘అజ్ఞానమనే చీకటి చేత అంధులైన వారికి జ్ఞానమనే అంజనాన్ని పూసి, కన్నులు తెరిపించిన గురువులకు నమస్కారం’ అని పై శ్లోకానికి భావం. సద్గురువు తారసపడిన నాడు అవివేకి కూడా వివేకవంతుడు అవుతాడు. గురు అనుగ్రహం కలిగిన నాడు అజ్ఞాని కూడా జ్ఞానవంతుడు అవుతాడు.
ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గురువును స్మరించుకుని, గౌరవించుకునే దినమే గురుపౌర్ణమి. ఈ రోజున గురువులను పూజించాలి. ఆరాధించాలి. వారి ఆశీర్వాదం పొందాలి. వినమ్రత అనే గురుదక్షిణను సమర్పించాలి. మన జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఈనాడు గురువులను యథాశక్తి కొలుస్తారు.
గురుపూర్ణిమ విధాయ కృత్యం..
గురుపౌర్ణమి నాడు ఆధ్యాత్మిక సాధనాపరులు ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తరువాత ఆహారం స్వీకరిస్తారు. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరించే సంప్రదాయం ఉంది. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొందరు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఆచరిస్తుంటారు.
హిందూ ధర్మంలో గురువుకే పెద్దపీట..
గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించే వాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పర్చుకుని ఉంటారు. హిందూ ధర్మంలో గురువును భగవంతుని భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తారు. వేదవ్యాసుడు మానవజాతికి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించి వెళ్లారు. కాబట్టి ఆయన మానవాళి అంతటికీ గురువుగా భాసిల్లుతున్నారు. అలాగే, షిర్డీ సాయినాథుడు తన బోధనల ద్వారా ఎందరికో మహిత సత్యాలను చాటారు. కాబట్టి ఆయననూ సద్గురువుగా ఎంచి పూజిస్తుంటారు.
గురువే తోడుంటే..
గురువు ఆవశ్యకత గురించి ఒకసారి షిర్డీ సాయినాథుని ఎదుట ప్రస్తావన వచ్చింది. అప్పుడు జరిగిన ఈ సంభాషణ గురువు ఆవశ్యకత గురించి, గురువు ప్రాముఖ్యత గురించి చెబుతుంది.
కాకాసాహెబు దీక్షిత్‍ సాయిబాబాకు గొప్ప భక్తుడు. ఒకసారి ఆయన బాబా ఎదుట వినమ్రంగా నిల్చుని బాబాను ఇలా అడిగాడు.
‘బాబా! షిర్డీ నుంచి వెళ్లవచ్చునా?’.
‘అలాగే. వెళ్లి రా’ అని బాబా బదులిచ్చారు.
ఈ సంభాషణ అర్థం కాక అక్కడ ఉన్న మరో భక్తుడు ‘ఎక్కడకు?’ అని ప్రశ్నించాడు.
‘చాలా పైకి’ అని బాబా బదులిచ్చారు.
‘అక్కడకు వెళ్లడానికి మార్గమేది?’ అని కాకాసాహెబు అడిగాడు.
‘అక్కడకు వెళ్లడానికి చాలా మార్గాలు ఉన్నాయి. షిర్డీ నుంచి ఒక దారి ఉంది. అయితే, ఆ మార్గం మిక్కిలి ప్రయాసకరమైనది. మార్గ మధ్యంలో ఉన్న అడవిలో పులులు, తోడేళ్లు కలవు’ అని బాబా చెప్పారు.
‘మరి ఏదీ మార్గం?’ అని కాకాసాహెబు మళ్లీ అడిగాడు.
‘మార్గదర్శకుడు తోడుంటే మనల్ని తిన్నగా గమ్యస్థానానికి చేరుస్తాడు. మార్గమధ్యంలో ఉన్న పులులు, గోతుల నుంచి మనల్ని తప్పిస్తాడు. మార్గదర్శకుడే లేకుంటే అడవి మృగాల బారిన పడవచ్చు. లేదా దారి తప్పి గుంటలలో పడిపోయే ప్రమాదం ఉంది. గురువు తోడు ఉంటే ఏది మంచి? ఏది చెడు? అనేది చెబుతాడు. క్షేమంగా మనల్ని దరి చేరుస్తాడు’ అని బాబా వివరించారు.
ఇది చాలా అర్థవంతమైన గురుశిష్య సంభాషణ. దీనిని విశ్లేషించుకుంటే ఎంతో అర్థముంది. దాన్ని అవగతం చేసుకుంటే పరమార్థం కలుగుతుంది.
గురువు అవసరమా? మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను విడిచి ఒకరికి ఎందుకు శుశ్రూష చేయాలి? గురువుకు ఎందుకు లొంగి ఉండాలి?.. ఇలాంటి ప్రశ్నలు చాలామందిలో ఉన్నాయి.
వేదాంత విషయాల్లో మనిషి స్వేచ్ఛాపరుడా? కాదా? అనే సంవాదం వల్ల కించిత్తు కూడా ప్రయోజనం లేదు. మనకు పరమార్థం నిజంగా గురు బోధనల వల్లనే కలుగుతుంది. రామకృష్ణులు వశిష్ట సాందీపులకు అణకువతో సేవచేసి ఆత్మసాక్షాత్కారాన్ని పొందారనే విషయాన్ని ఆధ్యాత్మిక సాధనపరులు ఇక్కడ మరువరాదు. గురు సేవ చేయాలన్నా, గురుకృప పొందాలన్నా ధృడమైన నమ్మకం (నిష్ట), ఓపిక (సబూరి) అనే రెండు గుణాలు అవసరం.
గురువు ఉండి తీరాలి..
భగవంతుని అనుగ్రహం మూగవానిని మాట్లాడేలా చేస్తుంది. కుంటివానికి పర్వతాన్ని అధిగమించే శక్తినిస్తుంది. లోకంలో తన ఇచ్ఛానుసారం పనులు నెరవేర్చుకునే చాతుర్యం ఆ భగవంతునికే ఉంది. హార్మోనియానికి కానీ, వేణువునకు కానీ ధ్వనులు ఎలా వస్తున్నాయో ఎవరికీ తెలియదు. వాటిని వాయించు వారికే ఆ విషయం తెలుస్తుంది. చంద్రకాంతం ద్రవించడం, సముద్రం ఉప్పొంగడం వాటి వల్ల జరగవు. అవి చంద్రోదయం వల్ల జరుగుతాయి. అలాగే భగవంతుని దర్శించడం, ఆత్మసాక్షాత్కారం పొందడం సామాన్య భక్తుల వల్ల కాదు. వాటిని సాధించాలంటే గురుకృప కావాలి. గురువు ఇంతకుముందే సాధనతో ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ఉండటం వల్ల దానిని పొందే మార్గాన్ని శిష్యులకు తేలికగా బోధించగలరు. ఒకరు జ్ఞాని కానిదే మరొకరికి జ్ఞానాన్ని ఎలా బోధించగలరు? అందుకే గురువు ఉండి తీరాలి.
ఈ కాలంలో మనకు సరైన దిక్సూచి, మార్గదర్శి సద్గురు సాయినాథుడే. ఆయన చేసిన బోధనలు గురువు విశిష్టతను తెలియ చెప్పి భగవంతునికి దగ్గర చేశాయి. ఆయన బోధనలు ఈ భూమి ఉన్నంత కాలం గురువై ఈ లోకానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయి.
సమస్త విద్యలకు అధి దేవత గురువు
మరో అర్థం ప్రకారం.. ‘గు’ అంటే సత్‍. అంటే బ్రహ్మ. ‘రు’ అంటే జ్ఞానం. అంటే గురువు బ్రహ్మజ్ఞాని. గురువు బోధించేది బ్రహ్మజ్ఞానం. గురువు తాను తలచుకుంటే, కోరుకుంటే ఏ రూపాన్నయినా ధరించగలరు. అటువంటి గురువును ఎల్లవేళలా ఆరాధించాలి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ షిర్డీ సాయినాథుడు. ఆయన తన శిష్యులకు, భక్తులకు వారికి కోరిన రూపాలలో దర్శనమిచ్చి జ్ఞానాన్ని, మోక్షాన్ని ప్రసాదించారు.
గురువు త్రిమూర్తి స్వరూపుడు. బ్రహ్మ స్వరూపం అంటే వేద స్వరూపం. వేదాలను దర్శించిన వారే అసలైన గురువు. అటువంటి గురువుకు నమస్కరించాలి. ఘటం, కలశం, కుంభం.. ఈ మూడు పదాలు సమానార్థకం కలవి. ఈ మూడు శబ్దాలూ ఘటమనే అర్థాన్నిస్తున్నాయి. అలాగే మంత్రదేవత, గురువు అనే శబ్దాలు కూడా సమాన అర్థాన్నిచ్చేవే. ఈ రెండు శబ్దాలు కూడా గురువనే అర్థాన్నే చెబుతున్నాయి.
గురువు అంటే సమస్త విద్యలను ఉపదేశించే వాడు. సకల ప్రాణికోటికీ జనకుడు, రక్షకుడు. మన లోక పాలకుడు. ప్రాణికోటి రక్షకుడు విష్ణువే. బ్రహ్మాదులకు కూడా సంప్రదాయబద్ధంగా బ్రహ్మవిద్యను ఒసగినది ఆయనే. ఆయన నుంచి వారసత్వంగా అందిపుచ్చుకున్న బ్రహ్మవిద్యను తరువాత తరాల్లో శిష్యలోకానికి అందించిన వారిలో శ్రేష్టులు సాయిబాబా.
తల్లి జన్మను ప్రసాదించి ఒడిలోనే తొలి పాఠాలు నేర్పుతుంది. మనకు ఊహ తెలిసే వరకు మంచిచెడులు చెబుతూ రెక్కలొచ్చే వరకు పోషించే వాడు తండ్రి. ఇక లోక జ్ఞానం నేర్పి ఆత్మజ్ఞానం అనే వెలుగు వైపు వేలు పట్టి నడిపించేది మాత్రం గురువే. గురువు కన్నా మించింది ఈ లోకంలో ఏదీ లేనేలేదు. తండ్రి కంటే తల్లి వందరెట్లు ఎక్కువ పూజ్యునీయురాలు. ఆ తల్లి కంటే కూడా నూరింతలు పూజించాల్సిన దైవం గురువేనని దేవీ భాగవతం చెబుతోంది. మన హిందూ ధర్మంలో ఎందరో దేవీదేవతలను పూజించడానికి ఎన్నో ప్రత్యేక దినాలను, తిథులను కేటాయించారు. అటువంటి వాటిలో ఆషాఢ శుద్ధ పూర్ణిమ విశేషమైనది.

శిష్యుడు – శవపేటిక
అనగనగా ఒక గురువు. మహా జ్ఞాని. సర్వ శాస్త్రాలనూ ఆయన ఔపోసన పట్టారు. అటువంటి గురువు వద్దకు ఒకడు వచ్చి తనను శిష్యుడిగా స్వీకరించాలని అభ్యర్థించాడు. అతను చాలా తెలివైన వాడు. ఏకసంధాగ్రాహి. కానీ, అతనిలో ఓ లోపం ఉంది. పచ్చి స్వార్థపరుడు. గురువు గారు అది గమనించారు. ఏదో ఒక లోపాన్ని ఎత్తిచూపి శిష్యుడిగా స్వీకరించకపోవడం గురుధర్మం కాదని ఎంచి గురువు గారు అతనిని శిష్యునిగా స్వీకరించారు. శిష్యునికి అన్నీ హృదయపూర్వకంగా బోధించారు. ఆ శిష్యుడు కూడా గురువు గారి వద్ద అన్నీ వినయంగా నేర్చుకున్నాడు. కొన్నాళ్లకు గురుశుశ్రూష పూర్తయ్యింది. తానే ఒక ఆశ్రమాన్ని నెలకొల్పాలనే ఆలోచన ఆ శిష్యునిలో కలిగింది. గురువు గారు బతికి ఉన్నంత కాలం అందుకు అవకాశం ఉండదు. కాబట్టి ఆయనను అడ్డు తొలగించుకుంటే తనకు పోటీ కూడా ఉండదని భావించాడు. ఇలా అనుకున్నదే తడవుగా ఆ శిష్యుడు గురువు గారిని ఓ పేటికలో బంధించి దాన్ని నదిలోకి తోసివేయాలని పథకం రచించాడు.
శిష్యుడి ఆలోచనలను, చర్యలను ఆ గురువు గారు గమనిస్తూనే ఉన్నారు. ఏం జరగబోతోందో తెలిసి కూడా ఆయన జ్ఞాని కనుక మౌనంగా ఉన్నారు. మరోపక్క శిష్యుడు తన పని తాను చేసుకు పోసాగాడు. రహస్యంగా గురువు గారి కొలతలు తీసుకున్నాడు. కొయ్యతో ఆ కొలతలకు అనుగుణంగా ఓ పేటిక తయారు చేయించాడు. దానిని ఒకనాడు గురువు గారి వద్దకు తెచ్చాడు.
‘గురువు గారూ! ఇందులో పడుకోండి’ అన్నాడు శిష్యుడు.
గురువు గారు మారు మాట్లాడకుండా ఆ పేటికలో పడుకున్నారు. పేటిక మూసేస్తున్న చివరి క్షణంలో గురువు గారు నోరు తెరిచి ఇలా అన్నారు.
‘నాయనా! నీ నిర్ణయాన్ని నేను ప్రశ్నించను. కాకపోతే నా బాధంతా ఒక్కటే. నాలాంటి ముసలివాడిని చంపడానికి ఇంత ప్రయత్నం, కష్టం కావాలా? నీళ్లలోకి తోసేస్తే సరిపోతుంది కదా? అలా అని ఈ పేటిక వృథాగా ఏం పోదు. కొన్నాళ్ల తరువాత నీ శిష్యులకు పనికి వస్తుంది’. గురువు గారిలో ఎటువంటి తొట్రుపాటు లేదు. ఆయనలో జ్ఞానం మరింత మూర్తీభవించింది. మౌనంగా, ప్రశాంతంగా ఉన్నారు. కానీ, శిష్యుడి ఒళ్లు జలదరించింది. ఎవరో తనను నీళ్లలోకి తోసేస్తున్నట్టుగా ఒక్క క్షణం ఒక దృశ్యం కళ్ల ముందు కదలాడి మాయమైంది. ఒకటే ఆందోళన. సన్నగా వణుకు. కళ్లు బైర్లు కమ్ముతుంటే తన తప్పు తెలుసుకున్నాడు.
గురువు అంటే బోధించే వాడు మాత్రమే కాదు. శిష్యుడనే వాడు నైతికత తప్పి పడిపోతుంటే తట్టిలేపే వాడు. దారి తప్పుతుంటే హెచ్చరించే వాడు కూడా.గురువు కళ్లుగప్పి చీమ కూడా చిటుక్కుమని అనలేదు.

సద్గురు సాయి బోధనలు
గురువు శిష్యుడు వేరు కాదు..
గురువు – శిష్యుడు వేరు కాదు. ఇద్దరూ పరమాత్మ స్వరూపులే. తనకు శిష్యుడు వేరు అనీ, తనకంటే శిష్యుడు తక్కువని భావించే వాడు గురువు కాదు. తన ఆత్మనే శిష్యునిగా భావించే వారే ఉత్తమ గురువులు. పూర్వం అటువంటి ఉత్తమ గురువులు ఉండేవారు. తన కంటే శిష్యుడు విద్యాధికుడు కావాలని, అతని జ్ఞానం ముందు తను వెలవెలబోవాలని అసలైన గురువులు కుతూహల పడతారట. అంటే, శిష్యులు తన శుశ్రూషలో తనను మించిపోవాలని భావించే వారన్న మాట నాటి గురువులు. తనకు వచ్చిన విద్యను, నేర్చుకున్న జ్ఞానాన్ని కించిత్తు కూడా దాచుకోకుండా శిష్యులకు బోధించిన గురువుల్లో ప్రథమవరేణ్యులు సద్గురు సాయిబాబా. ఆయన తన వద్దకు జ్ఞానం కోరి వచ్చిన అందరికీ తగినంతగా బోధించారు.
గురువు ఆవశ్యకత..
పాలలో ఎన్ని పాలు గుమ్మరించినా తోడుకోవు. చిటికెడు పెరుగు కావాల్సిందే. గురువు కూడా ఆ పెరుగు వంటి వాడే. జీవిత పరమార్థాన్ని బోధించి ఆ జీవితానికి ఒక అర్థాన్ని ప్రసాదించేది గురువు గారే.
మర్కట కిశోర, మార్జాల కిశోర న్యాయం
గురుశిష్య సంబంధానికి తొలి దశలో మర్కట కిశోర న్యాయం వర్తిస్తుంది. పిల్ల కోతి తల్లి కోతిని గట్టిగా పట్టుకుంటుంది. కొండలు దాటుతున్నా ఆ పట్టు వదలదు. చెట్లు, పుట్టలు ఆవలీలగా ఎక్కేస్తుంది. ఇంత జరుగుతున్నా పిల్ల కోతి పడిపోతానేమోనని భయపడదు. తల్లిపై దానికి అంత నమ్మకం. శిష్యుడు కూడా గురువును అదే మాదిరిగా విశ్వసించాలి.
మలిదశలో మార్జాల కిశోర న్యాయం వర్తిస్తుంది. పిల్లి తన పిల్లకు ఎటువంటి గాయాలూ కాకుండా, చాలా జాగ్రత్తగా తన పళ్లతో పట్టుకుని పలు గమ్యాలను చేరవేస్తుంది. గురువు కూడా అంతే. తననే నమ్ముకున్న శిష్యుడిని సురక్షితంగా ఒడ్డున పడేస్తారు.
సామాన్య సంభాషణలే మౌన ప్రబోధకాలు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, గ్రంథాలు ఇవ్వలేని జ్ఞానాన్ని సద్గురువు విప్పి చెప్పగలడు. సద్గురువు చర్యలు, సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధకాలు. శాంతి, క్షమ, వైరాగ్యం, దానం, ధర్మం, మనోదేహాలను స్వాధీనంలో ఉంచుకోవడం, అహంకారం లేకుండటం తదితర శుభ లక్షణాలను సద్గురువు యొక్క ఆచరణలో ప్రత్యక్షంగా చూసి, శిష్యులూ వాటిని నేర్చుకోగలుగుతారు.

మనసెరిగిన సాయి
శ్రీ సాయి సద్గురువు. కాబట్టే ఆయన భక్తుల మనసెరిగి తగిన అనుకూల నిర్ణయాలు తీసుకునే వారు. అందుకు ఈ లీల ఒక చక్కని ఉదాహరణ.
ఒకసారి ఖాపర్డే తన భార్యతో కలిసి షిర్డీ వచ్చి నాలుగు నెలల పాటు ఉన్నాడు. కానీ, అతని భార్య ఏడు నెలలు ఉంది. ఇద్దరూ షిర్డీలో ఉండగలిగినందుకు సంతోషించారు. ఖాపర్డే గారి భార్య బాబాపై అత్యంత భక్తిశ్రద్ధలు కలిగి ఉండేది. ఆమె బాబాను మిక్కిలి ప్రేమిస్తుండేది. ప్రతి రోజూ 12 గంటలకు బాబా కోసం నైవేద్యం స్వయంగా తెస్తుండేది. దానిని బాబా ఆమోదించిన తరువాత తాను భోజనం చేసేది. ఆమె యొక్క నిలకడను, నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించాలని ఒకసారి భావించారు.
ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయంలో ఒక పళ్లెంలో సాంజా, పూరీ, అన్నం, పులుసు, పరమాన్నం మొదలైనవి మసీదుకు తెచ్చింది. మామూలు రోజుల్లో గంటల కొలదీ భోజనం చేయక ఊరకనే ఉండే బాబా ఆనాడు వెంటనే లేచి, భోజన స్థలంలో కూర్చుని, ఆమె తెచ్చిన పళ్లెంపై ఆకు తీసి త్వరగా తినసాగారు.
అప్పుడు శ్యామా బాబాతో- ‘ఎందుకీ పక్షపాతం? ఇతరుల పళ్లెములను నెట్టివేస్తావు. వాటి వైపు చూడనైనా చూడవు. కానీ, ఈమె తెచ్చిన పళ్లెంను నీ దగ్గరకు లాక్కుని మరీ తింటున్నావు. ఈమె తెచ్చిన భోజనం ఎందుకంత రుచికరం? ఇది మాకు సమస్యగా ఉంది’ అన్నాడు.
బాబా అతనికి ఇలా బోధించారు- ‘ఈ భోజనం యథార్థంగా మిక్కిలి అమూల్యమైనది. గతజన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు. అది బాగా పాలిస్తుండేది. అక్కడి నుంచి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంట్లో జన్మించింది. తదుపరి ఒక క్షత్రియుని ఇంట్లో జన్మించి ఒక వర్తకుడిని వివాహమాడింది. తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబంలో పుట్టింది. చాలాకాలం తరువాత ఆమెను నేను చూశాను. కావున ఆమె పళ్లెం నుంచి ఇంకా కొన్ని ప్రేమయుతమైన ముద్దలను తీసుకొననివ్వు’.
అలా అంటూ బాబా ఆమె పళ్లెం ఖాళీ చేశారు. నోరు, చేతులు కడుక్కుని త్రేన్పులు తీస్తూ తిరిగి తన గద్దెపై కూర్చున్నారు. అప్పుడు ఖాపర్డే భార్య బాబాకు నమస్కరించింది. బాబా కాళ్లను పట్టసాగింది. ప్రతిగా బాబా ఆమె చేతులను నిమరసాగారు.
ఆధ్యాత్మికత తెలియని వారికి ఇది సామాన్య విషయంగా కనిపిస్తుంది. కానీ, ఇది అటువంటి సాధారణ విషయం కాదు. గురువు శిష్యునికి శక్తిని ప్రసాదించిన అరుదైన సందర్భం. సన్నివేశం గురుశిష్యుల సంబంధాన్ని బోధిస్తుంది. గురుశిష్యులు వేరు కారు. వారిద్దరి మధ్య భేదం లేదు. పైకి వారిద్దరు వేర్వేరుగా కనిపిస్తారు కానీ యథార్థంగా అంతరంగికంగా ఇద్దరూ ఒక్కటే. ఈ లీల ఆ విషయాన్నే చాటుతుంది.

Review గురువే దైవమైనది.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top