స్వాతంత్య్ర దీప్తి వజ్రోత్సవ కీర్తి

డెబ్బై అయిదు సంవత్సరాల స్వతంత్ర భారతం మనది. ఈ ఆగస్టు 15కి మనకు స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకునే కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్‍ మహోత్సవ్‍’ పేరుతో 2021, మార్చి 12న ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2022, ఆగస్టు 15కు 75 వారాల ముందు ప్రార్బభమైన ఈ కార్యక్రమం వచ్చే ఏడాది (2023), ఆగస్టు 15 వరకు కొనసాగుతుంది. నాటి మన స్వాతంత్య్ర పోరాటం గురించి నేటి తరానికి తెలియచెప్పడం, ఈ డెబ్బై అయిదేళ్లలో మన ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి? ఈ డెబ్బై అయిదేళ్లలో మనం సాధించిన విజయాలు, ఈ డెబ్బై అయిదేళ్లలో చేపట్టిన చర్యలు.. వంటివి మననం చేసుకోవడానికి ఈ ఉత్సవాలను ఉద్దేశించారు. ఈ ఉత్సవాల నిర్వహణకు వివిధ రంగాలకు చెందిన 250 మంది ప్రముఖులతో ఒక జాతీయ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. సాతంత్య్ర పోరాట స్ఫూర్తి, దేశం కోసం ప్రాణార్పణ చేసిన వీరులు, వారు చేసిన ప్రతిజ్ఞలు, సనాతన భారత వైశిష్ట్యం, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

భారత స్వాతంత్య్ర పోరాటంలో చిరస్థాయిగా చిలిచిపోయేది- దండియాత్ర. దీనిని గుర్తుచేసుకుంటూ సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు 241 మైళ్ల మహా పాదయాత్రను ప్రధాని నరేంద్ర మోదీ 2021, మార్చి 12న ప్రారంభించారు. ఈ పాదయాత్ర ఇరవై అయిదు రోజుల పాటు కొనసాగి 2021, ఏప్రిల్‍ 5న దండిలో ముగిసింది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్‍ మహోత్సవ్‍’ కింద అనేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అలాగే, వేడుకలను ఏకకాలంలో పదహారు చోట్ల ప్రారంభించారు. ఢిల్లీలోని ఖిలారాయ్‍ ఫిథోరా, గ్వాలియర్‍ కోట, ఢిల్లీలోని హుమాయూన్‍ సమాధి, ఫతేపూర్‍ సిక్రీ, హైదరాబాద్‍లోని గోల్కొండ కోట, ఐజ్వాల్‍లోని భువనేశ్వరి ఆలయం, ముంబైలోని ఆగాఖాన్‍ ప్యాలెస్‍, ఒడిశాలోని కోణార్క్ ఆలయం, లక్నోలోని హిమాచల్‍ ప్రదేశ్‍ రెసిడెన్సీ బిల్డింగ్‍, కాంగ్రా కోట, ఝూన్సీకోట, తొలి రాష్ట్రపతి డాక్టర్‍ బాబూ రాజేందప్రసాద్‍ పూర్వీకుల నివాసం, కర్ణాటకలోని చిత్రదుర్గ కోట, వారణాసిలోని మహల్‍ఘాట్‍, అమరావతి (మహారాష్ట్ర), జైపూర్‍ ప్యాలెస్‍ వద్ద ఆజాదీ కా అమృత్‍ మహోత్సవ్‍ వేడుకలు నిర్వహించారు. ఇంకా గ్రామ స్థాయి నుంచి అత్యున్నత స్థాయిల వరకు అందరూ అన్ని స్థాయిల్లో భారత స్వాతంత్య్ర ఘట్టాలను జ్ఞప్తికి తెచ్చేలా నిర్వహించాలని, 2047 నాటికి భారతదేశం ఏ స్థాయికి చేరాలో అనేందుకు అందరూ తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు.

ఆజాదీ కా అమృత్‍ మహోత్సవ్‍ అంటే..
ఆజాదీ అంటే స్వేచ్ఛ. అమృత్‍ అంటే అజరామరం. మహోత్సవ్‍ అంటే అతి పెద్ద సంరంభం. ‘ఆజాదీ కా అమృత్‍ మహోత్సవ్‍’ అంటే అజరామరమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాల సంరంభం అని అర్థం. దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన బ్రిటిష్‍ వలస పాలకులకు వ్యతిరేకంగా స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం సాగించిన ఉద్యమమే జాతీయోద్యమం. అదే స్వాతంత్య్రోద్యమం. భారత జాతి దాస్య శృంఖలాల విముక్తి కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను తృణపాయంగా భావించి తాగ్యం చేసిన ఫలితమే 1947లో దేశానికి స్వరాజ్యం సిద్ధించింది. అలాంటి జాతీయోద్యమం నాటి చరిత్రతో ముడిపడి ఉన్న క్షణాలను గుర్తుచేసుకోవడమే ఈ కార్యక్రమ ఉద్దేశం.

స్వాతంత్య్ర పోరాటంలో మనోళ్లు..
ఆంగ్లేయుల పాలనలో దేశ ప్రజానీకమంతా అష్టకష్టాలకు గురయ్యారు. నాటి సమయంలో కవులు, కళాకారులే అప్పటి పరిస్థితులపై ఫిరంగులై స్పందించి జనంలో చైతన్యం తెచ్చారు. 1900 సంవత్సరం మొదలుకుని దాదాపు యాభై సంవత్సరాల పాటు ఈ చైతన్యఝురి జాలువారింది.
ఆంగ్లేయుల సామ్రాజ్యవాదాన్ని నిరసించిన తెలుగు కవులు వారిని, ‘సామ్రాజ్య క్షుధాబాధితుల్‍’ అని ఈసడించారు.
ఆంగ్లేయుల దాష్టీకానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అప్పటి కృష్ణా పత్రిక, జమీన్‍ రైతు, ఆంధ్రభాషా సంజీవని, వివేకవర్ధిని, గోల్కొండ, విశాలాంధ్ర మొదలైన పత్రికలు దోహదపడ్డాయి. ప్రజల్లో దేశభక్తిని పెంచేందుకు మరెన్నో సంస్థలు ఏర్పాటయ్యాయి.
భరతఖండంబు చక్కని పాడియావు
జాతీయోద్యమంలో భాగంగా వెలువడిన తొలి పద్యాల్లో ఒకటిగా భావించే, ‘భరతఖండంబు చక్కని పాడియావు..’ అనే పద్యం భారతదేశాన్ని చక్కని పాడి ఆవుతో పోల్చింది. అంత చిన్న పద్యంలో బ్రిటిష్‍ వారి పీడనను వర్ణించాడు కవి (ఈ పద్యాన్ని చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారు రాశారని కొందరు, చెన్నాప్రగడ భానుమూర్తి గారి రాశారని మరికొందరు అంటారు).
ఈ దేశ ప్రజలు లేగదూడలై ఏడుస్తుంటే, తెల్లదొరలు వారి మూతులు బిగించి మరీ పాలు పితుకుతున్నారన్న చమత్కారం ఈ పద్యంలో ఉంది.

1907లో లాలా లజపతిరాయ్‍ అరెస్టు అయినపుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు ‘చెరసాలల్‍ పృథు చంద్రశాలలెయగున్‍’ అంటూ పద్యం రాశారు.
లోకమాన్య బాలగంగాధర్‍ తిలక్‍; గోపాలకృష్ణ గోఖలే, గాంధీజీ మొదలైన నాయకుల పిలుపు మేరకు ఎందరో దేశభక్తులు స్వాతంత్య్రోద్యమ యవనికపై ఉదయించారు.
గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కొండా వెంకటప్పయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు, కాశీనాథుని నాగేశ్వరరావు, పొట్టి శ్రీరాములు, అయ్యదేవర కాళేశ్వరరావు తదితర నాయకుల నేతృత్వంలో తెలుగు వారు స్వరాజ్య శంఖం పూరించారు.
ఈ పోరాటంలో దువ్వూరి సుబ్బమ్మ, గుమ్మడిదల దుర్గాబాయి తదితర మహిళలూ తమదైన పాత్ర పోషించారు. ఉద్యమంలో పాల్గొనే పురుషులకు స్త్రీలు వీరతిలకం దిద్ది స్వరాజ్య సమరంలో పాల్గొనాలని పంపేవారు.
ఈ నేపథ్యంలోనే త్రిపురనేని రామస్వామి చౌదరి రాసిన, ‘వీరగంధము తెచ్చినారము/వీరుడెవ్వరో తెల్పుడీ/పూసిపోదుము మెడనువైతుము/ పూలదండలు భక్తితో..’ అనే పాట నాటి మహిళల దేశభక్తికి అద్దం పడుతుంది.

స్వరాజ్య పోరాటంలో పూర్వ ఆంధప్రదేశ్‍లోని ఎందరో కవులు, సాహితీవేత్తలు, పత్రికలు అగ్గిబరాటాలై నిలిచారు. ఎవరి స్థాయిలో వారు తమ స్వరాజ్య వాణి వినిపించారు. నాటి జాతీయోద్యమంలో ఒక వెలుగు వెలిగిన తెలుగు వెలుగులను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం.

సహాయ నిరాకరణోద్యమం నేపథ్యంలో 1921 మార్చి 31న విజయవాడలో జరిగిన ప్రత్యేక కాంగ్రెస్‍ సమావేశానికి గాంధీజీ హాజర్యారు. ఈ సభలోనే పింగళి వెంకయ్య గారు తాను రూపొందించిన జాతీయ పతాకాన్ని మహాత్మాగాంధీకి అందించారు.
మాగంటి అన్నపూర్ణమ్మ తన ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలను తిలక్‍ స్వరాజ్యనిధి నిమిత్తం గాంధీజీకి అందించారు.
వందేమాతరం, హోంరూల్‍, సహాయ నిరాకరణం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్‍ ఇండియా ఉద్యమాల్లో ఎందరో తెలుగు వారు పాల్గొన్నారు. జైళ్ల పాలయ్యారు. లాఠీ దెబ్బలు తిన్నారు. ఆ రోజుల్లో ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమంలో మహాత్మాగాంధీది విశిష్ట స్థానం. ఆ సందర్భంలోనే గాంధీజీని అవతార పురుషుడిగా కీర్తించారు పలువురు తెలుగు కవులు.

మాగంటి అన్నపూర్ణమ్మ తన ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలను తిలక్‍ స్వరాజ్యనిధి నిమిత్తం గాంధీజీకి అందించారు.
వందేమాతరం, హోంరూల్‍, సహాయ నిరాకరణం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్‍ ఇండియా ఉద్యమాల్లో ఎందరో తెలుగు వారు పాల్గొన్నారు. జైళ్ల పాలయ్యారు. లాఠీ దెబ్బలు తిన్నారు. ఆ రోజుల్లో ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమంలో మహాత్మాగాంధీది విశిష్ట స్థానం. ఆ సందర్భంలోనే గాంధీజీని అవతార పురుషుడిగా కీర్తించారు పలువురు తెలుగు కవులు.

‘కత్తి కదల్చలేదు, విశిఖాల విదల్చను లేదు
గాండివం బెత్తనులేదు, ఏ క్రియ జయించితివో
నరమాంస పారణోన్మత్తుల
మీ ప్రభావములమానుషముల్‍
భవదీయ శాంతి సంపత్తికి దోసిలొగ్గెను ప్రపంచము
భారత భాగ్యదేవతా!’ అని గాంధీ అహింసా మార్గాన్ని తన చక్కని పద్యంలో ఇమిడ్చారు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు.
‘మాకొద్దీ తెల్లదొరతనము’ అంటూ గరిమెళ్ల సత్యనారాయణ గారు రచించిన పాట తెలుగునాట ప్రజానీకాన్ని ఉర్రూతలూగించింది. తెల్లదొరల నూట అరవై ఏళ్ల పాలనలోని దౌర్జన్యాలను కళ్లకు కడుతూ 160 పాదాలుగా సాగే ఈ పాట ప్రపంచ సాహిత్యంలో అతి పెద్ద పాటగా చరిత్రకెక్కింది. తెలుగు వారి గుండెలను మండించి పౌరుషాగ్ని జ్వాలలు రగిలించిన విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజు. శ్రమదోపిడీకి వ్యతిరేకంగా గిరిజనులతో కలిసి బ్రిటిష్‍ వారికి వ్యతిరేకంగా మన్నె విప్లవం లేవనెత్తాడు అల్లూరి. ఆయన పోరాటాన్ని- ‘రాచరికంపు రక్కసి కరమ్ములు సాచి అమాయక ప్రజన్‍/ దోచు పర ప్రభుత్వమ్మును దోచిన రాజుల చిన్నవాడ’ అని ప్రశంసిస్తారు ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రి.
మద్రాసులో సైమన్‍ కమిషన్‍ను బహిష్కరిస్తూ సాగించిన నిరసన ఉద్యమంలో పోలీసులు గుళ్ల వర్షం కురిపించారు. కాల్పుల్లో ఒక యువకుడు మరణించాడు. అతడిని చూసేందుకు వెళ్తున్న టంగుటూరి ప్రకాశం పంతులుపై పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టారు. అప్పుడు ప్రకాశం గారు ‘దమ్ముంటే కాల్చండి’ అని రొమ్ము చూపించారు. ఈ ధైర్య సాహసాలే ఆయనను ఆంధ్రకేసరిగా నిలిపాయి.

ఏ దేశమేగినా, ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా యెవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా
నీ జాతి నిండు గౌరవము అంటూ రాయప్రోలు సుబ్బారావు నినదించారు.
స్వాతంత్య్ర పోరాటం సాగుతున్న రోజుల్లో ఎక్కడ మూడు రంగుల జెండా కనిపించినా ఆంగ్లేయులకు శత్రుకేతనంలా కనిపించేది. తలపై ఖద్దరు టోపీ ఎవరు ధరించినా, అది తమ అధికారాన్ని ధిక్కరిస్తున్నట్టుగా బ్రిటిష్‍ ప్రభుత్వం భావించేది. అలాంటి వారిపై ఆంగ్లేయులు కఠిన చర్యలు తీసుకునే వారు.
ఒంగోలులో గుడిమెట్ల తిరువెంగళాచార్యులనే పద్నాలుగేళ్ల బాలుడు నిషేధిత కరపత్రాలు పంచుతున్నాడనే నెపంతో పోలీసులు ఆ బాలుడిని నడిరోడ్డుపై పట్టుకుని తీవ్రంగా కొట్టారు.
బందరులో తోట నరసయ్య నాయుడు జెండా ఎగురువేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆయనను స్పంహ తప్పేలా కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక నరసయ్య నాయుడు మరణించారు.

ప్రాణమంటే, అభిమానముంటె మన
ప్రాణములనన్‍ – బలియొసంగి
జెండా ఎత్తర, జాతికి ముక్తిర
నిండగు శక్తిర, నిల్పర కీర్తి
అంటూ గురజాడ రాఘవశర్మ రచించిన గేయం జాతీయ పతాకం మీద ఆనాటి ప్రజలకు ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంది. దేశభక్తి జాతీయ జెండా గౌరవాన్ని కాపాడటానికి ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడేలా చేసింది.

‘కత్తులు లేవు, శూలమును గాండివమున్‍
మొదలే హుళక్కి నోరెత్తి ప్రచండ వాక్పటిమనేనియు జాటడు
వైరి మీద దం
డెత్తగ సేనలేదు, బలహీనపుకాయము, కోపతాపముల్‍
బొత్తిగ సున్న అట్టి వరమూర్తి మనోబలశాలి,
గాంధీ జేయెత్తి నమస్కరించి స్మరియించుద మెప్డు
స్వరాజ్య సిద్ధికిన్‍’ అని దామరాజు పుండరీకాక్షుడు గారు గాంధీని కీర్తించారు.

తెలంగాణ.. కోటి రతనాల వీణ
1947, ఆగస్టు 14, అర్ధరాత్రి దాటి ఆగస్టు 15 ప్రవేశించగానే భారతదేశం స్వతంత్ర దేశంగా ఆవిర్బవించింది. కానీ, హైదరాబాద్‍ ర్యాం మాత్రం నిజాం నవాబు ఇనుప సంకెళ్ల నుంచి విముక్తి పొందలేదు. ఇండియన్‍ యూనియన్‍లో హైదరాబాద్‍ సంస్థానం విలీనం కావాలని ప్రజలు కాంక్షించారు. మాడపాటి హనుమంతరావు, బూరుగుల రామకృష్ణారావు, స్వామి రామానందతీర్థ, పండిట్‍ నరేంద్రజీ, రావి నారాయణరెడ్డి, దేవులపల్లి రామానుజరావు మొదలైన నాయకులు నిజాం రాజుకు వ్యతిరేకంగా ఉద్యమించారు. యల్లాప్రగడ సీతాదేవి, సంగెం లక్ష్మీబాయమ్మ వంటి మహిళలు కూడా ఇందులో పాలుపంచుకున్నారు.

ఓ నిజాము పిశాచమా! కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగెలను తెంపి అగ్నిలోకి దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి అంటే, మన కొంపలార్పిన – మన స్త్రీల చెరచిన
మన పిల్లలను చంపి – మనల బంధించిన
మానవాధములను – మండలాధీశులను
కండకండగా కోసి కాకులకు వేయాలె
కాలంబు రాగానే కాటేసి తీరాలె అని ప్రజాకవి కాళోజీ గర్జించారు.
వరంగల్‍లో మొగిలయ్య, రామస్వామి సోదరులు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా, వరంగల్‍ కోటపై జాతీయ జెండాను ఎగురవేస్తుండగా వెనుక నుంచి రజాకార్లు వెళ్లి మొగిలయ్యను బల్లెంతో పొడిచి దారుణంగా హతమార్చారు. ‘భారత మాతకు జై’ అంటూ మొగిలయ్య ప్రాణాలు విడిచాడు. తెలంగాణలో జాతీయజెండా వీరుడుగా మొగిలయ్య ప్రసిద్ధి చెందాడు. దీనికి స్పందిస్తూ చందాల రామకవి-
నవాబులకు స్థానం లేదు – యిమ్మంచు అడిగెదికలేదు
గానమ్ము గాదిది బ్రాణమ్ము – సంగ్రామమునకు పయనమ్ము
రానిమ్ము దేవుడె కానిమ్ము – బారు ఫిరంగులు మ్రోగినా
బాంబుల వర్షం కురిసినా – ఎత్తిన జెండా దించబోం అని రాశారు. అలాగే, తెలంగాణలో జాతీయాభిమాని షోయబుల్లాఖాన్‍ ‘ఇమ్రోజ్‍’ పత్రికలో రజాకార్ల ఆగడాలను తెగడుతూ వ్యాసాలు రాసేవాడు. ఇది రజ్వీకి కోప కారణమైంది. తన అనుచరులతో కలిసి 1948,ఆగస్టు 21న షోయబుల్లా చేతులు నరికి, కాల్చి చంపేశారు.
జనగాం తాలూకాలోని కడివెండి గ్రామ నివాసి కొమురయ్య ప్రజా హక్కులు కాపాడటానికి కంకణం కట్టుకున్నాడు. స్థానిక దేశ్‍ముఖ్‍పై తిరగబడ్డాడు. దాంతో దేశ్‍ముఖ్‍ గూండాలు జరిపిన హత్యాకాండలో కొమరయ్య ప్రాణాలు వదిలాడు. నిజాం సంస్థానంలో శాంతి భద్రతల సంరక్షణకు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి సర్దార్‍ వల్లభాయ్‍ పటేల్‍ సైనికచర్యకు ఆదేశించారు. 1948, సెప్టెంబరు 17న నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. సుద్దాల హనుమంతు, యాదగిరి, సుంకర మొదలైన కవులు ప్రజల్లో దేశభక్తిని రేకెత్తించే రచనలు చేశారు ఆ కాలంలో. ఎంతోమంది త్యాగధనుల పోరాట ఫలం. అందుకే-
మాతృదేవి బలిమంటపమందు
యజ్ఞ పశువుగ నిల్చునంతటి భాగ్య
మెవనికి సిద్ధించు నిందరిలోన
నా మహా పురుషుని అరి కాలు దుమ్ము
ప్రజల శిరంబెక్కి భవ్యంబు సేయు
అంటూ దేశమాత బానిస గొలుసులు తెంచడానికి ముందుకొచ్చిన ప్రతి వీరుడిని స్మరిస్తాడు కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి.
జాతీయోద్యమ కాలంలో తెలుగునేలపై భారతమాత, జాతీయ నాయకులు, మువ్వన్నెల జెండా, ఖద్దరు – రాట్నం, సంఘ సంస్కరణలపై కవిత్వం కోకొల్లలుగా వచ్చింది. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు కావస్తోంది. అప్పటి తరంలో ప్రతి ఒక్కరినీ కదిలించి, ఉద్యమంలోకి ఉరకలెత్తించింది జాతీయోద్యమ కవిత్వం. అప్పటి సమస్యలు వేరు. ఇప్పుడున్నవి వేరు. అయినా దేశభక్తి మాత్రం ఎప్పటికీ ఉండాల్సిందే. భారతదేశం ఉన్నన్నాళ్లు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది జాతీయోద్యమ కవిత్వం.

ప్రజల వ్యతిరేకతను అణచివేయడానికి నిజాం ప్రోద్బలంతో ఖాసిం రజ్వీ నేతృత్వంలో రజాకార్లు బయల్దేరారు. వీరు తెలంగాణలో ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డారు. ఇదే సమయంలో కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. పీడనకు వ్యతిరేకంగా ఎందరో కవులు తమ కలాలతో గళాలు వినిపించారు.

75 ఏళ్ల భారతంలో కొన్ని ముఖ్య ఘట్టాలు
మన దేశ తొలి గణతంత్ర దినోత్సవం (జనవరి 26, 1950) ఇర్విన్‍ ఆంఫి థియేటర్‍లో జరిగింది. ఇది ప్రస్తుత మేజర్‍ ధ్యాన్‍చంద్‍ నేషనల్‍ స్టేడియంగా మారింది. మొదటి రాష్ట్రపతి బాబూ రాజేందప్రసాద్‍ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ, మార్చ్ఫాస్ట్ వంటివన్నీ ఇక్కడే జరిగాయి. 1955 నాటి గణతంత్ర దిన వేడుకలకు శాశ్వత వేదికగా రాజ్‍పథ్‍ మారింది.

ఏటా జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవానికి విదేశీ అధినేతలు హాజరు కావడం ఒక సంప్రదాయంగా వస్తోంది. అలా తొలి రిపబ్లిక్‍ డే వేడుకలకు హాజరైన ముఖ్య అతిథి ఇండోనేషియా
అధ్యక్షుడు సుకర్ణో.

భారతదేశ చరిత్రలో 1944, జూలై 6కి ఒక ప్రత్యేకత ఉంది. సింగపూర్‍ నుంచి రేడియో ద్వారా ప్రసంగించిన నేతాజీ సుభాష్‍చంద్రబోస్‍ ‘ఫాదర్‍ ఆఫ్‍ ద నేషన్‍’ (జాతిపిత)గా మహాత్మాగాంధీని తొలిసారిగా సంబోధించిన రోజది.

ఇండియన్‍ ఎయిర్‍ఫోర్స్ తొలి మహిళా పైలట్‍ హరితాకౌర్‍. 1994లో ఆమె తొలి మహిళా పైలట్‍గా భూమికి పదివేల అడుగుల ఎత్తున హెచ్‍ఎస్‍-748 ఎయిర్‍ప్రాఫ్ట్ను నడిపారు.

‘క్విట్‍ ఇండియా’.. ఈ నినాదం ఎంత శక్తిమంతమైనదో అందరికీ తెలుసు. బ్రిటిష్‍ పాలన పతనానికి నాంది పలికిన రణన్నినాదమది. ఈ నినాదాన్ని నిజానికి మహాత్మాగాంధీ ఇచ్చారని అందరూ అనుకుంటారు. అప్పటి బొంబాయి మేయర్‍, సోషలిస్టు నాయకుడు అయిన యూసుఫ్‍ మెహరాలీ ఈ నినాదకర్త.

భారతీయ విద్యా విధానంలో ఇండియన్‍ ఇనిస్టిట్యూట్‍ ఆఫ్‍ టెక్నాలజీ (ఐఐటీ) విద్యాసంస్థలు ఒక మైలురాయి. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ఈ అత్యున్నత విద్యాసంస్థల ఏర్పాటుకు బీజం పడింది.

భారత్‍ – పాకిస్తాన్‍ మధ్య విభజన రేఖ గీసిన సిరిల్‍ రాడిక్లిఫ్‍కు.. అసలు తను విభజించిన భూముల సాంస్క•తిక సూక్ష్మభేదాలు కూడా ఆయనకు తెలియవు. ఈ రెండు దేశాల మధ్య విభజన రేఖను నిర్ధారించడానికి కేవలం ఐదు వారాల సమయం మాత్రమే ఆయనకు ఇచ్చారు. ఈ విభజన రేఖే ఆయన పేరుపై రెడ్‍క్లిఫ్‍ లైన్‍గా పేరొందింది.

కోల్‍కతాలోని సెయింట్‍పాల్స్ కేథడ్రల్‍ చర్చి రెండు భూకంపాలను తట్టుకుంది. మొదట 1897లో అస్సాంలో భూకంపం సంభవించినపుడు ఈ చర్చి పై భాగం కూలిపోయింది. అనంతరం 1934లో బీహార్‍, నేపాల్‍ ప్రాంతాల్లో భారీ భూకంపాలు వచ్చినపుడు చర్చి మొత్తం దెబ్బతిన్నది. ఇప్పుడు మనం చూసే నిర్మాణం ఆ తరువాత కాలంలో రీడిజైన్‍ చేసినదే..

మహిళా విద్య, అంటరానితనాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన మహిళ సరళాదేవి.
ఒడిసాలో జాతీయోద్యమం
వేళ్లూనుకోవడం వెనుక ఆమె క్రియాశీలక పాత్ర ఎంతో ఉంది. భారతదేశంలో తొలి మహిళా ఖైదీగా కూడా ఆమెకు పేరు.

‘భారత స్వాతంత్య్ర పోరాటం’ సిరీస్‍లో భాగంగా భారత తపాలా శాఖ 1986లో అల్లూరి సీతారామరాజు స్మారక పోస్టల్‍ స్టాంపును విడుదల చేసింది.

1948, జనవరి 30 భారతదేశ చరిత్రను రక్తాక్షరాలతో లిఖించిన రోజు. ఆ రోజు మితవాద హిందూ మహాసభ సభ్యుడు నాథూరామ్‍ గాడ్సే జాతిపిత మహాత్మాగాంధీని తుపాకీతో కాల్చి చంపాడు.

దేశం కోసం ఆజాద్‍ హిందుఫౌజ్‍ తరపున తన విలువైన జీవితాన్ని తాగ్యం చేసిన మొదటి వ్యక్తి మేజర్‍ దుర్గా మల్లా.

భారతదేశ చరిత్రలో శివాజీ మహారాజ్‍ మొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేసిందీ, శివాజీకి రాఖీ కట్టినది మహారాణి బేలవాడి మల్లమ్మ. 17వ శతాబ్దంలో శివాజీ మహారాజ్‍తో కలిసి ఆమె యుద్ధంలో పాల్గొంది.

సిక్కిం బారత్‍లో విలీనమైన రోజు- 1975, ఏప్రిల్‍ 22. ఈరోజున భారత్‍ లోక్‍సభ 36వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించింది. దీంతో సిక్కిం భారత్‍లో 22వ రాష్ట్రంగా మారింది. అంతకుముందు సిక్కింలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 97.5 శాతం మంది సిక్కిం భారత్‍లో కలవడానికి మద్దతిచ్చారు.

1975, జూన్‍ 25.. భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజు. ఆ రోజు రాత్రి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించారు. తనను వ్యతిరేకించే, ప్రతిపక్ష పార్టీ నేతలను మూకుమ్మడిగా అరెస్టు చేయించారు.

రాయ్‍బరేలీ నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీ గెలిచారు. అయితే ఎన్నికల సమయంలో ఆమె ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారంటూ రాజ్‍ నారాయణ్‍ వేసిన పిటిషన్‍ను అలహాబాద్‍ హైకోర్టు విచారించింది. ఇందిర ఎన్నిక చెల్లదంటూ 1975, జూన్‍ 12న తీర్పునిచ్చింది.

మౌంట్‍ ఎవరెస్ట్పై మన భారత జాతీయ పతాకం తొలిసారిగా మే 29, 1953లో రెపరెపలాడింది. దీన్ని ఎగురవేసిన తొలి పర్వతారోహకుడిగా నేపాలీ ఇండియన్‍ టెంజింగ్‍ నార్గే చరిత్రలో నిలిచిపోయారు. ఆయనతో పాటు న్యూజిలాండ్‍కు చెందిన ఎడ్మండ్‍ హిల్లరీ కూడా అదే సమయంలో ఎవరెస్ట్ను అధిరోహించారు.

భారత్‍ తన తొలి ఉపగ్రహం ఆర్యభట్టను 1975, ఏప్రిల్‍ 19న అంతరిక్షంలోకి పంపింది. 360 కిలోల ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో)లో అభివృద్ధి చేశారు.

భారత్‍ తొలి అణు పరీక్షను 1974, మే 19న నిర్వహించింది. రాజస్తాన్‍లోని పోఖ్రాన్‍లో తొలి భూగర్భ అణు పరీక్ష నిర్వహించడం ద్వారా అణ్వాయుధాలు కలిగిన ఆరు దేశాల సరసన చేరింది.

1971లో బంగ్లాదేశ్‍ ఆవిర్భవించింది. డిసెంబర్‍ 3న యుద్ధం ప్రారంభమయ్యాక భారత సైన్యం ఢాకాను తన నియంత్రణలోకి తెచ్చుకుంది. పాకిస్తాన్‍కు చెందిన 90 వేలకుపైగా సైనికులు లొంగిపోయారు. అనంతరం •ంగ్లాదేశ్‍ ఏర్పడింది.

దేశంలో 1971లో రాజభరణాల చట్టం రద్దయింది. 1947లో 500కిపైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసుకున్నాడు. ఈ సందర్భంలో ఆయా సంస్థానాధిపతులకు ఏటా రాజభరణం
ఇస్తామని భారత ప్రభుత్వం హామీనిచ్చింది. 1971లో కాంగ్రెస్‍ ప్రభుత్వం 26వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజభరణాలను రద్దు చేసింది.

భారతదేశంలో 1970లో శ్వేత విప్లవం ప్రారంభమైంది. అప్పటి నేషనల్‍ డెయిరీ డెవలప్‍మెంట్‍ బోర్డు చైర్మన్‍ వర్గీస్‍ కురియన్‍ ఆలోచనల నుంచి ఇది పురుడు పోసుకుంది. దేశంలో శ్వేత విప్లవం ప్రారంభమయ్యాక పరిమితంగా పాలు ఉత్పత్తి చేసే దేశాలు అదనంగా ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి.

1969లో దేశంలో 14 పెద్ద బ్యాంకులను నాటి ప్రధాని ఇందిరాగాంధీ జాతీయం చేశారు. ఈ చర్యను కొందరు సుప్రీంకోర్టులో సవాల్‍ చేశారు. తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది. దీంతో ఆర్డినెన్స్ ద్వారా ఈ నిర్ణయాన్ని అమలు చేశారు.

దేశంలో 1967లో నక్సల్‍ విప్లవం ప్రారంభమైంది. సిలిగురి డివిజన్‍ 3నక్సల్‍బరి గ్రామం నుంచి మొదలైన ఈ ఉద్యమం క్రమంగా పశ్చిమబెంగాల్‍ ఇతర రాష్ట్రాలకు వ్యాపించింది. ఈ సాయుధ పోరాటానికి చారు మజుందార్‍, కాను సన్యాల్‍ నేతృత్వం వహించారు.

నార్మన్‍ బోర్లాగ్‍, ఎమ్మెస్‍ స్వామినాథన్‍ల నాయకత్వంలో భారతదేశం 1966లో తొలి హరిత విప్తవానికి నాంది పలికింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, మెరుగైన సాగు విధానాలతో దేశం ధాన్యం ఉత్పత్తిలో స్వావలంబన సాధించింది.

1966లో తాష్కెంట్‍లో అప్పటి ప్రధాని లాల్‍బహదూర్‍ శాస్త్రి మరణించిన తరువాత భారతదేశపు తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ బాధ్యతలు చేపట్టారు. అప్పుడామె దేశానికి మూడో ప్రధాని.

1965, ఆగస్టులో భారత్‍పై పాకిస్థాన్‍ దాడి చేసింది. కశ్మీర్‍లో భారత వ్యతిరేక వాతావరణం సృష్టించడానికి పాకిస్తాన్‍ మొదట చొరబాటుదారులను పంపింది. తరువాత సెప్టెంబర్‍ 1న భారత్‍పై దాడికి దిగింది. మూడు వారాల తరువాత యూఎన్‍ జోక్యంతో యుద్ధం ఆగింది. ఈ యుద్ధంలో భారత్‍ పైచేయి సాధించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట భాక్రానంగల్‍. సట్లెజ్‍ నదిపై ఈ డ్యామ్‍ నిర్మాణ పనులు 1954లో మొదలయ్యాయి. 1963 నాటికి పూర్తయ్యాయి. 680 అడగుల ఎత్తయిన ఈ ఆనకట్టను ‘ఆధునిక భారత దేవాలయం’గా మన దేశ తొలి ప్రధాని నెహ్రూ అభివర్ణించారు

1962, అక్టోబర్‍ 19న చైనా సైన్యం తూర్పు, పశ్చిమ సెక్టార్ల మీదుగా భారత్‍పై దాడి చేసింది. చైనా దగ్గరున్న మెరుగైన ఆయుధాలు, సైనిక బలగం ఎక్కువగా ఉన్న కారణంగా భారత్‍ ఈ యుద్ధంలో ఓడిపోయింది.

పోర్చుగీసు వారి ఆధీనంలోనే గోవా దాదాపు 451 ఏళ్లపాటు ఉండిపోయింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఇది మన దేశంలో అంతర్భాగం కాలేదు. చివరకు, 1961 డిసెంబర్‍ 19న భారత సైన్యం పోర్చుగీసు పాలనలో ఉన్న గోవా, డయూ, డామన్‍లను ఆక్రమించుకుంది. ఆ విధంగా పోర్చుగల్‍ పాలన నుంచి గోవా విముక్తి పొందింది.

భారతదేశంలో 1959, సెప్టెంబర్‍ 15న తొలిసారిగా టెలివిజన్‍ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. దిల్లీలో తొలి దూరదర్శన్‍ కేంద్రం ఏర్పాటైంది.

1957, ఏప్రిల్‍లో భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్నికల్లో గెలిచి కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే ఎన్నికల పక్రియ ద్వారా ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం ఇది. ఈఎంఎస్‍ నంబూద్రిపాద్‍ తొలి కమ్యూనిస్టు ముఖ్యమంత్రి అయ్యారు.

ఆసియాలోనే తొలి అణు రియాక్టర్‍ ‘అప్సర’ ముంబయి శివారులోని ట్రాంబేలో 1956, ఆగస్టు 4న ఏర్పాటైంది. భారత అణు పరిశోధనలకు ఇది పునాదిగా నిలిచింది. దీని ఏర్పాటుకు హోమీ జే బాబా కీలకంగా వ్యవహరించారు.

1954, ఏప్రిల్‍ 29న భారత్‍ – చైనా పంచశీల ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఐదేళ్ల పాటు ఇరు దేశాలూ ఈ ఒప్పందాన్ని పాటించాయి. ఈ ఒప్పందం నేపథ్యంలోనే ‘హిందీ చీనీ భాయి భాయి’ అనే నినాదం పుట్టింది.

చిప్కో ఉద్యమానికి ఆద్యుడు సుందర్‍లాల్‍ బహుగుణ. ఈయన ప్రముఖ పర్యావరణవేత్త. 1973లో ఉత్తరప్రదేశ్‍లోని పర్వత ప్రాంతాల్లో చెట్లు కొట్టేందుకు ఒక స్పోర్టస్ కంపెనీ వచ్చినపుడు స్థానికులు దాన్ని వ్యతిరేకించి, ఉద్యమించారు. ఇదే సుందర్‍లాల్‍ బహుగుణ నేతృత్వంలో చిప్కో ఉద్యమంగా మారింది. దీంతో ఆ ప్రాంతంలో చెట్లు కొట్టడాన్ని ఉత్తరప్రదేశ్‍ ప్రభుత్వం నిషేధించింది.

Review స్వాతంత్య్ర దీప్తి వజ్రోత్సవ కీర్తి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top