పంచభక్ష్య పరమాన్నాలున్నా కుచేలుడు ఇచ్చిన గుప్పెడు అటుకులకే దాసోహమన్నాడు కన్నయ్య. మరి ఆ గొప్పతనమంతా కృష్ణయ్యదే అనేస్తాం కానీ.. అటుకుల రుచీ తక్కువేమీ కాదు. కాబట్టి బాలగోపాలుడికి ఇష్టమైన ఆ అటుకులతోనే కాస్త వెరైటీ నైవేద్యాలను ఇలా కూడా ప్రయత్నించొచ్చు..
అటుకుల పొంగలి
కావాల్సినవి: అటుకులు: కప్పు, పెసరపప్పు: మూడు చెంచాలు, బెల్లం తరుగు: ముప్పావు కప్పు, నెయ్యి: మూడు చెంచాలు, జీడిపప్పులు: ఐదు, కిస్‍మిస్: పది, యాలక్కాయ: ఒకటి, లవంగం: ఒకటి, పచ్చకర్పూరం: చిటికెడు, ఉప్పు: చిటికెడు.
తయారు చేసే విధానం: పెసరపప్పును మెత్తగా ఉడికించుకోవాలి. స్టవ్‍పైన కడాయిని పెట్టుకుని బెల్లం, పావుకప్పు నీళ్లు పోసుకుని కరగనిచ్చి, నలకలు లేకుండా వడగట్టి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో రెండు చెంచాల నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పులు, కిస్‍మిస్‍లు, లవంగం వేసి దోరగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నెయ్యిలో అటుకులు వేసి ముదురు రంగు వచ్చేంత వరకూ వేయించుకుని, అందులోనే కప్పు
నీళ్లు పోయాలి. అవి మరుగుతున్నప్పుడు ఉడికించిన పెసరపప్పు, కరిగించిన బెల్లం నీల్లను కూడా పోసుకుని మరికాసేపు ఉడకనివ్వాలి. దగ్గరవుతున్నప్పుడు చెంచా నెయ్యి, పచ్చకర్పూరం, ఉప్పు, యాలక్కాయ, వేయించిన జీడిపప్పులు, కిస్‍మిస్‍లు వేసి దించేస్తే..
కొత్తిమీర పోహా చివడా
కావాల్సినవి: పల్చని అటుకులు: 500 గ్రా., పుట్నాల పప్పు: 65 గ్రా., పల్లీలు: 100 గ్రా., ఎండు కొబ్బరిముక్కలు: 25 గ్రా., కిస్‍మిస్: పావుకప్పు, బాదం పప్పు: పావుకప్పు, జీడిపప్పు: 25 గ్రా., వెల్లుల్లి రెబ్బలు: 4, పచ్చి మిర్చి: 8, కొత్తిమీర తరుగు: కప్పు, కరివేపాకు రెబ్బలు: 2, పంచదార పొడి: పావుకప్పు, ఉప్పు: తగినంత, పసుపు: పావు చెంచా, జీలకర్ర, ధనియాల పొడులు: పావుచెంచా చొప్పున, నువ్వులు: చెంచా, ఇంగువ: పావుచెంచా, జీలకర్ర: చెంచా, ఆవాలు: అరచెంచా, చాట్ మసాలా: చెంచా, నూనె: 100 గ్రా.
తయారు చేసే విధానం: మిక్సీలో కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, సగం పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అటుకుల్లో ఉప్పు, పంచదార పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్‍మసాలా వేసి బాగా కలపాలి. స్టవ్‍పై కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. పల్లీలు, మిగిలిన పచ్చిమిర్చి, కరివేపాకు, బాదం, జీడిపప్పు, కొబ్బరిముక్కలు కూడా వేసి బాగా వేయించాలి. పసుపు, పుట్నాల పప్పు, నువ్వులు, ఇంగువ కూడా వేసి కలిపి స్టవ్ కట్టేయాలి. అటుకుల్లో చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ వేసి కలిపి, ఆ తర్వాత తాలింపు వేసి బాగా కలుపుకుంటే పోహా చివడా సిద్ధం.
ఇస్కాన్ కిచిడీ
కృష్ణాష్టమి నాడు దేశవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ ఆలయాల్లో రుచికరమైన కిచిడీ ప్రసాదాన్ని పంచుతుంటారు. ఇస్కాన్ కిచిడీగా ప్రాచుర్యంలో ఉన్న ఈ వంటకం అద్భుతంగా ఉందని దీన్ని ప్రసాదంగా స్వీకరించిన వారు చెబుతుంటారు. మరి అటువంటి వంటకాన్ని కాస్త ప్రయత్నిస్తే ఇంట్లో కూడా చేసుకోవచ్చు.
అరకప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి. వీటితో పాటు క్యారట్, బంగాళాదుంపలు, బఠాణీలు, క్యాప్సికమ్, టొమాటో, క్యాబేజీ.. ఇవన్నీ పావుకప్పు చొప్పున తీసుకోవాలి.
ఇవికాక, చెంచా మిరియాలు, ఒక బిర్యానీ ఆకు, రెండు యాలకులు, కొద్దిగా పసుపు, ఇంగువ, ధనియాల పొడి, సోంపు, రెండు చెంచాల చొప్పున నెయ్యి, నూనె వేసి ఈ వంటకాన్ని చేస్తారు.
ఒక దళసరి కడాయిలో ముందుగా పెసరపప్పును వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కడిగిన బియ్యాన్ని వేసి తడి ఆరిపోయే వరకు వేపి పక్కన పెట్టాలి.
ఆ కడాయిలో నూనె, వెన్న వేసి వేడెక్కాక మిరియాలు, యాలకులు, ఇతర మసాలా దినుసులూ, పొడులూ వేసి బాగా వేగనివ్వాలి.
ఆ తర్వాత ఉప్పు, ఇతర కూరగాయల ముక్కలూ వేసి బాగా మగ్గాక పెసర పప్పు, నెయ్యి, బియ్యం, 6 గ్లాసుల నీళ్లూ పోసి 20 ని।। ఉడకనిస్తే రుచికరమైన ఇస్కాన్ కిచిడీ తయారవుతుంది.




























































































Review నివేదన.