నిత్యానంద ‘కరివెన’!

‘‘నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ।।’’
అని ఆ కాశీ విశ్వనాథుని భార్య అన్నపూర్ణాదేవి గురించి వర్ణించారు ఆదిశంకరాచార్యులు.
అన్న= అన్నము, పూర్ణ= పూర్ణముగా (నిండుగా) ప్రసాదించే తల్లి- అన్నపూర్ణ. ఆ మాతాన్నపూర్ణేశ్వరి- నిత్యానందకరి. కృపావలంబనకరి. నిత్యమూ ఆనందాన్ని, ఆహారాన్ని, కృపను వర్షిస్తూ భక్తులకు వాటిని ప్రసాదించే తల్లి ఆమె.
అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం కూడా ‘నిత్యాన్నదాన నిత్యానందగా భాసిల్లుతోంది. పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులకు నిత్యం అన్నదాన సమారాధన చేస్తూ.. వసతి సదుపాయాలు కల్పిస్తూ వందేళ్ల వారసత్వాన్ని ఓ మహాయజ్ఞంలా కొనసాగిస్తోంది.

‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’. మనం భుజించే ఆహారం సాక్షాత్తూ దైవంతో సమానమని మన పెద్దలు చెప్పారు. ఈ లోకంలో ప్రాణికోటి ఆకలి తీర్చడాన్ని మించిన దైవకార్యం మరేముంది?. ఈ ఆర్యోక్తి స్ఫూర్తితోనే 1889లో ఆంధప్రదేశ్‍లోని కర్నూలు జిల్లాలో గల ప్రశాంతమైన కరివెన గ్రామంలో అన్నదాన మహా యజ్ఞ సంకల్పానికి బీజం పడింది. ఆ చుట్టుపక్కలకు వచ్చే యాత్రికులు, పరిసర ప్రాంతాల్లోని పేదలపై కరుణతో మొదట్లో చిన్న బ్రాహ్మణుల బృందం అన్నాదానానికి శ్రీకారం చుట్టింది. ఆ చిన్న అడుగుకు కొనసాగింపుగా శ్రీశైలంలో బ్రాహ్మణ యాత్రికులకు అన్నదానం చేసే ‘కరివెన సత్రం’గా రూపుదిద్దుకునేందుకు వడివడిగా మలి అడుగులు పడ్డాయి.
పరా (పరాశక్తి, పార్వతీదేవి).. భవ (అస్తిత్వానికి శాశ్వత మూలమైన శివుడు) అనే దివ్య సమ్మేళనమై రూపుదాల్చిన శ్రీపరాభవ నామ సంవత్సరంలోకి అడుగిడిన వేళ కరివెన నిత్యాన్నదాన సత్రం తన అర్ధవంతమైన సేవలను మరింతగా విస్తరించడానికి అడుగులు వేస్తోంది.
అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం ప్రస్తుత చైర్మన్‍ హెచ్‍.శ్రీనివాసరావు, కార్యదర్శి ఎన్‍. వేణుగోపాల్‍ సమర్థ నాయకత్వ సారథ్యంలో.. కార్యవర్గ సభ్యుల నిర్మాణాత్మక మద్దతుతో ఆదర్శవంతమైన సంప్రదాయాన్ని దేశం నలుదిశలా మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

అన్నాద్భవన్తి భూతాని పర్జన్యాదన్న సంభవ:।
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ: కర్మసముద్భవ:।।
ప్రాణులు అన్నము వలనే కలుగుచున్నవి. అన్నము మేఘము (వర్షం) వలన కలుగుచున్నది. మేఘము యజ్ఞము వలన కలుగుచున్నది. ఇట్టి యజ్ఞము కర్మ వలన కలుగుచున్నది.
(భగవద్గీతలో అర్జునుడితో శ్రీకృష్ణుడు)
సుదేవుడి కుమారుడైన శ్వేతుడు విదర్భ రాజు. గొప్ప తపస్సంపన్నుడైన శ్వేతుడు రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించి, తన తపశ్శక్తితో దైవత్వాన్ని పొందాడు. ఆయన ప్రాణం విడిచిన తరువాత విష్ణువు సేవకులు వచ్చి స్వర్గానికి తీసుకెళ్లారు. అక్కడ భోగభాగ్యాలు అనుభవిస్తూ సంతోషంగా ఉండేవాడు. కానీ, అన్ని సౌఖ్యాలున్నా అతనికి ఆకలిబాధ మాత్రం తప్పింది కాదు. నిజానికి స్వర్గంలో ఉండేవారికి ఆకలి ఉండదు. ఆకలేస్తే తినడానికి కూడా ఏమీ ఉండదు. కానీ శ్వేతుడు స్వర్గంలో ఉన్నా క్షుద్బాధ తప్పలేదు. ఆకలికి ఓర్చుకోలేక ఒకనాడు బ్రహ్మ వద్దకు వెళ్లి, ‘నేను గొప్ప తపస్సు చేసి దైవత్వాన్ని పొంది స్వర్గానికి వచ్చాను. కానీ, నాకు ఇక్కడ ఆకలి బాధ తప్పడం లేదు. స్వర్గంలో ఉన్న వారికి ఆకలి ఉండదు కాబట్టి ఇక్కడ నాకు తినడానికేమీ దొరకట్లేదు. ఈ బాధను తప్పించండి’ అని వేడుకున్నాడు.
‘రాజా! నువ్వు తపస్సు చేసి దైవత్వాన్ని పొంది స్వర్గానికి వచ్చావు. కానీ, నువ్వేనాడూ ఒక్కరి ఆకలి కూడా తీర్చలేదు. ఎవరికీ కనీసం పట్టెడన్నం పెట్టలేకపోయావు. దాహార్తులకు చుక్క నీరు ఇవ్వలేదు. దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. కానీ, నువ్వది చేయలేదు. స్వర్గంలో ఎవరికీ లేని ఆకలి బాధ నీకు కలగడానికి కారణం అదే. నాటి లోపమే నిన్నిప్పుడు బాధిస్తోంది’ అని బ్రహ్మ చెప్పాడు.
‘ఆ పాపం నుంచి ఎలా బయటపడాలో చెప్పండి’ అని శ్వేతుడు ప్రార్థించాడు.
‘నువ్వు భూలోకం వెళ్లి నీ పార్థివకాయం ఎక్కడుందో వెతికి దానిని రోజూ కొద్ది కొద్దిగా తిని ఆకలి బాధ తగ్గించుకో. నువ్వు ఎంత తిన్నా ఆ భాగం మళ్లీ పెరుగుతుంది. అది ఎప్పటికీ తరగదు’ అని తరుణోపాయం చెప్పాడు బ్రహ్మ.
‘అలా ఎంతకాలం చేయాలో సెలవియ్యండి’ అన్నాడు శ్వేతుడు.
‘అగస్త్య మహర్షి నీ వద్దకు వచ్చి పలకరించే వరకు అలా తింటూనే ఉండాలి’ అని బ్రహ్మ బదులిచ్చాడు.
బ్రహ్మ చెప్పినట్టుగానే శ్వేతుడు భూలోకానికి వెళ్లి తన శవాన్ని వెతికి.. ఆకలి తీరే వరకు తిని తిరిగి స్వర్గానికి రాసాగాడు. మర్నాడు వెళ్లేసరికి మళ్లీ ఆ భాగం అలాగే ఉంటోంది. ఆ భౌతికకాయం కుళ్లిపోకుండా మనిషి నిద్రపోతున్నట్టుగానే ఉండేది. యథా ప్రకారం ఒకనాడు శ్వేతుడు ఆ శవాన్ని కోసుకుని తింటుండగా అటుగా వచ్చిన అగస్త్య మహర్షి అది చూసి ఆశ్చర్యపోయాడు. శ్వేతుడని ఏమిటని పలకరించాడు.
‘మహాత్మా! నా జన్మ ధన్యమైంది. నా క్షుద్బాధ తీరింది. ఈ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవంతో తెలుసుకుని చేసిన తప్పు గురించి తెలుసుకున్నాను’ అని శ్వేతుడు అగస్త్యునికి నమస్కరించి స్వర్గానికి వెళ్లిపోయాడు.
అన్నదానం చేయని వారికి స్వర్గప్రాప్తి కలిగినా ఆకలిబాధ తప్పదని చాటే కథ ఇది. అన్నార్తుల ఆకలి తీర్చడం, దాహార్తులకు నీళ్లివ్వడం అనేవి ప్రతి మనిషి కనీస ధర్మం.
వెయ్యేనుగులు, కోటి ఆవులు, లెక్కకు మిక్కిలి బంగారం, వెండి, భూములు, జీవితం మొత్తం ఒక వంశానికి సేవ చేయడం, కోటి మంది యువతులకు వివాహం చేయడం.. ఇవేవీ అన్నదానానికి సాటిరావు.
అటువంటి బృహత్కర మానవ ధర్మానికి ‘మానవ సేవే మాధవ సేవ’ అనే ధర్మవాక్యాన్ని మంత్రంగా చేసుకుని ముందుకు సాగుతోంది అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం. హిందూ సంప్రదాయంలో అత్యుత్తమైనది- అన్నదానం. మన ధర్మంలో ఆకలితో ఉన్న వారికి అన్నాన్ని దానం చేయడం కంటే మంచి పూజ లేదా సత్సంప్రదాయం మరొకటి లేదని భావిస్తారు.
మన పురాణాలు ఈ శరీరం ‘అన్నమయ కోశం లేదా ఆహార కోశం’ అని చెప్పాయి. అలాగే పొట్ట భాగాన్ని ‘అగ్నికుండ్‍’ అని చెప్పాయి. పంచభూతాలలో అగ్ని ఒకటి. మన శరీరం కలిగి ఉండే ఐదు మూలకాల్లో కూడా అగ్ని ఒకటి. దీనిని తృప్తి పరచాలంటే నిత్యం దానికి ఆహార నైవేద్యాలను సమర్పించాలి. ఎందుకంటే అది ఆహార పోషకాలతో కూడి ఉన్నది. అవి లోపిస్తే ఆ కోశం కొడిగడుతుంది. ప్రాణం నిలవదు. అందువల్ల అన్నానికి నోచుకోని వారి ఆకలి తీర్చడం, వారి ప్రాణాన్ని నిలబెట్టడం అనేది వేలాది యజ్ఞాలు చేసిన దాని కంటే గొప్ప కార్యం.
అన్నదానం చేయడమంటే ఆ శరీరాన్ని నిలుపుతున్నట్టే.
అన్నం పెట్టడమంటే ఎదుటి వారికి జీవితాన్నిస్తున్నట్టే.

ఒక ప్రాణానికి జీవం పోస్తున్నట్టే.
అందుకే ఆహారం అనేది కేవలం పదార్థం కాదు.
ఒక జీవితం, ఒక జీవం.
ఎంతమందికి అన్నదానం చేస్తే అన్ని జీవితాలనిచ్చే అవకాశాన్ని పొందుతున్నట్టే.
ఆహారం పరబ్రహ్మ స్వరూపం..
ఒక్కో మెతుకు బతుకును కోరుతుంది.
ఆ విలువ తెలిసిన బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం వేనవేల జీవితాలను నిలబెడుతోంది. అన్నదానాన్ని పవిత్రమైన కార్యంగా భావించి.. ఆ యజ్ఞకార్యంలో అంకితభావంతో నిమగ్నమైందీ సత్రం. శ్రీశైలం, మహానంది, భద్రాచలం, అలంపూర్‍, షిర్డీ, వారణాసి, రామేశ్వరం, అరుణాచలం తదితర పదహారు ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ఈ సంస్థ అన్నదాన సత్రాలు ఏర్పాటు చేసి సాటి లేని మేటి వైదిక ఆదర్శానికి పునాదులు వేసింది. ఇటీవలే తిరుమల, మధురై, హరిద్వార్‍, అయోధ్య, ప్రయాగ్‍రాజ్‍ తదితర క్షేత్రాలకూ తన సేవలను విస్తరించే ప్రణాళికలను రూపొందించింది.
చిన్నగా ప్రారంభమై.. మిన్నగా మారి..
అవసరంలో ఉన్న వారికి ఏ సాయమైనా చేయండి. కానీ పుచ్చుకునే వారికి తృప్తి ఉండదు. మనిషి ఆశకు అంతూ, అదుపూ ఉండవు. అవసరార్థులకు డబ్బు, బంగారం, ఇంకా ఏది దానమిచ్చినా లేదా సాయం చేసినా ఇంకా ఇంకా కావాలనే అనిపిస్తుంది. కానీ, అన్నదానం పొందిన వారు మాత్రం ‘ఇక చాలు’ అని సంతృప్తి చెందుతారు. అందుకే అన్నదానం స్వీకరించిన వారు ‘అన్నదాతా సుఖీభవ’ అని గుండెల నిండా తృప్తితో నిండు మనసుతో ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదాలే వెయ్యేనుగుల పెట్టు. జన్మజన్మల ఆస్తి. ఈ ఆలోచనే కరివెన నిత్యాన్నదాన సత్రం ఏర్పాటుకు పునాది వేసింది.
కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్ర మహారాజు ఏలుతున్న కాలంలో ఈ కరివెన అగ్రహారం ఏర్పడింది. అప్పట్లో ఈ గ్రామానికి వెళ్లాలంటే అటవీ మార్గంలో కాలినడకే శరణ్యం. నల్లమల అటవీ ప్రాంతం మీదుగా అప్పట్లో భక్తులు శ్రీశైల క్షేత్రానికి వెళ్తుండే వారు. భక్తులు ఎంతో దూరం నుంచి వస్తూ.. మార్గమధ్యంలో ఆహారాన్ని సమకూర్చుకోలేక ఎన్నో ఇబ్బందులు పడేవారు. ఇది గమనించిన కరివెన గ్రామానికి చెందిన నిడిచెనమెట్ల సుబ్రహ్మణ్య సోమయాజులు గారు 1889లో నల్లమల అటవీ మార్గంలోని పెద్దచెరువు వద్ద తొలిసారిగా భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆహారంతో పాటు అలసి సొలసిన భక్తులకు నీరు, ఔషధాలను అందించే వారు. ఆ తరువాత ఆయన కుమారుడు నిడిచెనమెట్ల సోమసుందర శాస్త్రి గారు ఈ సత్సంప్రదాయాన్ని కొనసాగించారు. 1889 నుంచి 1974 వరకు ‘శివరాత్రి సత్రం’ పేరుతో ఈ సేవ కొనసాగింది. జూన్‍ 28, 1974 సంవత్సరంలో ఒక కమిటీ (రిజిస్టర్డ్ నంబర్‍: 47-1974) ఏర్పడింది. కరివెనకు చెందిన బొందలపాటి రామయ్య, విజయవాడకు చెందిన మాగంటి సూర్యనారాయణ పంతులు, మార్కాపురం వాస్తవ్యులు అన్నంరాజు సుబ్బారావు సారథ్యంలో అన్నదాన సేవలు కొనసాగాయి. అనంతరం వివిధ కారణాల వల్ల 1999 నుంచి 2014 వరకు కొన్ని ఆటంకాలు ఏర్పడినా.. ఆగస్టు 27, 2015లో మహానంది క్షేత్రంలో ఒక కొత్త కమిటీ ఏర్పడిన తరువాత కరివెన నిత్యాన్నదాన సత్రం చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అప్పటి నుంచి తన అన్నదాన, వసతి సేవలను బహుముఖంగా విస్తరిస్తూ కొత్త కమిటీ ఆధ్యాత్మిక సేవలో పరుగులు తీస్తున్నది.
కేవలం అన్నదానానికి మాత్రమే పరిమితం కాకుండా పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులు భగవంతుని దర్శనాన్ని సులభతరం చేసుకునేలా ఆయా క్షేత్రాల్లో వసతి సౌకర్యాలు కల్పించడంపైనా కమిటీ దృష్టి పెట్టింది. ఫలితంగా దాదాపు పదహారు ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ఈ సత్రం సేవలు అందుబాటులోకి వచ్చాయి. యాత్రికుల వసతి కోసం ఆధునిక హంగులతో భవనాల నిర్మాణాన్ని ప్రారంభించింది. సత్రం సేవలు చిరస్థాయిగా నిలవాలనే సంకల్పంతో ఆయా క్షేత్రాల సమీపంలో స్థలాలు కొనుగోలు చేసి వసతి గదుల నిర్మాణాన్ని ప్రారంభించింది. తన సేవలను పూర్తిగా కంప్యూటరీకరించిన ఈ సంస్థ.. నగదు లావాదేవీలు, ఆదాయ పన్ను వ్యవహారాలను ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. తన సత్రానికి విరాళాలు అందించే భక్తులకు ఆదాయ పన్ను మినహాయింపు సౌకర్యాన్ని కల్పించే అవకాశాన్ని సాధించింది.
భూదాన యజ్ఞం
బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం అనేక పుణ్యక్షేత్రాలలో వసతి గదుల భవంతులను నిర్మిస్తోంది. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఇంకొన్ని భూసేకరణ దశలోనూ ఉన్నాయి. ఇందుకోసం భూమిని దానం చేయాలనుకునే భక్తుల కోసం ఉద్దేశించినదే ‘భూదాన యజ్ఞ’ పథకం. అరుణాచలం, రామేశ్వరం, వారణాసి తదితర చోట్ల భూసేకరణ జరుగుతోంది. వీటిలో అరుణాచలం వంటి చోట్ల ఇప్పటికే వసతి గదుల భవంతులు సిద్ధమయ్యాయి.
భూదాన యజ్ఞంలో భాగంగా చదరపు గజం ధర రూ.10,000గా నిర్ణయించారు.
పది చదరపు అడుగుల స్థలం కోసం లక్ష రూపాయలు చెల్లించిన వారికి ప్రతి సంవత్సరం మూడు ఉచిత గది కూపన్లను అందచేస్తారు.
శాశ్వత గది నిర్మాణం కింద స్టాండర్డ్ రూమ్‍ నిర్మాణం కోసం రూ.8,00,000, సూట్‍ రూమ్‍ కింద రూ.10,00,000 చెల్లించవచ్చు. ఇలా చెల్లించిన దాతలకు జీవిత పర్యంతం ఉచిత గది వసతిని ఏటా 30 సార్లు వినియోగించుకోవచ్చు.
సేవే పరమార్థం..
భగవంతునికి, భక్తునికి మధ్య వారధిలా, అనుసంధానకర్తలా పని చేస్తున్న ఈ సత్రం అనేక సేవా కార్యక్రమాలతో భక్తుడిని భగవంతుడికి దగ్గర చేస్తోంది.
పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారు మొదట ఆలోచించేది- దైవ దర్శనం ఎలా సులభంగా చేసుకోవాలా అని..

తరువాత వెంటనే ఆలోచించేది- సదరు పుణ్యక్షేత్రంలో భోజనం, వసతి సదుపాయాలెలా? అనేది.

దైవ దర్శనానికి వచ్చిన వారెవరూ ఆ క్షేత్రంలో లభించే అన్నప్రసాదాన్ని తీసుకోకుండా వెనక్కి వెళ్లకూడదని, తలదాచుకునేందుకు ఇబ్బందులు పడకూడదనే బృహత్‍ సంకల్పం ఆయా పుణ్యక్షేత్రాల్లో కరివెన ట్రస్ట్ నిత్యాన్నదాన సత్రాలను ఏర్పాటు చేసి నిర్వహిస్తోంది.
నిత్యాన్నదానం, భక్తులకు వసతి సౌకర్యం వంటివి విజయవంతంగా కల్పిస్తూనే మరెన్నో ఆధ్యాత్మిక, వైదిక సేవలు, కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను కరివెన నిత్యాన్నదాన సత్రం సమర్థంగా నిర్వహిస్తోంది.
వేదవిద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో వేద పాఠశాలలను నిర్వహిస్తోంది. తరచూ వేదసభలు నిర్వహిస్తూ సామాన్యులకూ వేదాలను చేరువ చేసే ప్రయత్నం సాగిస్తోంది.
త్వరలో తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, అన్నవరం, హరిద్వార్‍, వేములవాడ ప్రాంతాల్లో వేద పాఠశాలల నిర్వహణకు భవిష్యత్తు కార్యాచరణను నిర్దేశించుకుని ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఆయా చోట్ల స్థల సేకరణపై దృష్టి పెట్టింది. కొత్త భవనాల నిర్మాణం కోసం దాతల సహాయ సహకారాలను కోరుతోంది.
ఇంకా గోసేవ, గోదానం, వృద్ధాశ్రమం, హోమ, జప, తప, ఆబ్దిక కార్యక్రమాలు, ఉపనయనాలు, నందికేశవ నోములు, కైలాసగౌరి నోములు, లక్ష వత్తుల నోములు, భజనలు వంటి ఆధ్యాత్మిక, సామాజిక సేవల్లోనూ కరివెన నిత్యాన్నదాన సత్రం నిమగ్నమైంది.
కరివెన నిత్యాన్నదాన సత్రం ద్వారా గోసేవ, గోసంరక్షణ చేయదల్చుకున్న భక్తులు నెలకు రూ.6,000 చెల్లించాల్సి ఉంటుంది. ఆ నెలంతా వారి పేరుపై గోవులకు గ్రాసం అందిస్తారు. విజయవాడ వృద్ధాశ్రమం, శ్రీశైలంలో ఈ సేవ అందుబాటులో ఉంది.
పుష్కర సమయాల్లో కరివేన నిత్యాన్నదాన సత్రం నిర్వహించే సేవలు ఎంతో ప్రఖ్యాతి పొందాయి. ఆయా నదీ పుష్కరాల సమయంలో పూర్తి వైదిక సంప్రదాయంతో అన్నదానం, సంకల్ప స్నానం, అన్నశ్రాద్ధం, హిరణ్య శ్రాద్ధం, తిల తర్పణం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
అన్నం.. అక్షరం.. ‘కరివెన’కు రెండు కళ్లు
‘వేదోఖిలో ధర్మమూలం’ అని వేదోక్తి.

అఖిలమైన ధర్మాలకు మూలము వేదాలేనని అర్థం.
భారతీయ సనాతన సంస్క•తికి, ధర్మానికి మూలభూతాలు వేదాలు. అలాగే సకల పురుషార్థాలకు మూలభూతాలు వేదాలేనని రుగ్వేద ప్రాతిశాఖ్య చాటుతోంది.
‘విద్యన్తే ధర్మాదయ: పురుషార్థా: యైస్తే వేదా’ అనే వాక్యాన్ని బట్టి అఖిల సృష్టికి మూలము కూడా వేదాలే. అలాంటి మహత్తరమైన వేదాల పరిరక్షణకు వేదికైంది- శ్రీ కంచి కామకోటి పీఠ శంకర వేద విద్యాలయం.
‘అన్నం.. అక్షరం’.. అనే రెండు సంకల్పాలను రెండు కళ్లుగా చేసుకున్న ‘కరివెన’ సంస్థ.. కర్నూలులోని ఖండేరి, చిదంబరరావు వీధి (కోట)లోని శ్రీ శంకర మందిరంలో శ్రీకంచి కామకోటి పీఠ శంకర వేద విద్యాలయాన్ని నిర్వహిస్తోంది. గత కొన్నేళ్లుగా రాయలసీమ ప్రాంతంలో ఈ విద్యాలయం చతుర్వేదాల (రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం)తో పాటు రుగ్వేద- యజుర్వేద స్మార్త విద్యలను అందిస్తోంది.
వేద రక్షణ కోసం అకుంఠిత దీక్షతో మొదట రుగ్వేద, కృష్ణ యజుర్వేదాలు, కృష్ణ యజుర్వేద స్మార్తముతో మొదలైన ఈ విద్యాలయం ప్రస్తుతం సామవేదాన్ని, అధర్వణ వేదాన్ని కూడా బోధిస్తోంది. రుగ్వేద స్మార్తాన్ని కొత్తగా ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 70 మంది విద్యార్థులు ఇక్కడ వేదవిద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థులకు విద్య, వైద్య, మౌలిక సదుపాయాలను, గ్రంథాలయ సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు.
ఈ వేద విద్యాలయంలో బోధించే ఆయా వేదాల వివరాలు..
రుగ్వేదము (శాకల శాఖ): ఈ విభాగంలో 16 మంది విద్యార్థులు వేదవిద్యను అభ్యసిస్తున్నారు. దేవతాస్తుతి, పరక మంత్రాలు ప్రధానంగా గల వేదం- రుగ్వేదం. చతుర్వేదాలకు మూలమైన ఈ వేదాధ్యయనానికి ఎనిమిది సంవత్సరాల వ్యవధి పడుతుంది. కరణం శ్రీదత్త శర్మ (క్రమపాఠి) ఈ విభాగం ప్రధాన అధ్యాపకులు.
రుగ్వేద స్మార్తము: ఈ విభాగంలో ఐదుగురు విద్యార్థులున్నారు. ఈ విభాగం కింద గణపతి పూజ, పుణ్యహవాచనము, వివాహాది
శుభకర్మలకు పఠించే మంత్రాలను బోధిస్తారు. ఈ రుగ్వేద స్మార్త అధ్యయనానికి ఆరు సంవత్సరాలు పడుతుంది. మేడవరం శ్రీప్రణవ శర్మ అధ్యాపకులుగా ఉన్నారు.

కృష్ణ యజుర్వేదము (తైత్తిరీయ శాఖ): ఈ వేద శాఖను 17 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. యజ్ఞ యాగాది క్రతు సంబంధమైన విషయాలను, దేవతాస్తుతులు ప్రధానంగా గల ఈ కృష్ణ యజుర్వేద అధ్యయనానికి తొమ్మిది సంవత్సరాలు పడుతుంది. కళ్లే ప్రతాపశర్మ (క్రమపాఠి) ఈ యజుర్వేద అధ్యాపకులుగా వ్యవహరిస్తున్నారు.
కృష్ణ యజుర్వేద స్మార్తము: పాలపర్తి శివరామ శర్మ అధ్యాపకత్వం కింద నిర్వహిస్తున్న ఈ స్మార్త విభాగంలో గణపతి పూజ, పుణ్యహవాచనము, వివాహాది శుభకర్మలు, తైత్తిరీయ అరణ్యక భాగం వంటివి బోధిస్తారు. ఈ స్మార్త వేదాధ్యయనానికి ఆరు సంవత్సరాల సమయం పడుతుంది. ప్రస్తుతం పద్నాలుగు మంది విద్యార్థులు ఈ వేదవిద్యను అభ్యసిస్తున్నారు.
సామవేదం (రాణాయనీయ శాఖ): సప్త స్వరాలకు మూలమైనది సామవేదం. రుక్కులకు గానమే ప్రధానంగా గల ఈ వేదాధ్యయనానికి పది సంవత్సరాల సమయం పడుతుంది. శుభం భగవత్కర శర్మ అధ్యాపకత్వం కింద ఏడుగురు విద్యార్థులు సామవేదాన్ని అధ్యయనం చేస్తున్నారు.
అధర్వణ వేదం (శౌనక శాఖ): కాశీభట్ల పవనశర్మ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ విభాగంలో పద్నాలుగు మంది విద్యార్థులు అభ్యసనం సాగిస్తున్నారు. అధర్వణ వేద విభాగం కింద వైద్య చికిత్సాదుల వైద్య విజ్ఞానం, ప్రాయశ్చిత్తాదులను బోధిస్తారు. ఈ వేదాధ్యయనానికి కనీసం ఏడు సంవత్సరాలు పడుతుంది.

కరివెన సత్రాలు..
ఏ సంవత్సరంలో ఎక్కడ ఏర్పాటయ్యాయంటే..

శ్రీశైలం (ప్రధాన కార్యాలయం) 28.6.1974
వారణాసి 1992
రామేశ్వరం 17.4.1993
భద్రాచలం 17.8.1994
వృద్ధాశ్రమం (తాడేపల్లి) 13.12.1997
మహానంది 1.4.2000
షిర్డీ 3.6.2004
అలంపూర్‍ 1.1.2009
త్రిపురాంతకం 23.11.2016
శ్రీశంకర మందిరం (కర్నూలు) 15.10.2020
యాదగిరిగుట్ట 26.11.2021
అరుణాచలం 13.06.2022
బృందావనం
(మధుర, ఉత్తరప్రదేశ్‍) 13.8.2023

అన్నదానం చేస్తే…
అన్నదానం తోటి వారి ఆకలిని తీర్చడమే కాక, దాతకు కోటి గోవులను దానం చేసినంత ఫలాన్నిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం ద్వారా అనంతమైన పుణ్యం, ఆశీస్సులు లభిస్తాయి.
అన్నదానాన్ని దానాలన్నింటిలోకెల్లా మిన్నగా భావిస్తారు. ఇది అనంతమైన పుణ్యాన్నిస్తుంది.
చేసిన పాపాలు, కర్మలు తొలగిపోయి మనశ్శాంతి, దైవానుగ్రహం కలుగుతాయి.
ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం ద్వారా లభించే ఆత్మానందం, వారి ఆశీస్సులు జీవితంలో సానుకూలతను తెస్తాయి.
అన్నదానం చేయడం వల్ల పూర్వీకులు (పితృ దేవతలు) సంతోషించి, మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు.
నిరంతరం అన్నదానం చేసే వారి ఇంట లక్ష్మీదేవి కటాక్షం ఉండి దానధర్మాలు చేసే శక్తి పెరుగుతుంది.
ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం, అన్నపానీయాలను ఇవ్వడం వల్ల దాతలో మానసిక, ఆధ్యాత్మిక వృద్ధి పెరుగుతుంది

వేదవిద్యా సాయం చేయాలంటే..

కుక్షౌ తిష్ఠతి యస్యాన్నం వేదభ్యాసేన జీర్యతే ।
కులం తారయతే తేషాం దశపూర్వం దశాపరం ।।
ఎవరి ద్రవ్యం వేదాభ్యాసంచే జీర్ణింపబడునో వారి యొక్క వంశము తనతో సహా పది తరాల ముందు వారిని, పది తరాల తరువాత వారిని తరించును అని పై శ్లోకానికి భావం. బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం నిర్వహిస్తున్న ఈ వేదవిద్య విభాగానికి ఇతోధిక తోడ్పాటు అందించడానికి వివిధ అవకాశాలున్నాయి.
విద్యార్థుల ఒకరోజు భోజనం ఖర్చు భరించే వారు రూ.6,000 చెల్లించాలి. ఈ దాతలకు వేదాశీర్వచనం అందిస్తారు. ఒక విద్యార్థికి ఒక నెల పాటు అయ్యే ఖర్చు కింద రూ.10,000 అందించవచ్చు. ఒక నెల అధ్యాపకుల గౌరవ వేతనం కింద రూ.15,000 ఇవ్వవచ్చు. వేద విద్యార్థులకు విద్య, వైద్యం, క్రీడలు, సంక్షేమం, నిత్యావసరాల ఒక నెల ఖర్చు కింద ఇవ్వదల్చుకుంటే రూ.30,000 చెల్లించాలి. ఇక వేదనిధి కింద ఫిక్స్డ్‍ డిపాజిట్‍ చేయదల్చుకుంటే రూ.1,00,000 చెల్లించవచ్చు. ఇంకా దాతలు విద్యార్థులకు వస్త్రదానం, అన్నదానం, ఇతర వస్తువులు ఏవైనా అందించవచ్చు.
దాతలు తమ విరాళాలను ఏబీబీకేఎన్‍ సత్రం, స్టేట్‍ బ్యాంక్‍ ఆఫ్‍ ఇండియా, కింగ్‍ మార్కెట్‍ బ్రాంచ్‍, కర్నూలు పేరిట పంపవచ్చు. ఖాతా నంబర్‍: 64014055346. అలాగే, యూనియన్‍ బ్యాంక్‍ ఆఫ్‍ ఇండియా, ఖాతా నంబర్‍ 520101198151175 ద్వారా కూడా తమ విరాళాలు పంపించి రశీదును పొందవచ్చు. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన
ఫోన్‍ నంబర్లు:
833907808,
8333907813,
8333907783.

అన్నదానం చేశారా?
అన్నదానానికి సాయం చేశారా?
లక్ష్మీదేవి చూస్తుందట!

ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టలేకపోయినా.. కనీసం అన్నం పెట్టే ఇంటినైనా చూపించాలని పెద్దలు చెబుతారు.
లక్ష్మీదేవి ఒక వ్యక్తికి పరిపూర్ణమైన అదృష్టాన్ని ప్రసాదించేటపుడు.. ఆ వ్యక్తి పూర్వజన్మలో అన్నదానం చేశాడా లేదా అని చూస్తుందని ప్రతీతి. పూర్వజన్మలో అన్నదానం చేసిన వారికి, అన్నదానికి సహాయ సహకారాలు అందించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభించి, వారు మహా అద్వితీయమైన ఐశ్వర్యవంతులుగా పుట్టి సమస్త భోగాలు అనుభవించే వారిగా ఎదుగుతారని చెబుతారు.
అన్నదానం చేసిన.. లేదా అన్నదానం చేయడానికి అవసరమైన వనరులు సమకూర్చిన వారికి మోక్షం లభిస్తుంది. అటువంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఐశ్వర్యవంతులుగా పునర్జన్మ పొందుతారని, గత జన్మ పాపాలు తొలగి శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు.. నాలుగు భుజాలూ జతకూడితేనే ఇతోధిక సాయానికి తోడ్పాటు. భక్తులు, దాతల నుంచి అలాంటి తోడ్పాటును కోరుతోంది అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం.
మనం ఏవైనా కారణాల వల్ల పట్టెడన్నం ఎవరికీ పెట్టలేకపోవచ్చు. సామూహికంగా అన్నదానాలు చేయలేకపోవచ్చు. కానీ, పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తుల అన్నార్తిని తీర్చే సత్రాలకు నేరుగా సాయం చేయడం ద్వారా అన్నదానం చేసిన ఫలాన్ని, ఫలితాన్నే పొందవచ్చు. మనం ఎవరికీ అన్నదానం చేయలేకపోయినా.. కనీసం అన్నదానం చేసే అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన సత్రాల వంటి వాటి వైపు చూపించడమే కాదు.. అటువంటి సంస్థలకు విరాళాలు ఇవ్వడం, వస్తు సామగ్రి సమకూర్చడం వంటి సాయాల ద్వారా అన్నదాన ఫలాన్ని, దైవాశీర్వచనాన్ని పొందుదాం.
శాశ్వత అన్నదాన పథకం ఇలా..
ఏడాదిలో ఒకరోజు శాశ్వత అన్నదానం : రూ.3,000
ఏడాదిలో 5 రోజులకు శాశ్వత అన్నదానం : రూ.15,000
శాశ్వత అన్నదానం ప్రతి రోజూ ఒక్కరికి వారి
పేరుతో అన్నదానం చేయాలంటే.. : రూ.30,000
రూ.1,00,000 చెల్లించిన దాతలను నిత్యాన్నదాన/భూదాన మహారాజ పోషకులుగా పరిగణిస్తారు. ఈ దాతలు జీవిత పర్యంతం ఉచిత గది వసతిని ఏటా మూడుసార్లు చొప్పున వినియోగించుకోవచ్చు.
దాతలు ఆయా పర్వదిన సందర్భాల్లోనూ, వివాహ, పుట్టిన రోజు వేడుకల సందర్భంగానూ, పుణ్యతిథి కాలాల్లోనూ విరాళాలు అందించి కరివెన నిత్యాన్నదాన సత్రం ద్వారా తమ పేరుపై ఆ రోజు అన్నదానం చేయించుకోవచ్చు

అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం కార్యనిర్వాహక వర్గం
హర్కర శ్రీనివాసరావు (హైదరాబాద్‍)
చైర్మన్‍, అడ్వైజరీ కౌన్సిల్‍
కామరాజు నరేంద్ర (హైదరాబాద్‍)
గౌరవ అధ్యక్షుడు
డాక్టర్‍ ఎన్‍ఆర్‍ శ్రీనివాస్‍ (కరివేన)
అధ్యక్షుడు
కె.మాధవరావు (ఆళ్లగడ్డ)
ఉపాధ్యక్షుడు
సీహెచ్‍.మారుతీ ప్రసన్న (విజయవాడ)
ఉపాధ్యక్షుడు
డాక్టర్‍ ఎన్‍ వేణుగోపాల్‍ (కర్నూలు)
సెక్రటరీ
కె.చిదంబరరావు (బండి ఆత్మకూరు)
జాయింట్‍ సెక్రటరీ
కె.రామకృష్ణ (మార్కాపురం)
జాయింట్‍ సెక్రటరీ-2
జి.హరిహరరావు (మార్కాపురం)
కోశాధికారి
కేవీ ప్రదీప్‍ (హైదరాబాద్‍)
ఎగ్జిక్యూటివ్‍ మెంబర్‍
ఎస్‍వీ రావు (హైదరాబాద్‍)
ఎగ్జిక్యూటివ్‍ మెంబర్‍
డాక్టర్‍ పి.రఘు (హైదరాబాద్‍)
ఎగ్జిక్యూటివ్‍ మెంబర్‍
హెచ్‍కే మనోహరరావు (కర్నూలు)
ఎగ్జిక్యూటివ్‍ మెంబర్‍

అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రాల ఫోన్‍ నంబర్లు
శ్రీశైలం 83339 07784, 83339 07787
కర్నూలు 83339 07783, 83339 07808
మహానంది 83339 07802, 83339 07803
త్రిపురాంతకం 83339 07794, 83339 07795
విజయవాడ
(వృద్ధాశ్రమం) 83339 07813, 83339 07807
కాణిపాకం 83339 07812, 83339 07813
భద్రాచలం 83339 07796, 83339 07797
యాదగిరిగుట్ట 83339 07815, 83339 07813
అలంపూర్‍ 83339 07805, 83339 07806
అరుణాచలం 83339 07816, 83339 07817
రామేశ్వరం 83339 07793, 83339 07813
షిర్డీ 83339 07798, 83339 07800
కాశీ 83339 07790, 83339 07791
బృందావనం
(మధుర) 83339 07789, 83339 07813
నైమిశారణ్యం 83339 07804, 83339 07813
తిరుపతి 83339 07809, 83339 07810

Review నిత్యానంద ‘కరివెన’!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top