మూర్తి’ చిన్నది కీర్తి గొప్పది

మన ఉపనిషత్తుల్లో అతి చిన్నది- కైవల్యోపనిషత్తు. కానీ, ఇది బోధించే విషయం మాత్రం చాలా పెద్దది. ఇది అథర్వణ వేదంలో ఉంది. స్వయంగా అనేక మంత్రాలను వేదాల్లో చేర్చగలిగిన సామర్థ్యమున్న అశ్వలాయన మహారుషి అడిగిన ప్రశ్నలకు చతుర్ముఖ బ్రహ్మ ఇచ్చిన సమాధానాల సారమే ఈ ఉపనిషత్తు. శుద్ధ ఆత్మతత్త్వం ఈ ఉపనిషత్తులోని ముఖ్యాంశం.
సాధారణంగా భోజన సమయాల్లోనూ, ఇతరత్రా తీరిక వేళల్లో భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయాన్ని పఠించడం చాలామందికి అలవాటు. అయితే, ప్రాచీన వైదిక కాలంలో మాత్రం కైవల్యోపనిషత్తును పఠించేవారట. ఆ విధంగా ఈ ఉపనిషత్తు నిత్యపఠనీయతను సార్థకం చేసుకుంది. ఈ ఉపనిషత్తు ‘మూర్తి’ (రూపం/విగ్రహం) చిన్నదైనా.. దీనికి గల కీర్తి మాత్రం చాలా గొప్పది.
మానవజన్మకు పరమ గమ్యమైన మోక్షాన్ని, బ్రహ్మప్రాప్తిని ఈ ఉపనిషత్తు సరళంగా, సరసంగా, సాధనసహితంగా నిరూపిస్తోంది. ఈ ఉపనిషత్తు ఏం బోధిస్తుంది? మానవజన్మ పరమార్థాన్ని గురించి ఏం చెబుతోంది? కైవల్యాన్ని ఎలా పొందాలి? వంటి సందేహాలకు బ్రహ్మ ముఖతా వెలువడిన సమాధానాలే దీని సారం.

సాధారణంగా మనం ఎవరినైనా పొగడాలన్నా, లేదా వెటకారం చేయాలన్నా ‘నువ్వు దేవుడివి రా బాబూ’ అంటాం.
ఇది అవతలి వారి మెప్పు కోసమో.. మన తాత్కాలిక ఆనందం కోసమో ఇలా అంటుంటాం.
అయితే, మన ఉపనిషత్తులు మాత్రం ‘నిజంగా నువ్వు దేవుడివే!’ అంటున్నాయి. ఆ విషయాన్ని నిరూపించి మరీ నిత్యానంద పరిపూర్ణత్వాన్ని ప్రసాదించడమే కైవల్యోపనిషత్తు ప్రత్యేకత.
ఘటాభిమానం వదిలితే ఘటాకాశమే మహాకాశం.
దేహాభిమానం వదిలితే జీవుడే దేవుడు.
ముక్తి అంటే, మోక్షమంటే కొత్తగా తెచ్చుకునే వస్తువు కాదు.
విడిచిపెట్టాల్సింది విడిచిపెడితే మోక్షం లభించడానికి సిద్ధంగా ఉంటుంది.
మోక్షమంటే విడుపు. త్యాగం చేస్తేనే అది లభిస్తుందని ఈ ఉపనిషత్తు చెబుతోంది. ఏం త్యాగం చేయాలనేది ముందుముందు తెలుసుకుందాం.
‘భ్రాంతులుడిగిన బ్రహ్మంబు బట్టబయలు’ అన్నాడు వేమన.
భౌతిక ప్రపంచంపై భ్రాంతులు వీడితేనే బ్రహ్మజ్ఞానం అవగతమవుతుందనేది భావం.
సాలె పురుగు తాను నేసుకున్న వలలో తాను తగుల్కోకుండా తిరుగుతుంది.
కానీ, జీవుడు?
సర్వ మాయా కల్పిత లోకంలో నిత్యం విహరిస్తూ, అందులోనే మునుగుతూ, అందులోనే తాత్కాలిక ఆనందాన్ని వెతుక్కుంటూ ‘సుఖదు:ఖ భోక్త’గా ఉన్నాడు.
ఈ ‘మాయ’ను వదిలించుకుంటే కనిపించేదే- పరబ్రహ్మం.
ఈ బోధను చేసేదే కైవల్యోపనిషత్తు.
మొత్తం ఇరవై నాలుగు (24) శ్లోకాలతో కూడిన ఈ అతిచిన్న కైవల్యోపనిషత్తు మనిషి సాధించాల్సిన అతిపెద్ద పరమార్థం గురించి వివరిస్తోంది. అదేమిటో ఆలకిద్దాం.
బ్రహ్మజ్ఞానం పొందాలంటే వివేకం, విరక్తి, శమాది గుణసంపత్తి (శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం),

ముముక్షత్వం అనే లక్షణాలు కలిగి ఉండాలి. ఇవన్నీ బ్రహ్మవిద్యకు యోగ్యత కలిగించే లక్షణాలు. ఈ లక్షణాలు కలిగిన అశ్వలాయనుడు అనే మహారుషి ఒకనాడు బ్రహ్మదేవుడు (ఇక్కడ బ్రహ్మదేవుడు అంటే శోత్రియ బ్రహ్మనిష్టుడైన గురువు అని అర్థం) వద్దకు వెళ్లాడు. అతనిలోని యోగ్యతను గమనించిన గురువు.. నీ సంశయాలేమిటో అడుగు అన్నాడు.
అప్పుడు అశ్వలాయనుడు ఇలా అడిగాడు..
‘హే భగవాన్‍! విద్యల్లోనే శ్రేష్ఠమైన బ్రహ్మవిద్యను నాకు బోధించు. అటువంటి విద్యను సత్పురుషులు నిత్యం, నిరంతరం సేవిస్తుంటారని విన్నాను. ఇది పామరులకు ఏమాత్రం నేర్వ సాధ్యం కాని విద్య. కాబట్టి అది రహస్యమైనది. అంటే, సంస్కారిత బుద్ధి ఉంటే తప్ప నేర్చుకోలేనిది. విషయం మిక్కిలి సూక్ష్మమైనది కాబట్టి అది రహస్యం. అటువంటి విద్యను నేర్చుకున్న తక్షణమే సర్వ పాపాలు నశిస్తాయి. అంటే, మనసులో నిరంతరం కలిగే దురాలోచనలు, కలతలు, కంపములు కలిగించే చింతలు (ఇవన్నీ పాపములు) తొలగిపోతాయి. మనసుకు పరమశాంతి కలుగుతుంది’.
ఈ విధంగా అశ్వలాయనుడు వినయపూర్వకంగా తన సంకల్పం తెలపగానే, బ్రహ్మదేవుడు ఇలా బదులిచ్చాడు.
‘భక్తి, శ్రద్ధ, ధ్యాన యోగంతో నేను చెప్పేది ఆలకించు. శ్రద్ధ అంటే- శాస్త్రములందు, గురు వాక్యములందు సత్యబుద్ధి కలిగి బోధ పొందడం. భక్తి అంటే- స్వస్వరూప అనుసంధానం. స్వస్వరూప లక్షణ భావాలకు లోటులేకుండా నిరంతరం వ్యవహరించడం. ధ్యానయోగమంటే- మనసులోని చింతలన్నింటినీ మాపి, ఆత్మపరమైన ఏక చింతన కలిగి, ఆ ఏకచింతనను మనసులో లగ్నం చేయడం. ఇలా శ్రద్ధ, భక్తి, ధ్యానయోగాలతో గురువులు చెప్పే బోధనలు విని, ఆకళింపు చేసుకోవాలి’ అని ఉపదేశిస్తూ ఇంకా ఇలా బోధించాడు.
కాయకష్టాలకు ఓర్చి చేసే యజ్ఞ, యాగాలు, స్వర్గప్రాప్తిని ఆశించి చేసే కార్యములు, సంతాన లాభాన్ని ఆశించే పుత్రకామేష్టి వంటి వ్రతాలు, రాజ్యం, ధనలాభం కోరి చేసే అశ్వమేధయాగాలు.. వీటి ద్వారా ముముక్షత లభించదు. పుత్ర కామేష్ఠి యాగం చేయడం వల్ల సంతానం కలుగుతుందేమో కానీ, ముక్తి లభించదు. ఆ సంతానం శీలం లేనిదైతే జీవితం మరింత నరకప్రాయమవుతుంది. ధనం వలన కూడా ముక్తి లభించదు. మనిషి తను చేసే ప్రతి పని ద్వారా లాభాన్ని కోరుతున్నాడు. యజ్ఞఫలం ద్వారా ఐహిక సంపద, స్వర్గప్రాప్తి కలుగవచ్చు. రాజ్యలాభం, సంపదలు చేకూరవచ్చు. ఇలా తాను చేసే ప్రతి కర్మ నుంచి మనిషి లాభం ఆశిస్తున్నాడు. అయితే, ముక్తి అనేది మాత్రం ఇలాంటి పనుల వల్ల లభించదు. దీనిని పొందడానికి అనేక మార్గాలు కూడా లేవు. ఉన్నది ఒకే ఒక్క మార్గం. అది అనుమానరహితమైనది. అది త్యాగం వల్ల లభిస్తుంది. త్యాగం అంటే.. విడిచిపెట్టాల్సినవి నిస్సంకోచంగా విడిచిపెట్టడం. ‘నేను యజ్ఞయాగాదులు చేయగలవాడను. నేను ధనవంతుడిని. ఇతరులు చేయలేని కార్యాలను నేను చేస్తున్నాను. నేను చేసే పనుల ద్వారా నాకు సంపదలు కలుగుతాయి. స్వర్గప్రాప్తి లభిస్తుంది. వాటితో నేను సుఖంగా ఉండగలను. నేను దానం చేస్తున్నాను. దాని ద్వారా పుణ్యమనే ఫలం లభిస్తుంది. తపస్సు చేస్తున్నాను. దాంతో నా పాపాలన్నీ హరిస్తాయి…’ ఇలాంటి భావనలనే ఫలాపేక్ష అంటారు. ఈ అపేక్షను తొలగించుకోవడమే ముక్తిని పొందడానికి తొలి అర్హత. త్యాగం అంటే పై భావాలను విడిచిపెట్టడమే. వాటిని విడిస్తే మనసు అహంకార శూన్యమవుతుంది. ఆత్మప్రకాశానికి అవకాశం కలుగుతుంది.
జన్మించడం, మరణించడం, మళ్లీ పుట్టడం.. ఇవి మృత లక్షణాలు. ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల మనిషి ఈ మృత లక్షణాలతోనే జన్మంతా గడిపేస్తున్నాడు. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం.. వీటిని అవస్థాత్రయములని అంటారు. ఇవన్నీ పైన చెప్పిన ‘మృత’ లక్షణాలకు కారణమవుతాయి.
‘నేను ఇవేవీ కాదు’ అనే తెలివి కలిగితే మృతము అంతమై అమృతత్వం లభిస్తుంది.
మరి, ఈ అమృతత్త్వాన్ని ఎవరు పొందగలరు?
తమను తాము తెలుసుకున్న వివేకులు, జ్ఞానులు, ఆత్మజ్ఞులు అలాంటి అమృతత్త్వాన్ని పొందగలుగుతున్నారు. తాము నేర్చుకున్న జ్ఞానంపై సంశయాలు లేని వారు,
‘అహం బ్రహ్మాస్మి’ అని భావించే వారు,

సన్యాస యోగాన్ని చక్కగా ఆచరించే వారు, లాభాపేక్ష లేకుండా పనిచేసే ఆత్మాన్వేషులు, రాజస, తామస గుణాలు లేనివారు, మలిన భావాలు లేనివారు, శుద్ధ సాత్వికులు, ఆత్మావలోకన తత్పరులు.. వీరంతా భౌతిక ప్రపంచానికి అతీతంగా జీవిస్తున్న వారు. వీరంతా ఈ భౌతిక ప్రపంచంలోనే ఉంటున్నా.. దాని నుంచి బంధవిముక్తులు అవుతున్నారు. త్రికాలాలు, త్రియవస్థలు, త్రిశరీరములు, త్రిగుణాలు.. వీటి వలన కలిగే సంసారం నుంచి వీరంతా విమోచన పొందుతున్నారు. వారిని సంసార బాధలు ఏ బంధంలోనూ బంధించలేవు’ అని బ్రహ్మ అశ్వలాయనుడికి వివరించాడు.
అప్పుడు అశ్వలాయనుడు, ‘బ్రహ్మజ్ఞానులు మాత్రమే అలాంటి పదవి (ముక్తి) పొందగలరా? మాలాంటి పామరులు పొందలేరా? మాకు అటువంటి ఉన్నత దశ లేదా? మేమూ ముము•••త పొందడానికి మార్గం ఏదైనా ఉంటే చెప్పండి’ అని వేడుకున్నాడు.
బ్రహ్మ మళ్లీ ఇలా చెప్పడం ప్రారంభించాడు-
‘శుచిగా స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి, మనసులోని విక్షేపాలను తొలగించుకుని ఏదైనా ఏకాంత స్థలంలో ధ్యాన నిమగ్నులై కూర్చోవాలి. మంచి అనుకూలమైన ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పద్మాసనంలో కూర్చుని శరీరము, మెడ, శిరసు సమానంగా ఉంచి, చలించని ఏకస్తంభంలా ధ్యానం చేయడం ఆరంభించాలి.
అలా కూర్చుని, ‘నేను గృహస్తుడిని. లేదా బ్రహ్మచారిని. సన్యాసిని’ అనే భావాలను తొలగించుకోవాలి. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలను వశపర్చుకుని, వాటిని విచ్చలవిడిగా వ్యవహరించనీయక గురువును స్మరించుకోవాలి. ఇక్కడ గురువు అంటే ఆత్మ. ఇది గురువుల్లోకెల్లా మేటి గురువు. అటువంటి గురువు (ఆత్మ)తో అనుసంధానమై, ‘నాది’ అనే భావాన్ని వదిలేయాలి.
ఈ చరాచర బ్రహ్మాండమంతా బ్రహ్మమే. జగత్తు అంతా బ్రహ్మమయం. ఇప్పుడు ఉన్నవే కాదు.. ఇదివరకు పుట్టి, గిట్టినవి, ఇక పుట్టబోవునవి కూడా బ్రహ్మానికి లోబడి ఉండేవే. లోకం పుట్టి, గిట్టుతున్నా కూడా బ్రహ్మము నిరంతరం, శాశ్వతంగా ప్రతి ప్రాణిలోనూ ఉంది. అది అవిచ్ఛన్నమైనది.
ఈ నిజం తెలుసుకున్న వారు మృత్యువును అతిక్రమిస్తారు. అటువంటి జ్ఞానులకు మరణభీతి ఉండదు.
అస్తి, భ్రాంతి, ప్రియం.. ఈ లక్షణాలతో కూడినదే ఆత్మ. అది విశ్వ విలాసంలోనూ, జీవరాశుల్లోనూ చైతన్యయుతమై సంచరిస్తుంటుంది.
జ్ఞాని.. యజ్ఞంలోని అగ్నిని పుట్టించడానికి ఉపయోగించే కొయ్యగానూ, చిలుకుటకు ఉపయోగించే కవ్వముగానూ ఉండి, నిరంతర ధ్యానమనే ప్రయాసతో సంసారమనే అజ్ఞాన పాశాన్ని దహించివేస్తాడు. ఆ విధంగా బంధరహితుడు అవుతున్నాడు. తుదకు మోక్షము పొందుతున్నాడు.
ఈ మోక్షము పొందలేకపోవడానికి ప్రధాన కారణం- బంధములు.
బంధములు ఎలా కలుగుతాయి?
మాయ అనే అవిద్య వలన, తాను జీవుడినని భ్రమిస్తూ, శరీరాన్ని స్థానంగా చేసుకుని, శరీరంలో నివసిస్తూ మనిషి అన్ని పనులు చేస్తున్నాడు. పురుషుని కారణంగా సుఖం లభిస్తున్నదని స్త్రీ, స్త్రీ మూలకంగా సుఖం దొరుకుతుందని పురుషుడు భావిస్తూ, భోగాలను అనుభవిస్తూ, అన్నం, పానం మొదలైన అనేక విధ భోగాలను వివిధ రీతుల్లో పొందుతూ.. అదే సుఖమని భ్రమిస్తూ, అవి లేకుంటే దు:ఖపడుతూ బతుకీడుస్తున్నారు.
తత్త్వమసి (నేనే బ్రహ్మము) అని తెలియకపోవడం, తెలుసుకోలేకపోవడం వల్లనే ఈ అవిద్య కలుగుతుంది.
బ్రహ్మము విశ్వవ్యాపి. అది అందరిలోనూ ఉండే ఆత్మచైతన్యం. అయితే దానిని మనం గుర్తించం. అది ఆకాశము కన్నా సూక్ష్మతరమై, ఆకాశానికి కూడా నిలయమై ఉంది. అది శాశ్వతమైనది. ఆది అంత్యములు లేనిది. ఆది అంత్యములకు నిలయమైనప్పటికీ.. వాటికి అంటక సాక్షి వలే ఉంటుంది. అటువంటి సర్వోత్క•ష్ట చైతన్యమే ‘నువ్వు’ (తత్‍ + త్వమ్‍ + ఏవ).
ఈ విషయంలో సంశయమే లేదు.
త్వమ్‍ + ఏవ + తత్‍..
అంటే- నిస్సందేహంగా అది నువ్వే.
ఇక్కడ ‘నువ్వు’ అంటే ఏమిటో తెలుసుకోవాలి.
‘నువ్వు’ అనేది ఈ కనిపించే దేహం కాదు. ఆ దేహంలోని కర్మేంద్రియాలు కావు.

జానేంద్రియాలు కూడా కావు. మనసు, బుద్ధి కావు. కనిపించని సూక్ష్మ శరీరం కూడా కాదు. గోచరం కాని కారణ శరీరం కాదు. జాగృతి, స్వప్న, సుషుప్తులు కావు. సత్వ, రజ, తమో గుణాలు కావు. ఇవన్నీ కాకపోయినా కూడా, వీటన్నిటికీ రూపనామక్రియలు కలిగించే సూక్ష్మ చైతన్యమే ఆత్మ. ఆ ఆత్మ చైతన్యమే అందరి దేహాల్లోనూ ప్రకాశిస్తోంది. ఆ ప్రకాశమే ‘నువ్వు’.
‘అయామాత్మా బ్రహ్మ’ అంటే అదే అర్థం.
జాగ్రత, స్వప్న, సుషుప్తి అవస్థలంటే ఏమిటో కూడా తెలుసుకోవాలి.
‘జాగ్రత’ అంటే- ఈ స్థూలదేహంపై గల అభిమానం. ఇది సత్వగుణ ప్రధానమైది. ఇదే విశ్వుడనే పేరుతో జీవుడిగా వ్యవహరించే పరమాత్మ లీల. ‘స్వప్న’మంటే- సూక్ష్మ దేహాభిమానం. రజోగుణం ప్రధానమైనది. పరమాత్మ తైజసుడనే పేరుతో మన దేహంతో స్వప్న వ్యవహారాలు నడిపిస్తాడు.
‘సుషుప్తి’ అంటే- కారణ దేహాభిమానం. దీనినే అజ్ఞానం అంటారు. ఇది తమో గుణ ప్రధానమైనది. ప్రాజ్ఞుడనే పేరుతో నిద్రలో సుఖానుభవాలు పొందే పరమాత్మ లీల ఇది.
పంచమహాభూతాలు, వాటి పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు.. ఇవి చేసే పనులు, పంచేద్రియ విషయాలు అన్నీ కలిసి ఈ ప్రపంచమైంది.
ఈ ప్రపంచానికంతా ఆత్మ చైతన్యమై ఉంది.
పతి జీవిలోనూ, ప్రతి వస్తువులోనూ ప్రకాశించేది ఆత్మ.
ఆ ఆత్మయే ‘నేను’.
‘నేను’ లేక ఇవేవీ ప్రకాశించవు.
ఆ ప్రకాశాన్ని ‘బ్రహ్మ’మని అంటారు.
ఆ బ్రహ్మమే ‘నేను’.
‘నేనే’ బ్రహ్మము.
ఈ విషయం తెలిస్తే అన్ని విధాలైన బంధాలు, పాశాలు పూర్తిగా, నిశ్శేషంగా తొలగిపోతాయి.
ఆత్మకు అవయవాలు లేవు. కానీ, ఆత్మశక్తితో మాత్రం అవయవాలన్నీ పనిచేస్తున్నాయి.
ఇంద్రియాలు లేవు. కానీ, ఆత్మ అధిష్ఠించి ఉండటం వల్ల ఇంద్రియాల గురించి మనిషి తెలుసుకోగలుగుతున్నాడు.
మనసు లేదు. కానీ, ఆత్మ చైతన్యం వల్ల మనసు విషయాలను గురించి ఆలోచించగలుగుతోంది.
రూపం లేదు. కానీ, అన్ని రూపాలలోనూ ఆత్మ అస్తి, భ్రాంతి, ప్రియం అనే లక్షణాలతో రూపుదిద్దుకుని ఉంది.
ఈ విషయం తెలుసుకున్న వాడే జ్ఞాన స్వరూపుడు. వేదాలు నాలుగే అని మనం భావిస్తాం.కానీ, మనం తెలుసుకోవాల్సిన ప్రతి విషయమూ వేదమే. అంటే మనం తెలుసుకోవాల్సినవి అసంఖ్యాకంగా ఉన్నాయి.
వాటి గురించి తెలియచెప్పే ‘తెలివే’.. బ్రహ్మము (పరమాత్మ). బ్రహ్మము లేకుండా మనం ఏం తెలుసుకోలేం. నేర్చుకోలేం.
ఉపనిషత్తులు అనేకం ఉన్నాయి. అనేకమంది రుషులు వాటి గురించి బోధించినా.. ఆ రుషుల రూపంలో బోధించినది, ప్రకటించినది బ్రహ్మమే. రుషిముఖంగా వేదాలను, వేదాంతాలను గ్రహించి శిష్యులు తెలుసుకున్నది కూడా ‘బ్రహ్మ’మనే తెలివి ద్వారానే.
బ్రహ్మమునకు పాపపుణ్యముల వలన నాశనం లేదు. అది అన్ని పనులు చేస్తుంది. కానీ, వాటి పుణ్యపాపాలు దానికి అంటవు.
బ్రహ్మమునకు జన్మ లేదు. జన్మ కలగడానికి దేహం లేదు. దేహం లేదు గనుక ఇంద్రియాలు లేవు, మనసు లేదు, బుద్ధి లేదు.
పరమాత్మ సాక్షిభూతం మాత్రమే. చిన్మాత్రుడు.
అటువంటి పరమాత్మకు ‘నాది’ అనబడే భూమి లేదు. నీరు కూడా లేదు. అగ్ని కూడా లేదు. వాయువు కూడా లేదు. ఆకాశం కూడా లేదు.
‘ఈ పంచమహాభూతాలైన ఆకాశం, అగ్ని, జలం, పృథ్వి, వాయువు నేను కాదు. అవి నావి కూడా కాదు. అయినా నేను లేకపోతే ఇవేవీ లేవు, ఉండవు’ అంటున్నాడు పరమాత్మ.
పరమాత్మ రూపం- పరబ్రహ్మం. అది ఆత్మస్వరూపం. అది ప్రతి మనిషిలోనూ, జీవిలోనూ హృదయంలో ఉంటుంది. పరబ్రహ్మానికి నిష్కళంకాలు సోకవు. అది అనన్య స్వరూపం. తనకు తానే పోలిక. ఇతరాలేవీ లేవు. అది చరాచర జగత్తుకు సాక్షి. గుణత్రయాలకు సాక్షి. జాగృత, స్వప్న, సుషుప్తవులకు సాక్షి. శరీరత్రయాలకు సాక్షి. సత్తు, అసత్తు అనే భేదవిభేదాలకు అతీతం. పరబ్రహ్మం- నిర్మలం, శుద్ధసత్వ ప్రధాన గుణం కలది. ఈ విషయం తెలుసుకున్న వాడే పరమాత్మ కాగలుగుతున్నాడు. పరమాత్మ రూపాన్ని తాను పొందుతున్నాడు. ఇదే ఆత్మజ్ఞానం. ఇదే మోక్షానికి దారి. మనిషి ‘నేను ఎవరు?’, ‘ఏది నాది?’ ‘ఏది కాదు?’ అని తనలో తాను వివేచించుకోవడం వలన జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితే అజ్ఞానం తొలగిపోతుంది. జీవభావం వీడిపోతుంది. మరణభీతి పోతుంది. జ్ఞానం అంటే కొత్తగా వచ్చేది కాదు. మేఘాలు తొలగినపుడు సూర్యుడు ప్రకాశించినట్టు, అజ్ఞానం తొలగిపోగానే కలిగే ప్రకాశమే జ్ఞానం. మనిషికి ఆత్మజ్ఞానం లేకపోవడం వల్లనే ఈ సంసారం ఏర్పడుతోంది. బంధములు కలుగుతున్నాయి. ఆత్మజ్ఞానం వల్ల భవబంధాలు తొలగిపోతాయి. మళ్లీ జన్మ కలుగుననే భీతి పోతుంది. మళ్లీ మళ్లీ జన్మ ఎత్తడం వల్ల మళ్లీ మళ్లీ సంసారంలో పడతాం. జన్మనాశనం పొందితే సంసారనాశనం కలుగుతుంది. అంటే, మళ్లీ జన్మ ఎత్తే అవసరం కలగని జ్ఞానం సంపాదించడమే మోక్షం.
మనలోని ఆత్మను ఎరిగి, జ్ఞానాన్ని పొందడమే మోక్షమార్గం. ఆ మోక్ష మార్గాన్ని పొందిన వారే ‘బ్రహ్మ’జ్ఞాని అవుతారు.

మోక్షం ఎవరికి ముందు?
నారద మహర్షి ముల్లోక సంచారి కదా! ఒకసారి ఆయన వైకుంఠం నుంచి నేరుగా భూలోకానికి వెళ్లాడు. శ్రీహరి భక్తుల యోగక్షేమాలు కనుక్కోవాలనేది ఆయన అభిలాష. మొదట ఆయన ఓ మునిని కలిశాడు.
నారదుడిని చూస్తూనే ఆ ముని, ‘మహర్షీ! వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? విష్ణువు ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? మీరు తరచూ ఆయనను కలుస్తుంటారు కదా! ఏం మాట్లాడుకుంటారు?’ అంటూ ప్రశ్నలతో ముంచెత్తాడు.
శ్రీహరి బాగానే ఉన్నాడని, తరచూ ఆయనను కలుస్తుంటానని నారదుడు బదులిచ్చాడు.
‘ఈసారి వైకుంఠానికి వెళ్లినపుడు నాకు మోక్షం ఎప్పుడు లభిస్తుందో నా శ్రీహరిని అడగండి’ అని ఆ ముని నారదుడిని కోరాడు.
సరేనంటూ నారదుడు అక్కడి నుంచి ముందుకు సాగాడు.
దారిలో ఓ చెప్పులు కుట్టే వ్యక్తి తారసపడ్డాడు.
నారదుడిని చూస్తూనే ఆ చెప్పులు కుట్టే వ్యక్తి వినమ్రంగా నమస్కరించాడు.
‘మిమ్మల్ని చూస్తుంటే నా స్వామి శ్రీహరిని చూస్తున్నట్టే ఉంది. అక్కడ నా స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు?’ అని అడిగాడు చెప్పులు కుట్టే వ్యక్తి.
‘స్వామి బాగానే ఉన్నారు. నేను మళ్లీ నేరుగా వైకుంఠానికే వెళ్తున్నాను. నీ తరపున స్వామిని ఏమైనా అడగమంటావా?’ అని అడిగాడు నారదుడు.
‘అడగడానికి ఏముంది స్వామీ! ఆ స్వామి కటాక్షం ఎప్పుడూ నా పైన ఉంటే చాలు’ అన్నాడు చెప్పులు కుట్టే వ్యక్తి.
ఇక్కడి విషయాలు అక్కడికి, అక్కడి విషయాలు ఇక్కడ చేరవేయడమే కదా నారదుడి పని.
భూలోకం నుంచి వైకుంఠానికి వెళ్లిన నారదుడు, శ్రీహరిని కలిసి భూలోకంలో తనకు ఎదురైన ఇద్దరు వ్యక్తుల గురించి, వారు తనతో, తాను వారితో మాట్లాడుకున్న విషయాల గురించి చెప్పాడు.
‘ఇంతకీ వారిద్దరిలో ఎవరికి మోక్షం ముందు లభిస్తుందో చెప్పండి’ అని విష్ణువును అడిగాడు నారదుడు.
‘మోక్షాన్ని పొందాలంటే ఆ ముని మరెన్నో జన్మలెత్తాలి. ఆ చెప్పులు కుట్టే వ్యక్తికి మాత్రం ఇదే చివరి జన్మ. అతడు నాలో లీనమవుతాడు. ఇక జన్మ ఉండదు’ అని విష్ణువు చెప్పాడు. నారదుడు ఆశ్చర్యపోయాడు.
‘నిత్యం నీ నామస్మరణలో గడుపుతున్న మునికి ఇప్పట్లో మోక్షం లేదా? చెప్పులు కుట్టుకునే వాడికి తక్షణమో ముక్తా? ఇదెక్కడి న్యాయం ప్రభూ!’ అన్నాడు నారదుడు.
‘సరే. ఈసారి మళ్లీ నువ్వు భూలోకం వెళ్లినపుడు వారిద్దరూ కలుస్తారు కదా! వారు ‘స్వామి వారు ఏం చేస్తున్నారు?’ అని నిన్ను అడిగినపుడు ‘ఆయన సూది బెజ్జంలో నుంచి ఏనుగును పంపించడానికి ప్రయత్నిస్తున్నారు’ అని చెప్పు. అప్పుడు ఎవరెలా స్పందిస్తారో దాన్ని బట్టి నిజమైన భక్తుడెవరో నువ్వే గుర్తించు’ అన్నాడు విష్ణువు.
నారదుడు మళ్లీ భూలోకం వచ్చాడు. ఆయనను చూస్తూనే ముని, ‘నా స్వామి ఏం చేస్తున్నారు?’ అని అడిగాడు.
‘స్వామి సూది బెజ్జంలో నుంచి ఏనుగును దూర్చడానికి యత్నిస్తున్నారు’ అని నారదుడు బదులిచ్చాడు.
‘భలే వారే! అదెలా సాధ్యం?’ అన్నాడు ముని.
అదే విషయం నారదుడు చెప్పులు కుట్టే వ్యక్తికి చెప్పగా, ‘నా స్వామికి సాధ్యం కానిది ఏముంది? ఆయన తలచుకుంటే ఏదైనా సాధ్యమే’ అన్నాడు భక్తిపూర్వకంగా.
అతడిలో భగవంతుడి పట్ల ఎంత బలమైన విశ్వాసం ఉందో నారదుడికి అర్థమైంది. మోక్షం చెప్పులు కుట్టే వ్యక్తికే ముందు ఎందుకు లభిస్తుందని విష్ణువు చెప్పారో నారదుడికి అర్థమైంది.

Review మూర్తి’ చిన్నది కీర్తి గొప్పది.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top