విష్ణు-శివాత్మకం

దీపకాంతుల కార్తీకం

ఆధ్యాత్మికంగా అద్భుత నేపథ్యమున్న మాసం- కార్తీకం. ఈ మాసానికి ‘కౌముదీ మాసం’ అనే పేరు కూడా ఉంది. కౌముది అంటే నిండు పున్నమి వెన్నెల.
శరదృతువులోని స్వచ్ఛమైన వెన్నెల ఈ మాసంలో విరగకాస్తుంది. కృత్తికా నక్షత్రంతో కూడిన పూర్ణిమ కలిగినది కావడం వలన ఈ మాసానికి కార్తీకం అని పేరొచ్చింది.
కృత్తికా నక్షత్రానికి సంబంధించిన చాంద్రమానంతో కూడిన కార్తీక మాసానికి నాలుగు పేర్లు ఉన్నాయి. అవి- కార్తీకం, బాహులం, ఊర్జం, కార్తికికం. సంధ్యాదీపాలు, ఆకాశ దీపాల పేరుతో కార్తీమ మాసమంతా వెలుగులీనపుతుంటుంది.
దీపావళి మొదలుకుని నెల రోజుల పాటు కార్తీక మాసంలో ఉదయం, సాయంకాలం వేళలలో దీపాలను వెలిగిస్తే ఉత్తమ లోకాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక, కార్తీక మాసం హరిహరుల ఆరాధనకు విశిష్టమైనది.
కార్తీకంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు, ఆ తరువాత చేసే దానాలు, ఉపవాసాలకు గొప్ప శక్తి ఉందని స్కంద పురాణంలో అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణం వివరిస్తోంది.
హిందూ సంప్రదాయంలో గొప్ప ఆధ్యాత్మిక ప్రశస్తి కలిగిన ఈ మాసంలోని ముప్పై రోజులూ మహిమాన్వితమైనవే.
హిందూ పంచాంగం ప్రకారం కార్తీకం ఎనిమిదివ నెల. ఈ నెల పొడవునా శివ, వైష్ణవాలయాలు భక్తుల పూజలతో ఆధ్యాత్మికశోభను సంతరించుకుంటాయి.
మన తెలుగునాటతో పాటు చాంద్రమానం పాటించే వారందరికీ దీపావళి అమావాస్య మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ఆరంభమవుతుంది.
సౌరమానం పాటించే తమిళులకు సూర్యుడు వృశ్చికరాశిలో అడుగుపెట్టినప్పటి నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది.
బెంగాలీ, ఒరియా వారికి ఆశ్వయుజ పున్నమి మర్నాటి నుంచి కార్తీక మాసం మొదలవుతుంది.
కార్తీక మాసంలో చాలా పర్వదినాలు ఉన్నాయి.
కార్తీక మాసం తొలిరోజున బలి పాడ్యమి పర్వదినం.
అదేరోజు గోవర్ధన పూజ కూడా చేస్తారు.
రెండో రోజున భగినీ హస్త భోజనం.
ఈనాడు సోదరి ఇంట సోదరులు విందారగించడం ఆనవాయితీ.
కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితి.
శుక్ల పక్షంలో వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి, ఆ మర్నాడు వచ్చే క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పున్నమి వంటివి ఈ నెలలో వచ్చే ప్రధాన పర్వదినాలు.
కార్తీక పున్నమి హిందువులకే కాదు.. సిక్కులకు, జైనులకు కూడా ఇది అత్యంత పవిత్రమైన రోజుగా ఆచరణలో ఉంది.
దీపావళి అమావాస్యకు పదిహేను రోజుల తరువాత వచ్చే కార్తీక పౌర్ణమిని ‘దేవ దీపావళి’గా అభివర్ణిస్తారు.
నరక చతుర్దశి మర్నాడు వచ్చేది మానవుల దీపావళి అయితే, కార్తీక పూర్ణిమ దేవతల దీపావళి అన్నమాట.
కార్తీక పూర్ణిమ వేడుకలు కార్తీక శుద్ధ ఏకాదశి నాటి నుంచే మొదలవుతాయి.
కార్తీక శుద్ధ ఏకాదశిని ‘ప్రబోధిని ఏకాదశి’ అనీ, ‘ప్రబోధ ఏకాదశి’ అనీ అంటారు.
కార్తీక శుద్ధ ఏకాదశి నాటితో చాతుర్మ్యాస వ్రతం పూర్తవుతుంది.
ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి జారుకున్న శ్రీమహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు.
కార్తీక పున్నమి నాటి దేవ దీపావళి వేడుకలకు ఈ ఏకాదశి నుంచే సన్నాహాలు మొదలవుతాయి.
రాజస్తాన్‍లోని బ్రహ్మదేవుడి ఆలయం ఉన్న పుష్కర క్షేత్రంలో బ్రహ్మదేవుడి ప్రీత్యర్థం జరిగే పుష్కర మేళా ఏటా కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక పూర్ణిమ వరకు అంగరంగ వైభవంగా జరుగుతుంది.
ఈ ఐదురోజులూ భక్తులు పుష్కర తీర్థంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తారు.
పుష్కర మేళాలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే సాధువులు ఇక్కడికి సమీపంలోని గుహలలో తలదాచుకుంటారు.
దాదాపు రెండు లక్షలకు పైగా భక్త జనవాహినితో పాటు పాతిక వేలకు పగా ఒంటెలతో పుష్కర మేళాలో జరిగే ఊరేగింపు చూసి తీరాల్సిందే కానీ చెప్పనలవి కాదు.
ఇది ఆసియాలోనే అతిపెద్ద ఒంటెల ఊరేగింపుగా గుర్తింపు పొందింది.
ఇదిలా ఉంటే, శైవ క్షేత్రాలలో తలమానికమైన వారణాసిలో దేవ దీపావళి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు.
గంగానది ఒడ్డున అన్ని ఘాట్లూ లెక్కలేనన్ని దీపాలతో మిరుమిట్లుగొలుపుతూ కనువిందు చేస్తాయి.
కాశీ క్షేత్రంలో గంగా మహోత్సవం కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక పూర్ణిమ వరకు వైభవోపేతంగా జరుగుతుంది.
కార్తీక స్నానం ఆచరించే వీలు లేని వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు కనీసం కార్తీక శుద్ధ పాడ్యమి, పౌర్ణమి, అమావాస్య తిథుల్లో స్నానం ఆచరిస్తే కార్తీక మాసంలోని 30 రోజులు స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. ఈ అవకాశం కూడా లేని వారు కార్తీక మాసంలో వచ్చే నాలుగు ఆదివారాల్లో స్నానం ఆచరించి, దేవాలయ సందర్శన చేస్తే 30 రోజులు స్నానం చేసిన ఫలితం లభిస్తుంది.
పరమశివుడు కార్తీక పున్నమి రోజున త్రిపురాసురుడిని సంహరించాడు.
ముల్లోకాలనూ ముప్పుతిప్పలు పెడుతూ పీడించిన త్రిపురాసురుని పీడ విరగడ కావడంతో దేవతలు ఆ రోజున దీపావళి పండుగ చేసుకున్నారని ప్రతీతి.
అందుకే ఈ పున్నమిని త్రిపురారి పున్నమి అని కూడా అంటారు.
కార్తీక పూర్ణిమ నాడు చిన్నా పెద్దా దేవాలయాలన్నీ అసంఖ్యాకమైన దీపాల వెలుగులతో ధగధగలాడుతూ నేత్రపర్వం చేస్తాయి.
నిత్య దీపారాధన చేయని వారు, చేయలేని వారు ఈ కార్తీక పున్నమి నాడు 365 ఒత్తులను ఒక్కటిగా చేసి, ఆవునేతితో తడిపి మట్టి ప్రమిద లేదా కొబ్బరిచిప్పలో దీపం వెలిగిస్తే ఏడాది పొడవునా దీపారాధన చేసిన ఫలం దక్కుతుందని ప్రతీతి.
కార్తీక పున్నమి నాడు ఉదయం విష్ణుపూజకు, రాత్రి శివపూజకు అనుకూలమైనవి.
శివకేశవుల అనుగ్రహం కోరేవారు ఆ రోజు ఉదయం వైష్ణవాలయాల్లో అర్చనలు జరిపిస్తారు.
రాత్రి వేళ శివాలయాల్లో వైభవంగా అభిషేకాలు నిర్వహిస్తారు.

కొన్ని ప్రాంతాల్లో అరటిదొప్పల్లో దీపాలు వెలిగించి వాటిని నీళ్లలో వదులుతారు. దీపదానాలు కూడా చేసే ఆచారం ఉంది.

కార్తీక విశేషాలు
న కార్తీక సమో మాస:
మాసాలలో కార్తీకాన్ని మించినది లేదని అర్థం. ఇది స్కాంద పురాణోక్తి.
ఈ మాసంలో మహా విష్ణువుకు కార్తీక దామోదరుడని పేరు.
ఇక, పరమశివుడు కార్తీక మహాదేవుడిగా ఈ మాసంలో పూజలందుకుంటాడు.

‘విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచమ్‍’

అనే విష్ణత్వ వైభవం, ‘శివతరాయచ’ అనే పరమశివ వైభవం అంటూ అంతర్యామికి చెందిన రెండు వైభవాలను మాత్రం వేదం వర్ణించింది.
హరిహర తత్వాల మధ్య ఉండే అన్యోన్యతను, ఏకత్వ భావనను అవగతం చేసుకోవడానికి, వారిద్దరూ ఒకటేనని సత్యాన్ని తెలుసుకోవడానికి జ్ఞానదీపం వెలిగించే మాసం కార్తీకం.

కార్తీక స్నాన మంత్రం

వేకువజామునే చల్లని నీటితో స్నానం చేయడం కార్తీక స్నానాల్లోని ముఖ్యమైన అంశం. ఇలా చేయడం వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.
కార్తీకం తరువాత ప్రవేశించే శీతాకాలానికి అనుగుణంగా శరీరాన్ని మలచడం కోసమే ఈ చన్నీటి స్నానాలను మన పెద్దలు ఆచారంగా నిర్దేశించారు. కార్తీక మాసంలో స్నానం చేసేటపుడు కింది శ్లోకాన్ని పఠించాలి.

తులారాశి గతే సూర్యే గంగా త్రైలోక్యపావని
సర్వత్రా ద్రవరూపేణ సాసంసారే భవేత్‍ తథా

కార్తీక సోమవారం వ్రత మహిమ

కార్తీక సోమవార వ్రత ప్రభావాన్ని గురించి వశిష్ట మహర్షి నిస్టురి అనే ఒక స్త్రీ కథతో ముడిపెడ్డి కార్తీక పురాణంలో చెప్పడం కనిపిస్తుంది.
నిస్టురి గారాబంగా పెరిగి తప్పుదోవ పట్టి, వివాహమయ్యాక భర్తను కూడా మోసగించి, చివరకు కాలక్రమంలో మరణిస్తుంది.
మరుసటి జన్మలో శునకంగా జన్మించిన ఆమె ఒక వేద పండితుడు కార్తీకమాసంలో తన ఇంటి బయట ఉంచిన బలి అన్నాన్ని భుజించి పూర్వజన్మ స్మ•తి పొందుతుంది.
ఆ వెంటనే తనను రక్షించమంటూ మానవ భాషలో మాట్లాడటంతో ఆ వేద పండితుడు ఇంటి బయటకు వచ్చి శునకం పూర్వ జన్మ వృత్తాంతాన్ని తన దివ్య దృష్టి ద్వారా గ్రహించి తెలుసుకుంటాడు.
తాను కార్తీక సోమవార వ్రతాన్ని అవలంభించి బయట విడిచిపెట్టిన బలి అన్నాన్ని తిన్నందువల్లనే కుక్కకు పూర్వజన్మ స్మ•తి కలిగిందని గ్రహిస్తాడు.
వెంటనే స్పందించి తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రత ఫలితాన్ని ఆ కుక్కకు ధారపోస్తాడు. క్షణాలలో ఒక దివ్యస్త్రీగా కుక్క దేహాన్ని విడిచిపెట్టి కైలాసానికి చేరుతుంది.
వశిష్టుడు ఇలా కార్తీక సోమవార వ్రత మహాత్మ్యాన్ని గురించి జనకుడికి వివరిస్తాడు.ఉసిరికాయల మీద దీపాలు వెలిగించే ఆచారాలు కూడా కొన్ని ప్రాంతాలలో పాటిస్తారు.
చాలామంది కార్తీక పున్నమి రోజున క్షేత్ర దర్శనం చేసుకునేందుకు ఆసక్తి చూపుతారు.
క్షేత్ర దర్శనానికి వీలు లేకున్నా, మంత్రోపదేశం పొందిన వారు కార్తీక పున్నమి వేళ నిష్టగా మంత్ర జపం సాగించినట్టయితే, విశేష ఫలం దక్కుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
ఏకకాలంలో శివకేశవుల అనుగ్రహాన్ని పొందడానికి కార్తీక పున్నమిని మించిన విశిష్టమైన రోజు మరేదీ లేదు.
చాలా ప్రాంతాల్లో కార్తీక పున్నమి రోజున తులసి చెట్టును శ్రీమహాలక్ష్మిగా, ఉసిరి కొమ్మను శ్రీమహావిష్ణువుగా భావించి, భక్తిశ్రద్ధలతో వాటికి కల్యాణం జరిపించే సంప్రదాయం కూడా ఉంది.
కార్తీక పున్నమి నాడు కొన్నిచోట్ల శివాలయాల్లో జ్వాలాతోరణ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
దీపకాంతులతో ధగధగలాడే జ్వాలాతోరణం కింద నుంచి భక్తులు ఉత్సాహంగా పరుగులు తీస్తారు.
ఇలా చేయడం వల్ల సకల పాపాలు నశిస్తాయని విశ్వసిస్తారు.
శివాలయాల్లో జ్వాలాతోరణం నిర్వహించడం వెనుక ఒక పౌరాణిక నేపథ్యం కూడా ఉంది.
క్షీరసాగర మథనం సమయంలో మొదటగా హాలాహలం వెలువడుతుంది.
లోకాలన్నిటినీ కబళించేలా హాలాహాలం వ్యాపించడంతో పరమశివుడు దానిని ఉండగా చేసుకుని మింగబోతాడు.
పూర్తిగా మింగేస్తే తన ఉదరంలో పదిలంగా ఉన్న లోకాలన్నీ నశించే ప్రమాదం ఉన్నందున, శివుడు దానిని తన కంఠంలోనే బంధించి ఉంచుతాడు.
పరమశివుడు హాలాహలాన్ని మింగడంతో పార్వతిదేవి ఆందోళన చెందుతుంది.
హాలాహల జ్వాలలు తన భర్తకు హాని కలిగించరాదంటూ అగ్నిదేవుడిని ఆమె ప్రార్థిస్తుంది.
ఆమె ప్రార్థనతో అగ్నిదేవుడు చల్లబడతాడు.
అందుకు ప్రతీకగా పార్వతీదేవి
అగ్ని స్వభావం కలిగిన కృత్తికా
నక్షత్రానికి సంకేతమైన కార్తీక
పూర్ణిమ నాడు జ్వాలా తోరణం
ఏర్పాటు చేసి తన భర్తతో కలిసి
దాటుతుంది.
ఆ మంటల వేడి నుంచి ఉపశమనం కలిగించడానికే శివుడికి నీటితోనూ, పంచామృతాలతోనూ ఆనాడు
అభిషేకాలు చేస్తారు.
జ్వాలాతోరణానికి సంబంధించి మరో
ఇతిహాసం కూడా ఉంది.
శివుడి రేతస్సును అగ్నిదేవుడు భరించలేక గంగా నదిలో పడవేస్తాడు.
గంగాదేవి కూడా దానిని భరించలేక ఒడ్డునే ఉన్న రెల్లుగడ్డిలో వదిలేస్తుంది.
ఆ తేజస్సు నుంచే ఉద్భవించిన కుమారస్వామి శరవణభవుడిగా పేరొందాడు.
శివుడి కుమారుడి చేతిలో తప్ప ఇతరుల చేతిలో మరణం సంభవించకుండా వరం పొందిన తారకాసురుడు రెల్లుగడ్డిని తగలబెట్టిస్తాడు.
కారణజన్ముడైన కుమారస్వామికి అగ్నిదేవుడు ఎలాంటి హాని కలిగించకుండా ఆ మంటల నుంచి సురక్షితంగా కాపాడతాడు.
దానికి గుర్తుగా కుమారస్వామి జన్మ నక్షత్రమైన కృత్తికా నక్షత్రం రోజు వచ్చే కార్తీక పున్నమి నాడు జ్వాలా తోరణం నిర్వహిస్తారు.
జ్వాలా తోరణం కింద నుంచి మూడుసార్లు వెళ్తే సమస్త పాపాలు, అపమృత్యు గంగాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.
గౌరీశంకరుల పల్లకిని జ్వాలా తోరణం కింద నుంచి మూడుసార్లు తీసుకువెళ్తారు.
ఆ తరువాత తోరణానికి మిగిలిన ఎండుగడ్డిని, సగం కాలిన గడ్డిని రైతులు తమ గడ్డివాములో కలుపుతారు.
ఆ వాములోని గడ్డిని మేస్తే పశు సంతతి అభివృద్ధి చెందుతుందని, రైతుల ధాన్యానికి లోటు ఉండదని నమ్ముతారు. పవిత్ర కార్తీక మాసంలో చాలామంది భక్తులు ఉపవాస దీక్షలను ఆచరిస్తారు.
ఈ మాసంలో వచ్చే సోమవారాల్లోనూ, ఏకాదశి, పున్నమి రోజుల్లో ఉపవాసాలు ఉండి, దేవాలయాల సందర్శనాలు, అర్చనలు, అభిషేకాలతో శివకేశవులను ఆరాధిస్తారు.
ముఖ్యంగా చంద్రుడికి చెందిన సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైన వారం.
కొందరు పూర్తిగా ఆ రోజున నిరాహారంగా ఉపవాసం ఉంటారు.
ఇంకొందరు రోజులో ఒక్కసారే ఫలహారం స్వీకరించి ఏకభుక్తం చేస్తారు.
మరికొందరు వండని పదార్థాలు, అంటే పండ్లు, కాయలు తింటూ నక్తం చేసుకుంటారు.
కొందరు కార్తీక మాసంలో నెల పొడవునా నక్త వ్రతాన్ని ఆచరిస్తారు.
మిగిలిన రోజుల్లో చేసే ఉపవాసం ఒక ఎత్తయితే, కార్తీక పున్నమి రోజున చేసే ఉపవాసం మరొక ఎత్తు.
కార్తీక పున్నమి నాడు ఉపవాసం చేయడం విశిష్ట ఫలదాయకమని పురాణాలు చెబుతున్నాయి.
దారిద్య్ర బాధల విముక్తి కోసం కార్తీక మాసంలో శివకేశవులను పూజించడం వల్ల సత్పలితాలు సిద్ధిస్తాయని అంటారు.
కార్తీక సోమవారం నాడు పగలంతా భోజనం చేయకుండా ఉపవాసంతో గడిపి సాయంత్రం వేళ శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అయ్యాక తులసి తీర్థాన్ని మాత్రమే సేవించడం ఈ ఉపవాస విధం. ఇలా చేయడం సాధ్యం కాని వాళ్లు ఉదయం పూట యథా ప్రకారం స్నాన, దాన, జపాలను చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి మాత్రమే శివతీర్థాన్నో, తులసి తీర్థాన్నో ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలి. ఇలా చేయడాన్ని ఏకభుక్తం అంటారు.
లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన శ్రావణ మాసం అంటే శివుడికి ఎంత ఇష్టమో.. శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం అంటే లక్ష్మీదేవికీ అంతే ఇష్టం.
అందుకే శ్రావణ మాసంలో శివుడికి, కార్తీక మాసంలో లక్ష్మీదేవికి విశేష పూజలు నిర్వహిస్తారు.
కార్తీక పున్నమి రోజున ఆవుపాలతో వండిన పాయసాన్ని శివకేశవులకు, లక్ష్మీదేవికి నివేదించిన అనంతరం ఆ ప్రసాదాన్ని స్వీకరించే వారికి, మరియు ఫలాన్ని సేవించే వారికి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్‍ జన్మించినది కూడా కార్తీక పున్నమి నాడే కావడంతో ఈరోజును సిక్కులు అత్యంత పవిత్ర దినంగా భావిస్తారు.
నానక్‍ మార్గాన్ని అనుసరించే ‘నానక్‍పంథీ’ హిందువులు కూడా నానక్‍ జయంతి రోజున గురుద్వారాలను దర్శించుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
నానక్‍ జయంతిని సిక్కులు గురుపరబ్‍నీ, ప్రకాశ్‍ పర్వ అని కూడా అంటారు.
కార్తీక పున్నమి జైనులకు కూడా అత్యంత పవిత్రమైన రోజు.
హిందువుల మాదిరిగానే జైనులు కూడా వర్ష రుతువులో చాతుర్మ్యాసం పాటిస్తారు.
చాతుర్మ్యాసం ముగిసిన తరువాత కార్తీక పున్నమి రోజున గుజరాత్‍లోని శత్రుంజయ పర్వతంపై వెలిసిన జైన క్షేత్రం ఆదినాథ్‍ ఆలయంలో ప్రార్థనలు జరుపుతారు.
ఇక్కడకు చేరుకోవడానికి దుర్గమమైన పర్వత మార్గంలో సుమారు రెండు వందల కిలోమీటర్ల మేర యాత్ర చేస్తారు.
ఈ యాత్రనే శత్రుంజయ తీర్థయాత్ర అంటారు.
జైనుల తొలి తీర్థంకరుడైన ఆదినాథుడు ఇక్కడి నుంచే తొలి ప్రబోధం చేసినందున లక్షలాది మంది జైన సన్యాసులు కార్తీక పున్నమి రోజున ఇక్కడకు చేరుకుని ప్రార్థనలు చేస్తారు.
కార్తీక మాసంలో నెల పొడవునా దీపారాధన చేయడం మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.
నెల పొడవునా కుదరకుంటే, కనీసం శుక్లపక్షంలోని తొలి ఐదు రోజులూ, కృష్ణ పక్షంలోని తొలి ఐదు రోజులూ మొత్తం పదిరోజులైనా ఈ నెలలో దీపారాధన చేయాలని, దీనివలన ఆయురారోగ్య, ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని శాస్త్ర వచనం.కార్తీక మాసంలో నదీస్నానం,
దీపదానం కూడా విశేష ఫలాన్ని ఇస్తాయి.
కార్తీక సోమవారాలలో ఉపవాసం వ్రతం ఆచరించే వారు ఈ నెల పొడవునా శుద్ధ
సాత్విక ఆహారం మాత్రమే స్వీకరిస్తారు.
ఉపవాస వ్రతం పాటించే వారికి ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి తామసిక పదార్థాలు పూర్తిగా నిషిద్ధమని పెద్దలు చెబుతున్నారు.
ఉపవాస వ్రతం ఆచరించే వారు కార్తీక మాసంలో నెల పొడవునా నిత్య పూజలతో పాటు, శివ పురాణం, కార్తీక పురాణాల పారాయణం చేయడం వల్ల విశేష ఫలితం కలుగుతుందని అంటారు.
ఒకసారి వశిష్టుడు సిద్ధాశ్రమానికి వెళ్తూ దారిలో జనక మహారాజును కలిశాడు. జనకుడు ఆయనను ఆదరించి, ప్రజలందరికీ సులభంగా పుణ్యం వచ్చే మార్గాన్ని, అందులోనూ వినగానే పుణ్యం వచ్చే మార్గం ఏదైనా ఉంటే చెప్పాలని వశిష్టుడిని అడిగాడు. అప్పుడు వశిష్టుడు జనకుడికి కార్తీక మహాత్మ్యం గురించి వివరించాడు. కార్తీక పురాణాన్ని ఎవరైనా వింటే చాలు అది చెప్పిన వారికి, విన్న వారికి పుణ్యం కలుగుతుందన్నాడు.
దానధర్మాలు చేయడానికి, వ్రతాలు, హోమాలు ఆచరించడానికి కూడా కార్తీక మాసం చాలా అనుకూలమైన మాసం.
కార్తీక సోమవారాల్లో కానీ, ఏకాదశి, పున్నమి రోజుల్లో కానీ రుద్రాభిషేకం, మహా మృత్యుంజయ హోమం చేయడం వల్ల అపమృత్యు భయం, వ్యాధిపీడ తొలగి మనోస్థైర్యం చేకూరుతుంది.

కార్తీక ఏకాదశి శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడానికి అద్భుతమైన రోజు.
కార్తీక మాసంలో పురోహితులకు దీపదానం చేయడంతో పాటు, యథాశక్తి గోదానం, భూదానం, హిరణ్య దానం వంటివి కూడా చేయవచ్చు.

అలాగే. ఈ నెలలో గోసేవ, అనాథ సేవ వంటి కార్యక్రమాలు చేపట్టడం, అన్న సమారాధన చేయడం వంటి విశేష ఫలాన్నిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
కార్తీక మాసంలో వన భోజనాలు చేయడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం.
ఎందరో దేవతలు వనాలలో, కొండకోనల్లో వెలుస్తారు.
సుప్రసిద్ధ శైవ, వైష్ణవ క్షేత్రాలు కూడా చాలా వరకు ఇలా కొండకోనల్లో, దుర్గమారణ్యాలలో వెలసినవే.
అందువలన వనభోజనాలు చేయడం దేవతా ప్రీతికరమని ప్రతీతి.
మానవాళి మనుగడకు పత్రహరితమే కీలకమని చెప్పడంతో పాటు, వృక్షోరక్షిత రక్షిత అని పిలుపునివ్వడం కార్తీక వన భోజనాల వెనుక ఉన్న ఆంతర్యం.
విష్ణువుకు ప్రీతికరమైన ఉసిరిచెట్టు కింద పనస ఆకుల విస్తరిలో భోజనాలు చేయడం కార్తీక వన భోజనాలు సంప్రదాయం.
ఏడాదిలో మరే నెలలోనూ లేనట్టుగా కార్తీక మాసంలోనే ఎందుకు వన భోజనాలు చేస్తారనేది పెద్దలు చెప్పే విశేషం ఏమిటంటే.. శ్రావణ, భాద్రపదాల్లో విశేషంగా వర్షాలు కురుస్తాయి.
శరదృతువులో వచ్చే ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో భూమి నుంచి కొత్త మొలకలు మొలకెత్తుతాయి.

వన భోజనాల సమయంలో ఆయుర్వేద

మూలికా వైద్యం తెలిసిన అనుభవజ్ఞులు ఈ మొక్కల ఉపయోగాన్ని, వాటి వల్ల కలిగే ఫలితాలను విశదీకరించేవారు.
ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవడం వల్ల చదువు సంధ్యలు లేని పామరులు సైతం వైద్య మర్మాలను వన భోజనాల సమయంలో గ్రహించగలిగే వారు.
మొక్కల వల్ల ఒనగూడే ప్రయోజనాన్ని తెలుసుకోవడం వల్ల, వాటి పట్ల గౌరవంగా మసులుకునే వారు.
ప్రకృతిని, వృక్షాలను ప్రేమించే లక్షణాన్ని పెంపొందించే ఉద్దేశంతో చేపట్టే కార్తీక వన భోజనాలు మనుషుల మధ్య సామరస్యానికి కూడా దోహదపడతాయి.

Review విష్ణు-శివాత్మకం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top