పిచ్చితలి

అనగనగా ఒక వృద్ధాశ్రమం. ఒక పెద్దావిడ రోజూ స్నానం చేసి, బట్టలన్నీ సర్దుకుని ఆశ్రమం గేటు వద్ద నిలుచుని ఎవరి రాక కోసమో ఎదురు చూస్తుంటుంది. ఒకరోజూ రెండ్రోజులూ కాదు.. వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి ఆమెకదే వ్యాపకం. ఆమె ఎందుకలా ఎవరి కోసం ఎదురు చూస్తుందో తెలుసా?.. ఆశ్రమం నిర్వాహకులు ఆమెకు ఎంతగానో నచ్చచెప్పి చూశారు. మీరు ఎదురుచూసే ఆ వ్యక్తి ఎన్నటికీ రాడని ఒప్పించడానికి యత్నించారు. కానీ, ఆమె వింటే కదా! ఒకనాడు ఆ వృద్ధాశ్రమాన్ని సందర్శించడానికి ఒక ప్రముఖుడు వచ్చారు. కడుపున పుట్టిన పిల్లలు వదిలేయగా, పిల్లల నిరాదరణకు గురై, ఇంకా వివిధ కారణాలతో అక్కడ చేరిన వృద్ధులైన తల్లిదండ్రులకు ప్రవచనాలు ఇచ్చేందుకు ఆ ప్రముఖుడు వచ్చారు. ఆయన ఆశ్రమం గేటు వద్ద కారు దిగగానే, ఆ అమ్మ యథావిధిగా పెట్టె పట్టుకుని ఎవరి కోసమో ఎదురు చూస్తూ నిలుచుంది. ఆమె ఎవరని ఆయన ఆశ్రమం నిర్వాహకులను అడిగారు. అప్పుడు వారిలా చెప్పారు.
‘‘అయ్యా! ఏం చెప్పమంటారు? ఆమె బాగా కలిగిన ఆవిడ. భర్త ఉన్నంత కాలం మంచిగానే బతికింది. ఆయన చనిపోగానే ఉన్న ఒక్కగానొక్క కొడుకులో అన్నీ చూసుకుంటూ అతని ఉన్నతి కోసం ఉన్నదంతా ధారపోసింది. అతను జీవితంలో స్థిరపడగానే తల్లి పనికిరానిది అయిపోయింది. ఓ రోజు ఆమెను పెట్టేబేడా సర్దుకోమని చెప్పాడు. తాను ఉద్యోగరీత్యా ఊరెళ్తున్నానని, నెలలో వస్తానని, అప్పటి వరకు నిన్ను చూసుకోవడం కోసం ఓ ఆశ్రమంలో చేర్పిస్తున్నానని, సరిగ్గా నెలకు వచ్చి ఇంటికి తీసుకెళ్తానని చెప్పి తల్లిని వృద్ధాశ్రమానికి తీసుకువచ్చాడు. ‘ఈవిడ మాకు తెలిసిన చుట్టాలామె. చూసుకోవడానికి ఎవరూ లేరు. మీ ఆశ్రమంలో చోటివ్వండి’ అని చెప్పి కారులో దించి వెళ్లిపోయాడు. తరువాత మేం విచారణ చేస్తే ఆమె అతని తల్లే అని, ఆమెను వదిలించుకోవడానికే అతనిలా చేశాడని తేలింది. కానీ, పిచ్చితల్లి.. ఆమెకు కొడుకంటే ప్రాణం, ప్రేమ. ఆ ప్రేమతో పిచ్చెక్కిపోయింది. అదిగో ఇలా రోజూ వచ్చి పెట్టె పట్టుకుని కొడుకు రాక కోసం రోడ్డు వైపు చూస్తుంటుంది’’ అని ఆశ్రమ నిర్వాహకులు చెప్పగానే ఆ ప్రముఖుడు, అక్కడున్న వారంతా కంటతడి పెట్టారు.
ఇది కథ కాదు. మన తెలుగునేలపై గల ఓ వృద్ధాశ్రమంలో కనిపించిన వాస్తవం. ఆమే కాదు.. ఇంకా ఎన్నో ఆశ్రమాల్లో ఎందరో అవశానదశలో పిల్లల ప్రేమకు నోచుకోక అల్లాడుతున్న తల్లులు ఎందరో ఉన్నారు.

Review పిచ్చితలి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top