భారత్‍లో అంతర్భాగమే కానీ.. అంతా ‘ప్రత్యేకం’. ఇక్కడ చేసిన చట్టాలు అక్కడ చెల్లవు. ఇక్కడి ఆదేశాలు అక్కడ అమలు కావు. ఇక్కడి కేంద్రం మాట అక్కడ చెల్లుబాటు కాదు. ఇదీ కశ్మీర్‍లో పరిస్థితి. దీనికంతటికీ కారణం.. 370వ అధికరణం (ఆర్టికల్), 35 (ఏ) నిబంధన. అప్పట్లో ఏవో కారణాలతో తాత్కాలిక ప్రాతిపదికన చేసిన ఈ రాజ్యాంగ అధికరణం డెబ్బై ఏళ్లుగా కశ్మీర్‍లో కొనసాగుతోంది. ఫలితంగా అక్కడ జెండా వేరు. అక్కడి ఉగ్రమూకల అజెండా వేరు. ఆగస్టు 5న భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంత్రి అమిత్‍షా ద్వయం తీసుకున్న సాహసోసేత, సంచలన నిర్ణయం.. ఈ ఆర్టికల్‍కు చరమగీతం పాడింది. ఇప్పుడు కశ్మీర్‍కు స్వయం ప్రతిపత్తి లేదు. భారత్‍లో అంతర్భాగం. దేశంతో పాటుగా అక్కడ త్రివర్ణ పతాకమే రెపరెపలాడుతుంది. కశ్మీర్‍లో ఆగస్టు 15 తొలి స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు కూడా అంబరాన్ని తాకేలా సాగాయి. భారతీయ జనతా పార్టీ ఈ అధికరణం రద్దుకు వేసిన ముందడుగు దేశ చరిత్రలోనే మైలురాయి. కశ్మీర్‍లో కొత్త సమీరాలు వీ••
భారతదేశ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. జమ్మూకశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయం దేశంలో పెను సంచలనాన్ని సృష్టించింది. జమ్మూకశ్మీర్‍ను రెండుగా విభజిస్తూ మోదీ సర్కారు ఆగస్టు 5న కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి కశ్మీర్‍కు స్వయం ప్రతిపత్తి అధికారం కల్పించే 370వ అధికరణం భూతల స్వర్గంగా పేర్గాంచిన ఆ ప్రాంతాన్ని ఉగ్రవాద భూతాల స్వర్గంగా మార్చేసింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో కశ్మీర్ తిరిగి భూలోక స్వర్గంగా మారే పరిస్థితులు ఏర్పడనున్నాయి. దీనికంతటికీ కారణమైన పరిస్థితులను ఒకసారి వెనక్కి వెళ్లి పరిశీలిస్తే..
భారతీయ జనతా పార్టీకి పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ తన జీవితాంతం జమ్మూ కశ్మీర్ విలీనం కోసం ఉద్యమించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. జమ్మూ కశ్మీర్‍ను పరిపూర్ణంగా భారత్ యూనియన్‍లో విలీనం చేయాలనేది ఆయన కల. అందుకోసం ఉద్యమిస్తూనే ప్రాణాలు వదిలారు. ఇన్నేళ్లకు 370వ అధికరణాన్ని రద్దు చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీ ముఖర్జీ కలలను సాకారం చేసినట్టయింది. శ్యామాప్రసాద్ ముఖర్జీ బెంగాలీ. న్యాయవాది. విద్యావేత్త. సర్ అశుతోష్ ముఖర్జీ తనయుడీయన. నెహ్రూ మంత్రి వర్గంలో ఒకసారి మంత్రిగా కూడా పని చేశారు. జమ్మూ కశ్మీర్ సహా పలు అంశాలపై నెహ్రూతో విభే దించి మంత్రి పదవిని వదులుకున్నారు. 1951, అక్టోబర్ 21న జన్‍సంఘ్‍ను స్థాపించారు. జమ్మూ కశ్మీ ర్‍కు ప్రత్యేక రాయితీలు ఏమీ లేకుండా భారత్‍లో కలిపి వేయాలంటూ ఉద్య మాన్ని ప్రారంభించారు. కనీసం, జమ్మూ, లడఖ్‍లనైనా భారత్‍లో సంపూర్ణంగా విలీనం చేయాలని డిమాండ్ వినిపించారు. 1953, మే 11న అనుమతి లేకుండా జమ్మూ కశ్మీర్‍లోకి ప్రవేశించారనే నెపంతో షేక్ అబ్దుల్లా నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసి జైలులో ఉంచింది. అక్కడే అనా రోగ్యానికి గురైన ఆయన.. జూన్ 23న గుండెపోటుతో మర ణించారు. ఇప్పుడు ఆయన నాటి కలను మోదీ సర్కారు నెరవేర్చడం ద్వారా ఆయనకు నిజమైన నివాళిని అర్పించి నట్టయ్యింది. కాగా, మోదీ సైతం 370 అధి కరణం రద్దుకు ఒకప్పుడు తీవ్ర పోరాటం చేసిన వ్యక్తే. ఆ ఆర్టికల్‍ను రద్దు చేయాలని, ఉగ్రవాదాన్ని రూపుమాపాలని, దేశాన్ని కాపాడాలని ఆయన బీజేపీలో కొనసాగిన కొత్తలోనే డిమాండ్‍ను బలంగా వినిపించారు. అయితే ఆయన ప్రణా ళికను కేంద్ర హోం మంత్రి అమిత్ షా పక్కాగా అమలు చేశారు. రద్దుకు ప్రతిపాదించగా, ఉభయ సభల్లోనూ (లోక్‍సభ, రాజ్యసభ) ఎదురే లేకుండా పోయింది. డీఎంకే, కాంగ్రెస్ మరికొన్ని చిన్నా చితకా పార్టీలు గొంతులు చించుకున్నా.. చివరకు కాంగ్రెస్ పార్టీలోనే 370వ అధికరణం రద్దుపై గందరగోళం చెలరేగడం విశేషం. ఆ ఆర్టికల్ రద్దును వ్యతిరేకించాలో, మద్దతివ్వాలో తెలియని స్థితిలోకి కాంగ్రెస్ పడిపోయింది.
రద్దుకు దారి దొరికిందిలా…
ఆర్టికల్ 370 రద్దు కోసం రాజ్యాంగంలో ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం మోదీ సర్కారుకు కలగలేదు. జమ్మూ కశ్మీర్‍కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆ అధికరణంలోని మూడవ సెక్షన్ కింద ఉన్న ఒక నిబంధన మోదీ ప్రభుత్వానికి వెదక బోయిన తీగ కాలికి తగిలినట్టుగా ఉపయోగ పడింది. నిజానికి 370వ అధికరణాన్ని రద్దు చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. దీనిని రద్దు చేయాలంటే ఆర్టికల్ 368 కింద రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన దావాలు కూడా ఇందుకు ప్రతిబంధకంగా మారాయి. ఈ నేప థ్యంలో 370 ఆర్టికల్‍లోని 3వ సెక్షన్ బీజేపీ ప్రభుత్వానికి వరంగా మారింది. రాజ్యాంగ సవరణ అవసరాన్ని అది తప్పించింది. ఇంతకీ 3వ సెక్షన్‍లో ఏముందంటే.. 370 ఆర్టికల్‍లో ఉద్ఘాటిస్తున్న అంశాల మాటెలా ఉన్నా.. ఒక బహి రంగ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రపతి ఈ అధికర ణాన్ని ఏ క్షణంలో, ఎప్పుడైనా రద్దు చేయవచ్చు. లేదా కొన్ని మినహాయింపులు, సవరణలతోనే దాన్ని అమలు చేయవచ్చు’ అనేది సెక్షన్ 3లో ఉన్న సారాంశం. 370 అధికరణం చెల్లుబాటులో లేకుండా చేయడానికి పార్లమెంటు ఆమోదం పొందాల్సిన అవసరాన్ని కూడా 3వ సెక్షన్ తప్పించింది. అందువల్ల రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా ఆ పనిని కేంద్రం పూర్తి చేసింది. దీనిపై గతంలో జారీ అయిన రాష్ట్రపతి ఉత్తర్వులను అధిగమించింది. ఇలాంటి ఆదేశాల జారీకి రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం అవసరం. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‍లో అసెంబ్లీ రద్దయ్యింది. రాష్ట్రపతి పాలన ఉంది. దీంతో ఆర్టికల్ రద్దుకు అన్ని విధాలుగా మార్గం సుగమమైంది.
అసెంబ్లీ లేని.. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలంటే..
జమ్మూ కశ్మీర్, లడఖ్‍ల విభజనతో ఇప్పుడు దేశంలో కేంద్ర పాలిత ప్రాంతాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. జమ్మూకశ్మీర్‍ను అసెంబ్లీ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతంగా, లడక్‍ను అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా కేంద్రం ప్రకటించింది. అసలు కేంద్ర పాలిత ప్రాంతమంటే ఏమిటో తెలుసుకోవాలి. శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలకు నేరుగా లెఫ్ట్నెంట్ గవర్నర్ పాలనలో ఉండే కేంద్ర పాలిత ప్రాంతాలకు తేడా ఏమిటి? శాసనసభ ఉండే కేంద్ర పాలిత ప్రాంతానికి పాక్షికంగా రాష్ట్ర హోదా ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్న శాసనసభ ఉంటుంది. ముఖ్య మంత్రి, మంత్రుల నేతృత్వంలో పాలన సాగుతుంది. కేంద్రం నియమించిన లెఫ్ట్నెంట్ గవర్నర్ ఆధ్వర్యంలో పాలన నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుల మేరకు పనిచేసినా.. ప్రతి విషయంలోనూ మంత్రివర్గ సూచనలు, సిఫా ర్సులు పాటించాల్సిన పని లేదు. గవర్నర్ స్వతంత్రంగానే ప్రభుత్వానికి సంబంధం లేకుం డానే నిర్ణయాలు తీసుకోగలరు. గవర్నర్‍కు ఈ విషయంలో పూర్తి అధికారాలు ఉంటాయి. ప్రస్తుతం దేశంలో శాసనసభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో ఢిల్లీ, పుదుచ్చేరి ఉన్నాయి. తాజాగా జమ్మూ కశ్మీర్ కూడా ఆ జాబితాలో చేరింది. ఇక, శాసనసభ లేని కేంద్ర పాలిత ప్రాంతం నేరుగా కేంద్ర ప్రభుత్వ పాలనలో ఉంటుంది. ఇక్కడ కూడా గవర్నర్ ద్వారానే పాలన జరుగుతుంది. గవర్నర్‍కు సలహాదారుల బృందం ఉంటుంది. లెఫ్ట్నెంట్ గవర్నర్ కేంద్రం తరపున పాలిస్తారు. ప్రస్తుతం లడఖ్ శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగానే ఉండనుంది.
వరుసగా కీలక నిర్ణయాలు..
అద్భుత విజయంతో రెండోసారి వరుసగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ.. తాను ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నట్టు.. అందుకోసం తెగించి ముందుకు సాగుతున్నట్టు జరుగుతున్న పరిణామాలను బట్టి గమనించ వచ్చు. ఆర్టికల్ 370 రద్దు వంటి సాహసోపేత నిర్ణయానికి ముందే బీజేపీ ప్రభుత్వం మరో సాహస నిర్ణయాన్ని తీసుకుంది. అది తలాక్‍కు ‘తలాక్’ చెప్పడం. మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా ముస్లిం మహిళలకు భర్త విడాకులు ఇచ్చే పద్ధతిని నిషేధిస్తూ ఈ ఏడాది జూలై 30న పార్లమెంటు ఆమోదించింది. మొన్నటి లోక్‍సభ ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించడంతో తలాక్ నిషేధానికి ప్రతిపక్షాల నుంచి పెద్దగా ప్రతిఘటనే లేకపోయింది. సరిగ్గా ఇది జరిగిన ఐదు రోజులకు జమ్మూ కశ్మీర్ విషయంలో కీలక ముందడుగు వేసింది. మోదీ సర్కారు ఈ నిర్ణయం ద్వారా దేశంలో మెజారిటీ ప్రజల మద్దతును చూరగొంది. ఈ ఆనందంలో బీజేపీ ప్రభుత్వం మరికొన్ని హామీలను నెరవేర్చేందుకు ముందుకు సాగుతోంది. వీటిలో కీలకమైనది- రామజన్మభూమి అంశం. ప్రస్తుతం దీనిపై సుప్రీంకోర్టులో రోజువారీ వాదనలు కొనసాగుతున్నాయి. ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ వివాదానికి మోదీ సర్కార్ ఏ క్షణంలోనైనా ఫుల్‍స్టాప్ పెట్టే అవకాశాలున్నాయి. భారతీయ జనతా పార్టీ 370 ఆర్టికల్ రద్దు, రామ మందిర నిర్మాణం, ఉమ్మడి పౌరస్మ•తి.. ఈ మూడే తమకు ఓట్లు రాబట్టే అంశాలని మొదటి నుంచీ గుర్తిస్తోంది. 2014లో మొదటిసారి అధికారంలోకి వచ్చినపుడు బీజేపీ నిజానికి ఈ మూడింటి విషయంలో ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోయింది. అప్పట్లో ఎన్టీఏ పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, పార్లమెంటులో వ్యతిరేకత తదితర అంశా లను పరిగణనలోకి తీసుకుని గప్‍చిప్‍గా ఉండి పోయింది. అయితే ఈ విషయంలో బీజేపీ తీరుపై హిందువుల్లో కాస్తంత వ్యతిరేకతా గూడుకట్టుకుంది. బీజేపీ మళ్లీ మళ్లీ అధికారంలోకి రావాలంటే హిందువుల మద్దతు తప్పనిసరి. అందుకోసమే కీలకమైన ఈ మూడింటి విషయంలో ఆ పార్టీ చకచకా పావులు కదుపుతోందని దేశ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
భారత్‍లో ఇప్పుడు 28 రాష్ట్రాలు.. 9 కేంద్ర పాలిత ప్రాంతా
భారతదేశంలో ఇప్పటి వరకు 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి. ఆర్టికల్ 370 రద్దు తరువాత పరిణామాల దృష్ట్యా ఇకపై 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల సమాహారంగా భారత్ అవతరించింది. జమ్మూ కశ్మీర్ పరి పాలన అంతా కేంద్రం చేతుల్లోకి రావడం, కశ్మీర్‍కు రాకపోకలపై అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ఆ ప్రాంత అభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది. వచ్చే రోజుల్లో దేశంలో ఇతర ప్రాంతాలతో సంబంధాలు ఏర్పడటం వల్ల సామాజికంగా, సాంస్క•తికంగా, ఆర్థికంగా కశ్మీర్‍లో అనూహ్య మార్పులు వస్తాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కొన్నాళ్లు హింసాకాండకు తెర తీసినా, పాలన అంతా కేంద్రం గుప్పిట్లోకి రావడం వల్ల ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి అవకాశం ఉంటుంది. కశ్మీర్ లోయలో ఉగ్రవాదానికి ఊతమిస్తున్న వేర్పాటువాదులు, రాళ్ల దాడులతోనే కాలక్షేపం చేసే యువతను దారిలోకి తీసుకువచ్చే అవకాశాలు మెరుగవుతాయి. దీంతో కశ్మీర్‍కు కొత్త పెట్టుబడులు వచ్చిన అభివృద్ధి పథంలో పయనించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ముస్లిం మెజారిటీ ఉన్న ఆ ప్రాంతలో హిందూ జనాభా పెరిగే అవకాశం ఉంది. శాంతిభద్రతలకు, జమ్మూ కశ్మీర్ ప్రాంత అభివృద్ధికి ఇది ఒక మహత్కర పరిణామంగా దేశ చరిత్రలో నిలిచిపోతుంది
ఆర్టికల్ 370: రద్దుకు ముందు
రాజ్యాంగంలోని 21వ భాగంలో ఆర్టికల్ 370 పొందుపరిచారు. ఈ ఆర్టికల్ ప్రకారం.. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే జమ్మూ కశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు, ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాలు ఉంటాయి. దేశంలోని మిగతా రాష్ట్రాలకు రాజ్యాంగం ప్రకారం కల్పించే సౌకర్యాలు కశ్మీర్‍కు వర్తించవు.
రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక సమాచార అంశాలు మినహా పౌరసత్వం, ప్రాపర్టీ ఓనర్‍షిప్, ప్రాథమిక హక్కులు కశ్మీర్‍కు భిన్నం.
ఈ రాష్ట్ర ప్రజలకు ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది.
కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేకంగా జెండా ఒక జెండా ఉంది.
ఆర్టికల్ 360 (ఆర్థిక అత్యవసర స్థితి) ఈ రాష్ట్రంలో అమలు చేయలేం.
పంచాయతీలకు ప్రత్యేక హక్కులు లేవు.
శాసనసభ కాల పరిమితి ఆరు సంవత్సరాలు.
హిందువులు, సిక్కులు తదితర మైనారిటీలకు రిజర్వేషన్లు లేవు.
వేరే రాష్ట్రాల వారు ఇక్కడ భూములు, ఆస్తులు కొనడం నిషేధం.
సమాచార హక్కు చట్టం ఇక్కడ వర్తించదు.
వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఇక్కడి మహిళ పెళ్లాడితే ఆమెకున్న స్థానిక పౌరసత్వం, హక్కులు పోతాయి.
ఆర్టికల్ 370 ప్రకారం కశ్మీర్‍లో ఆర్థిక ఎమర్జెన్సీ విధించే అధికారం కేంద్రానికి ఉండదు. కేవలం యుద్ధం, బాహ్య ఒత్తిళ్ల వల్ల ఏర్పడే పరిణామాల నేపథ్యంలోనే కశ్మీర్‍లో ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం లేదా రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే కేంద్రం ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉంది.
ఆర్టికల్ 370 అంటే.
భారత రాజ్యాంగంలోని 21వ భాగంలో ఉన్న ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కశ్మీర్‍కు స్వతంత్ర ప్రతిపత్తి లభిస్తోంది.
ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక అధికారాలూ, రాజ్యాంగం, ప్రత్యేక జెండా అమలులో ఉన్నాయి. ఇవన్నీ తాత్కాలిక ప్రాతిపదికన కొనసాగాలనే నిబంధన కూడా ఈ ఆర్టికల్‍లో ఉంది.
ఈ ఆర్టికల్ ప్రకారం.. రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, కమ్యూనికేషన్ల రంగాలపై మాత్రమే భారత ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన చట్టాలు మాత్రమే కశ్మీర్‍లో అమలు చేయగలదు. మిగిలిన రంగాల్లో ఏం చేయాలన్నా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
అంటే కశ్మీర్ ప్రజల పౌరసత్వం, ఆస్తి హక్కులు, ప్రాథమిక హక్కులు వంటి వాటికి సంబంధించి ప్రత్యేక రాజ్యాంగం అమల్లో ఉంటుంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 360 ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని కశ్మీర్‍లో విధించే అవకాశం కేంద్రానికి లేదు.
విదేశీ దురాక్రమణలు, యుద్ధ పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే అత్యవసర పరిస్థితి విధించే అధికారం కేంద్రానికి ఉంటుంది.
ఆర్టికల్ 35 (ఏ) అంటే..
కశ్మీర్‍లో శాశ్వత నివాసానికి సంబంధించినదే ఆర్టికల్ 35 (ఏ). కశ్మీర్ రాజ్యాంగంలో దీని ప్రస్తావన ఉంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 కిందకు కూడా వస్తుంది. 1954లో ప్రధాని జవహర్‍లాల్ నెహ్రూ సూచనల మేరకు బాబూ రాజేందప్రసాద్ రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా దీనిని రాజ్యాంగంలో పొందుపరిచారు. దీని ప్రకారం..
భారత్‍లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలెవరూ జమ్మూ కశ్మీర్‍లో భూములు, ఇతర ఆస్తుల్ని కొనుగోలు చేయలేరు. ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి కూడా కుదరదు.
కశ్మీర్‍లో 1911 సంవత్సరానికి ముందు పుట్టిన వారు, అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారే శాశ్వత నివాసుల కింద లెక్క. వారికి మాత్రమే రాష్ట్రంలో భూములు, స్థిరాస్తుల కొనుగోలుపై హక్కులు ఉంటాయి.
రాష్ట్ర ప్రభుత్వం కల్పించే స్కాలర్‍షిప్‍లు, ఇతరత్రా ప్రయోజనాలు దీర్ఘకాలం కశ్మీర్‍లో నివసిస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం సర్టిఫికెట్లను మంజూరు చేస్తుంది. రాష్ట్ర స్థిర నివాసులు ఎవరో నిర్వచించడం కోసం చట్టాలు చేసే అధికారాన్ని జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఈ 35 (ఏ) ద్వారా కల్పించింది.
1956లో రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చినపుడు 35 (ఏ) ఆర్టికల్ చేర్చిన తేదీ మే 14, 1954కి పదేళ్ల ముందు కశ్మీర్‍లో స్థిర నివాసం ఉన్న వారందరూ కశ్మీర్‍లో శాశ్వత నివాసులేనని స్పష్టం చేసింది. అయితే కశ్మీర్ మహిళలు ఎవరైనా ఇతర ప్రాంతాలకు చెందిన వారిని వివాహం చేసుకుంటేవారు ఆస్తి హక్కుల్ని కోల్పోతారు. ఈ నిబంధన మహిళా హక్కుల్ని కాలరాస్తోందని ఆ తరువాత కాలంలో విమర్శలు వెల్లువెత్తి కొందరు కోర్టును ఆశ్రయించారు.
2002లో జమ్మూ కశ్మీర్ కోర్టు వివాహం చేసుకునే సదరు మహిళకు ఆస్తి హక్కులు ఇచ్చింది కానీ, వారికి పుట్టిన పిల్లలకు ఆస్తి హక్కులేవీ లభించవని స్పష్టం చేసింది.
Review త్రివర్ణ కాశ్మీరం.