నివేదన

అటు ఉగాది.. ఇటు శ్రీరామ నవమి.. రాములోరి కల్యాణోత్సవ విందు కోసం ఎలాగూ వడపప్పు, పానకం వంటివి చేయక తప్పదు. అలాగే ఉగాదికి ఎలాగూ పచ్చడి చేసుకోవడం తప్పనిసరి. ఇవి కాకుండా ఈ రెండు పర్వాల సందర్భంలో ఇంకేం చేయాలా అని ఆలోచిస్తుంటే ఇవీ ఒకసారి ప్రయత్నించండి.
అటుకుల పొంగలి
కావాల్సినవి:
మందంగా ఉండే అటుకులు: పెద్ద కప్పు, బెల్లంపొడి: ముప్పావు కప్పు, నీళ్లు: అరకప్పు, పాలు: అరకప్పు, నెయ్యి: రెండు టేబుల్‍స్పూన్లు, జీడిపప్పు: పది, కిస్‍మిస్‍: పది, ఉడికించిన పెసరపప్పు: పావుకప్పు, యాలకుల పొడి: అరచెంచా.

తయారు చేసే విధానం:
స్టవ్‍ మీద గిన్నె పెట్టి పావుకప్పు నీళ్లు పోసి బెల్లంపొడి వేయాలి. బెల్లం కరిగి లేతపాకంగా మారుతున్న సమయంలో దించేయాలి. ఇప్పుడు స్టవ్‍ మీద కడాయిని పెట్టి చెంచా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‍మిస్‍ను వేయించుకుని తీసుకోవాలి. అదే కడాయిలో మరో చెంచా నెయ్యి వేసి అటుకులను వేయించాలి. రెండు నిమిషాల పాటు వేయించాక మిగిలిన నీళ్లూ, పాలూ పోసి కలుపుతూ ఉండాలి. అటుకులు కాస్త మెత్తగా అవుతున్నపుడు అప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్న బెల్లంపాకం, పెసరపప్పు ముద్ద, యాలకుల పొడి, మిగిలిన నెయ్యి వేసి కలపాలి. పొంగలి దగ్గరకు అవుతున్నపుడు వేయించుకున్న జీడిపప్పు, కిస్‍మిస్‍ పలుకులు వేసి దింపేయాలి.

చల్ల గారెలు

కావాల్సినవి:
అటుకులు: రెండు కప్పులు, పచ్చిమిర్చి: నాలుగు, అల్లం: చిన్నముక్క, జీలకర్ర: చెంచా, కొత్తిమీర తరుగు: పావుకప్పు, పెరుగు: ఒకటింపావు కప్పు, ఉప్పు: తగినంత, బియ్యప్పిండి: మూడు టేబుల్‍ స్పూన్లు, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారు చేసే విధానం:
అటుకులను ఒక గిన్నెలో వేసి అవి మునిగేలా నీళ్లు పోయాలి. అయిదు నిమిషాలు అయ్యాక ఆ నీటిని పూర్తిగా పిండేసి అటుకులను మరో గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలు అన్నింటినీ వేసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అయిదు నిమిషాలు నాననిచ్చి ఆ తరువాత చిన్న చిన్న గారెల్లా చేసుకుంటూ కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.

వంకాయ బోండా

కావాల్సినవి:
చిన్న వంకాయలు: అయిదు లేదా ఆరు, సెనగపిండి: కప్పు, కారం: అరచెంచా, పసుపు: పావుచెంచా, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా, వాము: చెంచా, వంటసోడా: చిటికెడు

స్టఫింగ్‍ కోసం:
కొబ్బరి తురుము: టేబుల్‍స్పూను, వేయించిన పల్లీల పొడి: రెండు టేబుల్‍స్పూన్లు, చింతపండు గుజ్జు: చెంచా, కారం: అరచెంచా, ధనియాల పొడి: అరచెంచా, జీలకర్ర పొడి: అరచెంచా, ఉప్పు: తగినంత, వేయించిన నువ్వుల పొడి: చెంచా

తయారు చేసే విధానం:
ముందుగా స్టఫింగ్‍ కోసం పెట్టుకున్న పదార్థాలు అన్నింటినీ ఓ గిన్నెలో వేసుకుని కలిపి పెట్టుకోవాలి. వంకాయలను శుభ్రంగా కడిగి, గుత్తివంకాయను కోసినట్టుగా నాలుగు గాట్లు పెట్టుకుని నీళ్లలో వేసుకోవాలి. అలాగే సెనగపిండి, కారం, పసుపు, ఉప్పు, వాము, వంటసోడా ఓ గిన్నెలో వేసుకుని నీళ్లతో బజ్జీల పిండిలా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు గాట్లు పెట్టుకున్న వంకాయలను కాగుతున్న నూనెలో వేసి దోరగా వేయించుకుని తీసుకోవాలి. వీటి వేడి చల్లారాక కలిపి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఈ వంకాయల్లో కూరి ఆ తరువాత సెనగపిండి మిశ్రమంలో ముంచి.. కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుంటే సరిపోతుంది.

Review నివేదన.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top