
ఈ భూమిని సస్యశ్యామలం చేసే మాసం శ్రావణ మాసం. మన పెద్దలు ఆయా మాసాల వాతావరణాన్ని బట్టి ఏం తినాలి? ఏం చేయాలి? ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి? అనే క్రమం ఏర్పరిచారు. అటువంటి నియమాలు పాటించాల్సిన మాసాల్లో శ్రావణ మాసం మొదటిది. ఈ మాసం దక్షిణాయనంలో వర్ష రుతువు మొదటి మాసం. దక్షిణాయనం వర్షాకాలం. అంటే జబ్బుల కాలం. ఆరోగ్య పరిరక్షణార్థం ఈ మాసంలో నియమాలు ఎక్కువగా పాటించాలి. అందుకనే అనేక వ్రతాలు, వాటి అనుసారంగా అనేక ఆరోగ్య నియమాలు ఈ మాసంలో విధించారు. మిగతా కాలాలతో పోలిస్తే వర్షాకాలంలో మానవ దేహంలో శక్తి సన్నగిల్లుతుంది. నీరసం, నిస్సత్తువ ఆవహిస్తాయి. అందుకే ఈ కాలంలో బలవర్ధకమైన మినుములు, ఇతర పప్పు ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలని అంటారు. అందుకు దోహదం చేసే శ్రేష్ఠమైన ఆహార పదార్థాలతో పాటు శక్తిని సముపార్జించుకోవడానికి శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ మాసంలో ఎక్కువగా ఆరాధిస్తారు. ఆరోగ్యానికి దోహదం చేసే శ్రావణ మాస ఆరోగ్య నియమాల గురించి వివరణ.
శ్రావణ మాసంలో ఆచరించే అనేక వ్రతాలలో భాగంగా పులగం, పప్పు అన్నం ఎక్కువగా వాడాలి. పులగం, పప్పన్నం మిశ్రమాన్నే ‘సూపో దనం’ అని అంటారు. వరి ధాన్యంతో పాటుగా పెసలు, మినుములు, శనగలు ఈ మాసంలో విరివిగా వాడాలి. దాదాపు ఈ మాసంలో ఆచరించే ప్రతి వ్రతానికీ వడపప్పుగా పెసరపప్పు ఎక్కువగా వాడతారు. పప్పు దినుసుల్లో పెసలు శ్రేష్ఠమైనవి.
శ్రావణ శుద్ధ త్రయోదశి నాడు నిర్వహించే అనంగ వ్రతంలో మినుముల పిండి, నెయ్యి, పంచదార కలిపి చేసే పదార్థం నివేదించాలని నియమం.
ఇక, మంగళ గౌరీ వ్రత సందర్భంగా ఇచ్చే వాయనాల్లో శనగల వాడకం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి ఛాయ కలిగించడంలో శనగలు సాటి లేనివి. నీళ్లలో నానబెట్టిన శనగలు గుప్పెడు తిని వ్యాయామం చేసే వారి శరీరం ద్రుఢంగా తయారవుతుంది.
శ్రావణ మాస వ్రత నియమాల్లో సూచించిన నివేదనలను పరిశీలిస్తే అవన్నీ ఆరోగ్య రక్షణ దృష్టితో విధించిన నియమాలేనని అర్థమవుతుంది.
శ్రావణ మాసంలో ప్రకృతి వర్షాధారలతో అభిఘాతం చెందిన తామరపువ్వులు, గిరి మల్లికలు, ఇంద్రధనస్సు, ఇంద్రగోప పురుగులు, నెమళ్లు, కప్పలు.. వాటి శబ్దాలు, ఉరుములు మెరుపులతో కూడి ఉంటుంది. ఈ కాలంలో పాతవైన గోధుమలు, ఆకాశోదకం, కూపోదకం, కాచిన ఉదకం, ఆమ్ల లవణ స్నేహరసాలు అధికంగా చేరి ఉండే భోజనం చేయాలని శాస్త్ర వచనం. అలాగే, సువాసన ద్రవ్యాలతో ధూపం వేసిన వస్త్రాలను ధరించాలి. పగలు అసలు నిద్రపోకూడదు. నదీజలం వాడకూడదు. వేడిగా ఉన్న ఆహార పదార్థాలనే భుజించాలి.
శ్రావణ మాసంలో వచ్చే ప్రధాన పర్వాల్లో నాగపంచమి ముఖ్యమైనది. ఈనాడు పువ్వులు, మంచిగంధం, పసుపు, వేపుడు బియ్యం, చిక్కుడు గింజలు, వేపిన ఉలవలు మొదలైనవి పూజా ద్రవ్యాలుగా వాడతారు. ఇక, ఈనాడు ఉడకబెట్టి పదార్థాలు మాత్రమే భుజించడం ఆచారం. మిగతా రోజుల్లో కంటే ఈ తిథి నాడు తీసుకునే ఆహార పదార్థాలు ముతకవిగా ఉండేటట్టు జాగ్రత్తపడతారు.
ఇక కేరళ ప్రాంతంలో నాగపంచమి నాడు గోధుమపిండి, బెల్లం, నీటితో ఆవిరి మీద ఉడికించిన ‘డిండీలు’ అనే తీపి వంటకం తింటారు.
శ్రావణ శుద్ధ షష్ఠి నాడు సూపౌదన వ్రతం ఆచరిస్తారు. సూప + ఓదనం అనగా, పప్పు + అన్నం అని అర్థం. ఈనాడు శివపూజ చేసి శివునికి పప్పు, అన్నం నైవేద్యంగా సమర్పించాలి. మనం కూడా పప్పు, అన్నమే తినాలని నియమం. ఈ ఆరోగ్య నియమంతో కూడిన ఆహార నియమం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి.
శ్రావణ శుద్ధ త్రయోదశి నాడు అనంగ త్రయోదశి వ్రతం ఆచరిస్తారు. ఇది పూర్తిగా మినుములతో ముడిపడి ఉన్న వ్రతం. మినుములు వేయించి, పంచదార, నేయి కలిపి ఉండలు చేసి వాటిని, పాలను రతీ మన్మథులకు నైవేద్యంగా పెట్టాలని అంటారు. ఆంధ్రుల ఇళ్లలో మనుగుడుపుల రోజుల్లో మినుములతో చేసిన మినపసున్నిని అల్లుళ్లకు తప్పకుండా పెడతారు. రతీ మన్మథులను పూజలో ఈ మినపసున్నిని నివేదన చేయడం బలవర్ధకం, మైథున ప్రీతికరం అని చెప్పడానికి కావచ్చు.
శ్రావణ శుద్ధ పూర్ణిమ అనేక విధాలుగా ప్రత్యేకమైనది. ఇక, ఆరోగ్యపరంగా చూస్తే ఈనాడు ఉపవాసం పనికిరాదని కొందరు అంటారు. ఈనాడు తీపి పదార్థాలను చేసుకుని భుజించాలని చెబుతారు.
శ్రావణ మాస తిథులలో మరో ముఖ్యమైనది- శ్రావణ బహుళ అష్టమి. ఇదే కృష్ణాష్టమిగా ప్రసిద్ధి. ఈనాడు తిలామలక పిష్టం ఒంటికి పట్టించుకుని స్నానం చేయాలి. తులసీదళాలు వేసిన నీటితో ఆచమనం చేయాలి. ఆనాడు ఉపవాసం ఉండాలి. అనంతరం కృష్ణుడిని యథాశక్తి పూజించాలి. మర్నాడే భోజనం చేయాలి. ఉపవాస పూజా జాగరణాలు ముఖ్యమైన దినాల్లో ఇది ఒకటి. ఈనాటి నైవేద్యానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈనాడు బాలింతలు తినే ‘కాయం’ ముఖ్య నైవేద్యపు ఆహార పదార్థం.
వేయించిన మిననపిండితో పంచదార కలిపి కాయం చేసి నివేదన చేయాలి. దీనినే కొన్ని ప్రాంతాలలో శొంఠి మిశ్రమించి కూడా తయారు చేస్తారు. శొంఠి ఉక్కిరి చాలా ఆరోగ్యప్రదమైన లేహ్యం. అది తియ్య తియ్యగా, కారం కారంగా ఉంటుంది. శొంఠి మిరియం కొద్ది నీళ్లతో నూరి బెల్లంతో పాకం పట్టి దానిలో తగినంత నేయి కలిపి తయారు చేస్తారు. దీనినే ‘కాయం’ అంటారు.
ఇక, ఉత్తరాదిన జరిగే కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా పంచదార, గసగసాలు, కొబ్బరి కాయ ముక్కలు, యాల కులు మొదలైన మధుర ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యా లతో కూడి తయారు చేసిన ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు. ఇది మిక్కిలి బలవర్ధకమైన పదార్థం.
ఇక, కృష్ణాష్టమి నాడు కృష్ణుడిని పూజించడానికి ఉపయోగించే పూలలో పొన్న పువ్వులు ముఖ్యమైనవి. ఇవి మనోహరంగా, సువాసనగా ఉంటాయి. ఇవి శిరోరోగాలను పోగొడతాయి. పొన్న చెట్టు నీడ త్రిదోష హరమై నదని ఆయుర్వేద వైద్య గ్రంథాలు చెబుతున్నాయి.
శ్రావణ కృష్ణ అమావాస్య పోలామావాస్యగా ప్రసిద్ధి. మాళవ ప్రాంతంలో ఈనాడు తయారు చేసుకుని తినే ఆహార పదార్థాన్ని ‘ఖాపర్ పోళీ’ అంటారు. దీనిని మెత్తటి పిండితో తయారు చేస్తారు. మధ్య మధ్యలో చిల్లులు ఉంటాయి. ఆవిరి మీద వండుతారు. తినేటప్పుడు వీటిని పంచదార కలిపిన పాలల్లో ముంచుకుని తింటారు. మహారాష్ట్రలో అయితే ఈనాడు చాలా రకాలైన ఆహార పదార్థాలను, పిండివంటలను తయారు చేస్తారు. ఇవన్నీ బలవర్ధకమైనవే.
పోలాల అమావాస్య నాడు ముఖ్య పూజా ద్రవ్యాలలో కంద ఒకటి. ఈనాడు పోలేరమ్మతో పాటుగా పూజలందుకునే కంద గొడుగు వరణీయమైనది. ‘కంద’ చాలా చలువైనది. అందుకే కాబోలు ‘నీ కడుపు కంద పెరడు కాను’ అని చమత్కారంగా ఆశీర్వదిస్తారు. పెళ్లి కూతుళ్ల వడికట్టులో కంద దుంప ఉంచే ఆచారం మన తెలుగునాట ఉంది. అలాగే, సవర్త బంతికి కందబచ్చలి తప్పనిసరిగా వండుతారు. ‘కంద గౌరి నోము’ అనే వ్రతం కూడా ఆచరణలో ఉంది. ఇవన్నీ కంద మహిమను తెలిపేందుకు పుట్టిన సందర్భాలేనని భావించాలి.
ఇక, శ్రావణ మాసంలో వచ్చే మంగళగౌరీ వ్రతం చాలా విశేషమైనది. ఈనాడు సూర్యో దయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేస్తారు. బెల్లం కలిపిన బియ్యంపిండితో ప్రమిదలు తయారు చేసి వాటిలో శ్రేష్ఠమైన ఆవునెయ్యి పోసి పవిడి పత్తితో చేసిన ఒత్తులు వేసి వెలిగించాలి. ఈ దీపం నుంచి వెలువడే ధూరం అత్యంత సువాసనతో నిండి ఉంటుంది. ఈ వాసన శ్వాసకోశ వ్యాధుల్ని నయం చేయగలగడంతో పాటు రక్తనాళాలను శుద్ధి చేస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించే సందర్భంలో ఒక పాట పాడతారు. ఆ పాట పూర్తయ్యేలోపు దీపపు నుశి కాటుకలా చుట్టూ అంటుకుంటుంది. ఈ కాటుకను వ్రతం ఆచరించే స్త్రీ కళ్లకు పెట్టుకోవాలి. తర్వాత ప్రమిదలు, ఒత్తితో సహా తినేయాలని వ్రత నియమం.
వరలక్ష్మీ వ్రతం నాడు పచ్చి బియ్యం పిండితో చలివిడి, ఉండ్రాళ్లు చేసి వాయనంగా ఇస్తారు. ఇవి ఉడికించి వండే ఆహార పదార్థాలు. వర్షాకాలంలో ఉడికించి వండిన ఈ పదార్థాలు ఆరోగ్యప్రదమైనవి.
ఇక, శ్రావణ మాస వ్రతాల్లో ఆచరించే కట్టుబాట్లు, నియమాలు చక్కటి వ్యాయామంగా పనిచేసి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. నైవేద్యంగా సమర్పించి, ఆరగించే చలిమిడి చలువ చేస్తుంది. చలిమిడి గర్భధారణ అవరోధాలను తొలగిస్తుంది. వరలక్ష్మీ వ్రతం నాడు వాయనంగా ఇచ్చే మొలకెత్తిన శనగలు పోషక నిలయాలు. వీటిలోని మాంసకృత్తులు తక్షణ శక్తినిస్తాయి. అలాగే, వర్షాకాలంలో పాదాలు ఎక్కువ సేపు తడిగా ఉండటం వల్ల ఇన్‍ఫెక్షన్లు కలుగుతాయి. ఈ ఇన్‍ఫెక్షన్లు కలగకుండా ఉండేందుకే కాళ్లకు పసుపు రాసుకోవడాన్ని వ్రతాల్లో భాగం చేశారు. ఆవునెయ్యితో వెలిగించే దీపాల ద్వారా విడుదలయ్యే ధూపం వాయు కాలుష్యాన్ని హరిస్తుంది.
ఇవీ శ్రావణ మాసపు వ్రతాలతో ముడిపడి ఉన్న ఆరోగ్య రహస్యాలు.
Review ఆరోగ్యదాయక శ్రావణం.