నాన్నంటే త్యాగం! నాన్నంటే జీవితం!!

ఎవరి జీవితంలోనైనా తొలి స్థానం అమ్మదైతే.. రెండో స్థానం నాన్నది. అమ్మ కనిపించే వాస్తవం. నాన్న ఓ నమ్మకం. లాలించేది అమ్మ ఒడి. నాన్న భుజం లోకాన్ని చూపించే బడి. అమ్మ జోలపాట.. నాన్న నీతి పాఠం..

తమకన్నా మిన్నగా బిడ్డలు తయారు కావాలని కలలు కనేది కన్నవారే. కాలం బాట మీద కనిపించని సాధకుడు ఎక్కుపెట్టిన బాణం బిడ్డ అయితే.. వంచిన విల్లు వారి తల్లిదండ్రులు.చిట్టి చేతులు పట్టి లోకాలను చూపిన కన్న వారి చేతులు పిన్న వారి కోసం చివరి శ్వాస దాకా అలా ఆశగా చాచే ఉంటాయి. బిడ్డకు అంతా తానే అయి ఉండే తండ్రికి కృతజ్ఞతలు తెలిపే పండుగే తండ్రుల దినోత్సవం.
దాదాపు యాభైకి పైగా దేశాల్లో ప్రతి ఏటా తండ్రుల దినోత్సవం పాటిస్తున్నారు.

ఈ ఏడాది జూన్‍ 16, 2024న ఫాదర్స్ డే జరుపుకోనున్నాం.

అంతర్జాతీయంగా మాతృ దినోత్సవం జరుపుకోవడం 1872 సంవత్సరం నుంచి మొదలైంది. తల్లుల కోసం ప్రత్యేకంగా ఒకరోజును జరుపుకుంటున్నపుడు బాధ్యతకు మారుపేరైన తండ్రుల కోసం కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలని అమెరికన్‍ మహిళ సానోరా స్మార్ట్ డాడ్‍ తండ్రుల దినోత్సవం కోసం ప్రచారం ప్రారంభించింది.

ఆమె ప్రచారం ఫలితంగా 1910లో తొలిసారిగా అమెరికాలో తండ్రుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీంతో ఆమె ‘మదర్‍ ఆఫ్‍ ఫాదర్స్ డే’గా గుర్తింపు పొందింది. క్రమంగా దీనికి ఆదరణ పెరగడంతో అంతర్జాతీయ స్థాయికి విస్తరించి, 1972 నుంచి ఏటా జూన్‍ నెల మూడో వారం అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం జరుపుకోవడం మొదలైంది.

కాలం మారింది. కాలంతో పాటు జీవనశైలి మారింది. పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉద్యోగాలు చేస్తూ కుటుంబ బాధ్యతల్లోనే కాకుండా, ఆర్థికంగా కూడా బాధ్యతలను పంచుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో పిల్లల ఆలనాపాలనా ఒక్క మహిళలకే కాదు పురుషులు కూడా బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తండ్రి తోడు ప్రతి బిడ్డకు ఓ రక్షణ కవచం. మగపిల్లల కంటే ఆడపిల్లలతోనే తండ్రికి అనుబంధం ఎక్కువ. బొమ్మలు ఎన్ని బహుమతిగా ఇచ్చినా.. తానే బొమ్మయి ఆడించే నాన్న వెంట ఉంటే ఇంకేం కావాలి ఆడపిల్లలకు? కోరినవన్నీ క్షణాల్లో తెచ్చిపెట్టే తండ్రే తమ లోకం అనే భావన ప్రతి బిడ్డకు ఉంటుంది. అంతటి అపారమైన ప్రేమను పంచడం ఒక్క తండ్రికే సొంతం. గతంలో తల్లికి బాగా దగ్గరగా ఉండే పిల్లలు నేడు తండ్రికి దగ్గరవుతున్నారు. తండ్రి ఓ స్నేహితుడిగా, పిల్లల మానసిక పరిస్థితులను బట్టి సలహాలు, సూచనలు ఇస్తూ వారి ఎదుగుదలకు కృషి చేస్తూ ఉంటాడు. తాను కరుగుతూ తన బిడ్డల ఎదుగుదలకు, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు తండ్రి చేసే త్యాగం మాటల్లో చెప్పలేనిది, వెలకట్టలేనిది. జీవితపు రహదారిలో ఎన్ని గతుకులు ఉన్నా.. అలుపెరగక తనని కన్నవాళ్ల కోసం, తను కన్న వాళ్ల కోసం ప్రతిక్షణం తపించే మహనీయుడు నాన్న. నాన్న దండనలో ఓ హెచ్చరిక ఉంటుంది. అది జీవితంలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకులను అధిగమించేందుకు ఉపయోగపడుతుంది. నాన్న చూపిన బాటలో విజయం ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. కానీ, అపజయం మాత్రం ఉండదు. గెలిచినపుడు పదిమందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి, ఓడినపుడు భుజంపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు తీసుకుని హత్తుకునే వ్యక్తి నాన్న మాత్రమే. అందుకే నాన్నకు.. ప్రేమతో వందనం.
‘మా నాన్న ఎలా బతకాలో నాకు చెప్పలేదు. తానెలా బతికాడో నన్ను చూడనిచ్చాడు’ అంటాడు అమెరికన్‍ రచయిత క్లారెన్స్ బడింగ్టన్‍ కెలాండ్‍.

పెద్దలు చెబితే పిల్లలు వినరు. వాళ్లు పెద్దలను గమనిస్తారు. అనుకరిస్తారు. పిల్లలు మంచి పౌరులుగా ఎదగాలంటే తండ్రులు ఊరకే నీతిపాఠాలు చెబితే సరిపోదు. నిజాయతీగా బతికి చూపించాలి. అప్పుడు మాత్రమే పిల్లలు సరైన దారిని ఎంచుకోగలుగుతారు. తండ్రులకు గర్వకారణంగా మనగలుగుతారు. ఇంటి బరువు బాధ్యతలను మోసే తండ్రి పిల్లలకు తొలి హీరో. ఉన్నత వ్యక్తిత్వాన్ని, విలువలను పిల్లలు తండ్రి నుంచే నేర్చుకుంటారు. ఒక కుటుంబంలో తండ్రి దారి తప్పితే పిల్లలు కూడా సరైన దారిని ఎంచుకోలేరు. రేపటి పౌరులు దారి తప్పితే రేపటి సమాజం విలువలు కోల్పోయిన జనారణ్యంగా మారిపోతుంది.
కుటుంబంలో తల్లిదండ్రులిద్దరూ సమానమే అయినా ప్రపంచ సాహిత్యంలో తల్లులకు దక్కిన ప్రశస్తి, స్థానం తండ్రులకు దక్కలేదు. అరుదుగానైనా తండ్రుల గురించి అద్భుతమైన కవిత్వం వెలువడింది. తండ్రిని త్యాగానికి ప్రతీకగా, మార్గదర్శిగా కొనియాడిన కవులు లేకపోలేదు. తన సంతానం ఉన్నతిని సమాజం పొగిడినపుడు పొంగిపోయే తొలి వ్యక్తి తండ్రి.

‘పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ’

అని శతకకారుడు అందుకే అన్నాడు.
తండ్రులకు పుత్రోత్సాహం పుత్రుల వల్లనే కాదు.. పుత్రికల వల్ల కూడా కలుగుతుంది. చరిత్రలోనూ, వర్తమానంలోనూ అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి.
సుప్రసిద్ధులైన తండ్రులు, వారికి పుత్రోత్సాహం కలిగించిన పిల్లల గురించి మన చుట్టూనే బోలెడన్ని కథలు, నిజజీవిత ఘటనలు ఉన్నాయి.
బాలీవుడ్‍ సూపర్‍స్టార్‍ అమితాబ్‍ బచ్చన్‍ తెలుసు కదా! ఆయన తండ్రి హరివంశరాయ్‍ బచ్చన్‍ గొప్ప కవి. ఆయనను ఒకసారి బుల్లి బచ్చన్‍, ‘నాన్నా! నన్నెందుకు కన్నావు?’ అని అడిగాడట. హరివంశరాయ్‍ వెంటనే కొడుకు ప్రశ్నకు బదులివ్వలేదు. సాలోచనగా కొడుకు వంక తేరిపార చూశాడు. మర్నాడు ఉదయం హరివంశరాయ్‍ అమితాబ్‍ను నిద్రలేపి, చేతిలో ఒక కాగితం ఉంచారు. అందులో..

‘నా కొడుకు నన్నడిగాడు – నన్నెందుకు కన్నావని
బదులు చెప్పడానికి నా వద్ద సమాధానమేదీ లేదు
నన్ను కనడానికి ముందు నా తండ్రి నన్నడగలేదు
నా తండ్రిని ఈ లోకంలోకి తెచ్చేటపుడు నా తాత కూడా అతణ్ణి అడగలేదు. నువ్వెందుకు కొత్త ప్రారంభానికి, కొత్త ఆలోచనకు నాంది పలకరాదు?నీ పిల్లలను కమే ముందు నువ్వు వాళ్లనడుగు’.
ఇది నా జీవితంలో ఎంతో ప్రభావం చూపిందంటారు అమితాబ్‍.
నాన్నంటే ఓ ధైర్యం. నాన్నంటే ఓ భరోసా. నాన్నంటే ఓ హీరో. నాన్న రైతేనా, కూలీ అయినా, నాయకుడైనా, ఉన్నతాధికారైనా, చిరుద్యోగైనా బిడ్డలకెపుడూ ఒక సూపర్‍హీరోనే. బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం తన జీవితాన్నే ధారపోసే తండ్రి త్యాగమే పిల్లల జీవితానికి పునాది.
హ్యాపీ ఫాదర్స్ డే!

తండ్రిని సేవించడమే పరమధర్మం
యస్మాత్పార్దివ దేహ: ప్రాదుర భూద్యేన భగవతా గురుణా
‘ఎవరి వల్ల ఈ భౌతిక శరీరం జన్మించిందో అలాంటి భగవత్‍ స్వరూపుడు, సర్వజ్ఞమూర్తి అయిన తండ్రికి వేలాది నమస్కారాలు’ అని పై శ్లోకానికి భావం.
‘తండ్రిని సేవించడమే పరమ ధర్మం. తండ్రిని అన్ని విధాలా సుఖపెట్టడం, ధర్మవర్తనుడైన తండ్రి ఆదేశాలను అనుసరించడం సర్వ శ్రేష్టమైన తపస్సు. తండ్రిని ప్రసన్నం చేసుకుంటే సకల దేవతలూ ప్రసన్నులవుతారు’ అని తండ్రి గొప్పదనం గురించి మహాభారతం ఉటంకిస్తోంది.

‘నేను నిముసంబు గానక యున్న నూరెల నరయు మజ్జనకుండు..’ అంటూ తండ్రి మనసు ఎలాంటిదో, అలాంటి తండ్రి పట్ల కుమారుడు ఎలా ప్రవర్తించాలో మనుచరిత్రలో ప్రవరాఖ్యుడు పలికిన ఈ మాటలను బట్టి తెలుస్తుంది.
తండ్రి తానే స్వయంగా పుత్ర రూపంలో జన్మిస్తాడనేది వేదసూక్తం. అభిజ్ఞాన శాకుంతలంలో శకుంతల అంగాదంగాత్‍ సంభవతి పుత్ర: హృదయాదభిజాయతి ఆత్మావై పుత్ర నామాసి’ అనే వేద వచనం వినలేదా? అని దుష్యంతుడిని ప్రశ్నిస్తుంది.
‘శరీర కణాల నుంచే కాదు, హృదయ అనుభూతితో జన్మించే వాడు పుత్రుడు. తండ్రి లక్షణాలు కొడుకులో ప్రతిఫలిస్తాయి కనుక ఇతడు నీ పుత్రుడో కాదో నువ్వే పరీక్షించుకో’ అని దుష్యంతుడి ద్వారా తనకు కలిగిన బిడ్డను అతడి ముందుంచుతుంది శకుంతల.
జఠరాగ్ని వల్ల కడుపులోకి ఆహారం జీర్ణమై రక్త, వీర్యాలుగా మార్పు చెంది సంతానోత్పత్తికి కారణం అవుతుంది. అగ్ని సృష్టికారక శక్తి అంటూ రుగ్వేదం అగ్నిని పితృసమానంగా అభివర్ణించింది. అలాగే అగ్ని లక్షణాలన్నీ తండ్రికి ఉంటాయంటూ అగ్ని గుణధర్మాల గురించి చెబుతున్న సందర్భంలో తండ్రిని అగ్నితో పోల్చడం చూస్తాం.
దారుణే చ పితా పుత్రే నైవ దారుణతాం వ్రజేత్‍
పుత్రార్థే పద:కష్టా: పితర: ప్రాప్నువన్తి హి

హరివంశ పురాణంలోని విష్ణుపర్వంలోనిదీ శ్లోకం.
‘పుత్రుడిది ఒకవేళ క్రూర స్వభావమైనా కూడా తండ్రి అతడితో ప్రేమగానే నడుచుకుంటాడు. కుమారుడి కోసం ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా ఎదుర్కొంటాడు’ అని తండ్రి ఔన్నత్యం గురించి అందులో అభివర్ణించారు.

తండ్రే ధర్మం.. తండ్రే స్వర్గం
నతో ధర్మాచరణం కించిదస్తి మహత్తరమ్‍
యథా పితరి శుశ్రూషా తస్య వా వచనక్రిపా

‘తండ్రికి సేవ చేయడం, ఆయన ఆజ్ఞలను పాటించడాన్ని మించిన ధర్మాచరణ లేదు’ అని వాల్మీకి రామాయణం చెబుతోంది.
ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు తండ్రికి శుశ్రూష చేస్తూ ఆయన ఆదేశాలు పాటించడమే ధర్మంగా భావించాడు. తండ్రి జమదగ్ని మాట జవదాటక పురుషోత్తముడయ్యాడు.
ఇక, తండ్రి జమదగ్ని ఆజ్ఞానుసారం తల్లిని పోగొట్టుకున్నా.. మళ్లీ ఆయనను మెప్పించి తల్లిని బతికించుకున్నాడు భార్గవరాముడు (పరశురాముడు).
సర్వదేవ మయ: పితా
అంటే, తండ్రి సర్వదేవతా స్వరూపుడని భావం. ఈ విషయాన్ని రూఢి పరిచింది పద్మపురాణం.
పితా ధర్మ: పితా స్వర్గ: పితా హి పరమం తప:
పితరి ప్రీతిమాపన్నే ప్రీయన్తో సర్వదేవతా:

తండ్రే ధర్మం. తండ్రే స్వర్గం. తండ్రే తపస్సు. తనకు అనుకూలంగా నడుచుకుంటున్న కొడుకు పట్ల తండ్రి సంతుష్టుడైతే సకల దేవతలూ సంతుష్టులవుతారట. ధర్మమూర్తి అయిన తండ్రికి సేవ చేస్తే ఇహలోకంలో కీర్తి, ఆనక మోక్షం సిద్ధిస్తాయని పద్మ పురాణంలోనే మరోచోట ఉటంకించారు.
బిడ్డకు ఏది, ఎంత, ఎప్పుడు, ఎలా ఇవ్వాలో, వేటిని ఇవ్వకూడదో క్షుణ్ణంగా తెలిసిన వాడు తండ్రి. అతడి హృదయంలో లోతైనది. మాట కటువు. మనసు సున్నితం.
సహసా విదధీత న క్రియా మవివేక: పరమాపదాం పదం
వృణుతే హి విమృశ్యకారిణం గుణలుబ్ధా స్స్వయమేవ సంపద:
తండ్రికి తనపై ఇష్టం లేదని బిడ్డలనుకోవడం అవివేకం. ఆయనది అవ్యాజ ప్రేమంటూ కిరాతార్జునీయంలో భారవి రాసిన శ్లోకమిది. తొందరసాటు, అవివేకం ఆపదలకు మూలం. ఆలోచించి కార్యనిర్వహణకు పూనుకునే వివేకవంతుడిని, సద్గుణాల యందు ప్రీతి గల సంపదలు తామే వచ్చి వరిస్తాయనేది పై శ్లోకానికి భావం.

Review నాన్నంటే త్యాగం! నాన్నంటే జీవితం!!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top