కన్నీరు..
మనసును కలత పెడుతుంది.
చిరునవ్వు..
మనిషిని సంతోషభరితం చేస్తుంది.
ఈ రెండూ పరస్పర ఆధారితాలు. ఒకదానితో మరొకటి సంబంధం గలవి. ఈ రెండింటి మధ్యా ఉన్న సంబంధాన్ని కనిపెట్టడానికి అనాదిగా, అవిశ్రాంతంగా మనిషి చేయని ప్రయత్నం లేదు.
అలాగే, ఏళ్లుగా ఈ కన్నీళ్లు, చిరునవ్వుల గురించిన ప్రశ్నలు మానవ మస్తిష్కాలను తొలుస్తూనే ఉన్నాయి.
ఏమిటీ కన్నీరు?
అదొక శాపం. భగవంతుడి పరోక్షానికి సాక్ష్యం.
ఏమిటీ చిరునవ్వు?
ఇదొక వరం. భగవంతుడి ప్రత్యక్షానికి సాక్ష్యం.
ఈ ప్రశ్నలూ, సమాధానాలు రెండూ మనల్ని తికమక పెడుతుంటాయి. ఆశ్చర్యపరుస్తుంటాయి.
ఈ ప్రశ్నలకు సమాధానాలేంటనే దానికి కొందరు ఒక నవ్వు నవ్వి ఊరుకుంటారు. కొందరు సమాధానం చెప్పలేక, సముదాయించుకోలేక కన్నీరు పెట్టుకుంటారు. వీచే గాలిని బట్టి తమ ఆకృతులను మార్చుకునే మేఘాల్లా ఇంకొందరు తమకెదురైన వివిధ అనుభవాలను బట్టి పై సమాధానాలను తరచుగా సవరించుకుంటుంటారు. నిజం చెప్పాలంటే కన్నీటికి, చిరునవ్వుకీ మధ్య ఉన్నది మోసపూరిత సంబంధం. ఈ బంధం చిక్కుముడిని విప్పడానికి ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ, ఎవరి అంచనాలకూ, ప్రయత్నాలకు అందని మేరు శిఖరంలా అదలా ఉండిపోతూనే ఉంది. మోనాలిసా చిరునవ్వును గురించి ఎందరో ఎన్నో రకాలుగా ఈనాటికీ విశ్లేషిస్తూనే ఉన్నారు. కానీ, ఏదీ సరైన విశ్లేషణ కాదని ఎప్పటికప్పుడు నిగ్గుతేలుతోంది. సమాధానం లేని ఈ ప్రశ్నలు నాపై పదేపదే దాడి చేస్తూ, అంత:కరణాల లోతుల్లోకి ఇంకిపోతు న్నాయి. ఈ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నించినప్పుడల్లా కన్నీరు-చిరునవ్వు మధ్య గల మోసపూరిత మాయ నా తెలివిని అధిగమిస్తోంది. దీంతో నా ఆలోచనా స్రవంతి దారితప్పి.. నన్ను ఏవేవో నిర్ధారణల వైపు నడిపిస్తూ వచ్చింది.
నిజానికి ఒక్కోసారి ప్రశ్నలకు ఎలాంటి సమాధానం కనుగొనక పోవడమే పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. ప్రశ్నల పిడికిలిలో నిస్సహాయంగా చిక్కుకుపోయినపుడు ప్రశ్నించడమే మానుకోవాలి. అప్పుడు హృదయాంతరాళలోని అలజడీ, ఆత్రుత క్రమంగా సద్దుమణుగుతాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానం కనుగొనే ప్రయత్నం చేయకపోవడం కూడా చాలా ఓదార్పునిస్తుంది.
అసలు తెలివైన వాడంటే ఎవరు?
మన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవాడు కాదు.. తగిన ప్రశ్నలు వేసేవాడే తెలివిపరుడు.
కాబట్టి అంతుబట్టని ప్రశ్నలకు సమాధానం కనుక్కునే ప్రయత్నం మానేసి, నావైన కొన్ని ప్రశ్నలతో వాటిని ఎదుర్కోవాలని నిశ్చయించుకున్నాను.
ముందుగా, అతి ముఖ్యంగా నేను వేసుకున్న ప్రశ్న-
భగవంతుడు వివేకవంతుడు కాడా?
పోనీ తగినంత వివేకవంతుడు కాడా?
నన్ను మించిన వివేకవంతుడు కాడా?
మనందరి కన్నా కూడా వివేకవంతుడు కాడా?
భవిష్యత్తులో వివేకవంతులు కాగలిగిన వారందరి కన్నా కూడా వివేకవంతుడు కాడా?
ఆపైన, భగవంతుడు నిజంగా నన్ను ప్రేమిస్తాడా?
అందరికన్నా కూడా ఎక్కువగా నన్ను ప్రేమిస్తాడా?
నా తల్లిదండ్రుల కన్నా కూడా ప్రేమిస్తాడా?
.. ఈ ప్రశ్నల క్రమం నా హృదయాన్ని ఆక్రమించింది. ఫలితమే ‘హసిత బాష్పా’లనే ఈ పద్దెనిమిది కవితల కవితాత్మక ఆవిష్కరణ.
అశ్రుకణం.. కన్నీటి చుక్క..
ఆ మాట పలికితే పెదవులు పరిశుద్ధమవుతాయి. కన్నీరు అనుభవంలోకి వస్తే మనసు తేలికపడుతుంది. హృదయంలో శాంతిని నింపుతుంది. వడగట్టిన జ్ఞానాన్ని మెదడులో రంగరిస్తుంది. కన్నీటి కొలను కఠోరమైన జీవనపాఠాలను బోధించి.. నిశ్చలంగా ఎలా ఉండాలో నేర్పుతుంది. అంతుబట్టని రహస్యాలను అంత:కర్ణాల దరిచేరుస్తుంది. కన్నీటి స్పర్శ మృదువుగా ఉంటుంది. ఎంతో ఉపశాంతినిస్తుంది. విషాదాన్ని పలికించే కన్నీటి గీతికలు శ్రవణపేయంగా ఉంటాయి. అవి పెదవులపై వాడిపోని చిరునవ్వులను పూయిస్తాయి. హృదయపు చీకటి గుహల్లోకి అంతులేని కాంతిని ప్రసరిస్తాయి.
ఏమిటీ.. కన్నీటి గురించి ఈ కబుర్లు చదువుతుంటే నాకేమైనా పిచ్చిపట్టిందా? అని అనుకుంటున్నారా? అనుకునే ఉంటారు! అలా అనుకోకపోతే పై పంక్తులు మీరు చదవలేదని అర్థం.
ఇన్నాళ్లూ నేను భగవంతుడు పిచ్చివాడనే భ్రమలో ఉన్నాను. కానీ, ఇప్పుడిప్పుడే నాకు తెలిసిన నిజమేమిటంటే, భగవంతుడు కాదు.. నేనే పిచ్చివాడినని!. మధ్య మధ్యలో మన జీవితంలోకి లోతుగా తొంగి చూసుకున్నా, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పైపైన చూసినా భగవంతుని ఉనికికి నిక్కమైన సాక్ష్యం దొరుకుతుంది. ఇన్ని రోజులూ ఆయన నా సమీపంలోనే ఉన్నా, ఆయనను దర్శించడానికి నాకు దూరపు చూపు లోపించిన చక్షువులు కరువయ్యాయి. ఇన్ని రోజులూ ఆయన అవ్యాజ ప్రేమ అనే దివ్య వర్షంలో స్నానమాడుతూనే ఉన్నాను. కానీ, అలసిపోయిన నా నరాలు నిరవధికమైన ఆయ కృపా వైభవాలను అందుకోలేకపోయాయి. విస్తుగొలిపే ఆయన వివేకమూ, సంభ్రమాశ్చర్యాలు కలిగించే ఆయన అనంత ప్రేమా నన్ను నిర్మలమైన నిశ్శబ్దంలోకి నెట్టి, ఏకాంతమనే ఆనందధామంలోకి విసిరేశాయి.
జనన మరణాలు, మంచిచెడులు, ఉదయాస్తమయాలు, రాత్రీ పగలూ.. ఇవన్నీ పరస్పర వ్యతిరేకాలు కావు. ఆకలీ అన్నమూ పరస్పర వ్యతిరేకాలు కావు. ఆకలి వేయనిదే మనం అన్నం రుచి చూడలేం. పూర్తిగా నిండిన కడుపు విందు భోజనాన్ని ఆస్వాదించలేదు. ఆరోగ్యమూ రోగమూ పరస్పర వ్యతిరేకాలు కావు. ఇవీ పరస్పర పూరకాలే. మనం ఆరోగ్యాన్ని కోల్పోతాం. జబ్బుపడతాం. తిరిగి ఆరోగ్యాన్ని పొందుతాం. ఆరోగ్యంగా ఉంటే ఆనందం కలుగుతుంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉండలేం. అంటే పోగొట్టుకుంటే కానీ అదెంతటి భాగ్యమో తెలుసుకోలేం. ఒక నాటకంలోని నాయకుడూ, ప్రతినాయకుడూ భిన్న ధ్రువాలు కారు. ఇద్దరూ ద్వంద్వాత్మక దివ్య నాటకంలో అనివార్య భాగాలు. ప్రతినాయకుడు లేని సినిమా విసుగు పుట్టిస్తుంది. నాటకం పూర్తికాగానే నాయకుడూ, ప్రతినాయకుడూ దర్శకుడితో కలిసి కాఫీ తాగుతారు. అలాగే కన్నీళ్లు – చిరునవ్వులు కూడా. ఇవి మనం అపార్థం చేసుకునే పరస్పర పర్యాయపదాలు. పైకి వ్యతిరేకార్థ పదాలుగా కనిపించే ఇవి పరస్పర విరుద్ధార్థకాలు కావు. పరస్పర పూరకాలు. నిజానికవి ఒకదానినొకటి పరిపోషించుకుంటాయి. ఒకదాని సమక్షాన్ని మరొకటి ఆనందిస్తాయి. ఒకదానితో మరొకటి కరచాలనం చేసుకుంటాయి. ఆలింగనం చేసుకుంటాయి. అంతిమంగా ఆనందభరిత జీవన నృత్యంలో సంతోషభరితంగా ఒకదానితో మరొకటి కలిసిపోయి కరిగిపోతాయి. కన్నీళ్లు – చిరునవ్వులు ఒకదానిని విడిచి మరొకటి ఉండలేవు. మనం ఎప్పుడైతే కన్నీళ్లను తిరస్కరిస్తామో, చిరునవ్వులను కూడా తిరస్కరించినట్టే. ద్వంద్వాత్మకమైన వాటి పరస్పర ఆధారాన్ని ఎవరూ విడదీయలేరు.
ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే- కమ్మరి ఒక ఇనుపగడ్డను రెండు ముక్కలు చేస్తాడు. ఒక ముక్కతో కత్తిని, ఇంకో ముక్కతో ఆ కత్తి వేటు నుంచి కాచుకునే డాలును తయారు చేస్తాడు. యుద్ధం జరిగినంతసేపూ కత్తి గాయపరచడానికీ, డాలు కాపడటానికీ ప్రయత్నిస్తాయి. కత్తి, డాలు పైకి పరస్పర విరుద్ధాలుగా కనిపిస్తాయి కానీ, అవి పుట్టింది ఒకే మూలం నుంచి. కాకపోతే తమ లక్షణాలకు తగిన పాత్రలను పోషిస్తుంటాయి. యుద్ధం ముగియగానే రెండింటినీ ఒక మూలకు విసిరేస్తారు. అవి పరస్పరాలింగనంలో ఆనందంగా అక్కడే పడుంటాయి. అలాగే ఒక నాయకుడూ, ప్రతినాయకుడూ, ఒక మిత్రుడూ, ఒక శత్రువూ కూడా. జీవన్నాటకం ఎప్పుడైతే ముగిసిందో, అప్పుడందరూ భగవంతుడి దివ్యధామానికి చేరి విశ్వదర్శకుడి సన్నిధిలో సంతోషంగా ఉండిపోతారు.
తల్లి పురిటి నొప్పుల నుంచి పుట్టే శిశువు.. మరోచోట, మరో సమయంలో మృత్యుహింసతో సమాధిగతమవుతున్న మరో శిశువుకు పర్యవసానమే. జన్మనిచ్చిన తల్లికి కలిగేది అనిర్వచనీయానందం. శిశువును పోగొట్టుకున్న తల్లికి మిగిలేది కడుపుకోత. ఒక తల్లి వేడుక మరో తల్లికి వేదన. అందుకే జననం-మరణం పరస్పరాధారితాలు. రేపటి చితిమంటలు నేటి పుట్టిన రోజు వెలుగులకు సూచికలు. ఒక చెట్టు పుట్టాలంటే ఒక బీజం మట్టిలో కలిసిపోక తప్పదు. వేసవి మహోగ్రతాపం లేనిదే భూమాత కడుపు పండించే వర్షరుతువు పుట్టదు. వేసవిలో సూర్యకిరణాలు వేడిని సంతరించుకోకుంటే, సముద్రపు నీటి బిందువులు ఆవిరిగా నింగికెగసి వర్షరుతువులో మనపై జలధారలు కురిపించవు. ఇదంతా అర్థం చేసుకోని ఫలితమే.. కన్నీటి పట్ల మనకు కలిగే విద్వేషం, వేదన.
కన్నీటి చుక్క మూలాలేమిటి?
కన్నీటికి ప్రారంభమూ, ముగింపూ ఎక్కడ?
ఇవి మనకు తెలియవు. విశ్వసంబంధమైన స్ప•హ లోపించడం వల్లే కన్నీటి పట్ల మనకు ఏవగింపు పుడుతోంది. ‘కన్నీటి’ అంతర్నిర్మాణం తెలుసుకోలేని అంధత్వం మనది. ఆ గుడ్డితనం నుంచే ద్వేషం పుడుతుంది. కన్నీటికే కన్నీరు పట్టేంత దుర్గతి కన్నీటిది. కన్నీరొచ్చినపుడు అన్ని తలుపులూ మూసుకుని పోయినట్టవుతుంది. అందరూ, అన్నివేళలా దానిని అసహ్యించుకుంటారు. ఏ ఒక్కరి ప్రేమకూ అది నోచుకోదు. అందుకే బహుశా కన్నీటి చుక్క అంతగా ఎవరూ కన్నీరు కార్చి ఉండరు. కన్నీరే గనుక తన ఆత్మకథ తనే రాసుకుంటే అది మనచే కంటతడి పెట్టిస్తుంది. ‘అన్ని సముద్రాలనూ ఇంకిపోయేలా చేయండి. వాటిని తిరిగి నా కన్నీటితో నింపుతా’నని అది రోదిస్తుండొచ్చు.
కన్నీరు ప్రతిరోజూ ఎందరెందరి తలుపులో తడుతుంది. కానీ, ఒక్కరూ తలుపు తీయరు. ఆహ్వానించరు. అలాంటి తిరస్క•త, పరాజిత అశ్రుబిందువు నిజానికి భగవంతుడికి అత్యంత ప్రేమబంధువు. చిరునవ్వూ, కన్నీరూ.. ఈ రెండూ భగవంతుని ప్రీతిపాత్రమైన సంతానం. కానీ, మనం ఆయన సంతానంలోని ఒకరిని ప్రేమిస్తాం. ఇంకొకరిని ఏవగించుకుంటాం. అది న్యాయమేనా? తన సంతానంలోని ఒకరిని ద్వేషించడం భగవంతుడు హర్షించేలా చేస్తుందా? అందరికన్నా వివేకవంతుడూ, మనల్ని అమితంగా ప్రేమించేవాడూ, అందరికన్నా మనకు అత్యంత ప్రేమాస్పదుడూ అయిన భగవంతుడు మనకు చిరునవ్వులూ పంచుతున్నాడు. కన్నీళ్లూ ప్రసాదిస్తున్నాడు. తల్లీ, తండ్రీ కూడా తనేగా రూపెత్తిన, అంతకన్నా ఇంకా లక్షల రెట్లు ఎక్కువైన భగవంతుడు తను అమితంగా ప్రేమించే తన సంతానానికి కన్నీటిని ప్రసాదిస్తే ఎందుకు విచారించాలి? దానికి మనమెందుకు భయపడాలి? మన సుఖదు:ఖాల ద్వంద్వాత్మక అస్తిత్వంలో మనకు అర్థం కాని మన శ్రేయస్సు ఏదో ఇమిడి ఉంటే తప్ప కరుణా సముద్రుడైన భగవంతుకు మనకు కన్నీళ్లు ఎందుకు ఇస్తాడు? తరచూ ఇవే ప్రశ్నలు నన్ను తొలుస్తూ ఉంటాయి. ఇలా నన్ను నేను ప్రశ్నించుకునే కొద్దీ కన్నీటికీ, చిరునవ్వుకీ మధ్య ఉన్న సంబంధం మరింత తేటపడుతుంటుంది. భగవంతుడు మనల్ని కన్నీటితో శిక్షిస్తున్నాడా? లేక కన్నీటితో చికిత్స చేస్తున్నాడా? ఇది వివేచించుకోగలిగితే సమాధానం సులభంగా బోధపడుతుంది.
కన్నీటి చుక్క మన పాపాలకు శిక్ష కాదు. మన జీవితాన్ని పీడించే అదృశ్య రోగాలకు రహస్య చికిత్స. శిక్షలా అనిపించే సూదిమందు. అది భగవంతుడు మనకందించే చికిత్స. అనారోగ్యానికి గురైతే మనమెంత ఇష్టంగా, సంతోషంగా చికిత్సను స్వీకరిస్తామో అంత త్వరగానూ రోగవిముక్తులం అవుతాం. నొప్పి కలిగించే సూదిమందు ఇచ్చి, మన రోగాన్ని నయం చేసిన డాక్టరుకు ఫీజు చెల్లించి ఎలా కృతజ్ఞతలు చెప్పుకుంటామో, అలాగే, మనకు కన్నీళ్లు ఇచ్చినందుకు భగవంతుడికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుని వాటిని ఆనందంగా స్వీకరించాలి. మనం కష్టం కలిగిన ప్రతిసారీ భగవంతుడు మనల్ని ద్వేషిస్తున్నాడనీ, మనల్ని శిక్షిస్తున్నాడనీ, మన పాపాలకు ప్రతీకారం తీర్చుకుంటున్నాడనీ, మనం కష్టాలు పడుతుంటే ఆనందిస్తున్నాడనీ అనుకుంటాం. కానీ, ఆయన ప్రేమ ఎంత గాఢమైనదీ, భేషరతైనదీ అంటే, ఆయనను మనమెంతగా ద్వేషిస్తామో, అంతకు వందరెట్లు మనపై అవ్యాజమైన ప్రేమను వర్షిస్తాడు.
మనం అడగకుండానే అమ్మ ప్రేమ అనే అద్భుతస్పర్శతో మనల్ని అనుగ్రహించే భగవంతుడు.. మనం కోరకుండానే నులివెచ్చని, తీయతీయని, పుష్టికరమైన పాలనూ.. మనం నేర్చుకోకుండానే వాటిని గ్రోలే కళనూ మనకు ప్రసాదించిన భగవంతుడు.. మన ఊపిరితిత్తులను నింపుకోవడానికి సమృద్ధిగా ప్రాణవాయువును సిద్ధం చేసి ఉంచిన భగవంతుడు.. ఎంత అనివార్యం కాకపోతే మనకు కన్నీళ్లు ఇస్తాడు?!. ఏమడగాలో కూడా మనకు తెలియని దశలోనే ఈ అమూల్య వరాలను అనుగ్రహించాడాయన. భగవంతుని కారుణ్యమూ, వివేకమూ అలాంటివి. నిజానికి పెద్దగా చదువు సంధ్యలు లేని సామాన్యులు సైతం నిర్వహించుకునేదీ, భావించుకునేదీ ఎట్టి షరతులూ లేని ప్రేమైకమూర్తిగానే!. తన ప్రేమను మనకు పంచడానికి ఆయన ఎలాంటి షరతులూ పెట్టడు. ఒక సాధారణ గృహిణి తను కన్న పసిపాప తన ముఖాన్ని కాళ్లతో తన్నినా ఆ కాళ్లను ప్రేమతో ముద్దాడుతుందే తప్ప కోపగించదు. అలాంటిది తల్లి కంటే లక్షల రెట్ల మాతృత్వం మూర్తీభవించిన భగవంతుడు మన హృదయాల్లో కన్నీటినెందుకు కుమ్మరిస్తాడు. భగవంతుడూ, కన్నీరు.. రెండూ అనాదిగా మన అవగాహనకు అతీతమవుతూనే ఉన్నాయి. మనం జీవించి ఉన్నంత వరకూ మన దైహిక అవసరాలను, అది కూడా సాధ్యమైన మేరకు మాత్రమే తీర్చుకోవడానికి ఉద్దేశించిన మన అల్ప మేధస్సు దివ్య వివేకపు లోతులను ఎప్పటికీ కొలవలేదు. భగవంతుని చర్యా, ప్రతిచర్యల లోలోతులు తెలియని మనం చిన్న కష్టం కలగగానే ఆయనను అపార్థం చేసుకోవడం ప్రారంభిస్తాం. నిజంగా కన్నీటిని ద్వేషించడమంటే ఏమిటో కూడా మనలో చాలామందికి తెలియదు. కన్నీటిని ద్వేషించడం అంటే స్వయంగా భగవంతుడిని ద్వేషించడమే. ఎందుకంటే కన్నీరు ఆయన ప్రియాతిప్రియమైన సంతానం.
కన్నీరు మన జీవితంలో పోషించే సానుకూల పాత్రను గురించి మనమెరుగం. దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో, కన్నీరు భగవంతుడి ప్రేమ, వివేకాల నుంచి పుట్టిన అనర్ఘ శిశువన్న సంగతిని మనమెప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు దానిపై మన ద్వేషం మాయమవు తుంది. దానిని ప్రేమించడం ప్రారంభిస్తాం. కన్నీరు అనేది మారువేషం ధరించిన చిరునవ్వు. మనం దానిని ద్వేషించడం అంటే చిరునవ్వును ద్వేషించడమే. కన్నీటిని చిరునవ్వుగా మార్చుకోవడానికి ఏకైక మార్గం.. కన్నీటిని చూసి చిరునవ్వు చిందించడమే. ప్రేమ, ఆమోదాల మధ్య నలిగిన కన్నీరే చిరునవ్వుగా రూపాంతరం చెందుతుంది. భగవంతుడు ఇచ్చిన కన్నీటిని స్వీకరించి ఆనందించడమే అత్యుత్తమ ఆరాధన. కన్నీటిని సంతోషంగా ఆమోదించే వాడే భగవంతుడిని సంతోష పెడతాడు. కన్నీరు మారు రూపంలో ఉన్న భగవంతుని మహోన్నత ఆశీస్సు. చిరునవ్వులో కన్నా కన్నీటిలో భగవంతుని వివేకాన్ని దర్శించగలిగిన వాడే నిజమైన ఆధ్యాత్మిక ద్రష్ట. కన్నీటి చుక్క మనకు సంతోషం కలిగించకపోవచ్చు. కానీ, మనల్ని వివేకవంతులను చేస్తుంది. చిరునవ్వు మనకు సంతోషం కలిగించవచ్చు. కానీ, వివేకవంతులను చేయలేదు. కనుక మనం అసంతుష్టి- జ్ఞానం, సంతుష్టి- అజ్ఞానాలలో ఒక జంటనే ఎంచుకోవాలి. భగవంతుడు మన చిరునవ్వును హరించేది దానికి రెట్టింపూ, మూడురెట్లూ చేసి తిరిగి మనకివ్వడానికే. ఆధ్యాత్మిక దృష్టి కలిగిన ఏ వ్యక్తికైనా ఈ విషయం తెలుస్తుంది. అందుకే అలాంటి వ్యక్తి మొదటి జంటనే ఎంచుకుంటాడు.
కన్నీటి చుక్క చిరునవ్వును వీడని నీడ. కనుక కన్నీటి గురించి మనకు భయం అక్కర్లేదు. దగ్గరలోనే ఎక్కడో చిరునవ్వుల వెలుగుల జడి మన కోసం ఎదురుచూస్తోందని దానర్థం. బాహ్యంగా కనిపించే ముళ్లకంచెను దాటి, కన్నీటి చుక్క అంతరిక్ష, ప్రకృతి దృశ్యంలోకి మనం మానసిక యాత్ర చేసినప్పుడు అక్కడంతటా దారి పొడవునా అంతులేని చిరునవ్వులు వికసిస్తూ కనిపిస్తాయి. కన్నీటి చుక్క తనను ప్రేమించే ఏ ఒక్కరి హృదయాన్నీ ఎప్పటికీ ముక్కలు చేయదు. మన పెదవులపై నిర్భీతీ, నిత్య సంతోషమూ వెల్లివిరిసే చిరునవ్వే భగవంతుని పట్ల మన హృదయంలోని అదృశ్య విశ్వాసానికి దృశ్యమాన సాక్ష్యం. చాలామంది కన్నీటిని ఎందుకు తప్పించుకోలేరంటే తప్పించు కోవాలని అనుకుంటారు కనుక!. వివేకవంతుడు ఎప్పుడూ ఆ పని చేయకూడదు. కన్నీరే మనకు పెన్నిధి. కన్నీరే కళ్లు చేసుకున్న అదృష్టం. కన్నీరు మన హృదయాలలో ఇంద్రధనువులను సృష్టిస్తుంది. చీకటి మబ్బుల మధ్య సూర్యుడు చిందించే చిరునవ్వే ఇంద్రధనువులను ఆవిష్కరిస్తుంది. వర్షం లేనిదే ఇంద్రధనువు లేదు. అందుకే కన్నీటి చుక్క కంటికి ఆభరణం. వింతగొలిపే వైరుధ్యం ఏమిటంటే, కన్నీటిని విజయవంతంగా తప్పించుకునే అది దగ్గరి దారి.. దాని ప్రేమలో పడటమే. కన్నీటికి దూరంగా పారిపోవాలనుకుంటే మనం చేయాల్సింది.. దానికి దగ్గరగా పరుగెత్తడమే. నాకు తెలిసినంత వరకూ, కన్నీటి పొందులో పారవశ్యంతో కరిగిపోయిన ఏ కొందరో తప్ప దాని నుంచి విజయవంతంగా తప్పించుకున్న వారు మానవ చరిత్రలోనే లేరు. కన్నీటిని ఎప్పుడైతే ఆమోదించి సహనంతో అక్కున చేర్చు కుంటామో అప్పుడు వాటిని తొలగించాలని భగవంతుడిని ప్రార్థించే సమయం కన్నా కూడా త్వరగా అవి అదృశ్యమవుతాయి.
కృష్ణుడి చిరునవ్వుల వెలుగుల మూలాలు రాముడి విషాదాశ్రువులలో దాగున్నాయి. రాముడు దు:ఖించినంతగానూ కృష్ణుడు చిరునవ్వులు చిందించాడు. బహుశా రాముడి కన్నీళ్లే కృష్ణుడి చిరునవ్వులకు కారణమై ఉంటాయి. చిరునవ్వులకూ, కన్నీళ్లకూ మధ్య ఎప్పటికీ తెగని అంతస్సంబంధం అలాంటిది. మనం జయప్రదంగా, సహజగతిలో కన్నీటిని తప్పించుకోగల మార్గాలు మూడే.
మొదటిది- కన్నీటిని స్వాగతించడం. కన్నీటి చుక్క మన తలుపు తట్టినపుడు దానిని తిరస్కరించకుండా ఉండటం. మనకు చిరునవ్వులు వర్షించే మన ప్రియ భగవానుడే కన్నీటినీ పంపించాడని భావించి సంతోషంగా ఆహ్వానించడం!. ఆయన ఇచ్చేది ఏదైనా అక్కున చేర్చుకోగదగినదే. మనమలా చేసినప్పుడు దాని ప్రభావం సగానికి సగం మాయమైపోతుంది.
రెండవది- కన్నీరు ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడం. మనల్ని అపారంగా ప్రేమించే అమిత వివేకవంతుడైన తండ్రి మనకు ఏదిచ్చినా కృతజ్ఞతలకు అర్హమే. కనుక దానిని స్వాగతించడమే కాదు, భగవంతుడికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అప్పుడు కన్నీరు మూడొంతులు బలహీనమైపోతుంది.
– శ్రీరామ్























































































Review కన్నీరు – చిరునవ్వు.