బుద్ధిని శివుడిలో నిలిపి ధ్యానం చేసేవాడు సాక్షాత్తూ శివుడే అవుతాడట!
భక్తుడిలోని భక్తికి, చిత్తశుద్ధికి వశమయ్యేవాడు శివుడు. అందుకే ఆయన భక్తవశంకరుడు.
ఈ విశ్వానికే నాథుడు- విశ్వనాథుడు.
ఈ సృష్టిలోని అణువణువూ ఆయన చైతన్యానికి నిదర్శనమే..
ఈ సృష్టిలోని ప్రతి కదలికా ఆయన తాండవమే..
ఆ మహా దేవదేవుడిని స్మరించే రోజే- శివరాత్రి.
శివనామ స్మరణం, రుద్రాక్ష ధారణం, విభూతి ధారణం.. ఈ మూడూ శివచిహ్నాలు. వీటిని పాటించే వారిని తీర్థదేహులని అంటారు. అంటే- తరించిన వారని అర్థం.
ఏ రీతిలోనైనా మనసును మహాదేవుడి ఆధీనంలో ఉంచడమే అసలైన శివరాత్రి.
అందుకే శివరాత్రి నాడు ‘హర హర మహదేవ.. శంభోశంకర’ అంటూ సమస్త ప్రకృతి పరమశివుడి ఎదుట మోకరిల్లుతుంది.
ముల్లోకాలనూ ఏలే దేవతల్లో శివుడు భోళాశంకరుడు. సనాతనుడు. భక్తజన వల్లభుడు. భూతనాథుడు. చంద్రశేఖరుడు. వైద్యనాథుడు. చరాచర జగత్తుకు ఆయనే విశ్వనాథుడు.
భక్తితో కొలిచే తన భక్తులకు ఇట్టే వశమయ్యే శివుడి దర్శనం సర్వపాపహరణం.
ప్రతి నెలా అమావాస్యకు ముందు రోజు వచ్చే చతుర్దశి ఆ మాసానికి శివరాత్రి అయితే, మాఘ మాసంలో వచ్చే కృష్ణ చతుర్దశి మహా శివరాత్రి అవుతుంది. ఈ చతుర్దశి నాటి అర్ధరాత్రికి తురీయ సంధ్య అని పేరు. అదే లింగోద్భవ కాలం. ఈ విశ్వమంతా వ్యాప్తమై ఉన్న ఈశ్వరతత్త్వమే లింగమని నిర్వచించాయి శాస్త్రాలు. ఆ సూక్ష్మ భగవత్ తత్త్వాన్ని ఆవిష్కరించుకునేందుకు అనువైన కాలమే ఈ తురీయ సంధ్యాకాలం.
ఇక, క్షీరసాగర మథనం సమయంలో అమృతానికి ముందు హాలాహలం పుట్టింది. అది ముల్లోకాలనూ దహించి వేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులంతా భీతావహులై తమను రక్షించాలంటూ పరమేశ్వరుడిని వేడుకున్నారు. దీంతో లోక రక్షణార్థం ఆ గరళాన్ని తానే మింగి, గొంతులో బంధించి గరళకంఠుడిగా పేరొందాడు శివుడు. ఈ హాలాహల ప్రభావంతో ఆయన కంఠం నీలంగా మారిపోవడంతో, ఆయన నీలకంఠుడయ్యాడు. అలా ఆయన గరళాన్ని కంఠంలో ఉంచుకున్న రోజే మహా శివరాత్రి పర్వదినమని కూడా అంటారు. స్నానం, మంత్రం, దయ, దానం, సత్యం, ఇంద్రియ నిగ్రహం, జ్ఞానం, మనశ్శుద్ధి.. ఈ ఎనిమిది శౌచాలు శివరాత్రి నాడు తప్పనిసరిగా పాటించాలని చెబుతారు. ఉపవాసం, జాగరణ.. శివరాత్రి నాడు పాటించాల్సిన ముఖ్య నియమాలు. ఈ రెండూ శరీరాన్ని యోగ చైతన్యంతో నింపి ఈశ్వరతత్త్వ అనుసంధానానికి సహకరిస్తాయి.
తాత్త్వికంగా చూస్తే అంతర్ముఖం కావడమే ఉపవాసం.
ఆ ఏకాగ్రతలో పూర్ణ చైతన్యంతో తాదాత్మ్యం పొందడమే జాగరణ.
శివరాత్రి నాడు మహా శివుడిని భక్తులు ఏ రీతిగా కొలిచినా.. మనసును మాత్రం మహాదేవుడి ఆధీనంలోనే ఉంచాలి.
పరమశివుడికి అయిదు ముఖాలని వేదం చెప్పింది.
తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశాన.. ఇవి పరమశివుని అయిదు ముఖాలు.
ఈ అయిదు రూపాలతో విశ్వమంతా శివ చైతన్యం పరివ్యాప్తమై ఉంటుందనేది వైదిక భావన.
రుద్రాధ్యాయంలోని మంత్ర భాగాన్ని ‘నమకం’, ‘చమకం’ అని పిలుస్తారు.
ప్రతి మంత్రం చివర ‘నమో.. నమ:’ అని ఉన్న భాగాన్ని నమకం అంటారు.
ప్రతి మంత్రం చివర ‘చ మే.. చ మే..’ అని ఉన్న భాగాన్ని చమకం అనీ అంటారు.
ఈ నమక, చమకాలలోని సారాంశాన్ని గ్రహించగలిగితే.. సృష్టి అంతా పరమేశ్వర స్వరూపమే అనే అవగాహన కలుగుతుంది.
శివుడు తాండవం చేసేటపుడు ఢమరుకం మోగిస్తాడు. అది ఆయనకు ఇష్టమైన తాళవాద్యం. ఆ ధ్వనులే పద్నాలుగు రకాలు. వీటినే మన మహర్షులు గుర్తుపెట్టుకున్నారు. వీటినే పరమేశ్వర సూత్రాలని పిలుస్తారు. పాణిని వంటి మహర్షులు వ్యాకరణం రాయడానికి ఈ సూత్రాలనే ఆధారం చేసుకున్నారట!.
శివలింగ మహిమను తెలిపేదే లింగాష్టకం.
బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగం జన్మజ దు:ఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం
.. అంటూ సాగే లింగాష్టకాన్ని వినని వారుండరు. ఆరాధన విషయంలో ఇతర దేవతల కన్నా శివుడికి ఓ ప్రత్యేకత ఉంది. అదేమంటే శివుడిని మూర్తిరూపంలోనూ, లింగ రూపంలోనూ పూజించడం. శివలింగ పూజ విశిష్టత లింగ మహా పురాణం మొదటి అధ్యాయంలో సంపూర్ణంగా ఉంది.
శివాలయాలకు వెళ్తే మనకు దర్శనమిచ్చేది లింగమే. మిగిలిన దేవతలంతా వారి వారి రూపాల్లో సాక్షాత్కరిస్తే, శివుడు ఇలా లింగ రూపంలో కనిపిస్తాడేమిటని ఎవరైనా భావించవచ్చు. అయితే, మూర్తి కన్నా ఎక్కువ విశేషాలు లింగ రూపంలోనే ఉన్నాయి.
శివలింగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక పీఠం.. దానిపైన లింగం అమరి ఉంటుంది. ఆ పీఠం మామూలు పీఠం కాదు. అది బ్రహ్మ దేవుడికి ప్రతిరూపం. ఈ పీఠం మీద కొద్దిగా విశాలంగా పానవట్టం ఉంటుంది. అది విష్ణువుకు ప్రతిరూపం. దాని మీద లింగం ఉంటుంది. అది శివుడికి ప్రతీక. ఇప్పుడు మొత్తం పీఠం కింది నుంచి పైదాకా గమనిస్తే పీఠంలో బ్రహ్మదేవుడు, దానిపైన ఉండే పానవట్టంలో విష్ణువు, దానిపైన ఉండే లింగంలో శివుడు ఉంటారని గ్రహించాలి. ఇలా ముగ్గురు ప్రధాన దేవతలు ఒకచోట కలిసి ఉండే స్థానం కనుకనే శివలింగానికి అంతటి ప్రాశస్త్యం. సాలగ్రామాల పూజ కంటే శివలింగ పూజ అందుకే అగ్రగణ్యమైనది.
శివలింగంలో బ్రహ్మ, విష్ణు మహేశ్వరులే కాక శక్తి కూడా నిండి ఉంటుంది. ఆ శక్తి పానవట్టం కింది పీఠంలో ఉంటుంది. పైన శివలింగంలో శివుడు ఉంటాడు. ఈ కోణంలో చూస్తే శివశక్తి స్వరూపంగా శివలింగం దర్శనమిస్తుంది. అందుకే శివుడి విషయంలో మూర్తి పూజ కంటే లింగార్చనకే అనంత ఫలప్రదమని శైవాగమాలు, మహా భారతంలాంటి ఇతిహాస, పురాణాలు వివరిస్తున్నాయి.
అలాగే, అకార, ఉకార, మకారంతో కూడిన ప్రణవాత్మకం శివలింగం.
ఇదే స్థూల, సూక్ష్మ పరాత్పరాల కలయికగా కూడా ఉంటుంది.
ఈ శివలింగానికి రుగ్వేదం ముఖంగానూ, సామవేదం నాలుకగానూ, యజుర్వేదం కంఠంగానూ, అధర్వణ వేదం హృదయంగానూ ఉంటాయి.
ఈ సృష్టి అంతా లింగస్వరూపమే. శివలింగం సామాన్యమైనది కాదు. అది రజో గుణంలో బ్రహ్మదేవుడై, సత్వగుణంలో విష్ణువై, తమోగుణంలో రుద్రుడై సృష్టి, స్థితి, లయలకు ఆధారమై ఉంటుంది. అందుకే తన విషయంలో లింగరూపాన్నే పూజించాలని శివుడు అనేక సందర్భాలలో భక్తులకు చెప్పినట్టు కూడా పలు పురాణాలలో కనిపిస్తుంది.
లింగం అంటే గుర్తు అని అర్థం.
శివలింగం శివుడికి గుర్తు.
ఆ గుర్తుతోనే శివుడు విష్ణువు, బ్రహ్మకు చాలాచోట్ల జ్ఞానోదయాన్ని కలిగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
లింగం అనే నిరాకార స్వరూపం జ్యోతిర్లింగాలుగా, వాయులింగాలుగా శివుడు అవతరించి భక్తులను అనుగ్రహించిన సందర్భాలు పురాణాలలో కోకొల్లలుగా ఉన్నాయి.
అసలు ఈ సృష్టి అంతా లింగ స్వరూపమే.
పద్నాలుగు లోకాల ప్రపంచమంతా ఒక పెద్ద శివలింగం వంటిదని లింగపురాణం వివరిస్తోంది.
ఈ జగత్తంతా శివశక్త్యాత్మకమని పెద్దలు చెబుతారు. అలాంటి ఈ జగత్తులో బిందువు శక్తి అని, నాదమే శివుడని వివరించి చెబుతోంది శివ మహాపురాణం. బిందువైన శక్తి నాదమైన శివుడిని ఆధారంగా చేసుకుని ఉంటుంది. అయితే ఈ జగత్తు అంతా బిందువును అవలంబించి ఉంటుంది. అలా చూసినట్టయితే బిందునాదాలు రెండూ ఈ జగత్తు అంతటికీ ఆధారమని అనిపిస్తుంది.
ఇక, ఈ బ్రహ్మాండమంతా ఓ పెద్ద శివలింగమే అని అనుకున్నప్పుడు ఈ బ్రహ్మాండమంతా నిండి ఉన్నది శక్తి, శివుడు అని ఇట్టే అర్థమవుతుంది. బిందునాదాల వల్లనే జన్మ పరంపరలు ఏర్పడుతుంటాయి. అందుకే జన్మ నివృత్తి కలగాలంటే శివలింగాన్ని నిత్యం భక్తిశ్రద్ధలతో అభిషేకిస్తుండాలి. బిందు స్వరూపిణి అయిన దేవి తల్లి అనీ, నాద స్వరూపుడైన శివుడు తండ్రి అనీ భావించి, తల్లిదండ్రుల స్వరూపమైన శివలింగాన్ని ఆరాధించాలి. శివలింగాన్ని పూజించడంతో పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం లభిస్తుంది. శివలింగ పూజ వల్ల ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. అనంతమైన ఆనందాన్ని ప్రాప్తింపచేస్తాడు. జీవన్ముక్తిని కోరుకుని పునర్జన్మ రాహిత్యాన్ని కాంక్షించే వారు శివలింగాన్ని ఆరాధించడమే మేలు.
షడ్లింగం లేదా మహా లింగం అనే లింగార్చన ఎంతో గొప్ప పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఇంతకీ ఈ షడ్లింగం లేదా మహా లింగం అంటే ఏమిటి? అనే దానికి శైవాగమం వివరణ ఇస్తోంది. ప్రణవం లేదా ఓంకారాన్నే షడ్లింగమని, మహా లింగమని అంటారు. ఓంకారంలో మిళితమై ఉన్న అకారాన్ని ఆచారలింగం అనీ, ఉకారాన్ని గురులింగమనీ, మకారాన్ని శివలింగమనీ, బిందువును చరలింగమనీ, నాదాన్ని ప్రసాద లింగమనీ అంటారు.
అకార, ఉకార, మకార, బిందునాదాలు కలిసిన ప్రణవాన్ని మహాలింగమని అంటారు.
అలాగే, మరికొందరు ఉకారాన్ని చరలింగమనీ, మకారాన్ని ప్రతిష్టిత యంత్రలింగనీ, బిందులింగమనీ, నాదలింగమనీ ఈ వరుసలో అకార, ఉకార, మకార, బిందునాదాల కలయికతో ఏర్పడిన ప్రణవాన్ని (ఓమ్) ధ్వని లింగమనీ అంటారు.
శ్రీకాళహస్తి- వాయులింగం
మహా శివరాత్రి పర్వదినాన దక్షిణ భారతదేశంలోని పంచభూత లింగాలు వెలసిన ఐదు దివ్యక్షేత్రాల్లో ఘనంగా వేడుకలను నిర్వహిస్తారు. వీటిలో ఒక క్షేత్రం ఆంధప్రదేశ్‍లో ఉండగా, మిగతా నాలుగు క్షేత్రాలు తమిళనాడులో కొలువుదీరాయి. ఈ దివ్యక్షేత్రాలను దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం. శ్రీకాళహస్తి క్షేత్రం దక్షిణ కైలాసంగా, నత్యవ్రత మహాభాస్కర క్షేత్రంగా, శివానందైక నిలయంగా అనే పేర్లతో ప్రసిద్ధి చెందింది. ఇది ఆంధప్రదేశ్‍లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉంది. పంచభూత లింగాల్లో మనిషికి ఆయువు అయిన వాయు క్షేత్రంగా ఇది విరాజిల్లుతోంది. మూడు మూగజీవాల భక్తి, ఆరాధనల ఫలితంగా ఏర్పడినదే శ్రీ (సాలె పురుగు), కాళ (పాము), హస్తి (ఏనుగు)- శ్రీకాళహస్తి. మనిషి మనుగడకు పంచభూతాలు ఎంతో అవసరం. వీటి గమనంతోనే మన మనుగడ సాగుతుంది. నింగి, నేల, గాలి, నీరు, నిప్పు.. ఇవే పంచభూతాలు. వీటిలో వాయువుకు ప్రతిరూపంగా శ్రీకాళహస్తిలో ఈశ్వరుడు స్వయంభువుగా వాయులింగేశ్వరుడిగా వెలిశాడు. స్వామి గర్భాలయంలో ఎడమ వైపున రెండు దీపాలు కనిపిస్తాయి. వీటినే వాయుదీపాలని అంటారు. స్వామి ఉచ్ఛ్వాస, నిశ్వాసాలకు ప్రతీకగా ఈ వాయుదీపాల కదలికను పేర్కొంటారు. నవగ్రహాలు, ఇరవై ఏడు నక్షత్రాల సౌర మండలం శివుడి ఆజ్ఞతో నడుస్తుంటాయి. రాహు కేతువులు కూడా ఆయన కనుసన్నల్లోనే ఉంటారు. ఎవరైనా గ్రహదోషాలు, రాహుకేతు దోషాలు, సర్పదోషాల వంటి గ్రహపీడలతో బాధింపబడుతుంటే, శ్రీకాళహస్తీశ్వర క్షేత్రాన్ని సందర్శించి గ్రహదోష పూజలు చేయించుకుంటారు. ఈ క్షేత్రాన్ని దర్శించడంతోనే గ్రహదోషాలు వదిలిపోతాయని అంటారు. అంతటి మహిమాన్వితమైన క్షేత్రం- వాయులింగేశ్వర శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం.
శ్రీకాళహస్తి దివ్యక్షేత్రానికి పడమర వైపున ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న స్వర్ణముఖీ నది బ్రహ్మదేవుడి వరప్రసాదంతో అగస్త్యముని తప ప్రభావం వల్ల దక్షిణ కైలాసం అనే కొండల్లో నుంచి పుట్టినట్టు స్థల పురాణం చెబుతోంది. సర్వేశ్వరుడు సృష్టికర్త బ్రహ్మను పిలిచి కైలాసాన్ని సృష్టించాలని ఆదేశించగా, బ్రహ్మ కైలాసాన్ని సృష్టించే సమయంలో తడబాటుతో కొంత భాగం భూమిపై పడిపోయిందట. ఆ భాగమే దక్షిణ కైలాసంగా పిలిచే శ్రీకాళహస్తి క్షేత్రమని అంటారు. ఈ క్షేత్రం మూడు మూగజీవాలకు ముక్తినిచ్చిన ముక్తిధామంగా వెలుగొందుతోంది.
చిదంబరం- ఆకాశలింగం
ఈ క్షేత్రం తమిళనాడులోని కడలూరు జిల్లా కారేకల్‍కు ఉత్తరంగా అరవై కి.మీ. దూరంలో చిదంబరం నగర నడిబొడ్డున ఉంది. ఇక్కడ శివుడు ఆకాశ లింగం రూపంలో ఉంటాడు. తమిళ సంఘం సాహిత్య రచనల ప్రకారం.. సనాతన విశ్వకర్మల వంశస్తుడైన విదువేల్విడుగు పెరుషత్తాన్ ఈ ఆలయ పున:సృష్టికి ప్రధాన రూపకర్తగా చెబుతారు. చోళ, పల్లవ రాజుల కాలంలో ఈ ఆలయం జీర్ణోద్ధరణ జరిగినట్టు ప్రతీతి. హిందూ సాహిత్యం ప్రకారం చిదంబరం అనేది శివుడి అయిదు పవిత్ర పంచభూత క్షేత్రాల్లో ఒకటి. నలభై ఎకరాల వైశాల్యంలో శైవ, వైష్ణవ సంప్రదాయాలతో వెలిసిన అతికొద్ది ఆలయాల్లో ఇది ఒకటి. క్రీస్తు శకం 1213లో వనకోవరైయన్ ఈ ఆలయాన్ని పున నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ శివుడు ఆనంద తాండవం చేస్తున్న భంగిమలో నటరాజ రూపంలో వెలసి భక్తులకు వరాలిస్తున్నాడు.
క్షణంలోని శత, సహస్ర భాగంలో పరమాణువులు నిరంతరంగా నశిస్తూ, జనిస్తూ ఉండే లయ ఈ సకల సృష్టికి మూలం. అది సృష్టిలో సమతూకానికి కారణం అవుతుంది. లయతో కూడిన సృష్టి క్రమమే శివతాండవం. అందుకు ప్రతీక ఇక్కడి నటరాజ మూర్తి.
కంచి- పృథ్వీలింగం
ఇక్కడ శివుడు పృధ్వీలింగమై వెలిశాడు. ఈ ఆలయ గోపురం ఎత్తు 59 మీటర్లు. దేశంలోనే అతిపెద్ద గోపురాల్లో ఇదీ ఒకటి. ఇక్కడ వెలసిన స్వామి ఏకాంబరేశ్వరుడు. ఈ దేవాలయంలో సుమారు 3,500 ఏళ్ల వయసు కలిగిన మామిడిచెట్టు ఉంది. ఈ చెట్టులోని నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచి గల పళ్లు కాస్తాయి. ఈ చెట్టు నీడలో ప్రస్తుతం మరో కొత్త మామిడి మొక్కను నాటారు. పురాతన మామిడి వృక్షం కాండాన్ని అద్దాలపెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు. ఈ మామిడి వృక్షం కింద పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని వధూవరులుగా దర్శనమిస్తారు. ఏకాంబరేశ్వరునికి నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి. దేవాలయం లోపలి మండపంలో వెయ్యి స్తంభాలు, 1008 శివలింగాలు ప్రతిష్టించారు.
జంబుకేశ్వరం- జలలింగం
తమిళనాడులోని తిరుచ్చికి 11 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఇక్కడ స్వామి ఏనుగుల చేత పూజలందుకున్నాడని స్థల పురాణం. ఈ ప్రాంతంలో పూర్వం జంబు వృక్షాలు (నేరేడు) అధికంగా ఉండటం వల్ల దీనికి జంబుకేశ్వరం అనే పేరు వచ్చింది. ఇక్కడ జంబుకేశ్వరుడు పశ్చిమాభిముఖంగా వెలసి ఉన్నాడు. గర్భగుడి పక్కనే అఖిలాండేశ్వరి ఆలయం కూడా ఉంది. జంబుకేశ్వరుడిగా పేరొందిన ఇక్కడి లింగం నీటితో నిర్మితమైంది. కానీ నీటిలో లేదు. లింగం పానవట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది. దీన్ని భక్తులకు స్పష్టంగా చూపేందుకు లింగం పానవట్టంపై ఒక వస్త్రం కప్పుతారు. అది నీటి తడితో కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించినట్టు, తరువాత పల్లవులు, పాండ్యులు, విజయనగర రాజులు జీర్ణోద్ధారణ చేసినట్టు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. నాయనార్లలో ప్రసిద్ధుడైన సుందర్ సంబందర్ తదితరులు ఈ స్వామిని సేవించి తరించినట్టు చెబుతారు. గతంలో ఈ ఆలయాన్ని కంచి కామకోటి పీటం పర్యవేక్షించేది. ఈ ఆలయం విశాలమైన ప్రాకారాలతో, ఎత్తయిన గోపురాలతో వెలిసింది. ఈ ఆలయానికి మొత్తం ఏడు గోపురాలు ఉన్నాయి.
తిరువణ్ణామలై- అగ్నిలింగం
పంచభూత లింగాల్లో తేజోలింగం తమిళనాడులోని తిరువణ్ణామలైలో వెలసింది. అన్నామలై కొండ దిగువల ప్రాంతంలో ఉన్న అన్నామలైయర్ గుడి తిరువన్నామలైలోనే ఉంది. తిరువణ్ణామలై చెన్నైకి 185 కిలోమీటర్లు, బెంగళూరుకు 210 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెన్‍పేపై నది మీద ఉన్న డ్యాం ఇక్కడ మంచి పర్యాటక ప్రదేశం. ఈ ఆలయంలో తమిళనాడులోని శైవ క్షేత్రాల్లో ఒక గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ దివ్యక్షేత్రం యోగులకు, సిద్ధులకు నిలయం. 20వ శతాబ్దపు గురువులలో ఒకరైన రమణ మహర్షి కూడా అరుణాచలేశ్వరం కొండ పైనే ఉండేవారు. తమిళ నెల కార్తికంలో ఇక్కడ జరిగే ఉత్సవాలు ప్రసిద్ధిచెందాయి. కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్ల మేర భక్తులు ప్రదక్షిణలు చేస్తారు.
Review పరవశమే.. పరమశివా!.