చిన్న పిల్లల కథలు.. మళ్లీ చెబుదాం

‘సప్త సముద్రాల అవతల మర్రిచెట్టు తొర్రలో ఉన్న చిలుకలో మాంత్రికుడి ప్రాణం ఉంటుంది..’’
కథలోని ఈ విషయం చెప్పగానే పిల్లలకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. అంతేకాదు, వాళ్ల మనసు సప్త సముద్రాల అవతలకు చేరుకుంటుంది. వారి ఊహలో మర్రిచెట్లు కనిపిస్తుంది. దాని తొర్రలో ఎర్రముక్కుతో ఉన్న చిలుక.. దానిని నులిమితే మాంత్రికుడి ప్రాణం పోతుంది. రాకుమారుడు ఈ సాహసం ఎలా చేస్తాడా అని వారి మనసు ఉత్సుకతతో నిండిపోతుంది. అయితే, విషాదం ఏమిటంటే.. ఇవ్వాళ కూడా పిల్లల చేతిలో ఒక చిలుక ఉంది. ఆ చిలుక పేరు సెల్‍ఫోన్‍. అది చిన్నారుల గొంతును పట్టుకుని ఉందా?.. పిల్లలే దాని గొంతును పట్టుకోబుతున్నారా? అనేది కాలమే తేల్చాల్సి ఉంది. సాంకేతిక పరిజ్ఞానం అవసరమైనదే. అది విలువైనది కూడా. దాని అవసరం కరోనా సమయంలో ప్రపంచానికి బాగా తెలిసివచ్చింది. పిల్లలు సెల్‍ఫోన్లు,
లాప్‍టాప్‍లు, ట్యాబ్‍లు ఆధారంగానే ఆన్‍లైన్‍ క్లాసులు విన్నారు. ఇది కచ్చితంగా సాంకేతికత వల్లే సాధ్యమైంది. అదే సమయంలో ఆ సాంకేతికతే వారి ఊహా జగత్తు గొంతు నులుముతోంది. అనవసర వీడియోలకు, గేమ్‍లకు వారిని లొంగదీస్తోంది. పనికిమాలిన, ఎటువంటి వికాసం ఇవ్వని కాలక్షేపంలో పడి పిల్లులు కొట్టుకుపోయేలా చేస్తోంది.
దేశంలో నిర్లక్ష్యానికి గురయ్యే ప్రజలు తాము అలక్ష్యానికి గురవుతున్నామని గొంతెత్తి చెప్పగలుగుతాయి. లేదా ప్రభుత్వాలే తమ పాలసీ రీత్యానో, వారికి ఓటు హక్కు ఉందనే కారణంతోనో కొన్ని పనులను వారి కోసం చేస్తుంటాయి. కానీ, పిల్లలకు ఓటుహక్కు ఉండదు. కాబట్టి వారు మిగతా వారిలా అరిచి చెప్పే వీలుండదు. చెప్పినా వారి మాట ఎవరూ వినరు. దేశంలో పిల్లలకు మించి నిర్లక్ష్యానికి గురవుతున్న వారెవరైనా ఉన్నారా? ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం.

భారతదేశంలో ఇప్పటికిప్పుడు లెక్క తీసినా రోజుకు ముప్పై మందికిపైగా పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ఉజ్జాయింపుగా చెప్పింది కాదు.. తాజా అధ్యయనాలు తేల్చిన విషయమే. పిల్లలు ఇంటా, బయటా ఎదుర్కొంటున్న ఒత్తిడి, చదువులకు సంబంధించి ఎదుర్కొంటున్న సవాళ్లు ఎవరు పట్టించుకుంటున్నారు? ‘సాంకేతిక విద్య’ విప్లవం మొదలయ్యే వరకు బాలల వికాసం ఒకలా, ఆ విద్య వల్ల వస్తున్న ఉపాధి తెలిశాక ఆ వికాసం మరోలా మారిపోయింది. ఒకప్పుడు విద్యా విధానం, తల్లిదండ్రుల చదువుతో పాటు ఆటపాటలకు, కళలకు, కథలకు చోటిచ్చే వారు. ‘కాసేపు ఆడుకోండ్రా’ అని అదిలించే వారు. కథల పుస్తకాలు తెచ్చి ఇచ్చే వారు. నేడు ఐదవ తరగతి నుంచే భవిష్యత్తులో సాధించాల్సిన ర్యాంకు గురించి పిల్లల్ని పెద్దలు హెచ్చరిస్తున్నా•
ఆటస్థలానికి, లైబ్రరీకి ఏమాత్రం చోటులేని స్కూళ్లు పిల్లల్ని సిలబస్‍ పేరుతో తోముతున్నాయి. పిల్లలకు పార్కులు అవసరం అని ప్రభుత్వాలు భావించనప్పుడు ఆటస్థలాలు అవసరం అని విద్యాసంస్థలూ భావించవు. ఈరోజు మున్సిపాలిటీలలో, నగరాలలో ఎన్ని పిల్లల పార్కులు ఉన్నాయో చూస్తే కాంక్రీట్‍ల మధ్య ఊపిరి పీల్చుకోవడానికి పెనుగులాడుతున్న పిల్లలు కనిపిస్తారు.
పిల్లలు భయం వేస్తే అమ్మమ్మ, అమ్మ కొంగుచాటుకు వెళ్లి దాక్కున్నట్టు వారికి ఆందోళన కలిగితే, గతంలో ఏ ‘చందమామ’నో పట్టుకుని కూచునేవారు. నేడు అన్ని పిల్లల పత్రికలు, పిల్లల కథల పుస్తకాలు మూతపడ్డాయి. వారికి కథలు చెప్పే అమ్మమ్మ, నాన్నమ్మలు, తాతయ్యలు రకరకాల కారణాల రీత్యా వేర్వేరు చోట్ల జీవిస్తున్నారు. ఒకవేళ వారు దగ్గరున్నా ఫోన్లు, సీరియళ్లు వారిని ఎంగేజ్‍ చేస్తున్నాయి. పిల్లలతో మాట్లాడటానికి ఎవరికీ సమయం లేదు. పిల్లలు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా సెల్‍ఫోన్లు అడ్డు నిలుస్తున్నాయి. వారి ఆందోళనకు ఓదార్పు ఏది?
ఎగరని చిలుకలు, పురి విప్పని నెమళ్లు ఉంటే ప్రకృతి ఎంత నిస్సారంగా ఉంటుందో ఆటలాడని, నవ్వని, కథ వినని, వినిపించని, బొమ్మలేయని, పాట పాడని, నృత్యం చేయని పిల్లలు ఉంటే కూడా ప్రకృతి అంతే నిస్సారంగా ఉంటుంది.

అందుకే చిలుకలను ఎగురనిద్దాం. నెమళ్లను పురివిప్పనిద్దాం. వారి ఆటస్థలాలను వారికి అప్పజెబుదాం. వారు ఆటలాడుకునే పీరియడ్‍లను స్కూళ్లలో వెనక్కి తెద్దాం. ర్యాంకులు అవసరమైన చదువులు మాత్రమే ఉండవని చెబుదాం. ఈ ప్రపంచం వారి కోసం ఎన్నో గండభేరుండ పక్షులను సిద్ధం చేసి వీపు మీద ఎక్కించి వారు కోరుకున్న విజయ తీరాలను చేరుస్తుందని నమ్మకం కలిగిద్దాం.
ఎందుకంటే బాలల వికాసమే సమాజ వికాసం కదా!.
పిల్లల్లో వికాసం కలిగించే, పెద్దల్లో ఆలోచన కలిగించే కొన్ని పిల్లల కథలు ఇక్కడ ఉన్నాయి. ఇలాంటివి కదా.. పిల్లలకు కావాల్సింది అనిపిస్తే.. అవి ఎందుకు ఈనాడు వారికి అందకుండా పోయాయో అందరూ ఆలోచించాలి.
ఇక, పదండి కథల్లోకి వెళ్దాం..

పొట్టివాడి తెలివి

ఒక రాజు గారు తన ఆస్థానంలో విదూషకుడిని ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నారు. వెంటనే మంత్రికి విషయాన్ని చెప్పాడు. మంత్రి.. ఆ పదవికి పోటీ చేయదలచిన వారందరూ ఫలానా రోజున రాజసభకు హాజరు కావాలని సేవకుల చేత చాటింపు వేయించాడు.
ఆస్థాన విదూషకుడి పదవికి పోటీ పడుతున్న వారంతా ఒకనాడు రాజసభకు వచ్చారు.
రాజు వారితో- ‘తాను నవ్వకుండా ఇతరులను నవ్వించగలవాడే విదూషకుడు అనే విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ విషయం గుర్తుంచుకుని, ఆస్థాన విదూషకులు కావాలనుకునే వారు ఒక్కొక్కరే ఈ సభను నవ్వించడానికి ప్రయత్నించండి’ అన్నారు.
ఒక్కొక్కరే లేచి తమకు తోచిన హాస్య ప్రసంగాలు చేశారు. శ్రోతలందరూ పోటీదారులే కాబట్టి ఒకరు చెప్పిన ప్రసంగానికి మరొకరు స్పందించలేదు. ఒకరు చెప్పిన దానికి ఇతరులు నవ్వలేదు. చివరకు ఒక పొట్టి వాడు లేచి నిలబడ్డాడు. వాడు ఏం మాట్లాడుతాడోనని అందరూ ఆసక్తిగా చూడసాగారు. కానీ, వాడేమీ మాట్లాడలేదు. అందరికేసీ అలా చూస్తూ ఉండిపోయాడు. ఎంతకీ మాట్లాడకపోయే సరికి వాడి ఉద్దేశం ఏమిటో ఎవరికీ అంతుచిక్కలేదు.
రాజు గారికి వాడి మీద విపరీతమైన కోపం వచ్చింది. ఇక, రాజు గారి చేతిలో ఆ పొట్టివాడికి శిక్ష తప్పదని అందరూ భావించారు.
అప్పటికీ పొట్టివాడు దిక్కులు చూస్తూ అలా నిలబడే ఉన్నాడు. అక్కడున్న అందరిలోనూ ఓపిక నశిస్తోంది.
‘ఏమిటి వీడి తంతు? నోరిప్పి మాట్లాడడు. అసలు ఏమిటీ వీడి ఉద్దేశం?’ అని అందరూ అనుకుంటున్నారు. అంతలో ఉండబట్టలేక ఒకడు- ‘చాల్లే.. వెళ్లి కూర్చో’ అన్నాడు చీత్కారంగా. వెంటనే పొట్టివాడు తన ఆసనం వద్దకు బయలుదేరాడు.
ఇదంతా చూసిన రాజుగారు ఫక్కున నవ్వారు. వెంటనే సభికులందరూ కూడా పగలబడి నవ్వారు. రాజుగారు ఆ పొట్టివాడినే తన ఆస్థాన విదూషకుడిగా నియమించుకున్నారు.
(చందమామ, 1970 జనవరి సంచిక)

చందమామ ఆత్మకథ

మీకు నేను ప్రతి రాత్రీ ఒకే వేళకు కనిపించను. అప్పుడప్పుడు అసలే రాను. అందువల్ల నేను మంచివాడిని కాదని అనుకునేరు. తల్లిదండ్రులంటే నాకూ భయభక్తులున్నాయి. చదువు, సంధ్య లేకుండా నేను అల్లరిచిల్లరిగా తిరగడం లేదు. నిజంగా నా కథ తెలిస్తే ఇలా ఎందుకు జరుగుతున్నదో మీకే తెలుస్తుంది. నా మీద మీకు అంత అపనమ్మకమూ ఉండదు. నాకు ప్రతిరోజూ వచ్చి మీతో ఆడుకోవాలనే ఉంటుంది. కానీ, ఏం చేయను?

చాలా ఏళ్ల కిందట, లక్షలు, కోట్ల సంవత్సరాల క్రితం అప్పటికి మనుషులు ఇంకా పుట్టలేదు. జంతువులు పుట్టలేదు. చెట్లు, పుట్ట లేదు. నీళ్లు కూడా లేవు. అప్పుడు మా అమ్మ నన్ను కన్నది. మా అమ్మను మీరెరుగుదురు కదా? మీరుంటున్నది మా ఒడిలోనేగా? భూదేవి మా అమ్మ. మా అమ్మ సూర్యుని కూతురు. మా అమ్మ చిన్నప్పుడు మా తాత సూర్యుడిలాగానే ఉండేదట. నేను కూడా ఎరుగుదును కానీ, నా చిన్నతనంలో మా అమ్మ ఎలా ఉండేదని. నా కళ్లు కూడా సరిగా చూడనిచ్చేవి కావు. మా అమ్మ పుట్టినప్పటి నుంచి మా తాత చుట్టూ గిరగిరా బొంగరంలా తిరుగుతూ ఆడుకుంటూ ఉండేది. అదే మా అమ్మకు ఆచారమైపోయింది.
ఇలా ఉండగా నేను పుట్టాను. పుట్టి, కాళ్లు వచ్చిన తరువాత ఒకచోట ఎలా కూర్చుంటాం? కాళ్లు, చేతులు ఊరుకోనిస్తాయా? నేను మా అమ్మ కొంగు వదిలిపెట్టకుండా ఆమె చుట్టూ అల్లిబిల్లీ తిరిగేవాడిని. చుక్కలు ఎంతో ప్రేమతో పిలిచేవి. కానీ, నేను మా అమ్మను వదిలి పెట్టేవాడిని కాదు. ఆ రోజుల్లో నేను మా తాత సూర్యుడిలాగానే ఉండేవాడిని. అందుకని అందరూ నన్ను ఎత్తి ముద్దులాడ పిలిచేవాళ్లు. మా అమ్మకు నన్ను చూస్తే ఎంతో సంతోషం. నా ఆటపాటలకు మురిసి చక్కని అద్దం ఇచ్చింది.
మీకు అద్దం ఇస్తే ఏం చేస్తారు? ముఖం చూసుకోరా? నేనూ ఆ పొరపాటే చేశాను. అద్దంలో చూసుకునే కొద్దీ నా ముఖం నాకే ఎంతో అందంగా కనిపించసాగింది. అలా చూసుకుంటూ ఉంటే ఇక ప్రపంచంలో మరొకటి అందమైనది ఉన్నట్టే కనిపించేది కాదు. అందువల్ల ఎప్పుడూ అదేపనిగా నన్ను నేను అద్దంలో చూసుకునే వాడిని. మా అమ్మ చీవాట్లు పెడుతూ ఉండేది. నేను వింటేగా? ఇలా చేయగా చేయగా కొన్నాళ్లకు నా కాంతి అంతా పోయింది. ముఖం మాడిన అట్ల పెనంలా అయిపోయింది. నాకు పుట్టెడు దు:ఖం వచ్చింది. చుట్టూ చూశాను. చుక్కలు మిలమిలా మెరుస్తున్నాయి. ఎదురుగా చూశాను. మా అమ్మ జ్యోతిలాగా వెలిగిపోతుంది. మా అమ్మకు పక్కగా చూశాను. మా తాత ఎలా ఉన్నాడని? చూడటానికి కళ్లు చాలకుండా ఉన్నాయి. మళ్లీ నన్ను నేను చూసుకున్నాను. నా ఒళ్లు నాకే కనిపించలేదు. నాకు పట్టరాని ఏడుపు వచ్చింది. పోయిన కాంతి ఎలా తిరిగి సంపాదించడం అని ఆలోచించాను. ఏమీ పాలుపోలేదు. దిగాలుపడి కూర్చున్నాను. అప్పుడే ఆకాశంలో చుక్కమ్మ కిటికీ మిలమిలలాడింది. చప్పున ఒక ఉపాయం తోచింది. అక్కడ నుంచి ఒక గంతులో పోయి చుక్కమ్మ ఇంటి తలుపు తట్టాను. ఆమె తలుపు తీయకుండానే, ‘ఎవరదీ? ఎందుకొచ్చావ్‍?’ అని కిటికీలో నుంచే గద్దించింది.
‘నేనే చుక్కమ్మా! చందమామను. కాస్త వెలుగుపెట్టవూ!’ అన్నాను.
‘ఫో..ఫో.. ఇప్పుడు కావాలసి వచ్చానా నేను? నల్లటి అట్ల పెనం ముఖం నువ్వూనూ’ అని కసిరింది.
మీ అక్కయ్య బొమ్మ ఇవ్వక కసిరితే ఎలా ఉంటుంది? నా పనీ అంతే అయ్యింది. కాళ్లీడ్చుకుంటూ ఇంకొక చుక్కమ్మ ఇంటికి వెళ్లాను.
‘ఇక్కడ మాకే లేకపోతే నీ ముఖానికెక్కడ ఇవ్వమంటావ్‍ వెలుగు?’ అని మూలిగింది ఆమె.
తతిమ్మా చుక్కమ్మలై అలాగే అన్నాయి. ఇక ఏమి చేసేది? బావురుమని ఏడ్చాను.
అప్పుడే మా తాత సూర్యుడు జ్ఞాపకం వచ్చాడు. వెంటనే ఒక్క గంతులో మా తాతయ్య ఇంటి ముందుకు వచ్చిపడ్డాను. కానీ, లోపలకు వెళ్లడం ఎలా? తలుపు తీద్దామంటే చేతులు కాలిపోవూ? అంతగా మా తాతయ్య ఇల్లు వెలిగిపోతున్నది. నేను ఏడుస్తూ అక్కడే నిలబడిపోయాను. అంతలో మా తాతయ్య ఏడు గుర్రాల బండిలో వస్తూ నన్ను చూశాడు.
‘నాయనా! ఎందుకు ఏడుస్తున్నావ్‍? నాకు చెప్పవూ? నీకేమి తక్కువ?’ అన్నాడు.
‘తాతయ్యా! నాలోని మంటలన్నీ ఆరిపోయాయి. వెలుతురంతా పోయింది. నాకన్నా చుక్కలే బాగున్నాయి. ఈ మాడు ముఖంతో మీ అందరి మధ్య నేను ఎలా ఉండాలి? తాతయ్యా.. తాతయ్యా నాకు కాస్త వెలుగునివ్వవూ’ అని జాలిగా అడిగాను.
తాతయ్య ఆలోచించి, ఆలోచించి చివరకు ఇలా అన్నాడు-
‘నువ్వు చాలా పెద్ద పొరపాటు చేశావురా. మీ అమ్మ ఇచ్చిన అద్దం సరిగా వాడుకోలేక చెడిపోయావు. ఆ అద్దం పెట్టి చూస్తే ఎన్ని రంగులు కనిపించేవి? ఎంత ప్రపంచం కనిపించేది? ఎన్ని విచిత్రాలు కనిపించేవి? సరే జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదనన్నా నేను చెప్పినట్టు చెయ్యి. నీ అద్దం ఉంది చూశావా.. దాన్ని ఎప్పుడూ నా కాంతి పడుతూ ఉండేటట్టుగా చూసుకో. ఆ అద్దం మీద వెలుతురు నీ ముఖం మీదకు తిప్పుకో. అప్పుడు నీ ముఖం తెల్లగా ఉంటుంది’ అన్నాడు.

అప్పుడు నాకు ఎంత సంతోషం కలిగిందనుకున్నారు? నాటి నుంచి మా తాతయ్య చెప్పినట్టే చేస్తున్నాను. ఆయన వెలుగును నా అద్దంలో పట్టి నా వైపునకు తిప్పుకుంటూ ఉన్నాను. నా ముఖం మళ్లీ ప్రకాశించడం మొదలుపెట్టింది. అయితే, అప్పుడప్పుడూ మా అమ్మ నా అద్దానికి, మా తాతయ్యకు అడ్డం వస్తుంది. అందువల్ల మీకు సరిగా కనిపించలేకపోతున్నాను. అంతేకానీ మరేమీ లేదు.

ఇదర్రా.. నా ఆత్మకథ. మీకు నచ్చిందనుకుంటాను. మనకు మనం నచ్చకపోవడం ఆత్మవిశ్వాస లోపమే. అది శాపంగా భావించి, మనలో మనమే కుంగిపోకూడదు. మనకు ఏదైనా బాధ కలిగితే మన పెద్దవాళ్లకు మనసు విప్పి మన బాధను చెప్పుకోగలగాలి. అప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
(చందమామ, 1947, జూలై సంచిక)

అధర్మపురపు న్యాయాధికారి
ఒకడు రామేశ్వర యాత్రకు వెళ్తూ అధర్మపురం అనే ఊరికి వస్తాడు. అప్పటికి తాను తెచ్చిన బియ్యం అయిపోతాయి. బజారుకు వెళ్లి రూపాయికి 12 కుంటాల బియ్యం వంతుల బేరం చేసుకుని, పది రూపాయలు వర్తకుడికి ఇస్తాడు. అంతడు కుంచం బోర్లించి కొలవడం మొదలుపెట్టాడు.
‘ఇదేమిటి?’ అని యాత్రికుడు వర్తకుడిని నిలదీశాడు.
‘‘ఇక్కడ ఇదింతే’ అని వర్తకుడు బదులిచ్చాడు.
దీంతో యాత్రికుడు న్యాయాధికారికి ఫిర్యాదు చేస్తాడు.
‘కుంచం తిరగేసి కొలవాలని నువ్వు బేరం చేసినపుడు అడిగావా?’ అని న్యాయాధికారి యాత్రికుడిని అడిగాడు.
‘లేదు’ అన్నాడు యాత్రికుడు.
‘తిరగేసి కొలవడానికి వ్యాపారి ఇష్టపడలేదు. బోర్లించి కొలవడానికి యాత్రికుడు అంగీకరించలేదు. కాబట్టి అడ్డంగా కొలవాలి’ అని న్యాయాధికారికి తీర్పు చెప్పాడు.

అక్బర్‍పాదుషా.. అతని మంతి
అక్బర్‍ పాదుషా దగ్గర వీరబలుడు అనే మంత్రి ఉన్నాడు. అతడు చాలా చమత్కారంగా మాట్లాడేవాడు. ఒక సాయంత్రం అక్బర్‍, ఆయన మంత్రి తీరిగ్గా కూర్చుని ఖర్జూరపు పండ్లు తింటున్నారు. అక్బర్‍ తాను తిన్న పళ్లలోని గింజలను వీరబలుడి ముందు పోగు చేస్తూ, పళ్లన్నీ తిన్న తరువాత, ‘నువ్వు ఎంత ఆకలితో ఉన్నావో నీ ఎదురుగా ఉన్న గింజలే సాక్షి’ అన్నారు. అప్పుడు వీరబలుడు రాజుగారిని చూసి, ‘నాకంటే మీకు వెర్రి ఆకలి వేసినట్టుంది. లేకుంటే గింజ కూడా మిగల్చకుండా పళ్లను తినేశారు’ అంటూ చమత్కారమాడతాడు.

ఉడతమ్మ ఉపదేశం
గోదావరి నదీ తీరాన ఒకప్పుడు చిక్కని అడవులు ఉండేవి. ఆ అరణ్యాల నిండా రకరకాల జంతువులు ఉండేవి. ఆ జంతువులను చూడటానికీ, అడవిలోని చెట్లను చూడటానికీ, దూరప్రాంతాల నుంచి చాలామంది వస్తూ పోతూ ఉండేవారు. ఆ వచ్చిన వారు తమ వెంట రకరకాల కాయలనూ, పండ్లనూ, మిఠాయిలనూ తెచ్చుకునే వారు. తిన్నంత తిని, మిగిలిన వాటిని దూరంగా విసిరేస్తూ ఉండేవారు.
ఒకసారి ఈ అడవిని చూడటానికి ఒక కుటుంబం వచ్చింది. వస్తూ వస్తూ వాళ్లు రకరకాల ఫలహారాలు తెచ్చుకున్నారు. మధ్యాహ్నం దాకా అడవిలో తిరిగారు. చూడవలసినవన్నీ చూశారు. అలసిపోయిన ఒక చెట్టు కింద కూర్చున్నారు. తీరికగా కూర్చున్న తాము తెచ్చుకున్న మూటలు, పొట్లాలు విప్పుకుని కడుపునిండా తిన్నారు. తినగా మిలిగిన వాటిని చెట్టు కిందే పారబోశారు. కాసేపు విశ్రాంతి తీసుకున్నాక వాళ్లు వెళ్లిపోయారు.
ఇదంతా ఆ చెట్టు తొర్రలో ఉన్న ఉడత పిల్లాడు చూస్తూనే ఉన్నాడు. ఎక్కడి వాళ్లు అక్కడికి వెళ్లిపోయాక, ఆ ఉడతబ్బాయి కిందకు దిగి వచ్చాడు. చెల్లాచెదురుగా చెట్టు కింద పడి ఉన్న మిఠాయి ముక్కల్ని ముందు కొంచెం రుచి చూశాడు. అవి తియ్యగానూ, రుచిగానూ ఉన్నాయి. తాను తినగలిగినన్ని తిని, మిగిలిన వాటిని అమ్మ కోసం అట్టేపెట్టాడు.
సాయంకాలం అయ్యేసరికి, ఆపసోపాలు పడుతూ అమ్మ ఉడత వచ్చింది. రాగానే, ఒక ఆకులో కాసిని మిఠాయి తునకలు ఉంచి, అమ్మ ముందుంచాడు ఉడతబ్బాయి.
కొడుకు వైపు ఆశ్చర్యంగా చూసింది ఉడతమ్మ.
జరిగిన సంగతంతా తల్లికి చెప్పాడు ఉడతబ్బాయి. చెప్పీ చెప్పీ చివరికిలా అన్నాడు-
‘అమ్మా! నువ్వు ఇంతకాలమూ, ఈ అడవిలో దొరికే పిందెల్ని, కాయల్ని మాత్రమే నాకు పెడుతున్నావు. నేనూ తింటున్నాను. ఈ ప్రపంచంలో మనం తినగలిగినవి ఇవేనేమో అనుకున్నాను. నువ్వయినా, నాకెప్పుడూ ఈ మిఠాయిల సంగతి చెప్పనన్నా చెప్పలేదు. ఎందుకుని?’ అన్నాడు ఉడతబ్బాయి.
ఉడతమ్మ చిన్నగా నిట్టూర్చింది.
‘నాన్నా! ఇలాంటివి నాకూ తెలుసు. కావాలనే వీటి గురించి నీకు చెప్పలేదు. సుఖాలకు అలవాటు పడటం తేలిక. ఆ అలవాటు నుంచి బయటపడటం కష్టం. ముందుగా- కష్టాలంటే ఏమిటో తెలియాలి. అవి బాగా అనుభవించాలి. ఆ తరువాత సుఖాలను అనుభవించాలి. కొంతకాలం సుఖపడిన తరువాత కష్టాలు వచ్చాయానుకో. అప్పుడు ఆ కష్టాలను అనుభవించడానికి పెద్దగా ఇబ్బందులు పడనవసరం లేదు. అందుకే నీకీ మిఠాయిల గురించి, అవి తినడంలో ఉన్న సుఖాలను గురించి నీకు చెప్పలేదు. అంతేకానీ, నీ మీద కోసంతో కాదు అంది ఉడతమ్మ.

‘నిన్న సాయంకాలం దాకా కుర్రాడు బాగానే ఉన్నాడు. ఈ రోజు ఉదయం తాను బయటికి వెళ్తున్నపుడు కూడా బాగానే ఉన్నాడు. ఇంత తిండి మూటగట్టుకుని ఇంటికి వచ్చేసరికి కుర్రాడు ఇలా తయారయ్యాడేమిటి?’ అనకుని ఉడతమ్మ భారమైన మనసుతో ఉడతబ్బాయిని కావలించుకుంది. బంగారు కన్నయ్యలాంటి తన కొడుకు ఇలా బండబారిపోవడానికి కారణాలేమిటో ఉడతమ్మ సరిగ్గానే ఊహించింది.
‘బుజ్జినాన్నా! నువ్వెప్పుడూ నన్ను ఏదీ అడగలేదు. ఇంతకాలానికి గాను, నువ్వు నన్ను అడిగిందల్లా మిఠాయిలు మాత్రమే. ఇలా నువ్వు అడగడం కూడా సహజమేరా పిచ్చితండ్రీ. చిన్నతనంలో అవీ ఇవీ తినాలని అందరికీ అనిపిస్తుంది. నా చిన్నప్పుడు మా అమ్మనూ, నాన్ననూ నేనూ ఏవేవో కావాలని అడిగాను. కాకపోతే ఒక చిన్న సంగతి మాత్రం నువ్వు గుర్తుంచుకో!’ అంది ఉడతమ్మ.
‘ఏమిటది?’ అడిగాడు ఉడతబ్బాయి.
‘రేపు నాకూ చిన్నతనం రావచ్చు. నాక్కూడా అవీ ఇవీ తినాలని అనిపించవచ్చు. అప్పుడు నేనూ నిన్ను అడుగుతాను. అలా అడిగినపుడు, నువ్వు ముఖం చిట్లించుకోకుండా, విసుక్కోకుండా తెచ్చిపెడితే నాకు అంతే చాలు’ అంది ఉడతమ్మ., ఉడతబ్బాయి ఆశ్చర్యపోయి అమ్మ వైపు చూశాడు.
‘అదేమిటి? మళ్లీ నీకు చిన్నతనం రావడమేమిటీ?’ అన్నా ముఖం చిట్లిస్తూ.
‘ఎల్లకాలం నేను ఇలాగే ఉండను కదా! ఎప్పటికో అప్పటి ముసలితనం ముంచుకొస్తుంది కదా! అప్పుడు నేనూ, నీకు మల్లేనే ఎక్కడికీ కదలలేను కదా! ఏమీ సొంతంగా తెచ్చుకోలేను కదా! ఆ రెండో చిన్నతనంలో, నాకు అవీ ఇవీ తినాలనిపించినప్పుడు నువ్వీ విషయాలన్నీ గుర్తుంచుకుని, విసుక్కోకుండా తెచ్చిపెట్టు. నాకు అంతకన్నా ఇంకేమీ అవసరం లేదు’ అంది ఉడతమ్మ. ‘అమ్మా! నువ్వు నన్ను చూసినంత బాగా నేనూ నిన్ను చూడాలని, ఇన్నిసార్లు ఎందుకు చెబుతున్నట్టు? ఇప్పుడలా జరగడం లేదా?’ అన్నాడు ఉడతబ్బాయి.
‘మొన్న మొన్నటి దాకా అలాగే జరుగుతూ ఉంది నాన్నా! ఈ మధ్యనే మనవాళ్లు మనుషుల్ని చూసి చెడిపోవడం ప్రారంభించారు. అందుకే ఇంతగా చెప్పవలసి వస్తోంది’ అంది ఉడతమ్మ కొడుకు వైపు జాగ్రత్తగా చూస్తూ. ఉడతబ్బాయి కళ్ల నిండా నీళ్లు తిరిగాయి.
‘అమ్మా! నాకేమీ వద్దు. నా కోసం నువ్వు కష్టపడను కూడా వద్దు. నువ్వు తప్ప ఇంకేమీ నాకు వద్దు’ అన్నాడు ఉడతబ్బాయి వాళ్లమ్మ కాళ్లను చుట్టుకుపోతూ.

(రావూరి భరద్వాజ,
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత)

ఎద్దు మెడలో గంట
ఒకసారి నూనె గానుగ ఆడించే వాడి ఇంటికి తర్క శాస్త్రం చదివిన పండితుడు వెళ్తాడు.
నూనెను కొని బయటికి వస్తూ, ‘ఓరీ! ఈ ఎద్దు మెడకు గంట ఎందుకు కట్టావు?’ అని అడుగుతాడు.
‘అయ్యా! నేను ఇంట్లో పని చేసుకుంటూ గానుగ నడుపుతున్నాను. గంట చప్పుడు అయితే ఎద్దు తిరుగుతుందని గుర్తు’ అని చెప్పాడు గానుగ వాడు.
‘ఎద్దు నిలబడే తలను తిప్పినా కూడా గంట మోగుతుంది. అప్పుడు నువ్వు మోసపోవా?’ అని అడిగాడు పండితుడు.
‘స్వామీ! నా ఎద్దు తర్కం చదవలేదు. కాబట్టి అది అలాంటి ఎత్తులు వేయలేదు’ అన్నాడు గానుగవాడు.
తార్కికుడు నవ్వుతూ వెళ్లిపోయాడు.
(పిల్లల కథలు, 1932 నాటి సంచిక నుంచి)

దొంగ తెలివి
ఒకరాత్రి ఒక దొంగ ఓ ధనవంతుడి గుర్రపుశాలకు కన్నం వేస్తాడు. గుర్రాన్ని అపహరించుకుపోతున్న సమయంలో యజమాని అతడిని పట్టుకుంటాడు.
‘గుర్రాలను దొంగిలించే పద్ధతుల్లో శ్రేష్ఠమైన పద్ధతిని తెలిపితే నిన్ను విడిచిపెడతాను’ అంటాడు యజమాని.
అప్పుడా దొంగ గుర్రం కాళ్లకు ఉన్న బంధాలను విప్పి, కళ్లాన్ని తగిలించి, గుర్రాన్ని ఎక్కి, ‘ఇదే శ్రేష్ఠమైన పద్ధతి’ అని అరుస్తూ దౌడు తీస్తాడు.

తలుపు జాగత్త్ర
ఒకరోజు ఒక యజమాని ఇంటి నుంచి బయటికి వెళ్తూ, నౌకరును పిలిచి, ‘ఇంటి తలుపు జాగ్రత్త సుమీ’ అని చెబుతాడు. అనంతరం నౌకరుకు వెంటనే బంధువుల ఇంటికి వెళ్లాల్సిన పనిబడుతుంది. దీంతో అతను యజమాని ఇంటి తలుపును ఊడదీసి, తల మీద పెట్టుకుని బయల్దేరుతాడు. సరిగ్గా ఆ సమయంలోనే యజమాని వచ్చి, ‘ఇదేమిటి?’ అని అడుగుతాడు. అందుకు ఆ నౌకరు ‘మీరు ఇంటి తలుపు జాగ్రత్త సుమీ అని చెప్పారు కదా! మా బంధువుల ఇంటికి వెళ్లాల్సి. అందుకే తలుపును జాగ్రత్తగా నెత్తిపై పెట్టుకుని వెళ్తున్నా’ అని బదులిచ్చాడు. వెంటనే ఆ యజమాని పకపకా నవ్వి, ‘నా మాటలను గమనించావే కానీ, అందులోని ఉద్దేశాన్ని గ్రహించలేకపోయావు’ అని చెప్పి ఆ నౌకరుకు ‘జాగ్రత్త’ అనడంలోని అసలు అర్థాన్ని వివరించాడు.

ఉడత – తోడేలు
అనగనగా ఒక అడవి.
ఆ అడవిలో ఒక ఉడత ఉండేది.
అది రోజూ అడవిలో దొరికే పండ్లు, లేత చిగుళ్లు తిని, ఆనందంగా గెంతుతూ, దూకుతూ తిరుగుతుండేది.
ఒకరోజు ఆ ఉడత ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదుకు దూకుంతుండగా, పట్టుతప్పి ఆ చెట్టు కింద నిద్రపోతున్న తోడేలుపై పడింది. దాంతో తోడేలుకు నిద్ర చెడింది. వెంటనే అది ఉడతను పట్టుకుని, ‘నా నిద్ర చెడగొడతావా? నిన్ను ఇప్పుడు ఏం చేస్తానో చూడు. నమలకుండానే గుటుక్కున మింగేస్తాను’ అంది కోపంగా.
తనను వదిలిపెట్టాలని బతిమలాడింది ఉడత.
‘అయితే నా ప్రశ్నకు జవాబు చెప్పు. విడిచిపెడతాను’ అంది తోడేలు.
సరేనంది ఉడత. ‘ఏ చీకూ చింతా లేకుండా నిత్యం ఇంత ఆనందంగా, హాయిగా గంతులేస్తూ మీ ఉడతలన్నీ ఎలా ఉండగలుగుతున్నాయి? మేమెందుకు అలా ఉండలేకపోతున్నాం?’ అని అడిగింది తోడేలు. ‘నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. నన్ను వదిలిపెడితే చెట్టు మీదకు వెళ్లి నీ ప్రశ్నకు జవాబు చెబుతా’ అంది తోడేలు. సరేనంటూ ఉడతను విడిచిపెట్టింది తోడేలు. ఆ వెంటనే ఉడత తుర్రున చెట్టు కొమ్మపైకి వెళ్లిపోయి, ‘మా మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు ఉండవు. ఎవరికీ హాని చేయాలనే తలంపే రాదు. అందుకే మేం నిత్యం సంతోషంగా ఉంటాం. మీరెప్పుడూ ఏవో చెడు తలంపులతో ఉంటారు. ఎదుటి జీవుల నుంచి చిన్న ఇబ్బంది కలిగినా చంపేస్తాం.. తినేస్తాం అంటారు. అలాంటి మాటలు, ఆలోచనలు మీ మనసుకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి’ అంది ఉడత. అది విన్న తోడేలు నిజమే అనుకుంది. తన ప్రవర్తనకు సిగ్గుపడింది.
(లియో టాల్‍స్టాయ్‍ కథ ఆధారంగా, బాల చెలిమి, 1990 అక్టోబర్‍ సంచిక)

ఇద్దరు యాతిక్రులు
ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశయాత్ర చేసే వాడు ఒకడు, దక్షిణ దేశం నుంచి ఉత్తర దేశయాత్ర చేసే మరొక వ్యక్తిని విజయవాడ దగ్గర కలుసుకుంటాడు. తను చూసిన వింతలను వర్ణిస్తూ, ‘నేను శాక క్షేత్రం అనే గ్రామానికి వెళ్లాను. అక్కడ విపరీతమైన తోటకూర కాడలు ఉన్నాయి. ఒక్కో కాడ చుట్టుకొలత డెబ్బై గజాలు’ అన్నాడు.
వెంటనే రెండో వ్యక్తి, ‘నేను పాత్రాపురం అనే గ్రామానికి వెళ్లాను. అక్కడ ఒక కమ్మరిని చూశాను. అతడు ఒక ఇనుప బాణలిని సాన పెడుతున్నాడు. దాని చుట్టుకొలత ఎంత అనుకున్నావు? ముప్పై ఐదు ఆమడలు సుమీ’ అన్నాడు.
‘ఆ బాణలి ఎందుకు ఉపయోగపడుతుంది?’ అని మొదటి వ్యక్తి ప్రశ్నించగా, ‘నువ్వు చూసిన పెద్ద తోటకూర కాడలు ఉడకబెట్టడానికి పనికొస్తుంది’ నవ్వుతూ జవాబిచ్చాడు అవతలి యాత్రికుడు.

ఒక రోలు.. ఒక మద్దెల
ఒకరోజు ఒక మేళగాడు దాహం తీర్చుకోవడానికి వెళ్తూ తన మద్దెలను ఒకరి ఇంటి రోటి మీద ఉంచి వెళతాడు. అప్పుడు రోలు మద్దెలతో ‘ఓ మృదంగరాజమా! నా బాధ ఎవరితో చెప్పుకోను? పిండి కొట్టడానికి, వడ్లు దంచడానికి, పచ్చళ్లు రుబ్బడానికి, ఇంకా వేర్వేరు పనులకు అర్థరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా జనం నన్ను హింసిస్తున్నారు’ అని మొరపెట్టుకుంది.
అందుకు మద్దెల, ‘నీ బాధా ఒక బాధేనా? ఉక్కు తుండులా ఉన్నావు. నా శరీరం చూడు. కొయ్యముక్కలతోనూ, ఎండిన తోలుతోనూ ఉన్నానను. నిన్ను ఒకవైపు మాత్రమే కొడతారు. నన్ను రెండువైపులా బాదుతున్నారు. నీకు రాత్రిళ్లు కొంత విశ్రాంతి అయినా దొరుకుతుంది. నన్ను రేయింబవళ్లు మోదుతున్నారు. దెబ్బలు తినలేక ఎప్పుడూ తెగ మూలుగుతుంటాను. ఇదిగో! నా పాలిటి యముడు వస్తున్నాడు. నాకు సెలవివ్వు’ అంటుంది. అంతలో మద్దెల వాడు వచ్చి, మద్దెలను మెడకు తగిలించుకుని, దాన్ని దబదబా బాడుతూ వెళ్లిపోతాడు.

కోతి – దురాశ
ఒక కోతి నూతి పక్కను కూర్చుంది. మామిడిపండు చీకుతూ, నూతిలోకి తొంగి చూసింది. కూపం లోపల వేరొక కోతి కూడా ఫలాన్ని తింటున్నట్టు దానికి కనిపించింది. ఆ కోతిని బెదిరించి, దాని పండును లాక్కోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో గట్టిగా కిచకిచమని అరించింది. నోరు తెరిచి అరవడంతో నోట్లో ఉన్న మామిడిపండు బావిలో పడిపోయింది. అప్పుడు ఆ కోతి జరిగిన దానికి చాలా బాధపడుతుంది. దురాశ వల్ల వేరే మామిడిపండు దక్కడం మాట అటుంచితే, ఉన్నది కూడా పోయిందని చింతించింది.

Review చిన్న పిల్లల కథలు.. మళ్లీ చెబుదాం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top