
తెలుగు వారంతా మాట్లాడేది తెలుగు భాషే.. అటువంటప్పుడు ఒకటే భాష మాట్లాడే వారికి వేర్వేరు అసోసియేషన్లు ఎందుకు? అందరూ మాట్లాడే భాషకు సంబంధించి ఒకటే అపోసియేషన్ ఉంటే.. ఐక్యత కూడా బాగుంటుంది కదా.. మనుషుల మధ్య సోదరభావం, సౌభ్రాతృత్వం ఇంకా పెరుగుతాయి కదా.. ఈ ఆలోచన నుంచి బీజం పోసుకున్నదే- ‘యునైటెడ్ అమెరికన్ తెలుగు కన్వెన్షన్’. ఈ కన్వెన్షన్ ముహుర్తం వచ్చే ఏడాది, 2018 జూలై 6,7,8 తేదీలలో అమెరికాలో ఉన్న తెలుగు వారందరినీ ఒకే గొడుగు కిందకు తెస్తూ, తెలుగు వారమంతా ఒక్కటే అని చాటుతూ ఏర్పాటు కానున్న ఈ ఆర్గనైజేషన్ వెనుక ఎవరు ఉన్నారు? ఈ బృహత్తర ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది ఎవరు? అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది?… ఇవన్నీ తెలుసుకోవాలంటే.. డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి గారిని పరిచయం చేసుకోవాల్సిందే…
డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి.. వృత్తిరీత్యా వైద్యుడైనా అక్షర సేద్యంలోనూ అందె వేసిన చేయి. అంతేకాదు సాహితీప్రియుడు కూడా. అటు వైద్యం.. ఇటు సాహితీ వైవిధ్యం డాక్టర్ ప్రేమ్‌ని విభిన్నంగా తీర్చిదిద్దాయి. ‘నేను తెలుగు వాడిని’ అని గర్వంగా చెప్పుకోవడాన్ని ఇష్టపడే ఆయన తెలుగు వారినందరినీ ఒక కన్వెన్షన్ ద్వారా ఏకతాటిపైకి తెచ్చేందుకు నడుం బిగించారు. వైద్యం, సాహిత్యం, సామాజిక సేవ కార్యక్రమాల్లో తలమునకలై ఉండే డాక్టర్ ప్రేమ్ తెలుగు వారి ‘ఐడెంటిటీ’ కోసం బృహత్తర ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. మారుమూల పల్లెలో పుట్టి.. స్వయంకృషితో, ప్రతిభతో కాంతిపుంజమై వెలుగొంది విశ్వఖ్యాతి పొందిన డాక్టర్ ప్రేమ్ ‘గుండెచప్పుడు’ వినండిక..
ఆయన మనసొక సేవా మందిరం. మది నిండా ప్రేమను నింపుకొన్న మంచి మనసు… మనిషి నిండా మంచితనం.. నిలువెల్లా మానవత్వం, సేవ, ప్రేమ భావాలను రంగరించి ఆయన వైద్యం అందించే తీరు, సామాజిక సేవలో మమేకమయ్యే తీరు అద్వితీయం. వైద్యమైనా, మరే పనైనా చేతులతో కాదు.. హృదయంతో చేయాలనేది ప్రేమ్ సిద్ధాంతం. ఆ లక్షణాలే ఆయనను అమెరికాలో అత్యున్నత స్థాయిలో, స్థానంలో నిలబెట్టాయి. అందుకే ఆయన స్థానం వేరు.. ఆయన స్థాయి వేరు..ఆంధప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా నిడిగుంటపాలెం డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి స్వస్థలం. తల్లిదండ్రులు- సుందరరామిరెడ్డి, కృష్ణవేణమ్మ గార్లు. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన డాక్టర్ రెడ్డి నలుగురు సంతానంలో పెద్దవారు. స్వగ్రామంలోనే గుడ్డి దీపాల వెలుగులో ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను పూర్తి చేశారు. ఆంధ్రా లయోలా కాలేజీలో పీయూసీ తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో మెడిసిన్ పూర్తి చేశారు. రాయవెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ఏడాది పని చేసిన తరువాత అమెరికా వచ్చారు. అప్పటికే ఆయనకు వివాహమైంది. ఆయన సతీమణి కూడా వైద్యురాలే. డాక్టర్ రెడ్డి అమెరికా వచ్చిన వెంటనే న్యూయార్కులోని డౌన్‌స్టేట్ మెడికల్ సెంటర్లో ఇంటర్నల్ మెడిసిన్‌తో పాటు హృద్రోగ చికిత్సలో ప్రత్యేక శిక్షణ పొందారు. 1981లో కాలిఫోర్నియాలోని హైడెసెర్ట్ ఏరియాలో వైద్యవృత్తిని ప్రారంభించారు. ఆ తరువాత అమెరికా వ్యాప్తంగా సొంతంగా 45కి పైగా ఆస్పత్రులను నిర్మించి నిర్వహిస్తున్నారు
డాక్టర్ ప్రేమ్ విజయకేతతనం
స్వయంకృషితో, స్వశక్తితో ఉన్నత స్థానానికి.
వైద్యుడిని కావాలనేది డాక్టర్ ప్రేమ్ చిన్ననాటి కల. తన స్వయంకృషితో, ప్రతిభతో ఆయన తన కలను సాకారం చేసుకున్నారు. మానవతా విలువలకు గొప్ప మార్గదర్శకత్వాన్ని నిర్దేశించుకుని వైద్య రంగంలో చేసిన కృషి ఆయనను విశిష్ట స్థానంలో నిలబెట్టింది. డాక్టర్ ప్రేమ్ ఇంటర్నల్ మెడిసిన్, కార్డియాలజీలో డబుల్ బోర్డు సరిఫికెట్ సాధించారు. కాలిఫోర్నియాలో ఇప్పటికి వేలాది కార్డియాక్ చికిత్సలు నిర్వహించారు. కరోనరీ ఆంజియోగ్రఫీ, ఆంజియోప్లాస్టీతో సహా శాశ్వత పేస్ మేకర్ వంటి ఎన్నో ఇంప్లాంట్లు చేశారు. ఆయన ఆధునిక హెల్త్ కేర్ జాబితాలో 50 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్సియల్ ఫిజీషియన్ ఎగ్జిక్యూటివ్స్లో ఒకరుగా నిలిచారు. అలాగే, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి తొమ్మిది సార్లు, ‘టాప్ 25 మైనారిటీ ఎగ్జిక్యూటివ్స్ టు నో’, ‘టాప్ 100 ఫిజీషియన్స్ టు నో’, ‘టాప్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్సియల్ పీపుల్ ఇన్ హెల్త్‌కేర్’ జాబితాలో డాక్టర్ ప్రేమ్ చోటు సంపాదించారు. తన దూరదృష్టితో నష్టాల్లో ఉన్న ఆసుపత్రులను లాభాల బాట పట్టించారు. నష్టాల్లో ఉన్న ఆసుపత్రులకు మెరుగైన స్థాయిని అందించి, తిరిగి వాటిని మళ్లీ కమ్యూనిటీ కోసం అంకితం చేయడం డాక్టర్ ప్రేమ్ లోని గొప్ప సేవా భావానికి నిదర్శనం.
సేవకు కేరాఫ్.. ప్రైమ్ హెల్త్‌కేర్ సర్వీసెస్
కష్టాలకు ఎదురీది సమోన్నత స్థానానికి ఎదిగిన డాక్టర్ ప్రేమ్ తన మూలాలను మరిచిపోలేదు. అందుకే తగినంత సామాజిక సేవ కార్యక్రమాలనూ నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన 2001లో ఉత్తమ వైద్య సేవలు అందించే లక్ష్యంతో ‘ప్రైమ్ హెల్త్‌కేర్ సర్వీసెస్’ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అమెరికాలోని 14 రాష్ట్రాల్లో 44 హాస్పటల్స్‌ను నిర్వహిస్తున్నారు. దేశంలోనే ఇది ఐదో అతి పెద్ద ఫర్ ప్రాఫిట్ ఆసుపత్రి వ్యవస్థగా నిలిచింది. అలాగే, ‘టాప్ 10 హెల్త్ సిస్టమ్స్’లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇంకా, ‘15 టాప్ హెల్త్ సిస్టమ్స్’లో దేశంలో మూడుసార్లు, 2003 నుంచి అమెరికాలో 38 ప్రైమ్ ఆరోగ్య ఆసుపత్రులను‘టాప్ 100 హాస్పిటల్స్’లో గుర్తింపు పొందాయి. డాక్టర్ ప్రేమ్ ‘డాక్టర్ ప్రేమ్ రెడ్డి ఫ్యామిలీ ఫౌండేషన్’ను లాభార్జన లేని సంస్థగా స్థాపించారు. ఈ సంస్థ.. విశ్వవిద్యా లయాలతో సహా ఆరోగ్యం, విద్యకు పాటుపడే స్వచ్ఛంద సంస్థలకు దాదాపు 50 మిలియన్ల డాలర్లను విరాళంగా అందించింది. కళాశాల స్కాలర్షిప్పులు, బాయ్స్, గర్లస్ క్లబ్ వంటి జాతీయ సేవా సంస్థలు, ప్రపంచంలోని వెనుక బడిన ప్రాంతాల్లోని వారికి వైద్య పరికరాలు అందించడం, మెడికల్ మిషన్లు, లైబ్రరీ బిల్డింగ్స్, పబ్లిక్ హెల్త్‌కేర్ విద్య, ఉచిత కమ్యూనిటీ క్లినిక్‌ల నిర్వహణ వంటి రూపాల్లో ఈ సంస్థ వివిధ సేవలను అందిస్తోంది. ‘ప్రైమ్ హెల్త్‌కేర్ ఫౌండే షన్’ను నాన్- ప్రాఫిట్ కింద పబ్లిక్ చారిటీ సంస్థగా స్థాపించారు. ఈ సంస్థలో 14 ప్రైమ్ హెల్త్‌కేర్ హాప్పి•ల్స్ ఉండగా, వీటిలో 800 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. ఇదంతా డాక్టర్ ప్రేమ్, ఆయన కుటుంబ సభ్యులు విరాళంగా ఇచ్చినదే. డాక్టర్ ప్రేమ్.. అందరికీ విద్య, వైద్యం అందించడాన్ని తన జీవిత కాల లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అందు కోసం ఈ సంస్థ నుంచి వచ్చే నిధులను తిరిగి ప్రజా ప్రయోజనార్థమే వినియోగిస్తున్నారు. ఇటీ వలే ఆయన 40 మిలియన్ డాలర్లను కాలి ఫోర్నియా (దక్షిణ) యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ మెడిసిన్‌కు తనవంతు సాయంగా అందిం చారు. ‘సేవింగ్ హాస్పిటల్స్’, ‘సేవింగ్ జాబ్స్’, ‘సేవింగ్ లైవ్స్’.. ఈ నినాదాన్నే తన విధానంగా మలుచుకుని, 2005 నుంచి సుమారు 1.1 బిలి యన్ డాలర్లను వివిధ ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరచడానికి, ఆధునీకరించడానికి ఖర్చు చేశారు. 2010 నుంచి 4 బిలియన్ డాలర్లకు పైగా వివిధ స్వచ్ఛంద సంస్థలకు, ఫౌండేషన్లకు చారిటీ రూపంలో అందించారు. ప్రైమ్ హెల్త్ కేర్ హాస్సిటల్స్ ‘టాప్ పెర్ఫార్మర్స్ ఆన్ కీ క్వాలిటీ మెజర్స్’ జాతీయ గుర్తింపును సాధించింది. ఈ గుర్తింపునిచ్చిన ‘ది జాయింట్ కమిషన్’.. అమె రికాలోనే ప్రముఖ వైద్య గుర్తింపు సంస్థ.
సాహితీ పరిచయం..
వైద్యవృత్తిలో క్షణం తీరిక లేకుండా ఉండే డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి.. కొంత సమయాన్ని సాహిత్యాన్నికీ కేటాయిస్తారు. తెలుగు సాహిత్యాన్ని అమితంగా చదువుతారు. అలాగే పలు రచనల ముద్రణకు ఆర్థిక సాయాన్ని అందిస్తుంటారు. ‘గులాబీ తోట’, ‘పండ్లతోట’ వంటి రచనలు డాక్టర్ ప్రేమ్ చొరవతోనే ముద్రణకు నోచు కున్నాయి. అలాగే, ‘కడపటి వీడ్కోలు’ అనే తెలుగు కావ్యాన్ని ఆంగ్లంలో తర్జుమా చేశారు. ఇంకా, తనలోని సాహితీ తృష్ణను తీర్చుకునేం దుకు డాక్టర్ ప్రేమ్ వివిధ సందర్భాల్లో చేసిన రచనలన్నిటినీ ఏర్చికూర్చి ‘ద లాస్ట్ ఫేర్వెల్ అండ్ అదర్ పోయెమ్స్’ పేరుతో ఒక సంపుటిగా వెలువరించారు.
జీవితంలో మరిచిపోలేని సంఘటనలు..
డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి గారు విజయవాడ లయోలా మెడికల్ కాలేజీలో పీయూసీ చేసే రోజుల్లో అనారోగ్యానికి గురై ఒక ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఒక్కరే వైద్యుడు.. ఎంతోమంది పేషంట్లు వచ్చే వారు. అందరినీ ఆయన ఎంతో ఓపికతో చూసి చికిత్స అందించడాన్ని అప్పట్లో కళ్ళారా చూశారు. అది ఇప్పటికీ గుర్తే. వైద్యుడ్నే కావాలి అనే తన లక్ష్యానికి ఆనాడే మరింత స్ఫూర్తికలిగిందని డాక్టర్ ప్రేమ్ చెబుతుంటారు. వైద్యుడు అంటే బిజినెస్ మ్యాన్ కాదనేది డాక్టర్ ప్రేమ్ నిశ్చితాభిప్రాయం. పేషంట్‌తో ఆప్యా యంగా ఉండాలి. ప్రేమతో, హృదయంతో అతనికి ట్రీట్మెంట్ అందించాలి. డాక్టర్ ఇచ్చే మందుల కంటే ఆ డాక్టర్ అందించే ప్రేమ, ఆప్యాయతలే రోగిని త్వరగా కోలుకునేలా చేస్తాయని డాక్టర్ ప్రేమ్ అంటారు. ప్రేమ్‌సాగర్ రెడ్డి కొన్ని లక్షల మందికి ఇప్పటి వరకు ట్రీట్మెంట్ చేశారు. కొందరైతే, ‘మీరు దేవుడు. ఎవరూ నయం చేయలేని వ్యాధిని నయం చేశారు’ అని కృతజ్ఞత చాటుకుంటూ ఉంటారు. ఇటువంటి సంఘటనలు వృత్తికి మరింత దన్నుగా నిలుస్తాయని, ప్రేరణనిస్తాయని డాక్టర్ ప్రేమ్ అంటారు.
భారత్, అమెరికా విద్యావిధానాల గురించి..
రెండు దేశాల స్వరూప స్వభావాలు వేరు. ఎవరి దేశ పరిస్థితులకు తగినట్టుగా వారు ఆయా విద్యా విధానాలను రూపొందించుకున్నారు. వేటికవే గొప్పవి. ఇక, రెండింటి గురించి చెప్పు కోవాల్సి వస్తే.. అమెరికాలో సబ్జెక్టు ప్రాధా న్యంగా, విద్యార్థికి దానిపై సంపూర్ణ అవగాహన కలిగించే రీతిలో బోధన ఉంటుంది. ప్రాజెక్టులు ఇచ్చి సొంతంగా తయారు చేయమంటారు. లైబ్రరీ, ఇంటర్నెట్ తదితర అందుబాటులో ఉన్న వనరుల ద్వారా ఆ విద్యార్థి తనకు తానుగా ప్రాజెక్టును రూపొందించాలి. దీనివల్ల విద్యార్థుల్లో సబ్జెక్టులపై అవగాహన శక్తి పెరుగుతుంది. దీనివల్ల తమకు తాముగా స్వతహాగా నిర్ణయాలు తీసుకోగల స్థితికి చేరుకుంటారు. భారత్ విషయానికి వస్తే మునుపటితో పోలిస్తే విద్యా విధానం బాగా మెరుగుపడింది. గతంలో పుస్తకాల్లో ఉన్నది చదివి పరీక్ష రాస్తే, పాసైతే.. చదువు పూర్తయి• •యినట్టే. ఈ విధానంలో ఉన్నది ఉన్నట్టు చదవడమే తప్ప దానిపై విద్యార్థికి అవగాహన కానీ, ఆలోచన కానీ రేకెత్తవు. అయితే, అమెరికా విద్యా విధానం ప్రపంచంలోనే అత్యుత్తమమైనది. ఉన్నత ప్రమాణాలతో కూడి కుని ఉంటుంది. విద్యార్థి మానసిక ఎదుగుదల ప్రధానంగా ఇక్కడి విద్యా విధానాన్ని రూపొందిం చారు. ప్రస్తుతం భారత్‌లో అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో అమెరికా తరహా విద్యా విధానం
ఉంది. దీన్ని అంతకంటే కింది స్థాయి తరగతుల దశకూ తీసుకు వెళ్లగలిగితే అక్కడా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడిప్పుడే భారత్ నుంచి ఎందరో నిపుణులు దేశ విదేశాల్లో కీలక శక్తు లుగా ఎదుగుతున్నారు. అద్భుతాలను సృష్టిస్తున్నారు.
యువతకు రోల్‌మోడల్ – డాక్టర్ ప్రేమ్
యువతకు, తల్లిదండ్రులకు సందేశం..
పిల్లలు స్వతహాగా పరిస్థితులను ఆకళింపు, అవగాహన చేసుకునే మానసిక పరిణితిని ప్రాథమిక విద్య స్థాయిలోనే మెరుగు పరుచు కోవాలి. తల్లిదండ్రుల, స్నేహితుల ఇష్టాయిష్టాల మేరకు చదవడం మానేయాలి. తనకు దేనిపై ఆసక్తి ఉందో, తన ఆసక్తి, అభిరుచులు ఏమిటో ఎవరికి వారు గుర్తించుకునే స్థాయి పెరగాలి. అందుకు అనుగుణంగా చదవాలి. ఏ రంగాన్ని ఎంచుకున్నామో అందులో అత్యున్నత స్థాయికి చేరుకునేందుకు క్రమశిక్షణతో, పట్టుదలతో కృషి చేయాలి. సహజంగా పిల్లలపై తల్లిదండ్రులకు కొన్ని అంచనాలు ఉంటాయి. అయితే, వాటిని వారిపై బలవంతంగా రుద్దకూడదు. పిల్లల ఆలోచ నలు, ఆసక్తులు ఎలా ఉన్నాయో గుర్తించడమే తల్లిదండ్రుల ప్రథమ కర్తవ్యం. ఆపై ఆ దిశగా వారిని ప్రోత్సహించడం వారి విద్యుక్త ధర్మం కావాలి. అప్పుడే పిల్లలు సగం సక్సెస్ అయినట్టు. పక్కింటి అబ్బాయి ఇంజనీర్ అయ్యాడని, ఎదురింటి అమ్మాయి డాక్టర్ అయ్యిందని, తమ పిల్లలూ అలా కావాలని నూరిపోయడం అర్థరహితం. ఒకవేళ మీ పిల్లాడు సైంటిస్టు కావాలని అనుకుంటున్నాడేమో?! అతని ఆలో చనను తల్లిదండ్రులు పసిగట్టాలి. బలవంతంగా లక్ష్యాలను రుద్దడం వల్ల కొన్ని బలమైన కోరికలు బయటకు రాకుండానే సమాధి అయిపోతాయి. కాబట్టి పిల్లల మదిని కనిపెట్టాలి. ఇక, పిల్లలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాక ఇతరుల ప్రభావానికి గురి కాకూడదు. మరో రంగంలోకి వెళ్లి ఉంటే బాగుండేదేమో అనే ఆలోచనలను రానివ్వ కూడదు. మీకు ఏది ఇష్టమో అదే చేయండి. అందుకు అవసరమైతే మీ తల్లిదండ్రు లను ఒప్పించండి. మన జీవిత కాలం తొంభై సంవత్సరాలు అనుకుంటే.. అందులో ఒక వంతు యుక్త వయసు కాలం. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలే, నిర్దేశించుకునే లక్ష్యాలే మిగతా రెండొంతుల జీవిత కాలాన్ని నిర్ణ యిస్తాయి. ఈ రెండొంతుల జీవిత కాలం సవ్యంగా, సాఫీగా సాగాలంటే మనం ప్రణాళికా బద్ధంగా పని చేయాలి. యుక్త వయసులోనే జీవి తాన్ని బాగా ప్లాన్ చేసుకోవాలి. సమస్యలు, కష్టాలు, నష్టాలు లేని జీవితం ఉండదు. వాటిని నేర్పుతో, ఓర్పుతో నెగ్గుకు రావాలి.
అమెరికా వచ్చే వారి కోసం..
అమెరికాకు ఎవరు వచ్చినా రెండు ప్రధాన కారణాలతో వస్తారు. ఒకటి- ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం, రెండు- ఉద్యోగం కోసం. దేని కోసం వచ్చినా.. ముందు అమెరికాకు వచ్చే వారు ‘అమెరికా’ను చదవాలి. మనకు తగి నట్టుగా ఎక్కడా పరిస్థితులు ఉండవు. కొన్నిసార్లు పరిస్థితులకు తగినట్టుగా మనమే మారిపోవాలి. ఇతర దేశ సార్వభౌమత్వాన్ని, అమెరికా ప్రజల ఆచార వ్యవహారాలను గౌరవించడం మన ప్రాథమిక కర్తవ్యం. మీరు ఏ లక్ష్యంతో ఇక్కడకు వచ్చినా అత్యున్నత స్థాయి ప్రమాణాలతో అవి అందడానికి సిద్ధంగా ఉంటాయి. కాకపోతే వాటిని అందుకునేందుకు తగిన అర్హతలు మనకు ఉండాలి. వాటిని అందిపుచ్చుకునేందుకు తగిన నైపుణ్యాలను మనం నేర్చుకోవాలి. చేసే పనిని ఇష్టపడి చేసే వారికి అమెరికా ఓ స్వర్గం. ఇక్కడ కాలు పెట్టగల అవకాశం అందరికీ రాదు. వచ్చిన వారు దాన్ని సద్వినియోగం చేసుకోవా లంటే క్రమశిక్షణ ముఖ్యం.
ప్రైమ్ హెల్త్ కేర్ అడుగుజాడలు
1985: డాక్టర్ రెడ్డి డెస్టర్ వ్యాలీ మెడికల్ గ్రూపు స్థాపించారు. తరువాత ఇది ప్రైమ్ హెల్త్‌కేర్ ఇంటర్నేషనల్ ఇంక్గా మారింది. ఈ సంస్థ ద్వారా 3 లక్షలకు పైగా వైద్య సదుపాయాలు అందచేశారు.
1994: ప్రైమ్‌కేర్, డెస్టర్ మెడికల్ గ్రూపులను టెన్నెస్సీకి చెందిన పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీ అయిన ‘ఫైకార్’ అనే సంస్థకు అమ్మేశారు.
2001: డాక్టర్ రెడ్డి ప్రైమ్ హెల్త్‌కేర్ సర్వీసెస్‌ను స్థాపించి డెస్టర్ వ్యాలీ హాస్పిటల్‌ను మళ్లీ కొనుగోలు చేశారు.
2004: ప్రైమ్ హెల్త్‌కేర్ కాలిఫోర్నియాలోని చినో వ్యాలీ మెడికల్ సెంటర్‌ను సొంతం చేసుకుంది.
2006: ప్రైమ్ హెల్త్‌కేర్ కాలిఫోర్నియాలోని షెర్మన్ఓక్స్, మోంట్క్లెయిర్, హంటింగ్టన్ బీచ్, లా పాల్మ, వెస్ట్ అనాహీమ్ ఆసుపత్రులను సొంతం చేసుకుంది.
2007: కాలిఫోర్నియాలోని ప్యారడైజ్ వ్యాలీ హాస్పిటల్, సెంటెనెల ఆసుపత్రి వైద్య కేంద్రాన్ని ప్రైమ్ హెల్త్‌కేర్ సొంతం చేసుకుంది.
2008: ప్రైమ్ ఆరోగ్య సంస్థ ఎంసినో, గార్డెన్గ్రోవ్, శాస్టా, శాన్ డిమిస్ ఆసుపత్రులను కాలిఫోర్నియాలో స్వాధీనం చేసుకుంది.
2009: ఎన్సీనో హాస్పిటల్‌కు ప్రైమ్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ విరాళం ఇచ్చింది.
2010: ప్రైమ్ హెల్త్‌కేర్ కాలిఫోర్నియాలోని అల్వారాడో ఆసుపత్రిని స్వాధీనం చేసుకుంది. ప్రైమ్ హెల్త్‌కేర్ మాంట్‌క్లెయిర్ హాస్పిటల్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చింది.
2011: ప్రైమ్ హెల్త్‌కేర్ తొలిసారి టెక్సాస్‌లోని హర్లింగన్ మెడికల్ సెంటర్‌ను కొలుగోలు చేసింది.
2012: ప్రైమ్ హెల్త్‌కేర్ పెన్సిల్వేనియాలో రోక్సో బరో మెమోరియల్ హాస్పిటల్, బక్స్ హాస్పిటల్‌ను స్వాధీనం చేసుకుంది. నెవాడాలోని సెయింట్ మేరీ రీజనల్ మెడికల్ సెంటర్, డల్లాస్ మెడికల్ సెంటర్, టెక్సాస్‌లోని పంపా రీజనల్ మెడికల్ సెంటర్‌ను స్వాధీనం చేసుకుంది. ప్రైమ్ హెల్త్‌కేర్ డెస్టర్ వ్యాలీ ఆసుపత్రిలో 65 బెడ్ల వసతిని కల్పించింది. ప్రైమ్ హెల్త్‌కేర్ హంటింగ్టన్ బీచ్ హాస్పిటల్‌కు విరాళం అందచేసింది.
2013: ప్రైమ్ ఫౌండేషన్ టెక్సాస్‌లోని నాప్ మెడికల్ సెంటర్, సెయింట్ జాన్ హాస్పిటల్, ప్రావిడెన్స్ మెడికల్ సెంటర్లను ను సొంతం చేసుకుంది. ‘15 టాప్ హెల్త్ సిస్టమ్స్’ జాబితాలో ప్రైమ్ హెల్త్‌కేర్ చోటు సంపాదించుకుంది.
2014: ప్రైమ్ హెల్త్‌కేర్ కాలిఫోర్నియాలోని గ్లెన్డోరా కమ్యూనిటీ హాస్పిటల్, మిచిగాన్‌లోని గార్డెన్ సిటీ హాస్పిటల్‌ను సొంతం చేసుకుంది. న్యూజెర్సీలోని సెయింట్ మేరీ జనరల్ హాస్పిటల్‌కు, లా పామ్మా ఇంటర్ కమ్యూనిటీ హాస్పిటల్‌కు ఫౌండేషన్ విరాళమిచ్చింది.
2015: నెవాడాలోని ఉత్తర విస్తా హాస్పిటల్, సెయింట్ జోసెఫ్, మిస్సౌరిలోని సెయింట్ మురీ మెడికల్ సెంటర్లను సొంతం చేసుకుంది. బెకర్ హాస్పిటల్ రివ్యూలో ప్రైమ్ హెల్త్‌కేర్ ఐదో ఫర్ ప్రాఫిట్ హాస్పిటల్‌గా నిలిచింది. దేశంలోనే ‘ఫాస్ట్ గ్రోయింగ్ హాస్పిటల్ సిస్టం’గా పేరు దక్కించుకుంది.
2016: సదరన్ రీజనల్ మెడికల్ సెంటర్ ఇన్ జార్జియా, కోశోక్టన్ రీజనల్ మెడికల్ సెంటర్ అండ్ ఈస్త్ లివర్‌పూల్ సిటీ హాస్పిటల్ ఇన్ ఒహియో అండ్ సబర్బర్ కమ్యూనిటీ హాస్పిటల్ ఇన్ పెన్సిల్వేనియాలకు ప్రైమ్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ విరాళం అందించింది.
జార్జియాలోని దక్షిణ సదరన్ మెడికల్ సెంటర్, కోషోక్టన్ రీజనల్ మెడికల్ సెంటర్, ఒహియో, ఈస్ట్ లివర్‌పూల్ సిటీ హాస్పిటల్ ప్రైమ్ హెల్త్‌కేర్ ఫౌండేషన్‌లో చేరాయి. అలాగే, ఫ్లోరిడాలోని లెహై రీజనల్ మెడికల్ సెంటర్, న్యూజెర్సీలోని సెయింట్ మైఖేల్ మెడికల్ సెంటర్, కోశోక్టన్ రీజనల్ మెడికల్ సెంటర్లను స్వాధీనం చేసుకుంది.
2017: ప్రైమ్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ మిషన్ రీజనల్ మెడికల్ సెంటర్‌ను సొంతం చేసుకుంది.
డాక్టర్ ప్రేమ్ లక్ష్యం ‘యునైటెడ్ తెలుగు’
తెలుగు వారిని ‘మీరు ఎక్కడి నుంచి వచ్చారని? అడిగితే, వారి ఊరి పేరో, రాష్ట్రం పేరో చెబుతారు. ‘మాది తెలుగు రాష్ట్రం’ అని నూటికి ఒక్కరు కూడా చెప్పరు. అందుకే- ‘తెలుగు’ అనేది ఒక ఐడెంటిటీ కావాలి. తెలుగు భాష మాట్లాడే వారంతా యునైటెడ్ కావాలి’ అనే గొప్ప లక్ష్యంతో పురుడుపోసుకున్న సంస్ధ ‘యునైటెడ్ అమెరికన్ తెలుగు కన్వెన్షన్’. ఈ సంస్థ కన్వెన్షన్ 2018 జులై 6,7,8 తేదిలలో ఫిలడెల్పియాలో జరగనుంది. అందుకోసం విశేష కృషి చేస్తున్నారు అమెరికాలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి. కొత్త అసోసియేషన్ రూపకల్పన పై డాక్టర్ ప్రేమ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
అమెరికాలో ఎందరో తెలుగు వారు ఉన్నారు. అందరూ తమ తమ ప్రాంతాలకు, ప్రదేశాలకు అనువుగా రకరకాల సంఘాలు, అసోసియేషన్లు ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా ఇటీవలే అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఏర్పాటయ్యింది. ఇవి వివిధ సందర్భాలు, పండుగలు, పర్వదినాల సమయాల్లో పలు కార్య క్రమాలను నిర్వహిస్తున్నాయి. నాటా, ఆటా, తానా.. ఇవన్నీ నిర్వహించే కార్యక్రమాలకు హాజ రయ్యేది తెలుగు వారే. తెలుగు అసోసియేషన్లు నిర్వహించే అన్ని కార్యక్రమాలకు వచ్చేది తెలుగు వారే అయినపుడు అసోసియేషన్లు ఇన్ని ఎందుకు? ఒకటే ఉంటే సరిపోదా? నాతో పాటు మరికొందరికి వచ్చిన ఈ ఆలోచన ఫలి తమే- ‘యునైటెడ్ అమెరికన్ తెలుగు కన్వెన్షన్’. ఆటా, నాటా వంటి అసోసియేషన్లు అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి వేడుకైనా, పండుగైనా మరేదైనా జరుపుకోవాలని, తెలుగు వారినంద రినీ ప్రాంతాలను బట్టి వర్గీకరించకుండా, భాషను బట్టి ఒకటి చేయాలనే లక్ష్యంతో దీనికి రూపకల్పన జరుగుతోంది. అమెరికాలో ఉన్న వివిధ ప్రాంతాల, రాష్ట్రాల తెలుగు వారంతా ఇందుకు సుముఖంగా ఉన్నారు. మనం ఏ రాష్ట్రానికి చెందిన వారమైనా మనమంతా మాట్లాడేది తెలుగే. మనమంతా పుట్టింది తెలుగు గడ్డపైనే. మన సంస్క•తీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు విలక్షణమైనవి. విడివిడిగా కాదు.. వాటిని కలివిడిగా ఉండి నిర్వహించుకుంటేనే ఆనందం మరింత అవర్ణమవుతుంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ అనే భేద భావాలు లేకుండా అందరినీ ఒకే వరుసలోకి తెచ్చే ప్రయత్నమిది. ఈ ప్రయత్నంలోనే ఫిలడెల్ఫియాలో 2018 సంవత్సరం, జూలై 6,7,8 తేదీలతో కన్వెన్షన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ ‘యునైటెడ్ అమెరికన్ తెలుగు కన్వెన్షన్’ను చేయడానికి అంతా సిద్ధం చేశాం. కొత్త కన్వెన్షన్‌ను సక్సెస్ చేసేందుకు అంతా కలిసి పని చేయాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాం. మూడు ఆర్గనైజేషన్లు కలిసి పని చేయడం వలన మన సమిష్టితత్త్వం మరింత పెరుగుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. మన ఐక్యత పెరుగుతుంది. ఆదాయం పెరిగితే మనం చేపట్టే సేవా కార్య క్రమాల విలువ, సంఖ్య పెరుగుతుంది. అమె రికాలో ప్రస్తుతం ఉన్న ప్రతి తెలుగు ఆర్గనైజేషన్ వివిధ సందర్భాల్లో ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వ హిస్తూనే ఉన్నాయి. అన్నీ మంచి కార్యక్రమాలే. అటువంటి వాటిని సమష్టిగా నిర్వహిస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయనేది మా ఆలోచన. ఈ క్రమంలోనే హైదరాబాద్ శిల్పారామంలో యునైటెడ్ కన్వెన్షన్ తరపున యునైటెడ్ కల్చరల్ అండ్ చారిటబుల్ ఈవెంట్ కండక్ట్ చేస్తే బాగుం టుందని. ఈ సంవత్సరం డిసెంబరు చివరి వారంలో ఈ ఈవెంట్‌ను నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తున్నాం. అనంతరం వచ్చే సంవ త్సరం జూలైలో తెలుగు కన్వెన్షన్ ఉంటుంది. దీని ద్వారా అమెరికాలో ఉన్న లక్షలాది మంది తెలుగు వారందరం ఒక్కటయ్యేందుకు ప్రయత్ని స్తున్నాం. ‘మనం తెలుగువారం’ అనే భావనతో అమెరికాలో ఉన్న తెలుగు వారంతా ఇందుకు కలిసి వస్తారని భావిస్తున్నాం. ఈ కన్వెన్షన్ ద్వారా వచ్చే ఆదాయంతో మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధప్రదేశ్ల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతా లను అభివృద్ధి చేయడం, తాగునీటి సౌకర్యం కల్పించడం, టాయిలెట్స్ తదితర మౌలిక సదు పాయాలు సమకూర్చడం, నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం వంటి సేవా కార్య క్రమాలను ముమ్మరం చేయాలని అను కొంటున్నాం. ఈ కన్వెన్షన్ ద్వారా తెలుగు వారం దరినీ ఏకం చేయడంతో పాటు మాతృభూమి గర్వించేలా సేవా కార్యక్రమాలు చేపట్టి అందరి అభిమానాన్ని చూరగొంటామనే నమ్మకం ఉంది. హైదరాబాద్‌లోని శిల్పారామంలో నిర్వహించే కన్వెన్షన్‌ను అత్యంత వైభవంగా నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందులో తెలుగు సంస్క•తీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నాం.
Review డాక్టర్ ప్రేమ్.