జగమంతా సచ్చిదానందం

లోకంలోని ఆనందమంతా ఆయన ముఖంలో సచ్చిదానందమై ప్రకాశిస్తుంది. చూసినంతనే ఆయన చిన్ముద్ర రూపం చెరగని ముద్ర వేస్తుంది. కుంకుమ చందన లేపితమై నొసటన వెలుగొందే ఆ బొట్టు ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీక.. కాషాయ వర్ణ వస్త్రాలు త్యాగనిరతిని, నిస్వార్థ చింతనను నేర్పే దివ్యాభరణాలు.. ముచ్చటగొలిపే మూడు మూర్తుల (త్రిమూర్తుల) స్వరూపాన్ని ఏకముఖమై అవతరించిన సద్గురు సచ్చిదానంద స్వరూపం..
గణపతి సచ్చిదానంద స్వామీజీ

దత్తుడు (దత్తాత్రేయుడు)లోని గురు పరంపరను, గుహుడు (కుమారస్వామి)లోని జ్ఞానసముపార్జనా శక్తిని రెండు కళ్లుగా చేసుకుని భక్తులకు పరమానందం కలిగించే అద్భుత సచ్చిదానంద స్వరూపమే.. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ.
కుమారస్వామికి ‘గుహుడు’ అని కూడా పేరు. ‘గుహ’ అంటే రహస్యంగా దాగి ఉన్న వాడనే పరమార్థం కూడా ఉంది. మన హృదయ గుహలో సూక్ష్మరూపంలో పరమాత్మ ఉంటాడని, ఆయనను కనుగొని, దర్శించడమే మానవజన్మ పరమార్థమని మన వేదాలు ఉద్ఘోషిస్తున్నాయి.
ఇక, గురువు అంటే.. జ్ఞానాన్ని బోధించే వాడని అర్థం.
ఈ గుహుడు, గురువు కలిసి మనలో సర్పాకారంలో లౌకిక గుహలోనూ, సూక్ష్మాకారంలో ఆధ్యాత్మిక గుహలోనూ దాగి ఉండే జ్ఞానాన్ని వెలికితీసే అద్భుతమూర్తి.
దేవతాతత్త్వాన్ని తెలుసుకోవాలంటే ఉపదేశం కావాలి. ఆధ్యాత్మిక చరిత్ర, రహస్యాలు తెలియాలి. అయితే, ఉపదేశించి చరిత్ర తెలిపేది, ఆ తెలిసిన చరిత్ర ద్వారా
ఉపాస్య దేవతను దర్శింప చేసేది మాత్రం సద్గురువే.
భక్తులకు ఈ జ్ఞానాన్ని కలిగించేందుకు ఒక్కో సద్గురువు ఒక్కో కాలంలో అవతరిస్తారు. అలా తగిన సమయంలో ఈ భువిపై దత్తాత్రేయుని పరంపరను అందిపుచ్చుకుని మానవాళిని నడిపించేందుకు అవతరించిన సద్గురువు గణపతి సచ్చిదానంద స్వామీజీ.
భగవంతుడిని కానీ, భగవంతుడి అవతారాలను కానీ మానవమాత్రులమైన మనం ఏమని స్తుతించగలం?
కానీ. అనాదిగా భక్తులు భగవంతుడిని స్తుతించేందుకు, కొలిచేందుకు యత్నిస్తూనే ఉన్నారు.
నారదుడు శ్రీహరి గానామృతాన్నే తన జీవన గమనం చేసుకున్నాడు.
రాముడు తన కొడుకుల చేత తన కథ పాడించుకుని విన్నాడు.
ప్రహ్లాదుడు ‘నారాయణ’ మంత్రాన్నే తన పారాయణంగా మలుచుకున్నాడు.
ధ్రువుడు విష్ణువు ఒకసారి అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యే సరికి ఆ విరాట్‍ స్వరూపాన్ని కనులారా వీక్షించి.. మాటలు రాని మూగవాడే అయ్యాడు. అప్పుడు విష్ణువు అతని నాలుకగా మారి తన కీర్తిని తనే పాడించుకున్నాడట!
హేమాడ్‍పంతు సాయిబాబా సచ్చరిత్ర రాసేందుకు బాబా చేతిలో ఒక కలం అయ్యాడు.
ఇప్పుడు సచ్చిదానంద స్వామీజీ చరిత్రను చదివేందుకు, వినేందుకు మనమూ ఒక సాధనం కాగలగాలి.
ఆయన బోధించిన జీవిత రహస్యాలు, ఆధ్యాత్మిక పరమార్థాలు మన అర్చనకు, అనుభవానికి, ఆధ్యాత్మికోన్నతికి సహాయ పడతాయి.
పైన ఉదహరించిన భక్తుల మాదిరిగానే మనకూ ఇదో గొప్ప అవకాశం. ఆయా కాలాల్లో భక్తుల చేతే భగవంతుడు తన కీర్తిని గానం చేయించుకున్న సందర్భం మళ్లీ మనకు దక్కింది. అది స్వామీజీ బోధనలను వినడం ద్వారానూ, చదవడం ద్వారానూ సంపాదించుకోవచ్చు.
ఆధ్యాత్మిక అనుభవాలు అందరివీ ఒకేలా ఉండవు. అందరికీ ఒకే మాదిరిగా జరగవు. స్వామీజీ ఉపదేశాలు, బోధనలు చదివితే కొందరికి జ్ఞానం కలుగుతుంది. మరికొందరికి ఉత్తమ భక్తికి ద్వారాలు తెరుచుకుంటాయి. ఇంకొందరికి స్వామీజీని అర్థం చేసుకునే, ఆయన అవతార ప్రాశస్త్యాన్ని కనుగొనే అవకాశం లభిస్తుంది. ఎవరికి ఏ అనుభవం, అనుభూతి కలిగినా.. మొత్తానికి శ్రద్ధాసక్తులు కలిగిన భక్తుడు ఇల్లిల్లూ తిరిగి పూలు సేకరించి మాలికలు అల్లినట్టు, సాహసం – సంపద కలిగిన భక్తుడు సప్త సముద్రాలలో దూకి మాణిక్యాలను ఏరుకువచ్చి హారాలు అర్పించినట్టు, సాధనా సంపత్తి గల భక్తుడు ఆకాశానికి ఎగిరి చుక్కలనే తుంచుకు వచ్చి గుత్తులు కట్టి సమర్పించినట్టు.. స్వామీజీ బోధనలు వింటే మనమూ అదేవిధంగా ఆయనకు చేతులు జోడించి ప్రణమిల్లగలుగుతాం.
గురుదేవులు పరమపూజ్య అవధూత

లీలా మానుష రూప
దత్తావతారాల ప్రధాన కర్తవ్యం ‘‘భిక్ష’’. కావేరీ తీరాన శోణ వస్త్ర దీక్ష పొందిన నాటి నుంచి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి నియమాలు కొన్ని మారాయి. అప్పటి నుంచి గడ్డం చేసుకోవడం మానేశారు. ఇతరులతో కలిసి భోజనం చేయడం కూడా మానేశారు. అంతకు ముందు వరకు తమ ఇళ్లలో వండి తెచ్చి పెడుతున్న తల్లులు అప్పటి నుంచి ఆశ్రమానికే వచ్చి వండిపెట్టసాగారు. అందుకోసం వారిలో వారు రోజుల వారీగా వంతులు వేసుకున్నారు. అప్పటి వరకు స్వామీజీకి వండి పెట్టిన కంఠయ్య గారికి చెయ్యి కాల్చుకునే శ్రమ తప్పింది. స్వామి వారి భోజనానికి ‘భిక్ష’ అనే వ్యవహారం కూడా ఆ రోజుల్లోనే ఏర్పడింది. స్వామి వారికి భిక్ష తయారు చేయడానికి రోజు విడిచి రోజు వస్తున్న ఓ తల్లి వెంట ఓ అవిటి పిల్ల వస్తుండేది. ఆ పిల్లకు పోలియో వ్యాధి ముదిరిపోయింది. కొన్నాళ్ల పాటు రోజూ స్వామీజీ ఆ చిన్నారి కాలికి స్వయంగా భస్మం రాసేవారు. ఒక వారం రోజుల్లో ఆ చిన్నారి కాలు బాగుపడి మామూలుగా నడవసాగింది. దీని ద్వారా మరో లీల కూడా బయటపడింది. స్వామీజీ భిక్షగా తాను అన్నం తిన్న ఏ ఇంటి రుణం ఉంచుకోరని ఈ త్యాగం ద్వారా లోకానికి వెల్లడైంది.

గణపతి సచ్చిదానంద స్వామీజీ గురించి ఒక్క ముక్కలోనో, వంద ముక్కల్లోనో చెప్పలేం కదా!. భగవంతుడి లీలల్ని, మహిమల్ని వర్ణించడానికి వేయి నాలుకలు కలిగిన ఆదిశేషుడి తరమే కాలేదట. అటువంటి భగవంతుడి అంశతో జన్మించిన గురుదేవుల గురించి లక్ష నాలుకలున్న వారు కూడా పలవరించగలరా? సూర్యుడి ప్రకాశం మరీ ఎక్కువగా ఉండటంతో ఆయన భార్య ఆ ప్రకాశాల తాలూకు వేడిని భరించలేకపోయిందట. ఆమెకు సౌకర్యం కలిగించేందుకు ఆమె తండ్రి సూర్యుడిని చిత్రిక పట్టి సన్నబరిచాడని ఒక కథ పురాణాల్లో ఉంది. అలాగే, స్వామీజీ లీలల్ని లెక్కించలేం. గణపతి సచ్చిదానంద స్వామీజీ శ్రీ జయలక్ష్మీ మాత గర్భాన అవతరించారు. ఆమె ద్వారానే శ్రీవిద్యతో పాటు యోగదీక్షను పొందారు. ఆమె సోదరీమణులకు వివాహాలు చేశారు. అనంతరం గణపతి అనుమతితో ఆశ్రమాన్ని స్థాపించారు. తద్వారా సచ్చిదానంద స్వామీజీగా అవతరించారు. శిష్యులను రక్షించడం, ధర్మాన్ని సంరక్షించడం, దత్తగురు తత్త్వ ప్రబోధలు చేయడం.. ఇవే కర్తవ్యాలుగా ఈ భువిపై అవతార పరంపరను కొనసాగిస్తున్న దివ్య మంగళ స్వరూపం.. గణపతి సచ్చిదానంద స్వామీజీ.
కర్ణాటక రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో గల అర్కావతీ, గుప్తగామినీ, కావేరీ నదుల త్రివేణీ సంగమ క్షేత్రం.. దత్తావతారాల పరంపర గల గురుదేవుల సంచార ప్రాంతం. అదే స్వామీజీ నేటి కార్యక్షేత్రం. ఈ సంగమ క్షేత్రంలోనే నివాసం ఉండే లింగణ్ణ గారనే హరితస గోత్ర పవిత్రులకు 1924 ప్రాంతంలో జయలక్ష్మి అనే కుమార్తె జన్మించింది. దత్తావతార యోగులతో కలిగిన పరిచయ భాగ్యం వల్ల జయలక్ష్మి చిన్నప్పటి నుంచే యోగ శిఖరాలను అధిరోహించిన భాగ్యశీలి. 120 ఏళ్ల ఫకీరు తాత అనే వృద్ధయోగితో కరపాత్ర యతీంద్రులనే శతవృద్ధ యతితో చేసిన శిష్యరికం ఆమెను యోగశిఖరాలు అధిరోహించేలా చేసింది. చివరకు ఆమె దత్తాత్రేయ సాక్షాత్కారాన్ని కూడా పొందారు. దత్తాత్రేయుడి ఆనతితో ఆమె నరసింహశాస్త్రికి ధర్మపత్ని అయ్యారు. వివాహానంతరం మెట్టినిల్లయిన ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా సమీపంలో గల బొమ్మెపర్తి గ్రామానికి ఆమె వెళ్లారు.
పైకి ఆదర్శ గృహిణిగా, లోన సిద్ధయోగినిగా జీవిస్తున్న జయలక్ష్మి చిత్రభాను సంవత్సరం అధిక జ్యేష్ఠ
శుద్ధ ఏకాదశీ మంగళవారం నాడు (26.5.1942) ఆది గురుమూర్తి నవీన అవతారానికి ద్వారభూత అయి జయలక్ష్మి మాతృమూర్తి అయ్యింది. ఆ లీలా బాలుడికి సత్యనారాయణ అనే పేరు పెట్టారు. పొత్తిళ్లలోనే ఆ చిన్నారికి సంగీత జ్ఞానమబ్బింది. గోరుముద్దలతోనే సాధన రహస్యాలు వంటబట్టాయి. బాలగోపాలుడిని తలపిస్తూ.. ఆ బాలుడి ఆటపాటల్లో అద్భుత మహిమలు ఆవిష్క•తమయ్యాయి. అంతలో 1953లో తన యోగివిద్యనంతా శక్తిపాత విధానంలో తన ముద్దుల బిడ్డడికి ధారాదత్తం చేసి భావి జీవితంలో అతను నిర్వర్తించాల్సిన కార్యాచరణను తెలియపరిచి, అద్భుతావహమైన విరాడ్రూప దర్శనాలను గ్రహించి, జయలక్ష్మీ మాత తనువు చాలించారు. ఆమె ఒకానొక శంకర జయంతి పర్వదినాన జన్మించి, మళ్లీ మరో శంకర జయంతి పర్వాన తనువు చాలించడం విశేషం. సత్యనారాయణ అనే బాలుడికి జన్మనిచ్చిన జయలక్ష్మి నిజంగా కారణ జన్మురాలు. ఎందుకంటే, ఆ సత్యనారాయణే భవిష్యత్తులో సద్గురు సచ్చిదానంద స్వామీజీగా అవతరించారు. అంతటి సద్గురువుకు జన్మనిచ్చిన జయలక్ష్మి.. మామూలు తల్లి కాదు.. జగన్మాత.
భార్యను పోగొట్టుకోవడంతో నరసింహశాస్త్రి గారిలో వైరాగ్యం అలుముకుంది. దీంతో సత్యనారాయణ, అతని చెల్లెళ్లు వరలక్ష్మి, సరస్వతి అప్పటికి మైసూరులో ఉంటున్న తాత గారు లింగణ్ణ గారి వద్దకు చేరారు. కడు బీదరికంలో ఉన్న లింగణ్ణ గారు ఈ పిల్లలను సాకలేకపోయారు. దీంతో సత్యనారాయణను, వరలక్ష్మిని బన్నీరుగట్టలోని తన రెండవ కూతురు శారదమ్మ వద్దకు పెంపకానికి పంపారు. బన్నీరుగట్ట బెంగళూరు సమీపంలోని చిన్న కుగ్రామం. అక్కడ చంపక దామేశ్వరి ఆలయం ఉండేది. అందులో శారదమ్మ గారి భర్త శేషగిరి శాస్త్రి అర్చకుడుగా ఉండేవారు. ఆ ఆలయంలోనూ, ఊరి చివరన ఉన్న చిట్టడివిలోనూ సత్యనారాయణ ఆధ్యాత్మిక సాధనలు నిరంతరాయంగా సాగిపోతూ ఉండేవి.
సత్యనారాయణ మామూలు బాలుడు కాడు. ఆధ్యాత్మిక సాధనలన్నింటినీ ఔపోసన పట్టేశాడు. అయిదవ ఏటనే అగస్త్య మహర్షి అనుగ్రహంతో వైద్యవిద్యను నేర్చాడు. అంతలో అనుకోకుండా సత్యనారాయణకు గండమాల అనే గొంతు వాపు వ్యాధి వచ్చింది. ఎక్కడ చూపించినా తగ్గలేదు. దీంతో మళ్లీ వరలక్ష్మి, సత్యనారాయణ తిరిగి తండ్రి వద్దకే చేర్చారు. వైరాగ్యం వల్ల తండ్రి నరసింహశాస్త్రి పిల్లలను సరిగా చూడలేకపోయారు. దీంతో పిల్లలిద్దరూ సన్యాసి జీవితం గడుపుతున్న వెంకమ్మ గారి వద్దకు చేరారు. ఈ విధంగా పొద్దుటూరులోని ప్రభుత్వ పాఠశాలలో సత్యనారాయణ 4వ తరగతిలో చేరాడు. మధుకరి వృత్తితో కొన్నాళ్లు, వారాల భోజనంతో కొన్నాళ్లు ఆ బాలుడు గడిపాడు. ఒకపక్క చదువుకుంటూనే మరోపక్క కుటుంబపోషణకు పాటుపడుతూ ఆ బాలుడు సత్యనారాయణ వయసుకు మించిన కష్టాలను అనుభవించాడు. పదో తరగతి తప్పాడు. పట్టుదలతో చెల్లెలు వరలక్ష్మి పెళ్లి చేశాడు. ఇందుకోసం పాలు అమ్మాడు. ట్యూషన్లు చెప్పాడు. పౌరోహిత్యం చేశాడు. వీవింగ్‍ ఫ్యాక్టరీలో పనికి కుదిరాడు. పోస్టాఫీసులో తాత్కాలిక జవానుగా పని చేశాడు. ఎలిమెంటరీ టీచర్‍ ట్రైనింగ్‍ తీసుకున్నాడు. ఇన్ని పనులు చేస్తూనే తన ఆధ్యాత్మిక సాధనల్లో మునిగి తేలేవాడు. అతని యోగవిద్య, ఆధ్యాత్మిక సాధన రహస్యాలు అప్పుడప్పుడు ఆ ఇంటి వారికి తెలిసినా.. వారికి అవి సంతోషం కలిగించేవి కావు. ఎందుకంటే అవి కూడు పెట్టవు కదా అనే అభిప్రాయం వారిది. కాబట్టి బంధువర్గంలో ఇవన్నీ తిరస్కరణకు గురయ్యాయి. అయినా, రహస్యంగా తన సాధనలు కొనసాగించిన సత్యనారాయణ మానస సరోవర, గండకీ యాత్రలను రహస్యంగా చేసి వచ్చాడు.
ఎవరి జీవితంలోనైనా ‘‘ఒక రోజు’’ ఉంటుంది. ఆ రోజు వచ్చిన నాడే వారేమిటో లోకానికి వెల్లడవుతుంది. సత్యనారాయణ జీవితంలోనూ ఆ రోజు రానే వచ్చింది. ఆయన ఒకసారి తన మకాంను కెసరే ఎలక్ట్రిసిటీ కాలనీలోని తన మిత్రుడి ఇంటికి మార్చాడు. అక్కడకు వెళ్లిన మొదటి రోజునే తన దీక్షా స్వీకార సమయంలో తన మాతృమూర్తి అనుగ్రహించి ఇచ్చిన ప్రశ్న గణపతి రత్నశిల మళ్లీ ప్రత్యక్షమైంది. ఆ రత్నశిల నుంచి గణపతి సందేశాలు సాక్షాత్తుగా అందాయి. ధర్మ ప్రచారానికి తన మాతృమూర్తి నిర్దేశించిన సమయం ఆసన్నమైందని గ్రహించిన సత్యనారాయణ తన సాధనను మరింత ముమ్మరం చేశారు. అప్పటితో సంపాదనను, సంసార జీవనాన్ని సత్యనారాయణ విడిచిపెట్టారు. సత్యనారాయణ కాస్తా సత్యనారాయణ స్వామి అయ్యారు. అది తరువాత కాలంలో గణపతి స్వామిగా, సత్యానంద స్వామిగా, చివరకు గణపతి సచ్చిదానంద స్వామీజీగా మారింది.
గణపతి సచ్చిదానంద స్వామీజీకి ఆంధప్రదేశ్‍, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో పెద్దసంఖ్యలో భక్తివర్గం ఉంది. ఆశ్రమం ఏర్పాటైంది. గణపతి హోమం, దివ్యనామ సంకీర్తనలు స్వామీజీ నిత్యకృత్యాలయ్యాయి. వీటిలో పాల్గొనడం భక్తుల అదృష్టంగా మారిపోయింది. ఒకనాడు స్వామీజీ శ్రీశైలయాత్ర చేపట్టారు. అక్కడ పాతాళగంగలో స్నానమాచరిస్తుండగా, అవధూత దీక్ష లభించింది. దీంతో స్వామీజీ కాషాయ వస్త్రధారి అయ్యారు. కొడుకు ఆధ్యాత్మిక దీక్షకు అబ్బురపడిన తండ్రి నరసింహశాస్త్రి.. కొడుకుకే తొలి శిష్యుడయ్యారు. యోగ బోధన, ధర్మ ప్రచారం, సంకీర్తన విధానం స్వామీజీ ఆధ్యాత్మిక జీవితంలో భాగమయ్యాయి. మహిమావిష్కరణలు వర్షపాతాలుగా భక్తులను ముంచెత్తేవి.
అర్ధం లేని అంతఃవిభేదాల విష వలయంలో చిక్కి ఉన్న భారతీయ భక్తకోటికి, ద్వేషభావ స్పర్శ లేని దైవసృష్టి కలిగించాలన్న స్వామీజీ సంకల్ప తపన ఫలితంగా అరుదైన త్రిమత సమ్మేళనానికి 1971లో వేదికైంది.. స్వామీజీ ఆశ్రమం. దైతం, అద్వైతం, విశిష్టాద్వైతం పీఠాధిపతులు సమావేశమై స్వామీజీ భావనలకు అనుగుణంగా తమ గళాలను శ్రుతి కలిపి ఆ దివ్యసభకు ‘‘రామానుజ మధ్వ శంకర కుటీరం’’ అనే నామం పెట్టారు. అదే ‘‘రా.మ.శంకర కుటీరం’’గా ప్రసిద్ధి పొందింది. జ్ఞానబోధలకు ఇది పేరొందింది. అనంతర కాలంలో శ్రీ గణపతి సచ్చిదానంద ట్రస్టు ఆవిర్భవించింది. ఆధ్యాత్మిక సాధనలతో పాటే వైద్యవిద్యా పారంగతులైన స్వామీజీ ఆ దిశగా కూడా తన పరిశోధనలను ముమ్మరం చేసి జనసామాన్యానికి సులభ చికిత్సా పద్ధతులను చేరువ చేశారు.
1978లో స్వామీజీ ఆధ్యాత్మిక జీవితం మరో మలుపు తిరిగింది. దత్తాత్రేయ ప్రచారానికి ఆనాడు స్థిరమైన పునాది పడింది. దీంతో ఆనాటి నుంచి భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఆధ్యాత్మిక ప్రభంజనం ఏర్పడింది. రెల్లు చావడిగా నిర్మితమైన ఆశ్రమం.. విశ్వప్రార్థన మందిరంగా ఆవిర్భవించింది. జయలక్ష్మీ మాత నిత్యాన్నదాన ట్రస్టు ఎందరో అన్నార్తులకు ఆకలి తీర్చే కల్పతరువు. అలాగే మరెందరో భక్తుల పాలిట మహా ప్రసాది. పర్వత శిఖరాగ్రాన, పెనుచరియల గుండెలను చీల్చుకుని పెల్లుబుకిన సెలయేటి బుగ్గలాగా 1966లో పీఠపూజా పాదుకా నిర్మాణ సమయానికే స్వామీజీ హృదయంలో మొలకెత్తి, 1978లో కాలాగ్ని శమనదత్త ప్రతిష్ఠతో పెను జలపాతమై దూకిన శ్రీ అవధూత దత్త పీఠ మహానది, 1988లో శ్రీ గణపతి సచ్చిదానంద అవధూత దత్తపీఠ ట్రస్టు ఆవిర్భావంతో వ్యావహారిక రూపాన్ని సంతరించుకుంది. ఆ సంవత్సరమే దీని నుంచి శ్రీ గణపతి సచ్చిదానంద విద్యాసంస్థ అనే పాయ చీలి విద్యాక్షేత్రంగా ఆవిర్భవించి.. ఆధ్యాత్మిక అక్షరాల పంటను ఏటేటా భారతావనికి వారసత్వంగా అందిస్తోంది.
1978లో తొలిసారిగా దత్త దేవాలయ నిర్మాణాన్ని సచ్చిదానంద స్వామీజీ చేపట్టారు. అక్కడితో మొదలైన దత్తాలయ పరంపర మొత్తం భారతదేశంలో 18 ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వీటిలో పదహారు క్షేత్రాలు దత్తావతార క్షేత్రాలు. స్వామీజీ జన్మస్థల క్షేత్రమైన మేకేదాటును ‘‘దత్తకాశి’’గా పిలుస్తారు. తూర్పు సముద్ర తీర క్షేత్రం మంగినపూడిని ‘‘దత్త రామేశ్వరం’’గా నిర్ణయించారు. ఇవికాక, మరో తొమ్మిది దత్త శిష్య క్షేత్రాలు నవనాథ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి.
స్వామీజీ ఆధ్యాత్మిక ధర్మ ప్రచారం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా దేశవిదేశాలకు పాకింది. భారతదేశమంతటా సచ్చిదానందమయమైంది. ఈ క్రమంలోనే స్వామీజీకి విదేశాల్లోనూ భక్తగణం ఏర్పాటైంది. 1976లో స్వామీజీ మొదటిసారిగా విదేశీ పర్యటన చేశారు. అనంతరం 1995 నాటికి దాదాపు 34 సార్లు విదేశీ పర్యటనలు చేశారు. అనేక దేశాల్లో ఘన సత్కారాలను పొందారు. సప్త సముద్రాల్లోనూ స్నానమాచరించిన ఘనత స్వామీజీ సొంతం. 1981 నుంచీ వేలకొద్దీ సాధకులకు క్రియా యోగ బోధనలు చేశారు. 1964 నుంచీ సంప్రదాయ పద్ధతులలో ప్రారంభమైన రాగ పద్ధతులు 1982 నుంచి రోలెండ్‍ సింథసైజర్‍పై వినూత్న పక్రియ రూపాలను ధరించి, 1990 నాటికి రాగరాగిణీ విద్యను తమలో రంగరించుకుని, ఆధ్యాత్మిక నాద కచేరీలుగా ఆధ్యాత్మిక జగతికి సంగీత శ్రుతులను వీనులవిందుగా అందిస్తున్నాయి. ఈ నాద కచేరీలు శ్రోతలకు శారీరక, మానసిక ఆరోగ్యాలను ప్రసాదిస్తూ, భక్తి భావనా తిలకం దిద్దుతూ దేశ విదేశాల్లో నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.
మానవోద్ధరణ అనేది భగవంతుని అవతార కర్తవ్యాల్లో ముఖ్యమైనది. భగవంతుని ప్రతిరూపం, దత్తగురు అవతారమైన సచ్చిదానంద స్వామీజీ కర్తవ్యం కూడా అదే కాకుండా ఎలా ఉంటుంది? ఈ కర్తవ్యం స్వామీజీ అవతారానికి మాత్రమే చెల్లిన అపూర్వ విశేషం. వివిధ కాలాలలో మహనీయులైన ఎందరో సత్పురుషులు, మహర్షులు తమ అంతర్‍దృష్టితో భగవంతుని అవతార పరంపరను మన వేదాలలో, ఉపనిషత్తులలో దర్శించారు. అదే విధంగా చిత్రదుర్గ వృద్ధ యోగీంద్రులు, ఆళ్లగడ్డ సజీవ సమాధి యోగీశ్వరులు తదితర తపస్వులు స్వామీజీ సాక్షాత్తు దత్తాత్రేయ అవతారమని నిర్ద్వందంగా ప్రకటించారు. ఈ కాలంలో సచ్చిదానంద స్వామీజీ వారి దత్తాత్రేయ అవతారానికి సమకాలీనులమై జన్మించడం మన భాగ్యం.

Review జగమంతా సచ్చిదానందం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top