
బీజేపీ మళ్లీ గెలిచింది.. మిత్రపక్షాల సాయంతో నిలిచింది. కాంగ్రెస్ సవాల్ విసిరినా.. సమాజ్‍వాదీ పార్టీ యూపీలో దెబ్బతీసినా.. తృణమూల్ సత్తా చాటినా.. డీఎంకే ధీటుగా నిలిచినా.. ఐదేళ్ల కిందటి స్థాయిలో కాకున్నా.. అఖండ మెజారిటీ రాకున్నా.. భారతీయ జనతా పార్టీ మళ్లీ గెలిచింది.. నిలిచింది. ఆంధప్రదేశ్‍లో అపూర్వ విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అండతో, బిహార్‍లో భుజం కలిపిన జేడీయూ మద్దతుతో, శివసేన (శిందే) సహకారంతో, ఎల్‍జేపీ (రాంవిలాస్) చేయూతతో ‘కమలనాథులు’ మళ్లీ ప్రధాని పీఠంపై జెండా ఎగురవేసింది.
ఫలితంగా జూన్ 9న..
ఏడు దేశాల అధినేతల సాక్షిగా..
భారత మాజీ రాష్ట్రపతులు, వివిధ రంగాలు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సినీ తారలు, మత గురువులు, పారిశుద్ధ కార్మికులు, వందేభారత్ లోకోపైలట్లు, ఇంకా సమాజంలోని వివిధ వర్గాల వారి సమక్షంలో భారత దేశ ప్రధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ జూన్ 9న ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిష్టించిన ఘనతను సాధించారు. రాష్ట్రపతి భవన్‍లో అట్టహాసంగా జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మోదీతో ప్రమాణం చేయించారు. దాదాపు తొమ్మిది వేల మంది ఆహ్వానితులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జవహర్‍లాల్ నెహ్రూ తరువాత దేశంలో వరుసగా మూడోసారి ప్రధాని అయిన ఘనతను 73 సంవత్సరాల మోదీ సాధించారు. ఆయన సారథ్యంలో వరుసగా 2014, 2019, 2014లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటైంది.
మోదీ.. ఏకంగా 71 మందిని కేంద్రమంతులుగా నియమించారు. వీరిలో 30 మందికి కేబినెట్ హోదా. ఐదుగురు స్వతంత్ర హోదాలో ఉంటారు. మిగతా 36 మంది సహాయ మంత్రులు. ఈసారి మన తెలుగువారు ఐదుగురికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడం విశేషం.
కూటమి బలంతో పీఠంపైకి..
‘140 కోట్ల మంది ఆశీస్సులతో నా విజయయాత్ర అప్రతిహతంగా కొనసాగి తీరుతుంది’ అని 2024 ఎన్నికలకు ముందు మోదీ అంతులేని ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. కానీ, ఈ ఎన్నికల్లో బీజేపీకి ఏకపక్ష విజయం సిద్ధించలేదు. లోక్‍సభలో ఏ పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టలేదు. బీజేపీ ఈ ఎన్నికల్లో 240 సీట్లు సొంతంగా సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీకి కొద్ది దూరంలోనే ఆగిపోయింది. అయితేనేం.. కూటమిలో టీడీపీ, జేడీ(యూ) తదితర పక్షాల సహకారంతో 293 సీట్ల బలంతో మోదీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. తొలిసారి సంకీర్ణ సర్కారుకు సారథ్యం వహిస్తున్న మోదీ.. మిత్రపక్షాలను కలుపుకుని ఎంతవరకు భారత్‍ను పరుగులు తీయించగలరనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. గడిచిన రెండు లోక్‍సభల్లో స్పష్టమైన మెజారిటీ ఉండటంతో బీజేపీ తన అధికార పక్ష ఎజెండాను అమలు చేసే విషయంలో పెద్దగా అవరోధాలనేమీ ఎదుర్కోలేదు. లోతైన చర్చ లేకుండానే అనేక బిల్లులు చట్టరూపం దాల్చాయి. అయితే, కాంగ్రెస్.. ‘ఇండియా’ పేరుతో కూటమి కట్టి చెప్పుకోదగ్గ ఫలితాలనే సాధించింది. కాంగ్రెస్ సొంతంగా 99 స్థానాల్లో గెలుపొందింది. మిత్రపక్షాల బలం కలుపుకుంటే ‘ఇండియా కూటమి’ చేతిలో 234 స్థానాలున్నాయి. దీంతో లోక్‍సభలో బీజేపీ తన మాట నెగ్గించుకునే విషయం నల్లేరుపై నడక కాదనేది రాజకీయ పండితుల మాట.
ఎదురుగా ఎన్నెన్నో సవాళ్లు
భారత్ ఈ పదేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందింది. అభివృద్ధి లెక్కలకు, ప్రజల నిజ జీవన స్థితిగతులకు మధ్య పొంతన లేకుండాపోయింది. జనాభాలోని ఒక శాతం మంది దగ్గరే అత్యధిక భాగం పోగుపడుతున్న వైనం ఆందోళన కలిగించే అంశం. కోవిడ్ తరువాత భారతీయుల జీవన ప్రమాణాలు పడిపోయాయి. గత మార్చిలో 7.4 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు ఏప్రిల్‍కు వచ్చేసరికి 8.1కి చేరినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అధ్యయనం చెబుతోంది.
అలాగే, జనవరి – మార్చి త్రైమాసికంలో పట్టణ భారత యువతలో నిరుద్యోగం 17 శాతానికి పెరిగినట్టు ప్రభుత్వ అంచనాలే చెబుతున్నాయి. అభివృద్ధి విధానాలు ఉద్యోగాల సృష్టికి అక్కరకు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో కొత్త సర్కారు ఈ సవాళ్లను అధిగమించే తీరుపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పొరుగు దేశాలే ముందు..
మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏడు దేశాల అధినేతలు హాజరయ్యారు. ‘పొరుగు దేశాలే ముందు..’ అనే భారత విదేశీ విధానానికి అనుగుణంగానే వీరిని ఆహ్వానించినట్టు విదేశాంగ నిపుణులు చెబుతున్నారు. మోదీ తొలిసారి ప్రధాని అయినపుడు సార్క్ దేశాల అధినేతలను కార్యక్రమానికి ఆహ్వానించారు. రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు బిమ్స్టెక్ దేశాధినేతలు వచ్చారు. ఈసారి కొన్ని పొరుగు దేశాలు, హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న దేశాధినేతలను ఆహ్వానించారు.
కొత్త కేబినెట్‍కు టీ పార్టీ
మంత్రివర్గంలోకి తీసుకున్న వారితో ప్రధాని మోదీ తొలిసారిగా భేటీ అయ్యారు. వారికి తేనీటి విందునిచ్చారు. వినయంగా ఉన్న వారినే సామాన్యులు ఇష్టపడతారన్న విషయాన్ని మరిచిపోవద్దని సహచరులకు మోదీ హితవు చెప్పారు. నిజాయతీగా, పారదర్శకంగా వ్యవహరించాలనీ, ప్రజల నుంచి ఆశలు, ఆకాంక్షలు ఎక్కువగా ఉన్నందున దానికి తగ్గట్టుగా పనిచేయాలని సూచించారు. కాగా, కేంద్ర మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కుడు మన ఏపీకి చెందిన కింజారపు రామ్మోహన్ నాయుడు (36) కాగా, బిహార్‍లోని గయా నుంచి ఎన్నికైన జితన్‍రామ్ మాంఝీ• 79 ఏళ్ల అతి పెద్ద వయస్కుడిగా నిలిచారు.
కార్మికుల ఆనందం..
మోదీ ప్రమాణ స్వీకారానికి అనేక మంది సామాన్యులనూ ఆహ్వానించారు. వీరిలో సహాయ లోకోపైలట్లలో తెలుగు వారైన నక్కా ప్రకాశ్ (దక్షిణ
మోదీ మూడోసారి.. నెహ్రూ రికార్డు సరి
భారత ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్‍దాస్ మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా వరుసగా రెండుసార్లు పదవిలో ఉండి, మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం కేవలం భారత్‍లోనే కాదు.. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దేశాల్లోనూ రికార్డే. ఒక అధ్యయనం ప్రకారం.. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రజాస్వామ్య ప్రపంచంలో ఇలా వరుసగా మూడోసారి గెలుపొంది, ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏకైక నేత మోదీయే కావడం గమనార్హం. గత రెండు పర్యాయాలతో పాటు మూడోసారి కూడా స్థిరమైన ఓటు శాతంతో ఎన్నికల్లో గెలిచిన నాయకులు మరెవరూ లేకపోవడం గమనార్హం. భారతదేశ ప్రజలు తొలి ప్రధాని నెహ్రూపై అచంచెల విశ్వాసం చూపారు. ఆయనను వరుసగా మూడుసార్లు గెలిపించారు. వరుసగా 1952, 1957, 1962 ఎన్నికల్లో నెహ్రూ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఆ తర్వాత మరే ప్రధానీ ఈ ఘనత సాధించలేదు. తాజాగా నరేంద్రమోదీ ఆ రికార్డును సమం చేశారు.
నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా..
ఆరెస్సెస్, ఆ తర్వాత 1985 నుంచి బీజేపీతో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన మోదీ.. అంచలంచెలుగా ఎదిగారు. 2001లో తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత 2012 వరకు తన నేతృత్వంలో గుజరాత్‍లో నాలుగుసార్లు బీజేపీ ప్రభుత్వాలను గద్దెనెక్కించారు. 2014లో ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగి.. బీజేపీకి ఘన విజయాన్ని సాధించిపెట్టారు. 2019లో, తాజాగా 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమిని విజయతీరాలకు చేర్చి హ్యాట్రిక్ కొట్టారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా మూడో విడత పాలనలో తనదైన కార్యాచరణతో దూసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ఆ ఘనత సాధించిన ప్రధానిగా..
2014 ఎన్నికల్లో మోదీ జాతీయస్థాయిలో కమలం పార్టీకి సంపూర్ణ మెజారిటీ సాధించిపెట్టారు. 1984 తరువాత ఆ ఘనత సాధించిన తొలి ప్రధానికి గుర్తింపు పొందారు. 2014లో టైమ్ మేగజైన్ పాఠకుల పోల్‍లో ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే జమ్మూకశ్మీర్‍లో ‘ఆర్టికల్ 370’ని రద్దు చేశారు. సీఏఏ, ట్రిపుల్ తలాక్ రద్దు, కొవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ, అయోధ్యలో రామమందిర నిర్మాణం, కొత్త పార్లమెంటు భవనం, మహిళా రిజర్వేషన్లకు ఆమోదం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
‘2024’ ఎంపీలు.. ప్రత్యేకతలు
18వ లోక్‍సభకు ఎన్నికైన ఎంపీల వయసు, వృత్తి, విద్య ఇతర వివరాలు
• వేర్వేరు పార్టీలు మారిన 9 మంది ఈసారి తిరిగి లోక్‍సభ సభ్యులుగా ఎన్నికయ్యారు.
• ఎన్నికైన ఎంపీల్లో 48 శాతం మంది సామాజిక సేవ నేపథ్యం గలవారు.
• వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చిన వారు 37 శాతం మంది.
• వ్యాపార, వాణిజ్య రంగాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు 32 శాతం మంది ఉన్నారు.
• న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లో ప్రవేశించి గెలుపొందిన వారు 7 శాతం మంది.
• వైద్యవృత్తి నుంచి వచ్చి.. 4 శాతం మంది ఎంపీలుగా గెలుపొందారు.
• వినోదం, కళా రంగాల నుంచి ఎన్నికైన వారు 3 శాతం.
• విద్య, ఉపాధ్యాయ వృత్తి నేపథ్యం గలవారు 3 శాతం మంది ఉన్నారు.
• ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసి.. పదవీ విరమణ అనంతరం రాజకీయాల్లో ప్రవేశించి ఎంపీగా పోటీచేసి విజయం సాధించిన వారు 2 శాతం మంది ఉన్నారు.
ఎంపీలుగా అనుభవం..
• మొత్తం గెలుపొందిన వారిలో 262 మంది ఎంపీలు గతంలో లోక్‍సభ సభ్యులుగా సేవలందించిన వారే..
• ఈసారి ఎన్నికల్లో గెలుపొందిన వారిలో సిట్టింగ్ ఎంపీలు 216 మంది.
మొదటిసారి ఎంపీలుగా..
• 2024 లోక్‍సభ ఎన్నికల్లో ఏకంగా 280 మంది మొదటిసారి ఎంపీలుగా గెలుపొందిన వారే.
• ఒకసారి ఎంపీగా గెలుపొందిన వారు 116 మంది, రెండోసారి ఎంపీగా గెలుపొందిన వారు 74 మంది, మూడోసారి ఎంపీగా 35 మంది, నాలుగోసారి ఎంపీగా 19 మంది, ఐదోసారి 10 మంది, ఆరోసారి ఏడుగురు, ఏడోసారి ఒకరు ఎంపీగా గెలుపొందిన వారిలో ఉన్నారు.
ఎంపీల్లో విద్యావంతులు
• 18వ లోక్‍సభలో 78 శాతం మంది కనీసం అండర్ గ్రాడ్యుయేట్లు.
• 25 శాతం మంది ఉన్నత మాధ్యమిక విద్యావంతులు.
• 50 శాతం మంది గ్రాడ్యుయేట్లు.
• 75 శాతం మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు.
• ఇంకా డాక్టొరల్ డిగ్రీ ఉన్నవారు కూడా ఎంపీల్లో ఉన్నారు.
ఎంపీలు – వయసులు
• 17వ లోక్‍సభకు ఎన్నికైన వారిలో గరిష్ట వయసు 59 సంవత్సరాలు కాగా, 18వ లోక్‍సభలో ఎంపీలుగా ఎన్నికైన వారి గరిష్ట వయసు 56 సంవత్సరాలుగా ఉంది.
భారత ప్రధానులు – పదవీ కాలాలు
జవహర్‍లాల్ నెహ్రూ 1947-64
లాల్‍బహదూర్ శాస్త్రి 1964-66
ఇందిరాగాంధీ 1966-77
మొరార్జీ దేశాయ్ 1977-79
చరణ్‍సింగ్ 1979-80
ఇందిరాగాంధీ 1980-84
రాజీవ్‍గాంధీ 1984-89
వీపీ సింగ్ 1989-90
చంద్రశేఖర్ 1990-91
పీవీ నరసింహారావు 1991-96
అటల్‍బిహారీ వాజ్‍పేయి 1996-96
హెచ్‍డీ దేవెగౌడ 1996-97
ఇందర్‍కుమార్ గుజ్రాల్ 1997-98
అటల్‍బిహారీ వాజ్‍పేయి 1998-’04
మన్మోహన్‍సింగ్ 2004-14
నరేంద్రమోదీ 2014-
రామోజీరావు యశస్సు
నిత్య నవోదయ ఉషస్సు
పాత్రికేయానికి నడక నేర్పిన.. తెలుగుతేజమై నిత్యస్ఫూర్తిని నింపిన అక్షర సూరీడు అస్తమించాడు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) జూలై 5న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ జూలై 8, తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కుటుంబసభ్యులు ఆయన మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం రామోజీ ఫిల్మ్సిటీలో ఉంచారు. జూలై 9న తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ముగిశాయి.
పుట్టిన నేల కోసం..
చుట్టూ ఉన్న సమాజం కోసం..
గట్టి మేలు తలపెట్టాలనే దృఢ సంకల్పం..
అందుకోసం నిరంతర శ్రమ.. కొత్తదనం కోసం తపన.. నిజాయితీతో కూడిన వ్యాపారం..
చెక్కుచెదరని ఆత్మస్థైర్యం..
తొంభై ఏళ్ల జీవితంలో అరవై ఏళ్లకుపైగా ప్రజలతో కలిసి నడిచిన నిత్య కృషీవలుడు..
ఆయన పయనం తెలుగు వారి చరిత్రపై చెరగని పచ్చబొట్టు..
విశేషణాలకు అందనిది ఆయన వ్యక్తిత్వం..
ఆయనే అజేయుడు- చెరుకూరి రామోజీరావు.
ఆయన గురించి ఏమని చెప్పగలం? ఎంతని చెప్పగలం?
తెలుగువారి సామాజిక, రాజకీయ చరిత్ర ‘ఈనాడు’కు ముందు.. తరువాత అన్నంతగా ప్రభావితం చేసిన రాజర్షి.
విలువలు, క్రమశిక్షణతో జీవితాన్ని గడిపిన మార్గదర్శి..
వర్తమానాన్ని దాటి చూడగలిగిన దార్శనికుడు.
సవాళ్లకు ఎదురొడ్డి నిలిచి అనితరసాధ్య విజయాలు సాధించిన ధైర్యశాలి.
ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడిన యోధుడు.
నమ్మిన విలువల కోసం వ్యవస్థలనైనా ఢీకొట్టగలిగే ఆయన ధైర్యసాహసాలు అనన్య సామాన్యం.
పెదపారుపూడి పల్లెబిడ్డ సాధించని విజయాలు లేవు.. చూడని జీవితం లేదు.
రామోజీరావు జీవితం ఒక తెరిచిన పుస్తకం..
విజేతలుగా నిలవాలనుకునే వారికి అదో అమూల్యమైన వ్యక్తిత్వ వికాస పాఠం.. రోజూ సూర్యోదయానికి కంటే ముందే నిద్రలేచే ఆయన.. నిత్యం ఉషోదయంతో సత్య నినదించాలని తపించిన తపస్వి.. ఆ సూర్యోదయ వేళలోనే తుదిశ్వాస విడిచిన యశస్వి.. ఆయన ఎప్పటికీ తెలుగువెలుగులు పంచే మహామనీషి.. పుణ్యభూమిపై ఆయన చేయాల్సిందంతా చేశారు.. చేయించారు.. సాధించారు.. తరించారు.. లోకానికి ఇవ్వాల్సింది ఇచ్చేశారు.
‘ఆవిరి ఓడలో జలధి యానమొనర్చుచు బాటసారులు రేవులందు దిగిపోవుచునుందురు ఇంచుక వెన్కముందుగా.. అంటారు ఓ చోట మహాకవి గుర్రం జాషువా.
అది నిజం చేస్తూ తన రేవు రాగానే ‘నా రేవే వచ్చేసింది.. ఇక సెలవా మరి’ అంటూ మహాభినిష్క్రమణం చేశారు.
రామోజీది పరిపూర్ణ జీవితం. ఆయనను మరెవరితోనూ పోల్చలేం.. ఆ వెలితిని పూడ్చలేం.
విత్తనం చనిపోతుంది- మొక్కకు జీవం పోస్తూ..
మబ్బు కరిగిపోతుంది- చినుకును ప్రసాదిస్తూ..
సంజె జారిపోతుంది- వేకువకు హామీ ఇస్తూ..
రామోజీ వెళ్లిపోయారు.. మన గుండెల్లో జీవిస్తూ.. జ్ఞాపకాల్లో పలకరిస్తూ.. చరిత్రలో శాశ్వతంగా నిలుస్తూ..
ఆయనది మరణం కాదు.. మహా నిర్యాణం.
విలువలే మూలస్తంభాలు అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చెరగని ముద్ర వేశారు రామోజీరావు. సాధించిన దానితో ఆగిపోక సరికొత్త లక్ష్యాల సాధనకు వడివడిగా అడుగులు వేసి అసంఖ్యాక ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.
నిత్యం ఉషోదయంతో సత్యం నినదించు గాక అంటూ తెలుగు వాకిళ్ల వెలుగు చుక్కలా ప్రభవించిన ‘ఈనాడు’, క్షణక్షణం ఆనందవీక్షణం అందించే వినోదాల ప్రభంజనం ఈటీవీ, యావద్భారతానికి 13 భాషల్లో క్షణాల్లో వార్తలు అందించే డిజిటల్ విప్లవం ఈటీవీ భారత్.. దుక్కి దున్ని జాతి పట్టెడన్నం పెట్టే రైతన్నకు అండదండగా నిలిచిన ‘అన్నదాత’, ప్రపంచంలోనే అతి పెద్ద చిత్ర నిర్మాణ ప్రాంగణం రామోజీ ఫిలింసిటీ, తెలుగు రుచులను విశ్వవ్యాప్తం చేసిన ప్రియా పచ్చళ్లు, తెలుగుకు తేజాన్నిచ్చిన ‘తెలుగువెలుగు’.. అన్నీ ఆయన మానస పుత్రికలే.
1961లో వివాహానంతరం సతీమణి రమాదేవితో కలిసి రామోజీరావు ఢిల్లీకి మకాం మార్చారు. దక్షిణ ఢిల్లీ కరోల్‍బాగ్‍లో నివసించారు. ఢిల్లీలో తనను తాను ఆర్టిస్టుగా తీర్చిదిద్దుకున్నారు. కృషి ఉంటే ఘన ఫలితాలు తథ్యమనే నమ్మకం కుదిరాక అనేక విషయాల్లో ఆయనకు స్పష్టత ఏర్పడింది. ఫలితంగా తను చేసే పని పదిమందికీ ప్రయోజనకరంగా ఉండాలనే సంకల్పంతో, 1962లో పెద్దకుమారుడు కిరణ్ పుట్టిన తరువాత హైదరాబాద్ తిరిగి వచ్చారు
నమ్మకమే పెట్టుబడిగా ‘మార్గదర్శి’
1962లో నమ్మకమే పెట్టుబడిగా, విశ్వసనీయతే ఆలంబనగా ‘మార్గదర్శి చిట్‍ఫండ్స్’ సంస్థను స్థాపించారు. మార్గదర్శి తోడుంటే ఆనందం మీ వెంటే’ అనే నినాదం లక్షలాది ఖాతాదారులకు తారక మంత్రమైంది. వసూళ్లు, చెల్లింపుల్లో కచ్చితత్వంలో రామోజీ ముందుకు సాగారు. ఆర్థిక క్రమశిక్షణ, అంకితభావం, విశ్వసనీయత.. ఈ మూడూ మార్గదర్శికి మూడు మంత్రాక్షరాలు. 60 ఏళ్ల ప్రస్థానంలో 60 లక్షల మంది ఖాతాదారులకు సేవలు అందించే ఘనత దక్కించుకుంది.
అన్నదాతకు అండదండగా..
వ్యవసాయ కుటుంబంలో పుట్టి.. రైతుల కష్టాలను చూస్తూ పెరిగిన రామోజీరావు సాగుబడికి తనవంతు సాయం చేయాలని తలిచారు. ఫలితంగా ఆయన ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే- ‘అన్నదాత’ పత్రిక. 1969లో మీడియా రంగంలో ఇది రామోజీ తొలి అడుగు. రైతుల కోసం అప్పట్లో ఓ పత్రిక పెట్టడం సంచలనం. అలాంటి సాహసానికి ఒడిగట్టిన రామోజీ.. వ్యవసాయ వైజ్ఞానిక కేంద్రాలకు, కర్షకులకు మధ్య తిరుగులేని వారధిని నిర్మించారు.
సత్యమై నినదించిన ‘ఈనాడు’
1974చ ఆగస్టు 10న విశాఖ సాగరతీరంలో రామోజీరావు ప్రారంభించిన ‘ఈనాడు’ దినపత్రిక తెలుగనాట సంచలనం సృష్టించింది. ప్రజల పక్షాన అక్షరయుద్ధంగా ఆరంభమై.. నాలుగేళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా ఎదిగింది. సూర్యోదయానికి ముందే ఈనాడు పత్రిక ఇంటికి చేరేలా సరికొత్త వ్యవస్థను సృష్టించారు రామోజీ. తర్వాత కాలంలో ఇతర వార్తా పత్రికలూ ఇదే విధానాన్ని అనుసరించాయి. స్థానిక వార్తలకు పట్టం కడుతూ టాబ్లాయిడ్స్ యుగం ఆరంభమైంది కూడా ఈనాడుతోనే. ఈ సందర్భంగా తెలుగు వారికి ప్రతి అడుగులోనూ అండగా నిలుస్తూ అనేక ఉద్యమాలు చేపట్టి విజయయాత్ర చేసింది ఈనాడు. అలాగే, సితార సినీ పత్రిక, చతుర, విపుల సాహితీ పత్రికలు తెలుగు లోగిళ్లలో సరికొత్త చరిత్ర సృష్టించాయి.
భారతీయతను రుచి చూపించిన ‘ప్రియా’
రామోజీ ఆలోచనల విలక్షణతకు నిదర్శనం ప్రియా ఫుడ్స్. 1980 ఫిబ్రవరిలో ఈ సంస్థ ద్వారా భారతీయ సంప్రదాయ వంటకాల రుచుల్ని దేశదేశాలకు పరిచయం చేశారు. ఇదే రీతిలో ప్రారంభించిన డాల్ఫిన్ హోటల్స్ ఆతిథ్య రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
క్షణక్షణం ఆనందవీక్షణం- ఈటీవీ
టీవీ అంటే దూరదర్శన్ అని మాత్రమే తెలిసిన రోజుల్లో ఈటీవీతో బుల్లితెర అద్భుతాన్ని సృష్టించారు రామోజీరావు. 1995 ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల కోసం ఆరంభమైన ఈటీవీని అనతికాలంలోనే జాతీయస్థాయికి విస్తరించారు. ప్రాంతీయ భాషా ఛానళ్లకు పురుడుపోసింది ఈటీవీనే. ఇంకా దీనికి అనుబంధంగా అనేక వినోదాత్మక ఛానళ్లను ప్రారంభించారు. ప్రత్యేకించి ఈటీవీ కార్యక్రమాల్లో రామోజీకి బాగా ఇష్టమైనది- ‘పాడుతా తీయగా’. ఇప్పటికీ ఈ బుల్లితెర కార్యక్రమం ఆబాలగోపాలన్నీ అలరిస్తోంది. ఖతర్నాక్ కామెడీ షో అంటూ ఇంటింటా ‘జబర్దస్త్’గా నవ్వులు పూయిస్తోంది ఈటీవీ నెట్‍వర్క్.
సినీ మంత్రనగరి- రామోజీ ఫిల్మ్సిటీ
రామోజీ ఫిల్మ్సిటీ యావత్తు సినీ జగత్తు హైదరాబాద్ వైపు చూసేలా చేసింది. ఈ ఫిల్మ్సిటీ ప్రపంచంలోనే అతి పెద్దదిగా గిన్నిస్ రికార్డు సాధించింది. సినిమాల చిత్రీకరణకు ఇది వేదిక కావడమే కాక, దేశంలోనే అత్యంత ప్రజాదరణ గల పర్యాటక కేంద్రంగానూ వర్థిల్లుతోంది. ఉషా కిరణాలు.. ఆ సినిమాలు తారాబలం కాదు.. కథాబలంతో సినిమాలు నిర్మించారు రామోజీ. ‘శ్రీవారికి ప్రేమలేఖ’ ఆయన నిర్మించిన తొలి సినిమా. ‘చిత్రం’, ‘నువ్వేకావాలి’, ‘ఆనందం’, ‘నచ్చావులే’ వంటి సినిమాలను యువతరం అభిరుచికి అనుగుణంగా రూపొందించి ఆదరాభిమానాలను పొందారు. ఉషాకిరణ్ బ్యానర్‍లో వచ్చిన ‘ప్రతిఘటన’ అప్పట్లో ఓ సంచలనం.
‘అన్నదాత’ నుంచి ‘ఈనాడు ముందడుగు’ వరకు..
• చెరుకూరి రామోజీరావు నవంబర్ 16, 1936లో కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు.
• ఆగస్టు 19, 1961లో రమాదేవిని వివాహం చేసుకున్నారు.
• రామోజీరావు అసలు పేరు రామయ్య. రమాదేవి అసలు పేరు రమణమ్మ. ఇద్దరూ స్కూలులో చేరినపుడే పేర్లు మార్చుకోవడం గమనార్హం.
• 1962లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. మార్గదర్శి, కిరణ్ యాడ్స్, ఇమేజెస్ యాడ్స్, వసుంధర ఫెర్టిలైజర్స్ తదితర సంస్థలను నెలకొల్పారు. 1969లో ‘అన్నదాత’ మ్యాగజైన్ ప్రారంభించారు. అనంతరం ఎరువుల వ్యాపారం మానేశారు.
• జూన్ 21, 1980లో విశాఖపట్నంలో త్రీస్టార్ హోటల్‍గా డాల్ఫిన్ హోటల్‍ను ప్రారంభించారు. హైదరాబాద్‍లోని రామోజీ ఫిల్మ్సిటీలోని తార, సితార, శాంతినికేతన్, సహారా డాల్ఫిన్ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి.
• ఆగస్టు 10, 1974లో విశాఖపట్నంలో ‘ఈనాడు’ పత్రికను ప్రారంభించారు. 1975, డిసెంబర్ 17న హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 28, 1988లో సండే మ్యాగజైన్, జనవరి 26, 1989లో జిల్లా టాబ్లాయిడ్స్ మొదలయ్యాయి.
• 1976లో సినీ పత్రిక ‘సితార’ను ప్రారంభించారు. 1978లో నవలలు, కథలతో ‘చతుర’, ‘విపుల’ మాసపత్రికలను ప్రారంభించారు.
• జనవరి 26, 1984లో ‘న్యూస్‍టైమ్’ పేరుతో ఆంగ్ల దినపత్రికను తీసుకొచ్చారు. ఇది ఇరవై ఏళ్లపాటు నడిచింది.
• ఫిబ్రవరి 9, 1980లో తెలుగు వారి రుచులను ప్రపంచానికి చాటుతున్న ‘ప్రియా ఫుడ్స్’ను ప్రారంభించారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 50 వారాల పాటు ఆలిండియా రేడియోలో నాటికలు ప్రసారం చేశారు.
• రామోజీరావు స్వతహాగా కళాభిమాని. 1978లో వచ్చిన ‘మార్పు’ సినిమాలో న్యాయమూర్తిగా అతిథి పాత్రలో కనిపించారు. ఈ చిత్ర బృందం పోస్టర్‍పై ఆయన ఫొటోను ముద్రించింది.
• మార్చి 2, 1983లో ‘ఉషాకిరణ్ మూవీస్’ సంస్థను ఏర్పాటు చేశారు. వినోదాత్మక, సందేశాత్మక చిత్రాలు అందించే లక్ష్యంతో తొలి ప్రయత్నంగా ‘శ్రీవారికి ప్రేమలేఖ’ నిర్మించారు. అనంతరం ‘మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్’నీ ప్రారంభించారు.
• ‘ప్రతిఘాత్’, ‘పో ఒండ్రు పుయలందు’, ‘కరువంద నేరము’, ‘కంచాన్‍గంగ’ ‘నినగాగి’ వంటి హిందీ, ప్రాంతీయ భాషల్లోనూ కొన్ని సినిమాలు నిర్మించారు.
• 1980లో పాత్రికేయులకు శిక్షణ విషయంలో వ్యవస్థీకృత రూపం ఇచ్చేందుకు ఈనాడు జర్నలిజం స్కూలును ప్రారంభించారు. దీని ద్వారా ఎంతో మంది జర్నలిస్టులను తయారుచేశారు.
• నవంబర్ 16, 1992లో ‘కళాంజలి’ షోరూమ్‍ను ప్రారంభించారు. హృదయాలను హత్తుకునే హస్తకళలు, చేతివృత్తి కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంలో తరువాత కాలంలో ఈ షోరూమ్‍లను విజయవాడ, తిరుపతి, విశాఖపట్నానికి విస్తరించారు.
• 1995లో ‘ఈటీవీ’ బుల్లితెర ప్రయాణం మొదలైంది.
• 1999లో అంతర్జాలం వేదికగా వార్తలు అందించేందుకు •••.వవఅ•••.అవ• వెబ్‍సైట్‍ను ప్రారంభించారు.
• జూన్ 2, 2002న తన సతీమణి రమాదేవి పేరు మీద రామోజీ ఫిల్మ్సిటీకి సమీపంలో ‘రమాదేవి పబ్లిక్ స్కూల్’ను ఏర్పాటు చేశారు.
• 2002, జూలై తొలి వారంలో తెలుగు పాఠకుల కోసం ‘ఈనాడు’లో ఇంద్రధనస్సు వంటి ఏడు ప్రత్యేక పేజీల (చదువు, సుఖీభవ, ఛాంపియన్, ఈ-నాడు, సిరి, ఈతరం, హాయ్‍బుజ్జీ)ను ప్రవేశపెట్టారు. అదే ఏడాది సెప్టెంబరులో ‘ఈనాడు’ ఢిల్లీ ఎడిషన్ ప్రారంభమైంది.
• డిసెంబర్ 28, 2003న ‘ఈటీవీ-2’ ఛానల్ ప్రారంభించారు.
• జూలై 12, 2007న ఇంటర్నెట్‍లో ఈనాడు ఈ-పేపర్ మొదలైంది.
• ఏప్రిల్ 14, 2008న ‘ఈనాడు ముందడుగు’ విభాగం ఏర్పాటైంది. దీని ద్వారా ప్రజల్లో సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగించారు.
• ఇంకా.. రామోజీ అకాడమీ ఆఫ్ మూవీస్, ఈటీవీ భారత్, టీవీలోనే మరో 4 ఛానళ్లు, ఈ-ఎఫ్‍ఎం వంటివి ప్రారంభించారు.
• రామోజీ ఫౌండేషన్ పేరుతో కోట్ల రూపాయలు వెచ్చించి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.
• 2016లో రామోజీరావు అందించిన సేవలకు గాను పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు.
• 1994లో ‘కెప్టెన్ దుర్గాప్రసాద్’, 2001లో ‘బి.డి.గోయెంకా’, ‘యుధ్‍వీర్’ అవార్డులు వచ్చాయి.
• 1989లో ఎస్‍వీయూ నుంచి గౌరవ డాక్టరేట్, ఆంధ్ర విశ్వకళా పరిషత్ నుంచి డి.లిట్ అందుకున్నారు.
రామోజీ: జీవన సూత్రాల మార్గదర్శి
రామోజీరావు ఆచరించిన జీవనసూత్రాలు కోట్లమందికి మార్గదర్శకాలు. ఆయన జీవితమే ఓ ఆదర్శం అయితే.. ఆయన ఆచరించిన సూత్రాలు అందరికీ స్ఫూర్తిదాయకం.
• మన చుట్టూ ఉన్న ప్రపంచమే పెద్ద పాఠశాల. అందులో మంచి ఎక్కడున్నా, ఎవరి నుంచైనా స్వీకరించాలి.
• మనందరిలోనూ అపరిమితమైన శక్తి ఉంటుంది. దాన్ని తెలుసుకోవడంలోనే అంతా ఉంది. మనకేం కావాలో, ఏం వద్దో మన మనసే చెబుతుంది. గ్రహించగలిగే శక్తి ఉంటే, ఆ ప్రకారమే నడుచుకుంటే అంతా సవ్యంగానే ఉంటుంది.
• సాహసవంతులను, కార్యసాధకులను మాత్రమే విజయం వరిస్తుంది.
• సవాళ్లు లేని జీవితం నిస్సారం.
• క్రమశిక్షణ, కష్టపడటం, కలిసి పనిచేయడం.. ఇవే విజయానికి మూలసూత్రాలు.
• ఎంత చేయాలన్న దానికి పరిమితులు, కొలమానాలు లేవు. కావాల్సింది చేయాలన్న చిత్తశుద్ధి, చేసి చూపాలన్న దృఢదీక్ష మాత్రమే.
• గెలుపు సాధించడం కన్నా దాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం.
• ఏదో ఒకటి చేయాలన్న తపన, ఏదైనా సాధించినపుడు పొందే తృప్తి.. వీటిని మించిన ప్రోత్సాహకాలు లేవు.
• జర్నలిజం ఉద్యోగం కాదు.. ప్రజా సంక్షేమ జీవన విధానం.
• విమర్శను స్వీకరించకపోతే ప్రగతి లేదు.
• వెనక్కి తిరిగి చూసుకుంటే సంతృప్తిగా అనిపించని, కనిపించని జీవితం వృథా.
• ప్రతీదీ ప్రభుత్వమే చేయాలని దాదాపు ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. ఇది తమ అసమర్థతను పరోక్షంగా అంగీకరించడమే.
• కర్ర పెత్తనంతో భయపెట్టి సాధించగలిగేది ఏమీ లేదు. కోపంతో అదుపు తప్పే వ్యక్తి నాయకుడిగా ఎదగలేడు.
• శాస్త్ర పరిశోధనలకు పల్లె బతుకులే ముడిసరుకు కావాలి. గ్రామీణ జీవితమే ప్రయోగాలకు గీటురాయి కావాలి. గ్రామీణ విప్లవ సాధనకు ప్రతి శాస్త్రవేత్త ఒక సామాజికవేత్త కావాలి.
• పనిచేయడంలోనే నాకు విశ్రాంతి. విశ్రాంతి తీసుకోవడమే ‘కష్టమైన పని’.
• స్ఫూర్తి అనేది ఏ ఒకరిద్దరి నుంచీ కాదు.. మొత్తం సమాజం నుంచే పొందాలి.
• హాయి, సంతోషం అనేవి మానసిక స్థితులు. హాయిగా, సంతోషంగా ఉండటానికి డబ్బు అవసరమే కానీ డబ్బుతోనే సుఖసంతోషాలు లభిస్తాయనుకోవడం భ్రమ.
• నా విజయ రహస్యం- పని..పని.. పని.. కష్టపడి పనిచేయడమే!.
• పారదర్శకత, కలిసి పనిచేయడం, విలువల వ్యవస్థ.. ఇదే నా నిర్వహణ సిద్ధాంతం (మేనేజ్‍మెంట్ థియరీ).
ఆత్మబంధువులైన తెలుగువారితో రామోజీ పంచుకున్న
మనోభావాల మాలిక
కొన్నాళ్ల ముందు రామోజీరావు తన ఆత్మబంధువులైన తెలుగు వారిని ఉద్దేశించిన తన మనసులోని మాటలను పంచుకున్నారు. ఆ లేఖలోని ఆయన మనోభావాల మాలికలో నుంచి కొన్ని విశేషాలు..
నిత్య కృషీవలుడికి గెలుపుబాటలో అలుపన్నదే తెలియదు. ఆరు దశాబ్దాలకుపైగా పనే ప్రపంచంగా, బృహత్ లక్ష్యాలను సంకల్పిస్తూ, వాటి సాకారానికి తపిస్తూ, కాలచక్ర భ్రమణాన్ని అసలు పట్టించుకోని నేను- తొమ్మిది పదులు మీదపడ్డాయని గుర్తించనే లేదు. నేను- మీ రామోజీరావును!.
సమాజ శ్రేయం, సమష్టి హితం కోసం వృత్తిగతంగా తప్ప వ్యక్తిగతంగా ఏనాడూ మీతో సంభాషించని నేను- జీవనసంధ్య వేళ నా మనోభావాల్ని పంచుకోవాలనుకుంటున్నాను.
1936లో మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టి, మరి పాతికేళ్లకు వ్యాపార నిమిత్తం హైదరాబాద్‍లో కాలిడినపుడు నేను ఎవరన్నది నా వాళ్లకు మాత్రమే తెలుసు. అదే నేడు, మా వాడండూ నన్ను సమాదరిస్తున్నాయి మూడు తరాల తెలుగు లోగిళ్లు. ఎల్లలెరుగని ఆప్యాయత, అభిమానాలను దశాబ్దాల తరబడి పంచి, ఇంతై వటుడింతై అన్నట్టుగా నన్ను, నా సంస్థలను పెంచిన మీ ప్రేమాదరాలకు శిరసు వంచి ప్రణమిల్లుతున్నాను.
నీతి, నిజాయతీ, వృత్తి నిబద్ధతలకు ఆర్థిక క్రమశిక్షణను జోడించి, ఆ విలువలే మూలస్తంభాలుగా 1962లో మార్గదర్శి చిట్‍ఫండ్స్ సంస్థను నెలకొల్పాను.
వ్యవసాయ సాంకేతిక విజ్ఞాన ఫలాలు తెలుగు రైతులకు అందాలన్న తపనతో 1969లో ‘అన్నదాత’ను స్థాపించి, రైతే రాజు కాగల రోజును స్వప్నించాను.
ఆ తరువాత ఐదేళ్లకు నా చేతుల మీదుగానే నిత్యం ఉషోదయంతో సత్యం నినదించడమే లక్ష్యంగా ‘ఈనాడు’ ఆవిష్క•తమవుతుందన్న సంగతి నాకు తెలియదు. ‘ఈనాడు’ తెలుగు వారి చేతి పాశుపతమై దశాబ్దాల చరిత్ర గతినే తిరగరాసింది.
తక్కినవన్నీ వ్యాపారాలే అయినా.. ఈనాడు మాత్రం విశాల ప్రజాహిత సాధనం.
ఢిల్లీ అహంకారం మదమణిచి, మద్యనిషేధ మహాధ్యాయం నుంచి జల సంరక్షణోద్యమం దాకా, స్వచ్ఛభారత్ మొదలు నిన్నటి తెలుగుజాతి పునర్వికాస మహోధ్యమం దాకా తెలుగు వారి మేలుకోరి ప్రతి దశలో ‘ఈనాడు ’ క్రియాశీలంగా స్పందిస్తూనే ఉంది.
రామోజీ గ్రూప్ సంస్థలన్నీ తెలుగువారి బహుముఖ వికాసంతో ముడిపడినవే కావడం నాకు గర్వకారణం. అంతకుమించి, అచంచల విశ్వాసాన్ని నాపై ఉంచి, నా జీవితాన్ని వడ్డించిన విస్తరి చేసిన మీ ఔదార్యం వెలకట్టలేనిదన్నది నిజం.
‘ఈనాడు’ ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి నిరంకుశ ప్రభుత్వాలు పన్నిన కుయుక్తులను కాలదన్నిన మీతో నేను ముడివేసుకున్నది మాటలకందని రుణానుబంధం. నా తదనంతరం కూడా తెలుగు జాతి ప్రయోజనాల్ని కంటికి రెప్పలా కాచుకునేలా రామోజీ గ్రూప్ వ్యవస్థల్ని తీర్చిదిద్దడం- నేను మీ పట్ల పాటించనున్న కృతజ్ఞతా ధర్మం.
మందులకే కాదు, సమస్త ప్రాణులకూ ‘ఎక్స్పైరీ డేట్’ ఉంటుంది.
‘మరణం వెలుగును ఆర్పదు. ప్రాత:సంధ్య వచ్చిందంటూ ప్రాణదీపాన్ని బయట పెడుతుంది’ అంటారు విశ్వకవి. ఆ మాట నిజం. నేను లేకున్నా రామోజీ సంస్థలన్నీ తెలుగుజాతి తలలో నాల్కలా కొనసాగాలన్నది నా ఆశ, ఆకాంక్ష, మీరు నా పట్ల చూపిన అవ్యాజ అభిమానమే నా ఆశకు శ్వాస!.
ఇక సెలవు..
రామోజీరావు
కూటమిదే పీఠం..
చంద్రబాబే సీఎం
ఈ ఎన్నికల్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పవన్‍కల్యాణ్ తన మాట నెగ్గించుకున్నారు. వైసీపీని నిజంగానే అథపాతాళానికి తొక్కేశారు. తన పేరు నిలబెట్టుకున్నారు.
ఇదీ ఆంధప్రదేశ్ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జరిగిన మాటల యుద్ధాలు.. భీషణ ప్రతిజ్ఞల ప్రకటనలు.. కట్ చేస్తే..
సైకిల్ పరుగులుపెట్టింది..
గాజు గ్లాసు కడిగిన ముత్యంలా తళతళలాడింది..
ఫ్యాను రెక్కలిరిగి మూలనపడింది.
అధికార వైఎస్సార్‍సీపీ 11 సీట్లకే పరిమితమై.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ‘వై నాట్ 175’ నినాదం వట్టిపోయింది.
ఒకే మాటగా, ఒకే బాటగా ప్రజలు కూడబలుకున్నట్టుగా కూటమి వెంట నిలిచారు. కూటమి సృష్టించిన పెను తుఫాను దాటికి ఫ్యాన్ రెక్కలు ముక్కలయ్యాయి.
ఇక, చంద్రబాబు ‘మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతా’నని చేసిన ప్రతిన వర్కవుట్ అయ్యింది. అన్నట్టుగానే ఆయన సొంతంగా 135 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు.
ఏపీ అసెంబ్లీ, లోక్‍సభ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సునామీ సృష్టించింది. ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు యావత్తు ఆంధ్రావని మాకు వైసీపీ వద్దని ఓటుతో నినదించింది. సంక్షేమం పేరుతో డబ్బులు పెంచి.. అవే ఓట్లుగా మారతాయని భ్రమల్లో ఉండిపోయిన అధికార వైసీపీని ఓటర్లు ఈడ్చిపెట్టి కొట్టినంత పనిచేశారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి తావు లేదని చాటారు. 2019లో అసాధారణ మెజారిటీతో వైసీపీని అధికార పీఠంపై కూర్చోబెట్టిన ప్రజలే ఐదు సంవత్సరాలు తిరిగేసరికి కోలుకోలేని విధంగా దెబ్బతీశారు.
సైకిల్ ఎప్పుడూ ఇంటి బయటే ఉండాలి.
టీ గ్లాసు ఎప్పుడూ సింక్‍లోనే ఉండాలి.
ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి
– వైసీపీ అధినేత వైఎస్ జగన్‍మోహన్‍రెడ్డి
ఇది కౌరవసభ.. తిరిగి సీఎం అయ్యాకే మళ్లీ సభలో అడుగుపెడతాను..
– టీడీపీ అధినేత చంద్రబాబు
వైసీపీని అథపాతాళానికి తొక్కేస్తాను. లేదంటే నా పేరు పవన్‍కల్యాణే కాదు..
– జనసేన అధినేత పవన్‍కల్యాణ్
చెప్పినట్టుగానే, జూన్ 12న అతిరథ మహారథుల సమక్షంలో ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రిగా ‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను..’ అంటూ ఉద్వేగభరితంగా ప్రమాణ స్వీకారం చేశారు.
మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు గల ఆంధప్రదేశ్ శాసనసభలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి ఏకంగా 164 సీట్లు కట్టబెట్టారు. అలాగే, 25 లోక్‍సభ స్ధానాల్లో కూటమి 21 స్థానాలు దక్కించుకుంది. వైనాట్ 175 అంటూ అతి విశ్వాసాన్ని ప్రకటించి.. ముందు నుంచీ ఐప్యాక్, స్వజన సర్వేలను నమ్ముకుని భ్రమల్లో మునిగిన వైసీపీ కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏకంగా 8 ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ ఒక్కచోటా ఖాతా తెరవలేదు. ఇక, కూటమిలోని పార్టీలపరంగా చూస్తే.. టీడీపీ 135 స్థానాల్లో, జనసేన 21 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేశాయి. ఇక లోక్‍సభ స్థానాల్లో టీడీపీ 16, జనసేన 2, బీజేపీ 3, వైసీపీ 4 చోట్ల విజయం సాధించాయి.
జనం నమ్మారు..
బటన్ నొక్కడం మినహా ఈ ఐదేళ్లలో చెప్పుకోదగిన ఒక్క పనీ లేకపోవడం వైసీపీని చావుదెబ్బ తీసింది. బటన్ నొక్కడం ద్వారా పడిన డబ్బులే ఓట్లు కురిపిస్తాయని అతి విశ్వాసంతో ఆ పార్టీ పెట్టుకున్న నమ్మకం ప్రజల తీర్పుతో వమ్మయింది. అదే సమయంలో అనుభవానికి, దార్శనికతకు, చిత్తశుద్ధికి ప్రజలు పట్టం కట్టారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పిల్లలకు బంగారు భవిష్యత్తు కావాలన్నా ఎన్డీఏ కూటమి పార్టీలతోనే సాధ్యమని ప్రజలు నమ్మారు. రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక వనరులు, ప్రాథమిక వసతులు, పరిశ్రమలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, ఉపాధి అవకాశాలు లేకుండా
వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధప్రదేశ్‍ను తిరిగి దారిలో పెట్టే సామర్థ్యం, సత్తా చంద్రబాబుకే ఉన్నాయని రాష్ట్రం మొత్తం నమ్మింది. ఈ నమ్మకంతోనే ఆయనకు 2014లో ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. రాజధాని లేకుండా, చేతిలో పైసా లేకుండా మిగిలిన ఏపీని దారిలో పెట్టేందుకు చంద్రబాబు శక్తివంచన లేకుండా కష్టపడ్డారు. కియా వంటి పరిశ్రమలను రాష్ట్రానికి తెచ్చారు. ఐటీ పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం చేశారు. రాజధాని అమరావతిలో నిర్మాణాలను ప్రారంభించారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను రప్పించారు. ఇంతచేసినా, జగన్ ‘ఒక్క చాన్స్ ప్లీజ్’ అంటూ వేడుకోవడంతో 2019లో ప్రజలు నిజంగానే అవకాశం ఇచ్చారు. అయితే ఈ ఐదేళ్లలో నిర్మాణం కంటే నిర్వీర్యంపైనే వైసీపీ దృష్టి పెట్టింది. సంక్షేమం పేరుతో జనం ఖాతాల్లో డబ్బులు వేయడం మినహా మరే అభివృద్ధి పనీ చేపట్టలేదు. ప్రజలకు కూడా రాష్ట్రంలో పరిస్థితులు అర్థమయ్యాయి. రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టడం ఎన్డీఏ కూ•మి సారథ్యంలోని చంద్రబాబుకే సాధ్యమని విశ్వసించి అసాధారణ విజయాన్ని కట్టబెట్టారు.
2014లో టీడీపీ, బీజేపీ, జనసేన చేతులు కలిపినా.. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. ఈసారి మూడు పార్టీలు కలిసికట్టుగా బరిలోకి దిగాయి. ఎన్డీఏ కూటమిగా ఏర్పడి అనుకూల ఫలితాలను రాబట్టగలిగాయి. సాధారణంగా ఏపీ ఎన్నికల్లో ప్రజల తీర్పు రాయలసీమలో ఒకలా, ఉత్తరాంధ్రలో మరోలా, దక్షిణ కోస్తాలో ఇంకో విధంగా ఉంటూ
వచ్చింది ఇప్పటి వరకు. కానీ, ఈసారి మాత్రం నిశ్శబ్దంగా అల్లుకున్న ప్రభుత్వ వ్యతిరేకత ఒక్కసారిగా పెల్లుబుకింది. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీని తుడిచిపెట్టుకుని పోయేలా చేసింది. ఈసారి ఎన్నికలను చావోరేవోగా నిర్దేశించుకున్న వారంతా విదేశాల నుంచి సైతం ఏపీకి వచ్చారు. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వారంతా సొంత డబ్బులు ఖర్చుపెట్టుకుని మరీ రాష్ట్రానికి వచ్చి కూటమికి ఓట్లేశారు.
ఎన్డీఏ కూటమి ఉమ్మడి సమావేశం..
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం
టీడీపీ-జపసేన-బీజేపీ కూటమి శాసనసభా పక్షం సమావేశం జూన్ 11న విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్‍కల్యాణ్ ప్రకటించగా, మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ ఎన్నికల సమయంలో పవన్‍కల్యాణ్ ప్రదర్శించిన సమయస్ఫూర్తిని ఎన్నటికీ మరిచిపోనని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. ఆయన కూటమి మధ్య అద్భుతమైన సమన్వయాన్ని సాధించారని, అదే ఇంత పెద్ద విజయానికి నాంది పలికిందని అంటూ పవన్‍కల్యాణ్‍ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ‘స్టేట్ ఫస్ట్’ నినాదంతో వచ్చే ఐదేళ్లు పనిచేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుందని, ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామని కూడా చంద్రబాబు వెల్లడించారు. అలాగే పవన్‍కల్యాణ్ మాట్లాడుతూ, చంద్రబాబును అన్యాయంగా జైలులో పెట్టినపుడు ఆయన సతీమణి భువనేశ్వరి పడిన బాధను ప్రత్యక్షంగా చూశాను. మంచి రోజులు వస్తాయని ఓదార్చాను. ఇప్పటికి మంచి రోజులు వచ్చాయి అని అన్నారు. కాగా, కూటమి సీఎం అభ్యర్థిగా చంద్రబాబును ప్రకటించిన తీర్మానాన్ని గవర్నర్‍కు పంపగా, ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలికారు. దీంతో జూన్ 12న బుధవారం ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ఆంధప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇతర ఎన్డీఏ అగ్రనేతలు హాజరయ్యారు.
నాటి శపథమే.. నేడు విజయపథమైంది..
‘‘ఇన్నేళ్లూ పరువు కోసం బతికాను. అలాంటిదీ రోజు సభలో నా భార్య ప్రస్తావన తీసుకొచ్చి అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ. ఇలాంటి సభలో నేనుండను. మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతాను. లేకపోతే నాకు రాజకీయాలే వద్దు..’’
(2021, నవంబరు 19న అసెంబ్లీలో తనకెదురైన తీవ్ర అవమానం నేపథ్యంలో చంద్రబాబు చేసిన భీషణ ప్రతిజ్ఞ ఇది. ఆ రోజు నుంచీ ఈయన అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. ప్రజాక్షేత్రంలో వైస్సార్‍సీపీని మట్టికరిపించి తిరిగి సీఎంగానే సభలో అడుగుపెడుతున్నారు)
ఒక్కసారి తమిళనాడు, ఏపీల్లో ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే.. గతంలో ఎన్టీఆర్, జయలలిత, ఎంజీ రామచంద్రన్ కూడా అసెంబ్లీలో అవమానాలను ఎదుర్కొని మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతామని శపథాలు చేసిన సందర్భాలున్నాయి. చెప్పినట్టుగానే వారంతా ముఖ్యమంత్రులు అయ్యాకే శాసనసభ గడప తొక్కారు.
– 1993, ఆగస్టులో నాటి జమ్మలమడుగు టీడీపీ ఎమ్మెల్యే శివారెడ్డిని ప్రత్యర్థులు హతమార్చారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేతగా ఉన్న ఎన్టీఆర్ డిమాండ్ చేశారు. నాటి సీఎం కోట్ల విజయభాస్కర్‍రెడ్డి నిరాకరించారు. టీడీపీ సభ్యులు సభలో నిరసనకు దిగడంతో వారందరినీ సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన ఎన్టీఆర్.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం సభలో అడుగుపెట్టనని ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయారు. 1994 ఎన్నికల్లో మళ్లీ గెలిచిన తరువాతే ముఖ్యమంత్రిగా తిరిగి శాసనసభలో అడుగుపెట్టారు.
– 1989, మార్చి 25న తమిళనాడు శాసనసభలో అధికార డీఎంకే సభ్యులు ప్రతిపక్ష నేత జయలలిత చీర లాగారు. అవమానానికి గురైన జయలలిత.. సీఎంగానే సభలో అడుగుపెడతానని ప్రతిజ్ఞ చేసి బయటకు వెళ్లారు. 1991లో గెలిచాక సభలో అడుగిడారు.
– 1972లో అసెంబ్లీలో డీఎంకే సభ్యులు తనను తీవ్రంగా అవమానించడంతో ఎంజీ రామచంద్రన్ సభకు రానని ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయారు. ‘అసెంబ్లీ మరణించింది’ అని ఆనాడు ఆయన వ్యాఖ్యానించారు. 1977లో సీఎం అయ్యాక సభలో అడుగుపెట్టారు.
ఆ రెండు అవమానాలే..
2021, నవంబర్ 19: ఏపీ అసెంబ్లీలో అంబటి రాంబాబు.. చంద్రబాబు సతీమణిని కించపరుస్తూ మాట్లాడారు. తోటి సభ్యులు బల్లలు చరిచారు. వారిని వారించాల్సిన సీఎం జగన్ వంతపాడారు. ఈ తీరుతో తీవ్ర మనస్తాపం చెందిన చంద్రబాబు.. తన రాజకీయ జీవితంలో ఏనాడూ ఇలాంటి అవమానం ఎదురు కాలేదని విలపించారు. ‘ఇలాంటి సభలో నేనుండ’నంటూ బయటికి వచ్చేశారు. ‘రాజకీయాలతో సంబంధం లేని నా భార్యను అవమానిస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నీచంగా మాట్లాడిన ఈ సభ.. ఇక ఎంతమాత్రమూ గౌరవసభ కాదు.. అలాంటి కౌరవసభకు వెళ్లబోను’ అని చంద్రబాబు ప్రతినబూనారు. నాడు చంద్రబాబును ఆ స్థితిలో చూసిన పార్టీ సహచర సభ్యులే కాదు.. ఆంధప్రదేశ్ ప్రజలూ చలించిపోయారు.
2023, సెప్టెంబర్ 9: చంద్రబాబును ‘స్కిల్’ కేసులో ఉన్నఫళంగా, అవమానకర రీతిలో అరెస్టు చేసినపుడూ ప్రజల్లో ఒకవిధమైన సానుభూతి పుట్టింది. అన్నాళ్లూ స్తబ్ధుగా ఉన్న టీడీపీ శ్రేణులు రోడ్ల మీదకొచ్చి పోరాడాయి. ఈ రెండు అవమానాలతో పార్టీ, ప్రజల నుంచి పుట్టిన సానుభూతి.. వైస్సార్‍సీపీని కోలుకోలేని దెబ్బతీసింది.
‘కూటమి’ సునామీ
ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మరోసారి సూపర్‍హిట్ అయింది. 2014లో కూడా ఈ మూడు పార్టీలు కలిసి పనిచేశాయి. అయితే, ఈసారి మాత్రం అంతకుమించిన ఫలితాలను నమోదు చేశాయి. ప్రధాని మోదీ, టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్‍కల్యాణ్‍ల కలిసికట్టు ఎన్నికల ప్రచారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఠాన్ని సమూలంగా పెకలించి పారేసింది. కూటమిలోని అగ్రనేతల నుంచి కింది స్థాయి కార్యకర్తలు వరకు ఒకే మాట.. ఒకే బాటగా సాగడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోలేదు. దీంతో కూటమికి విజయం సునాయాసమైంది.
కూటమి మధ్య పొత్తు కుదిరే వ్యవహారం మొదట్లో అనేక మలుపులు తిరిగింది. స్థానిక ఎన్నికల సమయంలోనే టీడీపీ, జనసేన పొత్తుతో పనిచేసి.. చెప్పుకోదగిన ఫలితాలు సాధించాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడేసరికి ‘వైసీపీ విముక్త ఆంధప్రదేశ్’ నినాదంతో చంద్రబాబు, పవన్ చేతులు కలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టిపరిస్థితుల్లో చీలిపోరాదనే సంకేతాలను ముందు నుంచీ క్యాడర్‍కు ఇస్తూ వచ్చారు. ఇది బాగా పనిచేసింది.
ఇక, స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టుతో పొత్తు కొత్త మలుపు తిరిగింది.
జైలులో ఉన్న చంద్రబాబును కలిసిసేందుకు వెళ్లిన పవన్.. బయటకు వచ్చిన తరువాత ఎవరూ ఊహించని విధంగా పొత్తును ప్రకటించారు. బాబు అరెస్టుతో డీలా పడిన టీడీపీ క్యాడర్‍కు ఈ పొత్తు ప్రకటన ఊపిరిలూదింది. అక్కడి నుంచి కలిసిసాగిన పొత్తు పయనం.. ఇసుమంతైనా పొరపచ్చాలు లేకుండా చివరి వరకూ ఏకతాటిపై కొనసాగింది.
ఎన్నికల షెడ్యూలు విడుదలకు ముందు బీజేపీ కూడా కూటమిలో చేరింది. బీజేపీని కలుపుకునే విషయంలో పవన్‍కల్యాణ్ చేసిన కృషి తక్కువేం కాదు. ఢిల్లీ పెద్దలను ఒప్పించి, మూడు పార్టీలు కలిసి పనిచేసేందుకు అవసరమైతే తాను తగ్గుతానని ప్రకటించి, పొత్తులో భాగంగా జనసేనకు వచ్చే సీట్లలో కోత పడినా పవన్ లెక్కచేయలేదు. అలాగే, బీజేపీ తన •లానికి మించి ఎక్కువ సీట్లు అడిగినా విస్త్రత ప్రయోజనాల రీత్యా కాదనలేదు. ఈ క్రమంలో సీట్ల కేటాయింపులో అనేక చిక్కుముళ్లు పడినా అవేవీ కూటమి విజయాన్ని అడ్డుకోలేకపోయాయి.
ఏపీలో బీజేపీ పది అసెంబ్లీ, 6 లోక్‍సభ స్థానాల్లో పోటీచేసింది. ప్రధాని మోదీ అసాధారణ రీతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చంద్రబాబు, పవన్‍కల్యాణ్ అలుపెరగకుండా రాష్ట్రం మొత్తం తిరిగారు.
మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిన నాటి నుంచి అద్భుతమైన సయన్వయాన్ని సాధించాయి. ఎన్నికల ప్రచారం మొదలు సీట్ల సర్దుబాటు, మ్యానిఫెస్టో వంటి విషయంలో కలిసికట్టుగా ముందుకు వెళ్లాయి. జనసేన పోటీలో ఉన్న చోట చంద్రబాబు ప్రచారం చేశారు. టీడీపీ పోటీ చేస్తున్న స్థానాల్లో పవన్ ప్రచారం నిర్వహించారు. అలాగే బీజేపీ పోటీలో లేకున్నా చిలకలూరిపేటలో మోదీ ప్రచారం చేశారు. వీరు ముగ్గురూ కలిసి, చంద్రబాబు-పవన్ కలిసి, వేర్వేరుగా కూడా ఇలా పలురీతుల్లో ప్రచారం సాగించారు. దీంతో మూడు పార్టీల కేడర్ కలిసికట్టుగా పనిచేసేందుకు దోహదపడింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటులో చీలిక రాలేదు. ఫలితంగా వైఎస్సార్‍సీపీకి దారుణమైన భంగపాటు మిగిలింది.
ఎన్డీఏ శాసనసభపక్ష సమావేశంలో ఎవరెవరు ఏమన్నారంటే..
నా శపథాన్ని ప్రజలు నిలబెట్టారు
రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. నూటికి నూరు శాతం కూటమిలోని మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారు. ఎన్నికల్లో 93 శాతం సీట్లు గెలవడం దేశ చరిత్రలో అరుదు. ఈ ఎన్నికల్లో ప్రజలు 75 శాతం ఓట్లతో ఆశీర్వదించారు. నేను జైలులో ఉన్నపుడు పవన్‍కల్యాణ్ నన్ను పరామర్శించారు. ఆ క్షణంలోనే టీడీపీతో పొత్తు ప్రకటించారు. ఆయన సమయస్ఫూర్తిని ఎప్పటికీ మరువలేను. ఓటర్లు ఇచ్చిన తీర్పు రాష్ట్ర చరిత్రలో నిలుస్తుంది. పదవి వచ్చిందని విర్రవీగితే తిరిగి ఇదే పరిస్థితి వస్తుంది. తప్పు చేసిన వారిని క్షమిస్తే అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది.
– టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు
కలిసికట్టుగా ముందుకు..
రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమిలోని మూడు పార్టీలు కలిసి ముందుకు తీసుకెళ్లాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని చెప్పాం. అదే చేసి చూపించాం. సీట్ల విషయంలో కొంచెం తగ్గినా.. ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించాం. కక్షసాధింపులకు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదు. సాగు, తాగునీరు, విద్య, వైద్యం, శాంతిభద్రతల విషయంలో మా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఉమ్మడి మేనిఫెస్టోలోని హామీలను నెరవేరుస్తాం.
– జనసేన అధినేత పవన్‍కల్యాణ
పవన్ కాదు.. తుఫాన్
‘యే పవన్ నహీ.. అంధీ హై’
(అతడు పవన్ కాదు.. తుఫాన్)
– ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోదీ.. జనసేన అధినేత పవన్‍కల్యాణ్‍ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలివి.
మోదీ మాటలు నిజం! పవన్ తుఫానై ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్‍సీపీని కుదిపేశాడు. టీడీపీ, బీజేపీని కలపడం కోసం ఒకడుగు వెనక్కి వేసి.. కూటమిని నెగ్గించడం కోసం తాను కొన్ని సీట్లు త్యాగం చేసి.. తానన్నట్టే ‘వైసీపీని అథపాతాళానికి తొక్కేశా’డు.
నాడు నిలబడిన రెండుచోట్లా ఓడిపోయాడు..
నేడు నిలబెట్టిన అందరినీ గెలిపించాడు..
అందుకే ఏపీ ఎన్నికల్లో పవన్‍కల్యాణ్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’.
సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ పవన్‍కల్యాణ్ ‘పవర్’స్టార్ అయ్యారు. ‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలుసుకున్న వాళ్లే రాజకీయాల్లో హీరో’ అని నిరూపించారు. అవసరమైనపుడు అదిమిపెట్టలేని ఆవేశాన్ని ప్రదర్శించే పవన్.. అవసరమైనపుడు అంతులేని ఓర్పును ప్రదర్శించి ఆంధప్రదేశ్ రాజకీయ తెరపై ‘తార’లా నిలిచారు. అడుగడుగునా సవాళ్లు.. వైసీపీ వ్యక్తిగత విమర్శలు, దూషణలు.. అన్నిటినీ ధీటుగా ఎదుర్కొని.. నాడు తన అన్న చిరంజీవి సారథ్యంలో ఉమ్మడి ఏపీలో ప్రజారాజ్యం సాధించిన 18 స్థానాల కన్నా అధిక సీట్లు గెలుచుకుని జనం మనసుల్లో తన రాజకీయ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టాలనే తన కలను స్వశక్తితో సాకారం చేసుకున్నారు.
సామాన్యుల చేదోడుగా..
ప్రజారాజ్యం పార్టీ (పీఆర్‍పీ)లో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ 2009 ఎన్నికలకు ముందు రాజకీయాల్లో అడుగుపెట్టారు. నాటి ఎన్నికల్లో పీఆర్‍పీ 18 చోట్ల గెలుపొందింది. అనంతరం పరిణామాల్లో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‍లో విలీనం చేశారు. 2014లో రాష్ట్ర విభజన తరువాత తిరిగి పవన్ రాజకీయరంగ ప్రవేశం చేశారు. జనసేన పేరుతో పార్టీని స్థాపించి, 2014 ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయకున్నా, టీడీపీ-బీజేపీకి మద్దుతుగా నిలిచారు. విభజిత ఏపీకి చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడైన నేత అవసరమంటూ నాడు పవన్ ప్రచారం నిర్వహించారు. నాడు రాష్ట్రలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు తనవంతు పాత్ర పోషించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమిని వీడి బయటికి వచ్చిన పవన్.. కమ్యూనిస్టు పార్టీలతో పాటు బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఆ ఎన్నికల్లో 160కిపైగా స్థానాల్లో పోటీచేశారు. అయితే, పవన్ తాను పోటీచేసిన గాజువాక, భీమవరం.. ఈ రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. ఒక్క రాజోలు నుంచి మాత్రమే ఆ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఓటమిని సైతం తట్టుకుని కొద్ది రోజుల్లోనే మళ్లీ పోరాటం ప్రారంభించి 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ (21/21 అసెంబీ, 2/2 లోక్‍సభ)తో కనీవినీ ఎరుగని విజయాన్ని సాధించారు. సామాన్యుల ఆలోచనలకు తగ్గట్టే తాను నడుచుకుంటానని చెప్పే పవన్‍కల్యాణ్ జనం నాడి పట్టుకోవడంలో సఫలీకృతులయ్యారు.
పొత్తులు.. ఎత్తుగడలు
2019 ఎన్నికల్లో ఓటమి తరువాత బలమైన వైసీపీని ఎదురొడ్డి నిలవాలంటే పొత్తులతోనే సాధ్యమని పవన్ నమ్మారు. భవిష్యత్తు ముఖచిత్రాన్ని ముందే అంచనా వేసిన 2020 జనవరిలో బీజేపీతో పొత్తు ప్రకటించారు. ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ పెద్దలతో మాట్లాడి సంక్రాంతి వేళ బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు జనసేన అభిమాన గణం మొత్తం ఆయన వెంట నిలిచింది. ఒకవైపు పార్టీ క్రియాశీల సభ్యత్వాలు పెంచుకుంటూ, క్యాడర్‍కు శిక్షణనిస్తూనే మరోవైపు వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడారు. ప్రజారాజ్యం పార్టీ నాటి అనుభవాలతో జనసేన పార్టీ బలాబలాలు, బలహీనతలపై స్పష్టమైన అవగాహన ఉన్న పవన్‍కు 2019 ఎన్నికల ఫలితాలు మంచి అనుభవాన్ని అందించాయి. రాజకీయాలను చాలా దగ్గరగా పరిశీలిస్తూ వచ్చిన ఆయన ఎక్కడకు పర్యటనకు వెళ్లినా మధ్యతరగతి వర్గాలు, వివిధ వృత్తుల వారితో మాట్లాడుతూ, వారితో మమేకమవుతూ రాష్ట్ర పరిస్థితులపై ఒక అంచనాకు వచ్చారు. దేశంలోని అనేక రాజకీయ పార్టీలు ఉత్థాన పతనాలపై, వారి రాజకీయ సిద్ధాంతాలపై జనసేన అధిపతికి స్పష్టమైన అవగాహన ఉంది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రజాభిమానాన్ని కోల్పోయిందని ఆయన చాలా ముందుగానే అంచనా వేశారు.
అంతేకాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టిపరిస్థితుల్లో చీలిపోనివ్వనని 2021లో ఇప్పటంలో కీలక ప్రకటన చేశారు. ఆ పరిణామంతోనే రాష్ట్ర రాజకీయం కొత్త మలుపు తిరిగింది. విశాఖపట్నంలో పోలీసులు ఎటూ కదలనివ్వకుండా తనను నిర్బంధించినపుడు, ఇప్పటం గ్రామస్తులు జనసేన సభకు స్థలం ఇవ్వడంతో వారి ఇళ్లు కూల్చినపుడు, చంద్రబాబు అరెస్టు సమయంలో తాను మంగళగిరి వస్తుంటే రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు నిలువరించినపుడు పవన్ ఆవేశంతో స్పందించారు. రాజకీయాల్లో ఎప్పుడు ఎంత దూకుడు ప్రదర్శించాలో అంత దూకుడును ఆయన ప్రదర్శించారు.
పక్కా టైమింగ్‍తో..
చంద్రబాబు అరెస్టు సమయంలో రాజమండ్రి జైలులో ఆయనను పరామర్శించిన పవన్‍కల్యాణ్.. బయటకి వచ్చి ఎకాఎకిన టీడీపీతో పొత్తు ప్రకటించారు. నాటి ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమైంది. చంద్రబాబు అరెస్టుతో నిశ్శబ్దంగా వెల్లువెత్తిన ప్రజాగ్రహాన్ని సరిగ్గా గుర్తించి.. జనసేప అధిపతి తీసుకున్న నిర్ణయం రాజకీయ ఉద్ధండులను ఆశ్చర్యపరిచింది. బీజేపీతో సంబంధం లేకుండానే నాడు తెలుగుదేశం పార్టీతో పవన్ పొత్తు ప్రకటించారు. అనంతరం బీజేపీని కూడా దగ్గరకు చేసుకునేందుకు పవన్ చాలా ఎత్తులు వేయాల్సి వచ్చింది. అటు ఢిల్లీలో ఆ పార్టీ పెద్దలను కలుస్తూ.. ఇటు విజయవాడ కేంద్రంగా రాజకీయాలు నడిపారు. తొలుత జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్‍సభ స్థానాలు ఇచ్చేలా టీడీపీతో అవగాహన కుదిరింది. బీజేపీ కూడా పూర్తి స్థాయిలో టీడీపీ-జనసేనతో జట్టు కట్టేందుకు ముందుకు రావడంతో వారి డిమాండ్లు నెరవేర్చేందుకు పవన్ 3 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‍సభ స్థానాన్ని త్యాగం చేశారు. చివరకు తన సోదరుడు నాగబాబు పోటీ చేయాలనుకున్న అనకాపల్లి లోక్‍సభ స్థానాన్ని బీజేపీ కోసం వదులుకున్నారు. కేవలం 21 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన విషయంలో
ఇంటా, బయటా విమర్శలు వచ్చినా లెక్కచేయలేదు. ఎందుకంటే కూటమి సాధించబోయే సునామీ విజయంపై
ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. ఫలితంగా పోటీచేసిన అన్ని స్థానాల్లో
వంద శాతం విజయం సాధించింది పవన్‍కల్యాణ్ జనసేన.
జనం మనసు గెలిచిన జనసేనాని
‘ఎన్ని సీట్లలో పోటీచేస్తున్నామనేది ముఖ్యం కాదు.. పోటీ చేసే అన్నిచోట్లా వంద శాతం స్ట్రైక్ రేట్ సాధిస్తున్నామా లేదా? అనేదే ముఖ్యం’ అని ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్‍కల్యాణ్ ప్రకటించారు. అన్నట్టుగానే టీడీపీ-బీజేపీతో కలిసి పొత్తులో భాగంగా పోటీచేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ పవన్‍కల్యాణ్ జనసేన సంచలన విజయాన్ని నమోదు చేసింది.
అధికార వైసీపీ రాష్ట్రంలోని 175 స్థానాల్లో పోటీచేసి కేవలం 11 చోట్ల మాత్రమే గెలుపొందితే, 21 సీట్లలో పోటీ చేసిన జనసేన అన్నింట్లోనూ గెలిచి సత్తా చాటింది. అలాగే 2 పార్లమెంటు స్థానాల్లోనే జయకేతనం ఎగురవేసింది. ఏపీ శానసనభలో టీడీపీ తరువాత అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా జనసేన అవతరించింది. ఈ అసమాన విజయంతో పవన్‍కల్యాణ్ రాజకీయాల్లోనూ ‘పవర్‍స్టార్’గా నిలిచారు. ఈ ఎన్నికల్లో సాధించిన విజయంతో ఎన్నికల సంఘం జనసేన పార్టీకి శాశ్వతంగా గాజు గ్లాసు గుర్తును కేటాయించనుండటం మరో విజయం. తొలి నుంచీ జనసేనకు ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఈసారి ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు, రాయలసీమ జిల్లాల్లోనూ ఆ పార్టీకి ఓటర్లు జవసత్వాలనిచ్చారు.
పిఠాపురం స్థానం నుంచి పవన్ 70,354 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. తొలి నుంచి పార్టీనే అంటిపెట్టుకుని ఉండి కీలకంగా వ్యవహరించిన నాదెండ్ల మనోహర్ తెనాలి స్థానం నుంచి గెలుపొందారు.
వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పవన్ పోరాట పంథాలో దూసుకెళ్లారు. రాజధాని అమరావతిలో నిర్మాణాలు నిలిపివేయడంపై ఆగ్రహించారు. కౌలు రైతులకు బాసటగా నిలిచి ఆయా కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచారు. జగన్ వంద రోజుల పాలనా వైఫల్యాలపై 33 పేజీల పుస్తకాన్ని విడుదల చేశారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులపై విశాఖలో లాంగ్‍మార్చ్ నిర్వహించి ప్రజా సమస్యలపై ఎలుగెత్తారు. డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు, రైతు సౌభాగ్య దీక్షలతో కార్యక్రమాలను పదునెక్కించారు. అమరావతి పోరాటంలో పవన్‍ది కీలకపాత్ర. పోలీసులు కంచెలు వేసినా.. కాలినడకన పర్యటించారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఐదేళ్ల పోరాటం, రాజకీయ నిర్ణయాలు చివరకు జనసేనకు ఈ స్థాయి విజయాన్ని అందించాయి.
Review హ్యాట్రిక్ ప్రధాని.. మోదీ 3.0.