ఫాల్గుణ శుద్ధ పూర్ణిమను మహా ఫాల్గునీ అనీ అంటారు. ఈ తిథి నాడు నైమిశారణ్యంలో గడిపితే విశేష ఫలప్రదమై ఉంటుందని గదాధర పద్ధతి అనే గ్రంథంలో వివరించారు. ఇక, ఈనాడు భారతీయంలో ప్రఖ్యాతమైన హోలీ పర్వదినం కూడాను. హోలికా, హోళికా దాహో అనే పేర్లతో స్మ•తి కౌస్తుభం, హుతాశనీ పూర్ణిమ, వహ్న్యుత్సవం అనే పేర్లతో ఆమాదేర్ జ్యోతిషీ అనే గ్రంథంలోనూ వర్ణించారు. ఈనాడు లక్ష్మీనారాయణ వ్రతం, అశోక పూర్ణిమ వ్రతం, ధామత్రి రాత్ర వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో రాశారు. శయన దాన వ్రతం చేస్తారని పురుషార్థ చింతామణిలో ఉంది. అలాగే, శశాంక పూజ చేయాలని నీలమత పురాణంలో ఉంది. మరికొన్ని గ్రంథాలు దీనిని డోలా పూర్ణిమ అంటున్నాయి. ఈనాడు లింగ పురాణాన్ని దానం చేస్తే శివలోక ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం.
ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ బ్రహ్మ సావర్ణి మన్వంతరాది దినం. బ్రహ్మ సావర్ణి మనువుల్లో పదో వాడు. ఇతడు బ్రహ్మపుత్రుడు. ఈ మన్వంతరంలో ఇంద్రుడు శాంతి కాముకుడు.
ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడు దక్షిణాదిలో కామదహనం చేస్తారు. ఈ పూర్ణిమను తెలుగు వారు కాముని పున్నమి అంటారు.
ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడు చంద్రుడు ఉత్తర ఫల్గునీ నక్షత్రంతో కూడి ఉంటాడు. ఈ సమయంలోనే ప్రకృతిలో వసంత రుతువు లక్ష ణాలు పొడచూపుతుంటాయి. చలి తగ్గుముఖం పడుతుంది. ఉక్కపోత అంతగా ఉండదు. సూర్యుడు బాగా ప్రకాశిస్తూ హితవై ఉంటాడు. అన్ని పంటలు ఇంటికి వస్తాయి. కర్షకుడికి కడుపు నిండా తిండి దండిగా దొరికే రోజులు. అంతా ఆనంద గోవిందంగా ఉంటుంది.
మధుర మీనాక్షి దేవి తపస్సు చేసి సుంద రేశ్వర స్వామిని ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడు వివాహమాడిందని చెబుతారు. అలాగే, ఈనాడు కల్యాణ వ్రతం ఆచరించే సంప్రదాయం కూడా ఉంది.
ఇక, ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ ప్రస్తుతం హోలీగానే ప్రసిద్ధి. ఈ కథ వివరాల్లోకి వెళ్తే..
పూర్వం హోలికా అనే రాక్షసి ఉండేది. శిశువులను చంపి తినేది. ప్రజలంతా రాక్షస రాజుతో మొర పెట్టుకున్నారు. అతను కూడా రాక్షస ప్రవృత్తి గలవాడే కాబట్టి, రోజుకొక శిశువును హోలిక వద్దకు పంపాలని ఆదేశించాడు. ప్రజలు అలాగే చేయసాగారు. ఒకసారి వృద్ధురాలి వంతు వచ్చింది. ఆమెకు ఒక్కడే కొడుకు. ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా, ఆ ఊరికి ఒక యోగి వచ్చాడు. దివ్యదృష్టితో విషయం తెలుసుకుని ఒక ఉపాయాన్ని కనిపెట్టాడు. దాని ప్రకారం- హోలిక రాక్షసి శిశువు కోసం వచ్చినపుడు పిల్లలందరూ కలిసి తిట్లను, అసభ్య వాక్కులను పలకాలి. హోలిక భయపెడుతుంది. అయినా బెదిరిపోక తిడుతూనే ఉండాలి. ఆ తిట్లు వినలేక హోలిక మరణిస్తుంది అని యోగి చెప్పాడు. గ్రామస్తులంతా అలాగే చేశారు. హోలిక మరణించగానే ఆమెను మంటల్లో వేసి కాల్చివేశారు. దీనికి అనుగుణంగానే హోలీ నాడు కొన్ని ప్రాంతాల్లో పిల్లలను మంటలపై అటూఇటూ తిప్పుతారు. దీనివల్ల పిల్లలకు పట్టిన పీడలు వదిలిపోతాయని నమ్మకం. ఈ ఆచారం గురించి నిర్ణయసింధువు, ధర్మసింధువు వంటి స్మ•తి గ్రంథా లలో ఉంది.
భవిష్యోత్తర పురాణంలో కూడా హోలీ గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పిన కథ దాదాపు పై కథనే పోలి ఉంటుంది. ఇది కూడా పిల్లల్ని పీడించే రాక్షసి కథే. హోలీ నాడు రాత్రి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలనే ఆచారం చాలా ఇళ్లలో ఉంది. మొత్తానికి పూర్ణమాసి సర్వ సారమైన తిథి. అందరికీ పరమానందదాయిని.
భవిష్యోత్తర పురాణంలోనే ‘మదన మహో త్సవం’ అనే మరో ఉత్సవ ప్రస్తావన ఉంది. ఇది కామదహన గాథ. మన్మథుడు ముక్కంటి ఆగ్రహానికి మసైపోగా, అతని సతీమణి రతీదేవి పతిభిక్ష కోరింది. పార్వతి కోరిక మేరకు శివుడు- ‘చైత్రశుక్ల త్రయోదశి నాడు మన్మథుడు మళ్లీ రూపుదాలుస్తాడని, బీజ భూతుడైన ఇతని యందే ప్రపంచమంతా ఉంటుంద’ని రతీదేవికి అభయం ఇచ్చాడు. అప్పటి నుంచి మన్మథ జన చిహ్నంగా హోలీ పండుగ జరుపుకోవడం ఆచారమైంది. భవిష్యోత్తర పురాణంలోనే మరో గాథ ఉంది.
ఒకప్పుడు పార్వతీదేవికి పిల్లలు లేరనే చింత కలిగింది. ఈ క్రమంలో ఆమె హృదయం నుంచి పంకిల శరీరంతో ఓ కన్య పుట్టింది. పార్వతి ఆమెను చూసి ‘నీవు భూమి పంకిలిప్తాంగివై పుట్టి తివి. కాబట్టి ఉదయ సేవ అనే మహోత్సవం కలుగుతుంది. ఆనాడు నువ్వు ఆరాధనలు అందుకుంటావు’ అని వరమిచ్చింది. అంతలో శంకరునికి, పార్వతికి కలిగిన ఘోర కామవాంఛ నుంచి భైరవుడు పుట్టాడు. అతను ఆ కన్యను తన భార్యగా చేసుకున్నాడు. వీరిద్దరి వల్ల భైరవోత్సవం జరిగేలా శంకరుడు శాసించాడు. ఈ భైరవుడు ప్రవేశించే ప్రాంతంలో ప్రజలు ఉన్మత్తులవుతారని, అశ్లీల మాటలతో, అసభ్యకరంగా ప్రవర్తిస్తారని, వావి వరసలు పాటించరని శివుడు అంటాడు. అలా భైరవుడు వెళ్లిపోయే రోజే ఈనాటి హోలీగా భావించవచ్చు.
ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం..
ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడు ప్రతి ఇంటి ముందు ఒక గుంటను తవ్వుతారు. దానిలో ఆముదపు కొమ్మను నాటి, గడ్డిగాదం, పిడకలు దాని చుట్టూ పోగుచేస్తారు. హోలీ, హెలిక అనే దేవతను పూజించి చేతి వెనుక భాగంతో నోరు కొట్టుకుంటూ ఆ గడ్డిగాదానికి నిప్పంటిస్తారు. రాత్రంతా ఆరుబయట వసంతాన్ని బుక్కపిండిన ఒకరిపై ఒకరు చల్లుకుని ఆడుకుంటారు. మరుసటి ఉదయం కింది తరగతుల వారూ పరస్పరం దుమ్ము, బురద చల్లుకుని అసభ్య పదజాలంతో తిట్టుకుంటారు. ఈనాటి పండుగను ‘ధులండీ’ అంటారు. అంటే ధూళి రేపుట అని అర్థం. ఇదీ హోలీ నాటి ఉత్తరాది వారి సంప్రదాయం.
మహారాష్ట్రులు- వీర సంస్మరణ దినంగా దీనిని జరుపుకుంటారు. ఈనాడు మృతవీరుల బంధువులు మంటల చుట్టూ నాట్యం చేస్తారు. పిదప ఆ మంటల్లో వేడి నీటితో స్నానం చేస్తారు.
పశ్చిమబెంగాల్‍లో- హోలీని డోలోత్సవం అంటారు. కృష్ణుడికి బొబ్బట్లు నైవేద్యం పెడతారు. ఈ పండుగనే సంతాలులు, ముండాలు సాల వృక్షాలు పూచినపుడు జరుపుకుంటారు. ఆటవికులైన వీరికి సాల వృక్షాలు ముఖ్యమైనవి కాబట్టి అవి పూచినపుడే వారికి పండుగ.
ఇక, ఆంధప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కామ దహనంగా నిర్వహించుకుంటారు. తన తపస్సు పాడు చేసేందుకు వచ్చిన మన్మథుడిని శివుడు మూడో కన్ను తెరిచి భస్మం చేస్తాడు. ఇది ఫాల్గుణ పూర్ణిమ నాడే జరిగిందని విశ్వాసం. పూర్ణిమకు నాలుగైదు రోజుల ముందే కూడలి ప్రాంతాల్లో పతాకాలను నాటతారు. చెత్తా చెదారాన్ని పోగు చేస్తారు. మన్మథుడి బొమ్మను ఊరేగించి ఆ చెత్తలో కాల్చివేస్తారు. ఉత్తర, పశ్చిమ భారతదేశాల్లో ఈ పండుగ కొంత అశ్లీలకర వాతా వరణంలో జరుగుతుంది.
వాత్స్యాయన కామసూత్రాల్లోనూ ప్రస్తావన..
క్రీస్తు శకం రెండు, మూడు శతాబ్దాలలో రచించిన వాత్స్యాయన కామసూత్రాలలో వాత్స్యాయనుడు ‘హోలాకా’ అనే పండుగ గురించి వర్ణించాడు. ఫాల్గుణ పూర్ణిమ నాడు శృంగకాదులు (కొమ్ములతో చేసిన పిచికారీ వంటి పరికరం) మొదలగు వాటితో మోదుగ పూలు, ఇతర రసాలు కలిపిన రంగుల నీటిని పరస్పరం చల్లుకోవాలనీ, బుక్కాపిండి చల్లుకోవా లని రాశాడు. కాళిదాసు దశకుమార చరిత్ర, హర్షుని రత్నావళిలోనూ వసంతోత్సవం గురించి వర్ణన ఉంది. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు ప్రతి ఏటా తిరుమలకు వెళ్లి స్వామికి వసంతోత్సవాన్ని జరిపించే వారు. అనంతరం కావ్యగోష్టి నిర్వహించేవారు. ఆ కాలంలో విజయనగర రాజ్యంలో హోలీ పండుగ ఈ విధంగా జరిగేదని నికలోకోంటీ అనే పాశ్చాత్య సందర్శకుడు వర్ణించాడు. హోలీకి సంబంధించి మన దేశంలో కొనసాగుతున్న ఆచారమే యూరప్ లోనూ వసంతమాసంలోనే జరుగు తుండటం విశేషం. ఫ్రాన్స్లో హోలీ నాడు ఒక బొమ్మను గడ్డి గాదంలో చుట్టి ఊరంతా తిప్పి దానిని కాల్చివేసేవారు. దీనినే ‘శ్రోల్ సమాధి’ అనే వారు. ఇంగ్లండ్‍లో కూడా ఇదే సమయంలో వసం తోత్సవాన్ని జరుపుకునే వారు. మనం ఏప్రిల్ పూల్‍గా వ్యవహరించేది వారికి వసంతోత్సవం. మొత్తానికి ఆబాల గోపాలానికి ఆనందదాయక మైన హోలీ పండుగ ప్రపంచ వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఒకే సంప్రదాయంలో కొనసాగుతున్న ఆచారం.
Review హోలీ… చెమ్మ కేళి.