
తేనె సామాన్య గుణం:
తియ్యగా ఉండి, కొద్దిగా పులుపు ఉంటుంది. వేడి చేసే గుణం కలది. త్రిదోషహరమైనది. విరేచనకారి. బలన్నిస్తుంది. కడుపునొప్పి, ఎక్కిళ్లు, వమనం, మూర్ఛ, వాతం, శ్లేష్మం, దగ్గు, వగర్పులు, అతిసారం, కఫం, పక్షవాతాన్ని హరిస్తుంది. నరాల మార్గాన్ని విప్పి, శుభ్రం చేస్తుంది. మూత్రరోగాలను, నేత్ర రోగాలను పోగొడుతుంది. మూత్రపు సంచిలోని రాళ్లను కరిగిస్తుంది. పొట్టకు, గుండెకు బలాన్నిస్తుంది. వ్రణాలను మాన్పుత్రుంది.
తేయాకు:
దీనితో చేసిన తేలిక కషాయంలో పాలు- పంచదార కలిపి మితంగా సేవిస్తే ఆకలి కలుగుతుంది. తిన్నది జీర్ణం అవుతుంది. నరాలకు సత్తువను కలిగిస్తుంది. కాళ్లు, చేతులు వణుకుతుంటే అవి తగ్గుతాయి. నిద్రబడలికను పోగొడుతుంది. బుద్ధికి, పుంస్త్వానికి, పొట్టకు బలాన్నిస్తుంది. సంతోషాన్ని కలుగచేస్తుంది. జలుబు, తలనొప్పులను అణచివేస్తుంది. శరీరానికి రంగునిస్తుంది. దీంతో ఏదేని ఔషధాన్ని తీసుకున్నా అది బాగా వంటబడుతుంది. నోటి దుర్గంధాన్ని పోగొడుతుంది. అతిగా తీసుకుంటే అనారోగ్యాన్ని కలిగిస్తుంది.
తైలాన్నం (అన్నంలో నువ్వుల నూనె కలుపుకుని తినడం): నూనె కలిపిన అన్నం దేహోష్ణాన్ని పెంచుతుంది. వాతాన్ని హరిస్తుంది. బలుపును తీసి వేసి శరీరాన్ని గట్టి పరుస్తుంది. కొవ్వును పెంచుతుంది. శరీరానికి కాంతిని కలుగచేస్తుంది. మలబద్ధకం కలిగిస్తుంది. అతిగా సేవిస్తే చర్మరోగాలను కలుగచేస్తుంది. పైత్యం పెరిగి ఉష్ణం చేస్తుంది.
త్రిజాతం: ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్కల చూర్ణాన్ని త్రిజాతం అంటారు. ఇది దేహోష్ణం, జఠరదీప్తిని కలుగచేస్తుంది. తిన్నది ఒంటబట్టేలా చక్కగా జీర్ణం చేస్తుంది. పైత్యశాంతి, మేహశాంతిని కలుగచేస్తుంది. శ్లేష్మాన్ని అణచి, అరుచిని పోగొడుతుంది.
త్రిఫలం:
కరక్కాయ, తాడికాయ, ఉసిరికాయ.. ఈ మూడింటినీ కలిపి త్రిఫలం అంటారు. త్రిఫల చూర్ణాన్ని తీసుకుంటే కళ్లకు మంచిది. శుక్ల వృద్ధి కలుగుతుంది. కఫ పైత్యాలను, జలుబును, శిరోరోగాన్ని, మధుమేహాన్ని మూలవ్యాధిని పోగొడుతుంది. దీనిని నేతితో కానీ, తేనెతో కానీ, పంచదారతో కానీ, బెల్లం, నూనె సమంగా కలిపి గాని పొద్దునే తీసుకోగలిగితే సమస్త రోగాలూ పోతాయి.
త్రిసమం: కరక్కాయ, శొంఠి, బెల్లాన్ని సమానంగా కలిపి పొద్దునే తీసుకుంటే అగ్నిమాంద్యం, వాతం, భ్రమ, పైత్యం, కఫం పోతాయి.
త్రిసుగంధాలు:
ఏలకులు, జాపత్రి, దాల్చిన చెక్కల చూర్ణాల మిశ్రమాన్ని త్రిసుగంధాలు అంటారు. ఇది మేహశాంతి, పైత్యశాంతిని కలుగచేస్తుంది. జఠరదీప్తి, వీర్యవృద్ధిని కూడా కలుగచేస్తుంది. వాంతి, వికారాలను పోగొడుతుంది. నోటికి చాలా మంచిది.
దంతధావనం:
పొద్దునే దంతధావనం చేస్తే పైత్య శ్లేష్మాలు పోతాయి. నోటికి రుచి కలుగుతుంది. పరిశుభ్రంగా ఉంటుంది. కళ్లకు చలువ చేస్తుంది. దంతాలకు పటిష్టత, దారుఢ్యాన్ని కలిగిస్తుంది. ముఖ, శిరో రక్తనాడులను అనుకూల స్థితిలో ఉంచుతుంది.
దధ్యోజనం: అన్నం, అల్లం, మిరియాలు, జీలకర్ర, ఇంగువ మొదలైన సంబారాలతో పొగిచి పెరుగులో కలిపిన అన్నమే దధ్యోజనం. ఇది రుచిగా ఉంటుంది. కఫాన్ని, పైత్యాన్ని తగ్గిస్తుంది. వీర్యవృద్ధి, బలాన్ని కలుగచేస్తుంది. దేహపుష్టికి కలుగచేసి, మంచి నిద్రను కలిగిస్తుంది. జ్వరం ఉన్నపుడు దీనిని తీసుకోకూడదు.
దర్భ: తెల్ల దర్భ, నీలిరంగులో ఉన్న దర్భలని ఇవి రెండు రకాలు. వీటి వేళ్ల లేదా ఆకుల రేకుల గడ్డి, రసం లేక కషాయం వగరు, తీపి రుచులను కలిగి ఉంటుంది. ఈ రసం, లేదంటే కషాయం దుష్ట వీర్యాన్ని పోగొడుతుంది. పైత్య శ్లేష్మాల వల్ల వచ్చే రోగాలను హరిస్తుంది. మూత్రాన్ని సాఫీగా జారీ చేస్తుంది. వేరు కషాయం రక్తం పడే మూలవ్యాధిని, శిశ్నం, యోనిలోని మంట, దురద మొదలైన వాటిని పోగొడుతుంది. వేరు నూరి పెరుగుతో ఇస్తే యోని, శిశ్నం వెంట కారు సెగ సంకటానికి చెందిన రసి కడుతుంది. ఆకురసం కానీ, నూరిన ముద్ద కానీ గాయాలకు పూస్తే రక్తం కట్టి మానుతుంది. దీనిని లోపలికి తీసుకున్న పక్షంలో మూత్రాన్ని జారీ చేస్తుంది. ఆకురసాన్ని కళ్లలో పోస్తే నీళ్లు కారడం తగ్గుతుంది. ఒంటికి పూసుకుంటే గజ్జి, చిడుం వంటివి పోతాయి. ముక్కులో పోస్తే ముక్కు వెంట రక్తం పడటం తగ్గుతుంది.
దవనం: సువాసనగా, మనోహరంగా, చేదుగా, వగరుగా ఉంటుంది. త్రిదోషహరమైనది. దురద, కఫవాతాలను, అపస్మారకం, హృద్రోగాలను హరిస్తుంది. దీని చూర్ణాన్ని నూనెలో కలిపి స్నానానంతరం శరీరానికి రాసుకుంటే సువాసనగా, ఆరోగ్యంగా ఉంటుంది. వీర్యవృద్ధిని కలిగిస్తుంది. స్త్రీలు దీన్ని శిరసున ధరించడం వలన సువాసనగా, మనోహరంగా ఉండి, అంటువ్యాధులను దూరం చేస్తుంది.
Review త్రిఫలం.. త్రిసుగంధం.