పరమపద సోపాన పథము లేదా వైకుంఠపాళీ లేదా పాము-నిచ్చెన ఆట.. లేదా మోక్షపథం..
మోక్షపటం..లేదా పాము పటం..
పేరేదైనా ఇదో ప్రాచీన భారతీయ ఆట.
మన తెలుగు నాట ఇది మరీ సుప్రసిద్ధం.
ఇది మానవ జీవితాల్లోని ఆధ్యాత్మిక కోణాన్ని వెలికితీస్తుంది. జీవితంలో మనిషి ఎదుర్కొనే కష్టనష్టాలకు, చివరకు చేరుకోవలసిన గమ్యానికి ప్రతీకగా నిలిచే ఆట ఇది.
పాశ్చాత్యులు దీనిని ‘క్లాసిక్ ఆట’గా పరిగణిస్తారు. జీవితంలో ఒక్కసారైనా ఆడాల్సిన ఆటగా మన పెద్దలు చెబుతుంటారు. మన పురాణాలు, ఇతిహాసాలు.. వాటిలోని పద్యాలు, మంచి మాటలు, పాటలు కలిపి మొత్తంగా అందించగలిగే వికాసాన్ని ఈ ఒక్క ఆట అందిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఇంతటి గొప్ప ఆట కాబట్టే దీనిని ‘పరమపద సోపాన పటం’ అన్నారు. జీవన సారాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ, క్రీడాస్ఫూర్తినీ, నైతిక విలువలనూ రంగరించే అపురూప వ్యక్తిత్వ వికాస క్రీడ- వైకుంఠపాళి.
ఇంతకూ వైకుంఠపాళిని ఎవరు కనిపెట్టారు?
అనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. 13వ శతాబ్దానికి చెందిన జ్ఞానేశ్వర్ లేదా జ్ఞానదేవ్ అనే ఆధ్యాత్మిక గురువు ఈ ఆటను భారతదేశానికి పరిచయం చేశారని చెబుతారు. అయితే క్రీస్తు పూర్వం 2వ శతాబ్ది నాటికే ఈ ఆట వ్యావహారికంలో ఉందని కొందరు అంటారు. ఈ భారతీయ ఆటను 1892 ప్రాంతంలో బ్రిటిష్ పాలకులు ప్రపంచానికి పరిచయం చేశారు.
ఇంతకీ ఈ ఆటలో ఏముంది.
ఈ ఆట ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు? ఏం నేర్చుకోవచ్చు?
ఆధ్యాత్మిక జీవనంలో ఈ ‘పరమపథం’ పాత్ర ఏమిటి?
‘‘తద్విష్ణో పరమం పదం’’ అని వేదోక్తి.
అంటే- విష్ణుమూర్తి నివాసం ఉండే ప్రదేశమే పరమపదం. అంటే, అదే వైకుంఠం లేదా సద్గతి. అక్కడికి చేరుకోవడానికి మనిషి చేసే ప్రయత్నమే పరమ పథం. పరమ పథం అనేది మానవ జీవిత లక్ష్యాన్ని నిర్దేశించే వేద ప్రమాణం. మనిషి ఆధ్యాత్మిక సాధనతో మోక్షం పొందిన తరువాత సద్గతిని పొందుతాడు. అటువంటి సద్గతి పొందిన మనిషికి మళ్లీ జన్మంటూ ఉండదు. అలాంటి మరుజన్మ లేని, జన్మరాహిత్యాన్ని పొందడమే ఈ ఆట మనకు నేర్పే ముఖ్య పాఠం.
మనం జీవితంలో మంచి పనులు చేస్తే మంచి స్థానానికి చేరుకుంటాం. ఆ మంచితనానికి ప్రతీకలు నిచ్చెనలు.
మనం చెడు పనులు చేస్తే చెడ్డ ఫలితాలనే పొందుతాం. అంటే పాపం చేస్తే పాము నోట్లో పడినట్టే. చెడు చేస్తూ, పాపం పనులు చేస్తూ జీవితంలో ఎదగాలనుకోవడం అసాధ్యం. ఒకవేళ ఏదోలా పైకి వెళ్లినా ఏదోరోజు నేరుగా కిందికి దిగజారిపోక తప్పదు.
వైకుంఠపాళీ ఇద్దరు లేదా ముగ్గురు నలుగురు కూడా ఆడవచ్చు. ఇంకా ఆపైన ఎందరైనా కూడా ఆడవచ్చు.
కాకపోతే ఆడేవాళ్లు ఒక్కో రకం ఆటకాయలను ఎంచుకోవాలి.
ఇక, పాచికలుగా గవ్వలను కానీ, చింతపిక్కలను కానీ వాడుతుంటారు.
చదరంగా ఉండే ఈ పఠంలో సాధారణంగా పది అడ్డ వరుసలు, పది నిలువు వరుసలతో మొత్తం వంద గడులు ఉంటాయి.
కొన్ని పటాలలో 8 అడ్డ నిలువు వరుసలు, 12 అడ్డ నిలువు వరుసలు కూడా ఉంటాయి.
మరికొన్ని పటాలలో 132 గళ్లు కూడా ఉంటాయి.
132 గడులు ఉన్న పటమే వైకుంఠపాళీ ఆటకు ప్రామాణికంగా భావిస్తారు.
ఈ గళ్లు కూడా వివిధ బొమ్మలతో నిండి ఉంటాయి. అయితే, ఈ విషయంలో ఏ ఒక్క పటం మధ్య సారూప్యత కనిపించదు. అంటే- ఒక్కో పటం ఒక్కో విధంగా ఉంటాయి. గడుల సంఖ్య కూడా వేర్వేరుగా ఉంటుంటుంది.
మొత్తానికి ఒకటో గడి నుంచి తుది గమ్యానికి చేరేలా ఆట సాగుతుంది.
ముందుకు సాగే కొద్దీ చిన్న పాములు, పెద్ద పాములు, చిన్న నిచ్చెనలు, పెద్ద నిచ్చెనలు ఉంటుంటాయి.
మనం ఆడే ఆటకాయలు వీటిలో నిచ్చెన వద్ద పడితే కొంచెం ముందుకు వెళ్తాం.
పాము నోట్లో పడితే సరాసరి కిందకు దిగిపోతాం.
దీనినే పాప-పుణ్యాలతో పోల్చి చెబుతారు.
చివరకు ఈ అడ్డంకులను దాటుకుంటూ ఎవరు ముందుగా చివరి గడి (మోక్షపథం)కి చేరుకుంటారో వారు విజేత అయినట్టు ప్రకటిస్తారు.
పరమపథ సోపాన పటంలో 16, 19, 30, 41, 52, 63, 74, 79, 87 సంఖ్యలు గల గడులలో నిచ్చెనలు ఉంటాయి.
మన ఆటకాయ ఈ గడుల్లో పడితే కనుక మనం ఆ స్థానం నుంచి పై స్థానానికి చేరుకుంటాం.
అలాగే, 3, 10, 26, 55, 75, 106, 121 తదితర గడుల్లో (ఈ సంఖ్యలు వైకుంఠపాళి పటంలో ఉన్న గడుల సంఖ్యను బట్టి మారుతుండవచ్చు) పాములు ఉంటాయి. ముఖ్యంగా 106వ గడిలో ఉన్న పాము మన ఆటకాయను మింగిదంటే ఆట మొదలెట్టిన చోటికే వచ్చేస్తాం.
అంటే 1వ గడిలో పడిపోతాం.
చివరకు 121వ గడిలో ఉన్న పామును తప్పించుకుని 122వ గడికి ఆటకాయ చేరుకుంటే మనం పుణ్యపథంలో పడినట్టే. అంటే, ఇక ఆపైన పాములు తగలవు.
ఇంతకీ ఆధ్యాత్మికతతో ముడిపడిన ఈ ఆటలోని మర్మం ఏమిటి?
మొదటి గడి నుంచి మొదలయ్యే ఈ ఆట ఎంతో ఆసక్తి, ఉత్సుకత కలిగిస్తూ ముందుకు తీసుకువెళ్తుంది.
ఒక్కోసారి నిచ్చెనలు ఎక్కి పైకి ఎగబాకడం.. మరోసారి పాముల బారిన పడి కిందకు జారిపోవడం ఈ ఆటలో భాగం.
ఆట అయినా, జీవితం అయినా.. అడ్డంకులను అధిగమించి ముందుకు సాగితేనే ఎవరైనా విజేతలుగా నిలుస్తారు.
సుదీర్ఘమైన ఈ జీవితాన్ని కూడా క్రీడాస్ఫూర్తితో ఆడాలి.
పోరాడి గెలవాలి.
అదే జీవిత వైకుంఠపాళీ.
ఈ ఆటలో ఒకసారి నిచ్చెన ఎక్కగానే సరిపోదు.
అలాంటివి మరెన్నో అధిరోహించాల్సి ఉంటుంది.
అంటే దీనర్థం- ఒక్క విజయంతోనే సంతృప్తిపడకూడదు. చివరి వరకు ఆడి విజయం సాధించాలి.
జీవితంలో మనల్ని ఒక్కోసారి పరాజయాలు, ఇంకొన్నిసార్లు విజయాలు పలకరిస్తాయి.
అవి ఆశ-నిరాశలకు గురిచేస్తుంటాయి.
అపజయం కలిగినపుడు ఇక పోరాడలేను అనిపిస్తుంది.
నేను సాధించలేననే భయం కలుగుతుంది.
అటువంటి సందర్భాలలోనే ఆత్మవిశ్వాసం, ధైర్యం అవసరం. ఆశాభావంతో ప్రయత్నం చేస్తే ఏనాటికైనా విజయం సిద్ధిస్తుంది.
క్రీడా మైదానం కావచ్చు.. జీవన విధానం కావచ్చు.. మనం నిర్దేశించుకున్న లక్ష్యం మంచిదై ఉంటే, దానిని సాధించే వరకు అలుపెరగని పోరాటం, ప్రయత్నం చేయాల్సిందే.
గెలవాలని, గెలిచి నిలవాలనే పట్టుదల, తెగింపు ఉండాలి.
మనలో తెగువ, ధైర్యం ఎప్పుడైతే తగ్గిపోతాయో, మనల్ని భయం ఎప్పుడైతే ఆవహిస్తోందో ఆటలోని పాముల్లా అవి ఉన్న స్థితి నుంచి ఇంకా కిందకు దిగజార్చేస్తాయి.
ఆటలోనైనా, జీవితంలోనైనా శ్రద్ధ, ఓర్పు, సహనం.. ఇవే విజయతీరాలకు చేర్చే మార్గదర్శులు.
పడిన చోటు నుంచే మళ్లీ మొదలుపెట్టాలి.
ఓడిన చోటు నుంచే మళ్లీ గెలుపు జెండా ఎగురవేయాలి.
మానవ జీవితంలో ఉత్థాన పతనాలు సహజాతి సహజం. వాటిని శ్రద్ధ, సహనంతో అధిగమించే నేర్పును, నైపుణ్యాన్ని పిల్లలకు బాల్యంలోనే నేర్పే క్రీడ- ఈ వైకుంఠపాళీ.
నాలుగు గవ్వలతో, ఆడేవారి సంఖ్యను బట్టి తగిన ఆటకాయలతో జీవితాన్ని ఆస్వాదించవచ్చంటే నమ్ముతారా? వైకుంఠపాళి ఆ పని చేస్తుంది. జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని, అడ్డంకులను ఎదుర్కోగల నేర్పును, ధైర్యాన్ని, అందుకు తగిన స్థైర్యాన్ని ఇచ్చే ఆట ఇది.
ప్రామాణికంగా చెప్పాలంటే, ఈ పటంలో పదకొండు వరుసలు ఉంటాయి. ఒక్కో వరుసలో 11 గడులు ఉంటాయి. మొత్తం 121 గడులు పూర్తయ్యాక, పై భాగాన పదకొండు గడులలో ‘పరమపద సోపాన పటము’ అని పెద్ద అక్షరాలు ఒక్కో గడిలో ఒక్కోటి రాసి ఉంటాయి. ఈ పదకొండు (11) గడుల్లోని పది గడుల్లో పది మంది దివ్య పురుషులు లేదా వేర్వేరు దేవతలు కొలువుదీరి ఉంటారు. వారి మధ్యలో శ్రీమహావిష్ణువు కొలువై ఉంటాడు. ఆయన ఉన్న చోటుకు చేరుకోవడమే ఈ ఆటలోని అంతిమ కర్తవ్యం. మనం చివరకు చేరుకోవాల్సిన స్థానం అది. అక్కడకు చేరుకునే వరకు ఈ ఆట ఆడుతూనే ఉండాలి.
జీవితం కూడా అంతే! కష్టనష్టాలు ఎదురైనా, వాటిని అధిగమిస్తూ ముందుకు సాగిపోవడమే మన పని. ఈ ఆటలో ఒకటి నుంచి 121వ గడి వరకు ఎకాఎకీన వెళ్లిపోతామని చెప్పలేం. అక్కడకు చేరే వరకు వివిధ గడుల నుంచి అదృష్టవశాత్తూ పైకి ఇంకొంచెం పైకి చేరుకోగలం. దురదృష్టవశాత్తూ కిందికి జారిపోగలం. అయినా పడుతూ లేస్తూ మళ్లీ ఆట మొదలుపెట్టాల్సిందే. అంటే పరమపదాన్ని చేరుకునే వరకు ఈ జనన మరణ సంసార చక్రంలో పడుతూ లేస్తూ ఉండటం తప్పదని ఇది సూచిస్తుంది.
పదకొండు (11) సంఖ్యను సంస్క•తంలో ‘ఏకాదశి’ అంటారు. ఏకాదశీ వ్రతం, ఏకాదశి ప్రాశస్త్యం భారతీయులందరికీ తెలిసిందే. ప్రతి నెలా రెండు ఏకాదశులు వస్తుంటాయి. ఈ రెండూ వివిధ పర్వాలతో ఉంటాయి. వీటిని భారతీయులు శ్రద్ధాభక్తులతో ఆచరిస్తుంటారు. దీనినే ఏకాదశి వ్రతమని అంటారు. అందుకే మనకు ఏకాదశి మహా పర్వదినం. ఆ రోజు వ్రతాచరణతో పాటు ఉపవాసం, జాగరణం ఉండటం, దైవనామ స్మరణతో గడపడం తప్పనిసరి. ఈ ఏకాదశీ వ్రతాన్ని వరుసగా పదకొండేళ్ల పాటు ఆచరిస్తే పరమపదం చేరుకోవచ్చని పురాణాలు చెబుతున్నాయి.
ఇదంతా ఆధ్యాత్మిక సంబంధం.
ఈ వైకుంఠపాళిలోని పరమపదాన్ని చేరుకోవడం మాత్రం ఆధ్యాత్మిక వికాసం.
జయాపజయాలు అనేవి మానసిక అనుభూతులు. ఈ అనుభూతుల మధ్య సమన్వయాన్ని సాధించి పరమపదాన్ని చేరుకోవడమే ఆధ్యాత్మిక పరమావధి. ఈ ఆటలో గొప్ప వ్యక్తిత్వ వికాస సూత్రం ఉంది. అదేమిటంటే- ‘‘మన విజయం లేదా మన ఉన్నతి మన చేతిలోనే ఉంది’’.
మన చేతిలోని గవ్వలు ఎలా పడతాయో.. అలా మన ఎదుగుదల ఉంటుంది. ఆటలో గవ్వలు కావచ్చు.. జీవితంలో ఉన్నత లక్ష్యాలు కావచ్చు.. వాటిని నేర్పుగా వాడుతూ ముందుకు వెళ్లడం అనేది ఒక కళ.
వైకుంఠపాళి పటంలోని ప్రతి గడిలో ఒక్కో బొమ్మ.. దానికో పేరు ఉంటాయి.
కొన్ని గళ్లు మనల్ని ఉన్నట్టుండి నిచ్చెనలు ఎక్కించి పైకి తీసుకువెళ్తాయి.
మరికొన్ని గళ్లలో కాచుకుని కూర్చున్న పాములు అమాంతం మింగేస్తూ కిందకు పడదోస్తాయి.
అంతలోనే ఉత్సాహం.. అంతలోనే నిరుత్సాహం.. అంతిమంగా ద్వంద్వాతీతమైన పరమశాంతి.
ఇదీ వైకుంఠపాళి ఆట నడిచే తీరు.
ఆ ఆటలోని పాములు, నిచ్చెనలు ఉన్న గడుల్లోని పేర్లను జాగ్రత్తగా పరిశీలిస్తే, అద్వితీయమైన ఆధ్యాత్మిక రహస్యాలు తెలిసివస్తాయి.
ఉదాహరణకు 75వ గడిలో ఒక పాము తల వద్ద ‘కర్కోటకుడు’ అని రాసి ఉంటుంది. దాని తోక పదవ గడిలోకి పాకి ఉంటుంది. అక్కడ వరాహం బొమ్మ ఉంటుంది. పాము కరవడం వల్ల కిందికి పడిపోయామనేది పైకి కనిపించే విషయం. కానీ, జీవితంలో కర్కోటకంగా వ్యవహరిస్తే వచ్చే జన్మలో పందిగా పుడతామనేది ఆధ్యాత్మిక హెచ్చరిక. పంది జన్మ బారిన పడకూడదంటే మనం జీవితంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఆటలోనూ, ఆ గడిలోకి పడకుండా నేర్పుగా గవ్వలను విసరాలి.
55వ గడిలో ఒక పాము తల ఉంటుంది. దాని వద్ద ‘దుర్యోధనుడు’ అని రాసి ఉంటుంది. దాని తోక 12వ గడిలోకి పాకి ఉంటుంది. అంటే పొరపాటున మన ఆటకాయ 55వ గడిలో పడిదంటే కనుక, ఏకంగా 43 గడుల కిందకు.. 12 గడిలోకి పడిపోతాం. ఇదంతా ఆటలో కనిపించేది. కానీ, దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక వికాసం మాత్రం చాలా గొప్పది. దుర్యోధనుడు అహంకారి. తన అహంకారంతో, మూర్ఖత్వంతో మొత్తం కురు వంశం వినాశనానికి కారకుడయ్యాడు. పైగా, అతడు కరడుగట్టిన అసూయకు ప్రతిరూపం. అందువల్లే అతనితో పాటు అతని వంశమూ సర్వనాశనమయ్యాయి. మనం కూడా జీవితంలో అసూయను దరిచేరనివ్వకూడదు. లేదంటే జీవితం నరకప్రాయమవుతుంది. సుఖం, శాంతి.. రెండూ ఉండవు. ఆ విషయాన్నే ఈ 55 నుంచి కిందికి 12వ గడి వరకు వ్యాపించి ఉన్న పాము చెబుతుంది.
పాముల అమరిక ఇంత అర్థవంతంగా ఉంటే, ఇక నిచ్చెనల ఏర్పాటు మరింత పరమార్థ బోధకంగా ఉంటుంది.
ఉదాహరణకు 63వ గడిలో ఒక నిచ్చెన అడుగు భాగం ఉంటుంది. అక్కడ ‘భక్తి’ అని రాసి ఉంటుంది. అక్కడ ఒక భక్తుడి బొమ్మ ఉంటుంది. దాని కొస 83వ గడి వరకూ సాగి ఉంటుంది. అక్కడ ‘బ్రహ్మలోకం’ అని ఉంటుంది. బ్రహ్మదేవుడి బొమ్మ చిత్రించి ఉంటుంది. అంటే, భక్తిగా ఉండటమే బ్రహ్మలోకానికి చేరే ఉపాయం అన్నది పరం అయితే, ఏ పనినైనా భక్తితో చేస్తేనే మంచి ఫలితాలు లభిస్తాయనేది ఇహం.
65వ గడిలో ఉండే నిచ్చెన నేర్పే పాఠం మరొకటి. ఈ గడిలో నిచ్చెన మొదలు ఉంటుంది. అక్కడ ‘చిత్తశుద్ధి’ అని ఉంటుంది. ఆ నిచ్చెన పై భాగం 105వ గడికి వ్యాపించి ఉంటుంది. అక్కడ ‘మహాలోకం’ అని రాసి ఉంటుంది. మొత్తం వైకుంఠపాళి ఆటలో ఇదే పెద్ద నిచ్చెన. 65వ గడిలో ఉండగా, మన చేతిలోని గవ్వలు నేర్పుగా పడ్డాయా.. నేరుగా 40 గడులను అధిగమించేసి.. 105వ గడికి ఎగబాకవచ్చు. ఇంతకీ దీనర్థం ఏమిటంటే.. చిత్తశుద్ధి ఉంటే మహాలోకాలు మనకు ఎదురేగి స్వాగతం పలుకుతాయని. ఈ నిచ్చెన చెప్పే అంతరార్థం ఇదే. చేసే పనిని చిత్తశుద్ధితో, శ్రద్ధతో చేస్తే మహాలోకాలు మన కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. మహాలోకానికి చేరుకున్నాక మనం మహా పురుషుడి కీర్తిని పొందుతాం అనే విశేషార్థం ఈ నిచ్చెనను అధిగమించడం వెనుక ఉంది.
గొప్ప గొప్ప జీవిత పాఠాలు నేర్పుతూనే, చెంతనే పొంచి ఉండే ప్రమాదాలనూ గుర్తించి జాగ్రత్తపడాలని హెచ్చరించడం ఆ ఆటలోని మరో ప్రత్యేకత.
సాధారణంగా 105వ గడి వరకు రాగానే, ఆటగాడిలో కొంచెం గర్వం తలెత్తుతుంది. ఇంకో పదహారు గడులు దాటేస్తే పరమపదం చేరిపోయినట్టేనని అనుకుంటాడు. సరిగ్గా అక్కడే ఎదురవుతుంది పెద్ద ప్రమాదం. 106వ గడిలో ‘అరుకాషుడు’ అనే అతి పెద్ద సర్పం ఉంటుంది. దాని నోట్లో పడితే అమాంతం కిందకు జారి, మొదటి గడిలోకి వచ్చి పడతాం. ఆ గడి పేరు ‘కోతి’. మహాలోకం చేరాను కదా.. నాకిక ఎదురు లేదు అని అనుకునేలోపే.. ఈ ప్రమాదం పొంచి ఉండటాన్ని బట్టి.. మనం జీవితంలో ఏ దశలోనూ గర్వాన్ని పొందకూడదని ఈ ఆట చెబుతుంది. ఇక్కడ చేసే పొరపాటు ఆటను మళ్లీ మొదటికి తెస్తుంది. వైకుంఠపాళి పరిభాషలో ఒకటిని ‘గుడ్డి’ అంటారు. అంటే ఎంత పెద్ద స్థానంలో ఉన్నా గర్వించి ఒక్క గుడ్డి పని చేసినా మళ్లీ పాతాళానికి దిగజారిపోవడం ఖాయం అని 106వ గడి చెబుతుంది.
ఎంత పైకి వెళ్లినా.. ఎంత కిందికి జారినా.. ఆటను ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదనేది, ఆపకూడదనేది ఒక నియమం. ఒకడు పెద్దపాము నోట్లో పడినా, ఇంకొకడు ఇంకా పడలేదు కాబట్టి అతను ఇతడిని ఆడాలని ప్రోత్సహిస్తాడు. ప్రత్యర్థిని సైతం బాగా ఆడాలని ప్రోత్సహించే ఏకైక ఆట బహుశా వైకుంఠపాళీయేనేమో!.
ఇక, చివరిదైనా.. చిన్నది కాదు మాత్రం ఇప్పుడు చెప్పుకోబోయే విషయం. చివరిలో 121వ గడిలో కూడా ఒక పాము ఉంటుంది. దాని పేరు ‘అహంకారం’. దాని తోక 99వ గడిలో ఉంటుంది. అక్కడ రాక్షసుడి బొమ్మ ఉంటుంది. అంటే 106లో ఆరుకాషుడిని దాటినా, 115లో వైకుంఠంలో ప్రవేశించినా, 117లో కైలాసంలో దివ్యానుభూతి పొందినా చివరిలో 121లో అహంకారానికి లోనైతే తిరిగి రాక్షస జన్మ తప్పదనేది ఇక్కడ నేర్పుకోవాల్సిన పాఠం. త్రిమూర్తులను తమ తపస్సులతో ప్రసన్నం చేసుకుని, మహాభోగాలు అనుభవించి లోకాలను జయించిన హిరణ్యకశిపుడు, రావణాసురుడు తదాది రాక్షసులు చివరకు రాక్షసులై దుర్మరణం పాలు కావడానికి ఈ అహంకారమే కారణం.
అంతిమంగా అహంకారం, మమకారం అనే రెండింటినీ జయించిన వాడే పరమపదం చేరుకోగలడు. అదే ఈ ఆట నేర్పే పాఠం.
Review పరమపద సోపాన ‘పాఠం’.