సిరిమల్లి పువ్వల్లే నవ్వు.. చిన్నారి పాపల్లే నవ్వు!

నవ్వడం ఓ భోగం.. నవ్వించడం ఓ యోగం.. నవ్వలేకపోవడం ఓ రోగం
నవ్వులాగానే ఈ తెలుగు సినిమాల దర్శకుడు, హాస్యబ్రహ్మ జంధ్యాల గారి ఈ కొటేషన్‍ ఎప్పటికీ పాతబడదు.
నవ్వితే హాపీ.. నవ్వకపోతే బీపీ.. నవ్వనివాడు పాపి
నిజమే. నవ్వడం లేదంటే, నవ్వు రావడం లేదంటే లోపమున్నట్టే.
నవ్వు చాలా ప్రాచీనమైనది.
కృతయుగంలో క్షీరసాగర మథనం వేళ చంద్రవంక పుట్టి, శివుని జటలో అమరినపుడు లోకాలన్నీ నవ్వాయి.
త్రేతాయుగంలో శివ ధనుర్భంగానికి గంగ ఫెళ్లున నవ్వింది. ఆ నవ్వుకి తొణికిన గంగ శివుడి మూడోకంటికి చల్లటి నీటి తెర అడ్డువేసింది. కల్యాణరాముడికి స్వచ్ఛమైన దీవెనలు అందాయి.
ద్వాపరంలో ఒక పురిటికందు అష్టమి నాటి రాత్రి పడగ నీడన తనని స్ప•శిస్తూ సాగుతున్న వేళ యమునా నది నిలువెల్లా నవ్వింది.
కలియుగంలో సత్యం అహింసలే ఆయుధాలుగా విశాల భారతి శృంఖలాలను తెంచినపుడు ఒక బోసినవ్వు అంతరిక్షం దాకా ఆవరించింది.
‘నవ్వులో శివుడున్నాడు’ అన్నాడొక మహానుభావుడు. నిజమే. నిరంతరం నవ్వే ముఖంలో దైవత్వం ఉంటుంది.
కొన్ని నవ్వులు ఉదయకిరణాల్లా హాయిహాయిగా ఉంటాయి.
కొన్ని పొద్దెక్కిన సూర్యకిరణాల్లా చురుక్కుమనిపిస్తాయి.
కొన్ని నవ్వులు వెన్నెల మడుగుల్లా చల్లదనం పంచుతాయి.
‘ఒక్క నవ్వే చాలు వజ్జిర వయిడూర్యాలు’ అంటాడు ఎంకి పాటలో నాయుడు బావ.
పసిపిల్లలు నిద్రలో తెగ నవ్వుతుంటారు. వాళ్లకి గత జన్మలోని హాస్య సంఘటనలు జ్ఞప్తికి వస్తాయి కాబోలు..
ఆనందానికి లిపి నవ్వు. అది పెదాల మీద సందర్భానికి తగినట్టు రూపుదిద్దుకుని ముఖమంతా కమ్ముకుంటుంది.
దస్తూరిలాగే కొందరి నవ్వులు ముత్యాలకోవలా ఉంటాయి.
మరికొన్ని నవ్వులు ముద్దు ముచ్చటగా ఉంటాయి. కొందరి నవ్వులు బుగ్గన దిష్టి చుక్కలవుతాయి.
ప్రతి నవ్వుకీ ఒక భాష.. దానికో భాష్యం ఉంటాయి.
నవ్వు ఒక జీవనది అయితే బతుకు సార్థకం అవుతుంది. సమస్యలను ఎదుర్కొనేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి రోజూ హాయిగా నవ్వాల్సిందే.

మే 5, ఆదివారం, 2024
ప్రపంచ నవ్వుల దినోత్సవం
సందర్భంగా కొన్ని నవ్వు ముచ్చట్లు..

జెన్‍ బౌద్ధంలో నవ్వుకి మంచి స్థానం ఉంది. ముగ్గురు బౌద్ధ సన్యాసులు నవ్వుతున్నట్టుగా జెన్‍తత్త్వ చిహ్నం ఉంటుంది. దీని వెనుకో కథ ఉంది.
బౌద్ధారామానికి, దాని పక్కనే ఉన్న పట్టణానికి మధ్య ఒక కాలువ ఉంది. దానిపై ఓ కొయ్య వంతెన ఉంది. బౌద్ధ సన్యాసులెవరూ ఆ వంతెన మీదకు కానీ, అది దాటి పట్టణానికి వెళ్లడం కానీ నిషేధం. అయితే, ఒకరోజు ముగ్గురు లేత సన్యాసులు లోకాభిరామాయణం చెప్పుకుంటూ, మధ్యలో మాటల్లో పడి అలా వంతెన దాటి అవతలకు వెళ్లారు. తీరా అవతల అడుగుపెట్టాక జరిగిన అపచారం గురించి తలంపు వచ్చింది. నాలికలు కరుచుకుని ముగ్గురూ ఒక్కసారిగా హాయిగా నవ్వుకున్నారు. ఈ సందర్భాన్నే జెన్‍ బౌద్ధానికి చిహ్నంగా మార్చేశారు.
మన పురాణాల్లో బొత్తిగా హాస్యం లేదని కొందరంటారు. కానీ, అది నిజం కాదు బుల్లి కృష్ణుని బాల్యచేష్టలకు నవ్వని వారెవరు?
వినాయక విజయం యావత్తూ నవ్వు మీదనే కదా ఆధారపడి ఉంది. అసందర్భంగా నవ్వితే ఏమవుతుందో కూడా చంద్రుడి ఉదంతం మనకు తెలియచెబుతుంది. చిన్న చిరునవ్వు గుండె గాయాలన్నింటినీ మాన్పించేస్తుంది. నవ్వొక ఔషధం
పెదాల అంచున మొదలై గొంతును మీటుతూ హృదయ కవాటాల్ని సరిచేయగలిగిన మహత్తరమైన మందు నవ్వే. అది డబ్బులతో పనిలేని ఔషధం. అందుకే చెరగని చిరునవ్వుతో ఉండే డాక్టర్లనూ, నర్సులనూ చూస్తే చాలు సగం జబ్బులు నయమైపోతాయి. ఈ విషయాన్ని గుర్తించే ముంబైకి చెందిన డాక్టర్‍ మదన్‍ కటారియా 1998లో నవ్వుల దినోత్సవానికి శ్రీకారం చుట్టారు. అంటే, ప్రపంచానికి నవ్వులను, నవ్వుల దినోత్సవాన్ని పంచిన ఘనత మన భారతదేశానిదేనన్న మాట.

బంధాల మధ్య ‘అంటు’కట్టే నవ్వు
ఆవలింతలాగానే నవ్వు కూడా అంటువ్యాధిలాంటిది. ఎవరికైనా ఆవులింత రాగానే ఆటోమేటిగ్గా పక్కనున్న వారికీ వచ్చేస్తుంది. నవ్వు కూడా అలాంటిదే. మనం నవ్వగానే ఎదుటి వారు తమకు తెలియకుండానే నవ్వేస్తారు. కానీ, అంటువ్యాధి చెరుపు చేస్తుంది. నవ్వు అనే అంటువ్యాధి మాత్రం బంధాల మధ్య అందమైన ‘అంటు’ కడుతుంది. నవ్వు అనే అసంకల్పిత ప్రతీకార చర్య వల్ల శ్వాస వేగం పెరిగి, ఆరోగ్యంగా ఉంటారట మనుషులు. నిజానికి మనుషులు ఒంటరిగా ఓ హాస్య చిత్రాన్ని చూసినపుడో లేదా జోక్‍ చదివినపుడో కన్నా చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడుతున్నప్పుడో వాళ్లు నవ్వడం వల్లనో 30 శాతం ఎక్కువగా నవ్వుతారని అధ్యయనాల్లో తేలింది.

నవ్వుకి భాష లేదు.. కానీ శాస్త్రం ఉంది..
నవ్వు లిపి లేని భాష. ప్రపంచంలో ఏ మూలకి వెళ్లినా ఎవరితోనైనా మాట్లాడగలిగే భాష కానీ భాష నవ్వు ఒక్కటే. అది నిశ్శబ్దాన్ని ఛేదించే శబ్దం. దానికి ప్రాంతీయ భాషా భేదాలు, జాతిమత విభేదాలు ఏమీ లేవు.. తెలియవు. పైగా నవ్వడం ఎవరి దగ్గరా నేర్చుకోనక్కర్లేదు. దాని కోసం పుస్తకాలు అసలే చదవనవసరం లేదు. జోకులు పేల్చనూ అక్కర్లేదు. నిజమే. అప్పుడే పుట్టిన పసివాళ్లకు ఎవరు నేర్పారు బోసినవ్వులు నవ్వమని?!. అందుకే చిరునవ్వుల పలకరింపు చాలు ఎదుటి వారిని కట్టిపడేయడానికి.
‘అసలెందుకు నవ్వాలి? అది నా స్వభావానికి విరుద్ధం. నేను చాలా సీరియస్సు..’ అనే టైపు మనుషులూ ఉంటారు. అందుకో నవ్వు కూడా ఒక శాస్త్రమే అంటూ కొందరు పరిశోధనలు, అధ్యయనాలు చేస్తూ నవ్వుల మీద బోలెడు పాఠాలు చెబుతున్నారు. అన్నిటికీ ఉన్నట్టే నవ్వులకీ ఒక శాస్త్రం ఉంది. దాని పేరు- గెలంటాలజీ.

ఎలాగైనా.. ఏదోలా నవ్వాలి
మనసులోని ఆనందాన్ని వ్యక్తం చేసే భావనే నవ్వు. ఆనందంతో పాటు ఆశ్చర్యం కలిగించే కొన్ని విషయాలకే నవ్వుతాం. ఎలా నవ్వినా నవ్వు నవ్వే కాబట్టి వింతగా అనిపించే విషయాలు విన్నా,
హాస్యభరిత సినిమాలు, కామిక్‍ స్క్రిప్టులు చూసినా, పుస్తకాలు చదివినా కూడా మంచిదే. వాటిని పదిమందికీ చెప్పి నవ్వడం, పిల్లలతో సరదాగా గడపడం.. ఇవన్నీ కుదరకపోతే లాఫింగ్‍ క్లబ్‍లకు వెళ్లడం, నవ్వుల యోగాలను అభ్యసించడం చేయాలి. ఏదైనా గానీ, ఎలాగైనా గానీ రోజూ కాసేపు నవ్వుకు కేటాయించాలి. ఆనందంగా, ఆరోగ్యంగా జీవించడానికి నవ్వు బాటలు వేస్తుంది.
నవ్వుకు చోటులేని చోటకు వెళ్లకూడదు..

నవ్వడం వల్ల ఆనందంగా ఉంటామో, ఆనందంగా ఉండటం వల్ల నవ్వుతూ ఉంటామో తెలియదు కానీ, ఆనందానికో అందమైన ఆనవాలు- నవ్వు. మనిషికి అత్యంత ఆనందాన్ని కలిగించే ధ్వని- నవ్వే. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అందరికీ కావాల్సిందే ఒకటే.. ముఖంపై చెరగని, చెదరని- చిరునవ్వు. అది చాలా పవర్‍ఫుల్‍. నిత్య జీవితంలోనివన్నీ నవ్వుతోనే ముడిపడి ఉంటాయి. ఉరుకుల పరుగుల జీవితంలో మంచి చిరునవ్వు అనేది చిరునామా లేకుండా పోతోంది. వాట్సాప్‍ చాటింగుల్లో, ఇన్‍స్టాగ్రామ్‍, ఫేస్‍బుక్‍ పేజీల్లో ఇమోజీలుగా కనిపించినంతగా నిజ జీవితాల్లో నవ్వులు కనిపించడం లేదు.
‘కళ్లలో స్నేహభావమూ, ముఖంలో ఆనందమూ కనిపించని చోటికి అక్కడ బంగారపు జల్లు కురిసినా సరే వెళ్లకూడదు’ అంటాడు సంత్‍ తులసీదాస్‍. మనుషుల మధ్య అనుబంధానికి సంతోషం ముఖ్యం కానీ సిరిసంపదలు కావనేది ఆయన ఉద్దేశం. మన సమాజంలో ఒకప్పుడు అనుబంధాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. మూడు నాలుగు తరాల మనుషులతో, గంపెడు మంది పిల్లలతో సరదాలూ సరాగాలతో సాగిన నాటి సంసారాలు నేడు లేవు. కుటుంబం చిక్కిపోయింది. మనసులు దగ్గరగా ఉన్నా మనుషులు ఒకరికొకరు దూరమైపోయారు. పిల్లలకు చదువుల పరుగు.. పెద్దలకు ఉద్యోగాల పరుగు.. సమయంతో పోటీ.. పక్క వారితో పోటీ.. అందరిదీ అడుగడుగునా పోటీ, పరుగులే. ఈ ఒత్తిళ్లలో కూరుకుపోతున్న మనిషి సంఘ జీవితానికి దూరమవుతున్నాడు. పిల్లలూ, పెద్దలూ అనే తేడా లేకుండా అందరూ సమూహంలో ఒంటరిగా మిగులుతున్నారు. నేటి జీవనశైలిలో యంత్రాలు భాగమైనట్టే.. జీవితంలోనూ యాంత్రికత పెరిగిపోతోంది. రోజులో కనీసం పట్టుమని పదిసార్లు అయినా మనసారా నవ్వుకుంటున్నామా? అంటే ఆలోచించాల్సిన విషయమే.

ఆనందం ఎక్కడ దొరుకుతుంది?
ఒకాయన ఆనందం ఎక్కడ దొరుకుతుందాదా అని వెతుక్కుంటూ దేశాన్నీ తిరిగాడట. చివరకు ఓ బౌద్ధ భిక్షువు కాళ్లపై పడి, ‘స్వామీ నాకు ఆనందం కావాలి. ఎక్కడ దొరుకుతుందో చెప్పండి’ అన్నాడట. ‘అది నీ ముక్కు కిందే ఉంది నాయనా! బిగిసిపోయిన ఆ కండరాలను కాస్త వదులుచేయి’ అని నవ్వుతూ బదులిచ్చాడట ఆ బౌద్ధ భిక్షువు.
‘ముక్కు కిందా?’ అంటూ ఆయన చెప్పిన తీరుకు ఆ వ్యక్తికి నవ్వొచ్చి నవ్వేశాడు. ‘ఆనందాన్ని నీ ముఖంలోనే ఉంచుకుని ఎక్కడెక్కడో వెతికావు కదా.. ఆనందం దొరికేది నవ్వులోనే. అది నీ ముఖంలోనే ఉంది’ అంటూ భిక్షువు వెళ్లిపోయాడు. నవ్వనేది మన ముఖంలో కనిపించే తొలి భావం. పుడుతూనే నేర్చుకునే సుగుణం. చిన్నప్పుడు కిలకిలా నవ్వే మనం పెరిగి పెద్దవగానే నవ్వుల విషయంలో పిసినిగొట్టులా మారిపోతున్నాం. చిరునవ్వు పైసా ఖర్చులేని పెట్టుబడి. దాని వల్ల పొందే లాభం అమూల్యం. అందుకే చిరునవ్వును ముఖం మీద నుంచి చెరగనివ్వకండి మరి!.

పావుగంట నవ్వు.. రెండు గంటల నిద

కలిసి కూర్చుకుని కబుర్లు చెప్పుకుంటూనో.. సినిమా/టీవీ చూస్తూనో మనసారా హాయిగా నవ్వుకునే వారు ఎక్కువ కాలం జీవిస్తారట!. స్నేహితులు కానివ్వండి, ప్రేమికులు కానివ్వండి, దంపతులు కానివ్వండి.. ఇతర కుటుంబ బంధాలు కానివ్వండి.. నవ్వు మనుషుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇటువంటి మనుషుల జీవితకాలం పెరుగుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నవ్వు ఒత్తిడిని తగ్గించి ఆనందాన్ని పెంచే ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. ఫలితంగా ఒత్తిడి, కోపం, భయం, అసూయ, ఆందోళన, ద్వేషం అన్నీ పోయి ప్రేమానురాగాలు బలపడతాయి.

సాధారణంగా మనిషి రోజూ 13 – 15 సార్లు నవ్వుతాడు. ఆడవాళ్లు రోజుకు 62 సార్లు నవ్వితే, మగాళ్లు నవ్వేది 8 సార్లేనట. ఆరేళ్ల లోపు పిల్లలు రోజుకి 400 సార్లు నవ్వుతారు. మనుషులే కాదు కుక్కలు, పిల్లులు, కోతులు, చింపాంజీలు, గొరిల్లాలు కూడా నవ్వుతాయట. హైనాలు నవ్వితే 3 మైళ్ల వరకూ వినిపిస్తుంది.
రోజుకి 15 సెకన్లు ఎక్కువగా నవ్వితే మరో రెండు రోజులు ఆయుష్షు పెరిగినట్టే.
15 నిమిషాల (పావుగంట) నవ్వు రెండు గంటల నిద్రతో సమానమని తాజా పరిశోధనలు తేల్చాయి.
1950ల ప్రాంతంలో మనుషులు రోజుకి సుమారు 18 నిమిషాల పాటు నవ్వేవారట. ప్రస్తుతం ఈ సమయం 4 – 6 నిమిషాలకు పడిపోయింది.
ఓ జోకుని మామూలు వ్యక్తులు చెప్పినపుడు కన్నా కమెడియన్‍గా పేరొందిన వాళ్లు చెబితే అది బాగా పేలుతుంది. ట ప్రాచీన చైనాలో ఆత్మానందం అనే దాన్ని ప్రత్యేకంగా బోధించేవారు. తమలో తామే నవ్వుకునే ఈ పద్ధతి వల్ల ఆనందం, ఆరోగ్యం, ఆయుష్షు పెరుగుతాయట.
మనం కావాలనో, తెచ్చిపెట్టుకునో ఎంత గట్టిగా నవ్వినా అవతలి వాళ్లకు అది ఇట్టే తెలిసిపోతుంది. నిజమైన నవ్వేదో కానిదేదో మెదడు ఇట్టే పసిగట్టేస్తుంది.
కొందరు ఊరికూరికే నవ్వేస్తుంటే మరికొందరు ఎంత పెద్ద జోకు పేల్చినా నవ్వురు. దీనికి కారణం జన్యువులే. ట నవ్వాలని ఉన్నా నవ్వలేకపోతే ఎఫ్నోజిలియా అనే వ్యాధితో బాధపడుతున్నారని అర్థం చేసుకోవాలి.

నవ్వడం ఒక భోగం..
నవ్వకపోవడం రోగమే!

నవ్వించడం భోగం.. నవ్వడం యోగం అవునో కాదో తెలియదు కానీ నవ్వకపోవడం మాత్రం కచ్చితంగా రోగమే! తక్కువగా నవ్వే వారిలో కండరాన్నీ ముడుచుకుపోయి, రక్తనాళాలు కుంచించుకుపోతాయి. అదే పగలబడి నవ్వే వాళ్లలో ముఖం, కాళ్లు, చేతుల్లోని కండరాలన్నీ సమన్వయంతో కదులుతాయి. దాంతో నొప్పులు కూడా తెలియవు.
ట నవ్వడం వల్ల రక్తనాళాలు వ్యాకోచించి, రక్తప్రసారం పెరుగుతుంది. దీంతో హృద్రోగాలు దరిచేరవు. కాబట్టి ఇతరత్రా ఆరోగ్య నియమాలతో పటు రోజూ కాసేపు నవ్వుతుంటే గుండెజబ్బులకు కాస్త దూరంగా ఉండొచ్చని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి.
ట ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాళ్లలో యాంటీబాడీలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. అదే సమయంలో రోగనిరోధక శక్తిని తగ్గించే కార్టిసాల్‍, ఎపినెఫ్రైన్‍ల శాతాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా నవ్వు వల్ల ఎలాంటి జబ్బులూ దరిచేరకుండా ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి నవ్వు కచ్చితంగా భోగమే.

నవ్వడం వల్ల రక్తంలో ఆక్సిజన్‍ శాతం పెరుగుతుంది. తద్వారా క్యాన్సర్‍ కారణంగా దెబ్బతిన్న కణాలను బాగుచేసే శక్తి నవ్వుకి ఉంది.
హాస్యసౌరభం కార్టిసాల్‍ శాతాన్ని తగ్గించడంతో పాటు వృద్ధాప్యంతో వచ్చే మతిమరుపుని తగ్గించి, జ్ఞాపకశక్తినీ పెంచుతుందని తేలింది. మంచి నిద్ర పట్టేలా చేయడంతో పాటు జీర్ణశక్తినీ పెంచుతుంది. చక్కెర నిల్వలనూ క్రమబద్ధీకరిస్తుంది.
నవ్వడం వల్ల ఆయుష్షూ పెరుగుతుంది. నోరంతా తెరిచి కళ్ల కింద ముడతలు పడేలా బిగ్గరగా నవ్వే వాళ్లు నవ్వని వాళ్లకన్నా ఏడు సంవత్సరాలు ఎక్కువగా జీవిస్తారట. అందుకే ఇటీవల హ్యూమర్‍, జోకర్‍థెరపీ వంటి వాటిని సైకియాట్రిస్టులతో పాటు ఇతర వైద్యులూ చికిత్సలో భాగం చేస్తున్నారు.
నవ్వడం వల్ల గుండె వేగం 10 – 20 శాతం పెరుగుతుంది. రోజుకు సుమారు పావుగంట సేపు నవ్వితే దాదాపు 40 వరకూ క్యాలరీలు కరుగుతాయట.
చాకొలెట్‍ను మూడ్‍ బూస్టర్‍ అంటారు. కానీ, దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ప్రభావం చూపేది చిరునవ్వే. నవ్వు.. రెండు వేల చాకొలెట్‍ బార్లతో సమానమైన ఉత్సాహాన్ని ఇస్తుంది.
నవ్వుతూ నవ్విస్తూ ఉండే వారు అసలు వయసు కన్నా తక్కువ కనిపించడమే కాదు.. దీర్ఘాయుష్మంతులూ అవుతారు.
నవ్వుతూ ఉండే వారిలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. నవ్వు ముఖం విజయ సంకేతంగా కనిపిస్తుంది.

హ్యాపీగా ఉండటమెలా?
ఒకాయన సంతోషంగా ఉండటం ఎలా? అనే విషయం మీద మాట్లాడటానికి ఉద్యుక్తుడవుతున్నాడు.
తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఒక జోకుతో ఆ పనికి శ్రీకారం చుట్టాడు. ఆయన చెప్పిన జోక్‍ చాలా బాగుందని అక్కడున్న వారంతా పడీ పడీ నవ్వారు.
ఆయన మళ్లీ అదే జోక్‍ను చెప్పాడు.
అందరూ వినలేదని మళ్లీ చెప్పాడనుకుని శ్రోతలు నవ్వారు కానీ మొదటిసారి నవ్వినంత గట్టిగా నవ్వలేదు.
ఆయన మూడోసారి మళ్లీ అదే జోక్‍ చెప్పాడు. ఈసారి ఎవరూ నవ్వలేదు. పైగా ఆయనకు ఏమైంది? చెప్పిందే చెబుతున్నాడు అని అందరూ విసుగ్గానూ, ప్రశ్నార్థకంగానూ చూడసాగారు.
‘నేను చెప్పిన జోక్‍ బాగా లేదా?’ అని ఆయన శ్రోతలను ప్రశ్నించాడు.
‘బాగుంది కానీ..’ అంటూ అసలు విషయం చెప్పడానికి నసిగారు శ్రోతలు.
‘నేను చెప్పిన జోక్‍నే మళ్లీ మళ్లీ చెబితే మీకు నవ్వు రాలేదు. అంతేకదా!. మరి ఎప్పుడో జరిగిన సంగతులను తలచుకుని పదేపదే బాధపడతారెందుకు? ముఖాలు వేలాడేసుకుని తిరుగుతారు ఎందుకు?’ అని ఆ ప్రసంగీకుడు అడిగాడు.
ఎవరి దగ్గరా సమాధానం లేదు.
‘చితి ఒక్కసారే మండుతుంది. చింత జీవితాంతం, నిరంతరం మండుతూనే ఉంటుంది. ఆ మంటను చల్లార్చే సాధనం చిరునవ్వు. అందుకే మనసారా నవ్వుకుందాం. అలాచేస్తే ఏ చింతా మన దరిచేరదు’ అంటూ తన ప్రసంగాన్ని ముగించాడాయన.

Review సిరిమల్లి పువ్వల్లే నవ్వు.. చిన్నారి పాపల్లే నవ్వు!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top