
మొక్క నాటితే పండు ఇస్తుంది.. జెండా ఎగురవేస్తే దేశభక్తితో గుండెలు ఉప్పొంగుతాయి..
మనలోని దేశభక్తిని చాటుకోవడానికి ఆగస్టు 15 కేవలం ఒక సందర్భం మాత్రమే. నిజానికి ప్రతి క్షణం, ప్రతి రోజూ మనం దేశభక్తులుగానే ఉండాలి. ఎందరో త్యాగఫలంతో మనకీ పుణ్యభూమి దక్కింది. ఈ దేశపు కీర్తిపతాకను ఎల్లకాలం ఇలాగే నిలుపుకోవాలంటే, మనం నిరంతరం సైనికులమై ఉండాలి. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన వాళ్ల గురించి మనలో ఎంతమందికి తెలుసు? దేశకీర్తి పతాకాన్ని ఎగురవేసిన వాళ్లలో ఎంతమంది మనకు తెలుసు?.ఆంగ్లేయుల చెర నుంచి దేశాన్ని విముక్తి చేసిన రోజే ఆగస్టు 15. ఇదే మన భారతదేశపు స్వాతంత్య్ర దినోత్సవం. 1947, ఆగస్టు 15న వందల సంవత్సరాల బానిసత్వం నుంచి భారతదేశం విముక్తి అయ్యింది. మనకు స్వాతంత్య్రం అంత సులువుగా వచ్చిందా? ఎంతమంది త్యాగ ఫలితమో ఒకసారి తెలుసుకొందాం..
18వ శతాబ్దం చివరి నాటికి భారతదేశంలోని చాలా భాగాన్ని బ్రిటిష్ వారు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే 1857లో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం జరిగింది. భారత సిపా యిలు, రాజులు ఈ యుద్ధంలో ఓడిపోయారు. దీంతో 1858లో బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్యాధి నేత అయ్యారు. అప్పటి నుంచి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఎందరో దేశభక్తులు ఎన్నో విధాలుగా వివిధ మార్గాల్లో పోరాడారు. వీరందరి త్యాగ ఫలంగానే 1947, ఆగస్టు 14 అర్థరాత్రి మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. అర్ధరాత్రి వేళ.. అంత చీకట్లో కూడా కోట్లాది భారతీయుల కళ్లల్లో కోట్ల కాంతుల ఉషోదయం విరజిమ్మింది. ఆ ఉషోదయానికి ఇప్పుడు డెబ్బయి ఒక్క సంవత్సరాలు. ఇన్నేళ్లుగా మనం ప్రతి ఏటా ఆగస్టు 15ను ‘దేశం పుట్టిన రోజు’గా జరుపుకొంటున్నాం.
‘‘అనేక సంవత్సరాల క్రితమే మన భవితవ్యం గురించిన గమ్యస్థానాన్ని చేరుకొని తీరాలని మనం నిర్ణయించాం. మన ఈ నిర్ణయాన్ని పూర్తిగా, కూలంకషంగా సాధించే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. అర్ధరాత్రి పన్నెండు గంటలు కొట్ట గానే, ప్రపంచమంతా నిద్రాదేవి ఒడిలో పార వశ్యం చెంది ఉన్న సమయాన, భారతదేశం పునరుజ్జీవనంతో, స్వేచ్ఛా స్వతంత్ర దేశంగా ఆవిర్భవిస్తుంది’’ అని నెహ్రూ అన్నారు. చారిత్రాత్మకమైన ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆయన మొదటి స్వాతంత్య్ర దినోత్సవం నాడు చేసిన ప్రసంగమిది.
అహింసా మార్గంలో..
‘దెబ్బ తీయడం గొప్ప కాదు.. దెబ్బను సహిం చడం గొప్ప. అందుకు ఎంతో ఆత్మస్థైర్యం కావాలి’ అని నిరూపించిన జాతిపిత మహాత్మాగాంధీ అడుగుజాడల్లోనే మన యావత్తు జాతి నడిచి దేశానికి అహింసా మార్గంలో స్వాతంత్య్రాన్ని తెచ్చుకొంది. దక్షిణాఫ్రికా నుంచి భారత్‍కు ఒక స్థిరమైన ఆశయంతో వచ్చిన ఆయన భరతజాతిని స్వాతంత్య్ర సాధన దిశగా ఏకతాటిపై నడిపించారు. అప్పటి వరకు స్వాతంత్య్రం ఎలా సాధించాలనే విషయమై ఎవరికీ ప్రణాళిక లేదు. గాంధీ వచ్చిన తరువాతే స్వాతంత్య్రోద్యమం గొప్ప మలుపు తిరిగింది. ప్రజాగ్రహం స్థానంలో సత్యాగ్రహం..ఆక్రోశం ఆవేశాల స్థానంలో అహింసను ఆయు ధంగా మలిచి యావత్తు జాతిని మహాత్ముడు నడిపించిన తీరును చూసి ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోయాయి. సత్యాగ్రహం, దండి సత్యా గ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం.. ఇవన్నీ మహాత్మాగాంధీ చేపట్టిన అహింసాయుత ఉద్యమాలే. ఇవన్నీ బ్రిటీషర్లను గడగడలాడించాయి. ఆయన చేపట్టిన ఏ ఉద్య మానికైనా భారత ప్రజలు సంపూర్ణ మద్దతును, సహకారాన్ని అందించారు. ‘వందేమాతరం’ అంటూ ఆయన వెనుక జనం దండు కట్టింది.
పదహారవ శతాబ్దంలో పోర్చుగీసు ఆక్రమణ లకు వ్యతిరేకంగా అబ్బక్కరాణి చేసిన పోరాటా లను, పదిహేడవ శతాబ్దం మధ్యలో బెంగాల్‍లో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటాలను వలస పాలనపై వ్యతిరే కతకు మొదటి అడుగులుగా చెప్పవచ్చు. మొదటి సంఘటిత సాయుధ పోరాటం బెంగాల్‍లో ప్రారంభమై తరువాత రాజకీయ పోరాటంగా పరిణామం చెందిన భారత జాతీయ కాంగ్రెస్‍గా ఆవిర్భవించింది. అదే నేటి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్‍లో అతివాదులైన లాలా లజపతిరాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్ (లాల్, బాల్, పాల్) విదేశీ వస్తు బహిష్కరణ, సమ్మె, స్వావలంబన మొదలైన పద్ధతులను అవలంబిస్తే, అరబిందో వంటి వారు తీవ్రవాద మార్గాలను అవలంబించారు. మొదటి దశకాలలో సాయుధ విప్లవ పోరాటాలు ముందుకు వచ్చాయి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ, అమెరికాల్లోని భారత స్వాతంత్య్రయోధులు ప్రారంభించిన గదర్ పార్టీ సహకారంతో జరిగిన సంఘటిత భారత సిపాయిల తిరుగుబాటు జాతీయోద్యమంలో వచ్చిన ఒక గొప్ప మౌలిక మార్పు. జాతీ యోద్యమం చివరి దశలో జాతీయ కాంగ్రెస్ మహాత్మాగాంధీ నాయకత్వంలో అహింసాయుత మార్గాలలో ఉద్యమించింది. ఆ కాలంలోనే ప్రముఖ విద్యావేత్త రాంజీ సింగ్ మహాత్మాగాంధీని ఇరవయ్యవ శతాబ్దంలో అవతరించిన బోధి సత్వునిగా కీర్తించారు. అయితే, ఇతర నాయకులు సాయుధ పోరాటాలను అనుసరించారు. సుభాష్ చంద్రబోస్ సాయుధ సంగ్రామమే సరైనదిగా భావిస్తే, స్వామి సహజానంద సరస్వతి సన్నకారు రైతులు, శ్రామికుల సంపూర్ణ ఆర్థిక స్వాతంత్య్రం కోసం పిలుపునిచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలానికి ఈ ఉద్యమాలు ఉదృత రూపం దాల్చాయి. నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో భారత జాతీయ సైన్యాన్ని స్థాపించి తూర్పు ఆసియా నుంచి పోరాడగా, భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది. మహాత్మా గాంధీ నాయకత్వంలో చివరకు ఆగస్టు 15, 1947లో భారతదేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భ వించింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయితే, అప్పటి వరకు బ్రిటిష్ వారి పాక్షిక పాలనలోనే భారత్ కొనసాగింది. భారత రాజ్యాంగం భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవింప చేసింది.
భారత స్వాతంత్య్ర దినోత్సవం చాలా విలక్షణ మైనది. ఆ రోజు బడిలో, గుడిలో, కళాశాలల్లో, కార్ఖానాల్లో, స్వదేశంలో, విదేశంలో.. ఇంటా బయటా.. ఇలా భారతీయులు ఎక్కడ ఉంటే అక్కడే దేశభక్తి గుండెల నిండుగా ఉప్పొంగగా ఇండిపెండెన్స్ డేను నిర్వహించుకొంటారు. త్రివర్ణ పతాకాన్ని స్వేచ్ఛాప్రతీకగా ఎగురవేస్తారు. ఇంటా బయటా అంటే, స్వదేశంలో ఉన్నా, విదేశంలో ఉన్నా అనే అర్థం వస్తుంది. ఆ రోజు భార తీయులు ఎక్కడ ఉంటే అక్కడే స్వాతంత్య్ర కాంక్ష వెల్లివిరుస్తుంది.
‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము’
అంటూ ఎలుగెత్తి కీర్తించిన రాయప్రోలు సుబ్బారావు గారి ప్రబోధాన్ని మరోసారి మననం చేసుకొంటూ వచ్చే స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకొందాం.
మనకు ఈనాడు లభించిన స్వేచ్ఛ అంత సులువుగా దక్కలేదు. మనందరి స్వేచ్ఛ కోసం ఎందరో తమ ప్రాణాలను పణంగా పెట్టారు. ప్రాణాలను లెక్క చేయకుండా కదనరంగంలోకి దూకి అసువులు బాశారు. భారతదేశాన్ని తమ కబంధ హస్తాల్లో బంధించిన తెల్లదొరల గుండెల్లో నిద్రపోయిన మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు నుంచి సాయుధ సంగ్రామానికి సైన్యం ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ వరకు స్వాతంత్య్రం కోసం ఎందరో ప్రాణార్పణ చేశారు. అటువంటి వారందరినీ కనీసం ఏడాదికి ఒక్కసారైనా స్మరించుకోవడం మనందరి కనీస ధర్మం. మన భారతీయ పండుగలు, పర్వదినాల్లో ఆగస్టు 15 మరి దేనికీ తీసిపోదు. దసరా, దీపా వళి, రంజాన్, క్రిస్మస్.. ఇవన్నీ వేర్వేరు మతాలకు చెందినవైతే, అన్ని మతాల అభిమతాలను ప్రతి ఫలించేది పంద్రాగస్టు పండుగ. ‘జైహింద్’ అంటూ చేసే సింహనాదంతో ఆగస్టు 15 నాడు పతి భారతీయుని హృదయం ఉద్వేగంతో నిండి పోతుంది. దాదాపు రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలన నుంచి అఖండ భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చిన ఆ శుభదినాన్ని తల్చుకుంటేనే ప్రతి భారతీయుని కంఠధ్వని ‘జైహింద్’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మార్మోగుతుంది.
ఎందరో ప్రాణత్యాగంతో మనకు స్వాతం త్య్రాన్ని సిద్ధింప చేశారు. మనం బానిసత్వాన్ని తెంచుకున్నాం. స్వేచ్ఛను పొందాం. ఇక, అయి పోయినట్టేనా? లేదు. స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చుకోవడం ఇప్పుడు మనందరి చేతుల్లోనే ఉంది.
వీరిలో ఎందరు తెలుసు?
మహాత్మాగాంధీ (మోహన్‍దాస్ కరమ్‍చంద్ గాంధీ), సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజా రామ్మోహన్‍రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకించంద్ర చటర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, చిత్త రంజన్‍దాస్, అరవింద ఘోష్, సుభాష్ చంద్ర బోస్, సరోజినీ నాయుడు, మౌలానా అబుల్ కలాం ఆజాద్, అరుణా ఆసఫ్ అలీ, తాంతియా తోపే, నానా సాహెబ్, దయానంద సరస్వతి, దాదాబాయి నౌరోజి, ఝూన్సీ లక్ష్మీబాయి, మహదేవ గోవింద రెనడే, డబ్ల్యూ సీ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, అనిబిసెంట్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్, కన్నెగంటి హనుమంతు, మోతీలాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, మదన్ మోహన్ మాలవ్య, రమాబాయి రానడే, లాలా లజపతి రాయ్, గోపాలకృష్ణ గోఖలే, కొండా వెంకటప్పయ్య, కాశీనాథుని నాగేశ్వరరావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం, కస్తూర్బా గాంధీ, మహమ్మద్ ఇక్బాల్, విఠల్‍బాయ్ పటేల్, షౌకత్ అలీ, ఉన్నవ లక్ష్మీనారాయణ, మహమ్మద్ అలీ జిన్నా, మౌలానా మహమ్మద్ అలీ, రాజగోపాలా చారి, ముట్నూరి కృష్ణారావు, సీవై చింతామణి, భోగరాజు పట్టాభిరామయ్య, సుబ్రహ్మణ్య భారతి, ఖాన్ సాహెబ్, వినాయక్ దామోదర్ సావర్కర్, బాబూ రాజేందప్రసాద్, పింగళి వెంకయ్య, మాడ పాటి హనుమంతరావు, త్రిపురనేని రామస్వామి, ఎమ్.ఎన్.రాయ్, బులుసు సాంబమూర్తి, సత్యమూర్తి, జేబీ కృపలానీ, దుగ్గిరాల గోపాల కృష్ణయ్య, ఆచార్య నరేంద్రదేవ్, జవహర్‍లాల్ నెహ్రూ, బూర్గుల రామకృష్ణారావు, ఖాన్ అబ్దుల్ గఫార్‍ఖాన్, బీఆర్ అంబేద్కర్, అనంతశయనం అయ్యంగార్, గరిమెళ్ల సత్యనారాయణ, వరాహ గిరి వెంకటగిరి, కాలేల్ కర్, వినోభా భావే, మొరార్జీ దేశాయ్, ఆచార్య ఎన్‍జీ రంగా, అల్లూరి సీతారామరాజు, గుల్జారీలాల్‍నందా, ఉద్ధామ్ సింగ్, కళా వెంకటరావు, కల్లూరి సుబ్బారావు, పద్మజా నాయుడు, విజయలక్ష్మీ పండిట్, సానే గురూజీ, పొట్టి శ్రీరాములు, మొసలికంటి తిరుమలరావు, కామరాజ్ నాడార్, జయప్రకాశ్ నారాయణ్, స్వామి రామానందతీర్థ, పుచ్చలపల్లి సుందరయ్య, లాల్ బహదూర్ శాస్త్రి, చంద్రశేఖర్ ఆజాద్, భగత్‍సింగ్, బెజవాడ గోపాలరెడ్డి, దుర్గాబాయి దేశ్‍ముఖ్, న్యాపతి సుబ్బారావు పంతులు, రామ్ మనోహర్ లోహియా, ప్రతివాది భయంకరాచార్యులు, రామస్వామి వెంకట్రామన్, రాజ్ గురు, నీలం సంజీవరెడ్డి, ఇందిరాగాంధీ, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, మగ్దూం మోహియుద్దీన్, టంగుటూరి అంజయ్య, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఆచార్య రంగా, కల్లూరి చంద్రమౌళి, తెన్నేటి విశ్వనాథం, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, కొండా వెంకటప్పయ్య, బూర్గుల రామకృష్ణారావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, పీవీ నరసింహారావు, పెండేకంటి వెంకట సుబ్బయ్య, కానూరు లక్ష్మణరావు, వావిలాల గోపాలకృష్ణయ్య, దామోదరం సంజీవయ్య, రామకృష్ణ రంగారావు, ప్రతివాది భయంకర వేంకటాచారి, కన్నెగంటి హనుమంతు, మాడపాటి హనుమంతరావు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, అయ్యంకి వెంకట రమణయ్య, మోటూరి సత్యనారాయణ.. ఇంకా ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు చెప్పడానికి మనకొక అవకాశం కల్పిస్తుంది ఆగస్టు 15. వీరందరి త్యాగమూర్తుల పోరాట ఫలితంగా భారత ప్రజలు నేడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తు న్నారు. స్వతంత్య్ర భారతదేశంలో కొత్త తరం ముందుకు వచ్చింది. భారత ఉపఖండంలో స్వాతంత్య్రం కోసం జరిగిన అనేక ఉద్యమాల నన్నిటినీ కలిపి ‘భారత స్వాతంత్య్రోద్యమం’గా చెబుతున్నారు. అనేక సాయుధ పోరాటాలు, అహింసాయుత పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్య్రోద్యమంలో భాగాలు. భారత ఉపఖండంలోని బ్రిటిష్, ఇతర వలస పాలకుల పాలనను అంతమొందించడానికి వివిధ సిద్ధాం తాలను అనుసరించే అనేక రాజకీయ పక్షాలు
ఉద్యమించాయి.
‘దేశమును ప్రేమించుమన్నా.. మంచి అన్నది పెంచుమన్నా’ అని గురజాడ అన్నారు.
దేశం మంచిగా ఉండాలంటే, మంచి మనసుతో ఉండాలి. ఆ మనసులో దేశభక్తి
ఉండాలి. ప్రాణం ఇచ్చే సిపాయి, ప్రాణం నిలిపే రైతుకు మనం నిరంతరం అండగా నిలవాలి. నిజానికి చెడును నిర్మూలించే ప్రతి ఒక్కరూ సైనికులే. మన చుట్టూ ఉన్న చెడును విధ్వంసం చేస్తే మీరే సైనికుడు. మీ చుట్టూ ఉన్న మంచి తనాన్ని పరిరక్షించి, పెంచితే మీరే రైతు. అంటే ‘జై జవాన్’ మనలోనే ఉన్నారు. ‘జై కిసాన్’ కూడా మనలోనే ఉన్నారు. నిండైన దేశభక్తి కూడా మనలో ఉంది. కాబట్టి నాటి అమరుల స్ఫూర్తిగా సురాజ్య సాధనకు పాటుపడటం ప్రతి భారతీయుని కర్తవ్యం.
గుండెల నిండుగ.. జాతీయ జెండా
అది దేశపు కీర్తిపతాక.. జాతి గౌరవ మర్యాదలను, కీర్తి ప్రతిష్టలను చాటే నిలువెత్తు బావుటా. మనకే కాదు ఏ దేశానికైనా ఆ దేశపు జాతీయ పతాకమే నిలువెత్తు స్వాభిమాన సంకేతం. మన దేశ స్వాతంత్య్ర కాంక్షను చాటేది త్రివర్ణ పతాకమే. ఆ జయకేతనం నేటి రూపానికి ముందు ఎన్నో రూపాలను సంతరించుకొంది. వాటన్నిటి గురించీ తెలుసుకొందాం.
జెండా లేదా ధ్వజం అనేది ఓ విజయచిహ్నం. రామాయణ కాలంలో భరతుడు ‘కోవిధార’ (ఓ అందమైన చెట్టు) గుర్తు ఉన్న ధ్వజాన్ని వాడేవాడు. రాముడు తమ కులదైవమైన సూర్యుడి గుర్తు ఉన్న ధ్వజాన్నీ, రావణుడు కపాల ధ్వజాన్నీ వాడినట్టు చెబుతారు. కురుక్షేత్ర సంగ్రామంలో ఒక్కొక్కరు ఒక్కో జెండాను వాడారు. కృష్ణుడి రథంపై హనుమంతుని ధ్వజం ఎగురుతూ కనిపిస్తుంది. బౌద్దులు, జైనులు కూడా ధ్వజాలను వాడారు. అశోకుడు సారనాథ్ ఆలయం మీద చెక్కించిన ధర్మచక్రమే నేడు మన జాతీయ పతాకంలో కనిపిస్తుంది. ధ్వజంలో మూడు రకాలు ఉన్నాయి. గాలిలో ఎగిరే వస్త్రాన్ని ‘పతాక’ అనీ, దాని మీదున్న చిహ్నాన్ని ‘కేతు’ అనీ, ఆ పతాకం ఎగిరేందుకు ఆధారంగా ఉన్న కొయ్యను ‘యుష్టి’ అని అంటారు. అయితే, ధ్వజం, పతాకం రెండూ ఒకటే కాదు. ధ్వజం దీర్ఘచతురస్రాకారంలో ఉంటే, పతాకం త్రికోణాకారంలో ఎలాంటి చిహ్నం లేకుండా ఉంటుంది. ఇక, స్వతంత్ర భారత పోరాటంలో ఎగిరిన జెండాల విషయానికి వస్తే..
1857లో సిపాయిల తిరుగుబాటు ద్వారా ఆంగ్లేయులపై భారతీయులు తొలి సమరశంఖం పూరించారు. ఆ పోరులో ఎన్నో జెండాలు ఎగిరాయి. బహదూర్‍షా వాడిన ఆకుపచ్చ, బంగారు వర్ణాలు కలగలిసిన జెండా మీద ‘హిందూ ముస్లిం, సిఖ్ హమారా’ అంటూ కనిపించిన పదాలు జాతీయ భావనలను కలిగించాయి. అనంతరం వివేకానంద శిష్యురాలైన సోదరి నివేదిత తొలుత జాతీయ పతాక రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. అందులో ఎరుపు, నలుపు రంగులను వాడారు. తరువాత ఆమె తన విద్యార్థుల కోసం సింధూర, పసుపు రంగుల్లో మరో జెండాను తయారు చేశారు. దాన్ని 1906లో కలకత్తా కాంగ్రెస్ సభలో ప్రదర్శించారు. చతురస్రాకారంలో ఉన్న దీని అంచుల మీద 108 జ్యోతులు, మధ్యలో పసుపు రంగులో వజ్రాయుధం, దానికి ఇరువైపులా వందేమాతరం అని విడివిడిగా పసుపు రంగులో బెంగాలీలో రాసి ఉంటుంది. అదే సమయంలో సచ్చీందప్రసాద్ బోస్, సుకుమార్ మిత్రా ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగులున్న జెండాకు రూపకల్పన చేశారు. ఈ జెండా భారతీయుల గుండెల్లో విప్లవాగ్నులు జ్వలింపచేసింది. ఆ తరువాత కొంతకాలానికి తిలక్, అనిబిసెంట్‍ల నాయకత్వంలో హోమ్‍రూల్ ఉద్యమం ప్రారంభమైంది. ఈ సమయంలో మరో పతాకం రూపుదిద్దుకుంది. ఇందులో ఐదు ఎరుపు, నాలుగు ఆకుపచ్చ రంగు చారలు ఒకదాని తరువాత ఒకటి ఉంటాయి. దానిపై ఏడు నక్షత్రాలు ఉంటాయి. అయితే, అప్పటికే 1916లో ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నానికి చెందిన పింగళి వెంకయ్య గాంధీజీ ఉద్యమానికి స్ఫూర్తి పొంది, మొత్తం భారతావనిని ప్రతిబింబిస్తూ ఉమ్మడి జాతీయ పతాకావశ్యకతను గుర్తించి, దాని రూపకల్పనకు స్వయంగా శ్రీకారం చుట్టారు. లాలా హన్స్లాల్ ఆ పతాకంపై చరఖాను కూడా పెడితే బాగుంటుందనే సూచన చేయగా, గాంధీ అందుకు అంగీకరించారు. దాంతో 1921లో బెజవాడలో జరిగిన ఓ సమావేశంలో హిందూ ముస్లిం సమైక్యతను సూచిస్తూ, ఎరుపు- ఆకుపచ్చ రంగుల్ని సమానంగానూ, వాటి మీద పెద్ద చరఖాను చిహ్నంగా ఉంచి, జెండా నమూనాను రూపొందించాలని పింగళి వెంకయ్యను గాంధీ అడిగారు. గాంధీ కోరినట్టుగా మూడే మూడు గంటల్లో వెంకయ్య నమూనాను తయారు చేసి ఇచ్చారు. అయితే, ఎందురో రెండు రంగులున్న ఆ జెండా అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. అనంతరం కొద్దికాలానికి ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులున్న జెండాకు రూపకల్పన చేయాలని మహాత్మాగాంధీ మళ్లీ వెంకయ్యకు సూచించారు. ఆ రకంగా రూపుదిద్దుకున్న మువ్వన్నెల జెండా అఖిల భారత కాంగ్రెస్ జెండాగా ఆవిర్భవించి, 1921లో అహ్మదాబాద్‍లో జరిగిన సభలో ఎగిరింది. అనంతరం జరిగిన ఉద్యమాలు, సత్యాగ్రహాల్లో ఈ త్రివర్ణ పతాకం ఎగిరింది. మిక్కిలి ప్రాచుర్యంలోకి వచ్చింది. 1924లో బెల్గాంలో జరిగిన కాంగ్రెస్ సభలో సేవాదళ్‍కు చెందిన కొందరు ఈ త్రివర్ణ పతాకానికి భక్తితో వందనం చేశారు. అదే ఏడాదికి ఉత్తరప్రదేశ్‍కు చెందిన శ్యామ్‍లాల్ గుప్తా ‘విజయీ విశ్వ తిరంగా ప్యారా, జండా ఊంఛా రహే హమారా’ అనే ఉత్తేజిత గీతాన్ని స్వరపరిచారు.
1929లో సిక్కులు.. జెండాలో పసుపు రంగు ఉంచాలని డిమాండ్ చేశారు. దీంతో 1931లో ఫ్లాగ్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ మతాలను విస్మరిస్తూ- తాగ్యనిరతిని, ఆత్మస్థైర్యాన్ని ప్రతిబింబించే కాషాయాన్నీ, స్వచ్ఛతనీ, శాంతిని, నిజాయతీని చాటే తెలుపునీ, దేశంలోని పాడిపంటల్నీ, ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని సూచించే ఆకుపచ్చఅయ రంగునీ, సాధారణ ప్రజల్నీ, వారి పరిశ్రమకూ గుర్తుగా నీలంరంగు రాట్నం ఉన్న జెండాను జాతీయ జెండాగా ఆమోదించింది.
Review జై జీవన్… జై కిసాన్… జై హింద్.