‘ఆహా’రం

రొయ్యల ఇగురు అందరూ చేసుకునేదే.. అదే రొయ్యలని మామిడితో కలిపి వండండి.. పుల్లగా, కారంగా ఉండే ఆ రుచికి మరో మరో ముద్ద ఎక్కువ లాగిస్తారు. కొబ్బరితో కలిపి చూడండి.. అన్నం కూడా లేకుండా అచ్చంగా కూరే తినేస్తారు. అసలు రొయ్యలతో ఒకటా రెండా..బోలెడు ప్రయోగాలు చేయొచ్చు.
వాటిలో కొన్ని..

రొయ్యల ఫ్రైడ్‍రైస్‍
కావాల్సినవి: రొయ్యలు: 200 గ్రా., నూనె: రెండున్నర చెంచాలు, సోయాసాస్‍: చెంచాన్నర, మిరియాల పొడి: చెంచా, గుడ్లు: రెండు, ఉప్పు: తగినంత, కాస్త పలుకుగా ఉడికించిన అన్నం: కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు: పావుకప్పు, క్యాప్సికమ్‍ ముక్కలు: పావుకప్పు, పచ్చి బఠాణీ: పావుకప్పు, ఉల్లికాడల తరుగు: చెంచా, కొత్తిమీర తరుగు: చెంచా, సన్నగా తరిగిన వెల్లుల్లి పలుకులు: చెంచా.

తయారు చేసే విధానం: రొయ్యల్లో అరచెంచా సోయాసాస్‍, పావుచెంచా మిరియాల పొడి వేసి కలిపి పావుగంట పక్కన పెట్టుకోవాలి. కడాయిలో కాస్త నూనె వేసి వేడెక్కాక అందులో రొయ్యలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో మరికాస్త నూనె తీసుకుని వేడెక్కాక, గుడ్లు పగులకొట్టి పొరటు చేసినట్టుగా గరిటెతో బాగా కలిపి దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన నూనె వేసుకుని వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్‍ ముక్కలు, పచ్చి బఠాణీ, ఉప్పు, మిగిలిన మిరియాల పొడి, వెల్లుల్లి పలుకులు, సోయాసాస్‍ వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తరువాత గుడ్లతో చేసిన పొరటు, వేయించిన రొయ్యలు, అన్నం, కొత్తిమీర, ఉల్లిపొరక కూడా వేసి బాగా కలిపితే రొయ్యల ఫ్రైడ్‍రైస్‍ సిద్ధం.

కావాల్సినవి: పచ్చిమామిడికాయ: ఒకటి (చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి), రొయ్యలు: అరకిలో (పొట్టు తీసి సిద్ధంగా ఉంచుకోవాలి), ఉల్లిపాయలు: రెండు, పచ్చిమిర్చి: నాలుగు (నిలువుగా కోసి పెట్టుకోవాలి), ఉప్పు: తగినంత, కారం: రెండు చెంచాలు, పసుపు: అరచెంచా, నూనె: రెండు చెంచాలు.

తయారు చేసే విధానం:
కడాయిలో నూనె వేసి వేడెక్కాక, పొట్టు తీసిన రొయ్యలను వేసి బాగా ఎర్రగా అయ్యేంత వరకూ వేయించుకోవాలి. అందులోనే నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కూడా ముదురు గోధుమ రంగులోకి వచ్చే వరకూ వేయించుకోవాలి. పసుపు, కారం కూడా వేసుకుని ఒక్క ఐదు నిమిషాలు అన్నింటినీ వేగనిచ్చి, ఇప్పుడు చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇవి కాసేపటికి బాగా ఉడికి, నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్‍ కట్టేయడమే. రొయ్యలు – మామిడికాయ కూర రుచి ఎవర్‍గ్రీన్‍. ఒకసారి రుచి చూస్తే వదిలిపెట్టరు. కాకపోతే కూరలో మామిడికాయ పులుపు మరీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి.

కావాల్సినవి: రొయ్యలు: అరకిలో, నెయ్యి: నాలుగు చెంచాలు, కరివేపాకు: మూడు రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్: రెండు చెంచాలు, ఎండుమిర్చి: ఐదు, ధనియాలు: చెంచా, జీలకర్ర: చెంచా, గరం మసాలా: చెంచా, కారం: రెండు చెంచాలు, ఉప్పు: రుచికి తగినంత, నిమ్మరసం: చెంచా, కొబ్బరిపాలు: పావు కప్పు.
తయారు చేసే విధానం:
పొట్టు తీసి శుభ్రం చేసిన రొయ్యల్లో ఉప్పు, కారం, నిమ్మరసం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి పొడిగా వేయించుకుని చల్లారాక, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కడాయిలో నెయ్యి వేడి చేసుకుని అందులో కరివేపాకు వేసి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఆ తరువాత రొయ్యలు వేసుకుని వాటిల్లోని నీరంతా బయటకు వచ్చి ఇగిరి పోయేంత వరకూ వేయించాలి. మరికొంచెం ఉప్పు, చేసుకున్న మసాలా, గరం మసాలా కూడా వేసి రొయ్యలు ఉడికాక, చివరిగా కొబ్బరిపాలు పోసి దగ్గరకు వచ్చాక దింపేసుకోవడమే.

Review ‘ఆహా’రం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top