ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‍ఓ) వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల్లో ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం, మంచి ఆహార
అలవాట్లు, పరిశుభ్రత పాటించేలా
చైతన్యపరచడం ఈ దినోత్సవ ముఖ్యోద్దేశం.
ఏటా ఏదైనా ఒక విశేషాన్ని (థీమ్) తీసుకుని ఏడాది పొడవునా దానిపై ప్రచారం చేయడం ఆరోగ్య దినోత్సవం లక్ష్యం. ఈ క్రమంలో 2026 సంవత్సరాన్ని ఆరోగ్యం.. వైద్యం అందరికీ సులభంగా, చౌకగా లభించాలానే థీమ్‍తో ఈ ఏడాది ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యం కోసం ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఆరోగ్యం పొందడం అనేది మన చేతుల్లోనే ఉందనే విషయాలను తెలుసుకుందాం.
మన జీవితాశయాలు నెరవేర్చుకోవాలన్నా.. జీవితంలో ఉన్నతి సాధించాలన్నా.. కలలను సాకారం చేసుకోవాలన్నా మనిషి శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా దృఢంగా ఉండటం ఎంతో అవసరం. ఒక్కమాటలో చెప్పాలంటే సంపూర్ణ ఆరోగ్యంతోనే మనం అన్నింటా శక్తిమంతులం కాగలం. ఇది సాధ్యం కావాలంటే కేవలం శారీరకంగానే కాదు, మానసికంగానూ దృఢంగా తయారు కావాలి. ఇందుకోసం చక్కటి పోషకాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి చేయడం అవసరం. అలాగే ఏ వయసులో ఉన్న వారు ఆ వయసుకు తగినట్టు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఇవన్నీ చేస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడానికి, మన జీవితాశయాలను నెరవేర్చుకోవడానికి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణుల మాటల్లోనే..
పోషకాహారం ఫస్ట్
ఏ వయసు వారైనా సరే.. మంచి పోషకాహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. తాజా పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు, బీన్స్, పెరుగు, మొలకెత్తిన గింజలు వంటి ప్రొటీన్లు ఎక్కువగా లభించే పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఎక్కువ మొత్తంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. బరువు అదుపులో ఉండి చురుగ్గా ఉండటంతో పాటు ఏ పనైనా శ్రద్ధగా చేయగలుగుతారు.
నీరసానికి ఐరన్ ఫుడ్
ఇటీవల చాలామందిలో కనిపిస్తున్న సమస్య- ఉన్నట్టుండి మనిషి నీరసపడిపోవడం. పని ఒత్తిడి, లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రస్తుతం మనిషి చాలా పరిశ్రమ చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో శక్తిని కోల్పోతాం. అలాంటపుడు ఐరన్ ఎక్కువగా లభించే ఆకుకూరలు, బాదం, రెడ్ మీట్ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల కోల్పోయిన శక్తిని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఈ ఆహారం తీసుకోవడం వల్ల నీరసం తగ్గి ఉత్తేజంగా ఉండగలుగుతాం.
అంతా టైమ్ టు టైమ్
పోషకాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని క్రమం తప్పకుండా సమయానికి తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. బ్రేక్‍ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి రోజూ ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడు పడితే అప్పుడు చేయడం కాకుండా.. వాటికంటూ ఒక కచ్చితమైన సమయం నిర్దేశించుకోవాలి. అలాగే ఒకేసారి ఎక్కువ తినడం, కొన్నిసార్లు మితంగా తినడం కాకుండా కొద్ది మొత్తంలో ఎక్కువసార్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. బయట దొరికే స్నాక్స్, జంక్‍ఫుడ్‍కు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ఆహారాన్ని సమయానికి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం.. శరీరానికి శక్తీ లభిస్తాయి.
వ్యాయామం మస్ట్
శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు కావడానికి వ్యాయామం ఎంతగానో ఉపకరిస్తుంది. వ్యాయామం చేసే క్రమంలో శరీరంలోని కణజాలాలకు ఆక్సిజన్, ఇతర పోషకాలు బాగా సరఫరా అవుతాయి. తద్వారా గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. అలాగే కండరాలు దృఢంగా తయారవడంతో పాటు శరీరానికి శక్తి అందుతుంది. వ్యాయామం వల్ల శరీరంలోని అదనపు క్యాలరీలు కరిగి బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు.
ఒత్తిడిలో ఉన్నప్పుడు అరగంట పాటు వ్యాయామం చేయడం ద్వారా మెదడులో విడుదలయ్యే కొన్ని రకాల రసాయనాల వల్ల మనసు స్థిమితపడుతుంది. దీంతోపాటు శరీరంలో కొత్త శక్తి ఉత్పన్నమవుతుంది. కాబట్టి రోజువారీ విధుల్లో ఎదురయ్యే ఒత్తిడి నుంచి బయటపడాలంటే కనీసం రోజు అరగంట పాటు వ్యాయామం చేయడాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలి. అలాగే వ్యాయామం చేయడం వల్ల శరీరం అలసటకు గురై నిద్ర కూడా బాగా పడుతుంది. మనసు ప్రశాంతమవుతుంది.
ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు
ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. చాలామంది ఒంట్లో బాగానే ఉంది కదా.. వైద్య పరీక్షలు ఎందుకు అనే ధోరణిలో ఉంటారు. కానీ, ఆరోగ్య సమస్యలు లేకపోయినా వైద్య పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవడం తప్పనిసరి. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే రకరకాల ఆరోగ్య సమస్యల గురించి అవగాహన పెరిగి అవి రాకుండా ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి వీలవుతుంది.
వయసు పెరిగే కొద్దీ బీపీ, మధుమేహం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. కాబట్టి ముందు నుంచీ వీటిపై అవగాహన పెంచుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
సంవత్సరానికి ఒకసారి దంత పరీక్షలు చేయించుకోవాలి. దంతాలను శుభ్రం చేయించుకోవడం, రెండేళ్లకోసారి కంటి పరీక్షలు చేయించుకోవడం అవసరం. శరీరంలో రోగనిరోధక శక్తి ఎలా ఉందో తెలుసుకోవడానికి కూడా కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. వివిధ క్యాన్సర్ల బారిన పడకుండా ఉండటానికి వైద్య పరీక్షలు ఉపకరిస్తాయి. ఇవన్నీ నిర్ణీత సమయం ప్రకారం చేయించుకోవడం వల్ల మన ఆరోగ్యంపై మనకు సరైన అవగాహన కలుగుతుంది.
ఆనందం.. ఆరోగ్యం
సమస్యలు, ఒత్తిళ్లు లేనపుడు మనసు సంతోషంగా, ఉల్లాసంగా ఉంటుంది. తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎప్పుడైతే ఆనందంగా జీవితం గడుపుతుంటామో అన్ని రోజులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు. అలాకాకుండా అనవసరమైన వాటికి ఆందోళన చెందడం, మానసిక ఒత్తిడికి గురికావడం వంటి వాటి వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి క్రమంగా క్షీణించి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారినపడే ప్రమాదం ఉంది. కాబట్టి నిత్యం నవ్వుతూ, ఆనందంగా ఉండటం జీవితంలో చాలా ము్య•ం.
ఆధ్యాత్మికతతో పశ్రాంతత
ఆధ్యాత్మిక చింతన ద్వారా కూడా మనిషి, మనసు ప్రశాంతంగా ఉండవచ్చు. తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మానసికంగానూ దృఢంగా ఉండవచ్చు. ఇందుకోసం ప్రశాంతమైన ప్రదేశంలో ఒంటరిగా కూర్చుని కాసేపు ధ్యానం చేయాలి. ఇంకా ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండటం, ఆత్మవిశ్వాసం పెంచుకోవడం వల్ల అటు శారీరకంగానూ, ఇటు మానసికంగానూ ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఆరోగ్యం కోసం ఇలా చేద్దాం!
కొన్నాళ్ల క్రితం కోవిడ్ వైరస్ మనుషులనే కాదు యావత్తు ప్రపంచాన్ని కుదిపి పారేసింది. జీవితాల్లో అల్లకల్లోలం సృష్టించింది. వైరస్ బారిన పడకుండా చూసుకోవడం దగ్గర్నుంచి ఇన్‍ఫెక్షన్లను ఎలా ఎదుర్కోవాలో పాఠాలు కూడా నేర్పింది. రోగనిరోధకశక్తిని బలోపేతం చేసుకునే మార్గాల ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పింది. నిజానికి కోవిడ్ నేర్పిన పాఠాలు మనకు కొత్తవీ, తెలియనివీ కావు. ఎప్పట్నుంచో ఉన్నవే. కాకపోతే కరోనా రూపంలో వచ్చి మళ్లీ వాటిని గుర్తు చేసింది. ఆరోగ్యం కోసం తీసుకునే, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక సీజన్‍కో, కొద్ది రోజులకో పరిమితం కాదు. నిత్యజీవితంలో దినచర్యలో వాటిని భాగం చేసుకోవాలి. పండంటి ఆరోగ్యం కోసం ఏం చేయాలంటే..
టీకా.. పక్కా
ప్రతి సంవత్సరం ఫ్లూ వైరస్ మారుతోంది. గత టీకాలను తట్టుకునే శక్తిని సంతరించుకుంటోంది. దీనికి తోడు మధ్యలో కరోనా వైరస్ తోడైంది. ఇదెలాంటి కలకలం రేపిందో అందరికీ తెలిసిందే. కాబట్టి ఫ్లూలను తట్టుకునే టీకాలను తీసుకోవడం ద్వారా సామూహిక రోగనిరోధకశక్తి లభిస్తుంది. జబ్బుల బారిన పడటం తగ్గుతుంది.
తాకే వస్తువులు శుభ్ర.. శుభ్ర..
తలుపు గొళ్లాలు, పిడులు, నల్లాలు, వాషింగ్ మెషీన్లు, ఫోన్లు, ట్యాబ్లెట్లు, కీబోర్డులు, లైట్ స్విచ్చులు, రిమోట్ కంట్రోళ్లు, పిల్లల ఆటబొమ్మలు.. ఇంకా బయటకు వెళ్తే లిఫ్టులు, మెట్ల రెయిలింగ్‍లు, రవాణా సాధనాల్లోని వివిధ వస్తువులు.. ఇంకా ఎన్నిటినో తాకక తప్పని పరిస్థితి. ఇలాంటివన్నీ బ్యాక్టీరియా నిలయాలే. కాబట్టి వీటిని తరచూ శుభ్రం చేయాలి. లేదా మన చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా, ఇతరులకు వ్యాపించకుండా చూసుకోవచ్చు. ఇది జలుబు, వివిధ అలర్జీలు, అతిసారం, వాంతులు, కోవిడ్ వంటి వైరస్‍ల బారిన పడకుండా ఉండటానికి తోడ్పడుతుంది.
చక్కెర.. కొంచెం కొంచెమే!
మద్యంలాగే చక్కెరా తెల్ల రక్తకణాల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. దీంతో బ్యాక్టీరియా, వైరస్‍లతో పోరాడే శక్తి సన్నగిల్లుతుంది. చక్కెర విషయంలో జాగ్రత్త అవసరం. ఆడవాళ్లు రోజూ 6, పురుషులు 9 చెంచాల కన్నా మించకుండా చూసుకోవాలి. ఒక మామూలు కూల్‍డ్రింక్‍లో 10 చెంచాల చక్కెర ఉంటుందని తెలుసుకోవాలి.
విటమిన్ సి, జింక్..
విటమిన్ సి ఇన్‍ఫెక్షన్ల ముప్పు తగ్గిస్తుంది. ముఖ్యంగా ఒత్తిడికి లోనైన వారిలో దీని ప్రభావం ఎక్కువ. విటమిన్ సి నిమ్మ, ఉసిరి, నారింజ, జామపండ్ల వాటిలో ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ పుంజుకోవడంతో జింక్ పాత్ర కూడా ఎక్కువే. రోజుకు 80 నుంచి 207 గ్రాముల జింక్ తీసుకున్న వారిలో జలుబుతో బాధపడే రోజులు 33 శాతం తగ్గుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. మాంసం, చేపలు, గింజపప్పులు వంటి వాటిలో జింక్ లభిస్తుంది.
పేగు ఆరోగ్యం కోసం..
మన రోగనిరోధక వ్యవస్థ చాలా వరకు పేగుల్లోనే కేంద్రీకృతమై ఉంటుంది. పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా హానికర సూక్ష్మక్రిముల వృద్ధిని అరికడుతుంది. బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుతుంది. విటమిన్లను సృష్టిస్తుంది. శరీరం మందులను శోషించుకోవడానికి తోడ్పడుతుంది. కాబట్టి పెరుగు, మజ్జిగ, పులియబెట్టిన పదార్థాల వంటి మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసే ప్రొ బయోటిక్స్ పదార్థాలను తగినంత తీసుకోవాలి.
మద్యం.. వద్దే వద్దు!
మద్యం అతిగా తాగితే తెల్ల రక్తకణాల సామర్థ్యం దెబ్బతింటుందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. తెల్ల రక్తకణాల సామర్థ్యం తగ్గితే రోగనిరోధక వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. బ్యాక్టీరియా, వైరస్‍లను ఎదుర్కొనే శక్తి తగ్గుతుంది. మద్యం తాగడం వల్ల ఒంట్లో నీటి శాతమూ తగ్గిపోతుంది. నిద్రకు సైతం భంగం కలుగుతుంది. ఇవన్నీ రోగనిరోధక వ్యవస్థను అస్తవ్యస్తం చేసేవే. కాబట్టి మద్యం జోలికి వెళ్లకపోవడం మంచిది. ఒకవేళ అలవాటు ఉంటే మితంగా తీసుకోవాలి.
గోళ్లు కొరకొద్దు..
రోజంతా చేతులు ఎక్కడో చోట తాకుతూనే ఉంటాం. అక్కడ బ్యాక్టీరియా, వైరస్‍లు ఉంటే అవి చేతులకు అంటుకుంటాయి. ఆ చేతులను కడుక్కోకుండా నోట్లో పెట్టుకున్నా, కళ్లను తాకినా లేదా గోళ్లు కొరికినా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. నోరు, ముక్కు, కళ్ల ద్వారా హానికర సూక్ష్మక్రిములు ఒంట్లోకి ప్రవేశిస్తాయి. అందువల్ల సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోకుండా ముఖాన్ని తాకకూడదు. గోళ్లు కొరికే అలవాటుంటే వెంటనే మానెయ్యాలి.
విటమిన్ డి.. ఇలా పొందండి
మన దేశంలో ఏడాది పొడవునా ఎండకాసినా చాలామందిలో విటమిన్ డి లోపం ఉంటుంది. మన చర్మం ముదురు రంగులో ఉండటం వల్ల ఎండ తాకినా అంతగా విటమిన్ డి తయారుకాదు. ఇది లోపిస్తే ఎముక పుష్టి తగ్గుతుంది. గుండెజబ్బులూ వస్తాయి. ముఖ్యంగా రోగనిరోధకశక్తి బలహీనపడుతుంది. దీంతో ఇన్‍ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. వీటి నుంచి కోలుకోవడం కూడా కష్టమవుతుంది. అందువల్ల రోజూ చర్మానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. పుట్ట గొడుగులు, గుడ్డులోని పచ్చసొన, చేపల వంటివి తినాలి. అవసరమైతే విటమిన్ డి మాత్రలూ వేసుకోవాలి.
ఒంట్లో నలతగా ఉంటే ఇంట్లోనే ఉండాలి
జలుబు, ఫ్లూ, కోవిడ్ వంటి ఇన్‍ఫెక్షన్లకు కారణమయ్యే వైరస్‍లు గాలి ద్వారా వ్యాపిస్తాయి. ఇతరులు దగ్గినపుడు, తుమ్మినపుడు వెలువడే తుంపర్లు గాలిలో కలుస్తాయి. వీటిని శ్వాస ద్వారా పీలిస్తే ఇతరులకూ వ్యాపిస్తాయి. కాబట్టి ఒంట్లో నలతగా ఉన్నపుడు ఇంట్లోనే ఉండాలి. ముక్కుకు, నోటికి మాస్కు ధరించాలి. ఇది మనకే కాదు చుట్టుపక్కల వారికి మంచిదే. అలాగే ఇంట్లోకి గాలి ధారాళంగా వచ్చి పోయేలా చూసుకోవాలి.
ఇంకా పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం, వ్యాయామం చేయడం, కంటి నిండా నిద్రపోవడం వంటివి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.



























































































Review మన ఆరోగ్యం.. మన చేతుల్లోనే!.