‘‘కులం, మంతం మనిషిని గొప్పవారిని చేయబోవు. ఆధ్యాత్మికత, అంకితభావం, కట్టుబాట్ల వల్ల మనిషి గొప్పవాడు అవుతాడు’’
– శ్రీ రామానుజాచార్య
ఎప్పుడో వెయ్యేళ్ల క్రితమే ఆధునిక కాలానికీ అన్వయించే విశ్వ సందేశాన్ని అందించిన ఆధ్యాత్మిక గురువు ఆయన..
కులల వివక్ష, పేద – ధనిక తారతమ్యాలు, అసమానతలపై పోరాడి ఆధ్యాత్మిక ఉద్యమం నడిపిన వైష్ణవ యోగి ఆయన..
వెయ్యేళ్ల క్రితమే జ్ఞాన యజ్ఞం సాగించి, మన సమాజానికి సమతాభావం బోధించిన విశిష్టావ్వైత సిద్ధాంతకర్త ఆయన..
ఆధ్యాత్మిక ఆకాశాన, హైందవ సంస్క•తీ కాంతితో, శ్రీవైష్ణవ సంప్రదాయంలో, విశిష్టాద్వైత సిద్ధాంతంలో అత్యున్నత శిఖరం ఆయన.. పదకొండో శతాబ్ది నాటి శ్రీవైష్ణవాచార్యుడు, విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకుడు, దేశమంతా పర్యటించి పరమత వాదాలను ప్రత్యక్ష సభా సమావేశాలతో,
ప్రమాణాలతో వాదించి, గెలిచిన మహానుభావుడు..
భగవాన్ శ్రీ రామానుజాచార్యుడు.
శ్రీ రామానుజుల వారి సమతాస్ఫూర్తి మంత్రం..
మన భారత రాజ్యాంగం ప్రవచించిన సమానతా హక్కు.. రెండూ ఒక్కటే.
వెయ్యేళ్ల క్రితం.. వివక్షకు, అసమానతలకు తావులేని సమాజం గురించి
కలలు కనడమే కాకుండా, సమతను ఎలా సాధించాలో రామానుజులు ఆచరించి చూపించారు. ఆ విధానాలు నేటికీ అనుసరణీయం. ఈ విషయాన్ని నేటి ప్రపంచానికి చాటి చెప్పడానికే ‘సమతామూర్తి’
(స్టాట్యూ ఆఫ్ ఈక్విటీ) ఆలయం వెలసింది.
భాగ్యనగరం శివారులోని శంషాబాద్ సమీపంలో గల ముచ్చింతల్ గ్రామంలోని శ్రీరామనగరం ‘జీవా’ ప్రాంగణంలో 216 అడుగుల ఎత్తయిన రామానుజుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహాలలో రెండవది. 2022, ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామానుజుల సమతా స్ఫూర్తి, భాస్కరుడై ఆయన విరజిమ్మిన జ్ఞానకాంతుల గురించి తెలుసుకుందాం.
ఈ భూమిపై వెయ్యేళ్ల క్రితమే నడయాడి విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించిన తత్త్వవేత్త, ఆస్తిక హేతువాది, సంఘ సంస్కర్త, యతి.. శ్రీ రామానుజాచార్యులు. వెయ్యేళ్ల క్రితమే సమానత్వం గురించి ఆలోచించి, ప్రవచించిన ఆయన గురించి తెలిసింది చాలా తక్కువ. నాటి ఆయన సమతాస్ఫూర్తిని నేటి తరానికి చాటేందుకే ఆయన భారీ విగ్రహాన్ని ముచ్చింతల్‍లోని శ్రీరామనగరంలో ప్రతిష్ఠించారు.
మహనీయుడు లభించాడు..
ప్రస్తుత చెన్నై నగరానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోని శ్రీపెరంబదూరులో క్రీస్తు శకం 1017 (కలియుగ సంవత్సరం 4118)లో జన్మించారు రామానుజులు. కాంతిమతీ దేవి, కేశవ సోమయాజులు తల్లిదండ్రులు. ఈ దంపతులకు మొదట ఇద్దరూ ఆడపిల్లలే జన్మించారు. మూడో సంతానం మగ పిల్లవాడు కావాలని తలచిన కేశవ సోమయాజులు దంపతులు పెరంబదూరుకు సమీపంలోని పార్థసారథి ఆలయం (ఈ ఆలయం ప్రస్తుతం చెన్నైలోని ట్రిపుల్‍కేన్ ప్రాంతంలో ఉంది. ఇది చాలా శక్తివంతమైన క్షేత్రమని పేరు. ఇది దేశంలోని 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి)లో నలభై రోజుల పాటు పుత్ర కామేష్ఠి యాగం చేశారు. యాగం పూర్తయ్యాక, కాంతిమతీదేవికి ఒకరోజు కలలో నారాయణుడు కనిపించి ‘యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. నీ కోరిక ఏమిటో చెప్పు?’ అని అడిగాడట.
‘నాకు నీ అంతటి గొప్ప కుమారుడు కావాలి’ అని ఆమె కోరుకుందట.
నారాయణుడు నవ్వి- ‘నా అంతటి వాడు పుట్టాలంటే నేనే పుట్టాలి. సరే! ధర్మ సంస్థాపన చేయడానికి నీ కడుపులో నా యంతటి వాడు తప్పక పుడతాడు’ అని ఆశీర్వదించాడు.
కాంతిమతీదేవి ఒక వైశాఖ పంచమి నాడు రామానుజాచార్యులకు జన్మనిచ్చింది. ఆయన మొత్తం ఏడు అంశలతో జన్మించారని అంటారు. ఆయన పుట్టగానే ఆకాశవాణి ‘ధీలబ్ధ:’ అని గట్టిగా మూడుమార్లు పలికిందట. అంటే- ‘మహనీయుడు లభించాడు’ అని అర్థం.
Review సమతామూర్తి ఆధ్యాత్మిక ఖ్యాతి.