వేపపువ్వు ప్రధాన ద్రవ్యంగా ఉగాది నాడు ఒక విధమైన పచ్చడి చేస్తారు. దీనికి ఉగాది పచ్చడి అని పేరు. ఇది ఔషధ యోగం. కొత్త చింతపండు తెచ్చి నీటితో పిసికి గింజలు, ఉట్లు, తొక్కలు మొదలైనవి లేకుండా తీసివేసి చిక్కటి గుజ్జు తయారు చేయాలి. ఆ గుజ్జులో కావాల్సినంత కొత్త బెల్లం వేయాలి. అందులో వేపపూవుల కాడలు, పుల్లలు లేకుండా బాగు చేసి వేయాలి. అలా తయారు చేసి గుజ్జులో కొద్దిగా నెయ్యి చేర్చి కలియపెట్టి పుచ్చుకోవాలి. దీనిని పరగడుపున మొదటి జాములోనే పుచ్చుకోవాలి.
మన పెద్దలు కొన్ని వస్తువుల వాడకానికి కొన్ని తిథులు గడవాలని నియమాలు పెట్టారు. వినాయక చవితి వెళ్తే కానీ వెలగకాయలు, నాగుల చవితి వెళ్లే కానీ తేగలు తినకూడదని నియమం. అలాగే కొత్త చింతపండు, కొత్త బెల్లం సంవత్సరాది వరకు ముట్టరాదని నియమం విధించారు. సంవత్సరాదితో ఆయా పదార్థాలకు పురుడు వెళ్లిపోతుందనీ, అప్పటి నుంచి వాటిని తినవచ్చని వారి అభిప్రాయం. అయితే, ప్రస్తుతం ఈ నియమాలు అంతగా వాడుకలో లేవు. ఇప్పుడు సంక్రాంతి నాటికే కొత్త బెల్లం, కొత్త చింతపండు వస్తున్నాయి. వాటిని అప్పటి నుంచే ప్రజలు సేవిస్తున్నారు. ఇది ఒకవిధంగా ఆరోగ్య నియమాలను ఉల్లంఘించడమే. మన పూర్వుల దేహదారుఢ్యాలు ఈనాడు మనకు లేకపోవడానికి ఇటువంటి నియమ ఉల్లంఘనలే కారణం.
కొత్త చింతపండు, బెల్లాలలో ఉండే దోషాల యొక్క తీక్షణత ఉగాది నాటికి తగ్గి అవి అప్పటి నుంచి భుజింప తగినవై ఉంటాయని మన పెద్దల అభిప్రాయం. శాస్త్రంలో వేపపువ్వు, చింతపండు, బెల్లం, నెయ్యి.. వీటితోనే ఉగాది పచ్చడి చేయాలని స్పష్టంగా ఉంది. కానీ, వాడుకలో ఇందులో అనేక వస్తువులను నేడు చేరుస్తున్నారు. చాలా మంది ఈ గుజ్జులో మామిడికాయ ముక్కలు చేరుస్తున్నారు. మామిడి కాయలు శివరాత్రి నాటికి జీడి పిందెలంత అవుతాయి. అయితే, వాటిని సంవత్సరానికి పూర్వం తినకూడదని మన పెద్దలు నిషేధించి ఉన్నారు. సంవత్సరాదితో మామిడికాయలకు పురుడు వెళ్లిపోతుంది కాబట్టి ఆనాటి ఉగాది పచ్చడిలో ఈ కాయ ముక్కలు చేర్చడం
రకాలంగా ఆచారమై ఉంది.
వేసవిలో తప్పక సేవించాల్సిన ప్రకృతి దత్త పదార్థాలలో మామిడి కాయలు ప్రముఖమైనవి. వడదెబ్బకు తట్టుకునే శక్తిని మానవుడికి ప్రసా దించే కాయలలో మామిడికాయలు ప్రముఖమైన వని ఆయుర్వేద గ్రంథాలలో ఉంది. కాగా, ఉగాది పచ్చడిలో తొలిసారిగా మామిడికాయ ముక్కలను చేర్చుకుని సేవించి ఆ మీదట వసంత గ్రీష్మ రుతువుల్లో మామిడికాయలు యథేచ్ఛగా ఉపయోగిస్తూ రావడం ఆరోగ్య మార్గమని గుర్తించవచ్చు.
చెరుకు ముక్కలు, అరటిపండ్లు మొదలైనవి కూడా ఈ ఉగాది పచ్చడిలో చేర్చడం కొన్ని ప్రాంతాలలో ఆచారమై ఉంది. ఇవి చేర్చే విష యంలో అభ్యంతరం చెప్పడానికి ఆస్కారం లేదు. ఈ పచ్చడిలో కొందరు తేనె కూడా కలుపుతారు. యూదులు తమ సంవత్సరాది నాడు ద్రాక్షపండ్లు, తేనె తింటారనే విషయం ఇక్కడ తెలుసుకోదగి నది. ఈ పచ్చడిలో ఇంకొన్ని ప్రాంతాల్లో గస గసాలు, చారపప్పు మొదలైన మసాలా దిను సులు వేయడం కూడా వాడుకలో ఉన్నట్టు తెలుస్తోంది.
వృద్ధాచార రీత్యా కానీ, ఆరోగ్య విజ్ఞానం దృష్ట్యా కానీ ఈ ఉగాది పచ్చడిలో మసాలా దినుసులు చేర్చడం సమర్థనీయం కాదనే చెప్పాలి. అలాగే, ఉగాది పచ్చడిలో ఉప్పు ఎంత మాత్రం చేర్చకూడదు. వసంత రుతువు ప్రారంభంలో ఆ కాలాన దొరికే వేపపువ్వు, చింత పండు, బెల్లం కలిపి పచ్చడి చేసి సేవించడం రాగల కాలానికి ఒక విధంగా స్వాగతోపచారం చేయడమే. మధురామ్ల ద్రవ్యాలతో చేర్చి చేదురసం గల వేపపువ్వును గుజ్జు పచ్చడిగా చేసుకుని తినడంలో వేదాంతార్థం కూడా కొంత ఇమిడి ఉంది. ఈ పచ్చడి తినడం తియ్యని నోట చేదు తినడమే. వేప తిక్తరస ప్రధానమైనది. తిక్త పదార్థాన్ని మధురామ్ల ద్రవ్యాలతో కలిపి తినడం కాలం కొని రాగల కష్టసుఖాలకు తాము సంసిద్ధులమై ఉన్నామని చాటడం. కష్టాలు కానీ, సుఖాలు రానీ మేం అనుభవిస్తాం అని చెప్పడానికి ఈ పచ్చడి సేవనం ఒక సూచన. రాగల అరిష్టాలకు, అదృష్టాలకు మేం సిద్ధంగా ఉంటామని శపథం తీసుకున్న దానికి ఈ పచ్చడి లక్ష్యమై ఉంటుంది.
ఉగాది పచ్చడి.. ఆయుర్వేద ప్రాశస్త్యం
ఆయుర్వేద వైద్యులు వాడే వేప పంచాం గాలలో ఆకు కూడా ఒకటి. చర్మ వ్యాధుల్లో పచ్చి వేపాకు నలుగు పెట్టుకుంటారు. అమ్మవారి జబ్బుల్లో రోగులకు వీచోపు నిమిత్తం ఆకులు దట్టంగా ఉండే వేపరొట్ట వాడతారు. మశూచి కాది రోగులు ఉండే ఇంటి ముంగిళ్లలో వేపాకు తోరణాలు కడతారు. ఇలా వేపాకు వైద్యోప యోగాలు, ఇతర ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఉగాది నాడు వేప ఆకు కంటే వేప పూత వాడటమే సమయోచితమై ఉంది. వేపచెట్టు అంగాల్లో వసంత రుతువులో మాత్రమే దొరికేది పువ్వు. వసంత రుతు సంబంధ పర్వమైన ఉగాది నాడు వసంత రుతువులో మాత్రమే లభించే వేపపూతను వాడటమే ప్రాప్తకాలజ్ఞత అనిపించుకుంటుంది. ఆనాడు అప్పుడు దొరికే వేపపువ్వును వాడటమే మన పెద్దల ఉద్దేశమై ఉంటుంది. ఆయా కాలాల్లో లభ్యమయ్యే ఫలపుష్పాదులను ఆయా కాలాల్లోని పర్వాల్లో భగవంతునికి నివేదన చేసి వాడుకోవడానికి ప్రారంభించడం మన మత సంప్రదాయం.
అన్ని రుతువుల్లోనూ దొరికే వేపాకు వసంత రుతు సంబంధమయిన ఉగాది నాడు తినడంలో ఎక్కువ విశిష్టత ఉందని చెప్పలేం. అందుచేత ఉగాది నాడు వేప పువ్వు వాడే ఆంధ్రుల ఆచారమే సంప్రదాయ సిద్ధమైనది. సర్వోత్తమ మైనది.
వేపపువ్వు పచ్చిది పచ్చడిలో వేసుకుని ఉగాది నాడు తినడమే కాదు అది విరివిగా దొరికే ఆ రోజుల్లో దానిని విశేషంగా సేకరించి ఎండ బెట్టి ఉంచుకుని ఏడాది పొడవునా వేయించు కుని కూరగానో, పచ్చడిగానో చేసుకుని, అది వేసుకుని చారు కాచుకుని సేవిస్తూ ఉంటే రక్తశుద్ధి, రక్తవృద్ధి కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈ ఆచారాన్ని ఆంధ్రులు ఇప్పటికీ కొందరు పాటిస్తున్నారు.
ఉగాది నాటికి వేపచెట్లు ముమ్మరంగా పూత పూసి ఉంటాయి. వేప పువ్వు గుణవంతమైన ఔషధి. రక్తాన్ని శుద్ధిచేసి వృద్ధి పరిచే గుణం దీనికి ఉంది. పైగా అది వసంత రుతు సంబంధమైన పువ్వు. వైద్యానికి ఉపయోగించే వేప చెట్టు పంచాంగాల్లో అది ఒకటి. వేప సర్వాంగాలు మన తెలుగు నాటే కాదు యావత్తు ప్రపంచంలోనూ వైద్యంలో వాడతారు. మానవునికి ఆరోగ్యం చేకూర్చే వృక్షరాజాల్లో వేప ఎన్నదగినది. స్వర్గలోకంలోని ఆబ్రోసియా వృక్షం యొక్క అంశతో భూలోకంలో వేపచెట్టు పుట్టిందని మహారాష్ట్ర సంప్రదాయక విజ్ఞానం ద్వారా తెలుస్తోంది. వేపచెట్టు గాలి కూడా చాలా ఆరోగ్యప్రదమై ఉంటుంది.
ఉగాది పచ్చడి.. ఆచారాలు
వేప పువ్వు కానీ, ఆకు కానీ సేవించడం ఉగాది విధాయక కృత్యాలలో ఒకటి. ఉగాది దినాలు వేరైనా వేపాకు కానీ, పువ్వు కానీ తినడం హిందూ దేశంలోని వివిధ ప్రాంతాలలో ఆచారమై ఉంది.
ఆంధ్ర ప్రాంతంలో ఉగాది పచ్చడిలో వేప సంబంధమైనది పూవు మాత్రమే వేస్తారు. మనకు పొరుగు వారైన కన్నడిగులు కూడా ఉగాది నాడు మనతో పాటే సాంప్రదాయకంగా వేప పువ్వునే వాడతారు.
తమిళుల ఉగాది వేరే రోజు అయినప్పటికీ వారు కూడా ఆనాడు వేపపువ్వునే వాడతారు. అయితే, వారిలో చాలామంది వేప పువ్వును పంచదారతో కలుపుకుని తినేస్తారు.
మాళవ, మహారాష్ట్ర, వంగ దేశస్తులు ఉగాది నాడు చేసుకునే పచ్చడిలో వేప పూలను కాక వేప ఆకులను వాడతారు.
మాళవ దేశస్తులు ఉగాది నాడు వేపాకులు ముద్దగా నూరి సేవిస్తారు. ఆనాడు ఇలా వేప పదార్థం తినడం వల్ల ఆ సంవత్సరంలో ఏ విధమైన రక్తకారపు బాధ ఉండదని వారి నమ్మకం.
మహారాష్ట్రుల ఉగాది మన ఉగాది నాడే. కానీ, నాడు వారు మనకు మాదిరిగా వేప పూత కాక, వేప ఆకులను పచ్చడిలో వాడతారు.
మొత్తానికి ఉగాది పచ్చడిలో వేపను ఏ రీతిలో వాడినా.. అది విశేషమైన రక్తశుద్ధికి దోహద పడుతుందని ఆయుర్వేదం చెబుతోంది.
యుగాది అనే సంస్క•త పదానికి యుగా నికి ఆది లేక ప్రారంభం అని అర్థం. యుగము నకు వికృత రూపమే ఉగము. ఈ ఉగము నుంచి పుట్టినదే ఉగాది. ప్రాచీన కాలంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, తరువాత మార్గశిర శుద్ధ పాడ్యమి, ఆ తరువాత చైత్ర శుద్ధ పాడ్యమి.. ఈ మూడిం టినీ ఉగాదిగా జరుపుకునేవారని పురాతన గ్రంథాల ద్వారా తెలుస్తోంది. తెలుగు వారిది, కన్నడిగులది చాంద్రమానం. కేరళ, తమిళనాడు ప్రాంతాల వారిది సౌరమానం. మనం జరుపు కునే పండుగలు, చేసే శుభకార్యాలు, చెప్పుకునే సంకల్పాలన్నీ చాంద్రమానం ప్రకారం ఏర్పడి నవే. మనకు జ్యోతిష శాస్త్రరీత్యా శుభాశుభ ఫలితాలను తెలిపే పండుగ ఉడాది. దీనినే సంవత్సరాది అని కూడా అంటారు. ఉగాది నుంచి తెలుగు వారికి కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది. ఈ పర్వదినాన ఉదయమే ఇల్లు అలికి, ముగ్గు పెట్టి, అటకలతో సహా అన్ని గదులలోనూ బూజు దులిపి, ఊడ్చి, శుభ్రంగా కడుక్కుని, మామిడి ఆకులతో లేదంటే వివిధ రకాల పుష్పాలతో తోరణాలు కట్టాలి. గడపలకు పసుపు, కుంకుమలు అలంకరించాలి. ఇంటిలో మనం పూజించే ఇష్ట దేవతల విగ్రహాలను షోడశోపచారాలతో పూజించి, శుచిగా చేసిన పిండివంటలనూ, ఉగాది పచ్చడినీ నివేదించాలి. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినదీ, ప్రజాను రంజకంగా పాలించిన శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగి నదీ, వెయ్యేళ్ల పాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినదీ, శకకారుడైన శాలివాహనుడు కిరీట ధారణ చేసినదీ, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తిన పీఠాన్ని అధిరోహించినదీ ఉగాది నాడేనని చారిత్రక పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి కొత్త కార్యాలను ప్రారంభించడానికి ఉగాదిని మించిన శుభ తరుణం మరొకటి లేనే లేదు. మంచి పనులకు, సంకల్పాలకు ఈనాడే శ్రీకారం చుట్టాలి.
ఉగాది కృత్యం..
ఉగాది పర్వదినాన ఉదయమే అభ్యంగ స్నానాలు చేస్తారు. నూతన వస్త్రాలు ధరిస్తారు. ఇంటి ద్వారాలను, పూజా మందిరాలను, ఇంటా బయటా పుష్ప, పత్ర తోరణాలతో అలంక రిస్తారు. ఇంటి భవంతిలో మంటపం నిర్మించి, ఆ సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను షోడశోపచారములతో పూజిస్తారు. షడ్రసాత్మకమగు ఉగాది పచ్చడి పదార్థాన్ని దేవతకు నివేదిస్తారు. దీనిని కొత్త బెల్లం, పచ్చి మిరపకాయలు, చింతపండు,
ఉప్పు, మామిడిపిందెలు, వేపపూత వేసి తయారు చేస్తారు. ఇవి వసంత కాలం ప్రారంభ సమయంలో ప్రకృతి ప్రసాదించిన నూతన పదా ర్థములు. షడ్రసోపేత (ఏడు రుచులు)మైన ఈ పదార్థం సుఖ దుఃఖ సమ్మిశ్రమమైన మానవుని సంవత్సర జీవితమునకు ఉపలక్షణము. ఉగాది నాడు ఈ పచ్చడి తినడం వల్ల సంవత్సరంలో తనకు అనుభవానికి రానున్న జీవితానికి ఆనాడే ఉప క్రమించడాన్ని సూచిస్తుంది. ఉగాది పచ్చడి విశేష ఔషధ గుణాలు కలిగిన పదార్థం.
పంచాంగ శ్రవణం
ఉగాది పండుగ మనకు ప్రథమం, ప్రధాన మైన పండుగ. మనకే కాదు, మన పక్కింటి కన్నడిగులకు, పొరుగింటి మరాఠీలకు, చాంద్ర మానమును అనుసరించే మాళవీయులు (కేరళ) మొదలైన వారికి ఇది నూతన సంవత్సరారంభ దినం. యుగాది క్రమంగా ఉగాదిగా తెలుగునాట స్థిరపడింది. కర్ణాటక, మహా రాష్ట్రలలో యుగాదిగానే ప్రాచుర్యంలో ఉంది. భోజనానంతరం మూడు జాములు గడిచిన పిదప స్వగృహం, దేవాలయం, గ్రామ చావడి.. ఎక్కడైనా అందరూ సమావేశమై పంచాంగ
శ్రవణం నిర్వహించడం ఆచారం. సంవత్స రంలోని ఆదాయ వ్యయాలు, కందాయ ఫలాలు, సుయోగ – దుర్యోగములను, స్థూలంగా ఆ ఏడాదిలోని తమ భావి జీవిత క్రమాన్ని తెలుసు కోవడానికి పంచాంగ శ్రవణం ఉపయోగపడు తుంది. కొన్ని ప్రాంతాలలో ఉగాది నాడు సాయంకాలం ఎడ్లబండ్ల పోటీలు నిర్వహిస్తారు. అలాగే ఈనాడు వివిధ ప్రాంతాల్లో ఆయా స్థానికతను బట్టి పలు ఆచారాలు వ్యవహారికంలో ఉన్నాయి.
భవిష్య పురాణంలో ఉగాది వర్ణన..
ఉగాది ప్రాశస్త్యం గురించి భవిష్యోత్తర పురాణంలో ఉంది. అందులో ధర్మరాజుతో శ్రీకృష్ణుడు అన్న మాటలివి..
‘మహాబాహో! చైత్ర మాస శుద్ధ పాడ్యమి పుణ్యమైనది. ఆనాడు వేపాకులు భుజించి తిథి, నక్షత్రాదులను, శకమును, వర్షాద్యాధిపతులను గురించి వినాలి. ఇలా వినడం వలన అశుభములు కూడా శుభములుగా మారిపోతాయి’.
ఉగాది నాడు ఇంద్రోత్సవం జరపాలని మహా భారతంలో ఉంది. సామాన్యంగా ఉగాది నుంచి రామ నవమి వరకు రామ నవరాత్రులను జరుపుతారు. చాంద్రమాన సంవత్సరాది అతి ప్రాచీనమైనది. దీనికి ధర్మశాస్త్రములే ప్రమా ణము.
కలియుగ ప్రారంభ దినం..
కృతయుగాన్ని వైశాఖ శుద్ధ తదియ నాడు, త్రేతాయుగాన్ని కార్తీక శుద్ధ నవమి నాడు, ద్వాపర యుగాన్ని శ్రావణ శుద్ధ త్రయోదశి నాడు ప్రారంభించిన పరమాత్మ కలియుగాన్ని చైత్ర శుద్ధ పాడ్యమి (ఉగాది) నాడు ప్రారంభించాడని చెబుతారు. అందుకే ఉగాది యుగానికి ఆది దినమైంది. ఉగాది అంటే నక్షత్రపు నడక అని అర్థం. ఇది ప్రకృతి పండుగ. నేలంతా పులక రించి, కొత్త చిగుళ్లు, పూలతో కళకళలాడే పండుగ. భవిష్యత్తుపై ఆశలు పెంచి కొత్త జీవితానికి ఊపిరిలూదే పండుగ. ఈ పండుగను ‘సంవత్సరేష్ఠి’ అని కూడా అంటారు. ఇష్ఠి అంట క్రతువు. అన్ని లోకాలూ సుఖశాంతులతో ఉండుగాక! అనే విశ్వవ్యాప్తమైన శుభకామన ఉండటమే మన సంవత్సరాది సందేశ ప్రత్యేకత.
ఆర్యుల కాలం నుంచీ ఆచరణలో..
ఉగాది పర్వం ఆచరణ ఆర్యుల కాలం నుంచీ ఉందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. శాలివాహనుడి శక స్థాపన దినము చైత్ర శుద్ధ పాడ్యమే. ఇక, శాస్త్రాలను తిరగేస్తే ఈనాడే బ్రహ్మ సృష్టి కార్యాన్ని ఆరంభించాడని అంటారు. ఉగాది నాడు ప్రధానంగా ఆచరించా ల్సిన పది విధాయ కృత్యాలను మన శాస్త్రకారులు విస్పష్టంగా పేర్కొన్నారు. అవి-
1) ప్రతిగృహ ధ్వజారోహణం: అంటే ప్రతి ఇంటా ధ్వజారోహణ చేయడం. అంటే, ఇంటి గుమ్మం ఎదుట విజయ చిహ్నంగా ధ్వజాన్ని ప్రతిష్ఠించడం.
2) తైలాభ్యంగం: నువ్వుల నూనెతో తల స్నానం చేయాలి.
3) నవ వస్త్రాభరణ ధారణం: ఛత్రచామరాది స్వీకారం: శుచిగా స్నానం చేసిన అనంతరం కొత్త బట్టలు, కొత్త నగలు ధరించడం, కొత్త గొడుగు, కొత్త విసనకర్ర స్వీకరించడం మూడవ విధి కిందకు వస్తుంది.
4) దమనేన బ్రహ్మ పూజనము: బ్రహ్మ దేవుడిని దమనములతో పూజించడం నాల్గవ విధి.
5) సర్వాకచ్ఛాంతకర మహాశాంతి: పౌరుష ప్రతి పద్వ్రతము: విఘ్నేశ్వరుడిని, నవగ్రహాలను, బ్రహ్మాది దేవతలను పూజిస్తూ శాంతిపూజ చేయడం ఐదవ కృత్యం.
6) నింబకుసుమ భక్షణం: వేపపువ్వును లేదా వేపపువ్వుతో చేసిన పచ్చడిని స్వీకరించడం.
7) పంచాంగ పూజ/పంచాంగ శ్రవణం: ఆ ఏడాది కలిగే శుభా శుభ ఫలితాల గురించి తెలుసుకోవడం ఏడవ విధి.
8) ప్రపాదాన ప్రారంభం: చలివేంద్రాలు ఏర్పాటు చేసి జనుల దాహార్తి తీర్చడం ఎనిమిదవ కృత్యం.
9) రాజదర్శనం: మన శ్రేయస్సుకు కారకులైన వారిని, పెద్దలను దర్శించుకోవడం తొమ్మిదవ విధి.
10) వసంత నవరాత్రి ప్రారంభం: పై తొమ్మిది కృత్యాలు చేయగా వసంత నవరాత్రి
ఉత్సవాలు ప్రారంభమైనట్టు.
ఉగాది నాడు ఈ పది విధాయక కృత్యాలను విధిగా ఆచరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉగాది పర్వం నాడు ఆనందోత్సాహాలతో గడ పాలనే వారంతా ఈ పది విధాయక కృత్యాలను విధిగా పాటించాలని శాస్త్ర నియమం.
దమన పూజ:
చైత్ర మాసంలో దాదాపు అందరు దేవతలను దమనములతో పూజించాలని చతుర్వర్గ చింతామణి తదితర వ్రత గ్రంథాలలో ఉంది. దమనం మంచి పరిమళం గల పత్రం. వసంత రుతు మాసాలైన చైత్ర, వైశాఖ మాసాలలో ఇది ఏపుగా పెరుగుతుంది. విరివిగా దొరుకుతుంది. కాగా, దీనిని మన పెద్దలు చైత్ర మాసపు పూజా ద్రవ్యాలలో ప్రధానమైనదిగా చేశారు. ఆరోగ్యప్రదమైన ఈ మూలికా పత్రం హృదయానికి మిక్కిలి హితకరమైనది. స్త్రీలు దీనిని శిరసున ధరిస్తారు. విష దోషాలను, భూత బాధలను పోగొడుతుందని అంటారు. శరీర దుర్గంధాన్ని హరిస్తుంది. చైత్ర శుక్ల పక్షములలో వచ్చే వివిధ పర్వాలలో ఆయా దేవతలకు దమనములతో చేసే పూజలకు పరిభాషలో దమనారోపణమని పేరు.
Review ఉగాది పచ్చడి ‘ఔషధీ’.