పిల్లల ఆటపాటలు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక

పక్కా ఫకీరు
ఒంటెల దోలుకు పోయే వారొక
కుంట గట్టుపై జేరారు
కుంటి యొంటె గనుపడలేదంటూ
గ్రుద్దులాడుకోసాగారు

ఆ సమయానికె ఫకీరు వాడొక
డక్కడ వచ్చి కూర్చున్నాడు
ఆ యయ్యలు ‘మా యొంటె గప్పడిన
దా?’ యని ఫకీరు నడిగారు

‘కుంటి కాలిదేనా?’ యని సాహే
బంటే వా ‘రవు’నన్నారు
‘ముందరి పండ్లూడినదేనా?’ యన
అంద‘రదే సు’మ్మన్నారు

‘బియ్యము మోసేదేనా?’ యన నా
యయ్యలు చంకలు గొట్టారు
‘ఏదేది యెటు పోయిం’దంటూ
ఎగబడి ఫకీరు నడిగారు

‘ఒంటె స్వరూపము మాత్ర మ్మాతడు
కంట జూడలే’దన్నాడు
‘నిజము చెప్పు’మని బతిమలాడినా
‘నే నెరుగు పొం’డన్నాడు.
వీరు నల్వు రా ఫకీరువాణ్ణొక
పెద్ద మనిషికాడికి జేర్చారు
పెద్దమనిషి ‘నిజమాడుము లేదా
గుద్దులు పడతై’ యన్నాడు
ఫకీరు దండము పెడుతూ ‘సత్యము
బాబయ్యా! విను’మన్నాడు

‘చెలిక బురదలో నొంటె కాలి జా
డలు మూడే గనిపించినవి
అందునేత నది తప్పక కుంటిది
యై యుంటుందనుకొన్నాను

గరిక మేయునపు డిరుప్రక్కలు దెగి
సరిగ మధ్య దెగకుండుటచే
పైనో కిందవో తప్పక ముందరి
పండ్లూడిన వనుకొన్నాను

చిత్తు బెత్తుగా జారిన బియ్యము
చీమలు కరచుక పోతుంటే
మస్తుగ వీపున బియ్యపు నూకల
బస్తాలెత్తారనుకొన్నా’
అంటుండగనే వెలవెల బొయ్యా
రయ్యలు మియ్యలు గూడాను
రావోయ్‍ పోవో యంటూ ఎవ్వరి
త్రోవను వారలు పొయ్యారు

రోకటి పాట
సూర్యుడూ యిచ్చిన చుక్క మెట్టిల్లు
సువిదరో మా కాళ్లు చుక్కలై మెరసు
నారాయుడిచ్చినా నల్లబూసల్లు
నాతిరో నా మెళ్లో నానులై మెరసు
పరమేశుడిచ్చినా పసుపు కుంకమ్ము
పణతిరో నా నొష్ట పద్మమై మెరసు

యిరుసు విరిగిన బండి యింటికే రాదు
మనసు విరిగిన బుద్ధి మరి కట్టుబడదు
తమలపాకుల కట్ట లెక్కెట్టరాదు
తమ్ముడన్న మాట తప్పుబట్టరాదు

రోటినిండా పోసి రోకళ్లు పట్టి
రోటికి మ్రొక్కను లోభితనమేమి?
రోటికింద పాటు రోటి కెక్కసము
తల్లి లేని బిడ్డ ధరణి కెక్కసము

ఉసిరికాయలు తిన్న రుచులేమి తెలుసు?
పసిబిడ్డను పెండ్లాడిన బలమేమి తెలుసు?
చెలికత్తె తీపయిన చెరుకు తీపయిన
తల్లిపాలు విషమైన జగమెట్లు మెచ్చు?

ఉల్లిపువ్వెంతైన మల్లెపువ్వు కాదు
వేశ్య ఎంత చక్కనిదైన యిల్లాలు కాదు

మరదలు-మర్యాద
అక్క తోడా నీవు బండెక్కి వస్తే
ఆనందమౌతుంది అందరికి బావ
మొలక నవ్వుల నిన్ను పలకరిస్తాను
అమ్మనాన్నా నిన్ను ఆదరిస్తారు
చుట్టపక్కాలు నిను చూడవస్తారు
మేలైన వాడవని మెచ్చుకుంటారు
అక్కను నీ వెంట కొనిరాక బావ
బిక్కుబిక్కుమంటు ఒక్కడవు వస్తే
చిత్తమొల్లాదోయి క్షేమంబు లడుగ
మనసు పుట్టాదోయి మర్యాద చేయ
అక్క నుంచే గద బావ చుట్టంబు
ఆళ్లనుంచే గద తిరుగలి చుట్టంబు
అన్న సామెత మనలో ఉన్నదంటిని ఎరుగవోయీ నీవు వెర్రి బావ!

Review పిల్లల ఆటపాటలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top