పూర్వం అనగనగా ఒక మాంత్రికుడు ఉండేవాడు. ఆ ఊరిలోని చిన్న సందులో చిన్న దుకాణం పెట్టుకుని వివిధ వస్తువులు అమ్ముకుంటూ వచ్చిన డబ్బులతో జీవితాన్ని కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. వాడు మాంత్రికుడు అనే విషయం ఆ ఊరిలోని ఒక పిల్లవాడికి తప్ప మరెవరికీ తెలియదు.
ఆ పిల్లవాడికి తల్లి లేదు. తండ్రి రోజంతా ఏదో పని చేసుకుంటూ రాత్రికి ఇంటికి వస్తుండే వాడు. అందుకని ఇంట్లో ఏమీ తోచక ఆ పిల్లవాడు మాంత్రికుడిని కనిపెట్టుకుని ఉంటుం డేవాడు. క్రమంగా అతని దుకాణంలో చేరి వచ్చిన వారికి వారడిగిన వస్తువులు తీసి చూపిస్తుండే వాడు. నచ్చిన వాళ్లకు వాటిని అమ్ముతూ ఉండేవాడు.
దుకాణంలోని ఒక వస్తువును మాత్రం ఎట్టిపరిస్థితుల్లో తాకవద్దని మాంత్రికుడు ఆ పిల్లవాడికి చెబుతుండే వాడు. అది ఒక చిత్రమైన తంబుర. దుకాణానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ‘ఆ తంబుర ఎంతకిస్తావు?’ అని అడిగే వారు. ‘ఇది అమ్మకానికి కాదయ్యా’ అని మాంత్రికుడు చెప్పేవాడు. లక్ష రూపాయలు ఇస్తానన్నా దానిని అమ్మనని ఖరాఖండీగా చెబుతుండటమే కాక కనీసం దానిని ఎవరూ తాకనిచ్చే వాడు కూడా కాదు.
ఒకరోజున ఆ పిల్లవాడు, ‘తాతా.. తాతా! కోరినంత ధనం వస్తుంది కదా! తంబుర అమ్మేసి కష్టాలన్నీ తీర్చేసికోవచ్చు కదా!’ అని చెప్పాడు.
‘నువ్వు పెరిగి పెద్దవాడివి అయ్యాక దానిని నీకు ఇచ్చేస్తాను. అది అమరగానం పాడుతుంది. ఆ పాటకు లోకమంతా నిశ్చేష్టమై నీవైపే చూస్తుంది. అందరూ దాని గానాన్నే వింటారు’ అని మాంత్రికుడు బదులిచ్చాడు.
అనంతరం మాంత్రికుడు ఆ తంబురను చేతిలోకి తీసుకుని తీగలు శ్రుతి చేయగానే అద్భుతమైన దివ్యగానం వినిపించింది.
ఇంతటి అద్భుతమైన గానం ఆ తంబుర నుంచి ఎలా వస్తుందనేది ఎవరికీ అంతుబట్టేది కాదు.
అయితే, ఆ తంబురలో మాంత్రికుడు ఒక దేవకన్యను బంధించివేశాడు. ఆమెను ఇలా బంధించి ఎంతో కాలం అయింది. అప్పటి నుంచీ మాంత్రికుడికి భయపడి, తంబురను తాకినప్పుడల్లా ఆ దేవకన్య లోపలి నుంచి గానం చేస్తూనే ఉంటుంది.
ఆ దేవకన్యకు ఈ పిల్లవాడిపై అమితమైన ప్రేమ పుట్టుకొచ్చింది. ఆ పిల్లవాడు తంబురను చేతబట్టినప్పుడల్లా అద్భుతమైన దివ్యగానం పాడి వినిపించేది. దేవకన్య చేసే ఆ గానానికి పిల్లవాడు సంతోషంతో ఆనందబాష్పాలు రాల్చేవాడు.
ఇలా ఉండగా, ఒకనాడు బాలుని పుట్టిన రోజు వచ్చింది. ఆ రోజున బాలుడు వచ్చి మాంత్రికుడికి నమస్కారం చేసి ఆశీర్వాదాలు పొందాడు. మాంత్రికుడు ఆ పిల్లవాడిని దీవించి, ‘మనవడా! ఇదిగో.. నేను నీకు ఇస్తానన్న తంబుర. దీనిని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో’ అని చెప్పి దానిని పుట్టిన రోజు కానుకగా ఇచ్చివేశాడు.
అందుకు పిల్లవాడు అబ్బురపడుతూ, ‘నాకు అచ్చంగా ఇచ్చేశావా తాతయ్యా? నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చా?’ అని ఆశగా మళ్లీ మళ్లీ అడిగాడు.
‘అచ్చంగా ఇచ్చేశాను. ఇకపై ఇది నీదే. దీనిని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. దానికి అభ్యంతరమేముంది?’ అన్నాడు మాంత్రికుడు.
పిల్లవాడు ఆనందంతో ఎగిరి గంతేశాడు. వెంటనే తంబురను చేతబట్టి భుజానికి తగిలించుకున్నాడు. తీగలు మోగించి శ్రుతి చేశాడు. అయితే ఈసారి తంబురలో నుంచి అద్భుతమైన గానానికి బదులు దీనమైన స్వరం వినిపించింది.
‘నాయనా! నా బిడ్డా.. ఇన్నాళ్లూ నేను ఈ తంబురలో బందీనై ఉన్నాను. ఇప్పటికైనా నన్ను ఈ బంధం నుంచి విడుదల చేయి. నాకు ఎంతో ప్రియమైన అరణ్యాలకు నన్ను వెళ్లనివ్వు. నా లోకానికి నన్ను చేరుకోనివ్వు’ అంటూ అందులో నుంచి దేవకన్య పలికింది.
పిల్లవాడు జాలితో కూడిన ఆ స్వరాన్ని ఇక వినలేక మధ్యలోనే ఆపేశాడు. గిరుక్కున మాంత్రికుడి వైపు తిరిగి, ‘తాతా! ఈ తంబుర నిజంగానే నాకు ఇచ్చేశావా? దేవకన్యను బంధం నుంచి విడుదల చేయవచ్చా?’ అని ఆత్రంగా అడిగాడు.
‘తంబురలో దేవకన్య ఉన్నదని నీకు ఎలా తెలుసు?’ అని ఆశ్చర్యంగా అడిగాడు ముసలివాడు.
అందుకు బాలుడు, ‘దేవకన్య వాక్కులు ఈ తంబుర నుంచి నాకు అనేకసార్లు వినిపించాయి. ఈ బంధం నుంచి విడిపించాలని ఆమె వేడుకుంటూ ఉంది. ఇదివరకే ఎన్నోసార్లు నన్నిలా వేడుకుంది. అయితే దానిని నువ్వు తాకవద్దని చెప్పినందున నేనా పని చేయలేకపోయాను. ఇప్పుడు తీగలు శ్రుతి చేయగానే మళ్లీ ఆమె అతి దీనంగా తనను విడుదల చేయాలని వేడుకుంటూ గానాన్ని వినిపించింది. ఆమె బాధను ఇక ఎంత మాత్రం నేను సహించలేను. ఈ తంబుర అచ్చంగా నాదే గనుక అయితే ఇప్పుడే ఆమెను విడిపించేస్తాను’ అని బాలుడు తన మనసులోని బాధనంతా ఆ ముసలివాడి ముందు వెళ్లగక్కాడు.
‘ఆమెను వదిలేస్తివంటే నువ్విక ఈ తంబుర నుంచి దివ్యగానం వినిపించలేవు. ఆమె దాని లోపల ఉన్నంతసేపే గానం దివ్యంగా ఉంటుంది. ఆ గానానికి తన్మయత్వం పొంది లోకమంతా నీ పాదాల దగ్గర ఉంటుంది. ఆమెను వదిలేసినప్పటికీ తంబుర మీద నువ్వు పాడవచ్చు. అయితే ఆ పాట బిచ్చగాళ్లు పాడే పా•లా ఉంటుంది. దివ్యగానం వల్ల కీర్తి, ఐశ్వర్యం, అధికారం అన్నీ వస్తాయి. కాదంటే దారిద్య్రంలో ఓలలాడతావు. కనుక ఏ మార్గంలో వెళ్లాలో బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో’ అన్నాడు మాంత్రికుడు.
అప్పుడు పిల్లవాడు, ‘తాతా! నేను దేవకన్యను బంధించి ఉంచలేను’ అంటూ తంబురను తీసి నేలకేసి కొట్టాడు. తంబుర ముక్కలు ముక్కలైంది. అందులో నుంచి ఒక దేవకన్య ఎగురుకుంటూ బయటకు వచ్చింది.
‘నాయనా! నువ్వు మంచి హృదయం కలిగిన వాడవు. నన్ను బంధం నుంచి విడిపించావు. చాలా సంతోషంగా ఉంది. ఈ తంబుర లోపల ఇక నేను ఉండను. అందుచేత నా మహిమ వల్ల ఇంతకాలం నువ్వు చేస్తూ వచ్చిన దివ్యగానం ఇకముందు చెయ్యలేవు. అయితే, ఒక మాట ఇస్తున్నాను. నువ్వు కోరినప్పుడల్లా నీ వద్దకు వచ్చి దివ్యగానం చేస్తూ ఉంటాను. దానిని నువ్వు బాగా విని గ్రంథస్తం చేసుకుని లోకానికి అందించు. గొప్ప కీర్తి వస్తుంది’ అని చెప్పి ఆ దేవకన్య అదృశ్యం అయింది.
మాంత్రికుడు చిరునవ్వు నవ్వుతూ, పగిలిపోయిన తంబుర ముక్కలను ఏరి దగ్గరగా చేర్చి తిరిగి అతికించాడు. దానిని ఆ పిల్లవాడికి ఇస్తూ, ‘మనవడా! నీ త్యాగానికి, సాహసానికి మెచ్చాను. ఇదిగో. తంబుర తీసుకో. సుఖంగా ఉండు’ అని చెప్పి అతను కూడా మాయమైపోయాడు.
అప్పటి నుంచి తంబుర ద్వారా దేవకన్యను ఆహ్వానించి, ఆమె దివ్యగానాన్ని గ్రంథస్థం చేస్తూ తరువాత కాలంలో ఆ పిల్లవాడు ఎనలేని కీర్తిని సంపాదించాడు.


























































































































































































































































































































































































































Review ఆధ్యాత్మి‘కథ’.