‘‘హ్యాపీ న్యూ ఇయర్’’
ఇలా కొత్త సంవత్సరం తొలిరోజును చెప్పించుకోవడమన్నా.. చెప్పడమన్నా అందరికీ ఇష్టమే. ఎందుకంటే ఆ పలకరింపులో, అలా చెప్పడంలో ఎంతో ఆనందం ఇమిడి ఉంది. మరెంతో సంతోషం దాగి ఉంది.
న్యూ ఇయర్ సంతోషాలను మూటగట్టి ఇస్తుందన్న ఓ విశ్వాసమే ఇంతటి ఆనందానికి కారణం. అందుకే కొత్త సంవత్సరం నాడు కనిపించిన అందరికీ, ఎదురైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు చెబుతుంటాం. ఇది ఆంగ్లమానం ప్రకారం వచ్చే కొత్త సంవత్సరమే కావచ్చు.. కానీ మంచి పలకరింపులకూ, మంచి పరిచయాలకూ, మంచి ఆనందాన్ని పంచుకోవడానికీ ప్రతి న్యూ ఇయర్ ఓ వేడుక. అందరిలోనూ ఆ రోజంతా సంతోషంగా ఉండాలనే కోరిక..
ఈ ఒక్క రోజే కాదు.. ఏడాది పొడవునా అందరితో అలా నవ్వుతూ, తుళ్లుతూ ఉండగలిగితే..?!
అదే జీవితానికి సరి‘కొత్త’ కానుక.
అందుకే ఈ న్యూ ఇయర్‍ను సరికొత్త జీవితానికి చేసుకుందాం వేదిక..
ఒకరోజు సంతోషం.. సంవత్సరం పొడవునా ఉండిపోవాలని కోరుకోని వారెవరు? అందుకోసం మనమేం చేయాలంటే.. మనమేం నేర్చుకోవాలంటే..
‘న్యూ ఇయర్’ చాటే వ్యక్తిత్వ వికాస స్ఫూర్తిని చదవండి!
పలకరింపు..
ఇది కొత్త సంవత్సరం నాడు ఎదుటి వారికి న్యూ ఇయర్ చెప్పడానికి మాత్రమే కాదు.. ఏడాది పొడవునా నిత్య జీవితంలో మన వ్యక్తిత్వాన్ని మేలిమలుపు తిప్పే భావ వ్యక్తీకరణ. ప్రతి భాషలోనూ, ప్రతి సంస్క•తిలోనూ పలకరింపు అనేది ఎంతో ముఖ్యమైనది. దానిని సరిగా ఉపయోగించడం నేర్చుకుంటే, అది మనల్ని మనిషిగా ఓ మెట్టు పైన ఉంచుతుంది.
‘మంచి మాటను మించిన అలంకారం లేదు’ అంటారు భర్త•హరి. అవును! మన పెద్దలు ‘వాక్‍భూషణం భూషణం’ అన్నారు.
ఎన్ని అలంకారాలైనా చేసుకోండి.
ఎన్ని అత్తర్లయినా పూసుకోండి.
ఎంత బంగారం, వజ్రాలనైనా ధరించండి.
సువాసనలు వెదజల్లే ఎన్ని సుమాలనైనా తురుముకోండి.
ఎంత ఖరీదైనా వస్త్రాలైనా ధరించండి.
ఇంకా మన ఆడంబరాన్ని చాటే ఇలాంటి అలంకారాలు ఎన్ని అయినా చేసుకోండి.
అయినా మీ అలంకరణ పూర్తికాదు. ఇవేవీ మీకు అందాన్నివ్వవు.
మంచి పలకరింపు ముందు ఇవన్నీ దిగదుడుపే.
మనిషికి మంచి మాటను మించిన అలంకారం లేదనేది నూటికి నూరు పాళ్లూ నిజం.
జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి:
జిహ్వాగ్రే మిత్రబంధవా:
జిహ్వాగ్రే బంధన ప్రాప్తి:
జిహ్వాగ్రే మరణం ధృవం
ఇది ఓ స్తోత్రం. కానీ ఎంత అందమైనది. ఎంత నిజాన్ని చాటేదీ?!
నాలుకపైనే సిరి ఉంటుందట.
నాలుక వల్లనే (మాటతీరు) సంపదలు లభిస్తాయట.
నాలుక వల్లే మిత్రులూ, బంధువులూ ఏర్పడతారట.
చివరికి ఆ నాలుక వల్లే ప్రాణహాని కూడా ప్రాప్తిస్తుందట. అంటే దీనర్థం.. నాలుకను సరిగా ఉపయోగించుకుంటే సిరిసంపదలు ఒనగూడుతాయి. బంధుమిత్రులు లభిస్తారు. అంటే, మనం మంచి మాటలు మాట్లాడటాన్ని బట్టీ ఇవన్నీ జరుగుతాయి. అదే నాలుకను చెడ్డ మా టలకు ఉపయోగిస్తే ప్రాణానికే హాని కలిగే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే నాలుకను మంచి మాటలకే ఉపయోగించడం అలవాటు చేసుకోవాలని పై శ్లోకం చెబుతోంది.
మంచిగా, మధురంగా, మృదువుగా మాట్లాడటం ఒక కళ. ఆ కళను ఏ ఒక్క రోజో కాదు.. జీవితాంతం అభ్యాసం చేయాలి.
నిత్య జీవితంలో మనం వాడే ‘ప్లీజ్, థ్యాంక్యూ, సారీ..’ వంటి పదాల వంటిదే ‘హలో.. లేదా నమస్తే’ కూడా.
ఈ చిన్న పదాలను మనం ఎంత సరిగా వాడతామో దానిని బట్టే మనకు గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. అలాంటి వారికే మంచివారన్న పేరొస్తుంది. అలాంటి వారి చుట్టూ స్నేహపూర్తి, ఆశావహ, సానుకూల వాతావరణం అల్లుకుని ఉంటుంది.
ఎదుటి వ్యక్తుల్ని పలకరించడం, వారిని చూసి అభివాదం చేయడం, నమస్కరించడం, వందనాలు సమర్పించడం, మన్నించడం, ఆప్యాయంగా కుశల ప్రశ్నలు వేయడం, విష్ చేయడం.. వీటన్నిటినీ ఆంగ్లంలో ‘గ్రీటింగ్’ అనే ఒకే ఒక్క పదం చాటుతుంది.
ఇద్దరు మనుషుల మధ్య పరిచయానికి తొలి అడుగు పడేది మంచి పలకరింపుతోనే.
ప్రతి దేశానీక, ప్రతి సంస్క•తికీ, ప్రతి సమాజానికీ, ప్రతి భాషకీ తమదైన అభివాద సంప్రదాయం ఉంటుంది.
మనం రెండు చేతులూ జోడించి నమస్కరిస్తాం. అది మన భారతీయ సంప్రదాయం.
కొన్ని దేశాల్లో ‘హాయ్.. హలో’ వంటి పలకరింపులు సంప్రదాయం.
కొందరు కరచాలనం చేస్తారు.
కొన్ని దేశాల్లో కౌగిలించుకోవడం ద్వారా ఆప్యాయతను చాటుతారు.
ఇంకొందరు మోచేతుల్ని ఒకరికొకరు తాకించుకుంటారు. ఇంకొన్నిచోట్ల నుదుటున ముద్దాడుతారు. అందుకే ఏ దేశ సంస్క•తిని అర్థం చేసుకోవాలన్నా ముందు ఆయా దేశాల పలకరింపుల తీరుతెన్నుల్ని గమనించాలి.
ఒక కొత్త భాష నేర్చుకునేటపుడు మొట్టమొదట నేర్పే మాట- పలకరింపే!
అది రోజువారీ సంభాషణలో ఒక భాగం.
మనుషులు ఒకరి ఉనికిని మరొకరికి తెలిసేలా చెప్పుకునే పదం- పలకరింపే!.
నిండు మనసుతో స్పష్టంగా చేసే చిన్న పలకరింపు ఎన్నో విషయాలను చెబుతుంది.
అవతలి వ్యక్తి ఎంత చిరాగ్గా ఉన్నా.. చిన్న పలకరింపుతో ఆప్యాయతను జోడిస్తే అవతలి వ్యక్తి మూడ్ క్షణాల్లో మారిపోతుంది.
ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధానికి వారధి వేసేది పలకరింపే.
ఇది మనసుల్లో సానుకూల స్పందనలను సృష్టిస్తుంది.
అపరిచితులను స్నేహితులుగా మారుస్తుంది.
విదేశాల్లో పెద్దల దగ్గర్నుంచి పిల్లల వరకు కుటుంబసభ్యులందరూ నిత్యం విష్ చేసుకుంటూనే ఉంటారు. ‘గుడ్ మార్నింగ్‍తో మొదలుపెట్టి ‘గుడ్ నైట్’ వరకూ వారు దేన్నీ మిస్ అవ్వరు. అందుకే విదేశీయులు వేరే దేశం వెళ్లినా అదే చిరునవ్వుతో కుటుంబసభ్యులను పలకరించినట్టే ఇతరులనూ పలకరిస్తారు. విష్ చేస్తారు. అది వారి నిత్య జీవితంలో భాగమైపోతుంది. చాలామంది ఇదేం కల్చర్? అనుకుంటారు. ఇంట్లో వాళ్లకు కూడా గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ చెప్పాలా? ఇలాంటి పలకరింపులు బయట సొసైటీలోనూ, ఆఫీసుల్లోనూ అవసరం కానీ ఇంట్లో ఎందుకని అనుకుంటారు.
కానీ, అది సరికాదు.
పలకరింపు అనేది ప్రతి చోటా అవసరమే.
ఎవరైనా మనల్ని విష్ చేసినపుడు మనకెలాంటి అనుభూతి కలుగుతుందో ‘ఫీల్’ అయితే, మనం ఎందుకు పలకరించాలో తెలుస్తుంది.
నిజానికి ఎవరినైనా పలకరించడానికి పెద్దగా రిహార్సల్స్ అవసరం లేదు. ఎలా చేయాలా? అనే ఆలోచన అవసరం లేదు.
కాస్త సాధన చేస్తే చాలు అదే నిత్య జీవితంలో ఓ మంచి అలవాటుగా మారిపోతుంది. అంతే.. ఇక మన ప్రమేయం లేకుండా, అలవోకగా ‘నమస్కారం’ అనో, ‘హాయ్’ అనో, ‘హలో’ అనే పలకరింపు సులువుగా వచ్చేస్తుంది.
అయితే ఎవరిని ఎలా పలకరించాలి? ఎలా విష్ చేయాలి? తద్వారా ఎదుటి వారి మనసులను ఎలా చూరగొనాలి? అనే విషయమై ఇటీవల అనేక అధ్యయనాలు కూడా జరిగాయి, జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ‘బిహేవియర్ సైన్స్’ అనే శాస్త్రమూ ఉంది. అదేం చెబుతుందంటే..
మనం ఎవరినైనా పలకరించడం కేవలం నోటి మాట మాత్రమే కాకూడదు. అది మన శరీర భాష (బాడీ లాంగ్వేజ్)లోనూ ప్రతిఫలించాలి. ఎదుటి వారి కళ్లలోకి చూడాలి. చిరునవ్వు నవ్వాలి. తెలిసిన వారైతే పేరు పెట్టి పలకరించాలి. తెలియని వారైతే, ‘యువర్ గుడ్ నేమ్ ప్లీజ్’ అని మర్యాదపూర్వకంగా అడగాలి. పలకరింపులో మృదుత్వం ఉట్టిపడాలి. అందరినీ ఒకేలా కాకుండా, ఎవరికి వారే ప్రత్యేకం అనిపించేలా, ఆ ఫీల్ కనిపించేలా విష్ చేయాలి. మనస్ఫూర్తిగా నవ్వాలి. చేతల్లో, పలుకుల్లో నాటకీయత ఉండకూడదు. పెద్ద వాళ్లు వస్తే గౌరవ పురస్కారంగా లేచి నిల్చోవాలి. ఎదురుపడితే చేతులు విధేయంగా పెట్టి వినమ్రత కనబరచాలి.
పలకరింపు విషయంలో ఎవరు ముందు? అనే శషభిష అసలు పనికిరాదు. ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు ఎవరు ముందు పలకరించాలనే మీమాంస రానే రాకూడదు. ఎవరు ముందు పలకరించినా పోయేదేం లేదు. ఈ విషయంలో అనవసర పట్టింపులకు పోకూడదు. ఎవరు ఎవరిని ముందు పలకరించినా తప్పు లేదు. ముందు పలకరించాల్సిన సందర్భం వస్తే ముందే ఉండాలి. దీన్ని నామోషీగా ఫీలవ్వకూడదు. దీనివల్ల చిన్నబోవడం, గొప్పతనం కోల్పవడం వంటివేమీ ఉండవు. అయితే, చిన్న వాళ్లు పెద్దవారిని ముందుగా పలకరించడం అనేది ఒక మర్యాద.
‘ఎవరు ముందు?’ అనే శంక లేకుండా ఒకరికి మనం ముందుగానే నమస్కారం పెడుతున్నామంటే లేదా పలకరిస్తున్నామంటే.. వారి పట్ల మనం గౌరవం చూపుతున్నట్టు లెక్క. అంతేకాదు, అవతలి వారి అహాన్ని తృప్తిపరిచినట్టవుతుంది కూడా. అంతేనా? వారి అవసరం అక్కడ ఉందని చాటుతున్నాం. వారి ప్రాధాన్యాన్ని పెంచుతున్నాం. అలా చేయడం వల్ల ప్రతి విషయంలో వారికి మన పట్ల అవతలి వ్యక్తుల్లో సుహృద్భావం పెరుగుతుంది. అంతకుమించి మన గౌరవం అమాంతం పెరిగిపోతుంది. మనది మంచి మనసు అనే అభిప్రాయం అవతలి వ్యక్తుల్లో కలుగుతుంది. కాబట్టి మంచి పలకరింపు వల్ల పోయేదేమీ లేదు.. లాభమే తప్ప!. అందుకే అవతలి వారిని విష్ చేయడం అనేది ఎంతో లాభదాయకమైనది. ఎదుటి వ్యక్తులకు మనపై ఉన్న అభిప్రాయాన్ని అది సమూలంగా మార్చేస్తుంది.
అన్నిసార్లూ అద్భుతాలే జరుగుతాయని కాదు.. కానీ, నవ్వుతూ పలకరించే వారు అవతలి వారికి త్వరగా నచ్చుతారు. మంచి మనిషి అనే పేరు వస్తుంది. మిత్రులనూ, వయసులో మనకంటే చిన్నవారినీ ‘హాయ్’.. అనో, ‘ఏరా’ అనో పలకరిస్తుంటాం. దీనిని ఇన్‍ఫార్మల్ గ్రీటింగ్ అంటారు. అదే పై అధికారులనూ, వయసులో మనకన్నా పెద్దవారినీ విష్ చేస్తున్నప్పుడు ఫార్మల్‍గా గ్రీట్ చేయాలి. అంటే, ‘గుడ్ మార్నింగ్’ అనాలి. లేదంటే నమస్కారం పెట్టాలి. వీటి చివర సర్, మేడమ్ అనే పదాలను ఒద్దికగా పలకాలి. ఈ గౌరవ వాచకాలను సంభాషణలో ఎంతగా వాడితే అంత మంచిది. ఫార్మల్ పరిచయాల్లో అతి చేయకూడదు. ఎంత వరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి. తొలి పరిచయంలోనే అవతలి వారికి మన జీవిత చరిత్ర చెప్పేయకూడదు సుమా!. అలాచేస్తే, అవతలి వారికి మనపై సదభిప్రాయం కలిగే అవకాశం తక్కువ. చిన్నచూపు చూసే అవకాశం కూడా ఉంది. చాలామంది పలకరింపు ‘ఎలా ఉన్నారు?’ అని మొదలవుతుంది. ‘ఆ.. ఏదో ఉన్నాంలే’ అన్నారా.. ఇక మనతో అవతలి వారు మాట కూడా మాట్లాడే అవకాశం లేదు. మనం ఎలా ఉన్నా.. బాగున్నామని సౌమ్యంగా చెప్పాలి. ఆ పలుకులో అసలు నిరాశ ధ్వనించకూడదు. నిస్ప•హ అసలే కూడదు. ఇలాంటి పెదవి విరుపు సమాధానాలు ఎదుటి వ్యక్తుల్లో మనపై దురభిప్రాయాన్ని కలిగిస్తాయి.
కొత్తగా ఏర్పడే పరిచయాలు చాలా వరకు ‘హలో..’తోనే ముగిసిపోతాయి. హలో.. హాయ్ చెప్పుకుని ఎవరికి వారు వెళ్లిపోవడం వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు.
‘మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మళ్లీ కలుద్దాం’ వంటి మాటలు కలపాలి. అప్పుడే అక్కడి నుంచి సెలవు తీసుకోవాలి. వెళ్తున్నపుడు వెళ్తున్నామని చెప్పాలి.
కొందరు ఏమాత్రం సంభాషణను పొడిగించలేరు.
ఇద్దరు పాశ్చాత్యులు కలిసినపుడు, ఒక వ్యక్తి సంభాషణను పొడిగించలేకపోతే, రెండో వ్యక్తి వెంటనే వాతావరణం మీదకో, పరిసరాల మీదకో టాపిక్ డైవర్ట్ చేస్తాడట. తద్వారా మాటల్లోకి దింపడం ఒక కళ.
ఏమీ మాట్లాడటానికి తోచనపుడు, మాటలు మరింత ముందుకు పొడిగించలేకపోయినపుడు ‘మీ డ్రెస్ బాగుంది’, ‘హెయిర్ స్టైల్ బాగుంది’ అని అనవచ్చు. ప్రశంసకు పడిపోని వారెవరూ ఉండదు కదా!. కాబట్టి ఇలాంటి ప్రశంసలు తప్పనిసరిగా అవతలి వారికి సంతోషం కలిగిస్తాయి. దాంతో సహజంగానే సంభాషణ సమయం పెరుగుతుంది.
కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఇప్పుడో పాఠమైపోయింది. శుభాభినందనలు చెప్పుకోవడం వెనుక ఎన్ని లాభాలున్నాయో, ఈ అలవాటు ఎంత సానుకూల దృక్పథానికి బాటలు వేస్తుందో కమ్యూనికేషన్ నిపుణులు నేడు కార్పొరేట్ సంస్థల్లో పాఠాలుగా చెబుతున్నారు.
వాట్సాప్, సోషల్‍మీడియా వ్యాప్తి పెరిగాక గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.
వీటిని చూసి ఇదెక్కడి గోల? అనుకోవడమూ కద్దు.
ఎందుకంటే ముక్కూ ముఖం తెలియని వారు చీటికీ మాటికీ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, తిన్నారా? ఏం చేస్తున్నారు? అని మెస్సేజ్‍లు పెడుతుంటే ఒకింత చిర్రెత్తడం సహజమే అయినా.. ప్రతి సందేశం వెనుకా ఒక కథ కూడా ఉంటుందన్న విషయం మరిచిపోవద్దు.
సోషల్‍మీడియాలో ఎక్కువగా ఇలాంటి మెస్సేజ్‍లు పెట్టేది సీనియర్ సిటిజన్ (వృద్ధులు)లేనట!.
దీనికి సంబంధించిన ఒక విషయం కూడా ప్రచారంలో ఉంది. అదేమిటంటే..
ఒకాయన వాట్సాప్ ఫ్రెండ్స్ గ్రూపులో పొద్దుట గుడ్ మార్నింగ్ అనీ, మధ్యాహ్నం తిన్నారా? అనీ, మధ్య మధ్యలో బాగున్నారా?. ఏం చేస్తున్నారు? అనీ, సాయంత్రం గుడ్ ఈవెనింగ్ అనీ, రాత్రి గుడ్ మార్నింగ్ అనీ.. ఇలా ప్రతి రోజూ సందేశాలు పెడుతుంటాడు. ఈ మెస్సేజ్‍లు చూసి అదే గ్రూపులో ఉన్న ఓ వ్యక్తి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.
‘మీకు వేరే పనేం లేదా?. రోజంతా ఇంతేనా?. ఇకపై అదేపనిగా అలాంటి మెస్సేజ్‍లు పెట్టొద్దు’ అని తన విసుగును వెలిబుచ్చాడు.
అవతలి వ్యక్తి స్పందించాడు.
‘నాయనా! నా వయసు ఎనభై. కొడుకు అమెరికాలో ఉంటాడు. కూతురు మరో దేశంలో ఉంటుంది. రోజూ కాదు.. అప్పుడప్పుడైనా నన్ను మాట వరసకు కూడా పలకరించే వారు లేరు. భార్య లేదు. నేను ఒంటరిని. ఎవరితోనూ ఏ విషయాన్నీ పంచుకోలేను. మరి, నేనున్నాననే ఉనికిని నేను ఎలా చాటుకోవాలి? నేను పెట్టే మెస్సేజ్‍లకు నాకు తిరిగి సమాధానాలు వస్తాయని కాదు.. ఒకవేళ నా నుంచి మెస్సేజ్‍లు ఆగిపోతే.. ఇక నేను లేను అనే విషయం ఈ గ్రూపులోని కొందరికైనా తెలియాలని.. తద్వారా ఆ విషయం నా పిల్లలకు తెలియాలి..’ అని బదులిచ్చే సరికి.. ఆయన్ని విసుక్కున్న వ్యక్తి విచలితుడైపోయాడు.
అందుకే, ప్రతి పలకరింపు వెనుక ఒక కథ ఉంటుంది. పలకరింపు అనేది ఆషామాషీ కాదు. అది చిరాకు పరాకుల్ని పరారు చేస్తుంది. ఫీల్ గుడ్ క్షణాలను అందిస్తుంది. గొంతులోని మృదుత్వం.. పలుకులోని ఆప్యాయత.. అవతలి మనుషులకు ఎంతో ప్రేమను పంచుతుంది.
పుట్టినరోజులకు, పెళ్లిరోజులకూ, పండుగలకూ, పబ్బాలకూ సోషల్‍మీడియాలో మనకు తెలిసిన వారు, తెలియని వారు కూడా సందేశాలు పంపుతారు. కొందరైతే అలాంటి అభినందన సందేశాలు ఎన్ని వచ్చాయో లెక్కపెట్టుకుని మురిసిపోతారు కూడా. ఇంతమంది శుభాకాంక్షలు నాకు అందాయి కదా అనే భావన మనసును ఉల్లాసభరితం చేస్తుంది. వారంతా మన సుఖసంతోషాలను కోరుకుంటున్నారని పొంగిపోతాం. మంచి జరగాలని కోరుకునే మనిషి ఆశావహ మనస్తత్త్వమే దీనికంతటికీ కారణం.
కాబట్టి, న్యూ ఇయర్ నాడే కాదు ప్రతి రోజూ మంచి మాట, మంచి పలకరింపు వంటివి ఆభరణంగా ధరిద్దాం.
అందరినీ మనవాళ్లను చేసుకుందాం.
అందరూ బాగుండాలి.
అందులో మనముండాలి.
ఈ భావనలోనే ఎనలేని సంతోషం, ఆనందం ఇమిడిఉన్నాయి.
విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్
న్యూ ఇయర్- 2024
కొత్త సంవత్సరం మీకు సకల సంతోషాలనూ, సంపదలనూ సమకూర్చాలని కోరుకుంటూ..
హ్యాపీ న్యూ ఇయర్.. హ్యాపీ న్యూ లైఫ్
Review ‘కొత్త’ సందేశం.