జంటలను కలిపే కళ్యాణ క్షేత్రం

శ్రీనివాసుని సమక్షంలో పెళ్లి చేసుకుంటే జీవితంలో అర్థం, పరమార్థం సిద్ధిస్తుందని ఆశించే వారెందరో! అటువంటి భక్తుల ఆశలకు వేదిక.. చేవెళ్ల (రంగారెడ్డి జిల్లా)లోని శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయం. హైదరాబాద్‍కు కేవలం 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం తిరుపతి, చిలుకూరు తరువాత అంతటి ప్రాశస్త్యం కలది.

ఈ ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో ఇక్కడ చిన్న ఆంజనేయస్వామి గుడి ఉండేది. పక్కనే పుష్కరిణి ఉండేది. వెంకన్న అనే అంధ భక్తుడు వేంకటేశ్వరస్వామికి పరమ భక్తుడు. ఆయన తరచూ తిరుపతి శ్రీనివాసుడి దర్శనానికి ఇక్కడి నుంచి కాలినడకన వెళ్లేవాడట. మిగతా రోజుల్లో ఆంజనేయస్వామి గుడిలో నిద్రించి, పక్కనే ఉన్న పుష్కరిణిలో స్నానాదులు కానిచ్చే వాడు. ఒకసారి యథా ప్రకారం తిరుపతి వెళ్తూ ఆంజనేయస్వామి ఆలయం వద్ద విశ్రాంతిగా ఆగాడు. ఆ సమయంలో ఆయనకు ఓ కల వచ్చింది. ‘అంత శమ్రపడుతూ తిరుపతి ఎందుకు వెళ్తావు?. నువ్వు ఉదయాన్నే లేచి స్నానానికి పుష్కరిణిలోకి దిగితే స్వయంభువు విగ్రహం దొరుకుతుంది. అది ఏ రూపంలో ఉంటుందో అలాగే ఇక్కడే ప్రతిష్ఠించు’ అనేది ఆ స్వప్న సారాంశం. వెంకన్నకు పుష్కరిణిలో నిజంగానే స్వామి విగ్రహం లభించింది. దాన్ని కనులారా దర్శించడానికి వెంకన్నకు చూపు కూడా వస్తుంది. విషయం తెలుసుకున్న అప్పటి పాపన్నపేట సంస్థానం వారు చేవెళ్లలో శ్రీబాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించి అందులో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం నర్కుడ సంస్థానాధీశులు ఆలయాన్ని మరింత అభివృద్ధి చేశారు. అప్పట్నుంచి నిత్యం పూజాధికాలు జరుగుతున్నాయి.
ఈ ఆలయంలో ఏటా దసరా నవరాత్రి ఉత్సవాలు, రథోత్సవాలు, మహా శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఇంకో విశేషం ఏమిటంటే, శివరాత్రి నాడు అంతటా శివకల్యాణం జరిగితే, ఇక్కడ మాత్రం వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు.

ఈ ఆలయంతో ముడిపడిన మరో విశేషం- ఇక్కడ పెళ్లిళ్లు చేసుకుంటే అంతా మంచే జరుగుతుందనే నమ్మకం. అందుకోసమే ఇక్కడ ప్రత్యేక కళ్యాణ వేదికను నిర్మించారు. అందుకే ఈ స్వామి కళ్యాణ వేంకటేశ్వరుడిగా ప్రతీతి.

తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహకారంతో ఆలయంలో పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఏటా ‘మన గుడి’ పేరిట ఇక్కడ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
చిలుకూరు బాలాజీ వీసాల బాలాజీగా ప్రసిద్ధి పొందగా, చేవెళ్ల వేంకటేశ్వరుడు పెళ్లిళ్ల వేంకటేశ్వరుడిగా ప్రఖ్యాతి చెందాడు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‍కు అత్యంత సమీపంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో గల ఈ ఆలయానికి చేరుకోవాలంటే బస్సు మార్గం మాత్రమే ఉంది. రైలు కనెక్టివిటీ లేదు. హైదరాబాద్‍ నుంచి మెహిదీపట్నం, లంగర్‍హౌస్‍ మీదుగా చేవెళ్ల సులభంగా చేరుకోవచ్చు. ఈ ఆలయం ఈ ప్రాంతాలకు 42 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే, మహాత్మాగాంధీ బస్సు స్టేషన్‍ నుంచి మెహిదీపట్నం మీదుగా ప్రయాణించే పరిగి, తాండూరు, వికారాబాద్‍ బస్సులు చేవెళ్ల మీదుగానే వెళ్తాయి. కర్ణాటక, కొడంగల్‍ వెళ్లే కొన్ని బస్సులు కూడా చేవెళ్ల మీదుగా ప్రయాణిస్తాయి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆయా బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అలాగే, శంషాబాద్‍ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ ఆలయం 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానాశ్రయంలో దిగే వారు ఔటర్‍ రింగ్‍ రోడ్డు ద్వారా పోలీస్‍ అకాడమీ, చిలుకూరు జింకల పార్కు, మెయినాబాద్‍ మీదుగా గంటలోనే ఇక్కడకు చేరుకోవచ్చు.
చిలుకూరు, చేవెళ్ల వేంకటేశ్వరాలయాలు దాదాపు ఒకే మార్గంలో ఉన్నాయి. కాబట్టి ఒకేరోజు ఈ రెండు ఆలయాలను దర్శించుకునేలా కూడా ప్రయాణ ప్రణాళికను రూపొందించుకోవచ్చు.

Review జంటలను కలిపే కళ్యాణ క్షేత్రం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top