సినీ పరిశ్రమ ప్రతి శుక్రవారం తన తలరాతను తిరగరాసుకుంటుంటుంది. ప్రతి శుక్రవారం విడుదలయ్యే సినిమా ఏ హీరోను ఏ స్థాయిలో నిలబెడుతుందో తెలియదు. ఉదయం కల్లా జాతకం తేలిపోతుంది. ఊహించని విజయాలు కొందరివి.. అనూహ్యమైన పరాజయాలు మరికొందరివి.. మళ్లీ శుక్రవారం వరకు అంతే.. అందుకే ప్రతి శుక్రవారం కోసం అటు హీరోలు, ఇటు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఈ ఏడాది ఆగస్టు వరకు చిత్ర పరిశ్రమలో నమోదైన విజయాలపై సమీక్ష..
‘మన శంకరవరప్రసాద్ గారు’తో ఈ ఏడాది తొలి విజయాన్ని నమోదు చేశారు చిరంజీవి. గతేడాది ‘భోళా శంకర్’తో పరాజయాన్ని చవిచూసిన ఆయన ఈసారి అనిల్ రావిపూడితో జట్టు కట్టి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇందులో వెంకటేశ్ మరో కథానాయకుడిగా తళుక్కుమన్నారు. చాన్నాళ్ల తరువాత వింటేజ్ చిరంజీవిని చూశామని ‘మన శంకరవరప్రసాద్’ చూసిన వారంతా మురిసిపోయారు.
ఇక, సంక్రాంతికే ‘నారీ నారీ నడుమ మురారి’తో విజయాన్ని నమోదు చేశారు శర్వానంద్. ఇది శర్వాకు కమ్‍బ్యాక్ మూవీ. అంతకుముందు ఆయన చేసిన ‘మనమే’ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేయలేదు. ‘నారీ..’తో విజయాన్ని అందుకున్న శర్వా అదే ఊపుతో ‘బైకర్’ సినిమాతోనూ మెప్పించారు.
‘గేమ్ ఛేంజర్’తో పెద్దగా మెప్పించలేకపోయిన రామ్‍చరణ్.. ఈ ఏడాది ‘పెద్ది’తో మళ్లీ సక్సెస్ కొట్టారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఈ ఏడాది ఇప్పటి వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘పెద్ది’ నిలిచింది.
‘పెద్ది’ విడుదలైన జూన్‍లోనే సమంత ‘మా ఇంటి బంగారం’ విడుదలై బాక్సాఫీస్‍ను కళకళలాడించింది. వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం సమంతకు ఉన్న క్రేజ్ చెక్కుచెదర లేదని చాటింది. అంతకుముందు సినిమాలు ఆమె స్థాయి విజయాన్ని సాధించలేకపోయాయి. దాంతో విజయం కోసం ఎదురుచూస్తున్న సమంతకు ఈ సినిమాతో పట్టిందల్లా ‘బంగార’మైంది. ఈ సినిమా నాయికా ప్రధానమైన సినిమాల్లో చరిత్ర సృష్టించింది.
ఈ ఏడాది అసలైన విజయమంటే ఏంటో రుచి చూసింది అఖిల్ అక్కినేని మాత్రమే. అంతకుముందు చేసిన సినిమాలేవీ చెప్పుకోదగ్గ విజయాలను సాధించలేదు. మంచి హిట్ కోసం ముఖం వాచిపోయిన అఖిల్‍కు ఆ లోటును తీర్చిన చిత్రం ‘లెనిన్’. వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాతో అఖిల్ మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతోనే హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తెలుగు చిత్రసీమలో తొలి విజయాన్ని నమోదు చేసింది.
ఇక, వరుస పరాజయాలతో సతమతమైన వరుణ్‍తేజ్ చాలా రోజుల రువాత ‘కొరియన్ కనకరాజు’తో మంచి విజయాన్ని సాధించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడంతో పాటు మంచి వసూళ్లను కూడా రాబట్టింది. ఎట్టకేలకు సక్సెస్ కొట్టడంతో వరుణ్‍తేజ్, అఖిల్ మార్కెట్ మళ్లీ పుంజుకుంది.
రవితేజ కూడా మంచి హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ‘విక్రమార్కుడు’, ‘కిక్’ తరువాత చెప్పుకోదగిన హిట్లేవీ లేవు. అలాంటి సమయంలో ‘ఇరుముడి’ సినిమాతో మంచి విజయం సాధించిన ఈయనకు మళ్లీ ఒకప్పటి వైభవాన్ని సాధించిపెట్టింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లన్నీ ఇప్పటికీ హౌస్‍ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. రవితేజ అయ్యప్ప భక్తుడిగా, ఓ చిన్నారికి తండ్రిగా కనిపించిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. పైగా మునుపటి రవితేజ్ మార్కు నటనకు భిన్నంగా రూపొందిన ఈ సినిమాలో అటు అయ్యప్ప స్వామి భక్తితో పాటు ఇటు తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయ్యాయి. ‘కట్టు కట్టు ఇరుముడి కట్టు’, ‘ఎక్కినాడు పల్లకి..’ పాటలు తెలుగు నాట మార్మోగుతున్నాయి.
ఇవికాక మరికొన్ని చిన్న సినిమాలూ ఈ ఏడాది ప్రథమార్థంలో సత్తా చాటాయి.
మొత్తానికి చిరంజీవి, రామ్‍చరణ్, రవితేజ, శర్వానంద్, అఖిల్, వరుణ్‍తేజ్, సమంత •కెరీర్లకు ఈ ఏడాది ప్రథమార్థంతో మళ్లీ ఊపొచ్చింది. గతంలోని అపజయాలను మరిపిస్తూ ఈ ఏడాది వచ్చిన హిట్లతో వీరంతా ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో కొత్త ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు.




























































































































































































































































Review సినిమా.