మనకు ఆత్మీయులు అనుకునే వారు దూరమైనపుడు మాటలు పెగలవు.
కళ్లు నీటితో నిండిపోతాయి. మనసు మౌనంగా రోదిస్తుంటుంది. హృదయం.. మనకు దూరమైన వారి జ్ఞాపకాల తడితో బరువెక్కుతుంది. మనసులో చెలరేగే వేదన.. మాటలకు అందదు. క్రెగ్ భౌతికంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లారనే వార్త విన్న క్షణం నుంచీ నాదీ ఇదే అనుభవం. ఆయన తోడిది పరిచయం యాదృచ్ఛికం కాదు. దైవ నిర్ణయం. స్వయంగా సాయినాథుడే మా ఇద్దరినీ కలిపాడు. అందుకే ఆయన నా ఆత్మబంధువు. మా ఆధ్యాత్మిక పయనం మధ్యలోనే క్రెగ్ ఇలా అర్ధంతరంగా నన్ను విడిచి, సాయిబంధువులను విడిచి వెళ్లిపోయారంటే నమ్మశక్యం కావడం లేదు. ‘‘మనిషి తోటి మనిషికి సేవ చేయడమే భగవంతుని సేవ’’ అని తలంచి, మనసా, వాచా, కర్మణా అదే నమ్మి.. చివరి నిమిషం వరకు భగవంతుని అన్వేషణలోనే గడిపిన ఆయన.. చివరకు భగవంతుని సన్నిధికే చేరారని తెలిసినప్పటి నుంచి నా మనసు మనసులో లేదు. ఇంత అలజడిలోనూ నాకు ఒక విషయం అర్థమయ్యింది. ‘‘క్రెగ్ భౌతికంగా మనల్ని విడిచి ఉండొచ్చేమో కానీ, ఆధ్యాత్మికంగా చూస్తే.. ఆయన భగవంతుని కనుగొన్నారు’’ అనిపించింది. గుండె దిటవు చేసుకుని, మాటలకందని భావాలను ఇలా అక్షరాలుగా పేర్చి.. ఆయనతో నాకు గల అనుబంధాన్ని మీతో పంచుకునే ప్రయత్నమిది..
అమెరికన్ ‘క్రెగ్’ ఓ భారతీయ సంచలనం..
మనందరినీ ఎంతో ప్రేమించిన, అందరితో ఎంతో ప్రేమింపబడిన క్రెగ్ ఎడ్వర్డస్.. మే 24, గురువారం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తనను నమ్ముకున్న ఎందరినో ఒంటరిని చేసి ఆయన దైవసాన్నిధ్యానికి చేరుకున్నారు. గురువారం (మే 24) ఉదయం 10.48 నిమిషాల వేళ తన జీవన సహచరి జిల్ సేవలందుకుంటూనే ప్రాణాలు విడిచారు. నిజానికి గురువారం ఏకాదశి పర్వదినం. గురువారం.. ఏకాదశి.. ఈ రెండూ సాయిబాబాకు ఎంతో ప్రీతికరమైనవి. సాయి బంధువుగా సుపరిచితులైన ఆయన సాయికి ఇష్టమైన తిథినాడే ‘సాయి’జ్యం పొందడం సాయిలీలగానే భావించాలి. పైగా ఈ కాలం అధిక జ్యేష్ఠ మాసం. అధిక జ్యేష్ఠ మాసాన్ని పురుషోత్తమ మాసంగా కూడా పరిగణిస్తారు. పురుషోత్తముడు అంటే స్వయానా విష్ణు భగవానుడు. సరిగ్గా ఈ రెండు కారణాలనే తన అంతిమ సమయంగా క్రెగ్ బాగా ఆలోచించే నిర్ణయించుకున్నారు కాబోలు. ఆయన ఆత్మకు శాంతి కలుగు గాక!
క్రెగ్ అంతిమ సంస్కారాలు శనివారం, మే 26న సాయిబంధువుల, ఆధ్యాత్మిక సహచరుల సమక్షంలో కన్నీటి వీడ్కోలు మధ్య జరిగాయి.
క్రెగ్ ఎడ్వర్డస్తో నా పరిచయం కలిగిన పూర్వపు రోజుల్లోకి వెళ్తే..
‘నా భక్తులైన వారు ఎంత దూరాన ఉన్నా పిచ్చుక కాళ్లకు దారం కట్టి లాగినట్టు లాక్కుంటాను’ అని షిర్డీ సాయిబాబా అన్నారు. ఎక్కడో ఖండాల ఆవల ఉన్న క్రెగ్‍ను బాబా అలాగే తన వద్దకు తీసుకున్నారు. లేకపోతే.. ఎక్కడి ఆస్టిన్?.. ఎక్కడ షిర్డీ?.. దేశం, మతం ముఖ్యం కాదు.. మానవత్వం మహోన్నతం అని భావించి క్రెగ్ దేశదేశాలు తిరిగారు. చివరకు ‘సాయి’ అనే అమూల్య రత్నం భారత్‍లో ఉందని కనుగొన్నారు. అంతే.. తన గుండెల్లోనే ఏకంగా గుడి కట్టుకుని సాయి బాంధవ్యుడు అయ్యారు. చివరి క్షణం వరకు ఆయన సాయి సద్గురువు బాటలో నడిచి, మానవాళి క్షేమం కోరి ఎన్నెన్నో సేవలందించారు.
క్రెగ్, ఆయన జీవన సహచరి జిల్ దంపతులకు సాయిబాబా అంటే ఎంతో గురి. ఆ గురి ఎంతటిదంటే.. ఆ దైవానికి ఏకంగా ఆస్టిన్‍లో గుడి కట్టినంతటిది. నేను పరిశీలించినంత వరకు బాబాపై క్రెగ్‍కు అద్భుతమైన భక్తిశ్రద్ధలు ఉండేవి. బాబా బోధించిన విషయాలను ఆచరించే విషయంలో ఆయన అమోఘమైన సహనం చూపేవారు. చెరగని చిరునవ్వు.. తరగని సేవ.. ఇవే ఆయన సహజ ఆభరణాలుగా భాసిల్లేవి. తోటి వారికి ప్రేమను పంచుతూ, సేవలను అందిస్తూ సాయిబాటలో నడిచిన క్రెగ్ ఆధ్యాత్మిక జీవనం పరిపూర్ణమైనది.
క్రెగ్ నిర్మించిన ఆస్టిన్ సాయి మందిరం గురించి చెప్పాలంటే… ఆధ్యాత్మికతను నిశ్శబ్దంగానే బోధించే ప్రశాంత వాతావరణం.. లోపల కళ్లతోనే కరుణ కురిపించే సాయినాథుని దివ్య విగ్రహం.. బయట.. ఆలయ ఆవరణలో పడి ఉన్న వ్యర్థాలను ఎత్తిపోస్తూ ఒక వ్యక్తి కనిపించారు. ఆలయం లోపల వంటగదిలో భక్తుల కోసం ప్రసాదాలు తయారు చేసి వంట పాత్రలను కడుగుతూ ఓ మహిళ కనిపించారు. నిరాడంబరతలోని వైవిధ్యానికి, భారతీయ ధర్మంలోని వైశిష్ట్యానికి వారిద్దరు సిసలైన ప్రతిరూపాలుగా కనిపించారు. ఆ పుణ్య దంపతుల హృదయ స్పందన ‘సేవ.. సేవ’, వారి గుండెచప్పుడు ‘సాయి.. సాయి’ అని తెలిసి పోయింది. తమ హృదయమనే కోవెలలో సాయినాథుడిని పరిపూర్ణంగా ప్రతిష్ఠించుకున్న వారిద్దరు సాయిబంధువులని ఇట్టే అర్థమయ్యింది.
పాశ్చాత్య దేశంలో పుట్టినా.. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు ముగ్ధులై ధర్మబద్ధ, ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతున్న ఈ జంట సాయితత్త్వాన్ని విశ్వజనీనం చేయడాన్ని నేను కళ్లారా చూశాను. సాయి మార్గంలో నడుస్తూ, మరెందరినో ఆ బా•లో నడిపిస్తూ తరించిన ఈ ఆధునిక ఆధ్యాత్మిక సాయి భక్తుడైన క్రెగ్.. శ్రీసాయి బోధించిన మానవీయ, నైతిక విలువలు, సమత, మమతలకు ప్రతిరూపం.
‘‘నేను ప్రపంచమంతా తిరిగాను. సాయితత్త్వం ఒక్కటే నన్ను ఆకర్షిం చింది. అందులోని మానవత్వం ఇంకా బాగా నచ్చింది. ప్రపంచంలో మానవత్వాన్ని ఇంతలా ఆచరించి, దానినే బోధించిన పరమ పురుషులు బాబాను మించి మరొకరు లేరు’’ అని క్రెగ్ తనను కలిసినప్పుడల్లా బాబా గొప్పదనం గురించి చెబుతుంటే, బాబాను భారతీయుల కంటే విదేశీయులే బాగా అర్థం చేసుకున్నారా? అనిపించేది. అంతగా ఆయన సాయితత్త్వాన్ని ఒంటబట్టించుకున్నారు. మా మధ్య చర్చల్లో సాయి గురించి తరచూ సంభాషణ కొనసాగేది. క్రెగ్ సాయి గురించి, ఆయన బోధనల్లోని వైశిష్ట్యం గురించి గంటల తరబడి చెబుతుంటే చెవులప్పగించి వినడమే నా వంతయ్యేది.
భారతీయులంతా పాశ్చాత్య ఒరవడిలో పడి కొట్టుకుపోతుంటే, విచిత్రంగా, విదేశీయులు మన దేశ సంస్క•తి పట్ల ఆకర్షితులై, మన సంస్కృతి గొప్పదనాన్ని మనకు తెలియచెప్పిన గొప్ప ఆధ్యాత్మికాపరుడు క్రెగ్. నాకు తెలిసీ.. క్రెగ్‍కు మొదటి నుంచీ భారతీయ యోగా, వేదాలు, ఆధ్యాత్మికత అంటే ఎనలేని ప్రేమ, అభిమానం. ఆయన వాటి కోసం ఎంతో ప్రయాణం చేశారు. దేశ, విదేశాల్లోని ఎన్నో మత సంస్కృతులను అధ్యయనం చేశారు. ఆచార సంప్రదాయాలను పరిశీలించారు. అయితే, భారతీయత, అందులోని వైవిధ్యభరితమైన ఆధ్యాత్మికత, కొన్ని వేల సంవత్సరాల క్రితమే విలువలతో కూడిన ఆదర్శ సంఘ జీవనానికి బాటలు వేసిన వేద విజ్ఞానం తనను అమితంగా ఆకట్టుకున్నాయని క్రెగ్ పలుమార్లు నాతో తన అనుభవాన్ని పంచుకున్నారు. షిర్డీలో సాయిబాబా అనే పరమ యోగి మానవత్వం గురించి చాటిన మహిత సత్యాలు తనను అబ్బురపరిచాయని ఆయన నాతో అనేవారు. మతం కంటే మానవత్వమే గొప్పదనే గొప్ప సత్యం తనను బాబా మార్గంలో నడిపించిందని తన ఆధ్యాత్మిక పయనం గురించి గుర్తు చేసుకునే వారు. బాబాను ఆయన ఎంతగా ప్రేమించారంటే.. ఆయనకు ఆస్టిన్‍లో గుడి కట్టి, అమెరికాలోనూ పలువురు సాయిబంధువులు ఆప్తులయ్యేంతగా. బాబా మందిరంతో పాటు వేంకటేశ్వరాలయాన్ని కూడా క్రెగ్ దంపతులు అహోరాత్రులు శ్రమించి నిర్మించిన క్షణాలు ఇప్పటికీ నా కళ్ల ముందు జ్ఞాపకాలుగా కదలాడుతున్నాయి.
క్రెగ్, జిల్ దంపతులు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, అందమైన హవాయి ద్వీప ప్రాంతానికి చెందిన వారు. నేను ఒకసారి మాటల మధ్యలో, భారతీయతపై మీకు ఆసక్తి ఎలా కలిగిందని, అదెలా పెరిగిందనీ అడిగాను. ఊహ తెలిసే నాటికే తనకు మెడిటేషన్, వేదాలపై ఆసక్తి ఉండేదని, వాటికి సంబంధించి రోజుల తరబడి అధ్యయనం, పరిశీలన సాగించే వాడినని ఆయన చెప్పారు. సరిగ్గా జిల్ కూడా ఇవే ఆసక్తులు కలిగి ఉండేవారట. 1970లో వీరిద్దరు అనుకోకుండా ఈ అంశాలపై అధ్యయానికి యూరోప్ వెళ్లారు. ఈ అన్వేషణలో భాగంగా 1978 సంవత్సరంలో ఫెయిర్ ఫీల్డ్లోని మహర్షి ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో వీరిద్దరు యాదృచ్ఛికంగా కలుసుకున్నామని క్రెగ్ నాతో నాటి రోజుల్ని గుర్తు చేసుకునేవారు. జిల్ అభిరుచులూ, ఆసక్తులు అచ్చం తనకు మాదిరే ఉండటంతో ఆమెతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, 1979లో వివాహం చేసుకున్నామని క్రెగ్ చెప్పే వారు.
భారతీయ వేద విజ్ఞానం, అందులో పేర్కొన్న అద్భుతమైన నైతిక విలువలతో కూడిన సంఘ జీవనం, వేద సంస్కారాలు, క్రియల పట్ల వివాహానంతరం తమ ఇద్దరిలో ఆసక్తి మరింత ఎక్కువైందని క్రెగ్ నాతో నాటి అనుభవాలను పంచుకునే వారు. వేద విజ్ఞానం కోసం సాగించిన తమ అన్వేషణ ఒకనాడు అనుకోకుండా అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని మొట్టమొదటి షిర్డీ సాయిబాబా ఆలయాన్ని నిర్మించిన పాండురంగ మల్యాలను కలుసుకోవడంతో మలుపు తిరిగిందని క్రెగ్ అనేవారు. ఆయనతో ఏర్పడిన పరిచయం తమ అన్వేషణను ఫలప్రదం చేసిందని గుర్తు చేసుకునే వారు. పాండురంగ 2002 సంవత్సరంలో ఆంధప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వేద పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇది రూపుదిద్దుకునేందుకు క్రెగ్ దంపతులు ఎంతో సాయం చేశారు. అయితే, ఈ విషయం ఆయన నాతో ఎప్పుడూ చెప్పలేదు. బహుశా, ‘దానం అనేది నీ కుడి చేతితో చేసిన విషయం ఎడమ చేతికి కూడా తెలియకూడదు’ అని సాయిబాబా చేసిన బోధన క్రెగ్ మనసులో నాటుకుపోయిందేమో! అందుకే ఆయన తాను చేసిన దాన ధర్మాల గురించి ఆయన ఎవరికీ తెలియనిచ్చే వారు కాదు. ఆ విషయాలను ఎవరితో చర్చించే వారు కాదు.
2000 – 2010 సంవత్సరాల మధ్యలో క్రెగ్ దంపతులు నాకు తెలిసీ దాదాపు ఇరవై సార్లకు పైగానే భారతదేశాన్ని సందర్శించారు. పాండురంగ నిర్వహించిన అనేక శాంతి యజ్ఞాల్లో వీరు పాలు పంచుకున్నారు.
భారతీయ యోగవిద్య అన్నా, యోగులన్నా, ఆధ్యాత్మిక గురువులన్నా క్రెగ్ అమితమైన గౌరవ మర్యాదలు చాటుకోవడాన్ని నేను అనేక ఏళ్లపాటు ప్రత్యక్షంగా చూశాను. క్రెగ్ నిరంతరం పండిత ప్రముఖులతోనే గడిపే వారు. వారితో అర్థవంతమైన చర్చలు సాగించే వారు. ఆధ్యాత్మిక సత్సంగాలతో సమయం తెలియకుండా గడిపేసే వారు. ఆయన గౌరవిం• పముఖుల్లో సెయింట్ బసవతి సిద్ధార్థ్ ఒకరు. బసవతిలో తన పరిచయం ఆధ్యాత్మిక సమాగమం అని క్రెగ్ అభివర్ణించేవారు.
క్రెగ్ భారతీయ పూజాతంతులన్నా కూడా ఎనలేని భక్తిశ్రద్ధలు చాటుకునే వారు. వాటిపై ఆయనకు ఎంతో విశ్వాసం ఉండేది. 2004 సంవత్సరంలో ఆయన పాండురంగ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా పుట్టపర్తిలో భారీ యాగాన్ని నిర్వహించారు. పద్దెనిమిది రోజుల పాటు నిర్విఘ్నంగా, అద్వితీయంగా సాగిన ఈ యజ్ఞంలో దాదాపు యాభై వేల మందికి పైగా భక్తులు పాల్గొని తరించిన విషయాన్ని క్రెగ్ ఎంతో ఆనందంగా నాతో ఒకసారి చెప్పారు.
ఇక, హైదరాబాద్ కూకట్‍పల్లిలో నా నివాసంలో జరిగిన సాయి భజన, పూజల్లోనూ ఆయన పాల్గొన్న అనుభవాన్ని నేను మరిచిపోలేను. మనసులో ఏ విధమైన కోరికలు లేని విరాగి ఆయన. ఆడంబరాలకు పోని వైరాగి ఆయన.
ఆస్టిన్‍లో సాయి మందిరాన్ని నిర్మించాలనే ఆలోచన ఎలా కలిగిందని ఆయనను ఒకసారి అడిగినపుడు ఆయన ఇలా చెప్పుకొచ్చారు.
‘భారతీయ వేద విజ్ఞానం, ఆధ్యాత్మికతలోని సారం గురించి తెలుసుకునే కొద్దీ ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలు, అబ్బురపరిచే ధర్మసూత్రాలు నన్ను కట్టిపడేశాయి. ఈ క్రమంలోనే నేను పలుమార్లు షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నాను. బాబా బోధనల్లోని సారాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నాను. వాటిని మనసా, వాచా, కర్మణా ఆచరిస్తూ మరెందరినో ఆ బా•లో నడిపించాలని నాడే నిర్ణయించుకున్నాను. అన్నిటికీ మించి నేను బాబాలో మహిమల్ని కాక మానవత్వం తాలూకు మహిత సత్యాన్ని దర్శించాను. ప్రపంచంలో కానీ, భారతదేశంలో కానీ షిర్డీ సాయిబాబా వంటి యోగి మరొకరు లేరని తెలుసుకున్నాను. బోధనలు చేసి ఊరుకోవడం కాక, వాటిని స్వయంగా ఆచరించి చూపిన అద్భుత యోగీశ్వరుడు సాయిబాబా. ఈ సత్యం తెలుసుకున్నాక అక్కడితో నా అన్వేషణ ముగిసింది. అప్పటి నుంచి కొత్త ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. 2003 సంవత్సరంలో మేము ఉండే హవాయి ద్వీప ప్రాంతంలోనే సాయి మందిరాన్ని నిర్మించాలని తలపోశాము. కానీ అనుకోని అవాంతరాలు వచ్చి పడ్డాయి. శ్రీసాయి నా కోరికను తప్పక నెరవేరుస్తారని నా నమ్మకం. బాబా ఆదేశానుసారమే మేం ఆస్టిన్‍కు మకాం మార్చాం. 2007 మకర సంక్రాంతి నాడు షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని తలపించే రీతిలో సుందరమైన సాయిబాబా మందిరాన్ని నిర్మించగలిగాను. అప్పటి నుంచి ఈ మందిరాన్ని ఒక సంస్థాన్‍గా అభివృద్ధి చేసి, మందిరానికి ఆధ్యాత్మిక అలంకారాలను అద్దుతూ లాభార్జన లేని మత సంస్థగా నిర్వహిస్తున్నాను’.
మానవత్వం, ప్రేమ, సేవాతత్పరత, ప్రశాంతత.. వీటిని అందరికీ పంచుతూ, అందరిలో పంచుతూ జీవించడమే తన ఆశయమని క్రెగ్ నాతో తరచూ అనేవారు. అందుకు తగినట్టే ఆయన తన జీవన ప్రణాళికను రూపొందించుకుని నడుచుకునే వారు. 2012లో ఆస్టిన్‍లోనే వేంకటేశ్వర ఆలయాన్ని కూడా క్రెగ్ నిర్మించారు. ఆ సమయంలో ఆయన నిద్రహారాలు మాని పనిచేయడం చూసి ఆశ్చర్యం అనిపించేది.
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని సౌత్‍వెస్ట్ స్టేట్ టెక్సాస్ రాజధాని ఆస్టిన్‍కు ఈ సాయి మందిరం ఉన్న ప్రాంతం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ మందిరం ఉన్న ప్రాంతాన్ని సెడార్ పార్కుగా వ్యవహరిస్తారు. సెడార్ పార్కులోని ఈ మందిర స్థలం మొదట్లో ఒక షాపింగ్ మాల్. 2008లో తొమ్మిది ఎకరాల ఈ స్థలాన్ని క్రెగ్ కొనుగోలు చేసి ఎన్నో మిలియన్ డాలర్ల ఖర్చుతో సాయి మందిరాన్ని నిర్మించారు. ఆలయ ప్రధాన హాలులో శ్రీసాయి శ్వేతవర్ణ మార్చుల్ విగ్రహం కళ్లతోనే భక్తులను ‘రా.. రమ్మ’ని పిలుస్తున్నట్టుగా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులకే కాదు అన్నార్తుల కోసం ప్రత్యేకంగా వంటకాలు వండి వడ్డిస్తారు.
మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకెప్పుడూ అలసట అనిపించలేదా? అని ఒక్కోసారి క్రెగ్‍ను అడగాలని అనిపించేది. ఇదే విషయాన్ని ఒకసారి సూచాయగా అడిగినపుడు ఆయన చెప్పిన సమాధానం అబ్బురపరిచింది.
‘‘భారతీయతలో దివ్యత్వం ఉంది. సద్గురు సాయి బోధనల్లో అమోఘమైన దైవత్వం ఉంది. తోటి మనిషిని ప్రేమించు.. సేవించు.. హింసించకు అని చాటిన బాబా బోధనలే నన్ను ముందుకు నడిపించే ఛోదకశక్తులు. నేటి ప్రపంచానికి బాబా బోధనలు చాలా అవసరం. వాటిని ఆచరిస్తేనే మానవాళి మధ్య శాంతి, సహృద్బావాలు వృద్ధి చెందుతాయి’’.
ఆధ్యాత్మిక సారథి భగవంతుని సన్నిధికి..
నరనరాన సాయితత్త్వాన్ని ఒంటబట్టించుకున్న క్రెగ్ ఇరవై నాలుగు గంటలూ సాయి సేవలోనే గడిపే వారు. సాయిబంధువుల సేవలోనే తరించే వారు. ఆస్టిన్‍లో క్రెగ్ నిర్మించిన సాయి మందిరం ప్రధాన ద్వారంపై ప్రపంచంలో గల అన్ని ప్రధాన, ప్రముఖ మతాల చిహ్నాలు చిత్రించి ఉంటాయి. వీటితో పాటు ‘‘ఈ జగమే నా కుటుంబం’’ అని ఉన్న అక్షరాలు వసుధైక భావనకు, బాబా బోధనలకు, అంతకు మించి క్రెగ్ ఆధ్యాత్మిక భావజాలానికి అద్దం పడుతుంటాయి.
క్రెగ్.. మనసు, ఆలోచనలు నాకు బాగా తెలుసు. నేను చాలా ఏళ్లుగా ఆయనకు సన్నిహితంగా మెలిగాను. సత్సంగం అంటే ఏమిటో నాకు ఇతమిద్ధంగా అర్థం తెలియదు. కానీ, క్రెగ్‍తో గడిపిన ప్రతి క్షణం సత్సంగమేనని ఇప్పుడు తెలిసి వస్తోంది. నిండా మానవత్వం మూర్తీభవించిన మహా మనీషి క్రెగ్. ఎక్కడ ఎవరు ఆపదలో ఉన్నా, సహాయం కోరినా తక్షణం స్పందించడం ఆయన సహజ నైజమని నేను గమనించాను. మానవత్వాన్ని కనబరిచే విషయంలో ఆయన షిర్డీ సాయికి ఏకలవ్య శిష్యుడి వంటి వారు. సాటి మనిషి ఇబ్బందుల్లో పడితే ఆయన దూరాభారాలను బేరీజు వేసుకోరనే విషయాన్ని నేను ఎన్నోసార్లు ప్రత్యక్షంగా చూశాను. తక్షణం తనకు చేతనైన సాయాన్ని అందించడం ఆయన నైజం. 2012 సంవత్సరంలో రష్యా తీవ్ర దుర్భిక్షం బారిన పడింది. బీభత్సమైన వేడిగాలులు వీచి మాస్కోవాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆ సయయంలో ఆస్టిన్ సాయి మందిరం మాస్కోవాసుల క్షేమం కోరుతూ వరుణ యజ్ఞం తలపెట్టింది. దీన్ని స్వయంగా క్రెగ్ నిర్వహించిన విషయాన్ని నేను ఇప్పటికీ మరువలేదు. నాకు తెలిసీ ఒక గురువారం ఉదయం ఈ మహా యజ్ఞం మొదలైంది. అదే రోజు రాత్రి మాస్కోలో అనూహ్యంగా భారీ వర్షాలు కురిశాయి. అక్కడి ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికీ ఆస్టిన్ సాయి మందిరం ఆధ్వర్యంలో కరువు కాటకాల నుంచి జనులను బయట పడవేయాలనే సంకల్పంతో ఏటా టెక్సాస్‍లో వరుణ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. భారత్‍లో పాండురంగ మల్యాల ఏటా నిర్వహించే ప్రపంచ శాంతి యజ్ఞంలో క్రెగ్ తన భార్య జిల్‍తో కలిసి క్రమం తప్పకుండా పాల్గొనే వారు.
ఆస్టిన్ సాయి మందిరాన్ని క్రెగ్ తూర్పు, పశ్చిమ దేశాల వారధిగా తీర్చిదిద్దారు. అటు పాశ్చాత్యుల్ని, ఇటు సంప్రదాయవాదులను, ఆధ్యాత్మికపరులనూ సూదంటు రాయిలా ఈ సాయి మందిరం ఆకర్షిస్తోందంటే అది క్రెగ్ చూపిన అంకిత భావానికి నిదర్శనం. ఎందరెందరో యోగులు, ఆధ్యాత్మిక ప్రముఖులు, గురువులు ఆస్టిన్ సాయి మందిరాన్ని సందర్శించడం నా కనులారా చూశాను. క్రెగ్ విశ్వమానవాళి కోసం ఎంత అంకితభావంతో ఉండే వారంటే.. ఆయన మనసు, ఆలోచనల్లో ‘సేవ’ తప్ప మరే మాట, భావం పలికేవి కావు. పెద్దలతో పాటు పిల్లల్లోనూ ఆయన నైతిక విలువలను పెంచేందుకు చేసిన కృషి అమోఘం. ఆస్టిన్ సాయి మందిరం 2009 నుంచి ప్రతి ఆదివారం ‘బాలవికాస్’ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఎలిమెంటరీ స్కూలు చిన్నారుల్లో వికాసాన్ని కలిగించడంతో పాటు వారిలో నైతిక వర్తనను అలవరించేందుకు ఇక్కడ ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ఏటా నూట యాభై నుంచి నూట ఎనభై మంది పిల్లలు ఈ తరగతుల్లో పాల్గొనేందుకు తమ పేర్లు నమోదు చేయించుకుంటున్నారు. పిల్లల్లో బాల్యంలోనే మానవీయ విలువలను పాలుగొల్పితే వారు పెరిగి పెద్దయ్యాక ఆదర్శనీయంగా రూపుదిద్దుకుంటారని క్రెగ్ అనేవారు.
నేను ఆస్టిన్ సాయి మందిరంలో చాలాసార్లు చూసిన దృశ్యమే అది. నేను ఎప్పుడు అక్కడకు వెళ్లినా.. ఆ సమయంలో క్రెగ్ ఆలయంలో చెల్లాచెదురుగా పడి ఉన్న వ్యర్థాలను ఏరుతూ కనిపించే వారు.
ఒకసారి ఉండబట్టలేక, ‘ఈ పని మీరే ఎందుకు చేయాలి. మీరు చేయాలని చెబితే చేసే వారు చాలామంది ఉన్నారు కదా’ అని అడిగేశాను.
అందుకు ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పటికీ నా చెవుల్లో గింగిర్లాడుతోంది.
‘దేహంలోని మలినాలను శుద్ధి చేసే వాడు గురువు. నేను గుడిలోని మలినాలను శుద్ధి చేయడం ద్వారా గురువు బాటలో నడుస్తున్నాను’.
ఆయన నిత్యం సాయి మందిరంలో పోగుపడిన వ్యర్థాలను ఏమాత్రం సంకోచించకుండా తొలగించే వారు. ఈ పని చేయడం ఏమాత్రం చిన్నతనం కాదని, అదీ ఒక సేవేనని ఆయన అనేవారు. క్రెగ్ ప్రయత్నాల వల్లనే సాయి బోధనలు విశ్వవ్యాప్తం అయ్యాయంటే అతిశయోక్తి కాదు.
ఏదేమైనా ఇప్పుడు క్రెగ్ మన కళ్లెదుట లేరు. కానీ, ఆయన రూపం మనసు నిండా ఉంది. ఆయన వదిలి వెళ్లిన జ్ఞాపకాలు హృదయాలను నిరంతరం తడుతూనే ఉంటాయి. ఆయనతో నేను గడిపిన రోజులు మరిచి పోలేనివి. ఆయనతో నేను, నాతో ఆయన పంచుకున్న భావాలు, ఆలో చనలు, అభిప్రాయాలు, ఆధ్యాత్మిక సంభాషణలు నన్ను నిరంతరం ఉత్తేజితం చేస్తూనే ఉంటాయి. ఆ విశ్వమానవునికి చేతులెత్తి నమస్క రిస్తూ …..
– డాక్టర్ కుమార్ అన్నవరపూ.
Review భగవంతుని సన్నిధికి….