వర్జినియా లో తెలుగు వారి ఏలుబడి!

అమెరికాలో ప్రకాశిస్తున్న తెలుగు తేజాలు ఎన్నెన్నో.. ప్రతిభతో వెళ్లి అక్కడ ఉన్నత స్థానాలకు చేరుకుంటున్న వారు కొందరైతే.. తమ నాయకత్వ లక్షణాలతో అక్కడి పాలనా పగ్గాలు అందుకుంటున్న వారు మరికొందరు. ఇప్పటికే ఎందరో భారతీయులు అమెరికాలో విశిష్టమైన పదవులను అలంకరించారు. ఈ వరుసలో తాజాగా నిలుస్తున్న ప్రముఖుడు- సుబ్బా కొల్లా.అమెరికాలో ఆయన ఒక వ్యాపారవేత్త. కానీ, సామాజిక కార్యకర్తగా ఆయన చాలా పెద్ద కార్యక్రమాలే చేపడుతుంటారు. అవే ఆయనను అమెరికా ప్రజానీకానికి దగ్గర చేశాయి. మన భారతదేశంలో శాసనసభ్యుడు (ఎమ్మెల్యే) పదవి మాదిరి అమెరికాలో ‘డెలిగేట్‍’ స్థానానికి ఆయన పోటీ పడుతున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సుబ్బా కొల్లా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే వర్జీనియా అసెంబ్లీ డెలిగేట్‍గా గెలిచిన మొట్టమొదటి తెలుగు వ్యక్తిగా రికార్డు సృష్టిస్తారు. ఈ నేపథ్యంలో సుబ్బా కొల్లా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఏం చేస్తున్నారు?.. ఈ వివరాలను తెలుగుపత్రిక టీమ్‍ సేకరించింది.వాటిని తెలుసుకొందాం.
సుబ్బారావు కోల్లా ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కోళ్లవారిపాలెం గ్రామంలో ఓ నిరుపేద, నిరక్షరాస్య పత్తి రైతు కుటుంబంలో 1967 సంవత్సరంలో జన్మించారు. ఎన్నో ఒడి దుడుకులను ఎదుర్కొంటూనే ఆయన విద్యా భ్యాసాన్ని కొనసాగించారు. బాగా చదువుకోవాలనే తన ఆశయానికి పేదరికం అడ్డురాకుండా అహరహం శ్రమించారు. ఫలితంగా వీఆర్‍ సిద్ధార్థ ఇంజనీరింగ్‍ కాలేజీలో 1985-89 సంవత్సరాల మధ్య ఇంజనీరింగ్‍
డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం ఇండియన్‍ ఇనిస్టిట్యూట్‍ ఆఫ్‍ ఖరగ్‍పూర్‍ (ఐఐటీ-కే) నుంచి 1989-90లో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం ఆయన కొద్ది కాలం బోధన రంగంలో పని చేశారు. 1991-95 సంవత్సరాల మధ్య గుంటూరులోని ఆర్‍వీఆర్‍ అండ్‍ జేసీ కాలేజీ లోనూ, హైదరాబాద్‍లోని వీఎన్‍ఆర్‍ వీజేఐఈటీ కాలేజీలో 1995-97 సంవత్సరాల మధ్య మెకానికల్‍ ఇంజనీరింగ్‍ సబ్జెక్టును బోధించారు. 1992లో ఆయనకు వివాహమైంది. ప్రస్తుతం ఆయనకు ఇద్దరు సంతానం. పెద్ద అబ్బాయి చెన్నైలో మెడిసిన్‍ పూర్తి చేయగా, రెండో అబ్బాయి వర్జీనియాలో బయాలజీ సీనియర్‍ సంవత్సరం చదువుతున్నారు.
రాజకీయాల్లోకి ఎందుకొచ్చారంటే.
అమెరికాలో ఇప్పటికే ఎన్నో భారతీయ సేవా సంస్థలు లాభార్జన లేకుండా వివిధ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయితే, అంతకుమించి సామాజిక సేవా బాధ్యతలను నిర్వర్తించాలని సుబ్బా కొల్లా నిర్ణయించారు. ఎందుకంటే భారత్‍ నుంచి అమెరికా వస్తున్న వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. సుమారు 50 సంవత్సరాల క్రితం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వేల మంది భారతీయులు ఉంటే, ప్రస్తుతం ఈ సంఖ్య దాదాపు నాలుగు (4) మిలి యన్లకు చేరింది. ఇన్ఫర్మేషన్‍ టెక్నాలజీ రంగం ఆవిర్భావం అనంతరం సాఫ్ట్వేర్‍ రంగం పుంజుకోవడంతో అమెరికా వచ్చే వారి సంఖ్య మరింత పెరిగింది. ఫలితంగా గత ఇరవై సంవత్సరాలలో అమెరికా వచ్చిన భారతీయుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అమెరికాలో ఉంటున్న భారతీయుల కోసం, దేశం కాని దేశంలో వారిలో అభద్రతా భావం తొలగించేందుకు, భద్రత కల్పించేందుకు, వారందరికీ నాయకత్వం వహించేందుకు సుబ్బా కొల్లా ఏదైనా చేయాలని అనుకొన్నారు. అప్పటికే చిన్నా చితకా సేవా కార్యక్రమాలు చేపట్టే భారతీయ సంస్థలు చాలా ఉన్నా.. వాటికి ప్రాతినిథ్యం వహించే, నాయకత్వం వహించే రాజకీయ అండదండలు ఉంటేనే భారతీయులు అమెరికాలో మరింత స్వేచ్ఛగా ఉంటారనే తలంపుతో సుబ్బా కొల్లా రాజకీయా ల్లోకి రావడానికి నిర్ణయించుకున్నారు. మును ముందు అమెరికా వచ్చే భారతీయులకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేయాలన్నా, మార్గ దర్శకంగా ఉండాలన్నా అమెరికా రాజకీయాల్లో భారతీయ ప్రాతినిథ్యం ఉండాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు.
డెలిగేట్‍గా పోటీ..
ప్రస్తుతం సుబ్బా కొల్లా చాలామందికి ఓ వ్యాపారవేత్తగా, సామాజిక సేవా ప్రముఖుడిగా తెలుసు. తాజాగా రాజకీయ నాయకునిగా కొత్త పాత్రతో ముందుకొచ్చారు. వర్జీనియా హౌస్‍ ఆఫ్‍ డెలిగేట్‍ స్థానానికి ఆయన రిపబ్లికన్స్ బలపరుస్తున్న అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అమెరికాలో డెలిగేట్‍ స్థానం అంటే మన భారత్‍లో శాసనసభ్యుడి స్థానంతో సమానం. వర్జీనియా 87వ డిస్ట్రిక్ట్ డెలిగేట్‍గా ఆయన పోటీ పడుతున్నారు. ఈ డెలిగేట్‍ స్థానానికి ఈ ఏడాది నవంబరు 7వ తేదీన సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 100 హౌస్‍ స్థానాలకు పోలింగ్‍ జరగ నుంది. సుబ్బా కొల్లా అమెరికాకు 1997 సంవత్సరంలో వచ్చారు. అనంతరం 2008 సంవత్సరంలో అమెరికా సిటిజన్‍షిప్‍ పొందారు. అమెరికా వచ్చిన కొత్తల్లో ఆయన డాటాబేస్‍ అడ్మినిస్ట్రేటర్‍గా పని చేశారు. మరి కొన్నాళ్లు రియల్‍ ఎస్టేట్‍ వ్యాపా రాన్ని నిర్వహించారు. ప్రస్తుతం ఒక వ్యాపార సంస్థను నడిపిస్తున్నారు.
వర్జీనియాలో మనోళ్లదే హవా.
2015 జనాభా లెక్కల ప్రకారం.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే వర్జీనియా లౌడౌన్‍ కౌంటీ అత్యంత సంపన్నమైనది. అమెరికాలోని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ రాష్ట్ర సగటు తలసరి ఆదాయం చాలా ఎక్కువ. ఇక, వర్జీనియా రాష్ట్రంలో హాఫ్‍ మిలియన్‍ మంది కంటే ఎక్కువగా భారతీయ అమెరికన్లు ఉన్నారు. వర్జీనియా 87వ డిస్ట్రిక్ట్లో అష్‍బర్న్, అల్డీ, స్టోన్‍రిడ్జ్, స్టెర్లింగ్‍, లౌడౌన్‍ కౌంటీలోని సౌత్‍ రైడింగ్‍, ప్రిన్స్ విలియమ్‍ కౌంటీలోని డొమినియన్‍ వ్యాలీ ఉన్నాయి. వర్జీనియా స్టేట్‍లో అత్యంత రాజకీయ సమతుల్యం గల డిస్ట్రిక్టస్ ఇవి. గత మూడు ఎన్నికలల్లో ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థుల గెలుపు ఓటముల మార్జిన్‍ కేవలం యాభై నుంచి మూడు వందల ఇరవై ఓట్లు మాత్రమే. అంటే, 50- 320 ఓట్ల తేడాతో అభ్యర్థుల గెలుపు సాధ్యమైంది. ఇక, ఈ సంవత్సరం జరగబోయే సాధారణ ఎన్నికల్లో దాదాపు అరవై మూడు వేల ఓట్లు పోల్‍ అవుతాయని అంచనా. అట్లాం• మొత్తం జనాభాలో ఇది నలభై నుంచి నలభై రెండు శాతం. గత ఎన్నికల్లో గెలుపొందిన వారి విజయంలో భారతీయ అమెరికన్లదే ప్రముఖ పాత్ర. దాదాపు పన్నెండు (12) శాతం మంది భారతీయ అమెరికన్ల ఓట్లను ఎవరు సొంతం చేసుకున్నారో వారే విజయం సాధించగలిగారు. వీరిలో తెలుగు మాట్లాడే వారి ప్రాతినిథ్యమే ఎక్కువ కావడం విశేషం. ఈ లెక్కలను బట్టి సుబ్బా కొల్లా తెలుగు వారి, భారతీయ అమెరికన్ల మద్దతుతో సునాయాసంగా విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అమెరికా రాజకీయాల్లో ‘కొల్లా’ పాత్ర.
గత సంవత్సరం సుబ్బా కొల్లా సూపర్‍ డెలి గేట్‍గా ఎన్నికయ్యారు. క్లీవ్‍లాంగ్‍లోని ఓహియోలో నిర్వహించిన రిపబ్లికన్‍ నేషనల్‍ కన్వెన్షన్‍కు హాజరయ్యారు. అనంతరం వర్జీనియా నుంచి ప్రెసిడెన్షియల్‍ నామినీగా పార్టీ తరపున పత్రాలు దాఖలు చేశారు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు, భారతీయ అమెరికన్‍గా సుబ్బా కొల్లా రికార్డు సృష్టించారు. గడిచిన ఆరు సంవత్సరాలుగా సుబ్బా కోళ్ల పలు రాష్ట్రాలలో పార్టీ తరపున అత్యంత కీలక పాత్ర పోషించారు. క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ కార్యకలాపాలను ముందుకు నడిపిన సమర్థత గల వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. సుబ్బా కొల్లా మూడు సంవత్సరాల పాటు లౌడౌన్‍ కౌంటీ బోర్డ్ ఆఫ్‍ ఈక్వలైజేషన్‍కు తన విశిష్ట సేవలను అందించారు. ఆదాయపు పన్నుకు సంబంధించిన ఫిర్యాదులను ఈ బోర్డు విని, పరిష్కరిస్తుంది.సామాజిక సేవలో ముందంజసుబ్బా కొల్లా గత పన్నెండు సంవత్సరాలుగ విధ భారతీయ లాభార్జన లేని సంస్థలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ, తనదైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. తెలుగు అసోసియేషన్‍ ఆఫ్‍ నార్త్ అమెరికా, గ్రేటర్‍ వాషింగ్టన్‍ తెలుగు కల్చరల్‍ సంఘం, హోప్‍ ఫర్‍ హ్యూమానిటీ వంటి సంస్థల్లో ఆయన కీలకపాత్ర పోషించారు. ఇంకా, తానాకు ఆయన 2007 సంవత్సరంలో వాషింగ్టన్‍ కన్వెన్షన్‍ రిజిస్ట్రేషన్‍ కమిటీ చైర్మన్‍గా వ్యవహరించారు. రీజనల్‍ వైస్‍ ప్రెసిడెంట్‍, ఫౌండేషన్‍ ట్రస్టీగా, జాయింట్‍ సెక్రటరీగానూ విలువైన సేవలను అందించారు. ఆయన తానాకు ప్రాతినిధ్యం వహించిన సమయంలో తానా తరపున తన స్వగ్రామంలో ఎన్నో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. ప్రత్యేకించి నేత్ర వైద్య శిబిరాలను మిక్కిలిగా ఏర్పాటు చేశారు. ఆయా శిబిరాలలో దాదాపు రెండు వందల అరవై నాలుగు (264) కాటరాక్ట్ ఆపరేషన్లను నిర్వహించారు. ఇవన్నీ శంకర నేత్ర వైద్యాలయం సహకారం, సంయుక్త ఆధ్వర్యంలో చేయించారు. ఇంకా ఆయన క్యాన్సర్‍ నిర్ధారణ, గ్యాస్ట్రోఎంట్రాలజీ శిబిరాలను కూడా నిర్వహించారు. ఇక, జీడబ్ల్యూటీసీఎస్‍కు ఆయన బోర్డు ఆఫ్‍ డైరెక్టర్‍గా వ్యవహరించారు. వైస్‍ ప్రెసిడెంట్‍, ఇన్‍చార్జి ప్రెసిడెంట్‍గానూ సేవలందించారు. ఆ సమయంలో వాషింగ్టన్‍ డీసీలో ఎన్నో కమ్యూనిటీ సంబంధ సేవా కార్యక్రమాలను, అభివృద్ధి పథకాలను చేపట్టారు. ఆయన తానందించిన సామాజిక సేవా కార్యక్రమాలకు గాను వర్జీనియా గవర్నర్‍ నుంచి గుర్తింపు పత్రాన్ని పొందారు. ఇంకా హోప్‍ ఫర్‍ హ్యూమానిటీ సంస్థకు ఆయన బోర్డు ఆఫ్‍ డైరెక్టర్‍గా విలువైన సేవలందించారు. సెక్రటరీ, ప్రెసిడెంట్‍ ఆఫ్‍ ది ఆర్గనైజేషన్‍గా వ్యవహరించారు. ఈ సంస్థ దాదాపు రెండు వందల యాభై మంది (250) అత్యంత నిరుపేద పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించింది. వీరందరికీ కూడా కిండర్‍గార్డెన్‍ స్థాయి నుంచి పదవ తరగతి వరకు ఆంధప్రదేశ్‍ లోని విజయవాడలో విద్యనందించిందీ సంస్థ.
ఎన్నికల ప్రాధాన్యాలు ఇవే..
వర్జీనియా డెలిగేట్‍గా పోటీలో ఉన్న సుబ్బా కొల్లా తన ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. రవాణా, విద్య, ఉద్యోగాలు, ఆర్థిక పరిపుష్టిత- ఇవే ప్రాధాన్యాంశాలుగా కొల్లా ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రం నుంచి మరిన్ని నిధులను రాబట్టి ట్రాఫిక్‍ వ్యవస్థను చక్కదిద్దుతానని, గ్రీన్‍వేస్‍ రూపుదిద్దుతామని, రాకపోకలను క్రమబద్ధీకరిస్తా మని చెబుతున్నారు. ఉదాహరణకు లౌడౌన్‍ కౌంటీలో గడిచిన పదిహేను సంవత్సరాలలో జనాభా రెండింతలు పెరిగింది. దీంతో ట్రాఫిక్‍ ఇబ్బందులు పెరిగాయి. రోడ్లపై ట్రాఫిక్‍ రద్దీ పెరగడంతో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులపై ఒత్తిడి పడుతోంది. అలాగే, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు క్లాస్‍ రూమ్‍ పరిమాణాన్ని తగ్గిస్తానని, తద్వారా విద్యార్థులకు బోధన మెరుగుపడుతుందని ఆయన హామీనిస్తున్నారు. అలాగే, మంచి ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులను నియమిస్తామని చెబుతున్నారు. అలాగే, ఆయన స్థానికంగా పలు పరిశ్రమలు ఏర్పాటు అయ్యేందుకు స్టేట్‍ అండ్‍ స్థానిక ప్రభుత్వాల అధికారులతో కలిసి పని చేస్తున్నారు.
అందరూ కలిసి వస్తే విజయం ఖాయం
వర్జీనియా డిస్ట్రిక్ట్లో భారతీయ సంతతి పన్నెండు శాతం మంది వరకు ఉన్నారు. వీరంతా పోలింగ్‍ నాడు ఓట్లు వేయడానికి వస్తే, పూర్తి స్థాయిలో ఓటింగ్‍లో పాల్గొంటే సుబ్బా కొల్లా విజయం సునాయాసం అవుతుంది. గతంలో జరిగిన ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపును భారతీయ సంతతి ఓట్లే శాసించాయి. వీరు ఎంతగా ఓటింగ్‍లో పాల్గొంటే అభ్యర్థి విజయావకాశాలు అంతగా మెరుగుపడతాయని గత ఎన్నికల నేపథ్యాలు చెబుతున్నాయి. అలాగే, భారతీయ సంతతి ఓట్లే ఆయా అభ్యర్థుల గెలుపులో కీలకపాత్ర పోషించాయి. ఈ నేపథ్యంలో తెలుగు, భారతీయ సంతతి ఓటర్లపై సుబ్బా కొల్లా ప్రత్యేక దృష్టి సారించారు. వారిని పోలింగ్‍ నాడు ఓటింగ్‍కు రప్పించేలా, ఓటుపై అవగాహన కలిగించేలా ప్రత్యేక డ్రైవ్‍లు నిర్వహించేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసే ప్రయత్నాలకు రూపకల్పన చేస్తున్నారు. ఓటరు రిజిస్ట్రేషన్‍ నిర్వహించి ప్రతి ఓటు నమోదయ్యేలా అవగాహన కలిగించాలని నిర్ణయించారు. ఆ దిశగా ఆయన తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వర్జీనియాలో సుబ్బా కొల్లా పోటీ అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నికల ఖర్చు దాదాపు ఆరు లక్షల డాలర్లుగా అంచనా వేస్తున్నారు. సుబ్బా కొల్లా ఇప్పటికే మూడు లక్షలకు పైగా డాలర్లను సేకరించారు. మరో రెండు లక్షల డాలర్ల సేకరణలో తలమునకలై ఉన్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో సుబ్బా కొల్లా గెలిస్తే.. వర్జీనియా జనరల్‍ అసెంబ్లీలో మొట్టమొదటి ఇండియన్‍ అమెరికన్‍ డెలిగేట్‍గా చరిత్ర సృష్టిస్తారు.
యూఎస్‍ రాజకీయాల్లో వర్జీనియా పాత్ర..
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వర్జీనియాది విలక్షణ పాత్ర. ఇది అత్యంత సంపన్నమైన రాష్ట్రమే కాదు రాజకీయంగానూ వైవిధ్యం కలది. ఈ రాష్ట్రం ఇప్పటికే మొదటి ఐదుగురు అధ్యక్షుల్లో నలుగురు అధ్యక్షులను అమెరికాకు బహుమతిగా అందించింది. ఈ నలుగురూ వర్జీనియాకు చెందిన వారే కావడం విశేషం. అలాగే, మొత్తం ఎనిమిది మంది అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుల్లో ఎనిమిది మంది వర్జీనియా స్టేట్‍కు చెందిన వారే. మరే రాష్ట్రానికి ఇంతటి ఘనత లేదు. జార్జి వాషింగ్టన్‍, థామస్‍ జఫర్‍సన్‍, జేమ్స్ మాడిసన్‍, జేమ్స్ మన్రో, విలియం హెన్రీ హారిసన్‍, జాన్‍ టేలర్‍, జచర్‍ టేలర్‍, ఉడ్రో విల్సన్‍.. వీరంతా వర్జీనియాకు చెందిన వారే. దీంతో సహజంగానే వచ్చే నవంబరులో జరిగే అసెంబ్లీ డెలిగేట్‍ ఎన్నికపై, అదీ తెలుగు సంతతి వ్యక్తి పోటీలో ఉండటం అమెరికా సంయుక్త రాష్ట్రాల వ్యాప్తంగా, ఇటు భారతదేశంలో ఆసక్తికరంగా మారింది. అంతా సుబ్బా కొల్లా గెలుపు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Review వర్జినియా లో తెలుగు వారి ఏలుబడి!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top